top of page

ఒక తండ్రి కథ

#OkaThandriKatha, #ఒకతండ్రికథ, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguStory, #తెలుగుకథ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Oka Thandri Katha - New Telugu Story Written By - Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 19/03/2025

ఒక తండ్రి కథతెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


’కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతింబొందరే?

వారేరీ? సిరి మూట గట్టుకొని పోవంజాలిరే? భూమిపై

పేరైనం గలదే? శిబి ప్రముఖులున్‌ ప్రీతిన్‌ యశఃకాములై 

యీరే కోర్కెలు? వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా!!’


“దినకరా, శుభకరా, నమస్సుమాంజలి” స్నానం చేసి దినకరునికి నమస్కరించాడు. 


అంజయ్య.. వారిపేరు, డెభ్భైఆరు సంవత్సరాల వయస్సు. అర్థాంగి అనసూయ, డెభ్భై సంవత్సరాలు. 


కొడుకు మహేష్ ఇంజనీరు. ఎ. ఇ ఎలట్రికల్ డిపార్టుమెంట్. మహేష్ అర్థాంగి కోమలి. కలెక్టర్ ఆఫీసులో యు. డి. సి. వారికి ఇద్దరు సంతానం. ప్రేమ పన్నెండు సంవత్సరాలు, రఘు చిన్నవాడు పది సంవత్సరాలు. ఆరవ తరగతి, ఐదవ తరగతి చదువుతున్నారు. కోమలికి అత్తమామలంటే ఇష్టం లేదు. 


కానీ.. మహేష్‍కు తన తల్లితండ్రులను తనతోనే వుంచుకొని వారిని వయస్సు మీరిన ఆ వయస్సులో బాగా ప్రీతిగా చూచుకోవాలనే ఆశ. కానీ, అర్థాంగి కోమలి తత్త్వం దానికి పూర్తి విరుద్ధం. ఉద్యోగరీత్యా మహేష్ సొంత వూర్లోనే కొంతకాలం వివాహం అయిన తరువాత ఉన్నాడు. 


మహేష్‍కు కోమలికి వివాహం జరిగిన ఆరుమాసాలకు, కోమలికి ఉద్యోగం వచ్చింది. జిల్లా నగరంలోని కలెక్టర్ ఆఫీసులో ఎల్. డి. సి గా. 


ఆరునెలల కాలం ఉదయం ఎనిమిదిన్నరకు బయలుదేరి బస్సులో జిల్లా నగరానికి చేరి, ఉద్యోగాన్ని నిర్వహించి సాయంత్రం ఆరున్నరకు బస్సులో గ్రామానికి బయలుదేరి ఏడున్నరకల్లా ఇంటికి చేరేది. ఇంటి పనులన్నీ అనసూయమ్మ చేసేది. గర్భవతి అయిన కోడలిని చూచిన అనసూయమ్మ దంపతులు బస్సులో ప్రతిరోజూ జిల్లా నగరానికి పోయి రావడం శ్రమ అని భావించి జిల్లా నగరంలో ఇల్లు చూచి కొడుకు కోడలిని అక్కడ చేర్చారు. మహేష్ తన పై అధికారులతో మాట్లాడి తానూ జిల్లా నగర ఉద్యోగిగా మారిపోయాడు. 


ఆ కుటుంబ సభ్యుల మధ్యన పది సంవత్సరాలు ప్రశాంతంగా సాగిపోయాయి. ఇద్దరు పిల్లలు కలిగారు. అందరికి ఆనందం. ఈ ప్రపంచంలో ఏదీ ఎవరి విషయంలోనూ శాశ్వతం కాదు. మార్పు ప్రకృతికి, మనుషులకు సహజం. 


ఒకనాటి రాత్రి ఏకాంత సమయంలో కోమలి భర్తతో.. 

"ఏమండీ!.. "


"ఆ.. చెప్పు!"


"ఈ లేఅవుట్ చూడండి.. " ఒక ప్లాన్ను చూపించింది. మహేష్ ఆ ప్లాన్ను చూచాడు. 


"బాగుంది" అన్నాడు. 


"మనం ఈ లేఅవుట్‍లో రెండు ప్లాట్లు కొనాలండి. "


"ఎందుకు?"


"మన పిల్లల కోసం"


"ఊర్లో అంత పెద్ద ఇల్లు, వేపచెట్లు, కానగచెట్లు, తోట దొడ్డి అన్నీ సలక్షణంగా మనకు వున్నాయిగా!..

ఇవెందుకు?"


"చూడండి!.. మన పిల్లలు ఆ పల్లెటూరు వెళ్ళి ఆ గ్రామంలో ఏం చేస్తారు? వారి చదువులు, ఉద్యోగాలు నగరాల్లోనేగా!.. ఇప్పుడు మనం రెండు గ్రౌండ్లు కొన్నామంటే, పోను పోనూ వాటి వెల ఎక్కువవుతుంది. మనకు వసతి కలిగిన నాడు ప్రేమ, రఘులకు చేరొక ఇల్లు కట్టిద్దాం. భూమిమీద పెట్టిన డబ్బుకు ఎప్పటికి నష్టాలు రావు. "


"గ్రౌండ్ ఎంతట?"


"రెండు లక్షలు"


"అంటే రెండు గ్రౌండ్లు నాలుగు లక్షలన్నమాట!"


"అన్న మాట కాదు. వున్నమాటే!.. వూర్లో వున్నపొలాన్ని అమ్మి మనం ఈ లేఅవుట్‍లో రెండు మూడు గ్రౌండ్స్ కొందామండి. "


"పొలాన్ని అమ్మా!" ఆశ్చర్యపోయాడు మహేష్. 


"అవును.. మన దగ్గర అంత డబ్బు లేదుగా!.. భూమిని అమ్మాల్సిందే!.. "


"ఆ భూమి నుంచి వచ్చే పంట మా అమ్మా నాన్నలకు జీవనాధారం. దాన్ని అమ్మితే వారెలా బ్రతుకుతారు!" ఆశ్చర్యంతో అడిగాడు మహేష్. 


"మీరేం చేస్తారో నాకు తెలియదు. నాకు ఈ లేఅవుట్‍లో రెండు గ్రౌండ్లు కావాలి!.. " బుంగమూతితో చెప్పింది కోమలి. 


మహేష్.. తన పెండ్లి అయిన నాటినుంచీ చూస్తున్నాడు. కోమలి కోర్కెను తీర్చకపోతే, ఆమె ఏ విధంగా తన్ను హింసిస్తుందో అనుభవ పూర్వకంగా బాగా తెలిసికొన్నాడు. వాదన వలన ప్రయోజనం శూన్యం అని ఎరిగిన మహేష్. 


"సరే!.. వూరికి వెళ్ళి నాన్నగారితో మాట్లాడుతాను" అన్నాడు. 


"మాట్లాడ్డం కాదు భూమిని అమ్మి డబ్బు తీసుకొని రావాలి" గద్దించినట్లు చెప్పింది కోమలి. 


మహేష్ కళ్ళు మూసుకొని తలాడించాడు. కానీ మనస్సున.. ’ఆరంభం నుండి దీన్ని, దాని విపరీతపు కోర్కెలను, కాదంటే ఎక్కడ బాధ పడుతుందోనని, ప్రేమ, దయ, అభిమానంతో నేను చేసినవన్నీ ఆనందంగా అనుభవించడం అలవాటు అయినందున ఈనాడు నన్ను శాసిస్తూ ఉంది. 


ఆత్మాభిమానంతో ఇంటి ఆలుమగల గొడవలు. అయినవారికి, వీధి వారికి తెలియకుండా ఉండాలనే సద్భావంతో తన అన్ని కోర్కెలను కాదనలేక తీర్చవలసిన దుస్థితికి చేరాను. పైగా పిల్లలు ఎదిగారు. తనకు నేడు, నాకన్నా పిల్లల పట్ల అభిమానం ప్రేమ. అదే రీతిగా పిల్లలూ తల్లితోనే ఎంతో చనువుగా అభిమానంగా వర్తిస్తున్నారు. 


పరిస్థితి చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొంటే ఏం లాభం అనే సామెతగా నా విషయం మారిపోయింది. తప్పదు, వూరికి వెళ్ళి విషయాన్ని చెప్పి నాన్నను డబ్బు అడగాలి. దాన్ని ప్రసన్నం చేసుకొనేదానికి నేను ప్రశాంతంగా బ్రతికే దానికి వేరే మార్గం లేదు’ విచారంగా అనుకొన్నాడు మహేష్. 

*

"ఆహా!.. అదా విషయం?" కుమారుడు చెప్పినదంతా విని చివరగా ఆమాట అన్నాడు అంజయ్య. 


"అవును నాన్నా!"


"సరే!.. నీ ఇష్ట ప్రకారమే చేస్తాను" శూన్యంలోకి చూస్తూ, సాలోచనగా అన్నాడు అంజయ్య. 


మహేష్ ముఖం వికసిత కుసుమం అయింది. 

అంజయ్య తనకు వున్న ఎకరం పంట భూమిని అమ్మేశాడు. కొడుకు కోరినట్లుగా అతనికి ఐదులక్షలు ఇచ్చాడు. అతని చేతిలో మిగిలింది యాభైవేలు. 

మహేష్ ఆనందంగా జిల్లా నగరానికి బయలుదేరాడు. 

"ఏమండీ!" భార్య అనసూయ పలకరింపు. 


"ఏమిటి అనూ!"


"మీరు తొందరపడి.." ఆమె పూర్తి చేయకముందే.. 


"భూమిని విక్రయించానంటావా!" వ్యంగ్యంగా నవ్వాడు. 


"నేను ఆ పని చేయకపోతే, వాడికి, నాకు, నీకు అభిప్రాయ భేదం ఏర్పడేది. వాడిని నీ కోడలు అతి చులకనగా చూచేది. వాడి మనస్సున శాంతి లేకుండా పోయేది. మన ఇరువురం ఆఖరి రంగంలో నటిస్తున్నాము. ఎవరు ముందో, ఎవరు వెనుకో!.. కానీ నేను చేసిన అ పని వలన నాకు శాంతి లభించింది. మనం మనకున్నంతలో ఏనాడు వాడి కోర్కెను కాదనలేదు. అది నాకు నీకు తృప్తి. ఈ వయస్సున మనకు ఇంతకంటే మరేం కావాలి. అనూ!" ప్రాధేయపూర్వకంగా అడిగాడు అంజయ్య. 

తన భర్తను గురించి ఆలోచిస్తున్న అనసూయ మౌనంగా తలాడించింది. 

*

"అక్కా!.. " అది కోమలి సోదరుడు కోదండం పిలుపు. అక్కగారి ఇంటికి చుట్టపు చూపుగా వచ్చాడు కోదండం. తమ్ముని ప్రేమాభిమానాలతో అహ్వానించింది కోమలి. ఆ తమ్ముడంటే ఆమెకు ఎంతో ఇష్టం. స్నానానికి వేడినీళ్ళు ఏర్పాటు చేసి, టిఫిన్ కాఫీ ఇచ్చి సోదరుని ప్రీతిగా సత్కరించింది కోమలి. కడుపు నిండా తిని కోదండం మంచం ఎక్కాడు. 


సమయం సాయంత్రం ఆరున్నర. మహేష్ ఇంటికి వచ్చాడు. మ్యాటనీ షో ఆర్. ఆర్. ఆర్. కు వెళ్ళిన కోదండం సినిమా చూచి ఇంటికి వచ్చాడు. బావ మహేష్ ప్రీతిగా పలకరించాడు కోదండాన్ని. 

భార్యాభర్తలు బెడ్ రూములోనికి వెళ్ళారు. మహేష్ తాను తెచ్చిన డబ్బును కోమలికి ఇచ్చాడు. కోమలి ముఖం చాటంత అయింది. లెక్క చూచి డబ్బును బీరువాలో పెట్టింది. 


ఆ సన్నివేశాన్ని కోదండం చూచాడు. వాడి మనస్సుకు మైకం కమ్మింది. అర్థరాత్రి సమయంలో అక్కాబావలు గాఢనిద్రలో వున్న సమయంలో బీరువా తెరిచి, ఆ డబ్బును తీసుకొని పారిపోయాడు కోదండం. 


ఉదయం ఆరుగంటలకు లేచిన కోమలి తమ్ముడు పడుకొన్న మరో బెడ్ రూములోకి వెళ్ళి చూచింది. కోదండం మంచం పైన లేడు. అతని హ్యాండ్ బ్యాగ్ లేదు. ఇల్లంతా కోదండం కోసం వెదికింది. మనస్సున ఠక్కున అనుమానం. బీరువాను తెరిచి చూచింది. ఐదు లక్షలు మాయం. 

నిద్రపోతున్న మహేష్‍ను లేపింది. విషయాన్ని చెప్పింది. భోరున ఏడుస్తూ. 


తన అత్తామామలకు ఫోన్ చేశాడు మహేష్. వారు కోదండం వూరికి రాలేదని చెప్పారు. 

భోరున ఏడుస్తూ కోమలి నేల కూలింది. మహేష్ నటనగా కోమలిని ఓదార్చాడు. కానీ అతని మనస్సున కూడా ఎంతో బాధ. ఒకటా రెండా ఐదు లక్షలు. అతనికి తెలియకుండానే అతని కళ్ళనుండి నీరు కారాయి. 


’భూమిని అమ్మేటప్పుడు నా తండ్రి ఎంతగా బాధపడ్డాడో!’ అనుకొన్నాడు. 


కోమలి కలలు కరిగిపోయాయి. ఇరువురు మిత్రులుతో కలిసి కోదండం థాయిలాండ్ వెళ్ళిపోయాడు. అది అతని చిరకాల వాంఛ. 


కోమలి అమ్మగారి వూరికి వెళ్ళి తన తమ్ముడు చేసిన నిర్వాకాన్ని గురించి తల్లిదండ్రులకు చెప్పింది. వారూ ఎంతగానో విచారపడ్డారు. ఆనోటా ఈనోటా పడి ఆ వార్త అంజయ్య, అనసూయలకు తెలిసింది. 


కోమలి భర్త మహేష్‍తో.. 

"మీ తండ్రిగారు అయిష్టంగా మీకు ఇచ్చిన ఈ పాపిష్టి డబ్బు మనకు ఉపయోగం లేకుండా పరుల పాలైంది. ఎవరైనా సరే చేసే పని హృదయపూర్వకంగా మంచి మనస్సుతో చేయాలి. ద్వేషంతో చేయకూడదు" అంది ఆవేశంగా. 


తన తండ్రిని గురించి కోమలి చేసిన వ్యాఖ్యానం మహేష్‍కు నచ్చలేదు. కానీ.. అతను కోమలి నోటికి జడిసి మౌనంగా వుండిపోయాడు. 

*

అనారోగ్య కారణంగా అనసూయ మంచం పట్టింది. 


"అనూ!.. " ప్రీతిగా ఆమె ముఖంలోకి చూస్తూ.. "నీ మనస్సున ఏదైనా కోరిక ఉందా!" మెల్లగా అడిగాడు అంజయ్య. వారి కన్నీళ్ళు అనసూయ ముఖంలో పడ్డాయి. 


మెల్లగా కళ్ళు తెరిచింది అనసూయ. చూపును నిలిపి చూడలేకపోతూ ఉంది. అవి ఆమె జీవితం అంతిమ క్షణాలు. తనలోని శక్తిని అంతా కూడగట్టుకొని నిలపలేని కళ్ళతో.. 

"మీ.. రు.. మీ.. రు.. నన్ను.. వ.. ద.. లి.. పో.. " అనగలిగింది. తల ఒరిగిపోయింది. జీవం గగనానికి ఎగిరింది. 


అంజయ్య భోరున ఏడుస్తూ ఆమె తలకు తన తలను చేర్చాడు. వారి ఏడుపును విన్న ఇరుగు పొరుగు వారు పరుగున ఆ ఇంట్లో ప్రవేశించారు. వారందరికీ అనసూయ అంతిమ యాత్రకు సిద్ధం అయిందన్న విషయం అర్థం అయింది. చాప పరిచి మంచంపై నున్న అనసూయమ్మను క్రింద పడుకోబెట్టారు. ఒక యువకుడు, మహేష్ మిత్రుడు రాజా అతనికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. రాజా అంజయ్యకు అభిమాన పుత్రుడు. 


ఆ రోజు కోమలి సోదరి నిశ్చితార్థం.. 


"ఆ ముసలిది ఇప్పుడే చావాలా!.. " వార్తను విన్న కోమలి ఆవేశంగా అంది. మహేష్ ముఖం చిన్నబోయింది. కన్నీళ్ళతో కోమలి ముందు నుండి తప్పుకొని, తన వూరికి బస్సు బయలుదేరాడు. 

బస్సుకు యాక్సిడెంట్ జరిగింది. దాదాపు పదిమంది తీవ్రగాయాలతో హాస్పిటల్ పాలైనారు. అందులో మహేష్ ఒకడు. కోమలి మాటను నిర్లక్ష్యం చేసి బయలుదేరాడు. ఆ మహాసాధ్వి అతన్ని గురించి ఏమనుకొందో!.. అతని స్థితి అలా మారింది. 


సొంత కొడుకుగా అభిమానించిన మహేష్ స్నేహితుడు రాజా వారి కుటుంబ సభ్యుల సాయంతో తన భార్య అంత్యక్రియలు అంజయ్యే జరిపాడు. 


అంజయ్య, భార్య చనిపోకముందే ఇంటికి, స్థలాన్ని అమ్మాడు. త్వరలో నా ఇల్లాలు వెళ్ళపోబోతూ ఉంది. ఆమె అంత్యక్రియలు ముగిసిన నెలరోజుల తర్వాత ఇంటినీ, స్థలాన్నీ మీరు స్వాధీనం చేసుకోగలరని కొన్నవారికి చెప్పాడు. అంజయ్య వారికి చెప్పిన మాట ప్రకారమే జరిగింది. 


ఆ సొమ్ము విలువ ఆరులక్షలు.. 

"రాజా!"


"పెదనాన్నా!"


అతని ముందు సంచిలోని డబ్బును చూపి.. 

"ఇంటిని, స్థలాన్ని అమ్మేశాను. నీవు ఈ డబ్బును మహేశ్‍కు చేర్చిరా. " రాజా చేతికి డబ్బును ఇచ్చాడు అంజయ్య. 


రాజా నగరానికి వచ్చి విచారించి మహేష్‍ను హాస్పిటల్లో కలిశాడు. డబ్బును మహేశ్‍కు చూపించాడు. 

పరమానందంగా కోమలి డబ్బును అందుకొంది. 

రాజా గ్రామానికి తిరిగి వచ్చాడు. 

మహాలక్ష్మమ్మ గుడి మండపంలో జనం. జనాన్ని తప్పుకొని ముందుకు నడిచాడు రాజా.. 

అచేతనంగా అంజయ్య.. 


’రాత్రి పోయినట్టున్నాడు. మహానుభావుడు. ’ జనవాక్యం. 


రాజా వారి పిడిలో వున్న పేపర్‍ను తీశాడు. విప్పాడు. 

’నాయనా!.. రాజా!.. నా అంతిమయాత్రను సాగించవలసినవాడివి నీవేనయ్యా!’ అని వ్రాసి ఉంది. 


భోరున ఏడుస్తూ రాజా అంజయ్య ఎదపై వాలిపోయాడు. 


సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


 
 
 

Comments


bottom of page