వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)
'Oka Dwaram Teravakapothenemi' - New Telugu Story Written By Pandranki Subramani
Published In manatelugukathalu.com On 19/02/2024
'ఒక ద్వారం తెరవకపోతేనేమి' తెలుగు కథ
రచన: పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
కొన్ని రోజులుగా నేను భాగ్యనగరం వేపు రావడానికి కుదరలేదు. కళాభిమానులకు చిరపరచిత ప్రదేశాలయిన రవీంద్ర భారతి, త్యాగరాయ గానసభ ప్రాంగణాల వేపు మనసున మనసుంచి తహతహతో రావాలనిపించినా రాలేక పోయాను, రాష్ట్ర సంగీత అకాడమీలో అసోసియేట్ సభ్యుడిగా పలు ప్రాంతాలలో పలు కళాకేంద్రాలు, పలు సంగీత వేదికల్లో న్యాయనిర్ణేతగా సంగీత పోటీల పర్యవేక్షకుడిగా హజరవుతూ ఉండటం వల్ల నా గాలివాటం నగర పొలిమేరల వరకూ సోకకుండా పోయింది.
తీరా నేను నగరం నడిబొడ్డున ఉన్న సంగీత కళాకేంద్రానికి చేరుకున్న తరవాత నాకు సునామీ వంటి బీభత్సకర దిగ్భ్రాంతి నాకోసం కాచుక్కూర్చుంది. ఆ రోజు గాత్ర సంగీతం యివ్వబోతూన్న సంగీత సారథి సోమలింగానికి సాధారణంగా మృదంగ సహకారం యిచ్చే భీమశంకరానికి బదులు మరొక మృదంగ విద్వాన్ పేరుండటం చూసి ఖంగుతిన్నాను.
కారణం - సోమలింగానికీ భీమశంకరానకీ విడదీయలేని గాత్ర బృంద అనుబంధం ఉంది. సంగీత వేదికపై వాళ్ళిద్దరి ఉనికీ కచ్చేరీకి బహుపసందుగా రక్తి కట్తుందన్న ఖ్యాతి రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలలా బాగా విస్తరించి ఉంది. సోమలింగం రాగ పీఠంపైన కూర్చుంటే ప్రక్కన యువ మృదంగ విద్వాన్ భీమశంకరం వాద్య సహకారం యివ్వవలసిందే— వీళ్ళద్దరి జంట సంగీత కచేరీ కోసం రసిక జనం తండోప తండాలుగా హాలు లోకి వచ్చి కూర్చుంటారు. గాత్ర సంగీత కళాకారుడికీ మృదంగ వాద్య సహకారం అందించే భీమశంక రానికీ మధ్య సాగే లయ విన్యాసానికి మంత్ర ముగ్ధులే రసికులు హాలుని చప్పట్లతో అదరగొట్టేసేవారు. ఇద్దరి కళా కౌశలం గురించి పత్రికలు సంగీత సమీక్షలతో ప్రత్యేక శీర్షికలతో వార్తలు నింపేసేవారు. సంగీత సభా నిర్వాహకులు ఇద్దరికీ సన్మాన సభలతో హోరెత్తించేవారు.
అటువంటిది— ఈ రోజు భీమశంకరం తోడ్పాటు లేకుండా సోమలింగం మరొక మృదంగ కళాకారుడితో సంగీత కచేరీ యివ్వడం యేమిటి? ఆషాడ మాసంలో మైదాకు (గోరింటాకు) లేని పెరడుతోటలా గోచరించడం లేదూ! ఇలా పరిపరి విధాల ఆలోచించు కుంటూ ఆ విషయం ఎవర్ని యెలా అడగాలో తోచక కొన్ని క్షణాల వరకూ సతమతమవుతూ ప్రక్కనున్న సంగీత రసికుణ్ణి అడిగాను నన్ను నేను పరిచయం చేసుకుంటూ-“ సోమలింగంగారికి ప్రక్కన భీమశంకరం గారు లేకుండా పాల్ఘాట్ నుంచి మరొక మృదంగ విద్వాన్ రావడమేమిటి?భీమశంకరం గారు ఫారిన్ టూరుపైన వెళ్లారా!”
ప్రక్కనున్న రసజ్ఞుడు నోరు మెదప కుండా తల అడ్డంగా ఆడించాడు.
నేనూరుకోలేదు. మళ్ళీ అడిగాను-“ ఇద్దరి మధ్యా ఎదురు చూడని విధంగా మనస్ఫర్థలు ఏవైనా వచ్చాయా!”
ఇది విని అతను నాపేవు పూర్తిగా తలతిప్పి చూసాడు. చూస్తూనే బదులిచ్చాడు-“ స్పర్ధలు పొడ సూపినట్లే పొడసూపి వాటికవే సమసిపోయాయి లెండి--”
ఈసారి నాలో చురుకుతనం రెట్టింపయింది-“వాటికవే అంటే?“అని పదునుగా అడిగాను.
దీనికతడు అదే పదునైన పదజాలంతో స్పందించాడు-“ అంటే—మీది ఈ ఊరుకాదన్నమాట-’
“మాది కూడా ఇదే ఊరండి. కాని— కొన్ని నెలలుగా ఇక్కడ లేను. నేను వెళ్లిన చోటల్లా తెలుగు పత్రికలు లేవు-అదన్నమాట సంగతి!”
అతడు అర్థం అయినట్లు తలూపి చెప్పడానికి ఉద్యుక్తుడయాడు- “ ఇద్దరు సంగీత విద్వాన్లూ మయూరి అనే నాట్య కళాకారిణిని యిష్టపడ్డారు.. చివరికామె భీమశంకరాన్ని యిష్టపడటంతో కథ పెండ్లితో సుఖాంతమైంది” .
అది విన్న తరవాత నాకంతా అయోమయంగా తోచింది. “భీమశంకరం పెండ్లితో స్పర్ధలు సమసిపోయాయంటున్నారు. మరి— ఇద్దరు మిత్రులూ కచేరీ లో కలవకుండా ఉండడ మేమిటండీ! సోమలింగంగారి గాత్ర సంగీతం ఉన్న వేదికపైన శంకరం మృదంగ విన్యాసం ఉండాలిగా!”
“ ఔను కలిసే ఉండాలి, కాని కలసి ఒకే వాదికిపైన ఉండలేరు. ఎందుకంటే—“
“ఎందుకంటే!” అని అతడికి అడ్డు వచ్చాను ఆతృత ఆపుకోలేక—
“కొంచెం ఓపిక పట్టండి మాష్టారూ-చెప్తాను. ఇప్పుడే కాదు-ఈ కచ్చేరీలోనే కాదు— మరేయితర సంగీత కార్యక్రమంలోనూ భీమశంకరం మృదంగం వాయించలేడు. కారణం—“
అదే టోన్ తో మళ్ళీ అడ్జుతగి లాను-“కారణం?”అని.
అతను కొనసాగించాడు- “చెప్తాను. గుండె దిటవు పర్చుకోండి. అతడి రెండు చేతుల వ్రేళ్ళు విరిగిపోయాయి. ఎలాగని అడక్కండి. అదీ నేనే చెప్తాను. వానా కాలమని గమనించకుండా అలవాటు ప్రకారం మ్యూజిక్ అకాడమీ మెట్లు చకాచకా దిగుతున్నప్పుడు మెట్ల పైన జారిపడ్డాడు. రెండు చేతులకీ రెండు వ్రేళ్ళ చొప్పున విరిగిపోయాయి. దీని వల్ల భీమశంకరంగారు మానసికంగా క్రుంగిపోయారు. బయట తలచూపడమే మానుకున్నారు. వాళ్ళ శ్రీమతి నృత్య ప్రదర్శనలకు వత్తాసుగా తోడుగా అప్పుడప్పుడు బయటకు వస్తుండేవారు. ఇప్పుడు అది కూడా మానుకున్నారు“
ఆ మాటతో నాకు తల తిరిగినంత పనయింది. ఒక గొప్ప కళాకారుడికి అంతటి దురదృష్టమా ఎదురవాలి!నేనిక నిలకడగా అక్కడ కూర్చోలేకపోయాను. చకచకా నడుస్తూ హాలు బయటకు వచ్చేసాను, మరొక ముప్పావు గంటలో భీమశంకరం యింటి వాకిట వాలాను. భీమశంకరం వయసు మళ్ళిన సీనియర్ సంగీత కళాకాంరుడిలా వాలు కుర్చీలో జేరబడి ఉన్నాడు. నన్ను చూసి పంజా కోల్పోయిన వృధ్ధ సింహంలా నీరసంగా నవ్వాడు, కాదు నవ్వబోయాడు, నేను ఆత్మీయంగా నవ్వుతూ అతడి భుజాలు తడుతూ ఎదురుగా కూర్చున్నాను. అతడు వెంటనే స్పందించాడు- “సారీ!మిమ్మల్ని పలకరించడానికి లేవలేక పోయాను. మరొక సారి క్షమాపణలు చెప్పుకుంటున్నాను చంద్రశేఖరా!“
“అదంతా గోళీమారో యార్! సమయం వృధాపోనివ్వకుండా విషయానికి రానియ్యి. ఇప్పుడు దీనికి బదులియ్యి. త్యాగయ్య మృదంగ విద్వాన్ ని యెవరితో పోల్చాడో తెలుసా!“
బదులివ్వకుండా ఆభావంగా చూసాడు నావేపు. అప్పుడు నేను పూర్తి చేసాను—“ ధీరుడితో— ఎక్కడంటావా— ఎలాగంటావా— విను- శ్రీరంజని రాగంలో ఇలా కొనియాడాడు- సొగసుగా మృదంగ తాళము జత గూర్చి నినుఁ జొక్కజేయు ధీరు డెవ్వడో! నిగమ శిరోర్థముగల్గిన నిజ వాక్కులతో సర్వశుధ్ధముతో సొగసుగా మృదంగ తాళము--!”
రాగాలాపన చేయడం ఆపి విషయానికి వచ్చాను- ఇప్పుడు గుర్తుకి వస్తుందా- అని అడుగుతూ— భీమశంకరం బదులివ్వలేదు. చేతులు రెండూ పైకెత్తి నమస్కరించాడు త్యాగయ్యను స్మరించుకుంటూ—
నేనూరుకోకుండా కొనసాగించాను “అటుంటి ధీరుడు మెడ వాల్చేసిన బాతులా తయారవుతాడా!”
“మరి నన్నేమి చేయమంటావు? మృదంగం వాయించాలంటే వ్రేళ్ళు ఉండాలిగా! అవి లేనిదే గమకాలు యెలా పుట్టుకొస్తాయి?”
“దేర్ యు ఆర్! ఇప్పుడు పాయింటుకి వచ్చావు. గమకాలు పలికించడానికి చేతి వ్రేళ్ళే ఉండనవసరం లేదు. గొంతులోనాలికి ఉంటే చాలు”
భీమశంకరం ఆశ్చర్యంగా నాలికా అన్నట్టు దిగ్భ్రమ చెందుతూ చూసాడు.
అప్పుడు తగిలించాను. ఔను. నాలికతోనే—“ “అదేలా-అన్నట్టు చూసాడతను. ” ఔను. ఇకనుంచి నువ్వు పాడటం నేర్చుకుంటావు. నాలికతో గమకాలు పలికిస్తావు. సంగీత సామ్రాజ్యా న్ని ఉర్రూత లూగిస్తావు. ”
“నేను నిజంగానే పాడగలనంటారా చంద్ర శేఖరా!”
“నీకు యెలాగూ ప్రాధమిక సంగీత సూత్రాలు తెలుసు కాబట్టి నేర్చుకుంటే తప్పకుంటే పాడి సంగీత సభను లాలించగలవు. సంగీత సభను జ్వలింప చేయగలవు. ఇంకా సందేహమా!” అని పదునుగా చూసాను.
అతడు ధ్యాననిమగ్నుడై శూన్యంలోకి చూడసాగాడు. అంటే— దారికి వస్తున్నాడన్నమాట— కాని నేను ఊరుకోలేదు. టెంపో తగ్గకూడనివ్వకూడదు కదా! “చివరి మాట గా ఇది వినుకో భీమశంకరా! దైవం ముఖ్యంగా కళామతల్లి యెప్పుడూ తలుపులన్నీ ఒకేసారి మూసుకు పోవడం యిష్టపడదు. ఒకటి మూసుకుపోతే మరొకటి తెరచి ఉంచుతుంది. అందులో ధీరుడు వంటి మృదంగ విద్వాన్ ఇలా నిస్తేజంగా మూలన పడి ఉండటం కళామతల్లి ససేమిరా సమ్మతించదు. ”
ఆ మాటతో భీమశంకరం చివ్వున లేచి నిల్చున్నాడు. ల్యాండ్ లైన్ తీసి మాట్లాడసాగాడు. నేను అడ్డు వచ్చి అడిగాను-
“ఎవరితో అంత అర్జంటుగా మాట్లాడుతున్నావు శంకరా?”
“బాలమురళీ కృష్ట గారి ప్రథమ శిష్యుడు ముకుందం గారితో—“
“ఎందుకూ?“
“ఇంకెందుకు? ఆయన ఆరంభించబోతూన్న గాత్ర సంగీత శిక్షణా తరగతులకు హాజరు కావడానికి--“
అది విని తృప్తిగా కుర్చీలో చేరబడ్డాను- మిషన్ సక్సెస్- అని మనసున ధీమాగా ఫీలవుతూ భీమశంకరం సతీమణి నవ్వుతూ వచ్చి అందించిన కాఫీ కప్పుని చేతులోకి తీసుకుంటూ--
***
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
Comments