#KotthapalliUdayababu, #కొత్తపల్లిఉదయబాబు, #OkaKommakiPuyaniPuvulam, #ఒకకొమ్మకుపూయనిపూవులం, #StoryOnSocialProblems, #సామాజికసమస్యలు
Oka Kommaki Puyani Puvulam - New Telugu Story Written By - Kotthapalli Udayababu
Published In manatelugukathalu.com On 19/01/2025
ఒక కొమ్మకు పూయని పూవులం - తెలుగు కథ
రచన : కొత్తపల్లి ఉదయబాబు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
కృత్తికా..కృత్తికా ...అబ్బా.తొందరగా తలుపు తీయవే..’’ అన్న దీపిక మాటలు విని తలుపు తీసింది కృత్తిక.
“హృదయపూర్వక అభినందనలు నీకు...నువ్వు ఎడ్ సెట్ పాసయ్యావ్. నీకు పదిహేడవ రాంక్ వచ్చింది. ఇంటర్వ్యూ నామినల్ అనుకో...తప్పకుండా నీకు ఉద్యోగం తొందరలో వచ్చేస్తుంది. నీ కాళ్ళమీద నువ్వు నిలబడే రోజు ఎంతో దూరంలో లేదు. భగవంతుడు నిన్ను కరుణించాడు.’’ అంది తన చేతిలోని కవర్ కృత్తిక చేతిలో పెడుతూ.
కృత్తిక ఆత్రంగా ఆ కవరు తీసి చూసుకుని తన కళ్ళను తానే నమ్మలేనట్టుగా దాన్ని రెండుమూడు సార్లు చదువుకుని ముద్దు పెట్టుకుంది. ఆ వెంటనే -
కృత్తిక ఒక్కసారిగా వంగి దీపిక కాళ్ళకి నమస్కారంచేసి, పైకి లేచి దీపికను గాఢంగా కౌగలించుకుంది.. “భగవంతుడు ఎవరే? అతనూ మగవాడే...నన్ను కరుణించినది ఆ రాజరాజేశ్వరి రూపంలో ఉన్న నువ్వే..ఎన్ని సార్లు నీకు అమ్మగా పుట్టమంటావో చెప్పు.ఆ తల్లిని బ్రతిమలాడి నీకు అమ్మగా పుట్టి రుణం తీర్చుకుంటానే...నీ ఋణం తీర్చుకుంటాను.’’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది కృత్తిక.
వెంటనే ఆమెను తననుండి విడదీసి కృత్తిక కన్నీళ్లను తుడిచి పక్కనున్న కుర్చీలో కూర్చోపెట్టి మరో కుర్చీని కృత్తిక దగ్గరగా లాక్కుని కూర్చుని అంది దీపిక .
“కృతీ...తప్పు. ఇలాంటి శుభవేళ అలా బాధపడటం నాకు నచ్చలేదు. అయినా నేను చేసింది ఏముందే? ఒక స్నేహితురాలిగా నీకు ఇంత ఆశ్రయం ఇచ్చాను. అంతేగా.నేను ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా చేస్తున్నాను కాబట్టి నీకు ఆశ్రయం ఇవ్వగలిగాను. ఆరోజు నువ్వు నాకు సహాయం చేయకుంటే నా బిడ్డ ప్రాణాలే పోయి ఉండేవి. ఈవేళ ఈ పురుషాధిక్య సమాజంలో ధైర్యంగా ఒంటరిగా బతుకుతున్నాను అంటే నువ్వేనే కారణం.
పెళ్ళయి ఒక బిడ్డకు తల్లి అయ్యేంత వరకేనే ఈ సమాజంలో ఆడదానికి మగవాడి అవసరం. మనకిష్టమైతే మదర్ థెరిస్సాలాగా కూడా బ్రతకవచ్చు అనుకో. ఆ తర్వాత మన జీవితం మనం సుఖంగా బ్రతికగలం. కానీ మగవాడు అలా కాదే. పుట్టిన క్షణం నుంచి వాడు చచ్చేవరకూ ఆడది కావాల్సిందే. నువ్వు స్థిరపడుతున్నావు అనుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ముందు టీ తాగుదాం.’’ అంటూ దీపిక స్టవ్ దగ్గరకు వెళ్ళి టీ కలపడం పూర్తి చేసి తెచ్చింది రెండు కప్పులలో.
ఇంతలో కృత్తిక వెళ్లి తన పెట్టెలో ఉన్న రెండు కొత్తచీరలు తెచ్చింది. "ఈ మంచిరోజును మనం బాగా సెలబ్రేట్ చేసుకుందాం దీపూ...ఇందులో నీకు నచ్చిన చీర తీసుకో.’’ అంది దీపికకు ఇస్తూ..
తనకు నచ్చిన చీర తీసుకుంది దీపూ...తీసుకోనంటే కృత్తిక ఏం చేస్తుందో తనకు తెలుసు.
“అన్నట్టు బాబు ఏడి? దీపూ” అడిగింది కృత్తిక.
“వాడిని పక్కింటి రవితో ఆడుకుంటానంటే అక్కడ వదిలి వచ్చాను. నువ్వు తయారవు.నేను వెళ్లి వాడిని తీసుకొచ్చేస్తాను. ఇంతకూ ఎక్కడకు వెళ్దాం? గుడికా? సినిమాకా? పార్కా?’’ అడిగింది దీపిక.
“హాయిగా అమ్మవారి గుడికి వెళ్లి వద్దాం. దర్శనం అయ్యాక చెరువు గట్టు మీద కూర్చుంటే హాయిగా ఉంటుంది.సరేనా?’’ అంది కృత్తిక.
“సరే.’’ అని దీపిక బయటకు వెళ్ళింది బాబు కోసం.
దైవదర్శనం తర్వాత చక్కటి ఆ సాయంత్రం తమ కాలేజీ కబుర్లు చెప్పుకుంటూ చెరువు చుట్టూ గట్టుకు ఏర్పాటు చేసిన పార్క్ లో బాబు అక్కడ పిల్లలతో ఆడుకుంటూ ఉంటే ఆనందంగా గడిపేసి ఇంటికి వచ్చారు.
ఇంటికి వచ్చాకా భోజనంచేసి పడుకున్నారు ముగ్గురూ...కృత్తిక కు నిద్ర పట్టలేదు. ఎక్కడి తానూ? ఎక్కడికొచ్చి ఉంటోంది? అని ఆలోచిస్తూ గతంలోకి జారిపోయింది ఆమె.
*****
కృత్తిక నాన్నగారు శ్రీమన్నారాయణ గారు రైసు మిల్లు గుమాస్తాగా పని చేసేవారు. ముగ్గురు ఆడపిల్లల తరువాత ఒక మగ పిల్లవాడు ఆయనకు. అందరిలోనూ కృత్తిక చాలా హుషారుగా ఉండేది. ఇంటికి పెద్ద కూతురు.చిన్నప్పటి నుంచి ఎక్కడ పాట వినబడినా తనకు తోచినట్లుగా డాన్సు చేసేసేది. తోటి పిల్లలకు నేర్పేసేది. ఆమె ఇంటి పక్క వాటాలోకి ఆవూరు జిల్లా పరిషత్తు హైస్కూల్ కు కొత్తగా వచ్చిన తెలుగు మాస్టారు నారాయణరావు గారి అమ్మాయి అయిన దీపిక తన క్లాసు కావడంతో కృత్తిక, దీపికల మధ్య స్నేహం చిగురు తొడిగి మహావృక్షమే అయ్యింది.
ఆమె ఇంటర్ రెండవ సంవత్సరంలో ఉండగా కళాశాల వార్షికోత్సవం జరిగింది. ఆమె అభిరుచిని గమనించిన రసాయన శాస్త్ర అధ్యాపకురాలు వార్షికోత్సవంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో ఒక నాటిక , ఒక స్వాగత గీతం, మరో దేశభక్తిగేయాల ప్రదర్శనకు ప్రోత్సహించారు. ఆ కార్యక్రమాలు చూసి సీనియర్స్, జూనియర్స్ అనే బేధం లేకుండా ఎందఱో ఆమెకు అభిమానులైపోయారు.
దీపిక డి.ఎడ్. లో చేరింది.
ఆడపిల్లకు చదువు ఆవశ్యకతను గుర్తించిన శ్రీమన్నారాయణ గారు కృత్తికను డిగ్రీ మొదటి సంవత్సరం లో చేర్పించిన కొంత కాలానికే గుండెపోటుతో మరణించారు. కృత్తిక తనకు తెలిసిన వారందరినీ తమకు ఏదైనా దారి చూపించమని ప్రాధేయపడింది. తన కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతూ ఈ మధ్యనే పరిచయం అయిన సుమంత్ “నీకు నాటికలలో నటించడం ఇష్టం అయితే మా నాన్నగారితో చెబుతాను. ఆయన సాంఘిక నాటకాలు ప్రదర్శించే సంస్థకు అధ్యక్షులు.’’ అన్నాడు.
“నాటికకు ఎంత ఇస్తారేమిటి?’’ అడిగింది.
“రెండువేలు దాకా ఇస్తారేమో ప్రదర్శనకు.నువ్వు కొత్తదానివి కదా. కొంచెం తక్కువే ఉండవచ్చు.’’ అన్నాడు సుమంత్.
“నెలకి ఎన్ని ప్రదర్సనలుఉంటాయేమిటి? అయినా అమ్మను అడిగి చెబుతాను.’’ అంది కృత్తిక.
“అసలంటూ మొదలెడితే దానిమీదే నెలకు ఒక ఇరవై వేలు సంపాదించుకోవచ్చు. పేరుకు పేరు...డబ్బుకు డబ్బు.’’ అన్న అతని మాటలలోని అంతరార్ధం తాను గ్రహించలేక పోయింది నాటకానుభవం లేకపోవడం వల్ల.
తల్లి ససేమిరా ఒప్పుకోలేదు.
“ఒప్పుకోనంటే ఇల్లు గడిచే మార్గం ఏముందమ్మా? పోనీ ఇంట్లో నలుగురం ఆడవాళ్ళం కూలి పనులకు వెళ్దామా?కోత పనులకు వెళ్దామా? పాచి పనులకు వెళ్దామా?నువ్ ఏది నిర్ణయిస్తే అదే చేద్దాం.’’ అంది కృత్తిక.
వేరే మార్గం లేక అతికష్టం మీద తల్లి ఒప్పుకుంది. అనుకోకుండా తన నాటకాలలో కొత్త హీరోయిన్ ను పరిచయం చెయ్యాలనే సుమంత్ తండ్రి అభిరుచి మేరకు మొదటిసారి ముఖానికి రంగు వేసుకుంది కృత్తిక. సుమంత్ తండ్రి జయరాజు ఆమె బాధ్యతను సుమంత్ కి అప్పగించాడు.
కొత్త అమ్మాయిగా తాను ఏ ముహూర్తం లో నాటకరంగవేదిక ఎక్కిందో గానీ మొదటి నాటికతోనే ఆమె ‘ఉత్తమ సహాయ నటి’ గా తొలి పరిషత్తు నాటిక పోటీలలో బహుమతి అందుకోవడంతో పాటు రెండువేలరూపాయల పారితోషకం అందుకుంది.
ఆనాటి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. అయిదు సంవత్సరాల నటచరిత్రలో ముప్పైకి పైగా పరిషత్తులలో ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి బహుమతులు అందుకోవడంతో పాటు, బహుమతులుగా వెండి పళ్ళాలు, గ్లాసులు, కప్పులు డబ్బును కూడా బహుమతిగా పొందింది.ఇక సాధారణ ప్రదర్శనలకు లెక్కే లేదు. స్త్రీ పాత్రధారులకు పరిషత్తువారు ఒక చీరను కూడా ప్రతీ ప్రదర్శనలో ఇవ్వడం పరిపాటి కావడంతో ఇంట్లో తల్లి చెల్లెళ్ళు ప్రతి నెలా కొత్తబట్టలు కట్టేసుకునేవారు. తన గురించి ఆలోచించేవారే కాదు. తనకోసం నచ్చిన చీర దాచుకున్నా వాళ్ళు అడిగితే ఇవ్వకుండా ఉండలేకపోయేది.
నాటకాలు వేయడం మొదలెట్టి సంవత్సరం పూర్తికాకుండానే ఇంట్లో తల్లితో పాటు అందరూ చీకు చింతా లేకుండా హాయిగా బ్రతకడం గమనించింది కృత్తిక. తనతో చెప్పకుండానే వాయిదాల పద్దతిలో ఇంట్లోకి టివి., ఇనుప బీరువా, డైనింగ్ టేబుల్, కుర్చీలు, పాత సామానుల స్థానంలో కొత్త వస్తువులు చేరడం గమినించింది కృత్తిక.
“ఎవరి స్వార్ధం వాళ్ళు చూసుకునేటప్పుడు నీ స్వార్ధం నువ్వు చూసుకోకపోతే నిండా మునిగిపోతావ్ కృతీ...ఆ తర్వాత బాధ పడి లాభం లేదు. నీకు అభ్యంతరం లేకపోతే స్నేహితురాలిగా నేను నీకో మార్గం చెబుతాను. విని ఆచరించగలను అంటే నేను సహాయం చేస్తాను.’’ అంది దీపిక.
“చెప్పు దీపూ...’’
“నీకు వచ్చిన బహుమతులలో అవసరం లేని కొన్ని వెండి వస్తువులు అమ్మి డబ్బు చేసి నీ పేరున బాంక్ లో అక్కౌంట్ తెరిచి అందులో వేస్తాను. అలాగే నాటకాల పారితోషకం కాకుండా, నీకు పైన వచ్చిన బహుమతుల డబ్బు కూడా అందులో వేస్తాను. ఎందుకంటే అది నీ కష్టార్జితం. నువ్వు కళ్ళు తెరిచేలోగా అవి కూడా వాడేసారంటే మళ్ళీ నువ్వే అప్పులు చెయ్యాలి. పోనీ అవి తీర్చే విషయంలో నీకు తోడుగా ఎవరైనా వస్తారా అంటే ఒక్కళ్ళు ముందుకు రారు అని నాకు అర్ధమైంది . ఈ సంగతి మీ ఇంట్లో తెలియనివ్వకు. ఆ పాస్-బుక్ నాదగ్గర దాస్తాను.అసలు అందులో ఎంత డబ్బు పోగయిందో కూడా నీకు చెప్పను. అందుకు ఇష్టమైతేనే . ఏమంటావ్?’’ అంది దీపిక.
కృత్తిక ఒక్కసారిగా దీపికను పట్టుకుని ఏడ్చేసింది. దీపిక కంగారు పడింది.
“అయ్యో. నీకు ఇష్టం లేకపోతే వద్దులే. నేనే తప్పుడు సలహా ఇచ్చి నీ మనసు పాడుచేసానేమో.’’ అంది.
“లేదు దీపు. నా కష్టం చూసి నా కన్నతల్లి కూడా ఆ మాట అనలేకపోయింది. అలాంటిది నువ్వు ఇంత మంచి సలహా ఇచ్చి మన మధ్య స్నేహం అనే పదానికి నిజమైన అర్ధం చెప్పావు. నువ్వు నా తోబుట్టువుగా ఎందుకు పుట్టలేదా అని కన్నీళ్లొచ్చాయి అంతే.’’ అంది కళ్ళు తుడుచుకొంటూ.
“పిచ్చిమొద్దూ. నేను నీ తోబుట్టువునైతే నువ్ తెచ్సిపెడుతుంటే హాయిగా నీ చెల్లెళ్ళలాగానే తినికూర్చుంటాను. ఇలాంటి సలహాలివ్వనుగా.’’ అంటూ వెక్కిరించింది.అది చూసి కిల కిలా నవ్వింది కృత్తిక.
ఒక శుభ ముహూర్తం చూసి కృత్తిక పేరున అక్కౌంట్ ప్రారంభించడానికి అవసరమైన కాగితాలన్నీ తెచ్చి పూర్తి చేసి తన సంతకాలు తీసుకుని వెళ్ళింది దీపిక. ఆసాయంత్రం పాస్-బుక్ ను పట్టుకొచ్చి చూపించి తనతో తీసుకుపోతూ అంది;
“కృతీ.నువ్వు నాకు ఎంత డబ్బు ఇస్తున్నావో...చిన్న పాకెట్ బుక్ లో నోట్ చేసుకో. అపుడు దీంట్లో ఎంత సొమ్ము పోగయ్యిందో నేను చెప్పక్కర్లేదు. నీకే తెలుస్తుంది.’’ అంది దీపిక.
“లేదే...నేను అలా చేస్తే నిన్ను అనుమానించినట్టే లెక్క. పొరపాటున కూడ ఆ పని చెయ్యను.’’ అంది కృత్తిక.
“లేదు కృతీ. స్నేహం వేరు..నమ్మకం వేరు. అందులోనూ డబ్బు విషయంలోనే స్నేహితుల మధ్య పోరాపోచ్చాలోస్తాయి. సరే..నువ్వు ఆ పని చెయ్యకపోతే నేనే చేస్తాను.’’ అంది సీరియస్ గా.
“మన స్నేహంలో మాత్రం రావు. రానివ్వను నేను.’’ స్థిరంగా అంది కృత్తిక.
రెండేళ్ళు గిర్రున తిరిగిపోయాయి. దీపిక డి.ఎడ్. పాసయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం డి.ఎస్.సి. ఉద్యోగాలు ప్రకటించడం, మంచి రాంక్ తో పాటు ప్రాధమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయినిగా ఆమెకు సెలక్షన్ రావడంతో పెళ్లి సంబంధాలు రాసాగాయి.
వచ్చిన సంబంధాలలో దగ్గరలోని పట్నంలో మున్సిపాలిటీలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా వచ్చిన సంబంధం నారాయణరావుగారికి బాగా నచ్చింది. అతనికి ఎలాగూ బదిలీలు ఉండవు. ఉన్నా అవి పట్టణ పరిధిలోనే ఉంటాయి. అమ్మాయి దగ్గరగా ఉంటుంది.చుట్టుపక్కల గ్రామంలోనే కాబట్టి ఆమె డ్యూటీ అనంతరం ఏరోజు కారోజు ఇంటికి వెళ్లిపోవచ్చు... పైగా ఇదరూ ఉపాద్యాయులే అయితే..డబ్బు కు డబ్బు... వెసులుబాటు కూడా. ఇన్ని విధాలుగా ఆలోచించి అతనికి దీపికను ఇచ్చి వివాహం చేసారు. తన ప్రాణమిత్రురాలు తనకు దూరం అయినందుకు కృత్తిక చాలా నీరసపడిపోయింది. దీపిక తనపక్కన ఉంటే ధైర్యమే ధైర్యం.
“పిచ్సిమొద్దు..నేనెక్కడకి వెళ్తాను.మా టీచర్లకి రెండువందల ఇరవై రోజులు పని చేస్తే చాలు. ఏడాది జీతం వస్తుంది. బోలెడు సెలవులు. నువ్వు దూర ప్రాంతాలకి నాటకానికి వెళ్ళినప్పుడు తిరిగి వస్తూ నా ఇంటికి వచ్చెయ్యి. సెలవుల్లో నేను ఇక్కడకి వస్తుంటాను. సరేనా? ప్రాణాలు పోయేంతవరకు మన ఇద్దరి స్నేహం ఇలాగే ఉంటుంది. నాదీ హామీ.’’అని చెప్పడంతో కృత్తిక మనసు తేలిక పడింది.
పెళ్ళయిన ఆరు నెలలకే భర్త ..అతని అభిరుచులు, అలవాట్లు అవగతమౌతూ వచ్చాయి దీపికకు. అతనికి టీనేజ్ అమ్మాయిల పిచ్చి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కు కోచింగ్ కు వచ్చే అతనికి నచ్చిన అమ్మాయి అతని కోరిక తీర్చాల్సిందే...అలా ట్రాప్ చేసేసేవాడు.
దీపికకు ఏడాదికే బాబు పుట్టాడు. ఒకరోజు పేరంటానికి వెళ్తూ పక్కింటి వాళ్ళ అబ్బాయికి బాబునిచ్చి జాగ్రత్తగా చూడమని చెప్పి వెళ్ళింది. వాళ్ళ ఇంట్లో టీవీ లేకపోవడం వాళ్ళ ఆ పిల్లాడు తన జేబులో కొనుక్కోవడానికి తెచ్చుకున్న చిల్లర నాణేలను బాబుకిచ్చి రిమోట్ తో టీవీ చానెల్స్ తిప్పుతూ చూడటంలో పడిపోయాడు. తళతళలాడుతున్న రెండు రూపయల నాణేన్ని ఆ బాబు నోట్లోపెట్టేసుకున్నాడు . ఇదేమీ గమనించే స్థితిలో లేడు వాడు.. దీపిక పేరంటం నుంచి వచ్చి చూస్తే బాబు గుడ్లు తేలేసి పడిఉన్నాడు..దీపికకు కాలూ చేతులూ ఆడలేదు. భర్తకు ఫోన్ చేసింది . నాట్ రీచబుల్ వచ్చింది. గబగబా పక్కింటి ఆమె సాయంతో డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళారు. డాక్టర్ ఆ నాణెం బయటకు తీయడానికి పదిహేనువేలు అడిగాడు.పైగా బాబు ప్రాణం పూచీ తనది కాదు అన్నాడు.
నెలాఖరు రోజులు. చేతిలో వాడకానికి డబ్బులు తప్ప చిల్లిగవ్వలేదు. వెంటనే కృత్తికకు ఫోన్ చేసింది దీపిక.
సరిగ్గా ఆసమయంలో కృత్తిక నాటక ప్రదర్శనలో తెరవెనుక ఉంది. వేదిక మీద రసవత్తర సన్నివేశం జరుగుతోంది.ఆమె మామ పాత్రధారి టీపాయ్ మీద మోగిన సెల్-ఫోన్ లో మాట్లాడిన తరువాత భార్య పాత్రతో ఫోన్ లో ఆవిషయం ఆందోళన తో చెప్పాలి. ఆ దృశ్యం ప్రారంభం అయ్యేటప్పుడు టీపాయ్ మీద ఫోన్ ఉంచడం మర్చిపోయారు ఆర్గనైజర్లు.
ఆ దృశ్యం లో కృత్తికలేదు. నాటిక జరుగుతున్నంతసేపూ సహనటీనటుల హావభావాలు చూడటం ఆమెకెంతో ఇష్టం.అలా వారిని పరిశీలిస్తూనే, తానెలాగూ సీన్ లో లేను కదా అని యధాలాపంగా హ్యాండ్ బాగ్ లోంచి ఫోన్ తీసి మిస్సడ్ కాల్స్ ఏమన్నా ఉన్నాయా అని చూస్తున్నంతలో ఫోన్ వచ్చింది దీపికనుంచి. ఆన్ చేసింది.దీపిక బాబు పరిస్తితి వివరిస్తూ " కృతీ..డాక్టర్ పదిహేను వేలు అడిగాడు.బాబు చావు బతుకుల్లో ఉన్నాడు.. చేతిలో వాడకానికి తప్ప డబ్బులేదు.నీ బాంక్ బుక్ లోంచి పదిహేను వేలు తీసుకోనా? చెప్పవే? కృతీ..కృతీ..’’ అని అరుస్తోంది.
కృత్తిక దృష్టి మామ పాత్రధారిమీద పడింది.అతను టీపాయ్ మీద ఫోన్ లేకపోవడంతో కంగారు పడిపోతూ ఎక్కడుందా అని వెతుకుతున్నాడు.
వెంటనే కృత్తిక స్టేజి మీదకు వచ్చేసింది ఫోన్ తో..
“ఆ...ఆ...ముందు బాబు ప్రాణాలు కాపాడటం ముఖ్యం.నువ్వు వెంటనే డబ్బు తీసుకుని వెళ్ళు. సరేనా?’’ అని ఫోన్ కట్ చేసి మావయ్య పాత్రదారితో.
“అదేంటి మావయ్యా. ఇందాకా కాఫీ అడగడానికి వచ్చి ఫోన్ వంటింట్లో మర్చిపోయారు. మీకే ఏదో కాల్ వస్తోంది..మాట్లాడండి.నాకు వంటింట్లో పని ఉంది.’’అని ఫోన్ అతనికి అందించి తెరవెనక్కి వచ్చేసింది. ఆ మావయ్య పాత్రధారి చేతికి ఫోన్ రావడంతో పాత్రలోకి వెళ్ళిపోయాడు. నాటిక కొనసాగింపబడి అద్భుతంగా పండింది.
కృత్తిక స్పాంటేనియస్ గా స్పందించిన తీరుకు జయరాజు ఉబ్బితబ్బిబ్బై పోయాడు. ఆ మావగారి పాత్రధారి నాటకానుభవం తక్కువ. దానితో కంగారు పడి పోర్షన్ మర్చిపోతే ఎక్కడ నాటిక చెడిపోతుందో అని భయపడ్డాడు జయరాజు. యూనిట్ అంతా కృత్తికను ఆకాశానికి ఎత్తేసి మరీ అభినందించారు. యధాప్రకారంగా ఈ నాటికలోను ఆమె ఉత్తమ నటి అవార్డ్ సొంతం చేసుకోవడంతో జయరాజు ఆనందానికి అవధులు లేవు. ఒక విధంగా పాతతరం నటీమణులతో విసుగెత్తిపోయి ప్రాభవం తగ్గిపోయిన నాటక సమాజానికి పూర్వ వైభవం రావడానికి కృత్తిక ముఖ్య కారణం అన్న కృతజ్ఞత జయరాజు మనసులో పాతుకు పోయింది..
ఆమెను తన కోడలిగా చేసుకుంటే బాగుంటుందన్న భావనను కొడుకు దగ్గర వ్యక్తం చేసాడు.ఈ విషయం లో జయరాజు చాలా లోతుగా ఆలోచించాడు అనే చెప్పాలి. మొదటగా తమ సంస్థలో నాటకాలు వేయడానికి వచ్చిన అమ్మాయిలను వాడుకోవడంలో సిద్ధహస్తుడైన కొడుకుకు ఆ పాడుఅలవాటు తప్పించి వాడిని ఒక కుటుంబీకునిగా స్థిరపరచడం . రెండవది ఆమెను కోడలిగా చేసుకోవడంవల్ల సంస్థకు పేరుకు పేరు...డబ్బుకు డబ్బు.
తండ్రి దగ్గర నుంచి వచ్చిన అవకాశం వింటూనే ఎగిరి గంతేశాడు సుమంత్.
“నేను స్వయంగా అడిగితే మీరు నన్ను తిడతారేమో అనుకున్నాను నాన్నా..నాకు మనసులోని కోరిక ఆ దేవుడు మీరూపంలో తీరుస్తాడని అనుకోలేదు.’’ అన్నాడు సుమంత్.
“సరే. నేను కృత్తికను కదుపుతాను. తన అభిప్రాయం విన్నాకా ఒక నిర్ణయానికి వద్దాము.’’ అన్నాడు జయరాజు.
ఆ మరునాడే వార్తాపత్రికలో ప్రముఖంగా వచ్చిన వార్త చదివి కంగారుపడిపోయింది కృత్తిక. అది దీపు భర్త అరెస్ట్ వార్త.
“ఫలానా పట్టణ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సత్యకృష్ణ సాయంత్రం సమయాలలో విద్యార్ధినులకు శిక్షణ ఇచ్చే సమయం లో తమతో అనుచితంగా ప్రవర్తిస్తూ తమను శారీరక, మానసిక హింసకు గురిచేస్తున్నాడని అదే పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్ధినుల సాక్ష్యాలను రికార్డు చేసి లోకల్ సిటీ కేబుల్ వారికి మరియు జిల్లా పరిషత్ అధికారులకు పంపడంతో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. విద్యాశాఖాధికారులు ముందుగా అతన్ని సస్పెండ్ చేసారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అతని భార్య దీపిక కూడా అదే మండలంలో ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే భర్తతో గొడవపడి దీపిక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసారు. సకాలంలో స్పందిచడం వలన ఆమెకు గండం తప్పిందని..ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు.’’
ఆ వార్త చదువుతూనే కృత్తిక భోరున ఏడ్చేసింది. బంగారం లాంటి భార్య ఇంట్లో ఉండగా ఈ మగాళ్ళకు ఇదేం రోగం?
పైకి అందరూ ఎంత మంచిగా కనిపి(నటి)స్తారు? అవకాశం వస్తే ముసుగు తీసేసి నిస్సిగ్గుగా తమ అసలు రంగు బయట పెడతారు. ముఖ్యంగా పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, తాము నేర్పిస్తే గాని ఆడపిల్లలు తెలుసుకోలేరనుకునే వారి అజ్ఞానపు కాముకత ఇలా బయటపడిననాడు పరువు, ప్రతిష్ట, తన కుటుంబం నాశనమై పోయాయన్న కనువిప్పు కలిగాక మాత్రం ఉపయోగం ఏమిటి?
అనుకున్నాక ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా దీపిక దగ్గరకు వచ్చేసింది కృత్తిక. వచ్చేముందు దీపిక మామూలు మనిషయ్యేవరకు తాను ఇంటికి రానని, అందుకు వారం- పదిరోజులు పట్టవచ్చని తల్లికి చెప్పింది.
అలాగే జయరాజుకు ఫోన్ చేసి ఫలానా తేదీన గల నాటికకు తాను రిహార్సల్స్ కు రాలేనని, నాటిక సమయానికి తప్పక వచ్చేస్తానని చెప్పింది.
దీపిక కృత్తిక ను చూస్తూనే "కృతీ...’’ అంటూ కౌగలించుకుని ఏడ్చేసింది. సరిగ్గా అప్పుడే మరో వార్త తెలసి ఇంకా కుంగి పోయింది దీపిక.
అల్లుడి వార్త చూసిన వెంటనే గుండెపోటుతో కుప్పకూలిన నారాయణరావుగారు గంట క్రితమే హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారన్నదే ఆ వార్త.
వెక్కి వెక్కి ఏడ్చాకా మనసు తేలికపడిన దీపిక చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ అడిగింది కృత్తిక.
“ఏమిటే...ఏమిటే ఈ పిచ్చిపని? ఏదో చిన్న వార్త పేపర్లో వచ్చిందని చక్కగా చదువుకుని ఎంతో ఓర్పు, సహనాలతో రేపటి పౌరులకు పునాది వేసే నువ్వే ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే, నాలాంటి వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి ఎవరుంటారే? బాబు ఏమైపోతాడు చెప్పు?’’
"నేను అంత దూరం ఆలోచించలేదే? ప్రాణంగా ప్రేమించాను. ఇల్లాలుగా నా జీవితం ధన్యం అనుకున్నాను.కలనైనా ఊహించలేదు. తట్టుకోలేకపోయాను.ఆడదానిగా ఓడిపోయాననిపించింది. అందుకే ఆ పని చేసాను.నన్ను మన్నించు కృతీ.’’ అంది చమరింపు కళ్ళతో.
“జరిగిందేదో జరిగిపోయింది. ఒకసారి వెళ్లి అతన్ని కలిసి చూసి వద్దాం.పద.’’ అంది కృతి.
“వద్దు కృతీ. వద్దు. వాడు అలాంటి రాక్షసుడు అని తెలిసాకా ఇక జీవితంలో వాడి ముఖం చూడను.చూడలేను. నా ఉద్యోగం నాకు ఉంది.నాకు మగతోడుగా నా బిడ్డ ఉన్నాడు. నీడగా నువ్వెప్పుడూ ఉంటావు. ఈ సమయంలో అమ్మకి నా ఆసరా చాలా అవసరం. నీకు చేతనైతే ఒక్క సాయం చేసిపెట్టు.’’అడిగింది దీపిక కృత్తిక కళ్ళల్లోకి చూస్తూ.
"చెప్పవే. నావల్ల ఏం సాయం కావాలో చెప్పు. నా శక్తివంచన లేకుండా చేస్తాను.’’ ఆవేశంగా అంది కృత్తిక.
“అతని చేత ...అతని చేత విడాకులు నేను పొందేవరకు నాకు తోడుగా ఉండు. చాలు. ఉండగలవా?’’ దీపిక మనసు ఎంతగా గాయపడిందో అర్ధం చేసుకున్న కృత్తికకు ఈసారి కన్నీళ్లు ఆగలేదు.
"బాగా ఆలోచించావా? మగవాడు తోడు లేకుండా ఆడది ఈ లోకం లో బతకలేదే.’’
“అది తప్పు అని నిరూపించిన సాక్ష్యానివి నువ్వు. ఈ విషయంలో నువ్వే నాకు స్పూర్తి. ఈ ఒక్క సాయం చేసిపెట్టు. మన స్నేహం మీద ఒట్టు వేసి చెబుతున్నా. నువ్ చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోను.’’ అంది దీపిక.
కృత్తిక సరే అని అంగీకరించింది. ఆ కార్యక్రమంలో బిజీ అయ్యారు స్నేహితురాళ్ళు ఇద్దరూ.
********
తరువాతి వారంలోనే జయరాజు కృత్తికను సుమంత్ తో వివాహం విషయం కదిపాడు. తనకు ఆలోచించుకోవడానికి కొద్దిపాటి సమయం కావాలని అడిగింది కృత్తిక. స్నేహితురాళ్లిద్దరూ సుమంత్ – జయరాజుల మనస్తత్వం..పరిచయాలు,కృత్తిక కుటుంబాన్ని ఆపద సమయంలో దారి చూపి ఆదుకోవడం వంటి అనేక విషయాలు చర్చించారు. ఏ విషయం లోను ‘వద్దు’ అనడానికి కారణం దొరకలేదు ఇద్దరికీ. సుమంత్ కృత్తిక మనసులు విప్పి మాట్లాడుకున్నారు.
“పెళ్లి అయినతర్వాత కూడా నువ్ నటించాలని నాన్నగారి కోరిక.అందుకు ఇష్టమేనా?నువ్వు నటిగా కొనసాగుతాను అంటే నాకేమీ అభ్యంతరం లేదు’’ అడిగాడు సుమంత్.
"నీకు మనస్పూర్తిగా ఇష్టమైతే నాకూ అభ్యంతరం లేదు సుమంత్’’ అంది కృత్తిక.
నెలరోజుల్లోనే ముహూర్తం కుదిరింది. ఒక రోజు జయరాజు వచ్చి కొంత డబ్బు కృత్తికకు ఇచ్చి " అబ్బాయి నువ్వు వెళ్లి మీకు నచ్చిన బట్టలు తీసుకొండమ్మ. అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు.వెళ్ళు.’’ అని పురమాయించి వెళ్ళిపోయాడు.
కృత్తిక తల్లికి చెప్పి జయరాజు ఇంటికి వచ్చింది. జయరాజు ఇల్లు పరిచయమే కాబట్టి నేరుగా సుమంత్ పడకగదిలోకి రాబోయి ఆగిపోయింది.సుమంత్ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నాడు.
“ఏంటి బెదిరిస్తున్నావ్? మూడో నెల కడుపు తీయించుకోవడానికి డబ్బు పడేసానుగా. ఇంకోసారి ఫోన్ చేసి బెదిరిస్తే నీ నాటకాల బతుకు అంతటితో సరి. నా సంగతి తెలుసుగా. నాన్నకు నేను ఎంత చెబితే అంత. పెట్టేయి ఫోను.’’ అని అరిచాడు.
“ఎవర్రా అది?’’ అతని స్నేహితుడు కాబోలు అడుగుతున్నాడు.
“అదేరా జయంతి- ఆ వైజాగ్ అమ్మాయ్. ఇప్పటివరకు నా బుర్ర తింది. ఇపుడు నువ్వు తినమాకు.’’ చిరాకు పడ్డాడు సుమంత్.
“సరే గానీ నా సంగతి ఏం చేసావ్? నువ్వు ఎన్ని లక్షలు కావాలంటే అన్ని ఇస్తాను. కృత్తిక మాత్రం ఒక్కరాత్రి నా సొంతం కావాలి.’’ అంటున్నాడు స్నేహితుడు. వింటున్న కృత్తిక కొయ్యబారిపోయింది.
“ఈ పెళ్లి ఏదో సవ్యంగా జరిగిపోనీ. దాని మీద నా మోజు తీరిపోతే..ఇక అది నీదే.పెళ్లి అయ్యాకా ఒక్క నెలరోజులు ఆగు.’’ అన్నాడు సుమంత్. ఆవేశంతో లోపలకు వెళ్లి కడిగేద్దామనుకుంది. తను ఒంటరిది. వాళ్ళు ఎంతకైనా తెగించవచ్చు అని విజ్ఞత చెప్పింది. నిశ్సబ్దంగా బయటకు వచ్చేసిన కృత్తిక నేరుగా దీపిక వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. ఈసారి నిర్ఘాంతపోవడం దీపిక వంతు అయింది.
“నువ్వేం అధైర్యపడకు కృతీ. నీకు నేనున్నాను. అతనితో నీ పెళ్లి జరగదు. అలా చేసేపూచీ నాది. మన స్నేహం మీద ఒట్టు’’ అని ప్రమాణం చేసింది దీపిక.
తనకు పురుడు పోసిన లేడి డాక్టర్ కు జరిగినదంతా చెప్పి ,కృత్తికకు గర్భస్థ కేన్సర్ అని, నయమవ్వని ఆ వ్యాధికి లక్షల్లో ఖర్చు పెట్టాల్సివస్తుందని,పెళ్లి అయితే ఆమెకు పిల్లలు పుట్టరని, ఇక మీదట నటిస్తే ఆమె ప్రాణానికే ప్రమాదమని ఆమె చేత జయరాజుకు చెప్పించింది దీపిక. జయరాజు. సుమంత్ కలిసి వచ్చి కృత్తిక చేతిలో కొంత డబ్బు పెట్టి "ముందు నీ ఆరోగ్యం జాగ్రత్తమ్మా. కుదుటపడితే మళ్ళీ చేద్దువుగానిలే.’’ అని పరామర్శించి వెళ్ళిపోయారు.
కేవలం మూడు నెలల కాలంలోనే దీపికకు ఆమెభర్తకు విడాకులు మంజూరు చేసింది న్యాయస్థానం.
“నువ్వు వెంటనే డి.ఎడ్.లో చేరు. ఆనాడు నేను దాచిన నీ కష్టార్జితమే నీ చదువుకు పెట్టుబడి.అర్ధం అయిందా?’’ అంది దీపిక. కృత్తిక దీపికను మనసారా కౌగలించుకుని "నువ్వు నా స్నేహితురాలు అవ్వడం నా అదృష్టం దీపూ.’’అంది.
ఈవేళ ఎడ్ సెట్ కూడా పాసైంది. ఒక మంచి పనిచేసి దీపిక చేసిన సాయానికి కృతజ్ఞత తెలుపుకోవాలి అని నిర్ణయించుకున్న కృత్తిక హాయిగా నిద్రలోకి జారుకుంది.
*****
“ఈరోజు ఎంతో మంచి రోజు దీపూ. ఇది నా మొదటి జీతం. నేను ఒక మంచి పని నిర్ణయం తీసుకున్నాను దీపూ.అనాధాశ్రమం నుంచి ఒక పాపను తెచ్చి పెంచుతాను.దానిని పెంచి పెద్దచేసి బాగా చదివించి నీ కోడలుగా చేసి మనం బంధుత్వం కలుపుకుని మన స్నేహానికి ఒక అర్ధం కల్పిద్దాం అన్నది నా ఉద్దేశం.ఏమంటావ్ దీపూ?’’ అడిగింది కృత్తిక.
కృత్తిక తెచ్చిన స్వీట్ బాక్స్ తెరచి కలాకండ్ స్వీట్ ఆమె నోటికి అందిస్తూ "నీ ఇష్టమే నా ఇష్టం కృతీ. ఒక కొమ్మకు పూయని పూలమైనా ఇక ఆజన్మాంతం నీ మాటే నా మాట. నీ పార్టీ నా బాట.ఎందుకంటే మన ఇద్దరికీ జీవితమంటేనే స్నేహం కాబట్టి " అంది ఆర్ద్రత నిండిన కళ్ళతో.
సమాప్తం
కొత్తపల్లి ఉదయబాబు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు : కొత్తపల్లి ఉదయబాబు పుట్టిన తేదీ : 01/07/1957 విద్యార్హతలు : M.Sc., M.Ed., M.phil (maths) నిర్వహించిన వృత్తి : ప్రధానోపాధ్యాయులు
తల్లి తండ్రులు : శ్రీ కొత్తపల్లి గంగాధర్ శర్మ, విశ్రాంత హెడ్ పోస్ట్-మాస్టర్ స్వర్గీయ శ్రీమతి సుబ్బలక్ష్మి. భార్య : శ్రీమతి సూర్యకుమారి కుమార్తె : చి. సౌ. గుడాల సుబ్బ లక్ష్మి సంతోషిత , M.B.A. w/o లక్ష్మికాంత్ – లాయర్ మనుమరాలు : చి. లక్ష్మి పూర్ణ సాధ్వి కుమారుడు : చి. హనుమ గంగాధర్ శర్మ , సాఫ్ట్-వేర్, h/o చి.సౌ.తేజశ్రీ మనుమలు : చిరంజీవులు గహన్ ముకుంద, ఋషిక్ వశిష్ట.
*వృత్తి పరంగా :
*జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల పోటీలలో వివిధ అంశాలలో బహుమతులు, క్విజ్,సాంకేశృతిక కార్యక్రమాల నిర్వహణ, న్యాయ నిర్ణేతగా వ్యవహిరించిన అనుభవం.
*పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2002 లో తొలిసారిగా ఐదుగురు విద్యార్థులకు నూటికి నూరు మార్కులు రావడం ఆ సందర్భంగా అరకాసు ఉంగరం బహుమతిగా అందుకోవడం ఒక చక్కని ప్రోత్సాహం, ఉత్సాహం. అలా మొత్తం సర్వీసులో నూటికి నూరు మార్కులు దాదాపు తొంభై మందికి పైగా విద్యార్థులు పొందగలగడం వృత్తిపరంగా సంతృప్తిని కలిగించిన విషయం.
*జిల్లా స్థాయిలో అధికారికంగా నిర్వహించిన భౌతిక శాస్త్ర,గణిత శాస్త్ర సదస్సులకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించడం.
*జిల్లా ఉమ్మడి పరీక్షల సంస్థకు అయిదు సంవత్సరాలపాటు ఎక్కువమంది విద్యార్హులు గణితంలో ఉత్తీరర్ణతాశాతం పొందదానికి అవసరమైన విజయ సూచిక, విజయ సోపానాలు... పుస్తకాలను ప్రభుత్వం తరపున రూపొందించుటలో ''గణిత ప్రవీణుడు''గా వ్యవహరించడం.
*ఆకాశవాణిలో కథానికలు, నాటికల ప్రసారం,అవగాహనా సదస్సులలో పాల్గొనడం, రేడియో నాటక కళాకారునిగా మూడు సంవత్సరాలు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పాల్గొనడం..మొదలైనవి
ప్రవృత్తి పరంగా :
*కథా రచయితగా రచనలు :
1. అందమైన తీగకు...! - 25 కధల మాలిక (2003) 2. చిగురు పిట్టలు* - నానీల సంపుటి (2007) 3. ఉదయబాబు మాస్టారి' కధానికలు - ఉదయకిరణాలు (2015) 4. అమ్మతనం సాక్షిగా... కవితా సంపుటి (2015) 5. నాన్నకో బహుమతి - 16 కథల సమాహారం (2019-.) జీ.వి.ఆర్. కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన కథాసంపుటుల పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన కథల సంపుటి) 6. ఆయన మా నాన్నగారు ( దీర్ఘ కవిత - త్వరలో )
నవలలు : 1 . లేడీ సింగర్ (2 భాగాలు )
2 . మనసు చేసిన న్యాయం(ప్రతిలిపి వారు మార్చి 2202 లో నిర్వహించిన ధారావాహికల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందినది)
ప్రేరణ : నాన్నగారు...ఆయన నాటక రచయిత,దర్శకుడు,ఉత్తమ నటుడు(18 నాటక పరిషత్తులలో)
*సామాజిక సేవ : రక్తదాన కార్యక్రమం లో, లయన్స్ క్లబ్ వారి కార్యక్రమాలలో విరివిగ పాల్గొనడం .
తెలుగు సాహిత్యానికి సేవ : తెలుగు సాహితీ సమాఖ్య లో కార్యకర్తగా, సంయుక్త కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా తెలుగు సాహిత్యానికి విశేష కృషి , జిల్లా స్థాయిలో ర్యాలీల నిర్వహణ ...అష్టావధానం, త్రీభాషా శతావధానం లలో పృచ్చకునిగా 46 సంవత్సరాలపాటు ప్రతీ నెల సాహితీ స్రష్టల ప్రసంగాలు...విద్యార్హులకు వివిధములైన పోటీల నిర్వహణ,
పత్రికా రంగం లో : వ్యంగ్య చిత్రకళ లో పలు కార్టూన్లు వేయడం. :*1999 - జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు - పశ్చిమ గోదావరి జిల్లా*
2000 - యువసాహితీ సహస్రాబ్ది అవార్డు - ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య 2011 - సోమేపల్లి సాహితీ పురస్కారం 2016 - గోదావరి మాత అవార్డు - ఉంగుటూరు ఎం.ఎల్.ఎ, శ్రీ గన్ని వీరంజనేయులుగారి చే- గణపవరం - పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎం.ఎల్.ఎ. శ్రీ వి.వెంకట శివరామరాజు గారి చే ''ఉగాది పురస్కారం*
పాలకొల్లు - కళాలయ సంస్థవారిచే " కధాభారతి" బిరుదు ప్రదానం.
*జన విజ్ఞానవేదిక - భీమవరం వారిచే " ఉగాది పురస్కారం" ....సుమారు నూటికి పైగా సన్మానాలు సత్కారాలు...ఇంకా ఎన్నో..
Youtube :1. తెలుగు కథను ప్రపంచ వ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం "Mastaru Kadhalu 'in' Telugu " ఛానెల్ ద్వారా నా కథలతో పాటు దాదాపు 25 మంది రచయితల కథలు (ఈనాటికి 420 కధల ఆడియో వీడియోలు)చదివి వీడియోలుగా మలుస్తూ ఉచిత సేవగా అందించడం జరుగుతోంది.
2.KUBDevotionalWorld అనే ఛానల్ ద్వారా శ్రీ భగవద్గీత 700 శ్లోకాలను ప్రతీరోజు 5 శ్లోకాలను భావాలతో సహా వీడియోలుగా చదివి అందించడం జరుగుతోంది.
3. UDAYABABUMathsBasics యు ట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు గణితంలో మౌలిక భావనల బోధన
ప్రస్తుత నివాసం : 2010 లో సికింద్రాబాద్ సైనిక్ పురి లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఇప్పటికీ కధా రచయితగా, బాలల కథారచయితగా కొనసాగడం.
చివరగా నా అభిప్రాయం :
ఇప్పటికీ నా కవితా ప్రస్తానం, కధా సాహితీ సేద్యం కొనసాగుతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం లో చెట్టు నాకు ఆదర్శం.
కవిగా రచయితగా తమ సాహితీ ప్రస్తానం కొనసాగిన్చాదలుచుకున్న యువత అంతా పాత సాహిత్యాన్ని బాగా చదవాలి. 'వెయ్యి పేజీలు చదివి ఒక్క పేజీ రాయి' అన్న ఒక మహాకవి వాక్యాలు స్పూర్తిగా తీసుకుని నిన్నటి రచన కన్నా, నేటిది, నేటి రచన కన్నా రేపటిది మరింత మెరుగుపరచుకుని ఈ రంగం లో తమకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరచుకోవాలని, ఆ దిశగా వారి సాహితీ ప్రస్తానం కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ...సాహిత్యాభినందనలు.
కొత్తపల్లి ఉదయబాబు
సికింద్రాబాద్
Comments