top of page

పద్మలాంఛన


'Padma Lanchana' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally

'పద్మలాంఛన' తెలుగు కథ

రచన: సుదర్శన రావు పోచంపల్లి


“పద్దూ! ఒక కప్పు కాఫీ ఇస్తవా?” అని అడుగుతాడు మధుహన్ పద్మలాంఛనను.


“నా చేతులు ఖాళీ లేవు మధూ” అంటుంది పద్మలాంఛన.


“అయితె ఉన్నప్పుడు చెప్పు ఓపిక పడుతాను” అంటాడు మధు హన్.


“రాత్రి పది గంటలకు” అంటుంది పద్మలాంఛన.


అంటూ “ఈ లోగా బజారుకు పోయి కూరగాయలు, నేను వ్రాసి బల్లమీద పెట్టిన సరుకులు తీసుకరా” అనగానే “వామ్మో! అయితె ఈ రోజు పస్తేనా” అంటాడు మధుహన్.


“మరి గంట గంటకు కాఫీ అడగడ మేమిటి? ఈ రోజు మీ కార్యాలయానికి సెలవు ఇచ్చింది అందుకేనా” అంటూ పిండి కలుపుతున్న చేతులతోనే వంటయింటినుండి బయటకొస్తుంది పద్మలాంఛన.


“ఓహో! ఈరోజు ఏదో పిండివంటలు చేస్తున్నట్టున్నది దొరసానిగారు” అంటాడు మధుహను.


“మధూ! నీకు ఇష్టమైన నేతి గారెలు చేస్తున్నాను. బజారుకు పోయి త్వరగా వస్తె తినొచ్చు. అటు తరువాత మా అమ్మగారింటికి భోజనానికి పోవాలె” అంటుంది పద్మలాంఛన.


“అయితె ఈ కూరగాయలు, సరుకులు రేపు తెస్తాను లే” అంటాడు మధుహన్.


“ఈ రోజు మాచెల్లెకు పెళ్ళి చూపులు. అదే పోయి ఇవ్వన్ని తెస్తనంటె ముస్తాబు కావాలె గద.. ఇంట్ల ఇంకెవరున్నరని, మా నాన్న అమ్మా చేతకాని వాళ్ళేకద” అంటుంది పద్మలాంఛన.


“సరెతియ్యి. నేను ఇప్పుడే పోయి అవన్ని తీసుకవస్త” అంటాడు మధుహన్.


“ఇంతకీ మీ గీర్దేవికి వచ్చే ఆ జేజేపెద్ద ఎవరో” అంటాడు వ్యంగ్యంగా.


“ఆ విషయాలన్ని అక్కడికి పోయినంక తెలుసుకుందువు, నా చేయి ఆరిపోతుంది. నువ్వు బయటికి పోతె నేను తలుపు పెట్టుకుంటాను” అంటుంది పద్మలాంఛన ఎడమ చేయి బోర్లేసి ముంగురులు సవరించుకుంటు.


సరె అనుకుంటు బయటికి పోతాడు మధుహన్.


తలుపుకు గొళ్ళెము పెట్టి వంటింటికి పోయి ఫలహారాలు చేయ నారంభించింది పద్మ లాంఛన.


త్రొవలో సరుకుల జాబితా చూసి ఉలిక్కి పడుతాడు మధుహన్. అందులో పెళ్ళి చూపుల సందర్భమున పెట్టవలసిన పండ్లు, బట్టలు, తమలపాకులు ఇత్యాదివే కాక పది పండెండు మందికి సరిపోను కూరగాయలు ఇత్యాదివి. ప్ల్చ్ తప్పదు అనుకుంటు అందులో ఏఒక్కటి లేదు అనకుడా తీసుక వస్తాడు మధుహన్.


తలుపుకొట్టి మెల్లగా పద్దూ అని పిలుస్తాడు భార్యను.

పద్మలాంఛన చేతులు కడుక్కొని వచ్చి తలుపు తెరుస్తుంది.


“పద్దూ.. ఇంత కష్టపడి ఇవన్నీ మోసుక వస్తే నాకేమి లాభము?” అంటాడు మధుహన్.


“మధూ! మనము బేరము చేస్తు లేముకదా.. నీవు తెచ్చిన బట్టలలో నీకు పెట్టే బట్టలు కూడా ఉన్నవి గద” అంటుంది పద్మలాంఛన.


“ఎవడొ సామెత చెప్పినట్టు ఉన్నది. ఎవడి దద్దినము వాడు పెట్టుకున్నట్టున్న”దని నవ్వుతాడు మధుహన్.


“ఛీ ఎప్పుడు ఏమి మాట్లాడాలో తెలియదా మధూ.

సమయము మించి పోతుంది. ముందైతె స్నానము చేసిరా. ఇంకా ఇరువది నిమిషాలలో అమ్మవాళ్ళ ఇంటికి పోవాలె” అంటుంది పద్మలాంఛన.


సరె అని స్నానము త్వరగా ముగించుకొని వస్తాడు మధుహన్.

ఈ లోపల తను చేసిన ఫలహారము, మధుహన్ తెచ్చిన కూరగాయలు, ఇతర సరుకులు మూడు నాలుగు సంచులలో సర్ది పెడుతుంది పద్మలాంఛన. ఒక కప్పు కాఫీ కూడా మధుహన్ కు చెతికందిస్తుంది. ఫలహారము అక్కడే తిందాము అంకుంటు. కాఫీత్రాగి బట్టలేసుకొని సిద్ధమౌతాడు మధుహన్. ఇద్దరూ కలిసి ఇంటి తలుపుకు తాళ మేసి కారెక్కుతారు.


తోవలో అంటాడు కారు నడుపుతూ “పద్దూ! ఈ కారు మనమే కొనుక్కున్నమని చెప్పు. లేక పోతె ఆ వచ్చే మహానుబాహుడు పిల్లతో పాటు కారుగూడ అడుగుతాడు” అని నవ్వుతుంటాడు.


“నీకు పేరు ఎవరు పెట్టారో గాని వేళాకోళం అని పెట్టవలసి ఉండె” అంటుంది పద్మలాంఛన.


అరగంటలో పద్మలాంఛన తల్లిగారింటికి చేరుతారు పద్మలాంఛన, మధుహన్.


కూతురు అల్లుని కొరకు ఎదురు చూస్తున్న పద్మలాంఛన తండ్రి రామేశ్వర్, తల్లి సనాతని “రండి రండి.. వాళ్ళు త్రోవలో ఉన్నరట” అని లోనికి ఆహ్వానిస్తారు.


“అక్కా. బావా బాగున్నరా” అంటూ గీర్దేవి వచ్చి పలకరిస్తుంది.


“మా కేలికుంచిక మెరిసిపోతుందే” అంటాడు మధుహన్.


గీర్దేవి “బావా! నాపేరు గీర్దేవి. ఒకవేళ మరిచిపోతె వ్రాసిస్తాను, జేబులో పెట్టుకో” అంటుంది గీర్దేవి.


“అమ్మా! వచ్చే మీ పరబ్రహ్మ చూసెనా అంటె అసలుకే మోసం. ఇక అనను తల్లీ కోపగించకు” అంటాడు మధుహన్ మరదలు వైపు కొంటెగా చూస్తు.


పది నిమిషాలకే పిల్లవాడు, అతని తండ్రి, తల్లి. మేనమామ వచ్చి కారు దిగుతారు. వాళ్ళకు ముందుగా కాళ్ళకు నీళ్ళు ఇస్తుంది పద్మలాంఛన. కాళ్ళు కడుక్కొగానె టవెల్ అందిస్తాడు మధుహన్.


లోపలికి వచ్చి కూర్చోగానే మధుహన్ తన పరిచయము చేసుకుంటు “నా పేరు మధుహన్. ఈ ఇంటికి పెద్ద అల్లుణ్ణి” అని వచ్చినవారి పేర్లు అడుగుతాడు.


దానికి పిల్లవాడు “నాపేరు నందనందన్, మా నాయన పేరు రామ కృష్ణ, అమ్మ కావేరి, ఇతను మా మామయ్య ఆర్యభట్ట” అని పరిచయం చేస్తాడు.


రామకృష్ణ నోరుజారి “మేము వచ్చిన కార్యక్రమము త్వరగా ముగించండి. మళ్ళీ అష్టమి వస్తుంది, రేపు నవమి, త్వరగా పోవాలి” అంటాడు.


కావేరి అతని తొడ గిల్లుతుంది.

“అంత తొందర ఎందుకండి.. మంచి సమయములోనే అమ్మాయిని చూస్తారు కద” అని అనుమానంగా అడుగుతుంది పద్మలాంఛన.


“ఆ.. ఏమీ లేదండి. ఆయన ఏదో మాట్లాడుతుంటాడు” అంటుంది పిల్లవాని తల్లి కావేరి..


పద్మలాంఛన భర్తను లోనికి పిలిచి “వీళ్ళు ఇంకో పిల్లను కూడా చూస్తున్నట్టున్నారు. నాకెందుకో అనుమానమొస్తుంది ఈ శాదస్తులను చూస్తుంటె. మీరు ఏదో ముచ్చటిస్తున్నట్టు కొంత సమయము గడుపండి. వాళ్ళ రంగు బయట పడుతుంది” అంటుంది.


సరె అనుకుంటు మధుహన్ పిల్లవానితో ముచ్చటిస్తుంటాడు. “మీరు ఎందాక చదివారు? మీ అసలు ఊరేది. తోబుట్టువు లెందరు..” అని ఇలా మాట్లాడుతుండగా పిల్లవాని తండ్రి రామేశ్వర్ మాటి మాటికి గడియారం చూస్తు ‘ప్చ్’ అంటుంటాడు.


“తొందర పడకుండి, అమ్మాయి సిద్ధమయితున్నది” అంటుంది పద్మలాంఛన. అంటూ ఇంటి బయటకు పోయి కారు డ్రైవర్ను అడుగుతుంది ఇంకెక్కడికన్న పోవాలా అని.


“అవునమ్మా! పోయి ఇంకెక్కడో పిల్లను చూడాలనుకుంటున్నరు. ఎవరు నచ్చితే వాళ్ళను ఒప్పుకుందామంటున్నరు. ఇదివరకే మూడు చోట్ల చూసి వచ్చినమమ్మా. దయచేసి నా పేరు చెప్పకండి. నాకూ ముగ్గురాడ పిల్లలున్నరు. ఎట్లనో ఏమో” అని నిట్టూరుస్తాడు.


డ్రైవర్ తో మట్లాడి ఇంటి వెనుకనుండి లోనికి వస్తుంది పద్మలాంఛన. అక్క కొరకు ఎదురు చూస్తున్న గీర్దేవి “అక్కా! నాకు ఆ అబ్బాయి నచ్చలేదు. కారుదిగి లోనికొస్తూ వుంటే చూశాను” అంటుంది.


“మా చెల్లెలుకు ఈసంబంధము ఇష్టము లేదంటున్నదండి. మీరు లోనికి వస్తూ వుంటే చూసిందట. దానికెప్పుడైతై ఇష్టము లేదో మేమూ బలవెంత పెట్టముగద” అంటుంది పద్మలాంఛన. పిల్లవాని తరఫు వాండ్లు ఖంగుతిని హఠ్హాతుగా లేస్తారు. నమస్కారము పెడుతూ వెళ్ళిపోతారు.


“తెలివికల్లదానివోయ్ పద్దూ! ఇంతకూ అసలు రహస్యమేమిటి” అంటాడు మధుహన్.


అందరూ వింటుండగానే పద్మలాంఛన చెబుతుంది “నాకు ఆ పిల్లవాని తండ్రి తొందర పెడుతూ వేరే చోటికి పోవాలంటుంటేనే అనుమాన మొచ్చింది. అందుకొరకే నేను బయటికి పోయి డ్రైవర్ తో అసలు విషయము తెలుసుకున్నాను” అని వివరంగా చెబుతుంది పద్మలాంఛన.


“మా అమ్మ.. నీ కడుపు చల్లగుండ” అంటాడు తండ్రి రామేశ్వర్.

తల్లి సనాతని అంటుంది “మంచి పని చేసినవమ్మా పద్మా! గీర్దేవి అదృష్టం బాగుండి దుర్మార్గుల ఇంట పడకుండ అయింది” అని.


“పద్దూ! ఉదయము నుంచి మీ చెల్లె పనులలో తిరుగుతున్నాను. ఆకలి దహించుక పోతున్నది. అందరి కడుపులో ఎలుకలు పరుగెడితె నా కడుపులో పిల్లులు పరుగెడుతున్నాయి” అంటుంటేనే గీర్దేవి ఫలహారం. నీళ్ళు తెచ్చి పెడుతుంది “తిను బావా’ అనుకుంటు.


ఫలహారం తినుకుంటు “మా చిన్నాయినకు నలుగురు కొడుకులు. నువు చూశావుకదా పద్దూ” అంటుంటె అవును అంటుంది పద్మలాంఛన.


“నలుగురిలో చిన్నోణి పెళ్ళి కాలే కాని, వాళ్ళేమి అంతగా ఉన్నవాళ్ళు కారు. ఉద్యోగమైతె చేస్తున్నాడు. మనము పట్టుబడితె ఇల్లరికం కూడా ఉంటాడు” అని తిండి ముగిస్తాడు మధుహన్.


“అదేదో చూడు నాయనా నీకు పుణ్య ముంటుంది” అంటాడు రామేశ్వర్.


“సరె.. ఎల్లుడి దశమి నాడు నేనూ పద్దూ పోయి మాట్లాడుతము.. గీర్దేవిని కూడా మాతో పంపండి .అక్కడే వీలుంటె పెళ్ళి చూపుల కార్యక్రమముకూడా జరిపించ వచ్చు” అంటాడు మధుహన్.

“ఇంక కాసేపు అయితె అష్టమి వస్తది పద్దూ ! పద మన యింటికి పోదాము” అని ఓరకంట చూస్తూ నవ్వుతాడు మధుహన్.


“ఇంత తొందరగ పొతారా” అంటుంది సనాతని.


“ఇప్పుడొచ్చిన వారితో ముచ్చటించాడు కద. కాసేపు మాట్లాడితె వారు వీరైతారని సామెత వినలేదా” అంటుంది తల్లితొ పద్మలాంఛన.


“సరె పద్దూ! ఎల్లుండి వేకువనే లేచి పోదాము. నేను రెండు రోజులు సెలవు పెడుతాను” అంటాడు మధుహన్.


మధుహన్ అన్నట్లే దశమి నాడు తెల్లవారు ఝాముననే ముగ్గురు పయనమై పోతారు.


అదే రోజు గీర్దేవిని ఇంటిలో ఉంచి మధుహన్ చిన్నాయిన ఇంటికి పోతారు.


ఏ సందర్భము లేక దంపతులను చూసి ఆశ్చర్యపోతారు వాళ్ళు. వచ్చిన సంగతి చెప్పి వాళ్ళను ఒప్పించి సాయంత్రము పెళ్ళి చూపులకు రమ్మని చెప్పి ఇంటికొస్తారు. ఈ లోపల గీర్దేవి వంట చేసి పెడుతుంది ముగ్గురికని.

సాయంత్రము వాళ్ళు రావడము అమ్మాయిని చూడడము ఒప్పుకోవడమూ అన్నీ చక చకా జరిగి పోతాయి.

“అదృష్టవంతుల చెడగొట్టేవారు. దురదృష్ట వంతుల బాగు పర్చేవారు ఉండరను సామెత మీ గీర్దేవికి అక్కరొచ్చిందోయ్ పద్దూ” అంటాడు మధుహన్.


మొత్తము మీద గీర్దేవికి, కైరవికి వివాహం జరుగుతుంది. అందరూ సంతోషంగా ఉంటారు "దేవుడు ఏది చేసినా మనమేలు కొరకే" అనుకుంటారు ఇంటిల్లిపాది.


సమాప్తం.


సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


Comments


bottom of page