ఒకరికి ఒకరు
- Srinivasarao Jeedigunta
- Mar 16, 2023
- 4 min read

'Okariki Okaru' New Telugu Story
Written By Jidigunta Srinivasa Rao
ఒకరికి ఒకరు తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
సుమారు పది సంవత్సరాల క్రితం అమెరికా నుంచి వచ్చారు కృష్ణారావు కూతురు, అల్లుడు.
“మామయ్యగారిని హైదరాబాద్ లో ఏదైనా మంచి ఇండిపెండెంట్ ఇల్లు అమ్మకానికి వుంటే చూడమని అడుగు” అన్నాడు అల్లుడు రమణ, భార్య తో.
“నాన్నా! విన్నావుగా.. యిక్కడ ఏదైనా మంచి ఇల్లు అమ్మకానికి వస్తే కొంటాము. కొద్దిగా ఆ పనిమీద దృష్టి పెట్టండి” అంది కృష్ణారావు కూతురు శ్రీదేవి.
“మీకెందుకే యిక్కడ, మీరు అమెరికా నుంచి వస్తారా, యిక్కడ యింట్లో వుంటారా, ఆ డబ్బుతో అక్కడే కొనుక్కోండి” అన్నాడు కృష్ణారావు.
“అదేమిటి మామయ్యగారు.. ఏదో అయిదారేళ్లు వుండి వద్దామని వెళ్ళాము తప్పా అక్కడే ఎందుకు వుండిపోతాము” అన్నాడు అల్లుడు.
“అయితే సరే.. నాకు తెలిసిన కాంట్రాక్టర్ బీరంగూడలో ఇండిపెండెంట్ యిల్లు కడుతున్నాడు, మంచి ఏరియా. అడుగుతాను. వీలుంటే రేపు ఉదయం బయలుదేరి వెళ్లి చూసి, మీకు నచ్చితే అడ్వాన్స్ యిచ్చి బుక్ చేసుకుందాం” అన్నాడు కృష్ణారావు.
వంటింట్లో నుంచి “రేపు మంచిది కాదు, ఎల్లుండి వెళ్లదాం” అంది కృష్ణారావు భార్య రాధిక.
ఈలోపున కృష్ణారావు కాంట్రాక్టర్ గారికి ఫోన్ చేసి, ‘తన అల్లుడు, కూతురు మంచి ఇండిపెండెంట్ ఇల్లు కొనడానికి చూస్తున్నారు, మీరు కొత్తగా వెంచర్ వేస్తున్నట్టు తెలిసింది, అందులో మాకేమైనా యివ్వగలరా’ అని ఆడిగాడు.
“అయ్యో మీరడగటం నేను ఇవ్వకపోవడమా.. ఈ రోజు వచ్చి చూస్తారా” అన్నాడు సుబ్బరాజు కాంట్రాక్టర్ గారు.
“లేదు, గురువారం మంచిది. ఉదయం వస్తాము” అని చెప్పి, అన్నమాట ప్రకారం అందరు బయలుదేరి బీరంగూడ లో సృజనా హోసింగ్ కాంప్లెక్స్ కి వెళ్లి చూసారు.
ఆ ఏరియా యిప్పుడిప్పుడే డెవలప్ అవుతోంది, పూర్తి అయినా ఇల్లు చూసి అల్లుడు, కూతురు యిష్టపడ్డారు. “అందరికంటే ఒక రెండు లక్షలు తగ్గించి తీసుకుంటాను” అన్నాడు సుబ్బరాజు గారు.
దానితో తమకి నచ్చిన హౌస్ సెలెక్ట్ చేసుకుని అయిదు లక్షలు కి అడ్వాన్స్ చెక్కు యిచ్చి, మిగిలిన డబ్బులకి లోన్ తీసుకునే ఒప్పందం చేసుకుని, దారిలో హోటల్ భోజనం చేసి ఇంటికి చేరుకున్నారు.
చెప్పిన ప్రకారం ఏడాదిలో ఇల్లు అన్ని రకములుగా పూర్తి చేసి తాళలు కృష్ణారావుకి అప్పగించాడు సుబ్బరాజు గారు.
అసలు కథ మొదలైంది. కూతురు ఒక రోజు ఫోన్ చేసి, “డాడీ! మా మామగారిని వచ్చి ఈ యింట్లో వుండమంటే, ఈ వయసులో పుట్టిన ఊరు వదిలి రానంటున్నారు, మాకేమో ఇల్లు అద్దెకు యివ్వడం యిష్టం లేదు. అందుకే మీరే, మీరు వున్న ఫ్లాట్ ని ఖాళీ చేసి మా యింట్లో వుండండి. విశాలం గా వుంటుంది” అంది.
“శ్రీదేవి.. నీకు తెలుసు కదా నా ఉద్యోగం, అమ్మ ఉద్యోగం ఖైరతాబాద్ అని.. మేము బీరంగూడ నుంచి రావాలి అంటే కష్టం. తమ్ముడి కాలేజీ కోఠి లో వుంది” అన్నాడు కృష్ణారావు.
“అయితే తాళం వేసేసి వుంచండి, మేము వచ్చినప్పుడు వుంటాము” అని అంది కూతురు.
“మనుషులు లేకపోతే ఇల్లు పాడయిపోతుంది, మీరు కొన్నది అద్దెకు యిస్తారనుకున్నాను కానీ మమ్మల్ని ఉండమని అంటారని అనుకోలేదు. అలోచించి ఏదో ఒకటి చేస్తాను” అని చెప్పి ఫోన్ పెట్టేసాడు.
చివరికి ఫ్లాట్ ఖాళీ చేసి బీరంగూడ లోని కూతురు యింట్లో గృహప్రవేశం చేసారు. కృష్ణారావు గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం కాబట్టి పదిగంటలకి బయలుదేరి వెళ్ళేవాడు. కష్టం అంతా పాపం కృష్ణారావు భార్య రాధిక పడింది. ఆవిడ ఆఫీస్ కి వంట అయినంత వరకు చేసుకుని, ఎనిమిది గంటలకు బయలుదేరి బస్సు లో ఆఫీస్ కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం 6గంటలకు ఇంటికి చేరేది.
కృష్ణారావు కి వంట బాగా వచ్చు కాబట్టి భార్య వండగా మిగిలిన వంట తను పూర్తిచేసి, తను, కొడుకు తిని బయటకి బయలుదేరేవాళ్లు.
కాలం వేగంగా కదిలిపోయింది, కృష్ణారావు తాతయ్య అయ్యాడు, శ్రీదేవి కి కొడుకు పుట్టడం, వాడు పెరిగి నైన్త్ క్లాసుకి రావడం, వాడికి ఇండియా అంటే సెలవలకి తాతయ్య, అమ్మమ్మల్ని చూడటానికి మాత్రమే అని, తన స్థావరం అమెరికానే అని నిర్ణయం చేసుకున్నాడు.
కృష్ణారావు కొడుకు పెళ్లి అయిన తరువాత ముంబై లో మంచి ఉద్యోగం కోసం వెళ్ళిపోయాడు. అక్కడే కూతురు పుట్టేసింది. దానికి ముంబై తప్ప ఏ ఊరు నచ్చదు.
చివరికి కృష్ణారావు దంపతులు యిద్దరు మిగిలిపోయారు.
మనవడి కోసం కృష్ణారావు దంపతులు ప్రతీ ఏడాది అమెరికా వెళ్ళి ఆరు నెలలు వుండి వచ్చే వాళ్ళు. పేరుకి అమెరికాలో కూతురు వుంది అనే కానీ ప్రతీ ఏడాది ఇండియా వచ్చి ఒక నెల వుండేవారు. యిహ మిగిలిన రోజులలో కొన్నాళ్ళు కొడుకు దగ్గరికి ముంబై వెళ్ళి, కొన్నాళ్ళు హైదరాబాద్ లోనే.
“వృద్ధాప్యం వచ్చేసింది, యిహ మీరు హైదరాబాద్ లో వుండటం నాకిష్టం లేదు, ముంబై వచ్చేయండి” అన్న కొడుకు మాట వినకుండా, “లేదురా.. అమ్మకి పూజలు చేసుకోవడం అలవాటు, యిక్కడ తనంత తాను గుడికి వెళ్ళి వస్తుంది, అక్కడ యివి అన్నీ కుదరవు. అమ్మ సుఖం ముఖ్యం మనకి. నువ్వు, కోడలు, మనవరాలు వీలున్నప్పుడు వస్తోనే వున్నారు, యిహ అక్కయ్య సరే సరి, దాని మనసంతా ఇండియా మీదే” అన్నాడు.
అమెరికాలో వున్నవాళ్లందరు కోటీశ్వరులు కారు, పిల్లల చదువులు, అప్పులు తీర్చుకున్న తరువాత మిగిలేది మనకంటే తక్కువే. అయితే తల్లిదండ్రులని పట్టించుకోకుండా డబ్బు సంపాదన ముఖ్యం అనుకునే వాళ్ళకి నాలుగు డాలరులు మిగులుతాయి అంతే.
కృష్ణారావు కి ఎందుకో ఈ జీవితం నచ్చలేదు, ఎవరికోసం తామిద్దరు ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా యిక్కడ వుండటం ఎందుకు అనుకుని కూతురు కి ఫోన్ చేసి చెప్పాడు, మేము తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోయి, నీ యిల్లు అద్దెకు యిస్తాము అని.
కొద్దిసేపు ఆలోచన చేసి “డాడీ! నేను కూడా అదే అనుకుంటున్నాను. మీరు మా యిల్లు గురించి ఆలోచించకండి. ఈ వయసులో మీరు తమ్ముడితో పాటు వుండటం మంచిది. యింకోక విషయం, యిప్పుడు మీ మనవడి కాలేజీ చదువు కోసం కోటి రూపాయలు ఖర్చు అవుతుంది, మేము ఆ యిల్లు అమ్మేసి వాడి చదువు కి ఉపయోగించాలి” అంది.
ఇండియా లో చదువు కి అయ్యే ఖర్చు కి నాలుగు రెట్లు ఖర్చు అవుతుంది అమెరికా లో.
కొడుకు కి కూడా ఫోన్ చేసి, “మేము యిహ నీతోనే వుంటాము, వీలున్నంత త్వరగా మమ్మల్ని తీసుకుని వెళ్ళు. నువ్వు ఇక్కడకి ఒక పదిరోజులు సెలవు మీద వస్తే, ఈ యిల్లు అమ్మేసి అక్కకి డబ్బులు పంపించి, మనం ముంబై వెళ్ళిపోదాం” అన్నాడు.
“నీ మేనల్లుడు చదువు కి డబ్బులు అవసరం. యిప్పుడు ఈ డబ్బు వాళ్ళకి ఉపయోగం. ఎలాగో వాళ్ళు అక్కడ సిటిజన్స్ కాబట్టి యిక్కడ ఆస్తులు అనవసరం” అన్నాడు.
“అమ్మ ముంబై కి వస్తుందా?” అన్నాడు కొడుకు.
“తనకి ఈ యిల్లు అలవాటైపోయింది, రాను అంటుంది. కానీ తనకి ఇదివరకు ఓపిక లేదు, వస్తుంది లే” అన్నాడు కృష్ణారావు.
తరువాత తల్లీకొడుకులు ఏమి మాట్లాడుకున్నారో కానీ, అక్కగారితో చెప్పాడు, “అమ్మకి మీ యిల్లు అలవాటైపోయింది, వాళ్ళు సుఖంగా వుండటమే కావాలి. అందుకే నీకు ఆ యింటిని అమ్మితే వచ్చే డబ్బుని ట్రాన్స్ఫర్ చేస్తాను. తరువాత నువ్వు ఇండియా వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేయండి” అన్నాడు.
“నేను నా తమ్ముడికి కావాలంటే ఫ్రీ గా యిస్తాను తప్పా, అమ్మను” అనడం తో, మొత్తానికి ఒప్పించి డబ్బులు పంపించాడు. తరువాత నెలలో అల్లుడు వచ్చి, బావమరిది పేరున యిల్లు రిజిస్ట్రేషన్ చేసి వెళ్లిపోయారు.
అయితే అక్కగారికి, ఇల్లు అమ్ముకున్నాను అనే అసంతృప్తి వున్నట్టు గ్రహించి, “అక్కా, ఇల్లు నా పేరున వున్నా, నీ పేరున వున్నా ఒకటే, కావాలంటే ఇల్లు నీ పేరున రిజిస్ట్రేషన్ చేస్తాను. నాకు నాది, నీది అనే తేడా లేదు. నాకు వున్నది ఒక ఆడపిల్ల, నీకు మగపిల్లాడు. యిద్దరూ నాకు సమానమే. రేపు నా కూతురుకి పెళ్లి అయ్యి వెళ్ళిపోతుంది. మాకైనా, నీకైనా నీ కొడుకే. అందుకని డబ్బులు, ఇల్లు, స్థలాలు యివి అమ్మా నాన్నా పెట్టిన మన పేర్లు లోనే వుంటున్నాయి. మనం మన తల్లిదండ్రుల శేష జీవితం హాయిగా గడిచేడట్లు చూడటమే మన పని. అమ్మా, నాన్నా తరువాత నువ్వు, బావగారే నాకు పెద్ద దిక్కు” అని అంటున్న తమ్ముడి మాటలకి కళ్ల నీళ్లతో “అవును నిజమే రా, నీ కోసం నేను, నా కోసం నువ్వు, అమ్మా నాన్నా కోసం మనమిద్దరం” అంది.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


Comments