top of page

ఒక తల్లి ప్రతిస్పందన!


'Oka Thalli Pratispandana' - New Telugu Story Written By Goparaju Venkata Suryanarayana

'ఒక తల్లి ప్రతిస్పందన' తెలుగు కథ

రచన: గోపరాజు వెంకట సూర్యనారాయణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

వర్ధనమ్మ గారు.. దీర్ఘాలోచనలో పడ్డారు! ఈ మధ్య ఆమె ఆలోచనలు.. ఎటూతేలక.. అంతు లేకుండా సాగుతున్నాయి. భర్త ఆనందరావు పోయి.. తాను ఒంటరైనప్పటి నుంచి దిగులుతో ఇదే పరిస్థితి!


భర్త ఉండగా.. ఆయన నీడలో.. వంటిల్లు చక్కబెట్టుకుంటూ, ఆమె జీవితం ఎంతో ధీమాగా ప్రశాంతంగా సాగిపోయేది! వారి సరిగమల సంసార జీవితంలో.. భార్యాభర్తలిద్దరూ ఒక్కగానొక్క కొడుకు శ్రీనాధ్ ను అల్లారు ముద్దుగా పెంచడం, వృద్ధిలోకి తీసుకురావడంలో.. సమిష్టిగా వారి వారి బాధ్యతలు నెరవేరుస్తూ.. మంచి ఉద్యోగంలో స్థిరపడే వరకూ ఏ లోటూ రాకుండానే సాకారు. ఆ పైన ఈడుజోడైన సంబంధం చూసి నీరజతో పెండ్లి కూడా చేశారు. ప్రస్తుతం కొడుకు, కోడలూ.. ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ సుఖజీవనం సాగిస్తున్నారు.


ఆనందరావు గారు కూడా.. తన జీవితమంతా ముందు చూపుతో సంసారాన్ని.. భావి విశ్రాంత జీవితం సుఖమయంగా ఉండాలనే దృష్టితో.. ఎంతో పొదుపుగా జీవనం సాగిస్తూ.. ఉద్యోగ సమయంలోనే ఒక హౌసింగ్ సొసైటీలో చేరి ఇంటి స్థలం భార్య వర్ధనమ్మ పేర కొన్నాడు. తర్వాత హౌసింగు లోను తీసుకుని.. చిన్న ఇల్లు కూడా నిర్మించాడు. అటు పైన వీలుచూసుకొని ఖాళీ స్థలం వైపు వీలుగా ఇంటిని విస్తరించాడు! తను రిటైరయ్యే సమయానికి ఆ లొకాలిటీ అభివృద్ధి చెందడంతో తనకు వచ్చిన రిటైర్మెంట్ సొమ్ముతో పైన అంతస్థువేసి.. ఇంటిని భవంతిగా తీర్చి దిద్దాడు. ప్రస్తుతం.. క్రింది భాగాన ఇంటివారుండగా.. పైన అద్దె రూపేణా కూడా.. గిట్టుబాటు గానే.. ముడుతోంది.. నెల నెలా వారికి.


పై వాటాను ఆనందరావు గారు.. తనకు కొడుకు వరసయ్యే దూరపు బంధువు.. లాయర్ వామనరావుకే అద్దె కిచ్చారు.. కాస్త మాటకు మంచికి సాయంగా ఉంటాడని. వామనరావు కూడా వృధ్ద దంపతులను బాబాయిగారు, పిన్నిగారు అని పిలుస్తూ.. ఆప్యాయంగా కలివిడిగానే ఉంటాడు. అతని భార్య పంకజాక్షి కూడా.. వర్ధనమ్మ గారితో అత్తయ్యగారూ అని పిలుస్తూ.. అన్నింటికీ చేదోడు వాదోడుగా ఉంటూ కలివిడి గానే ఉంటుంది. అవసరానికి చిన్ని చిన్ని పనులకు… సాయపడుతూనే ఉంటారు వారిద్దరూ.. ఆ వృద్ధ దంపతులకు.


ఆనందరావు గారు తరచూ.. ' మనకేం దిగులులేదు!.. మన జీవితాల చివరివరకు ఏ లోటూ రాదు!! సొంత ఇంట్లో ఉంటూ.. వచ్చే అద్దె ఆదాయం, పెన్షన్తో.. తృప్తిగా ఎవరిమీద ఆధారపడకుండా గడిపెయ్యగలం! ' అంటూ భరోసా చెప్పేవాడు భార్యకు. అలా ధైర్యం చెప్పే భర్త తోడు ఆమెకు మరెంతో కాలం నిలవలేదు. కోవిడ్ మహమ్మారి జంటను విడదీసి.. ఆమెను ఒంటరిని చేసింది!.


ఇన్నాళ్ళ జీవితంలో ఎంతో సన్నిహితంగా మెలిగిన నాధుడు లేక.. ఒంటరితనం అనుభవానికొచ్చింది వర్ధనమ్మ గారికి. ఇంట్లో.. ఇల్లాలు హోదా కోడలికి బదిలీ అయ్యింది! బ్రతుకు కొడుకు కోడలు సంరక్షణ లోకి మారింది! వారిరువురి ఉద్యోగాల కారణంగా వారికి వంటింటి సదుపాయాలు సమకూర్చే వ్యక్తి గా బాధ్యత తప్పడంలేదామెకు!. ఆమె జీవనం మాస్టర్ బెడ్ రూమ్ నుంచి గెస్ట్ రూముకు.. ఎటాచ్ బాత్ నుంచి.. కామన్ కూ మారింది!


పోను పోను.. వయసుతోపాటు.. ఇంటి చాకిరీతో.. శ్రమ పెరిగి.. విశ్రాంతి కొరవడి.. క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణించ సాగింది!. తరచూ అనారోగ్యం బారిన పడటం తప్పడం లేదు. అలసట.. నీరసం.. ఆమెను కృంగదీసి పనులు చేయలేక.. శరీరం.. విశ్రాంతి కోరుతూ.. వివిధ రుగ్మతలతో.. నీరస పడింది. దాని పర్యవసానంగా.. ఇంట్లో.. కొడుకూ కోడలు.. సేవల విషయంలో.. తరచూ ఇబ్బంది పడుతూ.. చికాకుతో.. అప్పుడప్పుడు.. ఘర్షణలు కూడా పరిపాటయ్యింది.


నీరసం భరించలేక.. చూసి చూసి ఒకరోజు.. కొడుకు శ్రీనాధ్ తో.. ' ఒరే.. బాబూ.. బడలిక తట్టుకోలేక పోతున్నానురా.. నీరసంగా ఉంటోంది.. డాక్టరు దగ్గరకు తీసుకెళ్లరా ' అని.. అడిగింది వర్ధనమ్మ.

' సరేనమ్మా.. శెలవురోజు వీలుచూసుకొని.. అలాగే వెళ్దాం! నువ్వు ఎక్కువగా హైరాన పడకు! మేం ఆఫీసులకు వెళ్ళాక.. ఖాళీయేగా.. పూర్తిగా విశ్రాంతి తీసుకో ' అని అప్పటికి సముదాయించాడే గాని… ఆ తర్వాత.. ఆవిషయమే పెద్దగా పట్టించుకోలేదు.

ఒకసారి.. కళ్లద్దాలు పగిలి.. కళ్లజోడు మార్పు కోసం, మరోసారి.. పంటి బాధకూ.. ఇంట్లో వాళ్ళతో.. పని జరగక.. వామనరావు దంపతుల సాయం తీసుకోవలసి వచ్చింది వర్ధనమ్మ గారికి.


ఒకనాడు మధ్యాహ్నం.. భోంచేసి వంటిల్లు సర్దుతుంటే.. కళ్ళు తిరిగి పడబోతుంటే.. నెమ్మదిగా గదికి చేరి పడుకుంది వర్ధనమ్మగారు. వొళ్ళు తెలియకుండా నిద్రపట్టేసింది. మళ్లీ… కోడలు ఆఫీసు నుంచి ఇంటికొచ్చి.. ' తలనొప్పితో చస్తుంటే కాఫీ ఇచ్చే దిక్కు లేదు!.. కనీసం కాఫీ పెట్టుకుందామంటే.. వంటిల్లు అంతా.. చిందరవందర ' అంటూ చిరాకు పడుతుంటే మెలుకువ వచ్చింది.. వర్ధనమ్మగారికి. లేద్దామన్నా.. సత్తువ లేక వీలుకాలేదు. ఈలోగా కొడుకు శ్రీనాధ్ కూడా రానే వచ్చాడు.


భార్య చిరాకు పడటం చూసి, .. తల్లి పడుకుని ఉండటం గమనించి… ' ఏమిటమ్మా… ఈ సమయంలో.. పడుకున్నావూ! '... అంటూ తల్లిని తాకి చూసాడు. జ్వర తీవ్రతతో... ఆమె వొళ్లు కాలిపోతోంది! లేవలేని పరిస్థితి అని.. అర్ధమయ్యింది శ్రీనాధ్ కు.


' చూడు.. నీరజా.. అమ్మకు జ్వరం తీవ్రంగా ఉంది.. ఇంట్లో పని నువ్వే చూసుకో.. రేపూ, ఎల్లుండీ.. ఆఫీసుకు శెలవు పెట్టి.. అమ్మను చూసుకో! ' అని పరిస్థితి వివరించాడు.


' నాకు.. ఆఫీసులో ఇనిస్పెక్షను ఉంది.. నాకు శెలవు పెట్టడం కుదరదు. మీరే శెలవు పెట్టి మీ అమ్మగారిని చూసుకోండి. ' అని సమాధానమిచ్చి.. వంటింట్లో కెళ్ళిపోయింది నీరజ.

చేసేదిలేక.. శ్రీధర్.. తల్లిని చూసుకోవడానికి ఆఫీసుకు శెలవుపెట్టి.. పై నున్న.. పంకజాక్షి సాయంతో.. తల్లి సంరక్షణ చూసుకున్నాడు. ఆ వారం పది రోజులు పంకజాక్షే.. వర్ధనమ్మ గారి ఆలనా పాలనా చూసింది. ఇంట్లో.. వర్ధనమ్మ గారు.. ఎంత అనాదరణకు గురవుతోందో.. ప్రత్యక్షంగా చూసింది. ఆవిడ దయనీయ స్ధితి గురించి.. భర్త వామనరావుకు కూడా.. ఉన్న పరిస్థితి వివరంగా తెలియపర్చింది.

జ్వరం కాస్త కుదుట పడ్డాక.. ఆఫీసుకు వెళ్తూ.. తల్లి పూర్తిగా.. కోరుకునే వరకూ.. కాస్త కనిపెట్టి చూస్తూ ఉండమని.. వామనరావు దంపతులకు బాధ్యత అప్పచెప్పి.. వెళ్ళాడు శ్రీధర్.

అదే సంధర్భంలో.. వామనరావు.. వర్ధనమ్మ గారి స్థితి గతుల్ని పూర్తిగా తెలుసుకున్నాడు. ' ఇక మీదట ఇంట్లో.. పనులు కొన్నిటిని.. కోడలికి అప్పజెప్పి.. కొంత విశ్రాంతి తీసుకోండి.. పిన్నిగారూ! '.. అంటూ.. సలహ ఇచ్చాడు.


ఆ వారం పది రోజుల ఇంటి పనికే.. చాలా సతమత మయ్యంది నీరజ. ఇంట్లో పని, ఆఫీసు పని.. రెండూ మేనేజ్ చేయడం.. ఇంటి పని అలవాటు లేని.. తన వల్ల కాదని.. అర్ధమైపోయింది. ఇకపై.. అత్తగారు తనకు.. మునపటిలా.. ఇంటి సాయమంతా.. చెయ్యగలరన్న నమ్మకం సడలింది. చురుగ్గా ఆలోచించడం మొదలుపెట్టింది. వెంటనే.. ఊళ్లో ఉన్న.. తల్లి సావిత్రమ్మకు ఫోను చేసి.. తన గోడు వెళ్ళబోసుకుంది.


' అమ్మా!.. ఇక్కడ.. మా అత్తగారు మంచం పట్టడంతో.. నాకు.. ఆఫీసు పనితో పాటు.. ఇంటి పని కూడా.. చేసుకోవడం.. చాలా కష్టమవుతోంది. ఇక ముందు.. మా అత్తగారు మునపటిలా.. ఇంటి పనంతా సముదాయించుకు పోగలుగుతారని అనిపించట్లేదు. నువ్వొచ్చి.. సాయంగా నా దగ్గరుంటే.. నాకు అన్ని విధాలా బాగుంటుంది… ఏమంటావ్? ' అంటూ.. గుక్క తిప్పుకోకుండా.. ఊదరగొట్టింది.


' సరేలేవే.. అలాగే!.. కానీ.. మీ అత్తగారుండగా.. నేను వచ్చి.. ఇల్లు చక్కబెట్టడం ఎలా కుదురుతుందే?.. ' అంటూ… అడ్డు పుల్ల వేసింది సావిత్రమ్మ గారు.


అందుకు.. ఏం చెయ్యాలా అని.. మళ్లీ.. మంత్రాంగం ఆలోచించడం.. మొదలు పెట్టింది నీరజ.


వర్ధనమ్మగారు జ్వరం నుంచి కోలుకున్నప్పటికీ.. పూర్వపు జవసత్వాలు కూడగట్టుకోలేక పోయింది. మునపటిలా.. అన్ని పనులూ చేయలేక.. వామనరావు సలహా ప్రకారం.. కోడలు, కొడుకుతో.. తన ఓపిక విషయం విడమరిచి చెప్పి.. వంటిల్లు బాధ్యత.. సగం విరమించు కుంది.


అలా.. పదిహేను రోజులు గడిచిన తర్వాత.. కొత్తగా మీద పడ్డ.. ఇంటి శ్రమకు ఓపలేక.. ఒకరోజు భర్త శ్రీనాధ్ తో విషయం.. ప్రస్తావన లేవనెత్తింది.


' చూడండీ!.. మీరు మరోలా అనుకోనంటే.. ఒక మాట!.. మీ అమ్మగారు.. మునపటిలా.. ఆరోగ్యంగా లేరు.. మనమా.. ఇద్దరం పగలంతా ఆఫీసుల్లో ఉంటాం.. మొన్నటిలా.. హఠాత్తుగా.. ఏ అవాంతరమైనా వస్తే.. ఆవిడను.. ఇంట్లో కనిపెట్టి చూసుకునే వారెవరు?!.. పైగా.. ఇక.. ముందు ముందు ఆవిడ.. నిత్యావసరాలు, సదుపాయాలు చూడటం.. ఆఫీసులకు పోయే మనవల్ల ఏమవుతుందీ!?.. మొన్ననే.. మా కొలీగ్ చెప్పింది.. సిటీ లోనే ఉన్న ' ప్రణామం ' ఆశ్రమంలో… సీనియర్ సిటిజన్సుకు అవసరమయ్యే అన్ని వసతులతో ఏర్పాట్లు ఉన్నాయట. మనం ఒకసారి వెళ్లి చూసి.. వాకబు చేస్తే బాగుంటుందేమో.. ఆలోచించండి!.. ఏమంటారు? ' అంటూ.. సలహాలా విషయం.. ప్రస్తావించింది నీరజ.


' ఇప్పటికిప్పుడు ఏం జరిగిందని.. ఈ ప్రస్తావన?.. సమస్య ఎదురైనప్పుడు ఆలోచిద్దాంలే! ' అని దాటేసాడు శ్రీధర్.


' అలాగే అయితే.. రేపు.. ఏదైనా సమస్య ఎదురై.. తీవ్రమైనప్పుడు.. నన్ను.. ఏ విధంగానూ తప్పు పట్టనని మాటీయండి!.. నా పూచీ ఏం లేదు!.. ఆపైన అంతా మీ ఇష్టం!.. ' అంటూ రుసరుసలాడుతూ వెనుతిరిగింది నీరజ.


అప్పటికి బింకంగా.. సంభాషణ ముగించాడే కానీ.. చివరకు.. సమస్య మిగిలేది.. తనకే నని తెలుసు కాబట్టి.. భార్య చెప్పిన విషయమై.. ధీర్ఘంగా ఆలోచించక తప్ప లేదు శ్రీధర్ కు. ఇద్దరూ ఆఫీసులకు వెళ్ళడంతో తల్లి సంరక్షణ.. జఠిలమౌతున్న మాట కూడా వాస్తవం! ఈ విషయంలో.. భార్య నీరజ సహకారం కూడా.. అంతంత మాత్రమే!. తను.. పూనుకుందామన్నా.. తన వల్ల కావటం లేదు!.. భార్య తోడు లేనిదే!.. తానొక్కడూ ఏం చెయ్యాలన్నా.. వీలు కాదనిపిస్తోంది! ఇలా.. సాగిన ఆలోచనలతో.. చివరకు.. భార్య చెప్పిన… ' ప్రణామం ' వ్యవస్థ.. వివరాలు తెలుసుకోడానికే.. మొగ్గు చూపాడు.


ఒక శెలవు రోజున.. భార్యాభర్తలు ఇద్దరూ వెళ్లి… వివరాలన్నీ తెలుసుకున్నారు! హోదాకు తగ్గట్టుగా.. సింగిల్, డబుల్, కపుల్ ఎకామడేషన్లతో… అన్ని ఇండిపెండెంటు వసతులతో.. ఆహ్లాదకరమైన.. వాతావరణంలో.. విశ్రాంత జీవులు కోరుకునే.. అన్ని ఏర్పాట్లు, సౌకర్యాలతో.. నడుపుతున్నారని, .. తెలుసుకొని, .. ఆరోగ్య పరమైన అన్ని జాగర్తలతో.. మూడుపూట్లా.. భోజన ఏర్పాట్లనన్నిటినీ, . అన్ని విషయాలు, సదుపాయాలూ.. స్వయంగా పరీక్షించి… సంతృప్తి చెంది.. సమీప స్థలమేననీ, .. వీలయినప్పుడల్లా రాగల వీలేననీ భావించి.. ఎడ్మిషను నిర్ధారించుకొని.. ఇంటికి చేరారు.


ఇంట్లో.. కొడుకూ, కోడలూ వెళ్ళొచ్చిన విశేషాలు చర్చించుకుంటూ.. తన ప్రసక్తీ, .. తన నెలనెలా వచ్చే పెన్షను అందుకు సరిపోతుందని.. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయనీ.. తోటి వయసువారితో కాలక్షేపం కూడా సరదాగానే గడుస్తుందని.. ఏదేదో ముచ్చటించు కుంటుంటే.. చూచాయగా విని.. తన గురించే ఏదో ప్రయత్నం చేస్తున్నారని గ్రహించింది వర్ధనమ్మగారు. కనీసం.. తనతో సంప్రదించకుండా.. తనగురించి అలా చర్చించు కోవడం ఏమిటో.. అర్ధంకాక, ఉండబట్టలేక..

' ఏంట్రా?.. ఆ.. తర్జనభర్జనలూ.. ' అంటూ నిలదీసింది కొడుకును.


' అవునమ్మా!.. నీ గురించే!.. మే మిద్దరం ఆఫీసులకు వెళ్తుంటే.. నీ సంరక్షణ.. ఎలాగా?.. ' అంటూ… ఆఫీసుకు వెళ్లిపోయాడు శ్రీధర్.


వారి ఆలోచన కొద్దికొద్దిగా చూచాయగా.. అర్ధమౌతోంది.. వర్ధనమ్మగారికి. దుఃఖం ముంచుకొచ్చింది!... ఇన్నాళ్ళకు.. కొడుకు.. తన్నిలా.. సమస్యగా భావిస్తున్నందుకు!

భర్త ఎప్పుడూ.. ఎన్నోసార్లు చెప్పుతూ వచ్చిన భరోసా విషయం గుర్తుకొచ్చి… దిగులుతో మనసులో గుబులు పుట్టుకొచ్చింది. ఆలోచన చురుగ్గా సాగి.. పైన వామనరావుకు విషయం చెప్పి…విచారంగా ఏమిటీ సలహా అని సంప్రదించింది.


విషయం గ్రహించిన వామనరావు.. ' మీరేం ఖంగారు పడకండి పిన్నిగారూ!.. మీ ఇష్టానికి విరుద్ధంగా ఏమీ జరగదు. ఈ ఇల్లు మీది!.. స్వేచ్ఛగా ఇంట్లో జీవించే అధికారం మీకుంది! మీ ఇంట్లో.. జరుగుతున్న వ్యవహారం.. పంకజాక్షి ద్వారా.. కొద్దిగా తెలుస్తూనే ఉంది! మీ సహకారంతోనే మీ వాళ్ళు మీతో ఉండ గలుగుతారు! మీతో సహకరించనప్పుడు.. వాళ్ళనే బయటకు వెళ్ళమనండి! అలా.. కొంతకాలం దూరం ఉంచితే కానీ.. విలువలు భోధపడవు! ఈ సారి.. విషయం కదిపినప్పుడు.. ఖరాఖండీగా మీ అభిప్రాయం.. నిక్కచ్చిగా చెప్పెయ్యండి.. మీ వాళ్ళతో! మీరు నిశ్చింతగా.. ఉండండి!.. పిన్నిగారూ!.. మీకు అండగా, .. తోడుగా.. మేమున్నాంగా! ' అంటూ.. ధైర్యం చెప్పి.. పంపాడు లాయర్ వామనరావు.


వారాంతం శెలవు రోజున.. భార్యాభర్తలిద్దరూ వర్ధనమ్మ గారిని.. ' ప్రమాణం ' సదనంలో.. చేర్చటానికి సన్నధ్ధమయ్యారు.

శ్రీధర్.. తల్లి దగ్గరకు వచ్చి.. ఉపోద్ఘాతంగా.. ' అమ్మా!.. నీ బట్టలు సర్దుకో!.. ఈ రోజు.. నిన్నో చోటుకు తీసుకు వెళ్తాం!.. అక్కడ నీకు.. ఒంటరితనం ఉండదు!.. నీకు అన్ని సదుపాయాలు ఉంటాయి!.. పూర్తిగా విశ్రాంతి తీసుకోవచ్చు!.. నీ వయసువారు.. నీకు తోడుగా ఉంటారు.. కాలక్షేపానికి!.. ' అంటూ.. విషయం బయట పెట్టాడు.


' అంటే!.. నన్ను.. ఈ ఇంటి నుంచి.. పంపించి.. వేరు చెయ్యాలనుకుంటున్నారా?.. ఈ ఇల్లు.. మీ నాన్న ఎంతో కష్టపడి.. సంపాదన పొదుపు చేసి.. మా భావి విశ్రాంత జీవనం.. సోంత ఇంట్లో.. చివరి వరకూ.. ఏ చీకూ చింతా లేకుండా.. సాగిపోవాలనే భావనతో.. కూడబెట్టి.. అంచెలంచెలుగా కట్టిన.. గూడురా ఇదీ!


ఇక్కడే.. మా ఆనందమయ జీవనం.. ఇన్నాళ్ళూ గడిచింది.. తోడూనీడగా! ఇక.. ఒంటరితనం అంటావా.. మీ నాన్నగారు.. కాలం చేసినప్పుడే.. నేను ఒంటరి దాన్నయ్యాను! ఆ తర్వాత.. ఇన్నాళ్ళుగా.. ఆయన మిగిల్చిన జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ.. ఒంటరి జీవితానికే అలవాటు పడ్డాను! ఈ ఇంటితో నా అనుబంధం విడదీయరానిది! నా జీవితం ఇక్కడే ఇలా.. గడిచి పోవలసిందే! అదే.. దంపతులుగా మేము ఆశ పడ్డది.. కలలు కన్నదీను!... అందుచేత నన్ను.. ఈ ఇంటి నుంచి ఎక్కడికో.. తరలించే ప్రయత్నం.. కుదరదు! అందుకు.. నేను.. ఎప్పటికీ.. ఎన్నడూ.. సుతరామూ.. ఇష్ట పడను.


నాతో.. సంప్రదించకుండా.. ఈ ఆలోచన చేయడం… మీరు చేసిన.. క్షమించరాని నేరం! ఈ ఇల్లు నాది.. ఈ ఇంట్లో… నేను సర్వ స్వతంత్రురాలిని!.. నేనిక్కడ.. ఏ చీకూ చింతా లేకుండా.. నా బ్రతుకు నేను.. ప్రస్తుతానికి.. స్వతంత్రంగా జీవించగలను!.. అందుకు నేను సిధ్ధంగానే ఉన్నాను.. ఏ కష్టాని కయినా సరే!..


బాధ్యతలెరగని.. మీతో కలిసుండి.. ఇన్నాళ్ళూ నాకు కలిగిన ప్రయోజనం ఏమిటీ?!.. దూరంగా ఉంటేనే.. విలువలు తెలిసొస్తాయి!.. మమకారాలు, అభిమానాలు బలపడతాయి!!

వెంటనే.. మీరు వేరే ఇల్లు చూసుకొని.. వీలయినంత త్వరలో.. వేరు కాపురానికి.. మీరే.. వెళ్ళండి! ' అంటూ.. ఆక్రోశంగా.. ఆవేశంగా.. తన వ్యధనంతా… తీవ్రంగా.. వెళ్ళగక్కింది వర్ధనమ్మ గారు.


అనుకోని వర్ధనమ్మ గారి ఈ ప్రతిస్పందన కు… కొడుకూ కోడలూ.. కాసేపు మాటలు రాని నిశ్చేష్టులయ్యారు!


వెంటనే.. తేరుకుని… ముందున్న ఆర్థిక కష్టనష్టాలు బేరీజు వేసుకుని.. వర్ధనమ్మ గారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో …


' అమ్మా! నీ ఒంటరితనం, .. నీ సంరక్షణ.. కోసమే.. అలా చేద్దామనుకున్నాం!.. కాదంటే.. నీ ఇష్టం!.. కానీ.. ఉన్నపళంగా.. వేరింటి కాపురం అంటే.. చాలా కష్టం, ఖర్చూ.. కదమ్మా!.. ఈసారికి.. మా తప్పు క్షమించు! ' అంటూ.. ప్రాధేయ పడ్డాడు శ్రీధర్.


కోడలు కూడా.. ' అత్తయ్యగారూ!.. మీరేగా మా పెద్ద దిక్కు!.. మీ తోడేగా.. మాకు కొండంత అండ!.. మా మీద ఇలా.. కోపగించు కోకండి.. ' అంటూ.. అనునయంగా.. మాట్లాడ బోయింది.. నీరజ.


' అదేం కాదు.. నాకు.. మీ మీద ఎలాంటి కోపం, ద్వేషం లేవు! ఎవ్వరికీ జీవితం.. వడ్డించిన విస్తరి కాకూడదు.. మీ నాన్న.. ఎలా జాగర్తగా జీవితం సాగించారో… అలాగే.. మీరూ.. స్వయంగా.. మీ సామ్రాజ్యాన్ని.. స్వయంకృషితో విస్తరించుకోండి! అప్పుడే.. మీ మీ సామర్ధ్యాలు బయటపడతాయి.. జీవితంలో విలువలపై.. నమ్మకమూ పెరుగుతుంది! నా మాట మీద.. గౌరవం ఉంచి.. నేను చెప్పింది పాటించండి. ' అని.. ఖరాఖండీగా.. తన నిర్ణయం.. తేల్చి చెప్పేసింది.. వర్ధనమ్మ గారు.


ఇక చేసేదేమీ లేక.. తల్లి పట్టింపు తెలిసిన శ్రీధర్ కు.. దగ్గరలోనే వేరే సింగిల్ బెడ్ రూము ఎపార్టుమెంటుకు.. కాపురం మార్చక తప్పలేదు! చిన్న వసతి కావటంతో.. సరోజకు.. సాయానికై.. తన తల్లిని తోడు తెచ్చుకోవడమూ కుదరలేదు! సంసార బాధ్యతలు పూర్తిగా ఒంటరిగా.. సంభాళించుకోకనూ.. తప్ప లేదు.


దంపతులకు.. ఆర్ధికంగా.. పొదుపు పాటించటం కూడా.. అనివార్యమయ్యింది. ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తూ.. తమకై.. స్వంతానికి.. ఒక మంచి ఎపార్టుమెంటు కూడా.. బుక్ చేసుకున్నారు! బాధ్యత మీదపడడంతో నీరజకు కూడా.. ఒళ్ళొంచి ఇంటిని చక్కబెట్టుకోవడం.. క్రమక్రమంగా.. అలవాటయ్యింది. స్వేచ్ఛను అనుభవిస్తూ.. అన్యోన్యంగా దంపతులిద్దరూ సంసార భారాన్ని పంచుకుంటూ.. కులాసాగానే.. కాలక్షేపం సాగిస్తున్నారు.


వయసుతో పాటు.. మోసే బరువు భాధ్యతలు కూడా.. కుటుంబాల్లో.. కాలానుగుణంగా.. సంస్కారం, సాంప్రదాయ విలువల పట్ల.. ఆసక్తిని, అనురక్తిని.. పెంచి.. అనుబంధాల్ని బలపరుస్తాయనటానికి నిదర్శనంగా… శ్రీధర్, నీరజలు కూడా.. తరచూ.. వీలయినప్పుడల్లా.. వర్ధనమ్మ గారిని కలుస్తూ.. ఆవిడ అవసరాలు తీరుస్తూ.. ఆప్యాయంగా మెలుగుతున్నారు. వారాంతపు శెలవల్లో.. వర్ధనమ్మగారు చేసిపెట్టే.. వంటల రుచులు ఆస్వాదిస్తూ ముచ్చటగా.. సమయం సంతోషంగా గడిచిపోతోంది.. వారందరికీ.

వర్ధనమ్మగారికి కూడా.. తగినంత విశ్రాంతితో.. ఊరటగానే.. ఆనందంగానే రోజులు గడుస్తున్నాయి. కలిసి లేరన్న మాటే గాని.. అనుభూతుల విషయంలో.. మునపటికంటే.. మంచిగా, ప్రశాంతంగా సుఖంగానే.. జీవిస్తున్నారా కుటుంబ సభ్యులంతా! వర్ధనమ్మ గారు కూడా.. తన ఒంటరి విశ్రాంతి జీవితం.. ఆధ్యాత్మిక భావనలతో.. ప్రశాంతిగా జీవనం.. శాంతిగా సాగిస్తున్నారు!

ఆవిడ తీసుకున్న నిర్ణయం.. ఆశించిన విధంగా.. సరైన ఫలితాల్నే ఇచ్చింది.. వారి భావి జీవితాలకు!


సమాప్తం


గోపరాజు వెంకట సూర్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

ముందుగా మన తెలుగు కలు.కామ్ నిర్వాహకులకు నమస్కారం, అభినందనలు. మీరు తెలుగు కలను, కకులను ప్రోత్సహిస్తున్న తీరు ఈ మధ్యనే తెలిసింది!

నా పేరు: గోపరాజు వెంకట సూర్యనారాయణ, తల్లిదండ్రులు: గోపరాజు కృష్ణమూర్తి, అనసూయ దంపతులు. నివాసం: కూకట్ పల్లి, హైదరాబాదు.

వృత్తి రీత్యా M.Tech. Machine design చదివిన నేను, HMT Hyd. లో, దాదాపు ముప్పై ఏళ్ళు పైన పనిచేసి డిప్యూటీ జనరల్ మేనేజరు స్థాయిలో వాలంటరీ పదవీ విరమణ చేసిన ఇంజనీరును.

ఆ తర్వాత పేరున్న విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ప్రొఫెసర్ గానూ, మరికొన్ని ఇంజనీరింగు సంస్థల్లో డిజైన్ కన్సల్టెంటు గానూ పనిచేసిన అనుభవం.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ ను. స్వతహాగా సాహిత్యాభిమానిని, కళాభిమానిని. కలంటే బాగా ఇష్టపడతాను. ఈ మధ్యనే, రిటైర్మెంట్ తర్వాత స్వీయరచనా వ్యాసాంగానికి, స్వీయ పెయింటింగ్సు వేయడానికి సాహసిస్తున్నాను. పలు అంతర్జాల సమూహలకు, సంకలనాలకు కవితలు, చిన్నగా కలు రాస్తున్నాను, ప్రచురిస్తున్నారు, అభినందిస్తున్నారు!



5 Comments


Very emotional and nice lesson...chaala bavundhi katha. --Sri Jonnalagedda Subharaj from USA

Like
vsgoparaju
Dec 14, 2023
Replying to

Thanks for the comments.

Like

Well written story in clean and sweet Telugu. Alternative endings are possible which is true for most stories.

Please continue to share more stories written by you. -Sri Venkat Yellapragada of 🇺🇸 (USA)

Like
vsgoparaju
Dec 14, 2023
Replying to

Thank you very much for the comments.

Like

sudershanap44
Sep 27, 2023

కథ వాస్తవానికి దగ్గరగా ఉన్నది-అభినందనలు.

Like
bottom of page