#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #OnePlusOneOffer, #వన్ప్లస్వన్ఆఫర్, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు
One Plus One Offer - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 27/11/2024
వన్ ప్లస్ వన్ ఆఫర్ - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
శృతి, కావేరి మంచి ఫ్రెండ్స్. సిటీ కి తలో దిక్కులో వాళ్ళ భర్తలతో ఉంటున్నారు.
"తొందరగా కానీవే కావేరి.. " అంది శృతి
"ఎందుకే అంత తొందర నీకు.. ?" అడిగింది కావేరి
"నీకేం తెలుసే నా బాధ.. అసలే మా ఆయన వచ్చేస్తారేమోనని తెగ కంగారుగా ఉంది.. "
"నువ్వే కదే మీ ఆయన ఊరు వెళ్లారు.. రెండు రోజుల వరకూ రారని చెప్పావు.. అందుకే కదా ఈ పార్టీ మీ ఇంట్లో పెట్టుకున్నాము.. " అంది కావేరి
"అవును అనుకో.. మా ఆయన దృష్టిలో నేను చాలా మంచి అమ్మాయిని.. ఇలాంటివి చేస్తున్నానని తెలిస్తే, ఇంకేమైనా ఉందా.. " అంది శృతి
"మొగుడంటే ఎందుకే మరీ అంత భయపడతావు.. ?"
"నీకు మీ ఆయన అంటే భయం ఉండదా.. " అడిగింది పల్లవిని శృతి
"నీ అంత కాదే.. కావేరి అంటే టైగర్.. ఎలాగో మనకి టైం పాస్ కావాలి కాబట్టి.. ఈరోజు నైట్ అంతా.. మన విషయాలు గుర్తు చేసుకుని.. లెట్స్ ఎంజాయ్.. "
"వస్తూ.. వస్తూ.. కవర్ లో ఏవో తెచ్చినట్టున్నావు.. " అడిగింది శృతి
"దీనినే తీర్దం అంటారు.. కొంతమంది అమృతం అని కుడా అంటారు.. నువ్వు ఏమైనా అనుకో.. దీని కిక్కే వేరబ్బా.. "
"రామ.. రామ..! ఉదయం పుట పూజ చేసుకుని మంచి తీర్దం తీసుకోవడమే తెలుసు నాకు.. ఇదెక్కడ తీర్దం.. ? " అమాయకంగా అడిగింది శృతి
"ఒసేయ్ మొద్దు..! కాలం తో మనము మారాలి.. అన్నీ తీర్ధాలు రుచి చూడాలే.. . దీనిని బాటిల్ లో పోసి అమ్ముతారు. పార్టీ అంటే, కూల్ డ్రింక్స్ తాగడం అనుకున్నావా..? ఈ మగవారికేనా, మనకివద్దా.. ఇలా దద్దోజనం లాగ ఉంటే, మగవారితో పాటు సమానంగా ఎలా ఉంటాం మరి చెప్పు..! అందుకే, దారిలో కార్ ఆపి మరీ నాలుగు బాటిల్స్ తెచ్చాను.. వన్ ప్లస్ వన్ ఆఫర్ లో.. "
"అయ్యో..! ఇప్పుడు వీటిని తాగాలా.. . ? నేనేమో టీ పార్టీ అనుకున్నాను"
"మరి కాదా.. ? ఎప్పుడూ తాగే ఆ టీ అందరి ముందు దర్జాగా తాగొచ్చు.. ఇలాంటివి ఇప్పుడే గొంతులో దింపేయాలి. అంతే కాదు.. ఈ కవర్ లో తెల్లటి సిగరెట్స్, నల్లటి చుట్టలు అన్నీ బ్రాండ్స్ ఉన్నాయి. ఒక చేతితో మందు గ్లాస్, మరో చేతిలో వెలుగుతున్న సిగరెట్టు.. భలే మజా వస్తుందే శృతి.. "
"నాకు వద్దు.. "
"ఏమిటే వద్దు..! మొన్న మీ హీరో.. సినిమాలో ఇలా చేస్తే, ఎంత బాగున్నో అని అన్నావుగా.. ఇప్పుడు నీకు చేసే అవకాశం వస్తే, నాటకాలు అమ్మాయిగారికి.. "
"అంటే, అది కాదు.. ఇల్లంతా అపవిత్రం అయిపోతుందేమోనని.. . "
"నోట్లోకి జామ ఆకులు.. ఇంటికి దూపం వేసుకుంటే సరి.. థింక్ పాజిటివ్ శృతి.. "
"మరి మంచి స్టఫ్ ఉండాలిగా.. " అని అప్రయత్నంగా అనేసింది శృతి.
"ఇప్పుడు వచ్చావే దారిలోకి.. అమ్మా..! నీ మనసులో ఎంతో వుంది.. బయటకి అన్నీ నాటకాలు.. . "
"మొన్న సినిమాలో కమెడియన్స్ అంతా.. ఇలాగే స్టఫ్ ప్యాకెట్స్ తింటారుగా తాగుతూ.. అదే గుర్తు వచ్చింది.. " అంది శృతి.
"అయినా.. . నీకు ఎప్పుడైనా, ఒక్కసారైనా అనిపించలేదా శృతి.. . జనాలు ఈ మందంటే ఎందుకు అంత పడిచస్తారో అని..! ఇదే మంచి అవకాశం, కాస్త రుచు చూడు..! నీకున్న భయం గియం అన్నీ పోతాయి.. " అంటూ బాటిల్ ఓపెన్ చేసి.. గ్లాసులలో పోసి చీర్స్ చెప్పింది కావేరి.
"అవునే.. ఎప్పుడూ జనాలతో కిట కిట లాడేది ఈ మందు షాపులే కదా.. ఇందులో ఏదో ఉందే..! నువ్వు మరీ చెబుతుంటే, కాదని అనలేకపోతున్నానే కావేరి.. " అంటూ చిప్స్ ప్యాకెట్స్ ఓపెన్ చేసింది శృతి.
"పెళ్ళైన మనం పబ్స్ కి ఎలాగో వెళ్లలేం.. . ఈ ఇల్లే క్లబ్ అనుకుని, అన్నీ ఎంజాయ్ చెయ్యి.. " అంటూ గ్లాస్ చేత పట్టి గొంతులోకి చల్లటి మందు దింపారు ఇద్దరు .
"అమృతమే ఇది.. ఇది తాగే కదా లోకంలో భర్తలకి బోలెడంత ధైర్యం వస్తుంది.. ఏం మనకి రాదా.. ? ఇప్పుడే మాట్లాడుతాను చూడు.. ఎవడొస్తే నాకేంటి భయం.. రమ్మను" అంది శృతి కావేరిని పట్టుకుని తూలుతూ డాన్స్ చేస్తూ.
'దీనికి అప్పుడే ఎక్కేసింది.. . భయం కూడా పోయినట్టుంది.. నాకన్నా ఫాస్ట్ గా ఉందే.. ' అనుకుంది కావేరి.
"మా ఆయన నన్ను ప్రేమించి పెళ్లిచేసుకున్నారే.. .. అప్పట్లో నేను సినిమా హీరోయిన్ లాగ ఉండేదానిని.. ఉండడమేంటి నేను సినిమా హీరోయిన్.. ఇప్పుడంటే ఇలా అయిపోయాను గానీ.. పెళ్ళైన కొత్తలో ఈ మందు బాటిల్ లాగ స్లిమ్ గా ఉండేదానిని. మా ఆయనికి ఎప్పుడూ బాటిల్ లో పొయ్యడమే తప్ప.. నా గొంతులో ఎప్పుడూ పోసుకోలేదే.. . ఈ అమృతాన్ని" .
"ఇప్పుడు ఎంచక్కా.. రేపటినుంచి మీ ఆయనకి కూడా కంపెనీ ఇవ్వొచ్చు. మీ ఆయన మీద ఎప్పుడో ఉన్న కోపం గుర్తు చేసుకుని.. . మత్తులో రెండు పీకినా.. తాగిన అకౌంట్ లోకి పోతుంది.. అది కుడా ట్రై చేయ్యరాదే శృతి. నువ్వేమో గానీ.. . రోజూ మా ఆయనా నేను సిట్టింగ్ వెయ్యనిదే.. మాకు మజా రాదే.. గుడ్ నైట్.. " అంటూ బై చెప్పి వెళ్లిపోయింది కావేరి.
ఇంకో రెండు పెగ్గులు వేసుకుని.. మొగుడిని కొట్టడానికి బోలెడంత ధైర్యం తో గుమ్మం దగ్గర వెయిట్ చేస్తోంది శృతి..
అలారం సౌండ్ కి ఉలిక్కి పడి లేచింది శృతి. టైం చూస్తే, తెల్లవారు జామున ఐదు.. వెంటనే ఫోన్ అందుకుంది..
"హలో కావేరి..! నాకు భయంగా ఉందే.. "
"ఏమైందే.. ఇంత ఉదయాన్నే.. "
"నాకు ఒక భయంకరమైన కల వచ్చిందే.. తెల్లవారు జామున వచ్చే కలలు నిజమవుతాయంటారు.. నిజమేనా.. ?"
"అవును అంటారు.. ముందు ఏ కల వచ్చింది అది చెప్పు.. అప్పుడు చెబుతాను.. "
"నువ్వూ.. నేనూ.. .."
"చెప్పవే.. .!"
"నువ్వు.. నేను.. మా ఇంట్లో మా ఆయన లేనప్పుడు మందు, సిగరెట్ రుచి చూసి పార్టీ చేసుకున్నామంట.. " అంది శృతి.
"నీ మనసులో అలాంటి పాడు ఆలోచనలు ఉన్నాయి గనుకే, ఆ కల వచ్చిందేమో.. ?".
"ఆ పార్టీ ఏర్పాట్లు చేసింది నువ్వే.. వన్ ప్లస్ వన్ ఆఫర్ లో నువ్వే మందు కుడా తెచ్చావు తెలుసా.. ? మందు, సిగరెట్, డాన్స్ లు రచ్చ రచ్చ అనుకో.. " అంది శృతి.
"ఇప్పుడే స్నానం చేసి మడి కట్టుకుని వచ్చానే. నీ మాటలతో నన్ను మళ్ళీ అపవిత్రం చేసావే.. మళ్ళీ స్నానం చెయ్యాలి. సినిమాలు చూసి ఇలాంటి కలలు కనడం. మళ్ళీ అందులో నాకో స్పెషల్ క్యారెక్టర్ ఇవ్వడం. నేను ఎప్పుడైనా మందు గురించి మాట్లాడానే.. ? అసలు కాఫీ కూడా తాగను కదే నేను.. అంత స్ట్రిక్ట్ నేను. ఈ సారి కలలు కంటే, నాకు మంచి రోల్ ప్లాన్ చెయ్యి.. ఇలాంటి చీప్ రోల్ కాదు.. " అంటూ కోపంగా ఫోన్ పెట్టేసింది కావేరి .
*****ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం*****
**********
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
😀