top of page

ఒక్కసారి ఆలోచించండి..

Writer: Sudha Vishwam AkondiSudha Vishwam Akondi

#SudhavishwamAkondi, #OkkasariAlochinchandi, #ఒక్కసారిఆలోచించండి, #సుధావిశ్వంఆకొండి, #TeluguStories, #తెలుగుకథలు


Okkasari Alochinchandi - New Telugu Story Written By - Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 08/03/2025 

ఒక్కసారిఆలోచించండి - తెలుగు కథ

రచన: సుధావిశ్వం ఆకొండి


నచ్చినా, నచ్చకున్నా ఒకసారి చదివి, ఈ దిశగా ఆలోచించండి. ఈ రోజు మహిళదినోత్సవం కదా మరి అందుకే కొంచెం స్వాతంత్య్రం తీసుకుని వ్రాస్తున్నా��. 


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పి, చేతులు దులుపుకుంటే అయిపోయితుందా? మహిళా సాధికారత సాధించాలి అని చర్చావేదికలు పెడితే రాదు! ప్రతి ఒక్కరూ సమాజంలో తమకు చేతనైన, వీలయినంత తోడ్పాటు అందించాలి. సమాజంలో సుహృద్భావ వాతావరణం నెలకొనాలి! అప్పుడే మహిళా సాధికారత సాధ్యపడుతుంది. 


 ఈ మధ్య చాలా మంది ఆడవాళ్ల వస్త్రధారణ పైన దుమ్మెత్తి పోస్తున్నారు. రేప్ లకు, అన్ని నేరాలకు అదే కారణం అంటున్నారు. అలా తాము చేసే నీతిమాలిన పనులకు సమర్థన తప్ప వేరే కారణం ఏముంది? ఒక్క విషయం ఆలోచించండి.. 


వస్త్రధారణ అలా ఉంటే ఉద్రేకపడిపోయి నేరాలు చేయడమేనా? పెద్దలకు తెలియని విషయం కాదు. రామాయణం మనకు ఎంతో పవిత్రం! శ్రీరాముడు ఆదర్శం. ఇది అందరూ ఒప్పుకుంటారు కదా! మరి ఆ రామ చంద్రమూర్తి ఏమి చేశాడు? శూర్పణఖ సౌందర్యవతిగా మారి వచ్చినా, ఎన్నో వెకిలి చేష్టలు చేసినా చలించి, ఆమె అలా వచ్చింది కాబట్టి అలా చేశాను కానీ నాదేం తప్పు? అన్నాడా? లేదే! ఆమెను సున్నితంగా తిరస్కరించి, నేను పెళ్లయిన వాడను. నా సీతను తప్ప ఎవరినీ నేను భార్యగా అంగీకరించను అని నిక్కచ్చిగా చెప్పాడా లేదా? ( ఇక్కడ నన్ను ఆ సీతారాములు క్షమించెదరు గాక. కలలో కూడా అలా అనుకోడానికి వీలు లేదు. ఆ పరమేశ్వరుడు ఏ అవతారం తీస్కున్నా మళ్ళీ అమ్మనే రావాలి ఎన్ని రూపాలుగా అయినా ) 


మరి అదే ఆదర్శంగా తీసుకుని మగవాళ్ళు నడుచుకోవాలి కదా! ఇప్పుడు కూడా అలా శూర్పణఖలా వ్యామోహం కలిగించాలని ప్రయత్నించే వాళ్లను పట్టించుకోకుండా ఉండాలి కదా పురుషులు. 


రాముడులా ఇప్పుడు మగాడు అలా కంట్రోల్ చేసుకోలేడు స్త్రీ లే అలా ఉండాలి అంటుంటారు. ఇది కొందరు స్త్రీలు కూడా సమర్ధిస్తుంటారు. ఎంతవరకు సమంజసం? వాళ్ళు ఏ రకంగా వున్నా సరే, వ్యామోహం కలిగించుకోకుండా, మనసును కంట్రోల్ చేసుకుంటూ, పరస్త్రీల పైన ప్రతి పురుషుడు మాతృభావన తోనే ఉండాలి. కాదంటారా?


ఒక స్త్రీ ని భార్యగా పొందితే మిగతా అందరూ స్త్రీలు పూజనీయులే! భార్యను భగవంతుడు ప్రసాదించిన గిఫ్టు అనే భావన ఉంటే ఇటువంటి పైత్యపు ఆలోచనలు రానేరావు!


సినిమాలు చూస్తారు. అందులో నటించే వారు హీరోయిన్స్ కావచ్చు, జుగుప్స కలిగించే హాస్య పాత్రధారిణులు కావొచ్చు, పాత్రధారులు కావొచ్చు, వారిని ఫ్రెండ్స్ చేసుకుంటారు. వారిని కలిస్తే ఫోటోలు దిగి సోషల్ మీడియాలలో గొప్పగా పెడతారు. తెలిసిన వారందరికీ గొప్పగా చెబుతారు. ( నేను వాళ్ళను అగౌరపరిచేలా చూడాలి అనడం లేదు. వారి పరిస్థితి, వాళ్ళ జాబ్ అది) అదే సినిమాలు ఆడపిల్లలు చూస్తారు కదా! గొప్పకోసం పెట్టిన పోస్టులు చూస్తారు కదా! అది చూసి ఫ్యాషన్ అని అనుకరిస్తే వాళ్లదేమి తప్పు?


ఆ ఫ్యాషన్ పాటించేది వేరే వాళ్ళ పిల్లలు అయితే తిట్టడం, అపహాస్యం చేయడం ఏమైనా బాగుందా? మీరు చూసి ఆనందిస్తుంటే, సినిమా వాళ్ళను గొప్పగా చూసి ఆదరిస్తుంటే, అది చూసిన పిల్లలు ఏమనుకుంటారు? ఎలాగైనా బాగా డబ్బు సంపాదిస్తే చాలు గొప్ప గౌరవం వస్తుంది అని భావిస్తారు కదా! 


ఫ్యాషన్ గా, హీరోయిన్ గా కనిపిస్తూ ఉంటేనే గొప్ప అనే భావం ఆడపిల్లల్లో కూడా కలుగుతుంది. అలా ఉండడం ఎంత వరకు మంచిది అనే విషయం విడమరిచి చెప్పకుండా అప్పుడు తిడితే వాళ్లకేం తెలుస్తుంది?


ఒకప్పుడు చాలా చిన్న వయసులోనే చాలా మంది ఆడపిల్లల్లో కానీ, మగ పిల్లల్లో కానీ మానసిక పరిపక్వత కలిగేది. జీవితం పైన ఒక అవగాహనతో ఉండేవారు. పెద్దలు చెప్పే మాటలు, అప్పటి విద్యావిధానం, మన పురాణాలు చదివి ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు అనే విషయాలు తెలుసుకోవడం, ఆచరించడం వల్ల అటువంటి పరిపక్వత కలిగేది అప్పట్లో. ఇప్పుడు ఎంత వయసు వచ్చినా చైల్డిష్ మెంటాలిటీ ఉంటోంది. దానికి కారణం ఏమంటారు? 


చిన్నప్పటినుంచి మగపిల్లల్లో ఆడవాళ్ళ పట్ల గౌరవం కలిగే విధంగా తాము నడుస్తూ, వారికి తెలియజేయాలి. వాడు చిన్నప్పటి నుంచే ఆంటీలు అంటూ ఒక రకమైన హేళనా భావం అలవాటు చేసు కుంటున్నాడు. ఆంటీ అనడంలో ఏ విధమైన గౌరవ భావం ఉండదు. సాటి స్త్రీని తల్లిదండ్రులు ఆంటీ అంటారు, వాళ్ళ పిల్లలూ ఆంటీ అనే అంటారు. ఇదేం పైత్యమో మరి? 


 ఒక స్త్రీ కి సరియైన వస్త్రధారణ లేదు, పొట్టి బట్టలు వేసుకుని కనిపించింది అని ఉద్రేకపడిపోకుండా వాళ్ళు ఎవరో పిచ్చివాళ్ళు అనుకుంటే సరిపోతుంది కదా! అలాంటి పెద్దవయసు స్త్రీలు కనిపిస్తే, ఏదో రోగంతో ఎవరో తల్లి అలా ఉంది అనుకుంటే! ఉన్న ఉద్రేకం సర్వంపోయి, ఆ స్థానం లో మానసిక దృఢత్వం కలుగుతుంది. కాదంటారా? పోస్టుకు లైకుల కోసమో, పేరు కోసమో అలా ఆడ వాళ్ళని తిట్టాలంటారా? 


ఓసారి ఒక పోస్ట్ పెట్టింది ఒక ముప్పై ఏళ్ళు పైబడిన ఆవిడ.. రుక్మిణి శ్రీకృష్ణుని ప్రేమించి పెళ్లి చేసుకుంటే తప్పులేదు పూజిస్తారు. తమ ఆడపిల్లలు ప్రేమిస్తే చావగొడతారు ఎందుకో? అంటూ.. రుక్మిణి కృష్ణుల పరిణయ అంతరార్ధం తెలియకుండానే అన్ని ఏళ్ళు వచ్చేసాయి ఆమెకు. 

 

సినిమాలు చూసి అందులో లా ప్రేమించి పెళ్లి చేసుకుంటే జీవితం బావుంటుంది అని అనుకుంటే ఆ కూతురిని, ఆ పిల్లవాడిని అడ్డంగా నరికేసి చంపేయడమేనా? అక్కడ పెంపకం లోపం ఎవరిది? తల్లిదండ్రులది కాదా? ప్రేమ, పెళ్లి పట్ల వారికి సరియైన అవగాహన కలిగిస్తే ఇలాంటి ఘోరాలు చేయాల్సిన అవసరం లేదు కదా!


ఏ వ్యక్తిని అయినా బెదిరించి, హింసించి కట్టడి చేయడం అవుతుందా? ఆ పని చేయడం వల్ల ఎలాంటి అశుభ పరిణామాలు ఎదురవుతాయో విపులంగా చెబితే ఎవ్వరు అలా చేయరు. 


ఒక స్త్రీ ని చూడగానే అది నాది రా! అనే డైలాగులు వినబడుతుంటాయి. జంతువుల్లాగా అసహ్యం వేస్తుంది ఇవేమీ చెత్త డైలాగులు? జంతువులకు, పక్షులకు భాష ఉండదు కనుక వాటికి సంకేత భాష ఉంటుంది దాన్ని బట్టి అవి నడుస్తాయి ఏ విధమైన అనుబంధాలు ఉండవు వాటికి. తనకు నచ్చి ఆడ జంతువుల వెంట పడతాయి. మరి మనిషి అలా వెంటబడి దక్కకపోతే చంపేస్తే అది చూసిన జంతువులు కూడా బాధ పడతాయేమో? అది ఎంత పైశాచికత్వం? 


గోవాలో చూశాను చాలామంది విదేశీ ఆడవాళ్లు బీచ్ లో పడుకుంటారు. వాళ్ల భర్తలూ వుంటారు. కానీ ఎవ్వరిని పట్టించుకోరు. మనవాళ్ళు కనిపిస్తే నవ్వుతూ పలకరించి వదిలేస్తారు. మనవాళ్ళు మటుకు పిచ్చివాళ్లుగా చూస్తుంటారు ఉద్రేకంగా. 


వాళ్ళతో ఉన్న మగ వాళ్ళు ఎవ్వరినీ అలా చూడరు. మర్యాదగా వుంటారు. ఎందుకు? అదొక సామాన్య విషయంగా చూస్తున్నారు వాళ్ళు. ఎంతమందికి వస్త్రధారణ గురించి ఇంటింటికి వెళ్లి చెబుతారు? అలా పట్టించుకోని తత్వం మగాళ్లలో పెరగాలి కానీ. 


భార్య ఇంటి ఫుడ్ లాంటిది. బయట హోటల్స్ కి వెళ్ళమా? ఇదీ అలాంటిదే. దేని టేస్ట్ దానిదే అని అంటుంటారు డైలాగులు. స్త్రీ కి ఫుడ్ కి బేధం లేదా? ఫుడ్ కి ప్రాణం లేదు. మరి స్త్రీ? ఆలోచించండి?


ప్రాణం, మనసు రెండూ ఉంటాయి స్త్రీ లో కూడా. మనసు అర్ధం చేసుకుని, తననే మనసా, వాచా ప్రేమిస్తే స్త్రీలు భర్త కోసం ఎన్ని కష్టాలు పడడానికి అయినా వెనుకాడరు. ఈ రోజుల్లో కూడా ఉన్నారు. అదీ మీ కుటుంబంలోనే. కానీ గుర్తించరు అంతే. 


ఆడవాళ్లు సమానత్వం ఆశించడం మంచిదే! కానీ దేనిలో? పైలెట్ గా అయ్యారు సమానంగా! పోలీసులు, లాయర్లు, డాక్టర్లు.. ఇలా ఎన్నో రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు అది అభివృద్ధి పథంకు పయనింపజేస్తుంది. 


మగాడు తిరిగితే తప్పు లేనిది మేము తిరగకూడదా? వాళ్ళు సిగరెట్ కాలుస్తారు కదా మేమూ కాలుస్తాము. వాళ్ళు డ్రింక్ చేస్తారు మేమేం తక్కువ మేమూ తాగి రోడ్డుపైనే పడతాం అంటే? ఏమైనా అర్ధం ఉందా? వాళ్ళూ సిగరెట్ తాగి క్యాన్సర్ తెచ్చుకుంటారు, నువ్వూ తెచ్చుకుంటావు. వాళ్ళూ తాగి రోడ్లపై పడి ఎందుకూ పనికిరాకుండా పోతారు. నీ గతి అంతే కదా! 


మగాళ్లదే తప్పు అని ఆడవాళ్లు, ఆడవాళ్లదే తప్పు అని మగాళ్లు ఇలా ఒకళ్లను ఒకళ్ళు తిట్టుకుంటూ చివరికి ద్వాపరయుగం అంతం అయ్యేటప్పుడు యాదవులు తమలో తాము కొట్టుకు చచ్చినట్టుగా అందరూ కొట్టుకు చస్తారేమో? అప్పుడు కలియుగం రెండవపాదం వస్తుందేమో అన్పిస్తుంది నాకప్పుడప్పుడు. ఇన్ని కోట్ల జీవరాసుల్లో మనిషికి మాత్రమే విచక్షణా జ్ఞానం ఉంది. సైన్స్ ప్రకారం మనిషి జంతువే కావచ్చు కానీ జంతువులకు లేని జ్ఞానం మనిషికి ఉంది కదా! 


అందుకే ఒక్కసారి ఆలోచించండి! పరస్త్రీలను తల్లిగా, అక్కచెల్లెళ్లుగా చూడాలి కానీ తల్లిలో, అక్కచెల్లెళ్ళలో కూడా ఆడతనం చూసే దుర్గతి కలుగుతోంది సమాజంలో. కొన్ని సంఘటనలు చూస్తుంటే మనసు కలిచివేస్తుంది. 


అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరుగ గలిగిన నాడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అని మహాత్మాగాంధీ అన్నారు. ఇదీ జోక్ గా మారింది ఎందుకు బయటకు రావాలి అంటూ.. దానర్థం అనవసరంగా రావాలని కాదు. అవసరమైతే అలా ధైర్యంగా వెళ్లగలిగే పరిస్థితులు ఉండాలి అని. 


ఏది ఏమైనా పరిస్థితుల పట్ల అవగాహన పెంచుకుని బుధ్ధి కుశలతతో, ధైర్యంగా ఉండి ఏ సమస్యను అయినా ఎదుర్కొనే స్థైర్యం ఆడవాళ్ళందరిలో కలగాలి. ప్రతి చిన్న విషయానికి పిరికితనంతో డీలాపడిపోవడం పోవాలి మహిళల్లో. అలా వచ్చిన రోజు నిజంగా మహిళా సాధికారత సాధించినట్లే. 

 

అటువంటి మంచి సభ్యసమాజం ఏర్పడాలని ఆశిద్దాం. 


నా తోటి మహిళలు అందరికి మరొక్కసారి అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు.. 


  ###


సుధావిశ్వం ఆకొండి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!

 కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది.  ప్రస్తుత నివాసం ఢిల్లీ.




Comments


bottom of page