#JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #OkasariItuRaraAbbayi, #ఒకసారియిటురారాఅబ్బాయి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు
Okasari Itu Rara Abbayi - New Telugu Story Written By - Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 18/11/2024
ఒకసారి యిటు రారా అబ్బాయి - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
దశరథ్ కౌసల్య కి ఒక కొడుకు పుట్టాడు. పురిట్లోనే కొడుకుని కని కౌసల్య కన్నుమూసింది. దశరథ్ తను బ్యాంకులో ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ గా చేస్తున్నావాడు, క్యాంపులకి వెళ్తే పిల్లాడిని చూడటానికి యిబ్బంది అని, అకౌంట్స్ డిపార్ట్మెంట్ కి మార్పించుకున్నాడు.
దశరథ్ చుట్టాలు చాలా మంది దశరథ్ ని ‘యింకో పెళ్లిచేసుకో, నీకు యింకా 35 సంవత్సరాలు కూడా నిండాలేదు, పిల్లాడిని ఎలా పెంచుతావు’ అని సలహా యిచ్చినా, కౌసల్య తో గడిపిన జీవితం మర్చిపోలేక మారు పెళ్లి చేసుకోకుండానే కాలం గడుపుతున్నాడు.
పిల్లాడికి రామ్ అని పేరు పెట్టి, చిన్న పిల్లలని చూసే స్కూల్ వుంచి తను ఆఫీసుకి వెళ్ళేవాడు. పిల్లాడు ఏడుగుతున్నది కొద్ది పెంకి తనం అలవాటు అయ్యింది. దానితో విసిగెత్తి పోయిన దశరథ్, పిల్లాడిని హాస్టల్ వుంచి చదివించడం మొదలుపెట్టాడు. ఆదివారం మాత్రం రామ్ ని ఇంటికి తీసుకుని వచ్చి ఆ రోజంతా వాడితో గడిపేవాడు.
రామ్ తండ్రిని ఒక్కొక్కసారి అందరికి అమ్మ వుంది, మా అమ్మ ఏది అని అడిగేవాడు. దశరథ్ కొడుకుకి ఏదో ఒక కథ చెప్పి దృష్టి మరల్చేవాడు.
రివ్వునా 15 సంవత్సరాలు గడిచిపోయాయి. రామ్ టెన్త్ క్లాస్ కి వచ్చిన దగ్గర నుంచి చదువు మీద శ్రద్ధ తగ్గించి స్నేహితులు తో తిరగడం అలవాటు చేసుకున్నాడు. స్కూల్ నుంచి కంప్లైంట్ రావడం తో తల్లీ లేని పిల్లాడు అని గారాబం చెయ్యటం వలన పాడాయిపోతున్నాడని తెలుసుకుని, దశరథ్ రామ్ ని హాస్టల్ వుంచి చదివించటం తో రామ్ చదువు లో బాగు పడ్డా, తండ్రి తనకి ఫ్రీడమ్ ఇవ్వలేదని కోపం పెంచుకున్నాడు.
తను రిటైర్ అయ్యేలోపు వీడికి మంచి ఉద్యోగం వస్తుందా, రాదా అని బెంగతో కాలం గడుపుతున్నాడు. రామ్ తండ్రి కోరిక ప్రకారం ఇంజనీరింగ్ చదవకుండా, డిగ్రీ చదివి బ్యాంకు లో ఉద్యోగం సంపాదించాడు. అయితే పోస్టింగ్ పూణే లో రావడం తో రామ్ పూణే వెళ్ళిపోయాడు. కొడుకు దూరం వెళ్ళాడు అని దశరథ్, తండ్రికి దూరం అవుతున్నాను అని కొడుకుకి ఎటువంటి బెంగ లేకుండా పోయింది. మొదటి నుంచి కొడుకు హాస్టల్, తను యింట్లో ఒంటరిగా ఉండటం అలవాటు అయిపొయింది దశరథ్ కి.
కొడుకు ఉద్యోగం కన్ఫర్మ్ అవ్వగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేసాడు దశరథ్. భార్య తో పూణే వెళ్లబోతో తండ్రిని ఆడిగాడు ‘కొన్నాళ్ళు మీరు సెలవు పెట్టి మాతో రావచ్చుగా’ అని.
“సర్వీస్ చివరిలో వున్నాను, యిప్పుడు సెలవు పెట్టడం ఎందుకు, రిటైర్ అయిన తరువాత ఎలాగో అక్కడే గా” అన్నాడు దశరథ్.
“మీ యిష్టం నాన్న” అని పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు.
ఆరు నెలలకు ఒకసారి వచ్చి చూసి, రెండు రోజులు తండ్రితో వుండి వెళ్లిపోయేవాడు రామ్.
“అబ్బాయి, కోడలిని కూడా ఒకసారి తీసుకుని రారా, చూసి ఏడాది అయ్యింది” అన్నాడు దశరథ్ కొడుకుతో.
“తను అక్కడ స్కూల్ లో టీచర్ గా చేరింది, సాయంత్రం ట్యూషన్ కోసం పిల్లలు యింటికి వస్తారు, టైము దొరకదు, అయినా నేను వస్తున్నాను గా, మీరు ఆ రెండు రోజులు సెలవు పెట్టకుండా ఆఫీసు కి వెళ్ళిపోతారు, నేను ఎందుకు వచ్చాను అని అనుకునే వాడిని” అన్నాడు రామ్.
“పేరుకి నా కోసం అనడం.. రాగానే ఫ్రెండ్స్ తో తిరిగి రాత్రి పదింటికి యిల్లు చేరడం. యింతోటి దానికి నా సెలవు ఎందుకు పోగుట్టుకోవడం?” అన్నాడు దశరథ్.
సర్వీస్ నుంచి రిటైర్ అయిపోయాడు, కొడుకు, కోడలు దశరథ్ రిటైర్మెంట్ ఫంక్షన్ కి వచ్చి రెండు రోజులు వుండి వెళ్లిపోయారు. దశరథ్ వంటరిగా మిగిలిపోయాడు.
గోడకి తగిలించిన భార్య ఫోటో వంక చూసి, ‘నీ కొడుకుకి నా మీద కోపం ఎందుకు, నేను నా సుఖం త్యాగం చేసి వేరే వివాహం చేసుకోకుండా వాడిని పెంచాలి అనుకుంటే,స్నేహితుల వల్ల చదువు మీద శ్రద్ద పెట్టకపోతోవుండటం తో హాస్టల్ వుంచి చదివించాను కాబట్టి యిప్పుడు నాలుగు రూపాయలు సంపాదించుకుంటున్నాడు. కానీ వాడు నా దగ్గర ఉంచుకోకుండా హాస్టల్ లో పడేసాను అని కోపం పెంచుకుని నాతో ముభావము గా వుంటున్నాడు.
నువ్వు పోయిన దగ్గరనుండి వంటరి జీవితం అయిపొయింది. ఓపిక పోయిన తరువాత అయినా వాడి దగ్గరికి వెళ్ళాక తప్పదుగా’ అనుకున్నాడు కళ్ళు తుడుచుకుంటూ దశరథ్.
రిటైర్ అయిన తరువాత వాకింగ్ మూలపడింది. తినటం పడుకోవడం తో కాలం లాగుతున్నాడు దశరథ్. లైఫ్ సర్టిఫికెట్ యిద్దామని ఆఫీస్ కి వెళ్తోవుండగా గుండెల్లో పట్టినట్టు అనిపించి హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాడు.
దశరథ్ని పరీక్ష చేసిన డాక్టర్ “హార్ట్ లో బ్లాక్ వుంది అని, వెంటనే స్టంట్ వేసుకోవాలి” అని సూచించాడు. అక్కడి నుంచే కొడుకు కి ఫోన్ చేసి సంగతి చెప్పాడు దశరథ్.
“మీరు డాక్టర్ గారు చెప్పినట్టు చెయ్యండి, నేను మూడు గంటలలో మీ దగ్గర వుంటాను” అన్నాడు రామ్.
హాస్పిటల్ జాయిన్ చేసుకుని, విజవంతంగా దశరథ్ కి స్టంట్ వేసి, తండ్రి ని చూడటానికి వచ్చిన రామ్ కి డాక్టర్ చెప్పాడు, “మీ నాన్నగారికి హార్ట్ లో ప్రాబ్లెమ్ వుంది, యిప్పుడు చేసిన ట్రీట్మెంట్ వలన కొంత కాలం పరవాలేదు, కాని జాగ్రత్తగా ఉండాలి” అన్నాడు.
హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తండ్రిని ఒప్పించి, తనతో తీసుకుని వెళ్ళిపోయాడు రామ్.
పూణే లో యిల్లు చిన్నదే, ఇందులో నేను ఎక్కడ ఉండగలను అనుకున్నాడు దశరథ్.
దశరథ్ కోసం ఒక గది యిచ్చి, “మీరు ఈ గదిలో విశ్రాంతి తీసుకోండి. వేళ కి మీకు అన్నీ ఇక్కడికే వస్తాయి. ముందు హల్ లో ట్యూషన్ పిల్లలతో మీ కోడలు హడావుడిగా ఉంటుంది, మీకు ఏమైనా కావాలి అంటే ఈ బల్ల మీద వున్న బెల్ నొక్కండి” అన్నాడు రామ్.
“అంటే నేను ఈ గది నుంచి బయటకు వచ్చి మీతో కూర్చోకూడదా” అన్నాడు దశరథ్.
“అలా కాదు నాన్న, మేము బిజీగా వుంటాము, మీతో కబుర్లు చెబుతో కూర్చుంటే ఎలా, మా ఆఫీస్ పని మేము చేసుకోవాలి, మీరు కృష్ణా రామా అనుకుంటూ ఏదైనా పుస్తకం చదువుకోండి, మీకు ఆరోగ్యం కుదుటపడిన తరువాత నాకు ఖాళీ వుంటే షిరిడీ తీసుకుని వెళ్తాను” అన్నాడు రామ్.
దశరథ్ కి ఎందుకో తను జైలు లో ఉన్నానా అని అనుకునే వాడు.
దానితో మనోవ్యాధి ఎక్కువ అయిపొయింది, ఆరోగ్యం పూర్తిగా పాడవటం మొదలైంది.
“నాయనా ఒక్కసారి యిటు రారా” అని పిలిచితే కొడుకు రామ్ వచ్చి “ఏమిటి నాన్న నిమిషానికి ఒకసారి పిలుస్తారు, నాకు ఆఫీస్ టైం అవుతోంది” అని విసుక్కునే వాడు.
“కాళ్ళు పీకేస్తున్నాయి, ఒక పది నిముషాలు నా కాళ్ళ మీద కూర్చో, నీతో మాట్లాడాలి” అన్నాడు దశరథ్.
“మీకు అర్ధం కాదు నాన్నా, ఆ పుల్లలాగా వున్న మీ కాళ్ళ మీద కూర్చుంటే నా బరువు కి మీ కాళ్ళు విరిగిపోతాయి. మీకు తోచకపోతే మీ కొడలితో మాట్లాడుకోండి, నాకు ఆఫీస్ లో చాలా పనివుంది” అని వెళ్ళిపోయాడు.
రోజులు భారంగా గడుస్తున్నాయి దశరథ్ కి. ఒక శనివారం కొడుకు రామ్ తండ్రి దగ్గరికి వచ్చి, “నాన్న! రేపు కారులో షిరిడీ వెళ్దాం రాగలరా” అని ఆడిగాడు.
ఏదో విధంగా బయట ప్రపంచం చూడాలి అనుకుని, తలవూపాడు దశరథ్. అయితే అదే చివరి మాట అయ్యింది దశరథ్ కి, రాత్రి నిద్రలోనే తనువు చాలించాడు.
తెల్లవారి ఆరు గంటలకు తండ్రి గదిలోకి వెళ్లిన రామ్ తండ్రిని చూసి కొయ్యబారిపోయాడు. లోపల నుంచి దుఃఖం తన్నుకుంటో వచ్చి గోల్లుమన్నాడు రామ్. మామగారి గది నుంచి భర్త ఏడుపు విని పరిగెత్తుకుని వచ్చింది రామ్ భార్య.
“అయ్యో! మూడు రోజుల నుంచి నాతో మాట్లాడాలి అని పిలిచే వారు, నాకు అదే టైం లో స్టూడెంట్స్ వచ్చి ఉండటం తో వెళ్ళలేదు” అంది.
అంత్యక్రియలు జరిపించి విచారంగా ఇంటికి చేరుకున్నాడు. విచిత్రం తనకు నిన్నటి వరకు నాన్న, భార్య వున్నారు, నాన్నకు నేను వున్నాను, నాతో గడపాలి అనుకున్నాడు, ఆ కోరిక తీరకుండా వెళ్ళిపోయాడు, నాన్న గది బోసిపోయింది. గదిలో మూలన నాన్న సూటకేస్ పెట్టివుంది.
భారంగా వెళ్ళి కింద కూర్చొని సూటకేస్ తెరిచాడు. కొన్ని బట్టలు, వాటిపైన ఒక కవర్ వుంది. దానిమీద నేను నీతో మాట్లాడకుండా పోతే ఈ కవర్ నీకోసం రామ్ అని రాసివుంది.
యిదేమిటి యిలా రాసాడు అనుకుంటూ కవర్ లోనుండి కాయితం బయటకు తీసాడు.
‘అబ్బాయి రామ్.. మీ అమ్మ మరణించిన తరువాత, తల్లీ ని తండ్రి ని అన్నీ నేనే అయ్యి నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటో వచ్చాను. అదేమిటో నువ్వు పదవ తరగతి లోకి రాగానే, స్నేహితులతో తిరుగుతో చదువు అశ్రద్ధ చేస్తున్నావని మీ టీచర్ సలహా తో నిన్ను హాస్టల్ లో ఉంచడం జరిగింది. నిన్ను విడిచి ఉండటం నాకు ఎంతో కష్టం అయినా, నీ బాగు కోరుకుంటూ ఆ బాధని భరించాను. నువ్వు చదువుకొని ఉద్యోగం సంపాదించి పూణే వెళ్ళినప్పటి నుంచి యిప్పటి వరకు ఎప్పుడు కూడా అసలు నా సంపాదన ఏమిటి, ఏ ఆస్తులు కొన్నాను, నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎంత వచ్చాయి అని నువ్వు అడగలేదు, నేను చెప్పటానికి అవకాశం దొరకలేదు.
నీకు నేను హాస్టల్ కి పంపించి నీ బాల్యం ని నీకు దక్కనివ్వలేదు అని నా మీద కోపం పెంచుకుని, నాకు దూరంగా ఉండటం మొదలుపెట్టావే గాని, నిన్ను హాస్టల్ కి ఎందుకు పంపించానో ఒక్కసారి కూడా అలోచించలేదు. నువ్వు చెడు మార్గం లోకి వెళ్లకుండా వుండటానికి, నా మనసు చంపుకుని నిన్ను హాస్టల్ పెట్టాలిసి వచ్చింది.
నీ దగ్గరికి వచ్చిన తరువాత నిజం చెప్పాలంటే ఈ గదిలో బంధీ అయిపోయాను. నీతో అన్నీ విషయాలు మాట్లాడి, నీ మనసులో నా మీద వున్న దురభిప్రాయం తొలిగించుకోవాలి అని ఎన్నోసార్లు నిన్ను ప్రాదేయపడ్డాను నా మాట వినరా ఒక్కసారి అని, అయితే నువ్వు నా దగ్గర కూర్చోడానికే ఇష్టపడలేదు.
నీ భార్యకు చెప్పాలి అని ప్రయత్నం చేసినా ఆమె తన బాధ్యత నాకు తిండి పెట్టడం వరకే అనుకుని, ఎప్పుడు ట్యూషన్స్ అంటూ ఉండిపోయింది. మా అమ్మానాన్న యిరవై ఏళ్ళు పెంచారు, అంతేగా అనుకుంటారు, అదే తల్లిదండ్రులని వాళ్ల వృద్ధులు అయినప్పుడు పది ఏళ్ళు చూస్తే తెలుస్తుంది తల్లిదండ్రులు తమని పెంచడానికి పడ్డ కష్టం. ఈ ఉత్తరం రాసే సమయంలో నాకు తెలిసిపోయింది, నేను యింకా ఎన్నాళ్ళో జీవించి ఉండను అని. పోయిన తరువాత నా పెట్టేని ఎలాగో పారెస్తావు, అప్పుడు పెట్టి తెరిచి ఈ ఉత్తరం చూస్తావు అని ఆశతో రాస్తున్నాను.
నా ఉద్యోగం క్యాంపులు ఎక్కువ అవడం తో నా తిండి, అవసరపు ఖర్చులు ఆఫీసు డబ్బు తో జరిగిపోయాయి, నా జీతం తో నీ హాస్టల్ ఖర్చులు పోగా మిగిలిన డబ్బుతో కొన్ని మంచి కంపెనీ షేర్స్ కొనేవాడిని. నా పేరున అయిదు ఎకరాల భూమి మన వూరిలో కొన్నాను, యిప్పుడు నేను కొన్న ఒక్కొక share అరవై వేలు పైన వుంది, అంటే షేర్స్ నువ్వు ఎప్పుడు అమ్ముకున్నా డబ్బెయ్ లక్షలు వరకు వస్తుంది, పొలం ఎంత లేదన్నా ఎకరం రెండు కోట్లు ఉంటుంది. అన్నిటికి నిన్ను నామిని గా వుంచాను. ఇప్పటికైనా నన్ను అర్ధం చేసుకుంటావని అనుకుంటాను.
సమాప్తం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
"ఒకసారి యిటు రారా అబ్బాయి" అనే ఈ తెలుగు కథ మన జీవితంలో తల్లిదండ్రుల బాధ్యతల గురించి ఆలోచించడానికి మోటివేట్ చేసే ఒక స్పూర్తిదాయకమైన రచన. జీడిగుంట శ్రీనివాసరావు గారు ఎంతో భావోద్వేగంతో రచించిన ఈ కథ తల్లిదండ్రులు తమ పిల్లల కోసం చేసే త్యాగాలను, పిల్లలు తమ తల్లిదండ్రులను ఎలా అర్థం చేసుకోవాలో చర్చిస్తుంది.
కథలో దశరథ్ తన భార్యను కోల్పోయినా, తన కొడుకు రామ్ కోసం నిస్వార్థంగా తన జీవితం గడుపుతాడు. అయితే, పెరిగేకొద్దీ రామ్ తండ్రి త్యాగాలను గుర్తించలేకపోయి, సుదూరంగా ఉంటాడు. చివరికి, దశరథ్ తన జీవితంలోని నిగూఢ భావాలను ఒక ఉత్తరంలో రాసి, తన కొడుకుకు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు.
కథ ముగింపులోని భావోద్వేగం, తల్లిదండ్రుల ప్రేమకు సంబంధించిన సూక్ష్మ దృష్టికోణాలు పాఠకుల హృదయాలను తాకుతాయి. తల్లిదండ్రుల త్యాగాలను గుర్తించి, వారి అవసరాలను పట్టించుకోవాల్సిన బాధ్యత మనందరిది అని ఈ కథ గుర్తు చేస్తుంది.