top of page

పదవీ విరమణ

#VemuriRadharani, #వేమూరిరాధారాణి, #PadaviViramana, #పదవీవిరమణ, #TeluguKathalu, #తెలుగుకథలు


Padavi Viramana - New Telugu Story Written By Vemuri Radharani

Published In manatelugukathalu.com On 21/04/2025

పదవీ విరమణ - తెలుగు కథ

రచన: వేమూరి రాధారాణి

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



"మమ్మీ! మమ్మీ! లే మమ్మీ! స్కూల్ టైం అవుతుంది బస్సు వస్తుంది లే " అంటూ నిద్ర లేపుతున్న హాసిత్ ని విసుక్కుంటూ 


"వెళ్లి నాయనమ్మ ని లేపు, ప్లీజ్ నన్ను పడుకోనివ్వు "అంటూ ముసగు పెట్టింది రాత్రంతా మీటింగ్ అటెండ్ అయిన శ్రీమయి. 


ఇక మమ్మీ తో లాభం లేదనుకుని


"డాడీ! డాడీ! లే నన్ను రెడీ చెయ్యి డాడీ.. స్కూల్ టైం అయ్యింది " అంటూ లేపి లేపి విసుగు వచ్చి పడక గది నుండి బయటకు వచ్చాడు హాసిత్. 


ట్రింగ్! ట్రింగ్! అని అలారం మోగగానే, శ్రీమయి లే అంటూ హడావిడిగా బాత్ రూంలోకి వెళ్ళాడు రాహుల్. 


శ్రీమయి ఇంకో బాత్ రూమ్ లోకి వెళ్లి స్నానం కానిచ్చి హడావిడిగా వంట గదిలోకి వెళ్ళింది. రోజూ ఎదురుగా కనిపించే టిఫిన్ కనిపించక పోయే సరికి దొరికిన పండు తీసుకుని

 

"రాహుల్, నాకు టైం అయిపోతుంది, నేను వెళ్తున్నాను, అత్తయ్య లేచినట్టు లేదు ఒకసారి చూసి వెళ్ళు" అంటూ బండి కీస్ తీసుకుని పరుగులు పెట్టింది శ్రీమయి. 


"అయ్యో నాకు టైం లేదు, వచ్చాక మాట్లాడతాలే అమ్మతో అంటూ కారు కీస్ తీసికుని తలుపు దగ్గరకు వేసి వెళ్ళాడు రాహుల్. 


ఆఫీస్ కి వెళ్లి వెళ్ళగానే ఫోన్. 


"హలో! మీరు రాహుల్ గారేనా? మేము స్కూల్ నుండి మాట్లాడుతున్నాం, ఒకసారి స్కూల్ కి రాగలరా మీ బాబు గురించి మాట్లాడాలి " అంటూ ఫోన్ పెట్టేసారు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా. రాహుల్ కి కంగారు పుట్టింది, 'హాసిత్ కి ఏం కాలేదు కదా ' అనుకుంటూ శ్రీమయి కి కాల్ చేయబోయే లోపు 


"రాహుల్ గారు! చీఫ్ మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారు క్లయింట్ లైన్ లో ఉన్నారట అంటూ రిసెప్షనిస్ట్ చెప్పగానే బాస్ రూమ్ లోకి వెళ్ళాడు రాహుల్. 


*********

శ్రీమయి ఆఫీస్ కి వెళ్లి వెళ్ళగానే టీం లీడర్ నుండి పిలుపు


 "మీది నిన్నటి వర్క్ పెండింగ్ ఉంది, చూడండి కోడింగ్ చాలా అర్జెంట్, చైర్మన్ వస్తారు కాసేపటిలో త్వరగా పూర్తి చెయ్యండి" అంటూ చెప్పేసరికి ఆ పనిలో పడింది. 

ఫోన్ మోగగానే అబ్బా ఈ టైమ్ లో ఎవరు డిస్ట్టర్బ్ చేస్తున్నారు అనుకుంటూ ఫోన్ మ్యూట్ లో పెట్టింది. 

శ్రీమయి పని అయ్యేసరికి సాయంత్రం నాలుగు అయిపోయింది. అప్పుడు ఫోన్ చూసుకున్న శ్రీమయి షాక్ అయ్యింది, అన్ని మిస్డ్ కాల్స్ చూసి. దాంట్లో స్కూల్ నుండి వచ్చినవి, కొత్త నెంబర్ నుండి వచ్చినవి ఉంటే, ముందుగా కొత్త నెంబర్ కి కాల్ చేసింది. 


"హలో.. ఎవరండి?" అంటుండగానే 

"నమస్తే మేడం, నా పేరు సురేష్.. నేను స్కూల్ నుండి మాట్లాడుతున్నాను, హాసిత్ బాబు నా దగ్గరే వున్నాడు పిల్లలందరూ వెళ్లిపోయారు, బాబు ని తీసుకు వెళ్ళడానికి ఎవ్వరూ రాలేదు. త్వరగా రండి మేడం" అంటూ ఫోన్ కట్ చేసాడు. 


'అదేంటి ఎప్పుడూ లేనిది స్కూల్ నుండి ఫోన్ వచ్చింది!.. అత్తయ్య స్కూల్ కి వెళ్లలేదా? ఏమైంది? పొద్దున రాహుల్ కి చెప్పి వచ్చాను గా చూడమని ' అనుకుంటూ రాహుల్ కి కాల్ చేసి "రాహుల్ ప్రొద్దున నేను అత్తయ్య తో మాట్లాడమని చెప్పానుగా మాట్లాడలేదా!?


స్కూల్ నుండి ఫోన్ వచ్చింది, బాబుని తీసుకువెళ్ళడానికి ఎవరూ రాలేదని" అంటూ విషయం చెప్పగానే రాహుల్ కంగారు పడుతూ


"నేను ఇంటికి వెళ్తాను, అమ్మకి ఆరోగ్యం బాగోలేదేమో, నువ్వు హాసిత్ ని తీసుకునిరా " అంటూ ఇంటికి బయలుదేరాడు. 


ఇంటికి వెళ్లి చూసేసరికి తలుపు వేసినది వేసినట్టే ఉంది, ఇంకా నయం ఎవరూ దూరలేదు ఇంట్లోకి అనుకుని' "అమ్మా! అమ్మా! అని పిలుస్తు బాల్కని లో వెదికాడు. అక్కడ కనపడక పోయేసరికి, అమ్మా! అమ్మా!" అంటూ గదిలోకి వెళ్ళాడు అక్కడ ఉందేమో అనుకుని. గది ఖాళీగా వెక్కిరించింది. 


'పక్క ఇంటి కి గానీ వెళ్లిందేమో'అనుకుని


"ఏమండీ మా అమ్మ వచ్చిందా? " అని వాకబు చేసి నిరుత్సాహం గా వెనక్కి వచ్చాడు. అమ్మకి ఎన్ని సార్లు ఫోన్ చేసినా కలవడం లేదు. కంగారు ఎక్కువయ్యింది ఏమై ఉంటుందో అని. 


తెలిసిన వాళ్ళ అందరికీ ఫోన్ చేశాడు, ఎటువంటి కబురు అందలేదు. బాబుని వదిలి అస్సలు వెళ్ళదు అలాంటిది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, అమ్మకి ఏమీ కాలేదు కదా, అనుకుంటూ తల్లి గదిలోకి వెళ్లి అచేతనంగా అలా కూర్చుండి పోయాడు. 


"రాహుల్! చూశావా! పిల్ల వాడిని స్కూల్ కి ఎలా పంపిందో మీ అమ్మ.. వాడి అవతారం చూడు, తనకి చేత కాకపోతే నన్ను లేపొచ్చుగా" అంటూ అరుస్తూ రాహుల్ దగ్గరికి వచ్చిన శ్రీమయి నిస్తేజంగా కూర్చుని ఉన్న రాహుల్ ని చూస్తూ కంగారుగా 


"ఏమైంది రాహుల్? ఎందుకలా వున్నావ్? అత్తయ్య ఎక్కడ? ఫ్యాన్ వేసుకోలేదే?" అంటూ ఫ్యాన్ వేసి మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చింది. ఫ్యాన్ స్పీడ్ అందుకోగానే గాలికి ఓ పేపర్ వచ్చి రాహుల్ దగ్గర పడింది. 


దాన్ని చూసేసరికి రాహుల్ కి దిమ్మ తిరిగినట్టయ్యింది. ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది. లెటర్ చదివిన శ్రీమయి మాటరాని దానిలా కూలబడింది. 

*********

"ప్రియమైన రాహుల్! అమ్మగా నేను గెలిచానో, ఓడానో తెలియని పరిస్థితి. నువ్వు స్కూల్ లో ఉన్నప్పుడు ప్రతీ ఈవెంట్ కి నేనూ, మీ నాన్న గారు దగ్గర ఉండి తీసుకువెళ్లేవాళ్ళం. ప్రతి చిన్న విషయాన్ని నువ్వు మాతో పంచుకునే వాడివి. నీ బాల్యం ఎక్కడ మిస్ అవుతుందో అని సాధ్యమైనంత వరకు బయటకి వెళ్లకుండా నీతో పాటే వుంటూ, నువ్వు ఆడుకుంటుంటే మురిసి పోయేదాన్ని. నాన్నగారు పోయాక నీకు నాన్న లేని లోటు తెలియకుండా పెంచాలని ప్రతి చిన్న విషయం జాగ్రత్తగా చూసుకునే దాన్ని.

 

నువ్వు ప్రయోజకుడివి అయ్యావని మురిసి పోయాను. నా కష్టం ఫలించింది అని సంబర పడ్డాను. కానీ అది ఎంతో కాలం నిలువలేదు. నీలాగే నీ కొడుకు పెరుగుతాడు అనుకున్నాను. కానీ.. మీ ఇద్దరినీ చూస్తుంటే అలా అనిపించడం లేదు. ఇద్దరూ ఎప్పుడూ బిజీగానే ఉంటారు ఉద్యోగం అంటూ. 

కాలంతో పాటు మనం మారాలి తప్పదు అది ఒప్పుకుంటాను కానీ.. డబ్బు ఒక్కటే జీవిత పరమార్థం కాదు. మీకు ఒక బిడ్డ ఉన్నాడు, వాడికి కోరికలు ఉంటాయి అనే సంగతే మరచిపోతున్నారు. ఆరు సంవత్సరాల పసివాడు వాడు. వాడి కి ఏమి ఇష్టమో, వాడు ఏమి తింటాడో మీకు తెలుసా? వాడికి ఎటువంటి బట్టలు ఇష్టమో తెలుసా? మొన్న స్కూల్ లో ఎవరో మీ అమ్మ పేరు ఏంటి అంటే నా పేరు చెప్పాడు వాడు. 


అమ్మా, నాన్నగా మీరు వాడికి చూపించిన ప్రేమ ఎక్కడ. వారం లో ఒక్కసారైనా వాడితో గడిపారా? ఒక్కసారైనా వాడిని బయటకు తీసుకు వెళ్లారా? వాడికి నచ్చినది వండి పెట్టారా? వాడి పుస్తకాలలో ఏముందో చూసారా?వాడి ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకున్నారా? ఆదివారం వస్తే రెస్ట్ అంటూ కాసేపు, రిలీఫ్ కోసం అంటూ వాడిని వదిలేసి బయటకు మీరు ఇద్దరూ వెళ్లడం ఇదంతా చూసే పసి మనసు ఎంత నొచ్చుకుంటుందో ఆలోచించారా? 


అమ్మతనం, నాన్నతనం మీ ఇద్దరూ కోల్పోయి యంత్రాల్లా పని చేస్తూ మిమ్మల్ని మీరే మరచి పోతున్నారు. నాన్న చెప్పే కథలు వాడికి తెలియవు, అమ్మ తో ఆడుకోవడం, దోబూచులాటలు తెలియవు. బాల్యం మాధుర్యం తెలియదు. మీరే కాదు ఇప్పటి తల్లితండ్రులు అందరూ. వాడు అడుగులు వేయడం మొదలు పెట్టగానే బడి, ట్యూషన్, డాన్స్, కరాటే, స్పోర్ట్స్ అంటూ నిమిషం తీరిక లేకుండా చేస్తున్నారు. 

ఎప్పుడైనా బయటకు వెళ్తే మిగిలిన పిల్లల్ని చూసి మొహం చిన్నబుచ్చుకునే వాడు హాసిత్. వాళ్ళ లాగా అమ్మా నాన్న నన్ను ఎందుకు తీసుకు వెళ్ళరు అంటూ వాడి కళ్ళల్లో వంద ప్రశ్నలు.. దానికి నా దగ్గర సమాధానం లేదు. వాడి పసి మనసు ఎంత గాయపడి వుంటుందో ఆలోచించారా?


రేపు వాడు ప్రేమ, ఆత్మీయతలు తెలియని యంత్రం లా తయారవుతాడు. అప్పుడు మీరు బాధ పడినా ప్రయోజనం ఉండదు. సంపాదించే డబ్బు ఎవరి కోసం? 

పెద్దయ్యాక వాడు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరా మీరు?


నన్ను నేను ఎన్ని సార్లు ప్రశ్నించుకున్నానో! నేను చేయబోయేది సబబేనా? కాదా? అని. కానీ నాకు తప్పలేదు. మీ మనసులు చిన్న బుచ్చుకున్నా ఫర్లేదు నేను నా నిర్ణయాన్ని చెబుతున్నాను. నేను నాయనమ్మ గా, అమ్మగా పదవీ విరమణ చేస్తున్నాను. 


ఇక నుండి హాసిత్ బాగోగులు అన్నీ మీ ఇద్దరే చూసుకోండి. నేను మన ఊరికి వెళ్తున్నాను. నాకు కాల్ చేయకండి. నేనే అప్పుడప్పుడు వస్తాను మీ దగ్గరికి. లేదా మీరే రెండు రోజులు సెలవు పెట్టుకుని పిల్లవాడిని తీసుకుని రండి. 


చివరిగా హాసిత్ కి..


నాన్నా హాసిత్! ఇప్పటి నుండి నువ్వు, అమ్మా నాన్న చెప్పినట్టు వినాలి, నేనే నీకు ఫోన్ చేసి మాట్లాడతాను ఇక వుంటాను. మిమ్మల్ని నొప్పిస్తే నన్ను క్షమించండి. 

ఉత్తరం చదువుతున్నంత సేపు కళ్లు ధారాపాతంగా వర్షిస్తూనే ఉన్నాయి ఇద్దరికీ. ఒక్కసారిగా గుర్తు వచ్చినట్టు అయ్యి 

"హాసిత్! నీకు అన్నం ఎవరు పెట్టారు?" అని అడిగింది శ్రీమయి. 


"నానమ్మ అక్కడ ఫ్రూట్స్ పెట్టిందిగా. అవి బాక్స్ లో పెట్టుకుని వెళ్ళాను. నా వాటర్ బాటిల్ నేనే నింపుకోవాలి అని నానమ్మ చెప్పింది. నేను మిమ్మల్ని లేపాను కానీ మీరు లేవలేదు, నానీ కూడా లేదు, నానీ స్కూల్ కి టైం కి వెళ్ళాలి అని చెబుతుంది అందుకే.. నా డ్రెస్ కూడా నేనే వేసుకున్నాను" అన్నాడు చక్రాల్లాంటి కళ్ళు తిప్పుతూ ఫస్ట్ క్లాస్ చదువుతున్న హాసిత్. 


బాబు చెబుతూ ఉండగా డ్రెస్ వైపు చూసారు ఇద్దరూ. యూనిఫామ్ సరిగ్గా లేదు. టై లేదు. 


"నిన్ను స్కూల్ లో ఎవరు దింపారు? అని రాహుల్ అడగగానే 

"నాన్నా! బస్ అంకుల్ నన్ను రోజూ చూస్తాడుగా నాయనమ్మకి బాగాలేనప్పుడు బస్ ఎక్కుతాము అందుకే నేను చెయ్యి ఎత్తితే బస్ ఎక్కించుకున్నాడు" అన్నాడు అమాయకంగా. 


ఇవన్నీ వింటున్న శ్రీమయి, రాహుల్ గుండె తరుక్కు పోయింది. 

ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. చిన్నప్పుడు మనం ఎలా పెరిగాం అని ఉహించుకునేసరికి తల్లితండ్రుల్లా సిగ్గు వేసింది. 


హాసిత్ ని దగ్గరకు తీసుకుని "ఇక నుండి మేమే నీకు బాక్స్ పెడతాము, మేమే నిన్ను స్కూల్ నుండి తీసుకువస్తాము" అంటూ గుండెలకు హత్తుకుంది కొడుకుని శ్రీమయి. 


'అసలు అమ్మ ఇంట్లో ఉందో లేదో, పిల్లవాడు వున్నాడా లేడా అనేది కూడా ఆలోచించలేనంత మూర్ఖులం అయ్యామా' అనుకున్నాడు రాహుల్. 


రాత్రికి హాసిత్ నిద్రపోగానే రాహుల్ తల్లికి ఫోన్ చేశాడు. "అమ్మా చాలా థాంక్స్ అమ్మా, మా కర్తవ్యాన్ని గుర్తు చేసినందుకు " అంటూ బావురుమన్నాడు. “నిన్ను బాధ పెట్టాను క్షమించు అమ్మా!” అన్నాడు ఉద్వేగంగా. 


"నేను కాదు క్షమించాల్సింది వాడు, ఈ వయసులో పిల్లలకి కావాల్సింది తల్లిదండ్రుల ప్రేమ. డబ్బు, సౌకర్యాలు కావు. మీరు నన్ను క్షమించాలి ఇబ్బంది పెట్టినందుకు. ఇప్పటికైనా తెలుసుకున్నారు అదే చాలు " అంది సంతోషంగా రాహుల్ తల్లి. 


***

వేమూరి రాధారాణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

రాధా రాణి. వేమూరి

స్కూల్ ప్రిన్సిపాల్

కవితలు, కథలు వ్రాస్తాను. ఇంతకు ముందు వేరే మాధ్యమాలలో వ్రాసాను.




Comments


bottom of page