top of page

ఓ తల్లి కల!!

#ఓతల్లికల, #OThalliKala, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ


'O Thalli Kala' - New Telugu Story Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 04/10/2024

'ఓ తల్లి కల' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


"అమ్మా!.."

మిలిటరీ నుండి వస్తాడని ఉదయం ఐదు గంటల నుండి కొడుకు వీర కోసం ఎనిమిది గంటల వరకూ వాకిట కాచుకొని వున్న దుర్గమ్మ నిట్టూర్చి ఇంట్లో ప్రవేశించింది.

ఆమెలోనికి వెళ్ళిన అరగంటకు వీర వచ్చాడు. తల్లిని పిలిచాడు. 

"అమ్మా!" వీర పిలుపు రెండవసారి.


ఆ పిలుపును విన్న తల్లి దుర్గమ్మ పరుగున ద్వారం దగ్గరకు వచ్చింది. మిలిటరీ డ్రెస్‍లో (సిపాయి) వున్న కొడుకును చూచి నవ్వుతూ..

"వీరా!.. వచ్చావా అయ్యా!.." ఆనందంతో చేతులు సాచింది.


వీరా తల్లిని కౌగలించుకొన్నాడు. అతని కళ్ళల్లో కన్నీరు.

భుజాలు పట్టుకొని దుర్గమ్మ వీర ముఖంలోకి ప్రీతిగా చూచింది. ఆ క్షణంలో ఆమె కళ్ళలోనూ కన్నీరు.

"ఎలా వున్నావమ్మా!" తల్లి భుజాలు పట్టుకొని ఆమె ముఖంలోకి ప్రీతిగా చూస్తూ అడిగాడు వీర.


దుర్గమ్మ వీర ముఖంలోకి ఆత్రంగా చూచింది. అతని కళ్ళలోని కన్నీరు ఆమెకు గోచరించాయి.

"నాయనా!.. ఎందుకురా ఆ కన్నీరు?"


"అవి కన్నీరు కాదమ్మా. సంవత్సరం తర్వాత నిన్ను చూస్తున్నానుగా అవి ఆనందభాష్పాలమ్మా!"


తన పవిటకొంగుతో తల్లి కొడుకు కన్నీటిని తుడిచింది.

"రా నాన్నా రా!" వీర చేతిని పట్టుకొని ఇంట్లోకి నడిచింది. దుర్గమ్మ.


"నీకి సేమ్యా పాయసం అంటే ఇష్టం కదా!.. ఉదయాన్నే తయారు చేశాను. కాళ్ళు చేతులు కడుక్కొని రా. ఇస్తాను తాగుదువు గాని" చిరునవ్వుతో చెప్పింది దుర్గమ్మ.


వీరా లగేజిని గదిలో వుంచి దొడ్లోకి వెళ్ళి సిమెంటు తొట్టిలోని నీళ్ళతో స్నానం చేసి, గదిలోకి వెళ్ళి డ్రస్ (సివిలియన్) మార్చుకొని వచ్చాడు. దుర్గమ్మ గిన్నెలోని పాయాసాన్ని గ్లాసులో పోసి వీరాకు అందించింది. వీరా ఆనందంగా పాయాసాన్ని త్రాగాడు.


వీరా స్నేహితుడు బంధువు అప్పన్న వచ్చారు. ఆరోజు వీరా వస్తాడని దుర్గమ్మ అతనికి చెప్పింది. సరిహద్దు సైన్యంలో వీరా చేరి ఐదుసంవత్సరాలు. అప్పన్న మనిషి కొంచెం పొట్టి. వీరాతో అతనూ సెలక్షన్ సెంటర్‍కు వెళ్ళాడు. ఇరువురూ ప్లస్ టూ వరకు ఒకే స్కూల్లో కలిసి చదువుకొన్నారు. అప్పన్న పొట్టి అయిన కారణంగా సెలక్ట్ కాలేదు. వీర సెలక్ట్ అయినాడు. తల్లి బాధ్యతను అప్పన్నకు అప్పగించి వీరా సైన్య శిక్షణకు డెహ్రాడూన్‍కు వెళ్ళిపోయాడు. ప్రతిరోజూ ఒకసారి అప్పన వచ్చి దుర్గమ్మకు కావల్సినవి కొనిచ్చి తన ఇంటికి వెళ్ళిపోతుంటాడు. 

"వీరా!.."


"ఏమ్మా!"


"అప్పన్న వచ్చాడురా!.. రారా అప్పన్నా!.. లోపలికి రా!" అంది దుర్గమ్మ.


అప్పన్న ఇంట్లోకి ప్రవేశించాడు. వీర తన గదినుండి బయటికి వచ్చాడు. ఇరువురూ నవ్వుతూ ఒకరినొకరు కౌగలించుకొన్నారు. దుర్గమ్మ అప్పన్నకు పాయసం ఇచ్చింది. తాగుతూ అప్పన్న "అత్తమ్మా!.. ఇది పాయసం కాదే.. అమృతం.. ఆ, వీరా నీవు తాగావా!" అడిగాడు అప్పన్న.


"ఆఁ.. ఇప్పుడే, పదినిముషాలైందిరా!.. అమ్మా, నాన్నా, మల్లిక అంతా బాగున్నారా!.."


"ఆ నడివీధి మన ఇలవేల్పు మహాలక్ష్మమ్మ తల్లి దయవలన అందరూ కుశలంరా.." చిరునవ్వుతో చెప్పాడు అప్పన్న. క్షణం తర్వాత..

"ఎన్ని రోజులుంటావురా!" అడిగాడు.


"మూడు వారాలు.."


"అంతేనా!"


"అవునురా!"


"మరి పెండ్లి?" అడిగింది దుర్గమ్మ.


"ఈసారి వచ్చినప్పుడు.."


"ఏంది వీరా అలా అన్నావ్? నేను ఈసారి నీవు తిరిగి వెళ్ళే లోపల పెండ్లి చెయ్యాలనుకొంటున్నా!.. నాకూ వయస్సు అవుతూ వుంది కదరా!.." ప్రశ్నార్థకంగా వీరా ముఖంలోకి చూచింది దుర్గమ్మ.


"సరిహద్దులో చైనాకు మనకు సమస్యగా వుందమ్మ. ఎక్కువ రోజులు శలవు దొరకలేదు. మూడవ వారం శుక్రవారం నాడు నా తిరుగు ప్రయాణం అమ్మా!" అనునయంగా చెప్పాడు వీర.


"అలాగా!.."


"అవునమ్మా!"


అప్పన్న తండ్రి కూరగాయల వ్యాపారి. హోల్ సేల్. పేరు సుబ్రమణి. ఆయన భార్య దేవయాని. కూతురు మల్లిక. వీరకు, మల్లికకు వివాహం జరిపించాలని దుర్గమ్మ సంకల్పం. అది ఆమె సంకల్పమే కాదు. ఆమె భార్య వీర జవాన్ మార్తాండ నిర్ణయం. మార్తాండ అక్క కూతురు దుర్గమ్మ. మార్తాండ చెల్లెలు దేవయాని. దేవయాని వివాహం తొలుత జరిగింది. ఆమె వివాహం జరిగిన సంవత్సరానికి దుర్గ, మార్తాండల వివాహం జరిగింది. 


ఒకనాడు పున్నమి వెన్నెల్లో ఇంటిముందు ఆ భార్యా భర్తలు పడుకొని వున్నారు. అప్పటికి దేవయాని గర్భవతి..

"దుర్గా!.."


"ఏం అయ్యా!"


"దేవయానికి ఏ బిడ్డ పుడుతుందంటావ్?"


"అయ్యా!.. మా అమ్మ చెబుతుండేది. కడుపుతో వున్నవాళ్ళు కూర్చుని లేచేటప్పుడు ఎడం చేతిని నేలమోపి లేస్తే ఆడపిల్ల, కుడిచేతిని నేల మోపి లేస్తే మొగబిడ్డ పుడతారంట."


"అవును. మన దేవయాని, నా చెల్లి ఏ చేతి సాయంతో లేస్తూ వుందే?" ఆత్రంగా అడిగాడు.


"మీకెందుకు అంత ఆత్రం. తొలి కానుపున ఆడైతేనేం, మగైతేనేం?" అంది దుర్గ.


"ఓసి పిచ్చి మొఖమా!.. నీవు ఇంకా ఏమీ అనుకోలేదు. కాబట్టి నా చెల్లికి ముందు మగబిడ్డే పుట్టాలి" నవ్వాడు మార్తాండ.


"ఆడపిల్ల పుడితే ఏం?"


"నీకు ఒకవేళ మగపిల్లోడు పుడితే. నా చెల్లికి నీకన్నా ముందు ఆడపిల్ల పుడితే, ఆ పిల్ల నా కొడుకు కన్నా పెద్దదవుతుంది కదే. వయస్సున పెద్దదైన పిల్లను మనం కోడలిగా చేసుకోలేము కదా అందుకని నా చెల్లికి ముందు మగబిడ్డ, రెండవసారి ఆడపిల్ల పుట్టాలి" గలగలా నవ్వాడు మార్తాండ.


"అబ్బో.. అబ్బో ఎంతదూరం ఆలోచించావయ్యా!" దుర్గ కూడా గల గల నవ్వింది.


నవమాసాలు నిండిన దేవయాని మగశిశువుకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు వారు అప్పన్న అని పేరు పెట్టారు. అప్పన పుట్టిన సంవత్సరానికి దుర్గ వీరాకు జన్మ నిచ్చింది. మార్తాండ, దుర్గమ్మలు ఎంతగానో సంతోషించారు. 


మార్తాండ వీరా పుట్టిన మూడునెలల తర్వాత సైన్యంలో చేరాడు. సంవత్సరం తరువాత తిరిగి వచ్చాడు నెలరోజులు శలవుతో. ఆ నెలరోజులు ఆ దంపతులు వీరాతో ఎంతో ఆనందంగా గడిపారు. ఆరోజు మార్తాండ సరిహద్దుకు ప్రయాణం..


సుబ్రమణి, దేవయాని, అప్పన్న దుర్గ ఇంటికి వచ్చారు.

తన చెల్లెలు దేవయానిని చూచి మార్తాండ..

"అమ్మా దేవా!.. ఈసారికి నువ్వు ఆడపిల్లను కనాలమ్మా. ఆమెకు పేరు మల్లిక అని పెట్టాలి"

చిరునవ్వుతో చెప్పాడు మార్తాండ.


సిగ్గుతో నవ్వుతూ తలదించుకొని దేవయాని "అలాగే అన్నయ్యా ఆ నా కూతురు నీకు కోడలు కావాలి. అదే గదా నీ ఆశ" నవ్వుతూ అడిగింది దేవయాని.


"అవునమ్మా!.. అదేనా కోరిక."


"మరదలా!.. మీ అన్నమాటను మరిచిపోకు. నాకు కోడలిని కని ఇవ్వు" నవ్వుతూ చెప్పింది దుర్గమ్మ.


"ఆఁ.. దుర్గా!.. నీవూ ఈ మాటను మరిచిపోకు."


"ఏందయ్యా అది?"


"నా కొడుకు బాగా చదివించి నాలా దేశ రక్షణకు సిపాయిగా చేయాలి. పుట్టిన ప్రతి మగాడిలో మన దేశ రక్షణ భావం ఉండాలి. తల్లితండ్రులు మగపిల్లలకు ఆ భావాన్ని నేర్పాలి. మన సువిశాల భారతదేశం మన తల్లి. మన తల్లి రక్షణ కన్నా ముఖ్యం మరొకటి కాదు."


"అవును బావా!.. నీవు అన్నమాట సత్యం నిజం" అన్నాడు సుబ్రమణి.


అందరికీ చెప్పి మార్తాండ తన ఇంటి నుండి బయలుదేరాడు. అందరి కళ్ళల్లో కన్నీరు. కొంతదూరం నడిచి వెనక్కు తిరిగి కుడిచేతిని పైకెత్తి తనవారికి వీడ్కోలు చెప్పి ముందుకు సాగాడు మార్తాండ. 

కాశ్మీర్ ప్రాంతంపై పాకిస్థానీయులు దాడి చేశారు. ఆ యుద్ధంలో పదిమంది పాకిస్థానీ సైనికులను చంపాడు మార్తాండ.


చివరకు.. శత్రు సైన్యం వెనుకనుంచి కాల్చిన కాల్పులకు మార్తాండ మరణించాడు.

భారత రాజ్యాంగం అతని శవాన్ని స్వగ్రామానికి చేర్చింది. వూరిజనమంతా గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇక భార్య దుర్గమ్మ, చెల్లి దేవయాని, బావమరిది సుబ్రమణి రెండేళ్ళ వీరాలను ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు. రాచమర్యాదలతో మార్తాండ దేహం స్మశానం చేరింది. సైనిక లాంఛనాలతో మార్తాండ దేహం దహనం గావించబడింది.


ఆ ఘోర సంఘటన తాలూకు జ్ఞాపకాలతో దుర్గమ్మ కోలుకొనే దానికి ఆరుమాసాలు పట్టింది. దేవయాని, సుబ్రమణిలు దుర్గమ్మకు ఎంతో అండదండలుగా నిలబడ్డారు. ఓదార్చారు.

మన భారత ప్రభుత్వం మార్తాండకు పరమవీర చక్ర (PVC) బిరుదును ప్రధానం చేసింది. ఢిల్లీలో ఆ బిరుదును ప్రెసిడెంట్ చేతుల మీదుగా అందుకొంది దుర్గమ్మ. 


కాలగతిలో దుర్గమ్మ.. బాధను దిగ మ్రింగుకొని వీర కోసం, తాను తన భర్త మార్తాండకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం.. గతాన్ని మరిచినట్లు నటిస్తూ కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జీవిత గమనాన్ని సాగించింది. వీరాను శ్రద్దగా చదువుకొనేలా చేసింది.


దేవయాని మార్తాండ గతించిన సంవత్సరం తర్వాత ఆడపిల్లకు జన్మనిచ్చింది.

"నా మనిషి స్వఛ్ఛమైన వ్యక్తి. ఆయన తన చెల్లిని కోరినట్లే దేవయాని ఆడబిడ్డను కన్నది. పుట్టిన ఆ ఆడబిడ్డ మాకోడలు’ అనుకొంది దుర్గమ్మ.


సుబ్రమణి, దేవయానీలు ఆ పాపకు మల్లిక అనే పేరు పెట్టారు.

దేవుని ముందు నిలబడి చేతులు జోడించి.. ’అన్నా!.. ఎక్కడున్నావో ఏమో, నాడు నీవు చెప్పిన రీతిగా నాకు ఆడపిల్ల పుట్టింది. పుట్టక ముందే నీవు నిర్ణయించిన మల్లిక, అనే పేరు నీ కోడలికి పెట్టానన్నా! మల్లిక నీ కోడలే!..’ కన్నీటితో తన అన్నయ్యను తలచుకొంది దేవయాని.


వూరిజనం.. మార్తాండ కాశ్మీర్ పోరాటాన్ని, వారికి ప్రభుత్వం ఇచ్చిన మర్యాద, బిరుదును గురించి కథగా చెప్పుకొనేవారు.


పదునెనిమిది సంవత్సరాలకు వీరా ప్లస్ టు స్టేట్ ఫస్టులో పాసైనాడు. ఒకనాటి రాత్రి దుర్గమ్మ వీరాకు అతని తండ్రికి తాను ఇచ్చిన మాటను గురించి చెప్పింది. పద్ధతిగా వీర తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చ నిశ్చయించుకొన్నాడు. తల్లికి చెప్పి మిలటరీలో చేరిపోయాడు. చేరి ఐదు సంవత్సరాలు గడచిపోయాయి.

*

రాత్రి దుర్గమ్మ.. వీర కలిసి భోంచేశారు.

"నాన్నా!.. వీరా!.."


"ఏమ్మా!" 


"మీ నాన్న నా కల ఒకటి వుందిరా. దాన్ని నీవు నెరవేర్చాలి. అది నా చివరి కోరిక!"


"ఏమిటమ్మా అది?"


"నీవు మల్లికను పెండ్లి చేసుకోవాలి!"


"ఎప్పుడు?"


"నీవు తిరిగి డ్యూటీకి పోయే లోపలే!"


"ఇప్పుడేనా!"


"అవును"


"మల్లిక చదువుకొన్న అమ్మాయి. మన బంధుత్వం సంగతి అటుంచు. తనకు నేను, నా ఉద్యోగం నచ్చాలి కదమ్మా!" సందేహంతో అడిగాడు వీర.


"నేను రేపు ఉదయాన్నే మీ అత్తయ్య ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతాను."


’ఉండేది ఒక్క తల్లి. ఆమె మాటను కాదనడం తప్పు’ అనుకొని వీర "సరే అమ్మా నీ ఇష్టం" అన్నాడు.


"ముహూర్తాలుంటే వెంటనే పెండ్లి జరుపుకొందాం. లేకపోతే నిశ్చితార్థం చేసుకొందాం. ఈసారి నీవు కొంచెం లీవు అధికంగా పెట్టురా. అప్పుడు పెండ్లి జరిపిస్తాను" అంది దుర్గమ్మ.


"అలాగే అమ్మా!"


దుర్గమ్మ ఆనందంగా మంచం ఎక్కింది.

*

"నాన్నా!"


"ఏమిటమ్మా!"


"నేను నా క్లాస్‍మేట్, భార్గవ ప్రేమించుకొన్నాము. అతను వాళ్ళ అమ్మా నాన్న రేపు మన ఇంటికి మీతో మాట్లాడేదానికి వస్తున్నారు. చాలా ఆస్థిపరులు. భార్గవ మంచివాడు. నేనంటే ప్రాణం. వారిని గౌరవంగా ఆహ్వానించి మాట్లాడి, నాకు భార్గవకు వివాహానికి ముహూర్తాలు పెట్టించి, త్వరలో మా పెండ్లిని జరిపించండి" అంది మల్లిక.


వాకిట ముందుకు చేరిన దుర్గమ్మ మల్లిక మాటలను విన్నది. ఆమెకు మైకం కమ్మినట్లైంది.

’మల్లిక ఎవరినో ప్రేమించిందా!’ ఆశ్చర్యంతో నోరు తెరిచి మెల్లగా వెనక్కు తిరిగి తన ఇంటి వైపుకు నడిచింది.


ఆమె ఇంటికి చేరే సమయానికి వీర ఇంట్లో లేడు. స్నేహితులతో కలిసి సముద్ర తీరానికి వెళ్ళాడు.

కన్నీటితో దుర్గమ్మ మంచంపై వాలిపోయింది. రాత్రి ఎనిమిది గంటలకు వీర ఇంటికి చేరాడు. తల్లి నిద్రపోవడాన్ని గమనించాడు. ఆమెను లేపకుండా, తనే భోజనం పెట్టుకొని తిని తన గదిలోకి పోయాడు.


యదార్థంగా అంత అవసరంగా అప్పుడు ఆ నిశ్చితార్థం, పెండ్లి అతనికి ఇష్టం లేదు.

నడిరాత్రి ఒకసారి లేచి తల్లి మంచాన్ని సమీపించి చూచాడు వీర. ఆమె చెక్కిళ్ళపై జారిన కన్నీటి చారలను గమనించాడు. అతని మనస్సున, తన అత్తగారి ఇంట్లో ఏదో జరగకూడనిది, తన తల్లి అభిప్రాయానికి వ్యతిరేకంగా, ఏదో జరిగినట్లుందన్న అనుమానం అతనికి కలిగింది. గదికి చేరి శయనించాడు. సయమం ఉదయం ఆరుగంటలు. ప్రతిరోజూ దుర్గమ్మ ఐదుగంటలకు నిద్రలేచి, వాకిట నీళ్ళు చలి, ముగ్గును వేసేది. అలాంటి తల్లి తనకు కనబడనందున వీర వేగంగా తల్లి గదిలో ప్రవేశించాడు. తల్లిని పరీక్షగా చూచాడు. ఏదో అనుమానం. పాదాలను తాకాడు. అవి చల్లగా వున్నాయి. శ్వాసను పరీక్షించాడు. ఆశ్చర్యపోయాడు. అతనికి విషయం అర్థం అయ్యింది. కళ్ళల్లో కన్నీరు.


"అమ్మా!.." అంటూ ఆమె పాదాలపై వాలిపోయాడు. 


అతని ఏడుపును విని ఇరుగు పొరుగు వారు ఆడ, మగ వచ్చారు. దుర్గమ్మను మంచం దించి చాపపరచి పడుకోబెట్టారు. 


మగవారు ఇద్దరు, ముగ్గురు వీరను ఓదార్చసాగారు. దుర్గమ్మ మరణవార్త సుబ్రమణికి, దేవయానికి తెలిసింది. వారూ వచ్చారు. మొసలి కన్నీరు కార్చారు. సాయంత్రం నాలుగున్నరకు దుర్గమ్మ అంతిమయాత్ర నలుగురు వాహకులతో స్మశానం వైపుకు సాగిపోయింది.

*

గుండె ఆగిపోయి దుర్గమ్మ చనిపోయిందని వూరిజనం అంతా అనుకొన్నారు. సుబ్రమణి, దేవయాని కూడా అలాగే అనుకున్నారు.


’వీరా! ఓ నెలరోజుల తరువాత ఒక్కనెల లీవు తీసుకొందువుగాని, వీరా. ఇప్పుడు వద్దులే’ అన్న బాస్‍తో వీర..

"అమ్మను చూచి సంవత్సరం అయింది సార్. వెళ్ళి అమ్మను చూచి వస్తాను సార్. ప్లీజ్ గ్రాంట్ మి లీవ్" చేతులు జోడించి అడిగాడు వీర. ఆ ఆఫీసర్, తన తల్లి గుర్తుకు రాగా, వీరాకు లీవు గ్రాంట్ చేశాడు.


ఆ సంభాషణ గుర్తుకు వచ్చిన వీర ’దైవం దయామయుడు. తన తల్లి అంత్యక్రియలను సకాలంలో సవ్యంగా జరిపించేదానికి నాకు వూరికి రావలెననే భావనను కలిగించాడు. వచ్చాను. నా తల్లిని చూచాను. ఆమె అంత్యక్రియలను శ్రద్ధగా చేయగలిగాను. అమ్మా!.. నాకు మల్లికకు వివాహం జరిపించాలనే నీ కల కల్ల అయిపోయింది. కానీ నేను నా తండ్రిలా సరిహద్దుల్లో వీర సిపాయిగా వుంటూ, తల్లీ!.. నీ కలను నిజం చేస్తాను" తల్లి ఫొటోకు నమస్కరించాడు. వీర ఫొటోను తన బ్యాగ్‍లో పెట్టుకొన్నాడు. అయ్యప్పకు సుబ్రమణి దేవయానికి, ఇరుగుపొరుగు హితులకు చెప్పి గ్రామాన్నుంచి కాశ్మీరుకు బయలుదేరాడు వీర.

*

సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


39 views0 comments

Komentarze


bottom of page