top of page
Writer's pictureB Sathyavani

ఒక్కసారి నవ్వవా?



'Okkasari Navvava' - New Telugu Story Written By B. Sathyavani

Published In manatelugukathalu.com On 16/06/2024

'ఒక్కసారి నవ్వవా?' తెలుగు కథ

రచన: బి. సత్యవాణి


అదో ఆటోలు రాని, బస్సులు దూరని కుగ్రామం. ఆ గ్రామంలో గ్రామ సింహం లాంటి యువకుడు.. క్షమించండి ఇక్కడ గ్రామ సింహం అంటే షష్టి విభక్తి తీసుకుని గ్రామానికి సింహం అని భావించడం మంచిది. అయినా గ్రామ సింహం (కుక్క) అనడంలో తప్పేముంది? దానికి ఉన్నంత విశ్వాసం కలవాడు అని అర్థం కూడా తీసుకోవచ్చు. సర్లేండి ఇంక ఆ యువకుడు గురించి తెలుసుకుందామా! 


ఆ యువకుడి పేరు పుల్లారావు. 


ఏవండోయ్.. పుల్లారావు అన్నానని పుల్లలాగా ఉంటాడు అనుకుంటే పొరపాటే. కండబలం గుండె బలం కలవాడు. అంతే కాదండోయ్.. పొడుగు మరియు నలుపు. 


నలుపు అంటే.. మరీ అంత నలుపు కాదండి. మనం కళ్ళకి పెట్టుకుని కాటుక అంత నలుపు అంతే. నలుపు అయితేనే ముఖంలో కళ కళకళలాడుతూ ఉంటుంది. నవ్వితే ఆ పళ్ళ వరుస కోహినూర్ డైమండ్ మాదిరి మెరుస్తుంటాయి. అందుకే వాళ్ళ అమ్మ ఒళ్ళంతా అంతా అదేనండి ఒళ్ళు కనబడకుండా దిష్టి చుక్కలు పెట్టేసినట్లుంది. 


ఇక మనవాడు అదేనండి పుల్లారావు గురించి చెప్పుకుంటే 10 వరకు చదివి ఇక చాలు అని చదువు పక్కన పెట్టి భూమి తల్లి పుస్తకం చదవడం మొదలుపెట్టాడు అదేనండి వ్యవసాయం. మనందరికీ వ్యవసాయం ద్వారా సాయం చేస్తున్న సంఘసంస్కర్త. 


 ఇక మనవాడు పనితోనే కాక నటనతోను మెప్పిద్దామని రీల్స్ చేయడం మొదలుపెట్టాడు. అంతా ఇంటర్నెట్ మహిమ. ఇంస్టాగ్రామ్ లో ఫిల్టర్స్ ఉపయోగించి తన కలర్ని బ్లాక్ నుంచి ప్యూర్ వైట్ గా మార్చేసుకుని మరి నటనతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించాడు. ఎంతోమంది అమ్మాయిలు ప్రపోజల్ పెట్టారు. అందులో మన వాడికి ఒక అమ్మాయి బాగా నచ్చేసింది. 


 ఆన్లైన్లో పరిచయం ఆఫ్ లైన్ దాకా వచ్చేసింది. అంటే స్నేహం పెళ్లి వరకు వచ్చింది అన్న మాట. ఇప్పుడు కదా అసలు పరీక్ష మొదలు. మనవాడు ఇన్నాళ్లు స్నాప్ చాట్ అండ్ ఇంస్టాగ్రామ్ ఫిల్టర్స్ వాడి ఏదో మేనేజ్ చేసాడు. మరి ఇప్పుడు.. 


దానికి కూడా ఉందండీ ఒక ఉపాయం. అదేనండి.. సున్నం. గోడకు వేస్తే సున్నం, మనిషికి వేస్తే మేకప్. ఇరు కుటుంబాలకు సంతోషమే. ఎందుకో చివరన మీకే తెలుస్తుంది. ఇప్పుడే చెప్పడం ఎందుకు? మన హీరో గారు పెళ్లి బట్టలతో తెల్లని సున్నంతో తళ తళా మెరిసిపోతున్నాడు. అన్నట్లు చెప్పడం మర్చిపోయా!


 మన హీరోయిన్ గారు అదేనండి పెళ్లికూతురు ఫోన్లో అయితే లోడలోడ వాగేస్తుంది. బయట మాత్రం మౌనం కూడా భయపడేంత మౌనాన్ని పాటిస్తుంది. ఒకవేళ ఎదురుగా మాట్లాడిన మాస్కున్నప్పుడే మాట్లాడేది. అంత కళ్ళతో అభినయించేది. ఆమె మేను (శరీరం) కాంతిని చూసి చంద్రుడు కూడా అసూయ పడి దాకుంటాడు అంత కాంతి ఆమె మేను. ఇంక పెళ్లి మేళ తాళాలతో సందడి సందడిగా ఉంది. 


 మన హీరో హీరోయిన్ గారిని చూసి నవ్వాడు. మన హీరోయిన్ కూడా నవ్వింది. అంతే మన పెళ్లి కొడుకు గారికి ఏదో తేడా కొడుతుంది కానీ అర్థం కాదు పెళ్లికూతురుని నవ్వించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తాడు. మనసులో మాత్రం. “ఒక్కసారి నవ్వవా? నవ్వవే తల్లీ” అనీ ప్రశాంతంగా ఉండే గోదావరి లాగా పెదాలపై చిరునవ్వు నుంచి ఉధృతమైన ప్రవాహం లాగా మూతి అష్టవంకలు తిప్పి నవ్వించడానికి ప్రయత్నిస్తాడు. 


ఏంటి? ఏం చేస్తున్నారు? అన్నట్లు అసహనం ప్రదర్శిస్తూ ఏమీ తెలియని నంగనాచిలా చూస్తుంది మన హీరోయిన్. 


 మన హీరో గారికీ మొత్తం జ్ఞానోదయం అవుతుంది. అదేంటంటే మన హీరో గారికి ముఖంలో ఏది అందమో అది హీరోయిన్ కు లేదని, మన హీరో గారికి ఏదైతే తక్కువ అది హీరోయిన్ గారికి ఎక్కువ అని, జ్ఞానోదయం అయ్యి దేవుడు ఊరికే రాస్తాడా తలరాతలు? అని అనుకుని “దొందూ దొందే” అంటే ఇదేనేమో! అని నవ్వుకుంటాడు. 


ఇంతకీ అది నవ్వో? ఏడుపో? రాసే నాకన్నా చదివే నీకే అర్థం అవ్వాలి సుమా!

***

బి. సత్యవాణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: బి. సత్యవాణి

హాబీస్ చదవడం, కథలు నవలలు రాయడం, కార్టూన్స్ గీయడం.

48 views0 comments

Comments


bottom of page