ఒక జలబిందువు కోసం ఈ ఆరాటం
- Pandranki Subramani
- Apr 5
- 6 min read
#PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #ఒకజలబిందువుకోసంఈఆరాటం, #OkaJalabinduvuKosamYeeAratam, #TeluguStories, #తెలుగుకథలు, #TeluguHeartTouchingStories, #కొసమెరుపు

Oka Jalabinduvu Kosam Yee Aratam - New Telugu Story Written By Pandranki Subramani
Published In manatelugukathalu.com On 05/04/2025
ఒక జలబిందువు కోసం ఈ ఆరాటం - తెలుగు కథ
రచన: పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
భాగ్యనగరంలో నెళ్ళాల్లుండి, వీసా గడువు ముగిసి కొడుకూ కోడలూ అమెరిగా ప్రయాణానికి సర్దుకుంటున్నారు. వాళ్ల నిత్య జీవితంలో నిత్యావసరాలైన ల్యాప్ టాప్- నోకియా కెమెరా ముబైల్ ఫోను- ఇయర్ ఫోనూ- ఇక్కడ మేం కొనిచ్చిన టీ- షర్టులూ మంగళ గిర పట్టు వలువలు నైటీలూ కుదురుగా పేర్చి, కారులో తోపుడు బండికి తట్టుకునేలా బిగించి అదుము కున్నారు. అంతా అయిందనిపించుకున్నారు.
అంతలో విమానాశ్రయం వెళ్ళేందుకు బయట క్యాబ్ సిద్ధంగా ఉన్నట్టు డ్రైవర్ హారన్ మ్రోగించాడు. అప్పుడు జుబ్బా వేసుకుని గది గుమ్మం దాటి హలులోకి వచ్చాను. నమస్కరిస్తూ వీడ్కోలు పుచ్చుకుంటూన్న భార్యా భర్తలిద్దర్నీ ఆశీర్వదించి సావధానంగా అడిగాను- “మంచి నీళ్ళ బాటిల్ ఉంచుకున్నారు కదూ! ”అని.
అప్పుడు ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మొదట మా అబ్బాయి పుంజుకుని నవ్వు ముఖంతో బదులిచ్చాడు- “ఇది రైలు ప్రయాణం కాదు బాబూ! ఫ్లయిట్ జార్నీ- అంటే గాలోడ లో రివ్వున ఎగరడం. మనం అడిగినా అడక్కపోయినా క్యాబిన్ క్రూ వాళ్ళు ఏదో ఒకటి అందిస్తూనే ఉంటారు. అన్నట్టు నేను న్యూయార్క్ చేరిన వెంటనే న్యూమోడల్ మ్యూజిక్ సిస్టమ్ పంపిస్తాను. ఇప్పుడున్నది గరగరమంటూంది. ఇక వెళ్ళొస్తాం” అని వాళ్లమ్మ పాదాలు తాకి కదలబోయాడు.
నేను అదేమీ గమనించలేదు. “నువ్వు మంచి నీళ్ల బాటిల్ తీసుకు వెళ్లు. శంషాబాదు ఇక్కడకి రమారమి ముప్పై కిలోమీటర్ల దూరాన ఉంది. దారి మధ్యలో దాని అవసరం లేదనిపిస్తే మరెవ్వరికైనా ఇచ్చేయి. ఎట్టి పరిస్థితి లోనూ మంచినీళ్ళ బాటల్ తీసుకువెళ్ళే అలవాటు మాత్రం మరవకు-”
నాది మరీ ఛాదస్తం అనుకున్నాడో యేమో- మళ్ళీ నవ్వడానికి ప్రయత్నిస్తూ మంచి నీళ్ల బాటిల్ అందుకుని ట్రావలింగ్ బ్యాగులో ఉంచుకున్నాడు.
వినేవారికి నా ప్రవర్తనలో ఏదో అతిగా ఉన్నట్టు తోస్తూంది కదూ! నిజమే! వేపకాయంత వెర్రి కూడా నాకుందనుకోవచ్చు. అయితే— ఈ ఛాదస్తపు వైఖరి వెనుక ఒక అనంత జీవితానుభవమే దాగి ఉందన్నదన్నది వాళ్ళకు తెలియదు కదా— దాని గురించి చెప్తాను- చెప్పకపోతే ఎలా తెలుస్తుంది?
చెన్నప్పట్నం రీజనల్ ప్రావిడెంటు ఫండు ఆఫీసులో ఏకబిగిన ఐదేళ్ల ఉద్యోగ పర్వం తరవాత నన్ను మహారాష్ట్ర పడమటి ప్రాంతమైన కొల్హాపూరుకి బదలీ చేసారు. ప్రసిధ్ది గాంచిన మహాలక్ష్మమ్మ గుడి ఇక్కడే ఉంది. తితిదే వారు పండగ పబ్బాలకు ఇక్కడి అమ్మవారికి చీరెలు సారెలు పంపించడం ఆనవాయితీ. చల్లదనం- పందిరిలా పరచుకున్న పచ్చదనం ఊరిని శోభతో నింపుతుంది. బ్రిటిష్ వాళ్ళ కాలంలో కొల్హాపూరు ఒక సంస్థానంగా ఉన్నప్పుడే షావు మహారాజావారు అన్ని వర్గాలవారికీ విభిన్న స్థాయుల్లోనూ సామాజిక న్యాయం ఒనరించిన ఘనత సంపాదించుకున్నారు.
అందుకేనేమో- ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలకు పరిపాలనా పరమైన పర్యటనలకు వెళ్ళిన ప్పుడు ఆయనగారి నిడుపాటి ఛాయాచిత్రం చక్కెర కర్మాగారాలు- వ్యాపార సంస్థల ముఖద్వారాల్లో నిటారుగా సాక్షాత్కరించేది. అన్నట్టు చెప్పడం మరిచేను—ఆయన ఛత్రపతి శివాజీ మహరాజు వారికి చెందిన వంశీయుడు.
ఇక విషయానికి వస్తాను. మహారాష్ట్ర ప్రాంతానికంతటికీ ఉమ్మడిగా రెండు నెలలకోమారు బాంద్రాలో ఉన్న ముంబాయి రీజనల్ కార్యాలయ హెడ్ క్వార్టర్సులో విస్తృతమైన సమీక్షా సమావెశం జరిగేది. చుట్టు ప్రక్కల పని చేస్తూన్న అనుబంధ కార్యాలయాల పని తీరుపై ఢిల్లీ నుండి అధికారులు వచ్చి సూక్ష్మంగా పరిశీలించేవారు. నిర్దేశిత లక్ష్య సాధనకై ఆదేశాలు జారీ చేసావారు.
మామూలుగా సమీక్షా సమావేశాలు సోమవారం జరుగుతుంటాయి. అంచేత నేను శనివారం సాయంత్రం బస్సేక్కి ఆదివారం ఉదయం ముంబాయి చేరుకునేవాణ్ణి. రోజంతా యమ రద్దీగా గడచి పోయేది. అంతేనా- కాదు. కొల్హాపూరు ఉపకార్యా లయం చేరుకున్న తరవాత వాళ్ళ ఆదేశాలను ఆమూలాగ్రంగా పాటించి తగు సానుకూల నివేదికను సమర్పించడానికి వారం రోజులు పట్టేవి. ఇప్పుడా రోజుల్లోకి తేరి చూస్తున్నప్పుడు అనిపిస్తుంటుంది; నా వంటి పెళుసైన మనస్తత్వం గలవాళ్ళు అధికార ప్రాంగణానికి ఎంత దూరంలో ఉంటే అంత మంచిదని--
అదంతా ఇప్పుడెందుకులే “గతం గత:” అన్నరీతిన విస్మరించడమే క్షేమ దాయకం. ఆనెల కూడా ఎప్పటిలాగే సమీక్షా సమావేశాలు ముగిసాయి అట్టుడిగిన వాతావరణంలో- అజెండాకి సంబంధించిన రిపోర్టులు- తదితర నివేదికలు అంది పుచ్చుకుని మా ఉపకార్యాలయానికి సంబంధించిన అంశాలు కూడా సమకూర్చుకుని రాత్రి ఎనిమిదన్నరకు దాదర్ బస్టేషన్ చేరుకున్నాను. అక్కడున్న రెండు రోజులూ నానా విధాల ఒత్తిళ్ళకూ నలిగిన మనసు కిటి కీ వద్ద స్వేఛ్ఛావాయువులు సోకేటప్పటికి మాగన్నుగా సుఖ ప్రవాహంలోకి వెళ్లిపోయింది; ఇక ఆ రోజు రాత్రంతా అలాగే బస్సులోనే హాయి గా గడచి పోతుందనుకుంటూ--
కాని నేనక్కడే పప్పులో కాదు- తప్పులో కాలేసాను. అనుకున్నది అనుకున్నట్టు ఎప్పుడు మాత్రం జరిగిందని? అలా కొద్ది సేపు మాగన్నుగా కళ్ళు మూసుకున్నానో లేదో- జెర్కింగ్ లా ఓ విధమైన ఉలికిపాటుకి లోనయాను. నన్నలా ఉలికిపాటుకి లోను చేసిన అంశం మరేమిటో కాదు- ఎవరో ప్రక్క వరుస సీట్లో కూర్చుని పట పట కొరుక్కు తింటూన్న శబ్దం నా చెవుల్లో రొద చేసింది. టైము చూసుకుంటే- రమారమి పదకొండు-- సగం లేచి నిక్కి చూసాను. ఒకావిడ మందకొడి కాంతిలో లావుపాటి స్నాక్స్ ప్యాకెట్టుని ముందేసుకుని చప్పుడయ్యేలా నముల్తూ రాత్రి ప్రశాంతతను భంగపరుస్తూంది. ఇది అన్నవాహికకు అంతరాయం కలిగించే సమయమా! లోలోన చిరాకు పడుతూ- ‘మనకెందుకులే ఆ సోదె--’ అనుకుంటూ చేరబడ్డాను- కాని నేనిక్కడే అసలైన పొరపాటు చేసాను. బారుగా బోర్లా పడ్డాను. ఎందుకంటే- నా సమస్యలు అప్పట్నించే ఆరంభమయాయి.
రాత్రి పదుకొండు దాటిపోయింది. ఎక్కడో నిర్మానుష్య ప్రాంతాన బస్సునాపి, వెళ్ళాలనుకునే వాళ్ళు బైటకి వెళ్లి ఐదారు నిమిషాల్లో రావచ్చని పురమాయిస్తున్నాడు కండక్టరు. నేను ఎక్కువ సేపు గడప లేదు. లఘుశంక తీర్చుకుని బస్సులోకి వచ్చేసాను. మినరల్ వాటర్ బాటిల్ తీసి కాసిని మంచి నీళ్ళు నోట్లో పోసుకుని అనుకోకుండా అటు తిరిగి చూసాను. అప్పుడు చూసాను; అంతకు ముందు ఏక తట్టున స్నాక్స్ నమిలేస్తూ కూర్చున్న ఆవిడ తీరుబడిగా ఇటు తిరిగి నా వేపు తేరిపార చూస్తూంది.
నిజానికావిడ తేరపార చూస్తున్నది నా వేపు కాదని- నా చేతిలోని వాటర్ బాటిల్ వేపని గ్రహించడానికి నాకు అట్టేసేపు పట్టలేదు. బహుశ: తెచ్చుకున్న మంచినీళ్లు ఐపోయాయేమో!
అయిపోయాయంటే ఐపోవూ మరి- దారి పొడుగునా నానా చిరుతిళ్లూ తింటూ వస్తుంటే-- కళ్లు తిప్పి అటు చూసాను. ఆవిడ మగాడు కాబోలు- గుర్రపెట్టి నిద్రపోతున్నాడు. ఇక చెప్పేడానికేముంది? ఆమె చూపులోని గాఢత నన్ను సోకింది. మానవ భాష తెలియని గ్రహాంతర వాసిలా లేచి వెళ్ళి వాటర్ బాటిల్ అందించాను. ఆమె గుటగుటా గుటకలు మ్రింగి- ఇక చాలన్నట్టు నా వేపు ఓ చూపు విసిరి వాటర్ బాటిల్ తిరిగిచ్చేసింది.
థేంక్స్ మాట దేవుడెరుగు - చిన్నపాటి స్పందన కూడా లేదు. చిన్నపాటి నవ్వు లేదు. ఇబ్బంది కరంగా ముఖం పెట్టి నా సీట్లోకి వచ్చి కూర్చున్నాను. కొందరంతే మరి— వాళ్ళను మార్చడం బ్రహ్మతరం కాదు. ఎదుటి వారి నుండి సహాయాన్ని స్వీకరించడం రాజ్యాంగబద్ధమైన హక్కులా భావిస్తారు. అయ్యహో—మానవ నాగరికత యెంతలా దిగజారిపోతూంది!
నేను జంకుతున్నట్లే అయింది. పదినిమిషాలయిందో లేదే ఆమె మళ్ళీ నమలడం ఆరంభించింది. విసుగ్గా ముఖం తిప్పు కున్నాను. ఆవిడ అవస్థ అంతా- కందకు లేని దురద కత్తిపీటకి యెందుకు అన్నట్టు యెత్తి చూపుతున్నట్లుంది. - ఆవిడకు ఎస్కార్టుగా వచ్చిన ఆవిడ భర్త చూసుకోవాలి ఇదంతా-- మధ్య నాకెందుకు తీపరం!
అలా ముఖం తిప్పుకున్న తరవాత నాలోని ఆలోచనలన్నీ ఆఫీసుపైకీ ఇంటి పైకీ వెళ్ళిపోయాయి. అప్పుడు అలా కోడికునుకు తీస్తున్నప్పుడు బస్సెందుకో ఓ పెద్దపాటి కుదుపుతో ఆగింది. భళ్ళున కళ్లు తెరిచాను. వాహనం దేని నైనా గుద్దుకోలేదు కదా! లేదని ఖరారు చేసుకుని కిటికీ లోనుంచి బైటకి చూపులు సారించాను. చుట్టు ప్రక్కలంతా అంగళ్ళ మాట అటుంచి మనుష్యల అలికిడే లేదు. దూరాన అక్కడక్కడ తోడేలు కళ్ళలా చిరుదీపాలు మిణుకు మిణుకుమని మెరుస్తున్నా యి. ఇక టీ నీళ్లు పోసుకునే భాగ్యం లేదను కుంటూ అటు తిరిగి చూసాను.
మహారాష్ట్రీయ మహిళామణి నా వేపు కుదురుగా తిరిగి సూటిగా చూడసాగింది. ఆమె చూపులో అభ్యర్థన కాదు—అదో విధమైన అసహనం రేగిపోతున్నట్లనిపించింది. ఆనాడు ద్రౌపది కౌరవుల వేపు ఇలానే కోపంగా కోరగా చూసుంటుంది. ఆ చూపుల్లో నన్ను తాకిన భావం ఇది- “నేనిక్కడ రాత్రంతా దప్పికతో అలమటిస్తుంటే నువ్వక్కడ మత్తుగా నిద్ర పోతుంటావా! ” అని నిలదీస్తున్లట్దుంది. ఎందుకు చెప్పాలి- నేనుకూడా అప్పటికప్పుడు ఎదురు తిరిగి పదునైన చూపులు సారించాలనే అనుకున్నాను.
నా మనస్తత్వంలో నిభిడీకృతమైన బలహీనత వల్లనో మరే కారణం వల్లనో నాకు తెలియదు- ఎక్కువ సేపు ముఖా ముఖి చూడలేక పోయాను. దేనికో వశీకరించబడ్డట్టు భవ్యంగా లేచి వెళ్లి వాటర్ బాటిల్ అందించాను. నీళ్లు మింగి బాటిల్ తిరిగి ఇచ్చేస్తూ నన్ను ఎగాదిగా చూసింది. ఈసారి ఆమె చూపుల్లో నాకు మరొక అర్థం గోచరించింది- “మరొక మారు అలా నిర్ళక్ష్యంగా పెడ ముఖం పెట్టుకుని ఉండ కూడదు. తెలుసా?” అని ప్రకటిస్తున్నట్లుంది.
ఆ చూపులోని సూటిదనం గమనించి నాకు ఒళ్లు మండుకొచ్చింది. బస్ ప్యాసింజర్సు అంత మందిలోనూ ఆమెకు నా ఒక్కడి ముఖమే కనిపిస్తుందా! నేను తెచ్చు కున్న మంచినీళ్లే ఆమెకు కావాలా! ఇదొక నియంత ఆధిపత్య ధోరణి కాదూ! ముందే చెప్పాగా- కొందరంతే మరి! అంతర్ము ఖుడినై నాలోకి నేను చూసుకుంటూ నిద్రపోయాను.
కష్టాలు చెప్పిరావంటారు. వచ్చేవి కూడా ఒక్కసారిగా రావంటారు. పొదుపుగా, ఒకటి తరవాత ఒకటిగా వస్తుంటాయి.
ఇందులో నాకు మాత్రం మినహాయింపు ఎక్కడుంటుంది? ఉదయం ఆరుగంటలకల్లా కొల్హాపూరులోకి ప్రవేశించాల్సిన బస్సు నగరం సరిహద్దుకి కూడా చేరుకోలేదు. ఎందుకు చెప్మా- అని కళ్లు పెద్దవి చేసుకుని చూసేటప్పటికి తెలిసొచ్చింది; బస్సు మార్గ మధ్యలో బ్రేక్ డౌన్ అయిందని. కళ్ళద్దాలు తుడుచుకుని పరీక్షగా చూసాను. బస్సు అక్కడ ఇక్కడ కాదు— రత్నగిరి కొండ చరియల పంచన ఆగిపోయింది. కారణాలు ఒకటి కాదు— రెండు.
బ్రేక్ వదులయి పోయింది. రెండవది- టైర్లు ప్రేలిపోయాయి. గుండె కంగారు పడింది. రత్నగిరి కొండల పరిసరాల్లా అంతటా పచ్చగా ఆహ్లాదకరంగా ఉండాలంటే- ఎలా? ఇది జీవితం— ఇలానే ఉంటుంది మరి ఎగుడు దిగుడుగా సాగిపోతుంటుంది-- హృదయ భారాన్ని వదిలించుకున్న పరివ్రాజకుడిలా ఉండాలని ఆశిస్తే కుదరదుగా! నా కోసం ఎదురు చూసే మూడు క్వాషీ జుడిషియల్ ఇంక్వయి రీలకు తదుపరి తేదీలు స్థిరపరచమని మా పి- ఏ కి సెల్ ఫోను ద్వరా ఆదేశాలిచ్చి బస్సు దిగి కొంచెం కొంచెంగా నీళ్లు చప్పరిస్తూ మైదానంలో పచార్లు చేయసాగాను.
ఈ లోపల చాలా మందికి వెంట తెచ్చుకున్న వాటర్ బాటిల్స్ ఖాలీ అయిపోయినట్టున్నాయి. ఇద్దరు ముగ్గురు నన్నూ నా వాటర్ బాటిల్ వేపూ చూసారు. నేను ఖాతర చేయలేదు. నాకు నీళ్ళివ్వ కూడదని కాదు. కాని ఇవ్వకపోవడానికి కారణం ఉంది. చాలా సంవత్స రాలుగా నన్ను మైగ్రేన్ తలనొప్పి వెంటాడు తూంది. అది ఎప్పుడైనా వస్తుంది. ఎక్కడైనా వస్తుంది పిలవని పేరంటానికి వచ్చి నట్టు. అప్పుడు తలనొప్పి మాత్ర వేసుకోవడానికి కాసిని మంచి నీళ్లు కావాలి.
నిజం చెప్పాలంటే-- అమృతమన్నది ఎక్కడో దేవలోకంలోనో స్వర్గం లోకంలోనో లేదు. భూలోకాన దొరికే మంచి నీళ్లే నిజమైన అమృతం. అందుకే కాబోలు- గాంధర్వులు సహితం రాత్రిపూట చడీ చప్పుడు లేకుండా దిగి వచ్చి వాగుల్లో వంకల్లో చెరువుల్లో జలకాలాటలు ఆడి సేద తీర్చుకుని వెళ్ళిపోతుంటారు!
అలా పచార్లు చేస్తూ ఆలోచనల్లో మునిగి తేలుతున్నప్పుడు- అలవాటులో పొరపాటుగా బస్సులోకి తలెత్తి చూసాను.
ఇంకేముంది— ఆ మహారాష్ట్రీయ మహిళా మణి బస్సు కిటికీ నుండి నన్నే తొంగి చూడసాగింది.. తక్షణం చూపు మరల్చుకుని సమీపంలో ఉన్న బండరాయి పైన చతికిలబడ్డాను; ఇచ్చేవాడుండాలే గాని. చచ్చేవాడు కూడా లేచి వస్తాడన్నది తలపోస్తూ—
అప్పుడు నేనే మాత్రం ఎదురు చూడనిది జరిగింది. ఆమె సరాసరి బస్తు దిగి నన్ను కన్ ఫ్రంట్ చేసేలా తేరిపార చూస్తూ నిలుచుంది. అప్పుడు నేనేమి చేసానని— బహు భవ్యంగా లేచి వెళ్లి నా చేతిలోని వాటర్ బాటిల్ ని ఆమెకు అందించాను.
అప్పుడు గాని నాకర్థం కాలేదు, ఆమెందుకలా రాత్రంతా పర పరా నముల్తూ కూర్చుందో— నముల్తూ నముల్తూ అలా ఎందుకు తరచూ దాహార్తికి లోనయేదో!
ఆమె నిండు గర్భీణీ!
శుభం
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

Comments