top of page

ఒకరికి ఒకరై ఇద్దరు ఒక్కరై!

వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)


'Okariki Okarai Iddaru Okkarai' - New Telugu Story Written By Vijayasundar

Published In manatelugukathalu.com On 09/01/2024

'ఒకరికి ఒకరై ఇద్దరు ఒక్కరైతెలుగు కథ

రచన: విజయా సుందర్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



రుబ్బిన గోరింటాకు గిన్నె పక్కన పెట్టుకుని, ఆలోచనల్లో ఎటో వెళ్ళిపోయింది మృదుల.. 'అమ్మ చక్కగా రెండు చేతులకి బంతి, మాచిపత్రి ఆకులు వేసి ఎంత కళాత్మకంగా పెట్టేదో! ఇప్పడు నేను పెట్టుకుంటే ఒక్కచేతికే పెట్టుకోవాలి.. ఎలాగబ్బా?' దీర్ఘనిస్వాసం వెలువడింది. 


ఎప్పుడొచ్చాడో మోహన్, మృదుల మనసు గ్రహించినట్లే, ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని, గోరింటాకు ముద్ద చేతిలోకి తీసుకున్నాడు. మృదుల కళ్ళు ఆశ్చర్యంతో, ఆనందంతో కలువరేకులే అయ్యాయి!


భార్యకి గోరింటాకు పెట్టడమే తన తపస్సుగా అరచేతిలో అందంగా చందమామ, చుట్టూ నక్షత్రాల్లాగా తీర్చి దిద్దుతున్నాడు!


రెండు చేతులకి పెట్టేసి, "అమ్మ పెట్టినట్టు వచ్చిందా దేవీ?" అని అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకునే పూజారిలా అడుగుతుంటే, మృదుల తనను తానే మరచిపోయి, మనోహరంగా నవ్వి, భర్త భుజంమీద తల ఆన్చుకున్నది!


కొత్తగా పెళ్ళైన ఆ జంటని ఆషాఢం రాకముందే ఇటు పెద్ద వాళ్ళు, అటు పెద్ద వాళ్ళు వచ్చి మోహన్ ఉద్యోగపు ఊరు హైద్రాబాదులో దింపి వెళ్లారు. 


ఇద్దరూ ఇంజనీర్లు. మృదులకి కూడా హైదరాబాదులోనే ఒక స్టార్టప్ కంపెనీలో వచ్చింది ఉద్యోగం. ఇద్దరూ మంచి రోజుల్లో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేసి, ఇప్పుడు జాయినింగ్ టైం అవైల్ చేస్తున్నారు. 


జీవితం అందంగా మొదలు పెట్టారు.. ఆనందంగా తీర్చి దిద్దుకునే ప్రయత్నంలో ఉన్నారు. మోహన్ అందగాడు, సౌమ్యుడు, సరసుడు! అతనికి తగ్గట్లే మృదుల కూడా అందగత్తె, మృదు స్వభావి! ఇద్దరూ ఎగువ మధ్యతరగతి సాంప్రదాయ కుటుంబాల నేపథ్యం నుండి వచ్చారు. 

**

 ఇంట్లో నాయనమ్మ తాతల మడి, వచ్చేపోయే జనాభాతో సంస్థానంలా ఉండే ఇంట్లో, ఇరవై మూడేళ్ళ మృదులకి వంట చెయ్యాల్సిన అవసరం కలగలేదు. ఏదో కాస్త కాఫీ పెట్టడం, ఇంత ఉప్మా కలియబెట్టడం దాకా చెయ్యగలదు. 


మోహన్ తల్లి, తండ్రి ఇద్దరూ ఉద్యోగస్తులు కనక ఇంట్లో ఎప్పుడూ వంటమనిషి ఉండడంతో అతనికీ వంట అలవాటు లేదు. మరి ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని వచ్చేసారు.. ఆషాఢమాసపు అడ్డు వల్ల పెద్దవాళ్ళెవరూ ఉండే వీల్లేదు. 


ఇద్దరూ ఆఫీసుల్లో జాయినయ్యారు. 

ఇంట్లో కాఫీ తాగి తయారయ్యి, రోజుకో హోటల్లో టిఫిన్, భోజనం చేస్తున్నారు. కొత్తగా పెళ్లైన మోజులో ఆకలుండదు, దాహముండదుగా.. సత్రం భోజనమేమీ సతాయించట్లేదు. 


పదిహేనురోజులయ్యాయి.. కొద్దికొద్దిగా హోటల్ భోజనం విసుగొస్తున్నది. ఆ మాట గట్టిగా అనుకోవడానికి కూడా టైము లేనంత బిజీగా ఉన్నారు మోహన్, మృదుల తమ ఉద్యోగాల్లో. 


ఇద్దరి ఆఫీసులు దగ్గరగానే ఉండటంతో, ఇద్దరూ టైం ఫిక్స్ చేసుకుని, లంచ్ కి హోటల్ కి కలిసి వెళ్లటం అలవాటు చేసుకున్నారు. 


ఆరోజు మృదులకి లంచ్ టైంలో పని ఉండటంతో మోహన్ కి ఫోన్ చేసి చెప్పింది అతన్ని వెళ్ళమని, తాను తన కలీగ్ తో వెళ్తానని. 

**

ఆ రోజు సాయంత్రానికి కూడా పని పూర్తికాక మోహన్ కి చెప్పేసింది అతన్ని ఇంటికి వెళ్ళిపొమ్మని. మృదుల క్యాబ్ మాట్లాడుకుని, రాత్రి ఏడు దాటుతుండగా వచ్చింది ఇంటికి.. బెల్ కొడితే తలుపు తెరుచుకోలేదు. 'మెహన్ ఇంకా రాలేదేమిటో' అనుకుంటూ బ్యాగ్లోనుండి తాళం చెవి తీస్తుండగా ఫోన్ మ్రోగింది. 


"మృదూ! నాకు అనుకోకుండా బాగా లేట్ అయింది ఆఫీసులో.. వర్క్ కంప్లీట్ కావటానికి ఇంకా టైం పట్టేలా ఉన్నది. ఇక్కడే ఏదో తినేస్తాను" అంటూనే హడావిడిగా ఫోన్ పెట్టేసాడు మోహన్. 


నిస్త్రాణ గా లోపలికి వచ్చింది మృదుల. 

ఆకలి దంచేస్తున్నది ఆమెకి. మధ్యాహ్నం లంచ్ కూడా ఏమీ బాగుండక సరిగా తినలేదు. 'అవునూ మోహన్ తను అక్కడే తినేస్తానన్నాడు.. మరి నా సంగతేమిటి? రోజూ ఇద్దరం కలిసి దగ్గర్లో ఉన్న మెస్ లో ఏదో ఒక టిఫిన్ తినేవాళ్ళం కదా.. మరి ఇవాళ? తన సంగతి మాత్రమే చూసుకున్నాడు' మృదుల కళ్ళు నీటి చెలమలయ్యాయి. ఆకలి, ఉక్రోషంతో మనసంతా చేదు తిన్నట్లయింది!


'ఇదే అమ్మ అయితే తనింత ఆకలితో ఉంటే ముద్దలు కలిపి పెట్టేది. అమ్మా.. ' ఆకలికి ప్రేవులు గోలపెట్టేస్తున్నాయి ఏదన్నా ఆహారం ఇవ్వమని!


పోనీ ఏ ఉప్మానో చేసుకుందామన్నా అసలు ఇంట్లో ఏమీ తెప్పించడం లేదు కదా. పెళ్లి అయ్యాక మొదటిసారి, 'అబ్బా ఏం పెళ్లి బాబు, ఇంత స్వార్థమా ఆ మనిషికి?' అనుకున్నదే కానీ కొంచెం వంట నేర్చుకుని ఉంటే బాగుండేదని అనిపించలేదు. తల్లి, నాయనమ్మ శత పోరినా, "వంట చెయ్యాల్సిన అవసరం మాకేమీ రాదు.. ఇన్ని హోటళ్లు ఉండగా, ఇన్ని ఫుడ్ జాయింట్స్ ఉండగా" అని తను వాళ్ళ మాటలు కొట్టి పారేసిందని అసలే గుర్తు రాలేదు. 


'అవును స్విగ్గిలో ఆర్డర్ చేస్తే'.. అమ్మో మొన్ననేగా ఎవరో వాట్సాప్ లో పెట్టారు, ఆర్డర్ తెచ్చిన అతను, డబ్బులిస్తుండగా మత్తుమందున్న కర్చీఫ్ వాసన చూపి.. ' ఆ పైన జరిగింది గుర్తు చేసుకోవడానికే అదిరి పడ్డది! అంతే ఆ ఆలోచనకి ఫుల్స్టాప్. పళ్ళ కోసం చూస్తే ఒక ఎండిపోయిన దానిమ్మ కనిపించింది. అప్పుడు అది వలుచుకుని తినే ఓపిక లేక, కడుపులో కాళ్ళు పెట్టుకుని, మనసు నిండా మొగుడి స్వార్థానికి అనేక నిర్వచనాలు చెప్పుకుంటూ, పక్కమీద వాలింది. చాలా సేపు నిద్ర పట్టకపోయినా, అలసిన శరీరం ఎక్కువ సేపు మేలుకుని ఉండనోపక నిద్రకుపక్రమించింది. 

**

ప్లేట్ లో పెట్టిన రోటీ తుంచబోతున్న మోహన్ కి, 'అయ్యో మృదుల ఏమి తిన్నదో.. సరిగ్గా అప్పుడే తన టీం లీడర్ ఏదో అడుగుతుంటే, తను హడావిడిగా ఫోన్ పెట్టేసాడు. ప్చ్.. అసలు మామూలు టైంకే బైల్దేరుతుంటే, మర్నాడు ఫారిన్ డెలిగేట్స్ వస్తున్నారని సడెన్ గా తెలిసిందని, అందర్నీ ఆపేశారు. సిస్టమ్స్ చాలా ట్రబుల్ ఇవ్వడంతో ఆ టెన్షన్ లో.. అయ్యయ్యో మృదుల ఏమీ తిని ఉండదు పాపం' తుంచిన రొట్టె ముక్క పట్టుకుని ఆలోచిస్తున్న మోహన్ ని, అతని ఫ్రెండ్ రాహుల్, కుదిపి విషయమేమిటని అడిగితే మోహన్ చెప్పాడు. రాహుల్ ప్యూన్ ని పంపి రోటీ, కూర తెప్పించాడు. 

**

 మృదుల బుగ్గలమీద ఎండిపోయిన కన్నీటి చారికలు చూసిన మోహన్ చాలా బాధపడ్డాడు. మెల్లిగా భార్యని లేపి బుజ్జగించాడు, బోలెడు సారీలు చెప్పాడు. ఊహు అమ్మడు కరగదే.. మోహన్ కూడా చాలా అలిసిపోయి ఉన్నాడు. పరుషంగా రాబోయిన పలుకులని గొంతులోనే ఆపేసి తెచ్చిపెట్టుకున్న ఓర్పుతో బ్రతిమాలగా, లేచి ఒక్క రొట్టె తిన్నది మృదుల. 

మోహన్ మొదటిసారి అనుకున్నాడు, 'మృదుల కొద్దిగా వంట నేర్చుకుని ఉంటే బాగుండేది' అని. 'నేను కూడా ఆఫీసునుండి అలిసిపోయి వచ్చాను కదా, తనకి కోపమెందుకు రావాలి?' అని కూడా అనిపించింది. 


ఆరోజు పెళ్లయ్యాక, మొదటి సారి కలిసి కాక ఎవరికి వారు ఆలోచించుకోవడం, ఎదుటి వారిదే తప్పు అనుకోవటం.. అదే మొదలు!

**

పొద్దున్నే లేచిన మృదుల, డ్రెస్ చేంజ్ చేసుకోకుండా పడుకున్న భర్తని చూసి, 'పాపం ఎంత అలిసిపోతే అలాగే పడుకుండిపోయాడో కదా' అనుకున్నది. అంత అలసటలో తనని బ్రతిమాలి తినిపించటం గుర్తొచ్చి, పెదవుల మీద ఓ హాసరేఖ విరిసింది!


అప్పుడే లేసున్న మోహన్, భార్య నవ్వు మొహం చూసి రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. 

"అదేదో మాకూ చెప్తే మేమూ నవ్వుతాముగా" చేతులు చాస్తూ అన్నాడు. రాత్రి మిస్ అయిన మధురక్షణాలు ఆ ఉషోదయాన పంచుకున్నారా పడుచు జంట!


"ఇలా కుదరదు మోహన్, నేను మెల్లిగా వంట నేర్చుకుంటాను. " మృదుల మాట విన్న మోహన్ భయం నటిస్తూ"అమ్మో! మా అమ్మకి, నాన్నకి నేను ఒక్కడే పిల్లవాణ్ణి, మా అక్కకి ఒక్కడే తమ్ముణ్ణి. నాకు అంత ధైర్యం లేదు తల్లీ"అన్నాడు. 

"భలే చెపొచ్చావ్, అక్కడికి మేము పదిమందిమి అయినట్లు.. మా అన్నయ్య ఒక్కడే కదా నాకూను. సరే అదలా ఉంచు డియర్.. వంట రాకెట్ సైన్సా ఏమిటి? నేను యు ట్యూబ్లో చూసి నేర్చుకుంటాను. " మృదుల అల్టిమేటం పాస్ చేసేసింది!



తమిద్దరికీ కాఫీ కలుపుకుని వచ్చింది మృదుల. 

కాఫీ సిప్ చేసిన మోహన్, "కాఫీ చాలా బాగుందోయ్" అన్నాడు. మృదుల ప్రేమగా చిరునవ్వు నవ్వింది. 


అప్పుడే దేవుడికి దీపం పెట్టి వచ్చినట్లుంది, గాలిలో తేలి వస్తున్న సాంబ్రాణి వాసనలని ఆస్వాదిస్తూ మోహన్, "ఎలాగైనా వస్తువుల సెలెక్షన్ లో మీది మాంచి టేస్ట్ శ్రీమతిగారు" అన్నాడు. 

"ఏమిటో ఇవాళ శ్రీవారు నన్ను పొగడటమే పనిగా పెట్టుకున్నట్లున్నారే?" లోపల్లోపల మురిసిపోతూ అన్నది మృదుల. 


"అప్పుడప్పుడు ఇంటావిణ్ణి ఇలా ఖుశామత్ చెయ్యాలి. లేకపోతే రాత్రి లాంటి నిర్వీర్యమైన రాత్రులు తప్పవు" మోహన్ నవ్వుతూనే అన్నా, మృదులకి బాగానే అర్థమయింది, తాను కొంచెం ఓవర్గా బిహేవ్ చేసిందని! కళ్ళతోనే 'సారి'

 చెప్పింది. 

**

ఇద్దరూ యు ట్యూబ్ అంతా తిరగేసి, వాళ్లకి నచ్చిన వంటలు కొన్నిటిని కాపీ చేసుకున్నారు. ఆరోజు శనివారం సెలవ కావడంతో, దగ్గర్లో ఉన్న సూపర్ మార్కెట్ కి వెళ్లి కావాల్సిన సరుకులు తెచ్చుకున్నారు. 


మృదుల ఆరోజు మొదటి రోజు కదా అని పాయసం చేసింది. మోహన్ రెసిపీ చదువుతుంటే మృదుల చేసింది. కుక్కర్లో ఒట్టి పప్పు పెట్టాడు మోహన్. మృదుల నీళ్లు కొలిచి పొయ్యమని చెప్పేలోపలే కుక్కర్ ఎక్కించేశాడు. "ఎందుకు నీకింత తొందర?" ముద్దుగా విసుక్కుంటున్న మృదుల చెవి పట్టుకుని, "ఈ బుజ్జమ్మకి ఆకలేసేస్తుందేమోనని. " 

"ఇదిగో నువ్విలా అల్లరి చేస్తే ఇంక వంట అయినట్లే బాబూ. ఆ గిన్నెలో నీళ్లు తెచ్చివ్వు. "

"జీ హుజూర్" మోహన్ తెచ్చిన నీళ్లలో తరిగిన వంకాయ ముక్కలు వేసింది మృదుల. 

"తిరగమోతలో ఏమేమి వెయ్యాలి?" మసాలా పెట్టె ముందు పెట్టుకుని మల్లగుల్లాలు పడుతున్న భార్య తో మోహన్, "దీనికింత ఆలోచనేమిటీ? అన్నీ ఎందుకున్నాయి.. అంటే అన్నీ వెయ్యాలనే కదా". భర్త మాటకి తలూపి, 

మృదుల మెంతులుతో సహా అన్నీ ధారాళంగా వేసేసింది. 



రెండు మంచినీళ్ళ గ్లాసుల బియ్యం కడిగి, యు ట్యూబ్లో చూసి 5 గ్లాసులు నీళ్లు పోసింది.. 

" అదేమిటోయ్ అక్కడ ఒకటికి రెండు గ్లాసులే పొయ్యాలంటే నువ్వు 5 పోసావు?"

"మరదే.. నా తెలివితేటలు భర్తగారు. 

 సూపర్ మార్కెట్ లో ఇవి పాత బియ్యం అని చెప్పారు కదా. మా అమ్మ పాత బియ్యానికి నీళ్ళు ఎక్కువ పడతాయని చెప్పింది" మోహన్ మెచ్చుకోలుగా చూసాడు. హతవిధీ! వాళ్ళిద్దరికీ తెలియదుగా బియ్యం నోట్లో వేసుకుంటే గింజ గట్టిగా లేకపోతే కొత్తబియ్యమనీ, షాపబ్బాయి మోసం చేసాడనీను!


అన్నం కుక్కర్, పప్పు కుక్కర్ తెరిచారు.. అన్నం బొంబాయి, పప్పు చెన్నపట్నం పోతున్నాయి. వంకాయ కూర ముక్కలు గిడసబారిపోయున్నాయి! 


వంకాయ కూర కలిపి నోట్లో పెట్టుకున్న మోహన్ కెవ్వున కేక వెయ్యబోయి ' పాపం నా పెళ్ళాం' అనుకుని బలవంతంగా నోట్లోకి పంపించాడు.. మృదుల వైపు మెచ్చుకోలుగా చూస్తూ. మృదుల మాత్రం "అబ్బో చేదు కషాయం" అంటూ నోట్లోది చేతిలోకి తీసేసింది. పప్పులో ఉప్పెక్కువ అయింది. ఇంటినుండి తెచ్చుకున్న ఊరగాయ, కొనుక్కొచ్చిన పెరుగుతో, బేబీ స్పెషల్ అన్నం తో భోజనం అయిందనిపించారు. పాయసంలో సేమ్యా వేగకపోయినా, తీపి ఎక్కువయినా, దండిగా వేసిన జీడిపప్పు కిస్మిస్ కాస్త తినేట్లు చేసాయి. 

**

మరునాడు ఆదివారం నాడు కూడా సహకరించని తమ ప్రయోగాలతో అలసిపోయారు.. ఆకలి కడుపులతో అలమటించి పోయారు!


ఇంతలో మోహన్ వాళ్ళక్యాంటీన్ అతను కారియర్ ఫెసిలిటీ పెట్టాడు. నాలుగు రోజులు ఆ భోగం! ఆహా, ఓహో అనుకున్నారో లేదో.. క్యాంటీన్ నడుపుతున్న నర్సింహ, కారియర్ తెచ్చే వాళ్ళు సరిగ్గా లేక ఆఫీస్ టైంకి పంపలేకపోతున్నాడు. మళ్లీ మన యువదంపతుల కష్టాలు మొదలు. 


 మృదుల తల్లికి ఫోన్ చేసి, ముందు వంట నేర్చుకోనందుకు తిట్లు తిని, తల్లి చెప్పిన రెసిపీలు, సులువుగా వంట చేసే పద్దతులు భగవద్గీత విన్నంత శ్రద్ధగా విన్నది. 



కిందా మీదా పడి మృదుల ఇప్పుడు బాగానే చేస్తున్నది వంట. అయితే ఆఫీసులో ఉద్యోగం కొత్త, భార్య పోస్టు కొత్త, అదనంగా ఇప్పుడు వంట కూడా అయ్యేటప్పటికి చాలా అలిసిపోతున్నది. ఒక్కోసారి ఆఫీసులో పని ఒత్తిడికి, వంట భారమనిపిస్తున్నది!



మోహన్ కి ఆఫీసులో బాధ్యతలు పెరిగాయి. అతని పనికి మెప్పుదలగా, టీం లీడర్ని చేసారు. అది కొంత, కొంత అతి సహజమైన మగ ఇగో, బద్ధకాలకు అతను కూడా అతీతుడేమీ కాదు! దాంతో మృదులకి ఇంటి పనుల్లో, వంటలో ఎటువంటి సాయమూ చెయ్యడం లేదు. ఆమె అయినా అడగటం లేదు. ఆమె స్వాభిమానం ఆమెది!

**

ఈ మధ్య ఇద్దరి టైమింగ్స్ కలవక ఎవరికి వారు రావటం, వెళ్లడం తరచుగా జరుగుతున్నది. దాంతో అసలు కలిసి మాట్లాడుకున్నట్లు, కలిసి గడుపుతున్నట్లు లేక, ఆ తిక్క ఇద్దరికీ ఇంట్లో చిటపటల రూపం దాల్చింది!


ఆరోజు మృదుల ఆఫీసునుండి అలిసిపోయి చాలా చిరాగ్గా వచ్చింది. ఆ చిరాకులో భర్త చెయ్యని సాయాలు, ఈ మధ్య అప్పుడప్పుడు జరిగే వాగ్వివాదాలు అన్నీ భూతద్దంలో కనిపించసాగాయి! ఉన్న తలనెప్పి ఈ ఆలోచనలతో, అసంతృప్తితో రెట్టింపు అయింది. టిఫిన్ ప్రిపేర్ చెయ్యనీయకుండా మనసు మొండికేసింది! అలసిన ఆమె నిద్రలోకి జారుకున్నది. 



రాత్రి ఎనిమిదవుతుండగా ఆఫీసునుండి వచ్చిన మోహన్, ఎన్నిసార్లు బెల్ కొట్టినా తలుపు తెరుచుకోకపోవడంతో తన దగ్గర ఉన్న డూప్లికేట్ తాళం చెవితో తలుపు తెరుచుకుని లోపలకు వచ్చాడు. 


మూడంకె వేసి పడుకున్న మృదుల ఎంతసేపు లేపినా లేవలేదు. ఫ్రెష్ అయి వచ్చి, ఆకలేస్తున్న మోహన్ డైనింగ్ టేబిల్ వద్దకు వెళ్ళాడు. వంటగదిలో కూడా చూసి వచ్చిన మోహన్ కి అర్థమయింది మృదుల టిఫిన్ చేయలేదని!


ఆ ఆకలికి ఎంత కోపమొచ్చిందంటే, మృదులని లేపి మరీ తిట్టాలనిపించింది. అప్పటికి మెస్ మూసేసి ఉంటారు. ఆకలితో పడుకున్న మోహన్ కి, 'ఛీ! ఉద్యోగస్తురాలైన భార్యతో సుఖం ఏమిటి.. ఆకలితో పడుకోవటమా?' అనిపించింది. 

వెంటనే 'అమ్మ కూడా ఉద్యోగం చేస్తుంది.. మొదట్లో తమకి వంటమనిషి లేదు. అమ్మ ఎప్పుడూ తనకు, అక్కకి ఏ లోటూ రానివ్వలేదు' తెగని ఆలోచనలతో, తీరని ఆకలితో.. ఏదో ఉక్రోషం, కోపంతో మోహన్ ముందు గదిలో సోఫాలో పడుకున్నాడు!

**

 పొద్దున మృదుల మోహన్ సోఫాలో పడుకోవడం చూసి అర్థం చేసుకున్నది అతనికి ఎంత కోపం వచ్చిందో! ఇంకా తగ్గని తలనెప్పి, కడుపులో ఆకలితో నీరసం ఆమెలోని వివేకాన్ని పీకనొక్కేసాయి!


'నేను మాత్రం అలసిపోలేదా.. నేను మాత్రం ఆకలితో పడుకోలేదా? నాకూ ఓపిక లేదు.. ' అనుకున్నది. కాఫీ మాత్రం పెట్టి, స్నానం చేసి దీపం పెట్టింది. 


రెండోసారి కాఫీ తాగి, పనిమనిషి పనులన్నీ చేసి వెళ్లిపోగానే చూస్తే ఇంకా మోహన్ పడుకునే ఉన్నాడు. తనకి ఆ రోజుకూడా చాలా వర్క్ ఉన్నదని, ఆఫీసుకి వెళ్లడానికి హడావిడి పడింది. చిన్న స్లిప్ రాసిపెట్టి వెళదామనుకున్నది. ఊహు.. అహం అందుకు ఒప్పుకోలేదు. మెల్లగా తలుపు దగ్గరకు లాగి, ఆఫీసుకి వెళ్ళిపోయింది మృదుల!


గంట తరవాత మెలకువ వచ్చిన మోహన్ ఉలికిపాటుతో లేచాడు, కిటికీలోనుండి పడుతున్న ఎండకి! సెల్ లో టైం చూసుకుని, గాభరాగా మృదులని పిలవబోయాడు. ఇంకా తగ్గని కోపం అతని ఆలోచనని ఆపేసింది!


తన పనులు చేసుకుంటూనే భార్య కోసం చూసిన మోహన్ కి కాస్సేప్పటికి సింక్ లోని కాఫీ గ్లాసులు, ముందు గదిలో లేని ఆమె చెప్పులు చెప్పాయి ఆమె లేదని. 


ఫోన్ చెయ్యబోయాడు.. ఊహు' అంత ఇదిగా తను వెళ్ళిపోతే నేనెందుకు చెయ్యాలి?' అనుకున్నాడు. ఎదురుకుండా కనపడిన కాఫీ గిన్నె, పాలు చెప్పకనే చెప్పాయి, ఆ పూట కూడా, 'మడతకుడుములు- శేషపాన్పులేనని'! ఆహాన్ని ఆకలి జయించగా, ఆ కాఫీయే తాగి వెళ్ళిపోయాడు. 


 మృదుల ఆఫీసులో పనిచేస్తున్నదన్న మాటేగానీ, ఈ మధ్య తామిద్దరి మధ్యా పెరుగుతున్న దూరం తలుచుకుంటే చాలా బాధ కలిగింది! 'మోహన్ ని సరిగ్గా చూసి, మాట్లాడి రోజున్నర గడిచిపోయింది' బాధగా నుదురు రాసుకున్నది.. మనసుని బలవంతంగా పనిలో పెట్టింది!


వర్క్ లో ఎంత బిజీగా ఉన్నా మోహన్ మనసు మృదుల చుట్టూనే తిరుగుతున్నది. 'ఎందుకు ఈ మధ్య తమ ఇద్దరి మధ్యా ఏదో అగాధం ఏర్పడినట్లు గా ఉంటున్నది?' పరిపరి విధాల ఆలోచనలతో అన్యమనస్కంగానే ఉన్నాడు. 


చాలా రోజుల తరువాత మామూలు టైం కి పని అయిపోయిందని, మృదులకి ఫోన్ చేసాడు మోహన్, ఆమెతో కలిసి వెళ్ళడానికి. నాలుగు సార్లు చేసినా, రింగ్ అవుతున్నది కానీ, మృదుల ఎత్తలేదు. 


 ఇంటికి వచ్చిన మోహన్, మాటలు వినిపిస్తుంటే ఒక్క క్షణం ఆగి.. లోపలికి వెళ్ళాడు. ఎవరో ఫ్రెండ్స్ తో భార్యని చూసి, ఎందుకో ఎక్కడలేని చిరాకనిపించింది!


ముందు గదిలో పావుగంట కూర్చున్నాడు.. మృదుల వస్తుందేమోనని. 


 ఆ కలీగ్స్ ఇద్దరూ వచ్చి, మృదులకి కొద్దిగా టెంపరేచర్ వచ్చిందని, అందుకే తాము తీసుకువచ్చామని చెప్తుంటే మోహన్ చాలా గాభరాపడిపోయాడు!


అతని హడావిడి చూసి, "పర్వాలేదండీ టాబ్లెట్, పాలు ఇచ్చాము. ఇప్పుడు పడుకుంది. మేము వెళ్లివస్తాము" అన్నారు. మోహన్ వాళ్ళకి అనేకసార్లు థాంక్స్ చెప్పి గేటు దాకా పంపి వచ్చాడు. 


అప్పుడే లేచిన మృదుల నుదుటి మీద చెయ్యి వేసి చూస్తూ, "ఇంకా ఉన్నది జ్వరం. ఇదేమిటి మృదూ ఇంత పెట్టున జ్వరం వచ్చేసింది? పద డాక్టర్ దగ్గరికి వెళదాము. " 

పర్వాలేదు తగ్గిపోతుందని మృదుల ఎంత చెప్పినా వినకుండా మోహన్ డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళాడు. ఆయన వైరల్ ఫీవర్ అని మందులు రాసిచ్చారు. 



 టైం టైం కి మందులు ఇస్తూ, బ్రెడ్ కాల్చి పెట్టడం, సూప్ చేసివ్వడం.. మోహన్ ప్రేమ మృదుల హృదయానికి అయిన చిన్న చిన్న అసంతృప్తి గాయాలకు మలామ్ పట్టీ అయింది!


"నేను కూడా కొద్దిగా సాయం చేసి ఉంటే నువ్వు ఇంత వీక్ అయ్యేదానివి కాదు. ఈ వైరల్ ఫీవర్ వచ్చేదే కాదేమో?" బాధపడుతున్న మోహన్ తలని తన గుండెలకానించుకుని మృదుల, " నువ్వు ఇలాంటి విషయాల్లో కొంచెం మొద్దబ్బాయివని నేనూ గ్రహించలేకపోయాను. లేకపోతే ముక్కుపిండి చేయించేదాన్ని పని" మృదుల మళ్లీ తన మామూలు ధోరణిలో మాట్లాడుతుంటే మోహన్, "అబ్బో అమ్మాయిగారికి మొగుడు గారి సేవలు వంటబట్టాయే!" మళ్లీ ఆ ఇల్లు హాసప్రతిహాసాలతో కళకళలాడింది!


'మరక మంచిదే' అన్నట్లు, మృదుల మూడు రోజుల పడకతో మోహన్ కి భార్య కష్టం అర్థమైతే, భర్త మంచితనం మృదుల కూడా చవి చూసి, 'అమ్మ చెప్పినట్లు తాను ఇంకొంచెం ఓర్పుతో ఉండి, ఇల్లు చక్కబెట్టుకోవాలి, మోహన్ ని కూడా సహాయ చెయ్యమని' అనుకున్నది. 



మోహన్ ఇష్టానికి వ్యతిరేకంగానే, మృదుల రోజూ పూలు కొయ్యడానికి పెరట్లోకి వెళ్ళినప్పుడు, ఇంటి వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడ బామ్మగారిని పలకరించేది. 


మూడు రోజుల నించి మృదుల కనపడలేదని బామ్మగారే వచ్చారు. మృదులకి జ్వరమొచ్చిందని తెలిసి, తమకు తెలియచెయ్యలేదని చాలా బాధ పడ్డారు. మోహన్ ని పొయ్యి దగ్గర చూసి, గట్టిగా చెప్పారు.. మళ్లీ మృదుల మామూలుగా లేచి తిరిగేదాకా, వాళ్ల కోడలి చేత కూరలు వండించి పంపుతామని. బామ్మగారి ఆర్డర్ కదా.. ఒప్పుకోక తప్పింది కాదు వాళ్ళకి. 


ఇప్పుడు అర్థమయింది అయ్యగారికి ప్రయవసీతో పాటు ఇరుగుపొరుగుతో మంచిగా ఉండటం వలన లాభం!


పెళ్లి అంటే బాజాలు, కాజాలు, మజాలు మాత్రమే కాదు, ప్రేమతో కూడిన బాధ్యత ఇద్దరికీ ఉన్నదని.. మంచి పెంపకపు నేపథ్యమున్న మన యువజంట కొద్ది మన్స్పర్థలతోనే, తొందరగానే తెలుసుకున్నారు!

***


విశాఖపట్నంలో వియ్యపురాళ్ళు ఇద్దరూ నాలుగు రోజులనించీ ఫోన్ కి అతుక్కుపోయారు. 

మోహన్ తల్లి వసుంధర, "వదినా! మీ అల్లుడు అసలు సాయం చెయ్యక పోవడం వలన కదూ నా కోడలికి ఇంత పెట్టున జ్వరం వచ్చింది? వాడికి అసలు ఏమీ తెలియదు. ఎప్పుడూ చదువులని హాస్టళ్లలో ఉండడమే కదా మీ అన్నగారి బదిలీల ఉద్యోగంతో. "

మృదుల తల్లి హైమ, "మరీ సూకరాల్లేవమ్మా మీ కోడలికి. మా ఇంట్లో మడివల్ల అసలే పని రాదు. వంట నేర్పుతానని చెవినిల్లు కట్టుకు పోరితే వింటేనా?"


వియ్యపురాళ్లిద్దరూ మంచి దోస్తులయ్యారు. 

యువజంట తమ తల్లులకు చెప్పుకునే గోడువలన, అక్కడ జరుగుతున్న భాగోతం తెలుసుకుంటూనే ఉన్నారు. తమ పుత్రరత్నాల గురించి ఎరిగిన ఆ తల్లులు వాళ్ళకి సుద్దులు గరపుతూనే ఉన్నారు.. 

పెళ్లి అంటే మధురిమలే కావని, మహత్తరమైన సహజీవనం కూడా అని!


మరి వాళ్లిద్దరూ 'వివాహబంధం' 'విడాకుల ప్రహసనం' కాకూడదని కోరుకునే సగటు ఇల్లాళ్ళు!


సమాప్తము


విజయా సుందర్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/vijayasundar

నా పేరు వారణాశి వెంకట విజయలక్ష్మి. కలం పేరు 'విజయాసుందర్'. నేను ముఖపుస్తక మాధ్యమాలలో రచనలు చేస్తుంటాను. గత 5 సంవత్సరముల నుండియే నేను వ్రాస్తున్నాను. ప్రముఖ ముఖపుస్తకము భావుకలో రెండు గొలుసు కథలు, రెండు సీరియల్స్, అనేక కథలు వ్రాసాను. పలు పోటీల్లో పాలుపంచుకుని అడపా దడపా బహుమతులు గెలుచుకున్నాను. భావుకథసలు పేరిట అచ్చు అయిన పుస్తకంలో నా కథ ' బాజా భజంత్రీలు' ఈనాడు పుస్తకపరిచయంలో చోటు చేసుకున్నది. 'కథాకేళి', 'ప్రియమైన నీకు, పిల్లలు చెప్పిన పాఠాలు' పుస్తకాలలో న కథలు అచ్చు అయ్యాయి. 'భావుక' లో 'బిజ్జు బామ్మ కబుర్లు' అనే శీర్షిక కొన్నాళ్ళు నడిపాను.మన కథలు మన భావాలు, ముఖపుస్తకం లో కూడా ఎన్నో కథలు రకరకాల కాన్సెప్ట్స్ కి తగ్గ రచనలు చేస్తూ ఉంటాను.

'లీడర్', 'ఉదయం', ఇంకా కొన్ని వెబ్ పత్రికలలో నా కథలు చాలా అచ్చయ్యాయి, పలువురి ప్రశంసలు అందుకున్నాయి. నా సాహితీ ప్రయాణంలో పలువురు సీనియర్ రచయితల సూచనలను అంది పుచ్చుకుంటూ నా రచనలను మెరుగు పర్చుకునే దిశలో ప్రయాణిస్తున్నాను. నమస్సులు!

136 views0 comments

Comentarios


bottom of page