top of page
Writer's pictureSeetharam Kumar Mallavarapu

ఒక అమ్మ కథ - పార్ట్ 2


'Oka Amma Katha Part 2/2' - New Telugu Story Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 03/12/2023

'ఒక అమ్మ కథ పార్ట్ 2/2' పెద్ద కథ చివరి భాగం

రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

సురేష్ అనే ఆటో డ్రైవర్ తో ప్రేమలో పడుతుంది డిగ్రీ చదువుతున్న సుచిత్ర. ఇంట్లో ఉన్న నగలు, డబ్బులు తీసుకొని అతనితో ముంబై వెళ్ళిపోతుంది.


ఒక కొడుకు పుట్టాక సురేష్ నిజస్వరూపం బయటపడుతుంది.

సుచిత్రను ముంబైలోని ఒక బ్రోతల్ హౌస్ కి అమ్మేస్తాడు సురేష్.


అక్కడ పోలీస్ రైడింగ్ జరగడంతో వైజాగ్ లో రంగనాయకి దగ్గర చేరుతుంది. హాస్పిటల్ లో తన కొడుకు వయసున్న ఒక డాక్టర్, సురేష్ పోలికలతో ఉండటంతో ఆశ్చర్యపోతుంది.

గెస్ట్ హౌస్ కి వచ్చి తనను పిలిపించుకున్న వ్యక్తి ఆ డాక్టర్ కావడంతో ఏంచెయ్యాలో తోచదు సుచిత్రకు.



ఇక ఒక అమ్మ కథ పెద్దకథ చివరి భాగం వినండి.


'భగవంతుడా.. ప్రపంచంలో ఏ తల్లికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు..


కన్న కొడుకు ముందు ఇలా ఒక పడుపుకత్తెగా నిలబడటంకన్నా ఘోరమైన శాపం ఉంటుందా..


సమస్యనుండి తప్పించుకోవడం సులభమే..

నేను నీ తల్లినని చెప్పేస్తే చాలు.

అది కూడా వెంటనే చెప్పెయ్యాలి.


అతని చూపులు తనని వేరేలా తాకక ముందే చెప్పెయ్యాలి. లేదంటే ఆ చూపులు తనని జీవితాంతం బాధించవూ..


కానీ చిన్నప్పుడు దూరమైన తల్లి..

అసలు ఉందో లేదో తెలీని తల్లి..

ఇప్పుడు ఈ స్థితిలో కనిపిస్తే ఆ కొడుక్కి అంతకన్నా ఘోరమైన వార్త ఉంటుందా..


అయినా తన పిచ్చి గానీ ఆనాటి తన కొడుకును సురేష్ ఇన్నాళ్లు భద్రంగా కాపాడి ఉంటాడా..


ముంబైలో ఏ బిక్షగాళ్ల ముఠాకో అమ్మేసి ఉండడూ..


సురేష్ కి మరో స్త్రీ తో పుట్టిన కొడుకు అయి ఉంటాడు.

అలా అయినా తనకు కొడుకే అవుతాడు కదా..


అసలు తాను ప్రస్తుతం కేవలం వంట మనిషే కదా..

ఆ మాటే చెప్పేస్తే సరి..



ఆమె ఆలోచనలు తెగకముందే అతను ఎదురుగా ఉన్న సోఫా చూపిస్తూ "అలా కూర్చోండి. మీతో మాట్లాడాలని పిలిపించాను" అన్నాడు.

గుండె కాస్త కుదుట పడగా సోఫాలో కూర్చుంది సుచిత్ర.


అతడు తలెత్తి ఆమె వైపు చూసాడు.

ఆ చూపులో భావాలు చదవడానికి ప్రయత్నిస్తోందామె.


ఇన్నేళ్ల అనుభవంలో మగవాళ్ల చూపులను అర్థం చేసుకునే శక్తి బాగానే ఉంది ఆమెకు. ఖచ్చితంగా అవి కోరికతో చూసే చూపులు కావు.


ఒక సంస్కారవంతుడైన యువకుడు తనకు పరిచయమున్న నడివయసు స్త్రీని చూసే గౌరవప్రదమైన చూపు అది.


"మీరు పక్కనున్న వుమెన్ హాస్టల్ లో వంట మనిషిగా పని చేస్తున్నారని తెలిసింది.." సంభాషణ ప్రారంభించాడతను.


ఆ ఒక్క మాటతోనే ఆమె మనసులో నెలకొన్న భయం దాదాపుగా సగమయింది.


అతడు తనని వంటమనిషిగా భావిస్తున్నాడు.

తాను వుంటున్నది హాస్టల్ గానే అనుకుంటున్నాడు.

కానీ ఎస్సై తరఫున వచ్చిన మనిషికి ఈ మురికి కూపం గురించి తెలియకుండా ఉంటుందా..


ఆమె మనసులోని భావాన్ని గ్రహించినట్లుగా ""లోకల్ ఎస్సైగారు నా పేషంట్. నేను వంటమనిషి కోసం వెదుకుతూ వుంటే మీ గురించి చెప్పారు. నేను ఒంటరిగా ఉంటున్నాను. కాబట్టి కాస్త పెద్దవయసులో ఉన్న మర్యాదస్తురాలయిన స్త్రీ అయితే బాగుంటుందని చెప్పాను" " అన్నాడు.


ఆ మాటతో ఆమె పూర్తిగా రిలాక్స్ అయింది.


"నిన్న మీరు నన్ను హాస్పిటల్ లో చూసారు కదా.. ఒంటరిగా ఉంటున్నానన్నారు. మీ వాళ్ళు వేరే ఊర్లో ఉంటున్నారా?" అడిగిందామె.


'ఆ విషయానికే వస్తున్నాను. నేను ఒక అనాథనట. పుణ్య దంపతులెవరో నన్ను చిన్నప్పటినుంచి పెంచారు. వాళ్ళు అనారోగ్యంతో ఉండటంతో నాకోసం ఒక అయాను ఏర్పాటు చేశారు. అమ్మ లేని లోటును ఆమె భర్తీ చేసింది. నన్ను చేరదీసిన పెద్దవాళ్ళు కాలం చేశారు. అమ్మలాంటి ఆయమ్మ ఇటీవలే మరణించింది.


మీరు అచ్చంగా ఆమె పోలికలతో ఉన్నారు. నిన్న హాస్పిటల్ లో మిమ్మల్ని చూడగానే ఆమే గుర్తుకు వచ్చింది. కానీ మీరు ఎవరో ఏమో తెలియకుండా ఏమని మాట్లాడాలి..


లోకల్ ఎస్సై నా పేషంట్ అని చెప్పాను కదా!

ఈరోజు మధ్యాహ్నం ఆయన నా దగ్గరకు వచ్చాడు.


నిన్న మీతో వచ్చినావిడ హాస్టల్ పేరు, మీరు ఉంటున్న ఏరియా గురించి చెప్పింది కదా! ఆ వివరాలు ఆయనకు చెప్పాను. హాస్పిటల్ సిసి కెమెరా పుట్టేజి నుండి మీ ఫోటో తీసి ఇచ్చాను. నన్ను పెంచిన తల్లి ఈ పోలికలతో ఉందని, అందుకని మీ ఆచూకీ కనుక్కోమని కోరాను. ఆయన ఇందాకే ఫోన్ చేసి మీరు ఈ హాస్టల్ లో వంటవారుగా ఉన్నట్లు చెప్పారు.


మీకు అభ్యంతరం లేకపోతే నాకు దూరమైన నా తల్లి లాంటి ఆయమ్మ స్థానాన్ని మీరు భర్తీ చేయండి. కేవలం వంట మనిషిగా కాకుండా ఒక తల్లిలా మీరు నాతో ఉండవచ్చు" చెప్పడం ఆపి సుచిత్ర వైపు చూశాడు అతను.


ఏం చెప్పాలో తోచలేదు సుచిత్ర కి. ఎవరిని చూడగానే తనలో మాతృత్వ భావన కలిగిందో ఆ వ్యక్తి తనను అమ్మ స్థానంలో ఉండమని కోరుతున్నాడు. ఇది కల కాదు కదా..


శాపగ్రస్తురాలైన తనను కరుణించడానికి భగవంతుడే ఈ రూపంలో వచ్చాడా..


తల్లిదండ్రులను క్షోభ పెట్టి తను చేసిన పాపం తీరిపోయిందా..


తను వెళ్లడానికి రంగనాయకి ఒప్పుకుంటుందా..

తన మీద కోపం తెచ్చుకొని తన గతాన్ని ఈ డాక్టర్ తో చెబుతుందా..


ఒక్కసారిగా చుట్టుముట్టిన ఆలోచనలతో ఏమీ మాట్లాడలేకపోయింది సుచిత్ర. మరోసారి ఆమె మనసును చదివిన అతను "ఒక్కసారిగా పని మానేస్తే మీ హాస్టల్ ఓనర్ గారికి నష్టం కలుగుతుంది. ఇప్పటికిప్పుడు వేరే వాళ్ళను వెతుక్కోవాలంటే ఎక్కువ మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని ఆమె అడిగిన నష్టపరిహారాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఆమెను కనుక్కొని ఆమెకు ఎంత ఇవ్వాల్సి ఉంటుందో చెబితే వెంటనే ఇచ్చేస్తాను.


అసలు ముందుగా ప్రస్తుతం ఉన్న స్థానాన్ని వదులుకొని ఈ అపరిచిత యువకుడి వెంట రావడానికి మీరు సిద్ధపడతారా లేదా నాకు తెలియదు. ఆలోచించుకొని మీ నిర్ణయం రేపు నాకు తెలియజేయండి" అంటూ తన విజిటింగ్ కార్డ్ సుచిత్రకు ఇచ్చి "మీరిక వెళ్ళవచ్చు" అని ఆమెకు నమస్కరించి చెప్పాడు.


అతనికి ప్రతి నమస్కారం చేసి ఈసారి వెనుక గుమ్మం నుండి కాక మెయిన్ డోర్ నుండే బయటకు వచ్చింది సుచిత్ర. తనకోసమే ఎదురుచూస్తున్న రంగనాయకి తో మొత్తం విషయం వివరించి చెప్పింది.


రంగనాయకి ఎంతో సంతోషించి "ఇన్నాళ్లకు నీ జీవితానికి ఒక దారి దొరుకుతూ ఉంటే నేను అడ్డుపడతానా?


నిరభ్యంతరంగా నువ్వు ఆ డాక్టర్ తో వెళ్ళవచ్చు. నేనే నీకు ఏదైనా కానుక ఇచ్చి పంపుతాను. నువ్వు నాకేమీ ఇవ్వనక్కర్లేదు" అంది సుచిత్రను హత్తుకుంటూ.


మర్నాడు ఆ డాక్టర్ కి ఫోన్ చేయడానికి అతడిచ్చిన విజిటింగ్ కార్డ్ తీసింది. పేరు డాక్టర్ కె ఎస్ నందన్ అని ఉంది. అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే "డాక్టర్ గారూ! నేను మీ.. మీఇంటికి వంటమనిషిగా రావడానికి ఒప్పుకుంటున్నాను" అని చెప్పింది.


"చాలా సంతోషమమ్మా! కానీ ఒక్క షరతు మీదే మీరు ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది" అన్నాడు అతను.


"చెప్పండి డాక్టర్ గారూ!" అంది సుచిత్ర.


"అదే.. 'డాక్టర్ గారూ’ అని పిలవడం మానేయండి. ఒక అమ్మ కొడుకుని ఎలా పిలుస్తుందో అలా పిలవండి, ‘కన్నా.. నందూ..’ ఇలా పిలవండి. అంతేగాని దయచేసి గౌరవ వాచకాలు వాడకండి" అన్నాడు అతను.


"నేను కూడా ఒక షరతు మీదే నీతో వస్తాను బాబూ" అంది సుచిత్ర.


"అదేమిటో చెప్పండి" అన్నాడు అతను.


"ఎవరైనా అమ్మను అండీ అని పిలుస్తారా? అమ్మా అని పిలవలేక పోయినా ఆయమ్మా అని పిలువు చాలు. అన్నట్లు రంగనాయకమ్మ గారు నా నుండి డబ్బులు ఏవీ ఆశించడం లేదు. నువ్వు నీకు వీలైనప్పుడు వచ్చి నన్ను తీసుకొని వెళ్లొచ్చు" చెప్పింది సుచిత్ర.


"ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నానమ్మా. వెంటనే వస్తున్నాను" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు డాక్టర్ నందన్.

అరగంటలో ఆ హాస్టల్ ముందు కారు దిగాడు. సుచిత్ర, రంగనాయకిలతో పాటు ఆ హాస్టల్లో ఉన్న వారందరూ గేటు దగ్గర అతని కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అందరూ కన్నీళ్ళతో వీడ్కోలు చెప్పగా సుచిత్ర కారు ఎక్కింది. నందన్ ఆమెను తను ఉంటున్న ఇంటికి తీసుకొని వెళ్ళాడు.

తన గదిలో గోడకు తగిలించి ఉన్న ఒక ఫోటోను చూపించి "ఈవిడే మా ఆయమ్మ " అన్నాడు, ఆ ఫోటోవంక ఆరాధనగా చూస్తూ.


ఆమె అచ్చం తనలాగే ఉండటంతో ఆశ్చర్యపోయింది సుచిత్ర.


ఇల్లంతా చూపించాక సోఫాలో కూర్చోబెట్టి "నాకు ఒక ఎమర్జెన్సీ కేస్ ఉందమ్మా! సర్జరీ చేయాలి. లేకుంటే ఈరోజు సెలవు పెట్టే వాడిని" నొచ్చుకుంటున్నట్లుగా చెప్పాడు.


"పరవాలేదు బాబూ. ఇంట్లో వంటకు కావలసిన సరుకులన్నీ ఉన్నట్లు ఉన్నాయి. నువ్వు వచ్చేసరికి భోజనం రెడీ చేస్తాను" చెప్పిందామె.


"ఈరోజుకు రెస్ట్ తీసుకోమని చెబుదాం అనుకున్నానమ్మా! కానీ ఆయమ్మ చనిపోయాక చాలా రోజులకు ఇంట్లో తినే అవకాశం వచ్చింది. అందుకని భోజనానికి ఇంటికే వస్తానమ్మా" అని చెప్పి హాస్పిటల్కు బయలుదేరాడు డాక్టర్ నందన్.


'అయ్యో! అతనికి ఇష్టమైన వంటలు ఏమిటో కనుక్కోలేదు. సర్జరీ కోసం వెళ్లిన మనిషిని ఫోన్ చేసి విసిగించకూడదు' అనుకొని తనకు తోచని విధంగా వంట పూర్తి చేసింది. చేసిన పదార్థాలన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉండగా ల్యాండ్ లైన్ మోగింది.

తీయాలా వద్దా అని ఆలోచించింది కాసేపు. అబ్బాయి డాక్టర్ కదా.. ఎవరైనా అత్యవసరమై కాల్ చేశారేమో.. లిఫ్ట్ చేయడం మంచిది. విషయం కనుక్కొని అవసరమైతే మొబైల్ నెంబర్ లేదా హాస్పిటల్ నెంబర్ ఇవ్వవచ్చు" అనుకుంటూ ఫోన్ తీసింది.


"సుచిత్రా! నువ్వేనా. " అని వినపడింది అవతల వైపు నుండి.


ఉలిక్కిపడింది సుచిత్ర. తన గురించి ఎవరికి తెలిసింది? తెలిసినవాళ్లు తన నెంబర్ కి కాక ఇక్కడున్న ల్యాండ్ లైన్ కు చేయడం ఏమిటి.. ? వెంటనే ఫోన్ పెట్టేద్దామనుకుంది కానీ అలా చేస్తే విషయం తెలియదు, తెగదు. అందుకే గొంతు పెగిల్చుకొని "నేనే సుచిత్రని, మీరెవరో చెప్పండి" అంది.


"అదేమిటి ఆడ గొంతు వినపడుతోంది? నువ్వు కొత్తగా చేరిన వంట మనిషివా అమ్మా " అన్నాడు అవతలి వ్యక్తి.


అంటే ఈ ఫోన్ తనకోసం కాదన్నమాట.. కాస్త ఊపిరి పీల్చుకొని "అవునండీ. నేను కొత్తగా చేరిన వంట మనిషిని. మీరు ఎవరి కోసం ఫోన్ చేశారు?" అని అడిగింది.


"నా మనవడు సుచిత్ర కోసం చేశానమ్మా. నాకు మొబైల్ ఫోన్ లేదు. ల్యాండ్ లైన్ నుంచి ల్యాండ్ లైన్ కు ఫ్రీ కదా.. అందుకని చేశాను. సరేలే, మొబైల్ కి చేస్తాను" అన్నాడు అతను.


"సుచిత్ర ఎవరు? ఇది డాక్టర్ నందన్ గారి ఇల్లు. నా పేరు కూడా సుచిత్ర కావడంతో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను" చెప్పింది సుచిత్ర.


"వాడి పూర్తి పేరు సుచిత్రానందన్ అమ్మా! వాళ్ల తాతయ్య నాకు అన్న అవుతాడు. చిన్నప్పుడు దూరమైన కూతురు సుచిత్ర పేరును కలిపి మనవడికి సుచిత్రానందన్ అని పేరు పెట్టాడు మా అన్నయ్య. అన్నట్టు నీ పేరు సుచిత్ర అన్నావు కదూ ఒకవేళ నువ్వు మా అన్నయ్య కూతురు సుచిత్రవు కాదు కదా! మీది కాకినాడేనా.. ? మీ నాన్నగారి పేరు రాఘవరావు గారేనా?" ఆత్రుతగా అడిగాడు ఆయన.


"అంటే మీరు.. బాబాయ్.. నువ్వేనా? నేనే సుచిత్రను. మిమ్మల్ని అందరిని వదులుకొని వెళ్లిపోయిన సుచిత్రను నేనే. అమ్మా నాన్నా ఎలా ఉన్నారు?" ఆతృతగా అడిగింది.


కొంతసేపు నిశ్శబ్దం తరువాత "నువ్వు వెళ్లి పోయిన కొద్ది రోజులకే మీ అమ్మ చనిపోయిందమ్మా. నీ భర్త.. అదే.. ఆ సురేష్ ఆరు నెలల పసిబిడ్డగా ఉన్న నిన్ను ముంబైలో ఒక గుడిముందు వదిలేసి వెళ్లిపోతుండగా గస్తీ తిరుగుతున్న పోలీసులు అనుమానించి వెంబడించారు.

తప్పించుకోవడానికి వేగంగా వెళ్తున్న అతని టాక్సీ లారీకి గుద్దుకొని తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులే ఆసుపత్రిలో చేర్పించారు. చనిపోయే ముందు మీ నాన్న చిరునామా ఇచ్చి, బాబును ఆయనకు చేర్చమన్నాడు. ప్రసవమయ్యాక నువ్వు చనిపోయినట్లు చెప్పాడు.


వాళ్ళు మన కాకినాడ పోలీసులకు ఫోన్ చేసి, మీ నాన్నను తగిన ఆధారాలతో ముంబైకి తీసుకొని రమ్మన్నారు. నేను, మీ నాన్న ఒక కానిస్టేబుల్ తో ముంబై వెళ్ళాము. అక్కడే మాకు ఈ విషయాలన్నీ తెలిసాయి. బాబుతో తమకు సంబంధం లేదని సురేష్ పేరెంట్స్ రాసి ఇవ్వడంతో బాబును మీ నాన్నకు అప్పగించారు.


నువ్వు చనిపోయావని తెలిసి మేము చాలా బాధ పడ్డాము. బాబుకు మీరేమి పేరు పెట్టారో తెలీదు. నీ పేరును కలిపి సుచిత్రానందన్ అనే పేరు పెట్టారు మీ నాన్న.


బాబు కోసం ఒక ఆయమ్మను నియమించారు. ఆమె ఒక అనాథ. అచ్చు నీ పోలికలతో ఉండేది. బాబుకు ఐదేళ్ల వయసులో మీ నాన్న కాలం చేశారు. ఆయమ్మ నందన్ ని సొంత బిడ్డ లాగా చూసుకునేది. ఒక సంవత్సరం ముందు ఆమె చనిపోయింది" వివరంగా చెప్పాడు అయన.


తలిదండ్రుల మరణ వార్త సుచిత్రను ఎంతో కలచి వేసింది.

అయితే ఆ బాధలో కూడా కొడుక్కి గానీ తండ్రికి గానీ తన గత జీవితం తెలియక పోవడం కాస్త ఊరట కలిగించింది.

"బాబాయ్! వీలు చూసుకొని ఇక్కడికి రండి" అని చెప్పింది సుచిత్ర.


"అలాగేనమ్మా!" అన్నాడాయన.


ఫోన్ పెట్టేశాక వరండాలో ఉన్న కుర్చీలో కూర్చొని కొడుకు కోసం ఎదురు చూస్తోందామె.

ఇంతలో పక్కింటావిడ ప్రహరీ గోడ దగ్గరకు వచ్చి సుచిత్రను పలకరించింది.


తాను కొత్తగా వచ్చిన వంటమనిషినని చెప్పింది సుచిత్ర.


రెండేళ్ల క్రితం నందన్ కి వైజాగ్ లో ఉద్యోగం రావడంతో ఈ ఇంట్లో చేరారనీ, అప్పట్నుంచీ ఆయమ్మ తమకి బాగా పరిచయమనీ చెప్పిందావిడ. ఆయమ్మ చాలా మంచి మనిషనీ, నందన్ ని ప్రాణంగా చూసుకునేదనీ చెప్పిందామె.


ఒక్క క్షణం ఆయమ్మ అదృష్టానికి కించిత్తు అసూయ కలిగింది సుచిత్రకి. అనాథ అయినా ఆయమ్మ తన కొడుకు ముద్దు ముచ్చట్లు చూడగలిగింది. కన్న కొడుకును ని దూరం చేసుకొని తాను మాత్రం అనాథగా బ్రతుకుతోంది.


"మీ గురించి డాక్టర్ గారు నాతో చెప్పారు. రాబోయే ఆవిడ ఆయమ్మకంటే మంచి మనిషని, ఆమెకు ఏ సహాయం అవసరమయినా గమనించుకోమని నాకు చెప్పారు. డాక్టర్ సార్ రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఈ లోగా మా ఇంటికి ఒకసారి రండి" అందావిడ.


మొహమాట పడుతూనే వెళ్ళింది సుచిత్ర.


కాసేపు ముచ్చట్లు అయ్యాక వాళ్ళ అమ్మాయి పెళ్లి ఫోటో ఆల్బమ్ చూపించింది ఆవిడ.

ఒక ఫొటోలో నందన్ తో పాటు ఉన్న ఒక పెద్దావిడను చూపించి ఎవరని అడిగింది సుచిత్ర.


"ఆవిడే ఆయమ్మ. మీ ఇంట్లో హాల్ లో ఆమె ఫోటో తగిలించి ఉంది కదా.. " అందామె.


నిర్ఘాంతపోయింది సుచిత్ర.


ఆవిడ తన పోలికలతో ఉంటుందని కదూ నందూ చెప్పాడు..

కానీ ఈమెకు తన పోలికలు లేవు.


మౌనంగా ఆల్బమ్ తిరగేసి మరో భంగిమలో ఉన్న ఆయమ్మ మరో ఫోటో చూసింది.

అందులో కూడా తన పోలికలు ఎంతమాత్రం లేవు.


"ఈ ఫొటోల్లో ముఖం చిన్నదిగా కనిపిస్తుంది. అయినా మీ ఇంట్లో హాల్లో పెద్ద ఫోటో తగిలించి ఉంది కదా.. అచ్చం అలాగే ఉంటుంది" చెప్పింది పక్కింటావిడ.


ఆవిడ ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్నా సుచిత్ర మనసు మనసులో లేదు.

"డాక్టర్ గారు వచ్చే వేళయింది" అంటూ వేగంగా ఇంట్లోకి నడిచింది.


ఆతృతగా హాలు గోడల వైపు చూసింది.

ఎక్కడా ఆయమ్మ ఫోటో లేదు.


కొడుకు గదిలోకి వెళ్లి 'ఇదే ఆయమ్మ ఫోటో' అంటూ నందూ చూపించిన ఫోటో వంక పరీక్షగా చూసింది.

ఆ ఫొటోలోని ఆవిడ పట్టు చీర కట్టుకుని ఉంది.

బాగా గమనించాక అది తన ఫోటో అని అర్థమయింది సుచిత్రకి.


డిగ్రీలో చేరబోయే ముందు సరదాగా అమ్మ చీర కట్టుకుని తాను తీసుకున్న ఫోటో లాగా ఉంది అది.


అవును..

ఆ ఫోటోనే మార్పులు చేసి వయసు పెరిగినట్లు చేసిన ఫోటో ఇది.


బాబాయి కూడా ఆయమ్మ తన పోలికలతో ఉందన్నాడు.

కొడుకే బాబాయి చేత ఫోన్ చేయించాడా..

ఇదంతా నందూ ఎందుకు చేసినట్లు.. ?


కొద్దిపాటి పరిచయంలోనే తన మనసులోని ఆలోచనలు కొడుకు రెండు మూడు సార్లు పసిగట్టడం తనకు తెలుసు.

మరి అతని మనసు తాను చదవలేదా ?


కళ్ళు మూసుకొని కొంతసేపు ఆలోచించింది సుచిత్ర.

ఆలోచించే కొద్దీ కొడుకు వ్యక్తిత్వం ఉహకందనంత పెరిగిపోసాగింది.


తన ఫోటోని వయసు పెరిగితే ఎలా ఉంటానో అలా మార్పులు చేసి తరచూ చూసుకుని గుర్తు చేసుకుంటూ ఉండి ఉంటాడు తన కొడుకు.


అందుకే హాస్పిటల్ లో తనను చూడగానే గుర్తు పట్టాడు.

ఎస్సై సహాయంతో తనగురించి వివరాలు తెలుసుకొని ఉంటాడు.


ఏ తల్లికైనా భరించలేని విషయం కొడుకు ముందు కళంకితలాగా నిలబడటం..


ఆ స్థితి తనకు కలగకూడదని ఆయమ్మగా, వంటమనిషిగా పిలిపించుకుని తల్లి కంటే గౌరవంగా చూసుకోవాలనుకున్నాడు.


బాబాయి మాటల్లో నాన్న తను మరణించినట్లుగా అనుకున్నట్లు చెప్పాడు.


తన చీకటి జీవితం తండ్రికి జీవించి ఉన్నంతవరకు తెలియదని అనుకుని, తాను ఊరట పొందాలని ఆ మాటలకర్థం!

ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న కొడుకు దగ్గరకు చేరాక తనకు ఇక ఏ భయము ఉండకూడదు. అవసరమయితే తన జీవితంలోని ప్రతి చీకటి పేజీని నిర్భయంగా అర్థం చేసుకునే కొడుకు ముందు ఉంచగలదు.


ఆలోచనల్లో ఉన్న సుచిత్ర ఇంటి ముందు కారు ఆగడం, కొడుకు ఇంట్లోకి రావడం గమనించనే లేదు.


కొడుకు తన భుజాలు పట్టుకుని గట్టిగా ఊపడంతో ఈ లోకంలోకి వచ్చిన సుచిత్ర అతన్ని గుండెలకు గట్టిగా హత్తుకుంది.


"ఏమైందమ్మా? ఎందుకీ కన్నీళ్లు.. " ప్రేమగా అడిగాడు నందూ.


"చిన్నప్పుడే నిన్ను దూరం చేసుకున్నాను. చీకటి జీవితం గడిపాను. నా మీద కోపం లేదా నందూ" అని అడిగిందామె.


"ఒక్కమాట అడుగుతాను. జవాబు చెబుతావా అమ్మా" అడిగాడు అతను.


మాట పెగలక అడగమన్నట్లు తల ఉపిందామె.


"చిన్నప్పుడు నీ ఒడిలోనే మలమూత్రాలు విడిచి ఉంటాను. అప్పుడు నా మేడా నువ్వు కోపం తెచ్చుకొని ఉంటావా? నన్ను పైకెత్తు కున్నప్పుడు నీ గుండెల మీద తన్నినా 'మా నాన్నే ' అని ముద్దు చేసి ఉంటావే గానీ కోపం తెచ్చుకొని ఉండవు" చెప్పాడు అతను.


అది నిజమే. కానీ నా చీకటి బ్రతుకు.. " చెప్పబోతున్న తల్లిని ఆపి"ఏమిటమ్మా ఆ చీకటి బ్రతుకు? భర్తకు దూరమైతే వంటలు చేసుకుంటూ ఒంటరి బ్రతుకును వెళ్లదీశావు. నాకు తెలిసిందింతే. ఇంతకు మించి తెలుసుకోవాలనే ఆరాటం నాకు లేదు. నువ్వు చెప్పినా వినిపించుకోను. కొడుకు అందంగా ఉన్నా లేకపోయినా, కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నా, బంట్రోతుగా ఉన్నా ఆ తల్లి ప్రేమలో తేడా ఉండదు. కొడుకును కొడుకుగానే చూస్తుంది. మరి కొడుకు కూడా తల్లిని అంతే ప్రేమతో ఆదరించాలి కదమ్మా" ఆప్యాయంగా తల్లిని ఓదార్చుతూ అన్నాడు నందూ.


ఆకాశాన్ని తాకేంత గొప్ప వ్యక్తిత్వమున్న కొడుకు తలను ప్రేమగా నిమురుతూ ఉండిపోయింది సుచిత్ర.

========================================================================

సమాప్తం ========================================================================

మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము.

(అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
















393 views1 comment

1 comentario


Nice story

Me gusta
bottom of page