'O Premakatha' - New Telugu Story Written By N. Dhanalakshmi
Published In manatelugukathalu.com On 29/01/2024
'ఓ ప్రేమకథ' తెలుగు కథ
రచన: N. ధనలక్ష్మి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“ఇదిగో సూర్య!! మళ్ళీ చెపుతున్నా! మన పెళ్ళికి ఇరువైపుల పెద్దలూ మనస్పూర్తిగా ఆనందంగా ఒప్పుకుంటేనే నేను నీ సొంతం అవుతాను.. బెదిరించో, భయపెట్టో పెళ్ళి చేసుకొని మనం ఒక్కటి అవ్వాలంటే మాత్రం నేను ఏ మాత్రం ఒప్పుకొను..” అంది మిత్రవింద.
“అబ్బా మిత్రా! ఎన్ని సార్లు ఇదే మాట చెప్పుతావు?
మా అమ్మ, నాన్నలకి నేనంటే ప్రాణం. ఇంత వరకు నేను అడిగింది ఏదీ కాదనలేదు. మన ప్రేమను కూడా కాదనరు” అన్నాడు సూర్య..
సూర్య, మిత్రవిందా విప్రో లో పని చేస్తున్నారు. సూర్య టీమ్ లీడ్ చేస్తుంటే అందులో మిత్ర ఓ మెంబర్.. ఎవరితోనూ పెద్దగా కలవని సూర్య, మిత్ర తో మాత్రం సన్నిహితంగా ఉండేవాడు. మిత్ర కి తెలియని విషయాలు నేర్పించేవాడు. స్నేహం కాస్తా ప్రేమగా మారడానికి రెండు ఏళ్ళు పట్టింది.. ఇప్పుడు ఆ ప్రేమ మజీలి చేరడానికి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని ఒక్కటి అవ్వాలనుకుంటున్నారు..
సూర్య, ఇంటికి చేరుకొని వాళ్ళ అమ్మకి, నాన్నకి వారి ప్రేమ విషయం చెప్పాడు. మిత్రవింద తమకెంతో నచ్చడంతో, కొడుకు సంతోషమే తమకు ముఖ్యం అంటూ వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.
“హమ్మయ్య! మన ప్రేమ సక్సెస్ అయింది.."
“ఎక్కడ సర్.. హాఫ్ సక్సెస్ అయింది ఇంక మా ఇంట్లో ఒప్పుకోవద్దా..”
‘నువ్వు టెన్షన్ పడకు.. ఈ ఆదివారం అమ్మ, నాన్నను తీసుకోని మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతాను. మంచి జాబ్, ఒక్కడే కొడుకుని, కాస్తో కూస్తో అందంగా ఉంటాను. ఎందుకు ఒప్పుకోరు చూద్దాము..’
“ఏమో సూర్య, ఎందుకో భయంగా ఉంది.. నువ్వు లేకుండా నేనుండలేను..”
“నువ్వు లేకపోతే నేను కూడా ఉండలేను. నీతో ఫుల్ లైఫ్ ను ఊహించుకున్నాను. బీ పాజిటివ్. మంచిగా ఆలోచిద్దాం. నువ్వు డల్ గా ఉండకు మిత్ర.. నేను చూడలేను. అలా సరదాగ వెళ్ళి వద్దాం” అంటూ తనని మాటలతో డైవర్ట్ చేశాడు సూర్య..
అన్నట్టుగానే సూర్య, వాళ్ళ అమ్మనాన్నలను తీసుకోని మిత్ర ఇంటికి వెళ్ళాడు.. వారి ప్రేమ విషయం, తన జాబ్, సాలరీ వగైరా అన్ని వివరాలు చెప్పాడు సూర్య..
అంత విన్న మిత్ర నాన్న.. మిత్రను గెస్ట్ ల కోసం స్నాక్స్ తీసుకురమ్మని చెప్పి తనని లోపలకి పంపి సూర్య వైపు చూస్తూ " చూడు బాబు.. మీది మాది ఒకటే కాస్ట్ కాదు. ఈ కాలంలో అది పెద్ద విషయం కాకపోవచ్చు. నా వరకు అది ఎప్పటికీ ముఖ్యమైంది.
పోనీ కాస్ట్ విషయం పక్కన పెట్టీ మీ పెళ్లికి ఒప్పుకోవాలన్నా, కోట్లకు వారసురాలు నా బిడ్డ ఎక్కడా… జీతాలతో బ్రతికే మీరెక్కడ? తను ముచ్చట పడింది అని జాబ్ కి పంపించాను. కానీ తను కోరింది కదా అని మాకన్న దిగువ స్థాయిలో ఉన్న వారితో వియ్యం అందడం ఏ మాత్రం ఇష్టం లేదు. ఏమయ్యా! ఏజెన్సీ నడుపుతున్న నువ్వు కొడుకుని చక్కగా చదివించి జాబ్ కి పంపావు. మీ స్థాయిలో ఉన్న అమ్మాయిని కోడలిగా తెచ్చుకోవాలి కానీ డబ్బున్న అమ్మాయిని ట్రాప్ చేయమని కొడుకుకి నేర్పడం కరెక్ట్ కాదు కదా.. ఒకవేళ నీకు అమ్మాయే గనక ఉంది వుంటే, తనను తార్చడానికి కూడా సిద్దం అయ్యేవాడిలా ఉన్నావే” అంటూ ఎగతాళి గా మాట్లాడాడు..
సూర్య నాన్న బాధగా కళ్ళు ముసుకున్నాడు. అది చూసిన సూర్య కోపంగా పైకి లేచి మిత్ర నాన్న కాలర్ పట్టుకొని పైకి లేపి ' మేమేమీ ట్రాప్ చేయలేదు. తనని ప్రాణంగా ప్రేమించాను. ఓ రెండు రోజుల ముందు మా ప్రేమ విషయం మా ఇంట్లో తెలిసింది.. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటారా.. మాకు మీలాగా ఆస్తులు లేకపోవచ్చు కానీ ఆత్మభిమానం ఉంది. మర్యాదగా మా నాన్నాకి సారీ చెప్పు లేదంటే నిన్ను చంపేస్తాను” అంటు వార్నింగ్ ఇచ్చాడు..
‘మా ఇంట్లో పని చేసే వాడి స్థాయి ఉన్నడోకి నేనేంటి సారీ చెప్పడం.. మీ బ్రతుకులెంత?” అంటు సూర్య ను రెచ్చకొట్టాడు..
సూర్య కోపంగా మిత్ర నాన్న తో గొడవపడి తోసేశాడు.. గోడకు గుద్దుకున్న అతను “అమ్మా మిత్రా!” అంటు గట్టిగా అరుస్తూ స్పృహ తప్పి కింద పడిపోయాడు..
కిచెన్ లో ఉన్న మిత్ర ఆ అరుపు విని పరుగున బయటకి వచ్చింది..
అక్కడ దృశ్యాన్ని చూసి సూర్య ను అపార్థం చేసుకుంది.. నుదిటి మీద గాయంతో వాళ్ళ నాన్నని ఒడిలో పెట్టుకొని లేపడానికి ట్రై చేసింది. పని వారి చేత తనని రూం లోకి పంపి, మిత్ర కోపంగా సూర్య వద్దకు చేరుకొని లాగి పెట్టీ ఒకటి ఇచ్చి బ్రేక్ అప్ చెప్పేసింది.. సూర్య జరిగింది ఇది అని చెప్పడానికి ఎంత ట్రై చేసిన మిత్ర వినలేదు..
మిత్ర జాబ్ మానేసింది. ఫోన్ నంబర్ మార్చేసింది. తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిట్లో సూర్య ను బ్లాక్ చేసేసింది.. తనని కలవడానికి ఏ ఒక్క అవకాశం ఇవ్వలేదు.. ఓ ప్రాజెక్ట్ పని మీద ఢిల్లీ కి సూర్య వెళ్ళాడు.. మిత్ర పెళ్ళి అంటు స్నేహితుడు పంపిన మెసేజ్ కి ఆగమేఘాల మీద మిత్రా ఇంటికి చేరుకున్నాడు సూర్య.. కానీ అక్కడ జనం గుమికూడి ఉన్నారు..
కంగారు పడుతూ లోపలకి వెళ్ళిన సూర్య అక్కడ దృశ్యాన్ని చూసి నేలమీద చతికిలపడి గట్టిగా ‘మిత్రా!’ అంటూ అరిచాడు..
పెళ్ళి కూతురు గేట్ అప్ లో అందంగా రెడీ అయి, పాడెపై శవంలా పడి ఉంది మిత్ర.. పక్కనే ఉలుకు పలుకు లేకుండా కూర్చొన్ని ఉన్నాడు వాళ్ళ నాన్న..
మిత్రా అమ్మ ఏడుస్తూ 'ఇదిగో, ఈ లెటర్ రాసి నా బిడ్డ విషం తాగి చనిపోయింది.. ఇది నువ్వు చదవాలి” అంటు సూర్యకు లెటర్ ను అందించింది..
ఏడుస్తూనే ఆ లెటర్ ఓపెన్ చేశాడు సూర్య..
"నాన్నా! నువ్వంటే నాకు చాలా ఇష్టం.. నువ్వు నా పక్కనుంటే ప్రపంచాన్నే జయించచ్చు అనే నమ్మకం.. నీ దగ్గర ఏ ప్రేమను చూశానో అలాంటి ప్రేమనే సూర్య వద్ద చూశాను.. అందుకే ప్రేమించాను. తను మిమ్మల్ని కొట్టాడు. నా తండ్రి పై చేయి చేసుకున్నాడు అని తనని దూరం పెట్టేశాను. సూర్య తో నువ్వన్న ప్రతి మాట అమ్మ నాకు చెప్పింది నాన్నా. తప్పు చేశాను.
మీకెందుకో తను నచ్చలేదు.. నిన్ను కాదనుకుని, లేదంటే బలవంత పెట్టి సూర్యను పెళ్ళి చేసుకోలేను. ఒకవేళ చేసుకున్నా మీరిద్దరూ ప్రేమగా, అభిమానంగా ఉండలేరు. నా కోసం ఉన్నట్టుగా నటిస్తారు. మీ కోసం తనని వద్దనుకున్నా. మీ కోసం పెళ్లికి ఒప్పుకున్నా. తనతో జీవితాన్ని ఊహించుకున్నా నాన్నా1. నేను ఇంకొకరి సొంతం అవుతున్న ఊహానే భరించలేకున్నా.. నా పక్కన వేరే వారిని ఊహించుకోలేను. సూర్య కోసమే ఈ ప్రాణం ఉండేది. పెళ్ళి చేసుకున్నా ఈ అబ్బాయిని ప్రేమగా చూడలేను. తనని మోసం చేసిన దానిని అవుతాను. అందుకే చనిపోతున్నా.. క్షమించు నాన్నా.. మనసు చంపుకొని బ్రతకలేను.
ఇది నీకు సూర్య.. నేను లేనని తెలిస్తే నువ్వు కూడా నా దగ్గర కి వస్తావు అని తెలుసు. కానీ వద్దు సూర్య.. మీ అమ్మ, నాన్న కి నువ్వు ఒక్కడివే. నా మీద నీకున్న ప్రేమ నిజమైతే నువ్వు పెళ్ళి చేసుకొని హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయాలి. ప్రేయసి గా దూరమైన నేను, బిడ్డలా నీ వద్దకు చేరుతాను. ప్రేయసిగా పొందలేని ప్రేమను, నీ బిడ్డ గా పొందుతాను.. "..
మిత్రా.. మిత్రా.. అంటు సూర్య ఏడుస్తూనే ఉన్నాడు.. మిత్రా లేదనే బాధని మనసులోనే దాచుకొని క్షణం తీరిక లేకుండా పని చేస్తూనే ఉండేవాడు.. ఒంటరిగా తనతో గడిపిన ప్రదేశాలకు వెళ్ళి ఏడిచేవాడు.. ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపాడో తన తలగడే కే తెలుసు..
మిత్రా నాన్న ఆ రోజు నుండి ప్రాణం ఉన్న శవం లా పడి ఉన్నాడు.. సూర్య నే అప్పుడప్పుడు వెళ్ళి వారి బాగోగులు చూస్తుండే వాడు..
రెండు ఏళ్ల తరువాత.. అమ్మ, నాన్న కోసం సూర్య తన మరదలు సంధ్యను ను పెళ్లి చేసుకున్నాడు.. సంధ్య కి తన బావ ప్రేమ విషయం తెలుసు.. ఓపికగా భర్త ప్రేమ కోసం ఎదురు చూస్తూ భార్యగా తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించేది.. కాలక్రమేణా భార్య చూపించే ప్రేమకి, అభిమానానికి లొంగీ పోయాడు సూర్య.. సంధ్య ను ప్రేమగా చూసుకున్నాడు. వారి ప్రేమకి గుర్తుగా పాప పుట్టింది. మిత్రానే తన బిడ్డగా పుట్టింది అని భావించి భార్య అనుమతి తో " మిత్రవింద" అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగాడు..
మిత్రా వాళ్ళ నాన్న, కూతురి సంతోషం కోసం తన అహాన్ని పక్కన పెట్టి, వారి పెళ్లికి ఒప్పుకుని ఉంటే ఈ కథ ఇంకోలా ఉండేదేమో.. అన్ని ప్రేమ కథలు సుఖాంతం అవ్వవేమో..
*****
N. ధనలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ యువ రచయిత్రి బిరుదు పొందారు.
Comments