top of page

ఒక మధ్యతరగతి తండ్రి కథ

#YasodaPulugurtha, #యశోదపులుగుర్త, #ఒకమధ్యతరగతితండ్రికథ, #OkaMadhyaTaragathiThandriKatha, ##TeluguHeartTouchingStories


Oka Madhya Taragathi Thandri Katha - New Telugu Story Written By Yasoda Pulugurtha 

Published In manatelugukathalu.com On 12/04/2025

ఒక మధ్యతరగతి తండ్రి కథ - తెలుగు కథ

రచన: యశోద పులుగుర్త 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



"ఏమండీ, ఉగాది పండుక్కి అల్లుడ్ని, అమ్మాయిని రమ్మనమని ఉత్తరం వ్రాసి పడేయండి". 


"అదేమిటే రాజ్యం, మొన్న సంక్రాంతి పండుక్కే కదా వచ్చి వెళ్లారు. మళ్లీ ఉగాది పండుక్కి ఎందుకే?”


"మీరు మరీ చోద్యంగా మాట్లాడతారేమండీ?” తల్లీ తండ్రీ బ్రతికుండగానే కదా కన్నకూతురికి ఏ ముచ్చటైనా తీరేది. ఆ తరువాత మనకు ఉన్న ఒకే ఒక పుత్ర రత్నం మన అమ్మాయి అచ్చటా ముచ్చటా తీరుస్తాడని నమ్మకం ఏమిటండీ?”


“ఓసి పిచ్చి ముఖమా, పెళ్లై అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్లకు పుట్టింటికి పిలిచి పసుపుకుంకుమలు ఇవ్వడం మంచిదే. కానీ, పెట్టు పోతలూ, అల్లుడికి బహుమానాలూ ఎల్లకాలం ఇవ్వాలన్న రూల్ ఏమీ లేదు. నా సిధ్దాంతం ఏమిటంటే లేనిపోని భేషజాలకు పోతూ అప్పులు చేసి ఈ పెట్టుపోతలు పెట్టుకుంటు పోతూ మనం అప్పులు పాలు అవకూడదని. మొన్న సంక్రాంతి పండుగకి ఫెస్టివల్ అడ్వాన్స్ వచ్చింది కాబట్టి ఆ మొత్తం డబ్బంతా కూతురికీ అల్లుడికీ, వాళ్ల పిల్లలకూ బట్టలు కొని పెట్టాం. ఇప్పుడు ఏ అడ్వాన్స్ రాదు. అప్పుచేయాలి. అందుకే చెపుతున్నాను. ఉగాది పండుక్కి పిలవద్దని.


"అక్కడే ఏదో వ్రాసుకుంటున్న వాసు తలెత్తి "అమ్మా నేను డిగ్రీ పూర్తి చేసినా ఇంతవరకూ ఉద్యోగం లేదు. అక్కకు పెళ్లై ఆరు సంవత్సరాలైనా ఇంకా ఈ మర్యాదలు ఏమిటమ్మా, లేనిపోని భేషజాలు మానుకుంటే మంచిదంటూ" కొడుకు మాట్లాడిన మాటలకు ఆవిడకు పుసుక్కున కోపం వచ్చేసింది. 


"ఏమండీ వాడి మాటలు వినకండి. వాడు అప్పుడే ఎలా మాట్లాడుతున్నాడో చూడండి వెధవ. ఏదో అప్పో సప్పో చేయక తప్పదు. వెంటనే అల్లుడికి ఉత్తరం వ్రాసిపడేయండంటూ హుకుం జారీ చేసింది.


ఇంక చేసేదేమీ లేక, సరేనంటూ సమాధానమిచ్చి కొన్ని నిమిషాల అనంతరం భార్యకు వినిపించేలా "ఒరే వాసూ నీవు లైబ్రరీ కి వెళ్లేటప్పుడు ఈ ఉత్తరాన్ని మరచిపోకుండా పోస్ట్ డబ్బాలో పడేయి. ఈరోజు పోస్ట్ లో వెళ్లిపోవాలి సుమా" అంటూ హెచ్చరించాడు.


ఉగాది పండుగ రెండురోజుల్లో కి వచ్చేసింది. రాజ్యం వాసుని పిలిచి పెద్ద లిస్ట్ వ్రాసి ఇచ్చింది. కిరాణా కొట్లో సామాను తెమ్మనమని.


"అమ్మా ఇన్ని సరుకులా! కిరాణా షాప్ వాడు ఇవ్వడు. అతనికి మనం క్రితం నెల బాకీ తీర్చలేదుకదా. అయినా ఇప్పుడివన్నీ ఎందుకమ్మా, అక్కా వాళ్లూ రారు కదా, నేను ఉత్తరం పోస్ట్ చేయనే లేదంటూ చటుక్కున నాలుక కొరుక్కున్నాడు".


"ఉత్తరం ఎందుకు పోస్ట్ చేయలేదు? "ఏమండీ, మిమ్మల్నే, వాసు చూడండి, అల్లుడికి ఉత్తరం పోస్టే చేయలేదంటున్నాడంటూ" కొడుకు మీద ఫిర్యాదు చేసింది.


"వాడు ఏదో వేళాకోళానికి, నీ వేమంటావోనని అంటున్నాడు లేవే, ఉత్తరం నేనే దగ్గరుండి పోస్ట్ చేయించాను. సరుకులు నేను తెస్తానులే కంగారుపడకంటూ" భార్యను సముదాయించాడు.


తెల్లవారితే ఉగాది. హమ్మయ్య, ఈ పండుక్కి అమ్మాయి అల్లుడూ రారు. అప్పు చేయాల్సిన పరిస్తితి నుండి తప్పించుకున్నట్లే. ఉగాది పండుక్కిరమ్మనమని తను అల్లుడికి ఉత్తరం వ్రాయాలేదు, కొడుక్కిచ్చి పోస్ట్ చేయమనాలేదు. అది తనకీ కొడుక్కీ మధ్యనున్న రహస్యం. కానీ తన భార్య కి ఒకటే ఆత్రుతగా ఉంది. “ఏమండీ అల్లుడూ పిల్లలూ వస్తారంటారా?” అంటూ లోపలకూ బయటకూ తిరుగుతూనే ఉంది. 


“ఇంతవరకూ రాలేదు కనుక బహుశా ఇంక రారేమో. అయినా వస్తున్నట్లు ఫోనో, కబురో చేయద్దా?” మనం ఇంతలా ఎదురుచూస్తున్నామని తెలియక పోతే ఎలా?” వాళ్లను తీసుకెళ్లి బట్టలు అవీ కొనాలని నేను చూస్తుంటే, అని భర్త క్రీగంటనే ఆమెను చూస్తూ అనేసరికి అంత టెన్షన్ లోనూ ఆవిడ మనస్సు భర్త పట్ల గౌరవంతో నిండిపోయింది. తన ముచ్చటను ముందు కాదన్నా తను బాధ పడతానని తన భర్త తనను సంతోషపెట్టాలనే చూస్తాడని మురిసిపోయింది.


ఆ సాయంత్రం షాప్ కి వెళ్లి రేపు ఉదయానికి కావలసిన వస్తువులూ, కూరగాయలు కొనుక్కొచ్చేసరికి ఇంట్లో నుండి గల గల మంటూ మాటల వినిపిస్తున్నాయి. తన కూతురి మాటలు. లోపలి గదిలోకి తొంగి చూస్తే అల్లుడూ మనవలూ కనిపించారు. రాజ్యం ముఖంలో అప్పుడే ఉగాది వచ్చేసిందన్న ఆనందం తో వెలిగిపోతోంది. వాళ్లున్న గదిలోకి అడుగుపెట్టగానే కొడుకు తనవేపు విస్తుపోతూ చూస్తున్నాడు.


ఈలోగా కూతురు తండ్రి వైపు కనుసైగ చేస్తూ, "నాన్నా మీరు పండక్కి రమ్మనమంటూ వ్రాసిన ఉత్తరాన్నిమీ అల్లుడు గారికి చూపిద్దామని టీపాయ్ మీద పెట్టానా, బుజ్జిగాడు దాన్ని ముక్కలు ముక్కలుగా చింపేసాడు. మామయ్యగారు ఉత్తరం ఏదీ చూపించంటూ ఈయన అడిగే సరికి దేన్ని చూపించేది?” అయినా నాదే పొరపాటు. బుజ్జిగాడికి ఏ కాగితం కనిపించినా చింపి ముక్కలు చేస్తాడని తెలిసీ కూడా నేను వాడికి ఆ ఉత్తరాన్ని అందేలా పెట్టడం.


క్షణం సేపు నోటివెంట ఏమాటా రాని ఆయన వెంటనే తేరుకుంటూ "ఉత్తరం వ్రాయకుండా ఏలా ఉంటానోయ్ ఉదయ్ అంటూ" అల్లుడిని చిరునవ్వుతో పలుకరించాడు. “నాన్నా, మేము రాకపోతే బాధ పడతారని మీ అల్లుడు వందే భారత్ ట్రైన్కి బుక్ చేసారని అనేసరికి అల్లుడు కూడా అవును మామయ్యగారూ, మిమ్మలని సర్ప్రైజ్ చేయాలని మీకు తెలియచేయలేదంటూ వంత పలికాడు. అక్కడ వాతావరణం కొద్దిగా సద్దుమణిగాకా ఆయన తన గదిలోకి వచ్చాడు. తన స్నేహితుడు గోవిందరావుకి ఫోన్చేసి ఒక పదివేలు సర్దమని అడుగుదామని.


ఈ లోపల కూతురు తండ్రి గదిలోకి కొన్ని పేకట్స్ పట్టుకుని వచ్చింది. గోవిందరావుకి ఫోన్ చేయబోతున్న ఆయన కూతురు గదిలోకి రావడం గమనించలేదు. “నాన్నా అన్న పిలుపుకి చివ్వున తలెత్తి చూసాడు.”


“నాన్నా, నన్ను క్షమించండి, మిమ్మల్ని అవమాన పరచాలని అబధ్దం ఆడలేదు. మీ గౌరవాన్ని కాపాడాలని ఒక కూతురిగా అబధ్దం చెప్పవలసి వచ్చింది. పెళ్లై ఆరు సంవత్సరాలైనా మా అత్తింటివారి ప్రవర్తన చాలా చికాకు కలిగిస్తుంది. ప్రతీ పండక్కీ పుట్టింటి వారు పిలిచి అల్లుడికి సత్కారాలు చేయాలన్న వారి అభిప్రాయం నాకు నచ్చదు. కనీసం ఈయన కూడా అర్థం చేసుకోవచ్చు కదా. మీ నాన్నగారు లెటర్ వ్రాసారా పండక్కి రమ్మనమని అంటూ పదే పదే అడుగుతుంటే ఇలా చేయాల్సి వచ్చింది. ఇందులో మీరు గిల్టీ ఫీల్ అవడానికి ఏమీ లేదు నాన్నా. మీ అల్లుడిలో మార్పు తేవడానికి ప్రయత్నిస్తాను. ఇవిగో ఈ బట్టలు రేపు మీరు మాకు పెట్టండి. అలాగే మీకూ, అమ్మకు, తమ్ముడికి కూడా తెచ్చాను. నాకు ఆఫీస్ లో ఇన్సెన్టివ్ ఇచ్చారు. నేను చెప్పలేదు ఆయనకీ సంగతి. అనవసరంగా మా గురించి ఆర్భాటాలు చేసి అప్పులు చేయకండంటూ, ఆ పేకట్లని అక్కడున్న మంచం మీద పెట్టి వెను తిరిగింది. కూతురి మంచి మనస్సుకి ఆయన మనస్సు చలించింది.


***

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :  

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.








Comentarios


bottom of page