కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Oka Kougili' Written By BVD Prasada Rao
రచన : బివిడి ప్రసాదరావు
ఒక కౌగిలింత....
జీవితాంతం గుర్తుంచుకునే మధుర జ్ఞాపకాలు మిగిల్చవచ్చు
లేదా వెంటాడి ఇబ్బంది పెట్టి , చేదు జ్ఞాపకంగా మిగిలి పోవచ్చు .
మరి ఈ కౌగిలింత ఏ దరికి దారి తిసిందో ప్రముఖ రచయిత, బ్లాగర్ B. V. D. ప్రసాద రావు గారి కథలో తెలుసుకోండి. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
సాకేత్ టేబిల్ మీది ఫోన్ రింగవుతోంది.
లేప్టాప్ మోనిటర్ మీది నుంచి చూపు తిప్పి.. అటు చూశాడు. మౌస్ మీది చేతిని తీసి.. ఆ ఫోన్ ని అందుకున్నాడు.
ఫోన్ స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే అవుతోంది. కొత్త నెంబర్.
"హలో" సాకేత్ సందిగ్ధంలో ఉన్నాడు.
"హలో.. సాకేత్ గారా" అటు నుంచి ప్రశ్న. ఎవరో.. మగ గొంతు.
"య. ఎవరు" సాకేత్.. 'ఎవరై ఉంటారో' అనుకున్నాడు.
"నేను.. రవిసూర్యని" అటు మాట సాఫీగా ఉంది.
"య.. మీ పేరు కొత్తగా ఉంది. మీరెవరో నాకు తెలీదు" ఫోన్ ని మరో చెవి వైపుకి
మార్చున్నాడు సాకేత్.
"య.. మనకు పరిచయం లేదు. బట్.. మీ నెంబర్.. కోరి తీసుకున్నాను."
చెప్పడం ఆపాడు రవిసూర్య.
"నా నెంబర్ ఎవరు ఇచ్చారు" సాకేత్ చిత్రమయ్యాడు.
"చంద్రకళ" చెప్పేశాడు రవిసూర్య.
"ఎవరు" ఇబ్బందయ్యాడు సాకేత్.
"మీకు తెలిసిన.. చంద్రకళ." చిన్నగా నవ్వేడు రవిసూర్య.
"అవునా.. ఎందుకు నా నెంబర్ తీసుకున్నారు" ఆశ్చర్యపోతూనే.. ప్రశ్నించాడు సాకేత్.
"మనం మాట్లాడుకుందాం. బట్.. ఫోన్ లో కాదు.. ఫోన్ లో వద్దు కూడా"
రవిసూర్య గొంతు ధ్వని రిక్వెస్టింగ్ గా ఉంది.
"మరి" ఫక్తుగా గజిబిజయ్యాడు సాకేత్.
"మనం కలుద్దాం. ముఖాముఖీగా సంభాషించుకుందాం. ప్లీజ్" రవిసూర్య ఆశ పడుతున్నాడు.
"సరే. తప్పక. ఎక్కడ.. ఎప్పుడు" సాకేత్ కుతూహలం కనపర్చాడు.
"రేపు. సండే. సో.. మీ ఊరు వస్తాను. మీటింగ్ ప్లేస్ చెప్పండి" అడిగాడు రవిసూర్య.
"య. సరే.. మీది ఈ ఊరు కాదా" సాకేత్ ప్రశ్నించాడు.
"కాదు" ముక్తసరిగా జవాబు ఇచ్చాడు రవిసూర్య.
"వచ్చే.. సండే. నా రూంకి రండి" చెప్పాడు సాకేత్.
"థాంక్యూ. లొకేషన్ షేర్ చెయ్యండి"
"ష్యూర్"
"సండే మోర్నింగ్.. బిట్వీన్ నైన్ టు టెన్.. రాగలను. ఓకే నా"
"వెల్కం ప్లీజ్" అనేశాడు సాకేత్.
సండే.. మోర్నింగ్.. పది గంటలు..
సాకేత్ రూం లో..
"కాఫీ" ఆఫర్ చేశాడు సాకేత్.
సున్నితంగా వద్దన్నాడు రవిసూర్య.
"నా చేతి కాఫీ టేస్టీగా ఉంటుంది.. తాగిన వాళ్లంతా చెప్పారు" చక్కగా నవ్వుతున్నాడు సాకేత్.
"అఫ్కోర్స్.. బట్.. మీ వద్దకి వస్తూ.. దార్లో.. హోటల్ లో టిఫిన్, కాఫీ తీసుకున్నాను"
ఇబ్బందయ్యాడు రవిసూర్య.
సాకేత్ మరేమీ అనలేదు.
ఇద్దరూ కుర్చీల్లో.. ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు.
రవిసూర్య కొద్ది నిముషాల ముందే సాకేత్ రూంకి వచ్చాడు.
రవిసూర్య.. సాకేత్ ఫోన్ కాల్ నుంచి సూచిస్తున్న ప్రకారం ఫాలో అవుతూ..
సాఫీగా.. సాకేత్ రూంకి రాగలిగాడు.
"చెప్పండి" సాకేత్ లో కుతూహలం పోలేదు.
"ముందు నా గురించి చెప్పి.. తర్వాత నా రాకకి కారణం చెప్తాను" రవిసూర్య
స్థిరంగా ఉన్నాడు.
సాకేత్ తలాడించాడు. రవిసూర్యనే చూస్తున్నాడు.
"వెల్.. నా పేరు చెప్పాను. నేను మీకు రమారమీ ఫిఫ్టీ కేయమ్స్ డిస్టెన్స్ లో
ఉన్న పేటలో ఉంటున్నా. బ్యాంక్ ఎంప్లాయ్ ని. గత సండే.. ఒక మేరేజీ బ్రోకర్ తో.. పెళ్లి
చూపులకై మీ ఊరు వచ్చాను" చెప్పడం ఆపాడు రవిసూర్య.
సాకేత్ కుర్చీలో చిన్నగా కదిలాడు. కానీ రవిసూర్య చెప్పేది పర్టిక్యులర్ గా వింటున్నాడు.
"మీ ఆఫీస్ కొలీగ్.. చంద్రకళని చూశాను. నచ్చాను. మా పెళ్ళికై.. మా ఇరు వైపు పెద్దలు
మాట్లాడుకుంటున్నారు." మళ్లీ చెప్పడం ఆపాడు రవిసూర్య.
సాకేత్ ఈ మారు మాత్రం కుర్చీలో అనీజీగా కదిలాడు. కానీ రవిసూర్య వైపు నుంచి తన చూపుని
తిప్పలేదు. అలానే ఏమీ అనలేదు.. అడగలేదు కూడా.
"పెళ్లి చూపులు తర్వాత.. తిరిగి వెళ్తూ.. నా ఫోన్ నెంబర్ ఇచ్చేక, చంద్రకళ ఫోన్ నెంబర్ అడిగి
తీసుకున్నాను" రవిసూర్య చెప్పుతున్నాడు.
చిన్నగా తలూపాడు సాకేత్.
"మా ఊరు వెళ్లేక.. నేను ఫోన్ చెయ్యక ముందే.. చంద్రకళే నాకు ఫోన్ చేసింది. మీ ఇద్దరి మధ్య
ప్రేమ గురించి చెప్పింది" ఆగాడు రవిసూర్య.
సాకేత్ హైరానా అవుతున్నాడు.
"వెల్.. మంచిదే. నేను స్పోర్టీవ్ గానే తీసుకున్నాను. బట్.." చెప్పడం ఆపాడు రవిసూర్య.
'తర్వాత ఏమిటి' అన్నట్టు కళ్లు సాగ తీశాడు సాకేత్.
"చంద్రకళ.. తన నిస్సహాయత స్థితిని వివరించింది. ప్చ్. బట్.. ఆమెకి వత్తాసు పలకలేను.. ఆమె
పెద్దల్ని నిలతీయలేను. కారణం.. నిజమే కదా. మనం సమాజంలో ఉన్నాం. సంఘంతో
మిళితమయ్యితేనే.. సాఫీ మనుగడ దొరుకుతోంది. అలాగే.. మీ వైపు .." రవిసూర్య కుర్చీలో
సర్దుకుంటున్నాడు.
సాకేత్ శ్వాస స్థిమితంగా కదలాడడం లేదు.
"మీదీ.. గొప్ప మెచ్చూర్టీయే. మిమ్మల్ని కంగ్రాట్స్ చేయాలి. మనసారా చెప్పుతున్నాను కూడా.
య. పరిస్థితిని.. ముఖ్యంగా చంద్రకళ రిక్వెస్ట్ ని మీరు మంచిగా అర్థం చేసుకున్నారు. తన పెళ్లికి
అడ్డు తప్పుకున్నారు. గ్రేట్. థటీస్ లవ్." చెప్పుకుపోతున్నాడు రవిసూర్య.
సాకేత్ మొద్దు మాదిరి ఉండి పోయాడు.
"మీ చర్య మెప్పు పొందాలనే.. చంద్రకళ.. మీ విషయాలు నాతో కోరి కదిపిందట. ట్రూ లవ్ అంటే
మీదీ అని.. నొక్కి వక్కాణించింది. తను.. తన పెద్దల్ని ఎదిరించి మిమ్మల్ని దక్కించుకోలేని..
ఒక దురదృష్టవంతురాలు.. అని బాధ పడింది.. మీపై ఆమెకి మంచి అభిప్రాయం ఉంది.. పైగా
మీరంటే.. గొప్ప నమ్మకం.. అలాగే.. తనకి మీరు చవి చూపిన ప్రేమను.. తను.. నా నుండి గట్టిగా
ఆశిస్తుంది.." చెప్పుతున్నాడు రవిసూర్య.
అడ్డయ్యాడు సాకేత్.. "ఇవన్నీ మీరు నాకెందుకు చెప్పుతున్నారు. ఇందు కోసమేనా.. మీరు నన్ను
కోరి కలిసింది"
తను చెప్పే ధోరణి నుంచి బయట పడి.. "చంద్రకళ.. మీ గురించి చెప్పింతర్వాత.. నేను..
నిజంగా గిల్టీ అయ్యాను. దానిని పల్చపర్చుకోవాలనే మిమ్మల్ని స్వయంగా కలవ తలిచాను. మీ
ద్వారా ఐతేనే.. చంద్రకళకి సరిగ్గా నా విన్నపం అందుతోందని భావించాను."
చెప్పాడు రవిసూర్య.
"విన్నపమా" విస్మయమయ్యాడు సాకేత్.
"అవును. మీ మాదిరిగానే.. నేను.. చంద్రకళని ఇంప్రెష్ చేయలేక పోయినా.. చాలా మేరకు.. నా
ప్రేమని చంద్రకళకి అందిస్తాను.. మీ అంతగా కాకపోయినా.." రవిసూర్య మాటలకి అడ్డు పడ్డాడు
సాకేత్ -
"నో నో.. అలా ఆలోచన చేయవద్దు. అలా ఊగిసలాడకండి. నిజానికి నిజం.. నేను కూడా పెద్దల
మాటని.. మీరలేకనే.. చంద్రకళకి అడ్డు తప్పుకున్నాను.. జార విడుచుకున్నాను." సాకేత్
చెప్పడం ఆపాడు.
రవిసూర్య ఏమీ అనలేదు. అస్థిరంగా కుర్చీలో కదులుతున్నాడు.
"వెల్.. నిజమే.. మేము ప్రేమించుకున్నాం.. చంద్రకళ.. ఏ సమయాన కూడా
రవ్వంత హద్దులు మీరే అవకాశం.. నాకు ఇవ్వలేదు. తను జమ్.." ఎందుకో చెప్పాడు సాకేత్
సడన్ గా.
చిన్నగా నవ్వాడు రవిసూర్య. "నమ్ముతాను. చంద్రకళ కూడా ఇంచుమించుగా మీలాగే
తెలియపరిచింది. ఎందుకో"
తికమక కాలేదు సాకేత్.
"చంద్రకళ.. గొప్ప వ్యక్తిత్వం కలది. ఆమె తీరే నన్ను బోధ పర్చింది. నో డౌట్.. షి ఈజ్ పెర్ఫెక్ట్
యూమన్ బీయింగ్. అలాగే మీ ఇద్దరి మధ్య లవ్ కూడా.. మానసికమైనది.. పవిత్రమైనది.
నమ్ముతాను" ఆనందమవుతున్నాడు రవిసూర్య.
కుదరయ్యాడు సాకేత్.
"మీ ఇద్దరి ప్రేమ పట్ల నాకు ఏ సందేహాలు లేవని.. నేను చక్కగా చంద్రకళని చూసుకోగలనని..
దయచేసి ఆమెకి తెలియ పర్చండి. నేను ఆమెకి చెప్పి చూశాను.. బట్ ఆమె ఎందుకో నమ్మేటట్టు
లేదు.. కుదురయ్యేలా లేదు. డోన్ట్ థింక్ అదర్వైజ్. మీరు అంటే ఆమెకి చక్కని గురి.. అని
అనిపించింది. సో.. ప్లీజ్.. సహకరించండి. నా విన్నతి.. మీ ద్వారా ఆమెకి అందగలిగితే
బాగుంటుందని భావిస్తున్నాను" చెప్పడం ఆపాడు రవిసూర్య.
సాకేత్ ఏమీ అనలేదు. రవిసూర్యనే చూస్తూ ఉండిపోయాడు.
"మరి నేను బయలుదేరుతాను" చెప్పాడు రవిసూర్య. లేచి నిల్చున్నాడు. తన
కుడి చేతిని చాపాడు.
సాకేత్ లేచాడు. రవిసూర్యకి షేక్హేండ్ ఇచ్చాడు.
"బై. మా ఊరికి బస్సు దొరికే టైం దాటలేదు." రవిసూర్య తన రిస్ట్ వాచీ పై నుంచి చూపు తిప్పాడు.
చిరునవ్వుతో సాకేత్ ని చూశాడు.
"ఎలాగూ వచ్చారు. చంద్రకళని కలిసి వెళ్లండి" చెప్పగలిగాడు సాకేత్.
"ఉహుఁ. లేదు.. నేను ఇలా వచ్చేది కూడా తనకి నేను చెప్పలేదు. ఇంటికి వెళ్లాక ఫోన్ చేస్తాను.
ఈ లోగా మీరు.. ఆమెతో నాకై మాట్లాడండి. నా విన్నపాన్ని మన్నించండి. ఆమెని కన్వెన్స్
చేయండి" చక్కగా నవ్వేడు రవిసూర్య.
రవిసూర్యని సాగనంపి.. రూం తలుపు మూశాడు సాకేత్. కుర్చీలో కూర్చున్నాడు. చంద్రకళకి ఫోన్
చేశాడు. రవిసూర్య ముచ్చట్లు మెల్లిగా ముచ్చటించాడు.
కాలం తన నడకన తాను నడుస్తుంది. నెల నిండింది.
చంద్రకళ.. రవిసూర్యల మేరేజీ వేడుక సరళంగా ముగిసింది.
వాళ్ల ఫస్ట్ నైట్..
తమకంతో.. చంద్రకళని కౌగిలించుకోబోయాడు రవిసూర్య.
చంద్రకళ గుప్పున షాక్ తగిలిన దానిలా వెనక్కి జరిగింది. ఆమె గుండె దడ దడ లాడుతోంది.
రవిసూర్య గాభరా అయ్యాడు. చంద్రకళ తేరుకొనే వరకు ఆగాడు.
తర్వాత.. "ప్లీజ్. నా దగ్గరికి రావద్దు. నాకు ఆందోళనగా ఉంది" చంద్రకళ చెప్పగలిగింది.
రవిసూర్య ఆరాలు మానేశాడు. పొందికగా నిద్రపోయాడు.
ఆ పిమ్మట.. వరస రెండు రాత్రులూ ఇంచుమించుగా ఇదే తంతు..
తర్వాత రాత్రి మాత్రం రవిసూర్య అడిగేశాడు.. "ఏమైంది చంద్రకళ.. ఎందుకు నన్ను దూరం
పెడుతున్నావు"
"మీ స్పర్శ.. నాకు ఊపిరి ఆడనీయడం లేదు" చెప్పేసింది చంద్రకళ.
రవిసూర్య నిరుత్సాహపడ్డాడు. కానీ అడగలేకపోయాడు.. నిలతీయలేకపోయాడు.
"కూల్.. కూల్.. నువ్వు రిలేక్స్ అయ్యేకే.. మిగతావన్నీ. సరేనా" సాఫీగా చెప్పాడు రవిసూర్య.
రవిసూర్య.. తనని తాకినప్పుడు.. తనని తాకిన ఒన్ అండ్ ఓన్లీ సాకేత్ స్పర్శ చటుక్కున గుర్తుకి
రావడం.. చంద్రకళ ఫేస్ చేస్తోంది. దానిని తను విస్మరించలేక పోతోంది.. విదిలించుకోలేక
పోతోంది.
పైగా.. ఆ రోజు ఘటన వైపు మొగ్గుతోంది.. తనని రవిసూర్య తాకిన ప్రతి మారు.
ఆ రోజు ..
"సరే.. మనం.. మన పెద్దల్ని ఎదిరించవద్దు. సో.. నీ మాట ప్రకారమే కానీ.. నీ పెద్దలు చూసే
సంబంధంకి ఫో. పెళ్లి చేసుకో." నిదానంగా, సరళంగా మాట్లాడేడు సాకేత్.
చంద్రకళ కామయ్యి ఉంది.
"బట్.. చంద్రకళ.. నాది ఒకే ఒక కోరిక.. ప్లీజ్.. తీర్చవా" బతిమలాడుతున్నాడు సాకేత్.
"ఏమిటి" చంద్రకళ ప్లీజవ్వుతోంది.
"కౌగిలి.. ఒక కౌగిలి.." సాకేత్ దీనావస్థ స్పష్టంగా తెలుస్తోంది.
చంద్రకళ మెత్తపడిపోయింది. అప్పటి వరకు.. ఏ నాడు.. తనని తాకడానికి పిసరంత కూడా వీలు
ఇవ్వని తను.. సాకేత్ కోరికని మన్నించింది.
సాకేత్.. చంద్రకళని అతి బింకంగా కౌగిలించుకున్నాడు.
చంద్రకళ.. ఆ కౌగిలిని తనివితీరా ఆస్వాదించింది.
ఆ కౌగిలి కారణంగానే.. తను రవిసూర్యకి చేరువ కాలేకపోతోంది..
సతమతమైపోతోంది..
ఆ మూడ్ లోనే.. తన స్థితిని.. వాట్సప్ మేసేజ్ గా సాకేత్ కి, రవిసూర్య ఫోన్లకి వ్యక్తపరిచేసింది
చంద్రకళ.
ఆ మేసేజ్.. 'నేను.. మీ ఇద్దరి నడుమ వేగలేకపోతున్నాను.. మెసులుకోలేక పోతున్నాను.. మీ
ఇద్దరి ప్రేమని భరించలేకపోతున్నాను.. నా పై మీరు చూపుతున్న కన్సర్న్ కి.. నేను స్తిమితం
కాలేకపోతున్నాను.. మీ ఇద్దరిలో.. ఏ ఒక్కర్నీ మోసం చేయలేను.. బాధ పెట్టలేను.. నేను
భరించలేను.. అందుకే.. మరణిస్తున్నాను'
చంద్రకళ నుండి .. కొద్దిసేపు తేడా సమయాల్లో.. తమ తమ ఫోన్ లకి అందిన..
ఆ వాట్సప్ మేసేజ్ ని చదివిన.. రవిసూర్య, సాకేత్ లు హడలిపోయారు. ఆమెకై దౌడు తీశారు.
కానీ అప్పటికే చంద్రకళ.. ఉరి వేసుకుని.. చనిపోయింది.
ఆమె చావుకి యదార్థ కారణం.. ఆ 'ఒక కౌగిలి'.
***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
コメント