#JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #OnlineBooking, #ఆన్లైన్బుకింగ్, #TeluguKathalu, #తెలుగుకథలు
Online Booking - New Telugu Story Written By - Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 17/01/2025
ఆన్లైన్ బుకింగ్ - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“ఏమండీ! ఈ ఫోటో చూడండి, ఇందులో చీరలు అయిదు, వెయ్యి రూపాయలు ట, మనం బెనారస్ లో అడిగితే ఒక్క చీర ఆరువేలు అన్నాడు గుర్తుందా” అంది సుష్మ.
“కొనలేదు అని కూడా గుర్తుంది, ఆన్లైన్ లో వస్తువుల గురించి నమ్మలేము, పెళ్లి ముందు ఫోటోకి పెళ్ళైన తరువాత ఫోటోకి వున్నంత తేడా ఉంటుంది” అన్నాడు రమణ.
“చూడండి.. మిమ్మల్ని నేను ఆన్లైన్ ద్వారా నే సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకున్నాను. అది గుర్తుపెట్టుకోండి” అంది సుష్మ.
“అయినా యిప్పుడు అన్ని చీరలు కొని ఏం చేసుకుంటావు” అన్నాడు చిరాకుగా.
“ఒకసారి ఆ పేపర్ పక్కన పెట్టి నా మాట వినండి, కాలనిలో నాకు ఎంతోమంది స్నేహితురాళ్ళు వున్నారు. మనం ఒక వంద చీరలు కొని వాళ్ళకి అమ్మితే మనకి పదివేలు లాభం వస్తుంది. అప్పుడు చక్కగా మీ పెన్షన్ ఖర్చుపెట్టకుండా దాచుకోవచ్చు” అంది సుష్మ.
“చూడు.. నీకు కావాలంటే ఆ పదివేలు నేను యిస్తాను, దాచుకో. అంతేగాని యింట్లో చీరల బేరం పెడతాను అంటే నేను ఒప్పుకోను. అయినా నువ్వు అమ్మిన చీరలు క్వాలిటీ బాగుండకపోతే అల్లరి చేస్తారు” అన్నాడు.
“మీరు మొదటినుండి అంతే. నాకున్న పలుకుబడి ఉపయోగించి చిన్న వ్యాపారం చేద్దాం అని ఆశ పడితే అడ్డం పడుతున్నారు. మొన్న నా ఫ్రెండ్ కంచి నుంచి చీరలు తెప్పించి తెలిసినవాళ్ళకి అమ్మి రెండు చేతుల డబ్బు సంపాదిస్తోంది. దాని పేరు చెప్పితే తెలియని వాళ్ళు లేరు కాలనీలో” అంది.
“సరే నీ యిష్టం. నన్ను మాత్రం యిందులో యిరికించకు. ఎందుకైనా మంచిది ఒకసారి ఆ చీరల అమ్మేవాడిని అడుగు, నమ్మకం కలిగితే ఆర్డర్ యివ్వు. ముందుగా డబ్బు పంపకు. సరుకు వచ్చిన తరువాత డబ్బు యిస్తామని చెప్పు” అన్నాడు రమణ.
అనటం ఆలస్యం ఆన్లైన్ లోని అడ్రస్ కి ఫోన్ చేసి తాను చీరలు కొని హైదరాబాద్ లో అమ్మాలి అనుకుంటున్నాను అని, శాంపిల్ గా కొన్ని చీరలు పంపితే చూసి నచ్చితే వంద చీరలు చొప్పున ఆర్డర్ యిస్తాను అని చెప్పింది వచ్చిరాని ఇంగ్లీషులో.
“సరకు గారంటీ అమ్మా, మీరు ముందుగా వంద చీరలకు డబ్బు పంపితే యింకో పది పెర్సెంట్ తగ్గిస్తాను” అన్నాడు.
ముందుగా డబ్బు పంపకు అని రమణ చెప్పిన విషయం ఎక్కువ లాభం యిస్తాను అనగానే షాప్ అతని నెంబర్ కి గూగుల్ పే చేసేసింది సుష్మ.
పదిరోజులు దాటినా పార్సెల్ రాకపోవడంతో అదివరకు ఫోన్ చేసిన నెంబర్ కి ఫోన్ చేసింది. ఈ నెంబర్ తో ఏ ఫోన్ పనిచెయ్యడం లేదు అన్న వాయిస్ మెసేజ్ విని కంగారు పడి ఆ రోజంతా ఫోన్ అదే మెసేజ్ రకరకాల బాషల లో.
ఎందుకు అలా వున్నావు అని అడిగిన భర్తతో చావుకబురు చల్లగా చెప్పింది సుష్మ.
“కొంప ములిగింది, ఎవడో దొంగకి డబ్బు కాస్తా సమర్పించావు. రోజు వింటున్నావు కదా ఆన్లైన్ లో మోసం అని, మీ ఆడవాళ్ళకి చవకగా చీరలు అమ్ముతారు అంటే చాలు ఆలోచించకుండా పుష్పా సినిమాకి ముందుగా వెళ్లినట్టు ఉహించుకుంటారు. రేపు గూగుల్ పే వాడికి కంప్లైంట్ చేద్దాం” అన్నాడు.
“సముద్రంలో పోసిన నీరు లా డబ్బు కాస్తా పోయింది, మనస్సు బాగుండలేదు, తిరుపతి వెళ్లి ఆ దేవదేవుడిని దర్శనం చేసుకుని వద్దాం అండి” అని మొదలెట్టింది సుష్మ.
‘యింటికి ఏదో డబ్బు శని పట్టింది, ఒకసారి తిరుపతి వెళ్లి స్వామి దర్శనం చేసుకోవడం మంచిదే’ అనిపించి యిరవై వేలు పెట్టి శ్రీవాణి టికెట్స్ కొనుకున్ని తిరుపతి చేరుకున్నారు.
“యిదిగో, నువ్వు గదిలోనే వుండు. నేను వెళ్లి జుట్టు యిచ్చి వస్తాను” అన్నాడు రమణ. కేశ ఖండన శాల కు వెళ్లి కూర్చున్నాడు.
“ఇవ్వటానికి ఏముంది సార్, రెండు వెంట్రుకలు తప్పా, మరీ యింత బాల్డ్ హెడ్డు వచ్చేదాకా ఎందుకు ఊరుకున్నారు” అన్నాడు బార్బర్.
“అదేమిటి నాకు అద్దం లో జుట్టు వత్తుగా వున్నట్టు వుందే” అన్నాడు రమణ.
“అద్దం లో అలానే ఉంటుంది సార్, లేవండి అయ్యింది” అన్నాడు.
గదికి వచ్చి తలుపు కొట్టాడు. తలుపు తీసిన సుష్మ, భర్త గుండు చూసి, “అనకూడదు కాని, మీరు తలమీద రెండు వెంట్రుకలు వున్నపుడే బాగున్నారు, యిప్పుడు మొహం గుండు రెండు కలిసిపోయాయి” అంది నవ్వుతో. మొత్తానికి స్వామి దర్శనం చేసుకుని యింటికి చేరుకున్నారు.
యింటికి రాగానే అద్దంలో చూసుకుని గతుక్కుమన్నాడు. నిజమే జుట్టు లేకుండా నా మొహం నాకే బాగుండలేదు అనుకుని, మర్నాడు సుల్తాన్ బజారు వెళ్లి విగ్గు ఒకటి కొనుక్కుని పెట్టుకుని వచ్చాడు.
“ఆయన బయటకు వెళ్లారండి” అంటున్న భార్య తో “నీ మొహం నేనేనే” అంటూ లోపలికి వచ్చి విగ్గు తీసి భార్యకి చూపించాడు.
“యిప్పుడు మీకు విగ్గు అవసరమా అండి, తలకి గాలి ఆడక కుళ్ళిపోతుంది జాగ్రత్త” అంది.
ఒకరోజు ఉదయం చలిగా వుంది అని భార్య చీర తలనిండుగా కప్పుకుని పేపర్ చదువుకుంటున్న రమణ ని చూసిన పనిపిల్ల, “అమ్మమ్మ గా.. ఎప్పుడు వచ్చారు” అంది.
“ఓసి నీ దుంపతెగ, నేనే మీ అయ్యగారిని” అన్నాడు తలమీద వున్న చీర తీసివేసి.
“అచ్చు అమ్మమ్మ గారు లా వున్నారు సార్” అంది.
రమణ ని చూసిన చుట్టాలు అందరూ ఏ కొబ్బరి నూనె వాడావు, జుట్టు భలే వచ్చింది అని అడగటం మొదలుపెట్టారు. కొన్నాళ్లకి రమణ కి విసుగు వచ్చింది, విగ్గు రోజు తీసి పెట్టుకోలేక. యింట్లో విగ్గు లేకుండా, బయటకు వెళ్ళినప్పుడు విగ్గుతో వెళ్తున్నాడు.
“ఏమిటోనోయ్ జీవితం బోర్ గా వుంది, తినడం, పడుకోవడం యింతేనా” అన్నాడు.
“మీరు ఏమి అనను అంటే, మనం బద్రీనాద్ యాత్ర కి వెళదామా, జీవితం లో ఒక్కసారి ఈ ప్రయాణం చేసి చూడాలి అని అంటారు” అంది.
“నేను ఈ యాత్ర బస్సు లో రాలేను, మనమే స్వయంగా టికెట్స్, హోటల్స్ బుక్ చేసుకుని వెళ్దాం” అన్నాడు రమణ. భర్త యింత త్వరగా ఒప్పుకోవడం సుష్మ కి ఆశ్చర్యం కలిగించింది.
ఒక మంచి రోజు చూసుకుని, ఎక్కడెక్కడ నైట్ హల్ట్ వుందో చూసుకుని అక్కడ హోటల్స్ ఆన్లైన్ లో బుక్ చేసాడు.
“ఏమోయ్! నువ్వు గుఱ్ఱం ఎక్కగలవా?” అన్నాడు భార్యతో రమణ.
“గుర్రం మీద ప్రయాణం ఏమిటండి, చక్కగా విమానం లో వెళ్దాం” అంది సుష్మ.
“అదికాదే పిచ్చి మొహమా, కేదారేశ్వర స్వామి ని చూడాలి అంటే నడిచి, గుర్రం, లేదంటే హెలికాప్టర్ లో వెళ్ళాలి. నువ్వు జాన్సీలక్ష్మిభాయి లా గుర్రం మీద వెళ్తోవుంటే చూడాలని వుంది సుష్మ” అన్నాడు.
“అసలే నడుం నొప్పితో బాధపడుతున్నాను, హెలికాప్టర్ బుక్ చెయ్యండి, చక్కగా శ్రమ లేకుండా వెళ్లి రావచ్చు. డబ్బు దాచుకుని ఏం చేస్తారు” అంది.
గూగుల్ లో వెతికి కేదార్నాథ్ కి హెలికాప్టర్ సర్వీస్ ఏజెన్సీ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి వివరాలు కనుక్కుని రాను పోను టికెట్స్ బుక్ చేసి డబ్బు పంపించాడు. వాళ్ళు పంపించిన రసీదు ని ప్రింట్ తీసుకుని దేహరాడూన్ బయలుదేరి వెళ్లారు దంపతులు. ఎయిర్పోర్ట్ కి హోటల్ వాడు కారు పంపించాడు. హోటల్ చేరుకున్న రమణ, సుష్మ లు హోటల్ ని చూసి విస్తుపోయారు.
చిన్న గది, పరుపు మీద మాసిపోయిన దుప్పటి, దానిమీద నలిగిపోయిన మల్లెపువ్వులు. ఇదేమిటండి యిదేదో ఓయో హోటల్ లా వుంది, వెళ్లి మేనేజర్ ని అడగండి అంది సుష్మ భర్త తో.
రిసెప్షన్ దగ్గరికి వెళ్లి, “మాకు మీరు ఆన్లైన్ లో చూపించిన రూమ్ ఫొటోస్ ఏమిటి, యిప్పుడు మీరు యిచ్చిన గది ఏమిటి” అన్నాడు కోపంగా.
రిసెప్షన్ లో కూర్చుని వున్న పెద్ద మీసాల అతను క్యాహై అన్నాడు హిందిలో.
“వుండండి వీళ్ళకి తెలుగు ఎందుకు వస్తుంది, యిన్నాళ్ళు హైదరాబాద్ లో వుండి హింది నేర్చుకోలేదు మీరు” అంటూ తను అతనితో హిందిలో మాట్లాడి రూమ్ గురించి చెప్పింది.
“ఏమో మాకు ఏం తెలుస్తుంది? రూమ్ యిచ్చిన తరువాత గులాబీ పువ్వులు పెట్టుకున్నారో, మల్లెపువ్వులు పెట్టుకున్నారో, రూమ్ క్లీన్ చేయిస్తాను, అలా సోఫాలో కూర్చోండి” అన్నాడు హిందిలో.
ఆరోజు ఆ హోటల్ లో గడిపి కారులో యాత్ర మొదలుపెట్టి ఒక్కొక్క టెంపుల్ చూసుకుంటో పాఠా హెలికాప్టర్ సెంటర్ కు చేరుకుని తన దగ్గర వున్న ఆన్లైన్ బుకింగ్ టికెట్ చూపించాడు కౌంటర్ లో.
“ఈ టికెట్ నడవదు, యిటువంటి హెలికాప్టర్ సర్వీస్ లేనేలేదు. ఎవ్వరో మిమ్మల్ని మోసం చేసారు” అన్నాడు బుకింగ్ గుమస్తా.
“అదేమిటండి.. ఆన్లైన్ లో కేదార్నాధ్ కి హెలికాప్టర్ టికెట్స్ అనివుంటే, బుక్ చేసుకున్నాము. యిప్పుడు మీరు మాకు తెలియదు అంటే ఎలా” అన్నాడు రమణ.
“మీరు అడ్డం తప్పుకోండి, ఆ టికెట్స్ మేము ఇవ్వలేదు” అంటూ విసుకున్నాడు బుకింగ్ గుమస్తా.
వణుకుతున్న చేతులతో వస్తున్న భర్తని చూసి ఏమైంది అని అడిగింది సుష్మ.
“కొంపములిగింది, మనం ఆన్లైన్ లో కొన్న హెలికాప్టర్ టికెట్స్ మోసం ట. యిప్పుడు వేరే టికెట్స్ కూడా లేవు. గుర్రం ఎక్కాలి అంటే భయం గా వుంది. తిరిగి వెళ్ళిపోదామా” అన్నాడు రమణ అక్కడే వున్న బెంచీమీద కూర్చొని.
“ఆన్లైన్ లో నేను మోసపోయాను అని తిట్టినతిట్టు తీటకుండా తిట్టారు, యిప్పుడు మీరు మోసపోయారు. ఎలాగో అలా గుర్రము మీద వెళ్దాం” అంది.
ఇంతలో ఒక కుర్రాడు వీళ్ళ దగ్గరికి వచ్చి, “తెలుగు వాళ్ళా సార్, ఏమైంది హెలికాప్టర్ టికెట్స్ దొరకలేదా” అన్నాడు.
తెలుగు మాట విని ప్రాణం లేచివచ్చి, “అవును బాబు, టికెట్స్ ఆన్లైన్ లో కొన్నాము, వీళ్ళు అవి చెల్లవు అంటున్నారు, యిప్పుడు ఎలాగో తెలియడం లేదు” అన్నాడు రమణ.
“యిక్కడ భక్తులు ఎంతమంది వుంటారో అంతమంది మోషగాళ్లు వుంటారు సార్. మిమ్మల్ని చూస్తే మా అంకుల్ గుర్తుకు వస్తున్నాడు. గుర్రం మాట్లాడుతాను వెళ్తారా? కాని నడుము పుండు పడుతుంది, మీకు షుగర్ లేకపోతే పరవాలేదు” అన్నాడు.
“షుగర్ లేకేం నాయనా! సార్ వంటినిండా షుగరే” అంది సుష్మ.
“బాబు, నీ పేరేమిటో గాని మంచివాడివిలా వున్నావు, ఏదైనా అవకాశం వుంటే కొద్దిగా ఎక్కువ డబ్బులు యిచ్చి అయినా రెండు హెలికాప్టర్ టికెట్స్ యిప్పించు నాయనా” అంది.
వాడు “సరే అమ్మా, మాకు లోపల టికెట్స్ యిచ్చే వాళ్ళకి అలవాటే, టికెట్ కి వెయ్యి రూపాయలు ఎక్కువ తీసుకుంటారు, అంటే రెండు టికెట్స్ కి పన్నెండు వేలు అవుతుంది. నాకు విడిగా ఏమి ఇవ్వక్కరలేదు” అన్నాడు.
“ఏమండీ, పోతే పోయింది రెండు వేలు. యితని చేత టికెట్స్ తెప్పించుకుందాం” అంది.
“ఇప్పటికే ఇదివరకు టికెట్స్ కి పదివేలు పోయింది, యిప్పుడు పన్నెండు వేలు పెట్టడం అవసరమా, ఇంటికి పోదాం” అన్నాడు రమణ.
“బలేవారే, యింత దూరం వచ్చి వెనక్కి వెళ్తారా, ముందు ఇతనికి డబ్బు యిచ్చి పంపండి, బాబు నీ పేరు చెప్పలేదు” అంది.
“నాగభూషణం అమ్మా, మీకు నా మీద నమ్మకం వుంటేనే ఇవ్వండి, అసలే దెబ్బతిని వున్నారు” అన్నాడు వినాయంగా.
“నిన్ను చూస్తే మంచి వాడు లా వున్నావు, యిదిగో డబ్బులు, ఆధార్ కార్డ్స్. త్వరగా టికెట్స్ తీసుకుని రా నాయనా, నీ ఋణం ఉంచుకోము” అంది సుష్మ.
డబ్బులు తీసుకుని టికెట్ కౌంటర్ గదిలోకి వెళ్ళాడు అతను.
“సార్ పల్లీలు కావాలా” అంటూ ఇద్దరు కుర్రాళ్లు బుట్టలు పట్టుకొని వచ్చారు.
“ఒక పది రూపాయలుకు యివ్వు” అని పల్లీలు తీసుకుని తినడం మొదలుపెట్టారు.
“సుష్మా, టికెట్స్ తీసుకుని వస్తాను అని వెళ్లినవాడు యింకా రాలేదేమిటి?” అన్నాడు రమణ.
“అదే ఎందుకు యింకా రాలేదో, మీరు పల్లీలు తింటూ వుండండి, నేను టికెట్స్ కౌంటర్ గది దగ్గరకి వెళ్లి చూసి వస్తాను” అని అటువైపు వెళ్ళింది.
టికెట్స్ యిచ్చే గదిలో ఒక లేడీ క్లర్క్, ఒక అబ్బాయి కూర్చొని టికెట్స్ సరిచూసుకుంటున్నారు.
మెల్లగా లోపలికి వెళ్లి “బాబూ నాగభూషణం అనే అతను మీరు తెలుసు అని టికెట్స్ తెస్తాను అని మీ గదికి వచ్చాడు, అతను తిరిగి రాలేదు, మీరు టికెట్స్ యిచ్చారా” అని అడిగింది సుష్మ.
“యిక్కడ టికెట్స్ అమ్మము, టికెట్స్ వున్నవాళ్ళని హెలికాప్టర్ దగ్గరికి పంపుతాము. మీరు చెప్పిన అతను ఎవ్వరు రాలేదు” అన్నాడు.
“పాపం ఎవ్వరో యీవిడని మోసం చేసినట్టు వున్నారు” అంది ఆ లేడీ క్లర్క్ జాలిగా చూస్తో.
“రోజు యిదే తంతు మీలా మోసపోయేవాళ్లు” అంది.
“చూడమ్మా.. అతను మీరు తెలుసు అని పెద్ద మొత్తం పట్టుకుని మీ గదికి వచ్చాడు, మా బ్రతుకు అంతా మోసపోవడమే లా వుంది” అని కన్నీళ్లు పెట్టుకుంటూ భర్త దగ్గరికి నడిచింది.
“టికెట్స్ తెస్తాను అన్న వాడు అక్కడ లేడు, మీకేమైనా టికెట్స్ తెచ్చి యిచ్చాడా” అంది భర్తతో.
“రాలేదు. వీడు కూడా మోసగాడే అన్నమాట, నోరుమూసుకుని రిటర్న్ వెళ్ళిపోదాం, యిహ ప్రయాణం అంటే చంపుతా” అన్నాడు కోపంగా.
“నేనేమి చేసాను, మన కళ్ల ముందే టికెట్ యిచ్చే గదిలోకి వెళ్ళాడుగా, మనకి తెలియకుండా బయటకు ఎలా వస్తాడు” అంది రమణ తో.
“నీ మొహం, మన చుట్టూ పల్లీలు అమ్మే వాళ్ళు వున్నప్పుడు వాడు పారిపోయాడు అనుకుంటా” అన్నాడు.
“మీరు యిక్కడే కూర్చోండి, ఒకసారి చుట్టుప్రక్కల చూసి వస్తాను, వాడిని వదలకూడదు” అంటూ వెళ్ళింది సుష్మ. ఎండకి తల మాడిపోతోంది అని సంచిలోనుంచి విగ్గు తీసుకొని పెట్టుకుని కూర్చున్నాడు దిగులుగా.
ఇంతలో “ఏం సార్! హెలికాప్టర్ టికెట్ దొరకలేదా” అంటూ గంట క్రితం తన దగ్గర డబ్బులు కొట్టేసిన కుర్రాడు అడిగాడు. బహుశా విగ్గతో వుండటంతో ఎవ్వరో అనుకుని వచ్చాడు.
“అవును నాయనా! నీకు ఎవ్వరైనా తెలిస్తే ఒక టికెట్ ఇప్పించ గలవా” అన్నాడు.
దూరం నుంచి తమని గమనించిన సుష్మ అక్కడ వున్న పోలీస్ ని తీసుకొని రావడం చూసి రమణ ఆ కుర్రాడిని మాటల్లో పెట్టాడు.
“మీకెందుకు.. మీరు ఒక ఎనిమిది వేలు యిస్తే యిట్టే మీకు హెలికాప్టర్ టికెట్ తెస్తాను” అంటున్న కుర్రాడి మెడకాయ ని గట్టిగా పట్టుకున్నాడు పోలీస్.
“ఏరా వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి పారిపోతావా” అన్నాడు పోలీస్.
సుష్మ ని చూసి కంగారు పడ్డ కుర్రాడు పక్కకి చూడగా విగ్గు తీసి నవ్వుతూ కనిపించాడు రమణ.
బయట జరుగుతున్న గొడవకి బుకింగ్ క్లర్క్ బయటకు వచ్చి చూసి, ఆమె కూడా అతని మీద కంప్లైంట్ యిచ్చింది. పోలీస్, వాడిని తన్నుకుంటూ తీసుకుని వెళ్ళిపోయాడు.
“అమ్మయ్య.. మొత్తానికి మీ విగ్గు వల్ల మన డబ్బులు తిరిగి వచ్చాయి. వాడు మిమ్మల్ని కొత్త కేసు అనుకున్నాడు” అంది సుష్మ. ‘యిక్కడ నుంచే ఒక దణ్ణం పెట్టుకుని మన ఊరు వెళ్ళిపోదాం’ అంది.
సరే పద అంటూ లేచిన రమణ కి దూరం నుంచి బుకింగ్ క్లర్క్ తమని పిలవటం చూసి ఆమె దగ్గరికి వెళ్లారు.
“సార్! యిప్పుడే ఒక ఫ్యామిలీ అయిదు టికెట్స్ బుక్ చేసుకుని ముగ్గురే వచ్చారుట, మీరు వాళ్ళతో పాటు హెలికాప్టర్ లో వెళ్ళండి. టికెట్స్ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి” అంది.
“సంతోషం తల్లి, యింత దూరం వచ్చి శివుడు ని చూడకుండా వెళ్తున్నామని విచారం గా వున్న మాకు దేవత లా సహాయం చేసావు” అంటూ, ఆమె చూపించిన ఫ్యామిలీ తో కలిసి హెలికాప్టర్ ఎక్కారు.
“ఆన్లైన్ నమ్మద్దు అనుకుంటే డైరెక్ట్ గా కూడా మోసగాళ్లు తయారు అయ్యారు” అంది సుష్మ.
“అవును, యింతటితో యాత్రలు ముగించి ఇంట్లోనే పడుందాం” అన్నాడు రమణ.
ఆన్లైన్ తో జాగ్రత్తగా వుండండి.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
చాలా బావుంది..హాస్య కథల పోటీలో సెలెక్ట్(ప్రైజ్) అ(రా)వ్వాల్సిన కథ ...😃👍👏👏
ఉషారాణి
విగ్గు వల్ల పోయిన డబ్బు రావడం బావుంది.
సీతారామరావు
ఆన్లైన్ బుకింగ్: జే. శ్రీనివాస్
ఈ కథ మేలు కొలువు ప్రతి ఒక్కరికి.
బాగా తెలుసుకున్న తరువాతే ఆన్లైన్ బుకింగ్ చేయాలి ... ఏ విషయం లో నైనా ... అమెజాన్ వంటి పెద్ద సంస్థలు , ప్రభుత్వ సంస్థలు అయితే పరవా లేదు.
ప్రత్యేకంగ బీద వారు మరియు మధ్య తరగతి కుటుంబం వారు చాలా జాగ్రత్త వహించాలి ... డబ్బు చెట్లకు కాయవు కదా! కష్టోడ్చి సంపాదించింది.
పి. వి. పద్మావతి మధు నివ్రితి
రమణ, సుష్మ, వారి అనుభవాలు ఎంత దైన్యంగా ఉంటాయో, అయితే ఆ పరిస్థితులను ఎదుర్కోవడం కూడా వారి వైఖరి, చమత్కారం, బాధ్యతా నైపుణ్యాన్ని చూపిస్తుంది.
ఈ కథ వినోదాత్మకంగా ఉంటూనే ఆన్లైన్ మోసాలు, అవగాహన లోపాలు, ప్రస్తుత కాలపు ప్రజల జీవితాలలోని అనివార్య సమస్యలను ప్రతిబింబిస్తుంది.