#PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #ఒకసజీవక్షణంకోసం, #OkaSajeevaKshanamKosam, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
Oka Sajeeva Kshanam Kosam - New Telugu Story Written By - Pandranki Subramani
Published In manatelugukathalu.com On 04/01/2025
ఒక సజీవ క్షణం కోసం - తెలుగు కథ
రచన: పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
అప్పుడప్పుడే వచ్చాగిన గ్రాండ్ ట్రంకు యెక్స్ ప్రెస్ బోగీ లోకి ఓపారి తొంగిచూసి, అమ్మానాన్నలిద్దర్నీ ఉన్నచోటే నిల్చోమని చెప్పి పార్ధిబ్ సరసరా సామానూ సామగ్రీ లోపలపెట్టి వచ్చాడు.
”ఇక వంద్యులిద్దరూ సావధానంగా లోపలకు వెళ్ళవచ్చు! ” అంటూ బైటకు వచ్చి ఇద్దరి ముందూ ఒకప్పటి ఎయిర్ ఇండియా మస్కట్ లా నమ్రంగా వంగి చేతులు చాచి బోగీ యెంట్రన్స్ వద్ద నిల్చున్నాడు పార్థిబ్.
ఏదో ఆంగ్ల పుస్తకం కొనుక్కుని అక్కడకు చేరిన ధనుష్ పార్థిబ్ చేష్టకు విసుక్కున్నాడు- “ఏంవిట్రా ఇది? నీ వంక టింకర చేష్టలు బయట కూడానా! బాబాయికీ పిన్నికీ ఇవి ససేమిరా నచ్చవని తెలవద్దూ! ”
దానికి పార్థిబ్ బుగ్గలు పూరించేలా ముఖం పెట్టాడు. ”అవును కదూ! ఇంటా బయటా వాళ్ల ముద్దుల కొడుకువి నువ్వే కదూ! చిన్నమ్మనూ బాబాయినీ కర్ణుడి కవచంలా కాపాడుతుంటావన్నది- ఓ ఎమ్జీ- (ఓ మైగాడ్ )తృటిలో మర్చేను సుమా! ” అంటూ ఓ వెటకారపు నవ్వుని విసిరి బోగీలోకెళ్ళి కూర్చు న్నాడు; అప్పటికక్కడకు చేరిన అమ్మానాన్నల మధ్య ఒద్దికగా-- తోకలేని వానరుడిలా--
కరుణమ్మ కొడుకువేపు కళ్లు పెద్దవి చేసుకుని చూసింది- “నీకెన్నిసార్లు చెప్పేదిరా వాడు నీకంటే పెద్దవాడని, వాడితో చూసి మాట్లాడమని? నువ్వింకా స్కూల్ బాయ్ వి కావు. ఇకనైనా ఆ వెటకారపు విసుర్లు తగ్గించుకో! ”
అప్పటికైనా పార్ధిబ్ తగ్గాడా— లేదు. తగ్గలేదు- “ఓఎమ్జీ! మళ్లీ మరొక ముఖ్యమైన విషయం మర్చిపోయాను సుమా! తప్పు తప్పు! మీది పెద్ద బృందమనీ, దానికి రాజమాత తమరేనని. మీ మాట ఉల్లంఘించినందుకు క్షంతవ్యుడను మాతృమూర్తీ! ” అంటూ వాళ్ళకెదురుగా వచ్చి కూర్చోబోతూన్న ధనుష్ పాదాలను వంగితాకాడు.
ఈసారి విఘ్నేశ్వరరావు కళ్లు పెద్దవి చేసుకుని చూసాడు కొడుకు వేపు- “టూమచ్ వెటకారం చేయకురా అబ్బీ! నిన్ను వాడితో క్షమాపణ కోరమని అడిగిందా మీ అమ్మ? కంట్రోల్ యువర్ సెల్ఫ్! ప్రతిసారీ తెలుగు పద గుంభన ఝులిపిస్తూ నీకు నువ్వు ఆంగ్లంలో వీక్ అని చెప్పక చెప్తున్నావు”
పార్థిబ్ ఈసారి కళ్ళెత్తి చూసి ఊరకుండిపోయాడు- “నాకున్న తెలుగే నాకు గొప్ప“ అని గొణుక్కుంటూ క్షణం పాటు ఆలోచించాడు. నిజంగానే తను- ‘రాముడు- భీముడు ‘ చిత్రంలో’ని రాజనాలలా ఓవరాక్షన్ చేసేసాడేమో! ఇక మరుపలుకు లేకుండా సైడు బ్యాగునుండి ఏదో పుస్తకం తీసి సీరియస్ గా ముఖం పెట్టి చదవసాగాడు. ధనుష్ ని ఆటలు పట్టిస్తే వాళ్ళిద్దరూ తట్టు కోలేరు. ఎంతైనా రాముడు మంచి బాలుడు కదా! అందులో వాళ్లతో వాడికి చిన్నప్పటి మాలిమి. అప్పుడక్కడకు ఒక పెద్దాయన వచ్చాడు- “ఎక్స్యూజ్మీ! ” అంటూ. అందరూ అతడి వేపు తలలు తిప్పి చూసారు- ఏమిటన్నట్టు. ”ఈ బోగీలో మీరు తెలుగువారని తెలుసుకుని బోలెడంత నెమ్మది కలిగిందనుకోండి!”
“అదంతా తరవాత మాట్లాడుకుందాం గాని, మీకు కూర్చోవడానికి చోటు కావాలి, అంతేకదా! రండి. అలా వెళ్ళి ఆసీనులుకండి“ ఆ మాటన్న పార్థిబ్ వేపు కంటి హెచ్చరిక విడిచాడు ధనుష్; పరుల వద్ద నోటిని అదుపులో పెట్టుకోవడం మరచిపోకని. అక్కడ కు వచ్చిన పెద్దాయన కొనసాగించాడు- “అబ్బే! మీరింకేదో అనుకున్నట్టున్నారు. నేనిక్కడ స్టీల్ కంపెనీలో పనిచేస్తున్నాను. మా స్వస్థలం గజపతి నగరం. నేను అర్జంటుగా బిజి నెస్ టూరు పైన వెళ్ళాల్సి వచ్చింది. అందుకని లీవు ముగిసి కాలేజీకి వెళ్తూన్న మా అమ్మాయితో నేను చెన్నైవరకూ వెళ్ళలేక పోతున్నాను. వాళ్ళమ్మను తోడుగా పంపిద్దామనుకుంటే ఫ్రోజన్ భుజంతో కదల్లేని పరిస్థితి ఆమెది. అందుకని కాస్తంత జన సందడి ఉంటుందని అమ్మాయిని సెకెండు క్లాసు కంపార్టుమెంటులోకి యెక్కించాను- అప్పటికప్పుడు లేడీస్ కంపార్టుమెంటులో సీటు దొరక్క”
ఆయన వేపు విఘ్నేశ్వరరావు అసహనంగా చూసాడు- ”ఇంతకీ మీ అమ్మాయెక్కడండీ? ”అని అడుగుతూ--
ఆ ప్రశ్నతో ఎట్టకేలకు ఆ పెద్దాయన ఈలోకంలోకి వచ్చిపడ్డాడు. నిల్చున్న చోటునుంచే సైగ చేసి పిలిచాడు. అప్పుడక్కడకు చురిదార్ డ్రెస్సులో అందాలు చిమ్ముతూన్న ముఖంతో పొంగులూరే యవ్వనపు కాంతులతో నవ్వుతూ వచ్చింది వాళ్ల అమ్మాయి. పార్థిబ్ ఆమె వేపు చూపు సారించడం లేదు.. కళ్లు తిప్పుకోకుండా ఆమెనే గమనిస్తూన్న ధనుష్ పైనే ఉందతని చూపు.. ఇప్పటికే అతడి కోసం ఢిల్లీనగరంలో రెండు సంబంధాలు చూసి వస్తున్నారు. వాడికున్న విద్యార్హతలు తెలుసుకుని వాళ్ళ వాళ్ళ అమ్మాయిల్ని పళ్లెంలో పువ్వూ తాంబూలం పెట్టి అందించినట్టు వాడిచేత మూడుముళ్ళూ వేయించడానికి తహతహలాడుతున్నారు ఆడపిల్లల్ని కన్నవారు. ఎందుకు ఉవ్విళ్ళూరరూ? కంప్యూటర్ సైన్స్ లో గోల్డ్ మెడలిస్టు కదా! మేజర్ ఐటి కంపెనీలో క్యాంపస్ సెలెక్షన్ లో విజయ పతాకం యెగరేసిన వాడు కదా! ఇక ఇప్పుడు ఈ అందాల రాశిని చూసాడు కదా- ఇక్కడికిక్కడే మూడో సంబంధం గురించి మంతనాలు ప్రారంభమవుతాయేమో-- ఆది నుంచీ వాడిదంతా రాజయోగమే! పట్టిందంతా బంగారమే!
ఆ అమ్మాయి చెప్పసాగింది- “నాపేరు దుర్గాదేవండీ! చెన్నై సెయింటే మేరీస్ కాలేజీలో ఎమ్మెస్సీ చేస్తున్నానండి. మా నాన్న మరీ భయపడిపోతున్నారండీ టీవీలలో క్రైమ్ టైమ్ న్యూస్ చూసి చూసి- మార్గ మధ్యలో నాకేదో కీడు జరిగిపోతుందని-- అందులో ఈ మధ్య అక్కడక్కడ చోటు చేసుకునే నిర్భయ కేసుల గురించి విని- మా ఇంట్లో మా అమ్మ పరిస్థితి ఇక చెప్పనవసరమే లేదనుకోండి” చెప్తూ చెప్తూ- ముగించీ ముగించకుండానే మురిపాతి మురిపంగా నవ్వేసిందామె.
అమ్మాయిలకు కారణం ఉన్నా లేకపోయినా పక పక నవ్వడం, నోట ముత్యాలు వెదజల్లడం సహజ గుణమేగా! పార్థిభ్ పుస్తకంలోనుంచి తలెత్తకుండానే స్త్రీల ప్రవృత్తి గురించి ఆలోచిస్తున్నాడు. అంతటి సొందర్య వతికి ఎటువంటి మొగుడు దొరుకుతాడో మరి! ఎదురుగా కళ్ళప్పగించి చూస్తూ కూర్చున్న ధనుష్ గాని తలచుకుంటే ఇప్పటి కిప్పుడే దుర్గాదేవికి జీవనసహచరుడిగా కుదిరిపోడూ! చాలామంది విద్యావాన్ ధనవాన్ భవేత్ అంటారు గాని—వాస్తవానికి విద్యావాన్ కన్యకా భవేత్ అనాలి మరి! ఇక తనకంటే పెద్దవాడయిన ధనుష్ సాధారణంగా తమింట్లోనే ఉంటాడు, వాడికి సంబంధించిన ముఖ్యమైన పనుల. న్నీ అమ్మానాన్నలే చూసుకుంటారు, . వయోభారం వల్ల కొంత, అనారోగ్య సమస్యల వల్ల కొంత పెదనాన్నా పెద్దమ్మా సాధారణంగా కాలు బయట పెట్టరు. కాలేజీ లెవల్ వరకూ వాడి అడ్మిషన్ వ్యవహారాలన్నీ తమింటి వారే చూసుకున్నారు. ఇప్పుడేమో వాడి పెండ్లి సంబంధాల గురించి కూడా తమింటి వారే చొరవ తీసుకుని ముందుకు సాగుతున్నారు. ఇంట్లో వాడికున్న మాలిమిని బట్టి కొందరు వాణ్ణి స్వంత కొడుకనుకుంటారు.
తననేమో పెదనాన్న వాళ్ళింటి అబ్బాయనుకుంటారు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి రావడం, ఆ విషయం గురించే—నేడో రేపో ధనుష్ పెండ్లి సంబంధం ఇక్కడో అక్కడో కుదురిపోవచ్చు. ఆ తరవాతనే తన సంగతి చూస్తారేమో—ఇంతకూ తనకు కూడా ఈడూ జోడూ గల జీవన సహచరి అవసరమన్న సంగతి ఎప్పుడు గుర్తిస్తారో యేమో! తనకు మంచి ఉద్యోగం దొరికిన తరవాతనే పెండ్లి సంబంధం చూస్తామంటే తనకు పూర్తిగా తల వెంట్రుకలు నెరసిపోతాయేమో-- మరికాసేపటికి విఘ్నేశ్వరరావు దంపతులతో ఏవో కబుర్లాడి ఒకరి టెలిఫోన్ నెంబర్లు మరొకరు నోట్ చేసుకుని ఆ ఢిల్లీ పెద్దాయన వెళ్లిపోయాడు; మరొకమారు కూతురుని ఓకంట చూడటం మరచిపోకండని వేడుకోలు విడుస్తూ— పార్థిభ్ మరొకసారి ఆలోచనల్లో పడ్డాడు.
కొందరున్నారు. ఎదుటి వారిని సహాయం అడగటానికి ఇసుమంత కూడా సందేహించరు. అవసరమున్నా లేకున్నా పదేపదే వాళ్ళ అవసరాలను గుర్తుచేయడానికి కూడా వెనుకాడరు. కాని వాళ్ళ వంతు వచ్చేటప్పటికి మాత్రం చల్లగా తప్పుకుంటారు జారుడు నేలలా-- పరిస్థితుల కారణంగా ఒంటరిగా పయనిస్తూన్నపెళ్లికాని కూతురు పట్ల కన్న తండ్రికి అక్కర ఉండాల్సిందే! కాని ఆ అక్కర శృతిమించి రాగాన పడకూడదు కదా! ముక్కూ మొహం యెరగని వారితో అంతటి చనువూ చొరవా చూపించ కూడదు కదా! ఆఫ్టరాల్ తామెవరూ ఈ అమ్మాయికి దగ్గరి బంధువులేమీ కారు కదా--
ఆయన వెడలిపోయిన కాసేపు తరవాత పార్థిభ్ తన సీట్లోనుండి లేచాడు. నోరు అదుపులో పెట్టుకోలేని తమ్ముడు ఏదో మిస్సాయిల్ విడువబోతున్నాడన్నది గ్రహించిన ధనుష్ ఎలర్టుగా కళ్లతో మరోమారు సంజ్ఞచేసాడు, మాట్లాడకుండా ఉండమని.
కాని అతడదేమీ లక్ష్యపెట్టే మూడ్ లో లేనట్టున్నాడు ”చూడండి దుర్గమ్మగారూ- సారీ దుర్గాదేవి గారూ! నేను వెళ్ళి మీకు కేటాయించిన బెంచీ వేపు వెళ్లి సర్దుకుని కూర్చుంటాను. మీరేమో ఇక్కడే కూర్చోండి. కమ్మటి తెలుగులో కబుర్లాడుతూ కమ్ ఫర్ట బుల్ గా కూర్చోండి. ఐతే ఒకటి. నేను వెళ్ళింతర్వాత నా గురించిన గుట్టు సుతారంగా విప్పుతారు ఈ ఇద్దరు మాతా పితలూను. నేనేమో చదువబ్బని మొద్దబ్బాయినని. మూడు సార్లు దండయాత్ర చేసిగాని బి. ఏ పట్టా తెచ్చుకులేని అసమర్థుణ్ణనీ-- ఇంటి ముద్దుల కొడుకేమో- అంటే మా పితృవ్యుడి సుపుత్రుడు ధనుషేమో చదువులరాయడనీ- కొలువు ఐటీ కంపెనీలోనే కాక, ఇండియన్ రెవెన్యూ సర్వీసులో ఆఫీసరుగా భారీ జీతంతో సెలెక్టయాడని- నేనేమా ఉద్యోగం కోసం రోడ్లు కొలుస్తున్నానని- ఇంకేమేమో చెప్పవచ్చు.
ఎటువంటి ప్రొఫెషనల్ డిగ్రీకోసమూ ప్రయత్నించకుండా ఆటపాటల్లో మునుగుతూ ఫుట్ బాల్ క్రికెట్ గేములు ఆడుతుంటానని- వీధి పోరాటాలకు కసరత్తు చేస్తూ కరాటే నేర్చుకున్నానన్న ధీమాతో దారిన పోయే వారితో తగవులు పెట్టుకుంటూ ఉంటానని—ఆస్పత్రి పాలవుతుంటానని-- మొత్తానికి నన్నొక స్ట్రీట్ ఫైటర్ గాడినని చెప్పినా చెప్తారు. వినండి. కాని అన్నీ నమ్మేయకండి. నమ్మకూడదని కాదు. వాయిదాల పధ్ధతిన నమ్మండి- వివరణ ఇవ్వడానికి నాకూ ఒక ఛాన్సు ఇవ్వండి”
అలా అతడింకేదో చెప్పబోయేంతలో విఘ్నేశ్వరరావు కొడుకుని ఆపాడు- “ఇక ఆపుతావా లేదా పార్థిభ్! ఇంతగా తెలుగులో ఊకదంపుడుగా వాగేస్తున్నావు గాని- ఏదీ దీనికి నిర్వచనం చెప్పు- సదైవ ప్రియదర్శన:“
“దీనికి అర్థం ఇంకెన్ని సార్లు అడుగుతారు నాన్నా! చూసిన వెంటనే ప్రీతి కలిగించేవాడని అర్థం. అంటే ధనుష్షు లాగన్నమాట. ఇక మిగతాది నాకు విడిచి పెట్టేయండి. నేనున్నా లేకపోయినా నా గురంచి యెలాగూ చెప్తారుగా! చెప్పక పోతే కడుపు ఉబ్బు చల్లారుదుగా!! మీకెందుకంత శ్రమని నేనే పూర్తి చేసి వెళతాను. ఇదండీ సగంతి! ఇక నేనటు వెళ్ళి మళ్ళీ రానుగా- అందుకే మీకు ఆసక్తిగా ఉంటుందని సవివరంగా సమీక్షించి చెప్తున్నాను”అంటూ కదలబోయాడు పార్థిభ్.
”ఒక్కనిమిషం!”
దుర్గాదేవి గొంతు వినిపించి ఆగాడతను-
“మీచేతిలో యేదో పుస్తకం ఉన్నట్లుంది. ఒకసారి-- “
అప్పుడు విఘ్నేశ్వరరావు అడ్డు వచ్చాడు-
“వద్దమ్మా! ఆ పుస్తకం నీకొద్దు “ అని వారించాడు. ఎందుకని కళ్ళతో నవ్వుతూనే అడిగింది దుర్గాదేవి,
”వాడు చదివేవి ధనుష్ లా మామూలు పుస్తకాలు కావు. హత్యలూ శవాలూ బాంబులూ రక్తపాతాలూను- వీటితో నిండిపోయే డిటెక్టివ్ భయానక నవలది. సరాసరి ప్రేతాత్మలను ఆహ్వానిస్తాడు. ట్రైను కదలినట్లుంది. వచ్చే స్టేషన్లో ఏదైనా వారపత్రిక దొరుకుతుంది. అది కొనుక్కో”
దుర్గాదేవి అంగీకరించలేదు. పార్ధిబ్ చేతినుంచి పుస్తకాన్ని అందుకుంటూ అడిగింది ””మీకు దైవభక్తి ఉందండీ? ”
“ఎందుకు లేదూ? నాది శ్రీరాముడి భక్తి. అదిగో- అక్కడ ఓరచూపులు చూస్తూ కూర్చున్నాడే- వాడిదేమో శ్రీ కృష్ణభక్తి. అన్నట్టు నేను కూడా ఒకటడుగుతాను. మనసున అన్యదా భావించకపోతే. మీరు న్యూఢిల్లీ నుండి వస్తున్నారు కాబట్టి బస్సు లోనో నడదారిలోనో నిర్భయ కేసులు సంభవిస్తాయని జంకుతున్నారుగాని, అవి, అక్కడెక్కడో కాదు- ఇక్కడ కూడా- ”అంటూ అర్థోక్తిలో ఆగిపోయి దుర్గాదేవికి కేటాయించిన సీటు వేపు వెళ్ళి పోయాడు పార్థిభ్.
ఆ మాటలకు ఆమె మొదట తెల్లబోయి, ఆ తరవాత ఫెళ్ళున నవ్వేసింది. ఏం చెప్పాలో తెలియక భార్యాభర్తలిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఒక కన్నె పిల్లతో అటువంటి అపభ్రంశుపు మాట చెప్పవచ్చా! ఇక తరచి చూస్తే- ఈ ఢిల్లీ తెలుగు పిల్లకు తమ ముద్దుల కొడుకు ఆకతాయి వేషాలు బాగానే నచ్చినట్టున్నాయి. భార్యాభర్తలిద్దరూ అనుకున్నట్లే దుర్గాదేవి పార్థిబ్ ని ఒక పట్టాన విడిచి పెట్టేటట్లు లేదు. అతణ్ణి మరొక మారు ఆపుతూ అడిగింది- “ఒక మాట. చివరిమాట. అన్యధా భావించకూడదు. మీకు తగిన ఉద్యోగం కోసం ఎన్నాళ్ళు ఎదురు చూస్తుంటారు? మీకు మీరుగా ఏదో ఒకటి వెతుక్కోవాలి లేక చేసుకోవాలి కదా! ”
“ఎందుకు చేసుకోను మేడమ్? బహుకాల పథక రచన చేసే ఉన్నాను. పచ్చదనంలో స్వఛ్ఛదనమూ నిండుదనమూ ఉంటుందంటారే—ఆ కోవన నేను చుట్టూ కంచెవేసి తోట పెంచబోతున్నాను. ఎందుకంటారా- చెప్తాను వినండి. సీతాఫలం- రామాఫలం- లక్ష్మణ ఫలం- వాటర్ యాపిల్- రోజ్ యాపిల్- మిరాకిల్ ఫ్రూట్- ఈ రీతిన డబ్బైకి పైగా పండ్ల రకాలూ—అశ్వగంధ- అడ్డసర- శంఖుపు- జీవకాంచన--- ఇలా మరో డబ్బై రకాల ఔషధ మొక్కలూ—యాలకులు దాల్చిన చెక్క యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలూ- శ్రీగంధం- నేరేడు- ఎర్ర చందనం వంటి వృక్షాలు పెంచి కావలసిన వాళ్ళందరికీ సరఫరా చేయబోతున్నాను! ”
“ అయ్య బాబోయ్! పెద్ద ప్లానే! మరైతే దీనికి కనీసం నాలుగెకరాల భూమయినా ఉండాలి కదా! ”
“ఎందుకుండదూ! కౌలుకి తీసుకుంటాను”
“మీకు పూర్వానుభవం అంతగా లేదాయె. నాలుగెకరాలు ఎవరిస్తారు మీకు? ”
“ఎందుకివ్వరూ? మిస్టర్ విఘ్వేశ్వరరావు గారిస్తారు”
“ఆయనెవరు? ”
“ఇంకెవరు? అదిగో! మీకెదురుగా కూర్చున్నారే- ఆయనే- మా పితృదేవుడు“అంటూ మరుచూపులేకుండా కదలి వెళ్ళిపోయాడు, కొడుకు మాటలు విని భార్యా భర్తలిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ధనుష్ నవ్వాపుకోలేక పోతున్నాడు.
అనుకున్నవి అనుకున్నట్లు చాలా అరుదుగా జరుగుతాయి. అయితే అనుకున్నవి కొన్ని అనుకున్నట్లు జిరిగినా అవి ప్రమాదకరంగా మారుతాయి. బీభత్సకరమైన పరిస్థితిని సృశ్టిస్తాయి. రాత్రితెర వాలి భోజనాలు ముగించి బోగీలో అందరూ మాగన్నుగా జోగుతున్న సమయం చూసి ఉన్నపాటున- ఆరుగురు ముసుగులేసుకున్న దుండగలు హిందుస్థానీ, భోజ్ పురీ, రాజ స్తానీ యాసలతో మిళితమైన కలగా పులగ భాషలో అరుస్తూ కత్తులూ కటారులూ ఝులిపిస్తూ బోగీపైన దాడి చేసా రు. వాళ్ళ భీకరమైన అరుపులకి కంపార్టుమెంటులోని వాళ్ళందరూ బిక్కసచ్చిపోయి వజవజ వణకుతూ లేచి కూర్చున్నారు. కొందరికి పై ప్రాణాలు పైకే పోయాయి. ఏదో అనబోయిన ఇద్దరు ప్యాసంజర్లను మెడలు వంచి కాళ్ళ క్రింద పడవేసారు ట్రైన్ దోపిడీగాళ్లు. కన్నూ మిన్నూ తెలియని తాగుడు మత్తులోనో డ్రగ్ మైకంలోనో ఉన్నట్టున్నారు దుండగలందరూ.
ఒకరిద్దరు ప్యాసింజర్లు- ‘హెల్ప్! హెల్ప్! ’ అని అరిచారు గాని- ఎక్కడా ట్రైన్ సెక్యూరిటీ గార్డుల అలికిడి వినిపించలేదు. అరచిన వాళ్ళ గతి కూడా అంతే మరి. నోట మాట లేకుండా కూర్చున్న ఆడాళ్లందరి నుండీ నగానట్రా ఒలుచుకుని కంటికి కనిపించిందంతా దోచుకుని వెళ్ళిపోతూన్న ఇద్దరి దుండగుల చూపు ఉన్నపళాన దుర్గాదేవి పైన పడింది. అప్పుడామె చేసిన తప్పు- దుపట్టాతో చప్పున ముసుగేసుకోవడం మరచిపోవడం.
”బహుత్ కప్సూరత్ హై! ”అంటూ ఆమెను అమాంతం ఎత్తుకున్నారు.
దుర్గాదేవి- “సేవ్ మీ! సేవ్ మీ! అని అరు స్తూ వాళ్ల రాక్షస కబంధ హస్తాలనుండి విడిపించుకోవడానికి గిలగిలా తన్నుకుంటూంది. అది చూసి ధనుష్”పోలీస్! పోలీస్! ” అని కేకలు పెట్టసాగాడు. పూర్తి మత్తులో ఉన్న ఆ దుండగలది అటు వంటి దీనహీన కేకల్ని లక్ష్యపెట్టే రకమా! ధనుష్ ని ఒక్క తోపు తోసి, ఆమెను యెత్తుకుని తీసుకుని పోతూనే ఉన్నారు దుండగులు తిరిగి చూడకుండా--
అప్పుడామెను నోరుమూయించేలా ఒక దుండగుడు చెళ్ళున లెంపకాయకొట్టడమూ- వెనుకనుండి పులి పంజా వంటి దెబ్బ వాడి మెడపైన పడటమూ ఒకే సారి జరిగి పోయాయి.! మరొక దెబ్బ- మరొక దుండగుడిపైన విరుచుకుపడింది. అంతే! క్రింద పడ్డ ఇద్దరు దుండగులూ మళ్లీ లేవలేదు. ఆ దెబ్బ మామూలు టింగరి పింగరి దెబ్బకాదుగా. కేరళ మర్మకళ నేర్చుకున్న వాళ్ళకు మాత్రమే సాధ్యమయే ఇనుప గుండు వంటి యమ దెబ్బ! క్రింద కాలు మోపిన దుర్గ అదెవరా అని ఆశ్చర్యంగా చూసింది. వీరావేశంతో ఊగిపోతూ పిడికిలి బిగించిన పార్థిబ్ కనిపించాడు!
ఆలోపల అంతవరకూ ఎక్కడెక్కడో ఊసులాడుతూ గడిపిన రైల్వే సెక్యూరిటీ గార్డులు ప్యాసెంజర్ల అరుపులు విని పరు గెత్తుకుంటూ వచ్చి కదల్లేకుండా పడి ఉన్న బందిపోటు దొంగలకు బేడీలు తగిలించి అరెస్టు చేసారు. మిగతా నలుగురు దుండగులూ చీకట్లో చీకటిగా కలిసిపోయి మాయమైపోయారు. అర్జంటు మెసేజ్ అందుకున్న సీనియర్ రైల్వే అధికారులు వచ్చి అక్క డున్న వాళ్ళందరి వద్దా లిఖిత పూర్వక స్టేట్మెంటులు తీసుకుని వాళ్ళ వాళ్ల నగలూ నట్రా తగు ఇంటరాగేషన్ జరిపిన తరవాత అప్పచెప్పేస్తామన్నారు. దైర్యంగా ఉండమన్నారు.
పార్థిభ్ సాహసచర్య గురించి సెల్ఫీ తీసి తోటి ప్యాసంజర్ల బోగట్టాకూడా జోడించి ప్రత్తేకంగా నోటు వ్రాసుకున్నారు;రైల్వే డిపార్టు మెంటు హెడ్ క్వార్టర్సుకి పంపడానికి. ఆ తరవాత అందరూ కుదురుగా కూర్చు న్నతరవాత“నీకేమీ కాలేదు కదరా పార్థీ? ! ”అని ఆదుర్దాగా అడిగింది కరుణమ్మ, గుండెను దిటవు పర్చుకుంటూ. అతడు నవ్వి ఊరకున్నాడు. కాని, దుర్గాదేవి ఏమీ అనలేదు. పార్థిభ్ ని పరీక్షగా చూసి తనపైనున్న దుపట్టాని సర్రున చించి అతడి తలవెనుక తగిలిన గాయానికి కట్టుకట్టింది. మినరల్ వాటర్ బాటిల్ తీసి అతడి చేత తాగిపించింది.
ఆమె వేపు తిరిగి చూసి- “థేంక్స్ మేడ మ్”అని నవ్వుతూ అన్నాడు పార్థిబ్. దుర్గాదేవి చురుగ్గా చూసింది. ”మీనుండి ఈ- ఈజీ గోయింగ్ నైజం ఎప్పుడూ పోనే పోదా! ” అంటూ నవ్వలేక నవ్వుతూ అందరూ చూస్తుండగానే అతడి ముక్కు పట్టుకుని గట్టిగా లాగింది. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు ఓర చూపులు చూసుకున్నారు.
అప్పుడు ధనుష్ అన్నాడు- “రైల్వే డిపార్టుమంటు వాళ్ళు నీకు తప్పకుండా జాబ్ ఆఫర్ చేస్తార్రా పార్థిబ్! ”
“ఇవన్నీ ఎదురు చూసి చేసేవాటిని సహాయమనర్రా తిరుమల నాయకా! బిజినస్ మైండ్ అంటారు“
అప్పుడు మరొక సారి కిలకిలా నవ్వుతూ- “యు ఆర్ రైట్ మైడియర్ హీమ్యాన్! ”అంటూ చుట్టు ప్రక్కలున్నవారిని ఖాతరు చేయకుండా పార్ధిభ్ ని కౌగలించుకుంది. గట్టిగా పెనవేసుకుంది దుర్గ. కంగారు పడిపోతూ అడిగాడతను- “వాట్ డు యూ మీన్? ”అని.
“ఐ మీన్- యు ఆర్ మై లైఫ్- మై సోల్. —ప్లీజ్ హగ్ మీ! “
అతడు మౌనంగా తలూపుతూ ఆమె కళ్ళలోకి లోతుగా చూస్తూ- ఆమెను గుండెలకు హత్తుకున్నాడు అమాంతంగా--
మనసులు కలసిన వేళ, వసంతం విరిసిన వేళ తనువులు కూడా తన్మయత్వంతో తనివి తీరని దాహంతో చేరువయే తీరుతాయి కదా! ఎక్కడో యెప్పుడో చదివిన తెలుగు సుందర పదాలు సరదాగా అతడి మనసున మెదిలాయి, . “ఎందరో వస్తారు, మరెందరో పోతారు. మరికొందరు చూపుకి ఆనకుండా కనుమరుగవుతారు. మబ్బుల్లా మారిపోయి మబ్బుల్లో కలసిపోతారు. కొందరు మాత్రం తొలకరి చినుకుల్లా చల్లదనం కురిపిస్తారు. మనమధ్యే మిగిలిపోతారు. మన మనుగడతో ఆకాశంలో ఆకాశంగా మమేకమైపోతారు”,
శుభం
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
Comments