top of page

ఒకే లక్ష్యం

#OkeLakshyam, #ఒకేలక్ష్యం, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguStory, #తెలుగుకథ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Oke Lakshyam - New Telugu Story Written By - Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 05/12/2024

ఒకే లక్ష్యంతెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


"ఏమండోయ్, సత్యానందరావుగారు!.... మీరు మీ తాహతును గురించి వివరించారు. మేము మా అబ్బాయి కెపాసిటీని గురించి తెలియజేస్తాము. వినండి" హెచ్చు స్థాయిలో పలికాడు భుజంగరావు.


పెండ్లి పెద్ద 'చిరకాల', వరుడు శ్యామ్, వారి తల్లి సంధ్య, ఆడపిల్ల తల్లిదండ్రులు సత్యానందరావు, వారి అర్థాంగి అనిత, వారి కుమారుడు సూర్య, వధువు వసంత ఆశ్చర్యంతో భుజంగరావు ముఖంలోకి చూచారు. సూర్య మిత్రుడు విజయ్ కూడా వారిలో వున్నాడు. 


“మావాడు ఎం.బి.బి.ఎస్, ఎం.డి, ఎఫ్.ఆర్.సి.ఎస్, లండన్.... సముద్రాలను దాటించి వాడిని చదివించేదానికి నేను ఎంత ఖర్చు పెట్టానో, మీలో ఎవరైనా వూహించగలరా!.... తెలిసుంటే చెప్పండి, వింటాను” భావావేశంతో భుజంగరావు అందరి ముఖాలను పరీక్షగా చూచాడు. 

అమ్మాయి వారందరూ విచారంగా తలలు దించుకొన్నారు. భుజంగరావు గారి మాటలను విన్న విజయ్ కుర్చీ నుండి లేచి భుజంగరావు ముఖంలోకి, అతని తనయుడు శ్యామ్ ముఖంలోకి తీక్షణంగా చూచి వేగంగా బయటికి వెళ్ళిపోయాడు.


సూర్యా అతని వెనుకాలే నడిచాడు.


"అయ్యా!... భుజంగరావు గారు... మీరు చాలా గొప్పవారు. గ్రానైట్ వ్యాపారస్థులు. కోట్లకు వారసులు. అలాగే మీ తనయులుంగారు గొప్ప డాక్టర్. ఆ విషయాలన్నీ నేను అమ్మాయి వారికి విశదంగా చెప్పానండీ!... నేను మిమ్మల్ని వీరి ఇంటికి ఎందుకు తీసుకొచ్చానో మీకు తెలియదు. తమరి నందనుల వారు అమ్మాయి వసంతను చూచి మోహించి, నన్ను పెండ్లి చూపులను ఏర్పాటు చేయమన్నారు. చేసాను. కనుక సమరసంగా మాట్లాడుకొని సంబంధాన్ని...."


"ఇదిగో సామీ!... సోది చెప్పకు. ఇంతకూ వారు ఏమిస్తారో కనుక్కో!" ఆవేశంగా అన్నాడు భుజంగరావు.


భుజంగరావు, ఆ మాటలను విన్న వసంత సోఫా నుండి లేచింది. పెండ్లి కొడుకును, వారి తల్లి అనితను, భుజంగరావును ముఖాల్లో మూడు క్షణాలు చూచింది.

"అమ్మా!.... నాన్నా!.... నాకు వీరి సంబంధం ఇష్టం లేదు" నేరుగా వేగంగా తన గదికి వెళ్ళిపోయింది వసంత.


ఈసారి ఆశ్చర్యపోవడం పెండ్లి కొడుకు శ్యామ్, వారి జన మహారాజు భుజంగరావు, జనని సంధ్య, సంధాత చిరకాల వారి వంతైంది.

కొన్ని క్షణాల తర్వాత భుజంగరావు...

"ఏమిటండి సత్యానందరావు గారూ!... ఇదేనా మీరు మీ అమ్మాయికి నేర్పిన మర్యాద!" ఆవేశంగా అడిగాడు భుజంగరావు.


"భుజంగరావు గారు!... ఇప్పుడు మేము మీకు ఏం అమర్యాద చేశాము?" అడిగాడు వధువు సోదరుడు సూర్య.


ఆ మాటలను విన్న భుజంగరావు సోఫా నుండి లేచాడు. అర్థాంగి, కుమారుల ముఖాల్లోకి తీక్షణంగా చూచాడు.


"ఏమిటే చాకిరేవు బండకు అతుక్కుపోని పాతగడ్డిలా అలాగే కూర్చున్నావ్? ఇరువురూ లేవండి. ఆ అమ్మాయి అంత స్పష్టంగా తెగేసి చెప్పిన తరువాత ఇంకా ఇక్కడ మనకు ఏం పని!" ఆవేశంగా అన్నాడు భుజంగరావు.


భార్య సంధ్య, తనయుడు శ్యామ్ సోఫా నుండి లేచారు.

"రండీ!...." వేగంగా ఇంటినుండి బయటికి నడిచాడు భుజంగరావు. తల్లి కొడుకు వారిని అనుసరించారు.


సంధాత చిరకాల కళ్ళు పెద్దవి చేసి వారిని చూచాడు.

భుజంగరావు కారు ముందు సీట్లో కూర్చున్నాడు. భార్య కుమారుడు వెనుక సీట్లో కూర్చున్నారు.

"పోనీరా!..." అన్నాడు భుజంగరావు.


డ్రైవర్ పరంధామ కారును స్టార్ట్ చేసి ముందుకు నడిపాడు.


"బ్రహ్మాండమైన సంబంధం సత్యానందరావు గారు, మీ అమ్మాయికి ప్రాప్తం లేదు వస్తా!...." తన కమీషన్ పోయిందని సంధాత చిరకాల విచారంగా వారి గృహాన్ని వీడాడు.


"ఏది ఏమైనా నీకు నోటి దురుసు చాలా ఎక్కువే!.. పెండ్లి చూపులకు వచ్చిన వారితో అట్లాగానా మాట్లాడేది?" కూతుర్ని కసురుకొంది తల్లి అనిత.


"వాడు కాకపోతే.... వాడికంటే అన్ని విధాలా మంచివాడు మరొకడు వస్తాడులే అమ్మా!... ఆవేశపడకు" సౌమ్యంగా చెప్పాడు సూర్య.


"అనితా!... భుజంగరావు దాహాన్ని మనం తీర్చలేము. అమ్మాయి చెప్పినదాంట్లో తప్పేమీ లేదు. కాకపోతే నేను చెప్పవలసిన మాటలను చదువుకొన్న అమ్మాయి కనుక నా ముఖ భంగిమలను చూచి తాను చెప్పింది. ముఖ్యంగా కళ్యాణ ఘడియలు వచ్చినా కక్కు వచ్చినా ఎవరూ ఆపలేరు. అమ్మాయికి ఇంకా వివాహ తరుణం రాలేదు. గంతకు తగిన బొంత అన్నట్లు మనకు తగిన అబ్బాయి రాకపోడు బాధపడకు" అనునయంగా చెప్పాడు సత్యానందరావు.


సోదరుడు తండ్రి చెప్పిన మాటలకు వసంత ముఖంలో ఆనందం....

*

భుజంగరావు వారి సతీమణి సంధ్య కుమారుడు శ్యామ్ ఎవరి ఆలోచనలో వారున్నారు.

డ్రైవర్ పరంధామ వారి వద్ద ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఆ ముగ్గురూ మాటా పలుకు లేకుండా వుండటాన్ని చూచిన పరంధామ వారందరితో తనకు వున్న చనువుతో....

"అయ్యా!..."


"ఏరా!..."


"అమ్మాయి నచ్చిందా!" చిరునవ్వుతో అడిగాడు పరంధామ.


"నచ్చలేదు!" ఆవేశంగా చెప్పాడు భుజంగరావు.


"అబద్ధం!..." అంది వెనుక సీట్లో కుమారుడి ప్రక్కన కూర్చొని యున్న సంధ్య.


భుజంగరావు వులిక్కిపడ్డాడు. భార్య ముఖంలోకి తీక్షణంగా చూచాడు.

"మరి నిజం ఏమిటి అర్థాంగి!" వ్యంగ్యంగా అడిగాడు భుజంగరావు.


"వారు ఇస్తానన్న కట్నం వీరికి నచ్చలేదు పరంధామా!" అన్నాడు శ్యామ్ తండ్రి ముఖంలోకి చూస్తూ.


"నిజం!" అంది సంధ్య.


"డబ్బుదేముందమ్మగారు!... మీరు అయ్యగోరు చూడని డబ్బా!... పిల్ల మనకు నచ్చితే సరి. ఏమంటారు?" చిరునవ్వుతో అడిగాడు పరంధామ.


"ఒరేయ్!.."


"అయ్యా!...."


"నోరు మూసుకొని, రోడ్డును చూస్తూ జాగ్రత్తగా బండిని నడుపు" ఆవేశంగా చెప్పాడు భుజంగరావు.


"ఈ ఆవేశమే ఆ పిల్లచేత ఆ మాటను అనిపించింది!" మూతి మూడువంకరలు త్రిప్పుతూ అంది సంధ్య.


"అమ్మాయిగారు, ఏమన్నారు అమ్మగోరూ!..."


"మీ సంబంధం నాకు ఇష్టం లేదు అంది" విచారంగా చెప్పింది సంధ్య.


"అంతమాట అందా అమ్మగోరూ!"


"ఆఁ... అంది!" శ్యామ్ జవాబు.


భుజంగరావు కోపంగా భార్య, కుమారుల ముఖాలను చూచాడు.

అది బస్టాండు ప్రాంతం.

శ్యామ్ స్నేహితుడు విజయ్ రోడ్డు ప్రక్కన నిలబడి వున్నాడు బస్సు కోసం. పరంధామ అతన్ని చూచాడు.


"చినబాబూ!... మీ ఫ్రెండు విజయ్!" అన్నాడు పరంధామ.


"పరంధామా!.... కారు ఆపు!" అన్నాడు శ్యామ్.


"ఎందుకు?" భుజంగరావు ప్రశ్న.


"నేను కారు దిగుతాను"


"అదే ఎందుకు అని అడుగుతున్నా!..." కొడుకు ముఖంలోకి తీక్షణంగా చూస్తూ అడిగాడు భుజంగరావు.


"వాడు దిగాలన్నాడుగా!... అర్థం కాలేదా!...." సంధ్య ప్రశ్న.


"పరంధామ కారు ఆపు!..." గట్టిగా అన్నాడు శ్యామ్.


పరంధామ కారును ఆపాడు.

డోర్ తెరుచుకొని శ్యామ్ కారునుండి దిగాడు.


"అమ్మా! నాన్నా!... మీరు వెళ్ళండి. నేను రాత్రికి వస్తాను"


"ఇక్కడ, ఇప్పుడు నీకేం పని?" భుజంగరావు గారి ప్రశ్న.


"విజయ్‍తో మాట్లాడాలి!"


"ఏం మాట్లాడాలి?"


"పెండ్లి విషయం!"


"ఎవరి పెండ్లి విషయం?"


"వాడి పెండ్లి విషయం!... పరంధామా!... నీవు కారును నడుపు!..."


"అట్టాగే బాబూ!..." పరంధామ కారును కదిలించాడు.


భుజంగరావు కొడుకు ముఖంలోకి తీక్షణంగా చూచాడు. తల్లి సంధ్య తనయుని ముఖంలోకి దీనంగా చూచింది.

’వాడికి ఇరవై ఎనిమిదేళ్ళు. ఈ కట్నంపు దాహం భుజంగరావు దాహం తీరేలా కట్నం ఇచ్చేవారెవరో!... ఎప్పుడు వాడి పెండ్లి అవుతుందో!..’ విచారంగా అనుకొంది సంధ్య.

*

"ఏరా అలా లేచి వచ్చేశావ్!..." మిత్రుడు విజయ్‍ను సమీపించి అడిగాడు శ్యామ్.


"ఓరే శ్యామ్!... మీ జనక మహారాజుగారి మాటలను వినలేకపోయారా!"


"ఏమీ అనుకోకురా!... డబ్బు విషయంలో ఆ మనిషి....." శ్యామ్ పూర్తి చేయకముందే...

"కర్కటోడు. షైలాక్.... తప్పుగా అనుకోకురా!..." మెల్లగా చెప్పాడు విజయ్.


"అవునురా!... పద హోటల్‍కు వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకొందాం" అన్నాడు శ్యామ్.


ఇరువురు మిత్రులూ ప్రక్కనే వున్న హోటల్లో ప్రవేశించారు. టిఫిన్, కాఫీ సేవించారు.

"ప్రక్కన గాంధీజీ పార్కు వుంది కదా, అక్కడకు వెళ్ళి చెట్ల నీడలో కూర్చొని ఆ ప్రశాంతమైన వాతావరణంలో కొంత సమయం గడుపుదాం. ఏమంటావ్?" అడిగాడు విజయ్.


"అలాగే పద!..." శ్యామ్ జవాబు.


ఇరువురూ పార్కులో ప్రవేశించారు.


వారికంటే ముందు శ్యామ్ చూచిన వధువు వసంత, ఆమె స్నేహితురాలు మాధవి పార్కులో ప్రవేశించడం విజయ్ చూచాడు. ఆ ఇరువురూ వెళ్ళి బాగా ఏపుగా పెరిగిన క్రోటన్ మొక్కల ప్రక్కన కూర్చున్నారు. క్రోటన్ మొక్కల పక్కన వేపచెట్టు చల్లదనం, నీడ వారికి వ్యతిరేక దిశలో కనబడకుండా వారి మాటలు వినగలిగేలా విజయ్ స్థలాన్ని ఎంచుకొని శ్యామ్‍తో కలసి కూర్చున్నాడు.

*

"ఆ... చెప్పవే, నీ పెండ్లి చూపుల ఫలితాన్ని!..." అడిగింది మాధవి.


"కాన్సిల్"


"ఎందుకని?"


"ఆ భుజంగరావుకు ధనదాహం. ఆ దాహాన్ని మా నాన్న తీర్చలేడు. అందుకని, నేనే నాకు మీ సంబంధం ఇష్టం లేదని వారితో చెప్పేశాను" చిరునవ్వుతో చెప్పింది వసంత.


"ఏమిటే నువ్వనేది!" ఆశ్చరంతో అడిగింది మాధవి.


"అవునే!... నేను చెప్పింది నిజం!..." గర్వంగా నవ్వింది వసంత.


"మరి అమ్మా నాన్న బాధపడలేదా!"


"వారి ఫీలింగ్స్ వారికి వుంటాయిగా. కానీ... నేను వారికి చెప్పింది ఏమిటంటే... వీరు కాకపోతే మరొకరు... సమయం వస్తే అన్నీ కలిసి వస్తాయి. బాధపడకండి అని చెప్పాను" చెప్పింది వసంత.


"అవునే ఆ శ్యామ్‍కు నీకు పరిచయం వుందిగా!..."


"లేదు. కానీ... అతను నన్ను చూచి ఇష్టపడ్డాడట. మాటల సందర్భంలో సంధాత చిరకాల చెప్పాడు."


"అయితే ప్రస్తుత నీ నిర్ణయం ఏమిటి?" అడిగింది మాధవి.


"రేయ్ శ్యామ్ పొదలకు ఆ వైపున వున్న వారి మాటలను వింటున్నావా!"


సాలోచనగా తలాడించాడు శ్యామ్.


"చూడు మాధవీ!... నాకు వివాహం చేసుకోవాలని లేదు. నాకు నా తల్లీతండ్రీ ఎంతో ముఖ్యం. ఎవరినో ఒకరిని వివాహం చేసుకొని వారితో సంతానాన్ని కని, వారిని సాకి సంతరించి, వారు పెద్ద అయ్యాక నేడు నా మూలంగా నా తల్లితండ్రులు అనుభవిస్తున్న బాధలను నేను నా భావి జీవితంలో అనుభవించ దలచుకోలేదు. నాకు నా దేశం... మన ఈ భారతదేశం... మన భరతమాత అంటే నా ప్రాణ సమానం. అందుకే మిలటరీలో జాయిన్ కావాలనే నిర్ణయానికి వచ్చాను. నా అంతిమ శ్వాస వరకు నా తల్లితండ్రులను, నా దేశాన్ని ప్రేమాభిమానాలతో చూచుకోవడం నా లక్ష్యం. అందులో నాకు పరిపూర్ణ ఆనందం. ఆల్‍రెడి అప్లై చేశాను. ఇంటర్వ్యూకి కాల్ కూడా వచ్చింది" ఎంతో ప్రశాంతంగా చిరునవ్వుతో చెప్పింది వసంత.


"అరే!... శ్యామ్ విన్నావా వసంత నిర్ణయాన్ని!" అడిగాడు విజయ్.


శ్యామ్ మౌనంగా శూన్యంలోకి చూస్తున్నాడు.

విజయ్ అతని భుజంపై తట్టాడు.

"ఏమిటిరా నీ ఆలోచన?" అడిగాడు విజయ్.


"విజయ్!"


"చెప్పరా!..."


"వసంత మాటలు నాకు నా కర్తవ్యాన్ని తెలియజేశాయి. నేనూ మిలటరీలో జాయిన్ అవుతాను. మన సాటి సరిహద్దు రక్షక సోదరులకు వైద్యం చేస్తూ, ’మానవ సేవే మాధవ సేవ’ అనే సిద్ధాంతాన్ని పాటిస్తూ నా జీవితకాలాన్ని ఆనందంగా అనుభవిస్తాను. ప్రేమ, పెండ్లి, సంసారం నాకు అవసరం లేదు, ఇక వెళదాం!" నిశ్చలమైన భావనతో లేచి నిలబడ్డాడు శ్యామ్.

విజయ్ అతని మాటలకు ఆశ్చర్యపోయాడు.


"మా తండ్రి కారణంగా నేను వసంత వివాహ రీత్యా ఒకటి కాలేకపోయాము. కానీ ఒకే లక్ష్యంతో ఇరువురం ఒకటైనట్లే నా ప్రస్తుత మనోభావన ఆ భావన నా మనస్సున ఎంతో ఆనందంగా వుంది. నాకు చాలా సంతోషంరా. నడు... వెళదాం" నవ్వుతూ శ్యామ్ ముందుకు నడిచాడు.

విజయ్ అతనిలో కలిగిన మార్పుకు ఆశ్చర్యంతో అతన్ని అనుసరించాడు.


శ్యామ్, విజయ్, వసంత, మాధవీలు గేటు దగ్గర కలిశారు. వసంతను చూచి చిరునవ్వుతో చేతులు జోడించి "మీదీ నాదీ ఒకే లక్ష్యం. కలుద్దాం ఎప్పుడో ఒకనాడు మన దేశ సరిహద్దుల్లో" చిరునవ్వుతో చూచాడు వసంత ముఖంలోకి శ్యామ్.


వసంత, విజయ్, మాధవీలు శ్యామ్ ముఖంలోకి ఆశ్చర్యంతో చూచారు. 



సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


32 views0 comments

Comentários


bottom of page