top of page
Writer's picturePandranki Subramani

ఒక రాత్రి పూట ట్యాంక్ బండ్ ప్రక్కన---


'Oka Rathri Puta Tank Bund Prakkana' written by Pandranki Subramani

రచన : పాండ్రంకి సుబ్రమణి

హెడ్ కానిస్టేబుల్ బుచ్చిబాబు బైక్ ని ఆపి న్యూట్రల్ లో ఉంచాడు గాని, అక్కణ్ణించి కదల్లేదు. ముందుకు వెళ్ళలేదు. సగం మనసుతో పైకి చూసి ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఆకాశం, విషాదగ్రస్త విధివంచితుడి వదనంలా కనిపించింది. ఇప్పుడు పనిగట్టుకుని వెళ్ళి వరదరాజులు మనసును మరోసారి దు:ఖపు తెరలతో కదలించి కలతలు రేపాలా! ఒకసారి లేదా రెండోసారి వెళితే సరే-- భార్య పోయిన మిత్రుడికి స్వాంతన చేకూర్చవచ్చు. పదే పదే వెళ్ళి కనిపిస్తే గతం గుర్తుకు వచ్చి గాయాన్ని కెలికినట్లుండదూ! బ్రతుకు పునాదుల్ని కదల్చేలా దెబ్బపైన దెబ్బ తగిలితే యే మానవుడు మాత్రం తట్టుకోగలడు? ప్రసవ వేదనతో ఉన్న భార్య పసికందును చేతికిచ్చి అదేదో దూర ప్రాంత తీర్థయాత్రలకు వెళ్ళబోతున్నట్టు- “ఇదిగో యిలా వెళ్ళి అలా రానూ !” అని వీడ్కోలు పుచ్చుకున్నట్లు శాశ్వతంగా కనుమరుగయింది. ఇప్పుడా పసికందుని లాలి పాటలు పాడుతూ, ఊయలలో జోలపాట వినిపిస్తూ దీర్ఘమైన ఆర్జిత సెలవు తీసుకుని యింట్లో ఉంటున్నాడు వరదరాజులు. దారి తప్పిపోయిన పథికుడులా-- ఈ కరోనా కాలంలో ఎన్నాళ్ళిలా ఉద్యోగానికి ఎగనామం పెట్టి ఉండగలడు? అసలు యెన్నాళ్ళు పై అధికారులు మాత్రం అలా ఉండనిస్తారు? నిదానంగా ఆలోచించి చూస్తే- మానవ బంధాలన్నీ వ్యాపార సంబంధాలనడం సబబో కాదో చెప్పడం కష్టం గాని, కచ్చితంగా చల్లగా చూపుకందని రీతిన, కరిగిపోయే మంచు ముద్దలేగా అవన్నీ! కష్ట కాలం కాకపోతే, యిటువంటి సమయంలోనా బుచ్చి బాబు భార్య ఉష వంటగదిలో కాలు జారి పడాలి! పడిందే అనుకో- కదల్లేని స్థితిలో ఉండలు చుట్టుకుపోయేలా పడుండాలి? ఇప్పుడు ఉషగాని మామూలు స్థితిలో ఉంటే దిగంతాలకు చేరుకున్న భాగ్యం చంటి బిడ్డ ఆలనా పాలనా తనే చూసుకుంటూ ఉండేది. కనీసం వరదరాజులు అత్తా మామలు పరిస్థితులు మెరుగైన తర్వాత ఊరి నుంచి వచ్చేంత వరకైనా! కానీ యిప్పుడే మైంది— స్టేట్ వైడ్ లాక్ డౌన్ ప్రకటించడాన, ఇద్దరూ సీనియర్ సిటీజన్స్ కావడాన యెక్కడకీ కదల్లేని పరిస్థితి యెదురైంది. ఇద్దరికీ ట్రైను టిక్కెట్టు లేదు- బస్సు టిక్కెట్టూ లేదు. సర్వమూ అంధకార బంధురం! ఎక్కడ వేసిన గొంగొళి అక్కడే పడున్నట్టు.

ఎట్టకేలకు బారులు తీరిన ఆలోచనలు మూటగట్టి బుచ్చిబాబు బైక్ ని స్టాండ్ పై ఉంచి, లోపలకు వచ్చి మిత్రుణ్ణి పలక రించాడు- “బిడ్డ పాలు తాగాడా!”

“క్షణం పాటు కళ్ళు మిటకరించి చూసి బదులిచ్చాడు వరదరాజులు- “సగం తాగినట్టు సగం తాగనట్టు మింగాడు. ఒకటి రెండు సార్లు వాంతి కూడా చేసుకున్నాడు. హ్యూమన్ మిల్క్ బ్యాంకుకి మెసేజ్ యిచ్చాను. ఫోను కూడా చేసాను. రెస్పాన్స్ యింకా రాలేదు. అక్కడి ఏరియాను కోవిడ్ రెడ్ జోన్ గా ప్రకటించినట్లు ఎవరో వచ్చి చెప్పారు. ఇప్పటికి పరిస్థితి పూర్తి సెక్షన్144 వంటిదే! ఔనుగాని,నిన్నెందుకు రాలేదు? ఇటువంటి స్థితిలో నీ రాక ఆశ్వాసనగా ఉంటుంది కదా!”

“సారీరా! రావాలనే ప్రయత్నించాను. అనుకోని పరిస్థితి యెదురవడం వల్ల కోవిడ్ ఆస్పత్రి ప్రాంగణంలో ఉండిపోవలసొచ్చింది”.

ప్రశ్నార్థకంగా చూసాడు వరదరాజు.

“ఎవరో శవాన్ని అక్కడికక్కడ విడిచి పెట్టి వెళ్ళిపోయారు. శవానికి దగ్గరకూ రాలేక దూరంగా తొలగిపోనూ లేక ఇద్దరు స్త్రీలు, ఒక చంటబ్బాయి, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అది చూడలేక నేనే పీపీఈ కిట్సు తగిలించుకుని ముఖ కవచాన్ని బాగా బిగించుకుని గ్లవ్సుతో శవాన్ని ట్రాలీలో వేసుకుని ప్రక్కనే ఉన్న శ్మశానవాటిక ముందుంచి వచ్చాను”.

వరదరాజులు కళ్ళు పెద్దవి చేసుకుని చూసాడు. “కానీ, పోలీసు హెడ్డుగా అది నీ డ్యూటీ కాదు కదరా! దానికి కోవిడ్ మెడికల్ సిబ్బంది విడిగా ఉంటారుగా-- ఏమో! అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నావేమో! వెనుక పెళ్ళాం బిడ్డులున్నారన్న సంగతి మరచి-”

వరదరాజులు బదులిచ్చాడు- “ఔను. నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. కాని మనిషి మనసు అప్పుడప్పుడు డ్యూటీ పరిధి గురించి, డ్యూటీ అవర్స్ గురించి ఆలోచించదు. అది సరే గాని మీ మామయ్య పిల్లనిస్తానంటున్నాడు కదా! విషయాన్ని సెటిల్ చేసావా? పనిగత్తె సహాయంతో నువ్వెన్నాళ్ళు బిడ్డను సాకగలవు? అనుబంధాలున్నచోటే కదా బిడ్డకు భరోసా ఉంటుంది?”

వరదరాజు బదులివ్వకుండా బిడ్డ పైన దుప్పటి కప్పి లోపలకు వెళ్ళి, ఫ్లాస్కునుండి టీపోసుకొచ్చి యిచ్చా డు.

“ఇప్పుడిదా ముఖ్యం! నేనడిగిందానికి బదులివ్వరా” అంటూ టీ కప్పు చేతిలోకి తీసుకున్నాడు బుచ్చిబాబు.

“చెప్తాను. చెప్పక పోతే విడిచి పెడ్తావా! నాకిప్పటికిప్పుడు ఆడదాని తోడు అవసరం లేదు. నాకు నేను అంతా చూసుకోగలను. కొన్నాళ్ళకు అత్తగారు యెలాగూ వస్తున్నారుగా-- చంటిగాడు గట్టెక్కేయగలడు”

“ఓరి శుంఠ వెధవా! నీకు పెళ్ళాం అవసరం ఉండకపోవచ్చు. కాని బిడ్డడి ఆలనా పాలనా చూసుకోవడానికి తల్లి అవసరం ఉంటుంది కదా! దాని గురించి ఆలోచించవేం?”

వరదరాజు బుర్రూపుతూ అన్నాడు- “మానసికంగా నేనిప్పుడు దానికి సిద్ధంగా లేను. అలా సిద్ధమైనప్పుడు తప్పకుండా నీకు చెప్తాను. నీకు చెప్పి చేస్తాను. భాగ్యం బిడ్డకు కష్టం లేకుండా చూసుకుంటాను. నీకు డ్యూటీకి టైమవుతున్నట్లుంది. సమయానికి నువ్వు స్పాట్ లో లేకపోతే మీ ఎస్సయ్ చీవాట్లు పెడ్తాడు”

బుచ్చిబాబు తలూపుతూ లేచి చంటి కుర్రాడి నెత్తిపైన చేతి నుంచి నిమిరి బయటకు నడచి స్కూటర్ కి కిక్కిచ్చాడు. బిడ్డడి తల్లి భాగ్యం గాని పురిట్లో ప్రాణాలు వదలకుండా ఉంటే యిల్లూ వాకిలీ యెంత బాగుణ్ణు! పగలే వెన్నెలలా, వసంతరాయుడి కళామండపంలా కళకళ్ళాడి పోదూ! ఇంటికి యిల్లాలే దీపమని, ఒకరి వెలితికి మరొకరు పూరణగా నిలవాలని శాస్త్రాలు చెప్పడం లేదూ!

బుచ్చిబాబు ట్యాంక్ బండ్ చేరుకుని ఠాణాలో రిపోర్టు చేసి, దాని ప్రక్కనే స్కూటర్ పార్క్ చేసి సాగర్ ప్రక్కన నడవసాగాడు. అప్పటికి ఆకాశం జుత్తు విరబోసుకుంటున్నట్టు నేల నలువైపులా చీకటి తెరలు క్రమ్ముకో సాగాయి. నీళ్ళపైన కెరటాల శిఖరాల్లా దీపాల కాంతులు మెరవసాగాయి. చుక్కల్లేని చైత్ర మాసపు చంద్రుడు యెందుకో తనలో తను నవ్వుతున్నట్టున్నాడు. లోలోన రోహిణీ దేవి రాకని తలచుకునా! అతడలా పరధ్యానంగా నడుస్తూ అలా తలెత్తి చూసాడు. దిగ్గున ఆగిపోయాడు. ఎవరో నల్ల ముసుగులో ఉన్న స్త్రీ ప్రహరీ గోడ యెక్కుతూంది. ఎందుకెక్కుతూంది?ఇంకెందుకెక్కుతుంది? తనకు తానుగా కథ ముగించుకోవడానికి.. ఇక అతడు జాప్యం చేయలేదు. పరుగున వెళ్ళి రొప్పుతూ ఆమె చేయి పట్టుకుని లాగాడు. ఆమె యే మాత్రం తగ్గలేదు. అతణ్ణి విసిరి కొట్టి అటు వేపు జంప్ చేయడానికి పూర్తిగా యెక్కేసింది. ఈసారి బుచ్చిబాబూ సందేహించ కుండా ఆమె చేతిని గట్టిగా లాగి ఆమె చెంప పైన ఛెళ్ళుమనిపించాడు.

“అమ్మీ!” అంటూ కూర్చుండిపోయిందా ఆడ రూపం. “ఏమిటా దూకుడు! పోలీసునే విసిరి కొడ్తావా? చెప్పు, చచ్చిపోవడానికేనా ఈ జంపింగ్!”

బదులివ్వకుండా యేడ్వసాగిందామె. “హుఁ-బదులియ్యి. లేదా ఆడదానివని చూడకుండా లాకప్ లో పడేస్తాను. చితగ్గొడ్తాను. హుఁ! జల్దీ బోలో..”

ఇప్పుడామె తలెత్తి అతడి కళ్ళలోకి సూటిగా చూసింది. “నేనేమి చేయబోతున్నానో మీకు తెలియడంలే?”

కళ్ళు మిటకరించాడు. “అంటే.. సూయిసైడ్ చేసుకో బోతున్నావు. హైలీ పనిషబుల్ క్రైమ్” .

ఈసారి సూటిగా చూసింది- “నా లైఫ్ కి క్రైమ్ గురించీ, శిక్ష గురించీ ఆలోచించేపాటి సమయం లేదు. నాకంతా ఐపోయింది. మిగిలిందేమీ లేదు. నన్ను చావనివ్వండి. లేదా కేసు పెట్టి లాకప్ లో పెట్టండి. ప్రశ్నల పైన ప్రశ్నలు వేసి ప్రాణాలు తోడేయకండి”

అతడు ఆమెను లేవనెత్తి చెట్టు చప్టా పైన కూర్చో బెట్టాడు. “హైందవ ధర్మం ప్రకారం ఆత్మహత్య మహా పాపం తెలుసా! పుట్ట గతులుండవు”

“అన్ని ధర్మాలూ అలాగే చెప్తాయి. కష్టాలు తీర్చలేవు, కన్నీళ్ళు తుడవ లేవుగా!”

“తప్పు. చాలా తప్పు! బలవన్మరణాలు యెప్పుడూ సమస్యల్ని పరిష్కరించలేవు సరికదా- యెక్కువ చేస్తాయి. చుట్టు ప్రక్కలున్న వారందరికీ పుట్టెడు దు:ఖంతో బాటు సమస్యలు తెచ్చిపెడ్తాయి. నీ తెలుగు ఉఛ్ఛారణ చూస్తే నువ్వు ఈ ప్రాంతానికి చెందిన ముస్లిం స్త్రీలా లేవు. ఔనా!”

ఆమె తలూపింది. “మేం కాకినాడ తెలుగు ముస్లిమ్స్. మా బాబాజాన్ ఇక్కడి సంబంధం చూసి పెళ్ళి చేసి పంపించాడు. ఇప్పుడాయన లేడు. మా అత్తయ్య, మా అమ్మా నాతో ఉంటున్నారు” అని, తన పేరు హసీనా బేగం అని, తనకొక కొడుకున్నాడని చెప్పింది.

“భర్త లేడా!”

లేడన్నట్లు తల అడ్డంగా ఆడించింది.

“కోవిడ్ తో చచ్చిపోయాడా?” హసీనా బేగం మళ్ళీ అదే రీతిన తల అడ్డంగా ఆడించి- “కోవిడ్ తో కాదు. తప్ప తాగి కాలేయం పాడు చేసుకుని చచ్చిపోయాడు, చేతికి ఒక చంటిదానిని యిచ్చి. అది పురుట్లోనే చచ్చిపోయింది”

ఆ మాటకు బుచ్చి బాబు ఉలికిపాటుకి లోనయాడు. ఒక మనిషికి, అందునా ఒక సామాన్య సగటు స్త్రీకి యిన్ని కడగండ్లా! అమ్మలగన్న అమ్మ భూదేవి తట్టుకోగలదా! “సరే— పాయింటుకే వస్తు న్నాను. మీ కుటుంబానికి వైట్ కార్డు పైన వారం వారం ఫ్రీ రేషనింగ్- పప్పు ధాన్యాలు దొరుకుతుంటాయి కదా! మరెందుకీ విపరీత నిర్ణయం? ప్రయత్నిస్తే ఎక్కడో ఒక చోట యేవో చిల్లర పనులు దొరుకుతాయిగా!”

ఆమె చప్పున తలెత్తి లోతుగా చూసింది- “ఫ్రీ రేషనింగ్ ఆడదానికి బ్రతుకునివ్వవు. మా అత్తకు, మా అమ్మకు ప్రతి పది రోజులకొకసారి మందులు కొనివ్వాలి. మెడికల్ చెకప్ లు చేయించాలి. కొంచెం ఆలస్యమయితే చాలు ముఖం తిరిగి పడిపోతారు. నాకేమో థైరాయిడ్. తప్పని సరిగా మందులు తీసు కావాలి. లేకపోతే లైఫ్ ఖతమ్. సహాయం కావాలని, అప్పులు కావాలని వెళ్ళి అడిగితే నా చుట్టూ ఇనుప తీగలు బిగిస్తున్నారు. నిజాయితీగా చెప్పాలంటే నాకేమీ ఆక్షేపణ లేదు యెవడికో ఒకడికి ఉంపుడు గత్తెగా ఉండటానికి. కాని— వాడు అంతటితో తృప్తి చెందడు. అందరి వద్దకీ ఉంపుడు గత్తెగా వెళ్ళమంటాడు. అలా ఉండలేను కదా! అలాగుండటానికి నేనలా తయారయితే నేనిక ఆత్మ ఉన్న ఆడదానిగా మిగలను కదా! ఆ పైన నా జీవితం కుక్కలు చించిన విస్తరాకులా తయారవుతుంది కదా! అందుకే బ్రతుకు పోరాటానికి ఫుల్ స్టాప్ పెట్టాలని తీర్మానించాను. ఇప్పుడంతా తేట తెల్లమయింది కదా!”

బుచ్చిబాబు ఉన్నపాటున తలవిదిలించాడు. అప్పుడామె షార్పుగా స్పందించింది- “అంటే— నేను చెప్పిందంతా అబధ్దమనుకుంటున్నారా?”

“లేదు. కచ్చితంగా కాదు. మృత్యుముఖంలోకి తేరిపార చూడటానికి సిధ్ధమైన వారు అబద్ధం ఆడరు. నేనిప్పుడు నాకు తెలిసిన పరిష్కార మార్గం చూపిస్తాను. నాపైన నమ్మకం ఉంటే నేను చెప్పినట్లు చేయి. చేస్తావా?” తేరిపార చూసి చెప్పమందామె.

“నాకొక క్లోజ్ ఫ్రెండున్నాడు. పురుడు పోసుకున్న భార్య, పురిటి మంచం పైనే బిడ్డను చేతికిచ్చి కన్నుమూసింది. ఆ బిడ్డను తన బిడ్డగా చూసుకోగల స్త్రీ సహాయం కావాలి. ఇప్పుడు వాడు ఉద్యోగానికి వెళ్లడం మానుకుని పసికందుతో యమ యాతన పడ్తు న్నాడు. మంచి స్థాయిలో ఉన్న ఉద్యోగస్తుడు. నీకు నెలసరి జీతం యివ్వగలడు. కావాలంటే నీకూ నీ కొడుక్కి అక్కడే ఉండటానికి పోర్షన్ యివ్వగలడు. కావలసిన మందూ మాకూ కొనివ్వగలడు. వ్యక్తి సభ్యతా సంస్కారాలు గలవాడు కావటాన నిన్ను మన్ననతో చూసుకోగలడు. ఎనీ అబ్జెక్షన్ ?”

హసీనా మౌనపు పరదాలోకి వెళ్ళి పోయింది. “అదేమిటి? అలా ఊరకుండిపోయావు! నా మాట పైన నమ్మకం లేదా?”

ఆమె తల అడ్డంగా ఆడించింది కాదన్నట్టు. “నమ్మకం కలుగుతూంది. కాని— నేనేమో ముస్లిమ్ స్త్రీని. వాళ్ళేమో హిందువులు. వాళ్ళతో యిమడ గలనానని—“

“బాగా గుర్తు పెట్టుకో— ఇది కలికాలం కాదు. అంతకంటే ఘోరమైన కరోనా కాలం. ఇప్పటి రోజుల్లో ఈ కరోనా వైరస్ కుల మతాలను, ప్రాంతాల మధ్యనున్న భూ రేఖలను గుర్తించడం లేదు. అందర్నీ ఒక్కుమ్మడిగా ఎటాక్ చేస్తూంది. ఒక్కుమ్మడిగానే యమపురికి పంపిస్తూంది. అంచేత పుచ్చిపోయిన పుచ్చకాయల వంటి సామాజిక వ్యత్యాసాల గురించి మాట్లాడకు. ప్రాణాలు గాల్లోకి యెగిరి పోతున్న ఇప్పటి బీభత్స యుద్ధ వాతావరణంలో ఒకరికొకరు ఆసరాగా నిల్చోవడం గురించి మాట్లాడు, తల్లి తనం తో- సరేనా హసీనా?”

ఆమె సర్దుకుంటూ లేచి బుచ్చిబాబుకి సలామ్ పెట్టింది. పెడ్తూ అంది- “నాదొక సందేహం. తీరుస్తారా!”

“ ఉఁ” అన్నాడతను.

“మీ ఫ్రెండ్ మంచి ఉద్యోగస్థుడంటున్నారు. ఒకే ఒక బిడ్డను చూసుకోవాలంటున్నారు. ఉండటానికి పోర్షన్ తో బాటు నెలసరిజీతం కూడా యిప్పిస్తానంటున్నారు. మరి యిటువంటి వసతులున్న యింటికి- యిటువంటి కష్టకాలంలో యెవ్వరూ కాదనకుండా వస్తారు కదా! నన్ను మాత్రమే యెందుకు సెలెక్ట్ చేస్తున్నారు?”

బుచ్చిబాబు చిన్నగా నవ్వాడు. ఆ తరవాత గట్టిగానే నవ్వేసాడు. “ఈ ప్రపంచంలో యెవ్వరూ యెవ్వరికీ బ్లాంక్ చెక్కివ్వరు. ఇది బాగా గుర్తుంచుకో! నీ పరిస్థితి విని నీకు సహాయం చేయాలన్న తలంపు కలగడం వాస్తవమైనా మరొక బలమైన కారణం కూడా ఉంది. ఎవరో సైద్ధాంతిక తత్వవేత్త అప్పుడే అన్నాడు కదా- ఒక విధంగా చూస్తే మానవ బంధాలన్నీ వ్యాపార సంబంధాలేనని!. అటువంటిదే యిది కూడాను. నువ్వు నాకు మాటల మధ్య చెప్పావు కదా— నీకు రెండవ సారి పురిట్లోనే బిడ్డ పోయిందని. అప్పుడేమవుతుంది? తల్లిపాలు ఊరుతూనే ఉంటుంది కదా! నీకింకా పాలు ఊరుతూనే ఉందన్నది నాకెలా తెలుసంటావా! చెప్తాను. నాది పోలీసు చూపు. అప్పట్నించి యిప్పటి వరకూ చూస్తూనే ఉన్నాను. ఎడతెరపి లేకుండా నీకు పాలు ఊరుతుండటం వల్ల నీ అంగీ తడిసిపోతూనే ఉంది. అలాంటప్పుడు ప్రాణధార వంటి నీ చనుబాలు ఊరకే వృధా యెందుకు పోనిస్తావు? తల్లి లేని నా ఫ్రెండు బిడ్డడికి నీ చనుబాలిచ్చి ప్రాణం పోయవచ్చు కదా!” అంటూ అతడు జేబు నుండి విజిటింగ్ కార్డు తీసి అందించాడు. హసీనా బేగం బుచ్చిబాబు వేపు విస్ఫారిత నేత్రాలతో చూస్తూ అక్కణ్ణించి మెల్లగా కదలింది. మరొకసారి సలామ్ పెడ్తూ-

“ఆగు! ఇది సెన్సిటివ్ వ్యవహారం. ఎందుకైనా మంచిది, నువ్వొకసారి మెడికల్ చెకప్ చేసుకో! ఆ తరవాత నాకు ఫోను చెయ్యి. నేనే వచ్చి బిడ్డడింటికి తీసుకు వెళతాను. జాగ్రత్త: భయం నాస్తి కదా! ఇదిగో ఈ క్యాష్ ఉంచుకో—” అంటూ నాలుగు ఐదొందల రూపాయి నోట్లు అందించాడు. ఆమె మర్యాదపూర్వకంగా తలవంచి రూపాయి నోట్లు అందుకుని అక్కణ్ణించి కదలింది. బుచ్చిబాబు మొబైల్ తీసి వరదరాజులుకి తల్లిపాల కోసం తపిస్తూన్న బిడ్డడికోసం తను చేసిన యేర్పాటు గురించి వివరించసాగాడు. వరదరాజులు తన్మ యత్వంతో మిత్రుడు చెప్పేది వింటున్నాడు. తడిసిన కళ్ళతో— మైమరిచిన మనసుతో— వింటూ నిదానంగా మెల్లగా అడిగాడు- “ఒక వేళ హసీనాబేగం కోవిడ్-19 బాధితురాలయి ఉంటే-- ఆమె ఉంటున్న పాత బస్తీ కోవిడ్ తో బాగా అఫెక్ట్ అయింది కదా!”

“పర్వేలేదు. అతలా కుతలమైపోతూన్న పరిస్థితిలో కూడా ఎలర్టుగానే ఉన్నావు. నాకు తెలిసిన ఒక వైద్యురాలిని సంప్రదించాను. ఒకవేళ తల్లికి కోవిడ్-19 తాకినా బిడ్డకు పాలివ్వచ్చంట, కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు తీసుకుని. నేను ముందే చెప్పాగా హసీనా బేగాన్ని మెడికల్ చెకప్ లు చేసుకురమ్మని. ఆ తరవాతనేగా ఆమె నీ కొడుక్కి పాలిచ్చే మారుటి తల్లిగా బాధ్యత తీసుకుంటుందని— ఎనీ మోర్ క్వశ్చన్స్?”

వరదరాజులు బదులివ్వలేదు. కొన్ని క్షణాల తరవాత “థేంక్స్ ప్రాణమిత్రమా!”అన్నాడు.


***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల-ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


49 views0 comments

Comments


bottom of page