'Padmavathi Parinayam' - New Telugu Story Written By Penumaka Vasantha
Published In manatelugukathalu.com On 26/07/2024
'పద్మావతి పరిణయం' తెలుగు కథ
రచన, కథా పఠనం: పెనుమాక వసంత
"ఏంటోయి అంత ఆనందం.. !” భార్యను ఉద్దేశించి అన్నాడు సాగర్.
"ఇపుడే మా ఫ్రెండ్ కాల్ చేసింది. రేపు మా కాలేజ్ లో పూర్వ విద్యార్ధుల సంఘం వాళ్ళు పాత వాళ్ళము అందరం కలవాలని నిర్ణయించారు నన్ను రమ్మని ఇన్వైట్ చేసింది. రేపు పొద్దున అందరం కలవబోతున్నాము అంటే ఎంత ఆనందంగా వుందో.. ! నైంటీస్ లో చదివిన వాళ్ళం కలుస్తున్నాము. పొద్దునే లేచి మీకు పిల్లలకు బాక్స్ లు ఇచ్చే వెళ్తా లెండి.. !" అంది కవిత.
“పర్లేదులే! ఒక రోజుకి మేము బయట తింటాంలే.. !" అన్నాడు సాగరు.
"నో ఆండి.. !" కొంచం ముందుగా లేస్తే సరి..” అంది కవిత.
"సరే నీ ఇష్టం. వండవాకే అంటే వండుతానంటావు. వండవే అంటే వండనూ.. ! అంటావు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. !” అని పాడుకుంటూ బయటకు వెళ్ళాడు ఏదో పని వుందని సాగరు.
ఆ రాత్రి, మరుసటరోజుకు చీరా నగలు అన్ని సెట్ చేసుకుని పడుకుంది కవిత. పొద్దునే లేచి వంట చేసి బాక్స్లు సర్ది రెడీ అయింది కవిత. సాగర్ ఆఫీస్ కెళ్తూ కవితని బస్టాప్ లో డ్రాప్ చేసి వెళ్ళాడు. హ్యాండ్ బ్యాగ్ లో అద్దంలో మొహం చూసుకుని, 'ముడతలు మచ్చలు అంతగా లేవులే..!' అనుకుంది.
ఫ్రెండ్సులో కవిత బావుంటుంది.. అనే టాక్ ఉంది. సో.. ! వాళ్ల దృష్టిలో ‘అప్పటిలాగేనే.. ! ఉంది కవిత’ అని అనుకోవాలని తాపత్రయం పడుతుంది కవిత.
అదీకాక ఫిట్నెస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి వయసు కన్నా తక్కువగానే కనిపిస్తుంది కవిత.
ఆటో నుండి కాలేజ్ ముందు దిగగానే కాలేజ్ పేరు చూడగానే ఆ రోజులన్నీ గుర్తుకు వచ్చాయి. క్లాస్ రూమ్ లు చూడగానే క్లాస్ రూం లో చేసిన అల్లరి గుర్తుకు వచ్చింది కవితకు. ఆర్ట్స్ గ్రూప్ అవ్వటం వల్ల లెక్చరర్స్ ను బాగా ఏడిపించే వాళ్ళం.
కవిత ఫ్రెండ్స్ కలిశారు. అందరూ ప్రస్తుతం యేమి చేస్తుంది.. ఎక్కడ వుంటుంది.. అన్ని గుక్క తిప్పుకోకుండా మాట్లాడుకుంటున్నారు. కవిత బెంచ్ లో కూర్చొనే నలుగురు లో ముగ్గురు కలిసి సెకండ్ బెంచ్లో కూర్చుని ఎంత గోల చేసేది చెప్పుకుని ఒకటే నవ్వులు. వాళ్ళు నాలుగో వ్యక్తి పద్మ కోసం వెయిట్ చేస్తున్నారు, పద్మ వచ్చింది.
వస్తూనే "సారి.. ! నా కోసం వెయిట్ చేస్తున్నారు కదా. ఏ స్వాతి, కవిత, భవ్య.. ఎలా వున్నారే ?. ఎన్ని యేళ్లు అయిందో కదా? మనం కలుసుకుని. గీత.. ఎక్కడ వున్నావు, మీవారు యేమి చేస్తారు?”
అన్న దానికి గీత జవాబు చెప్పింది. తర్వాత స్వాతి, కవిత, భవ్యలు కూడా వాళ్లకి పిల్లలు ఎంత మంది? వాళ్ళు ఏమి చేస్తుంది. చెప్పారు.
"మా సంగతి సరే కానీ నీ సంగతి చెప్పు.. !" అని ఫ్రెండ్సు అడిగారు. పద్మ "నేను పెళ్ళి చేసుకోలేదు. అందువల్ల నాదగ్గర పెద్ద న్యూస్ యేమి లేవు.. సోలో బతుకే సో బెటర్. సగం జీవితం హాపీగా గడిపాను" అన్నదాంట్లో ఆనందం కనిపించలేదు.
"మంచి పని చేసావే. మేము ఈ పెళ్ళిళ్ళు చేసుకుని ఏముంది? రొటీన్ లైఫు, బోరింగ్ యార్. పొద్దున లేవటం వండటం పెట్టటం, మళ్ళీ సాయంత్రం వండటం పెట్టటం తినటం పడుకోవటం. నేను మటుకు వచ్చే జన్మలో మగవాడిగా పుట్టాలి. వండే పని తప్పుతుంది" అంది స్వాతి.
బాగా చెప్పావే.. ! మేము కూడ నీతో ఏకీభవిస్తున్నాము అన్నారు " భవ్య, గీత.
"చాల్లే ఆపండి.. ! అలా పెళ్లి కాకుండా ఉంటే పెళ్లి అవలేదని వాపోయేవారు. పెళ్లయిందని ఇపుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు, అందని ద్రాక్ష పులుపు" అంది కవిత.
"నీ కవితా సారాలు ఆపవే. కాలేజ్ డేస్ లోను ఇలాగే చంపేదానివి ఇప్పటికీ మానలేదా తల్లా.. ! మీవారు ఎలా భరిస్తున్నారే నిన్ను.. !" అని ముగ్గురు ఫ్రెండ్సు ఆట పట్టించారు కవితని.
"మావారు నాకన్నా బాగా చెప్తారు కవితలు" అంది కవిత.
"సరే కాని మీరు ఒక వారం మీ భర్తని పిల్లలని వదిలేసి ఎక్కడన్నా ఉండండి చూద్దాము. 'అయ్యో, .. ! మా పిల్లలు మా వారు ఏమైపోతారో?' అని గోల చేయరూ? ఊరికే కాకమ్మ కబుర్లు చెప్పకండి" అని కవిత అంది.
ఈ మాటలు వింటున్నప్పుడు పద్మ నిర్లిప్తంగా అయింది. ఇది గమనించింది కవిత.
అక్కడి వాతావరణాన్ని హుషార్ చేయటానికి "మనము లెక్చరర్స్ ను ఎలా ఏడిపించే వాళ్ళమే.. ? మన సివిక్స్ లెక్చరర్ ని, మరీ ఎక్కువ ఆట పట్టించాము. ఆయనకు నత్తి పూనుకొనాలి అనటం రాక పూలు కొనాలి అనేవారు" నవ్వుతూ అంది కవిత.
"అవును అపుడు నువ్వు ఎంత కొనాలి. ఒక మూరా? రెండు మూరల? అని బెంచ్ మీద కనపడకుండా తలవంచి పడుకుని అనేదానివి. మేము ఆ మాటకు నవ్వుతూ కనపడేసరికి సార్ మమ్మల్ని స్టాండ్ అప్ అనేవాళ్ళు" అని భవ్య అంది.
"అవును మనల్ని తిట్టించేది ఈ కవితా.. ! థాంక్స్ ఫ్రెండ్స్..! మనసారా నవ్వి ఎన్నాళ్ళు అయిందో.. ఇలా " అని పద్మ అంది.
"సరే పద్మ.. వంటరిగా ఏమి చేస్తున్నావే.. !" అని అడిగిన వాళ్లకి డిగ్రీ అవగానే బ్యాంక్ లో జాబ్ వచ్చింది. తర్వాత నేనే మా ఇంటిని చూసుకున్నాను. నాన్న నామీద భాద్యతలు వదిలి ఆయన హాయిగా తాగి పడుకునే వారు. అక్కకి మారేజ్ చేశా. తమ్ముడిని చదివించా. నేను ఇపుడు వంటరినే.
మొన్నటి దాకా అమ్మ నాన్న వున్నారు నాకు తోడుగా. వాళ్ళు పోయాక ఇపుడు అక్క పిల్లలను నా దగ్గర పెట్టుకుని చదివిస్తున్నాను" అంది పద్మ.
కానీ అవి మనసులో నుండి వచ్చినవిగా అనిపించలేదు ముగ్గురికి.
"మరి బాధ్యతలు లేవుగా? ఇపుడైనా చేసుకోవచ్చుగా నువ్వు పెళ్లి.. !" అంది కవిత.
"పెళ్లి చేసుకుందామనుకున్నప్పుడు నేను బిజీగా వున్నాను. ఇపుడు చేసుకుందామంటే నన్ను చేసుకోవటానికి ఎవరు ఖాళీగా లేరే.. !. ఈ లేట్ వయసులో ఇంకా చేసుకున్నా ఈ బామ్మకు పెళ్లి ఎందుకో? అంటారు".
"ఎవరన్నా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకుంటావా?" అన్న కవితతో పద్మ "నన్ను ఎవరు చేసుకుంటారు? నీ పిచ్చిగానీ.. " అంటూ కొట్టి పారేసింది పద్మ.
కాసేపు కాలేజ్ కబుర్లు చెప్పుకుందామంటూ.. పిచ్చాపాటి మాట్లాడుకున్నారు నలుగురు. వెళ్తూ సెల్ నంబర్స్ తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు.
ఇంటికి వచ్చినా పద్మ ఆలోచనలే కవితకు. పద్మ మా ఫ్రెండ్స్ అందరిలో చాలా బాగా చదివేది, అన్ని ఫస్ట్ రాంక్లే. ఇంటి పరిస్థితులు చెప్పి బాధ పడేది.
ఇంటికి పెద్ద అవ్వటం వల్ల తన సెలవుల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఆ వచ్చిన డబ్బులతో
బట్టలు పుస్తకాలు కొనుక్కునేది. అది ఎపుడు సుఖపడింది లేదు. డిగ్రీ అవగానే దానికి బ్యాంక్ జాబ్ వచ్చింది. ఆ తర్వాత ఇంటి బాధ్యతలు భుజాన వేసుకుంది. మేము పెళ్ళిళ్ళు చేసుకున్నాము.
అది అలానే వుంది.
సాగర్, “రేపు సండే కదా మాప్రెండ్ సుధాకరుని లంచ్ కి పిలుస్తాను. నీకు ఓకేనా కవితా.. !" అన్నాడు.
"తప్పకుండా పిలవండి" అంది కవిత.
సండే లంచ్ కి వచ్చాడు సుధాకర్.
"అన్నయ్య గారు.. బావున్నారా.. !" అంది కవిత.
"అదే బాగు” అన్నాడు సుధాకర్.
“అదేంటి అన్నయ్యా.. ? ఇంకా మీరు మా వదినని మర్చిపోక పోతే ఎలా అండి? కాలంతో పాటు మనము మారాలి”
"ట్రై చేస్తున్నా అమ్మా.. !" అన్నాడు బాధను దిగమింగుకుంటూ.
"పిల్లలు ఫోన్ చేస్తున్నారా అన్నయ్యా?” అంది కవిత.
"చేస్తున్నారమ్మా.. ! ఇంకా నయం.. అది వున్నప్పుడే ఆడపిల్ల పెళ్లి చేశా. మగపిల్లవాడు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. వాడికీ పెళ్లి చేయాలి" అన్నాడు సుధాకర్.
సాగర్ తో కవిత అంది "మీ ఫ్రెండ్ సుధాకర్ పెళ్లి చేసుకోవచ్చుగా.. !" అంది.
“నేను చాలా సార్లు చెప్పానే.. ! ‘ఇపుడు నాకు ఈ వయసులో పెళ్లి ఎంటి? అల్లుడు వచ్చాడు. రేపో మాపో కోడలు రాబోతుంది’ అన్నాడు.
‘కోడలు వచ్చినా.. మీ అబ్బాయికి ఎక్కడ జాబో అక్కడ ఉంటుంది కాని నీదగ్గర వాళ్ళు ఉండరుగా.. ఇపుడు నీకు వోపిక ఉంది. తర్వాత సంగతి ఏంటి?’ అంటే వినడు వాడు.. !” అన్నాడు సాగరు.
"ఏమండి.. ! నా ఫ్రెండ్ పద్మ ఉందండి. దాన్ని సుధాకరుకి ఇచ్చి చేస్తే బావుంటుంది కదండి. "
“నీ తెలివి తెళ్ళారినట్టే ఉంది. నీ ఫ్రెండ్ ఈ రెండో పెళ్లి వాడిని చేసుకుంటుందా? నీ పిచ్చిగాని.. !"
ప్రయత్నిస్తే తప్పు లేదుగా.. ! మీరు మీ ఫ్రెండ్ ని ఒప్పించండి. నేను నా ఫ్రెండ్ ని ఒప్పిస్తా.. !” అంది.
"సరేనే.. ! వీళ్లిద్దరు ఒప్పుకుంటే.. సుధాకర్ పిల్లలు ఒప్పుకోవద్దు.. !" అన్నాడు సాగర్.
"అదీ నిజమే.. ! నేను శైలజను ఒప్పిస్తా, మీరు వాళ్ళబ్బాయి శ్రీధరును ఒప్పించండి. "
"అయితే నేను మగవాళ్ళను నువ్వు ఆడవాళ్ళను ఒప్పించాలి అంతేగా.. అంతేగా.. !" అన్నాడు
నవ్వుతూ సాగర్.
కవిత సుధాకరు కూతురు శైలజతో మాట్లాడింది. "నాన్నకు ఒకే.. ! అయితే పిల్లలం మాకు ప్రాబ్లం లేదు.. !" అంది.
"ఇక నువ్వు ఆ మాట మీద వుండు" అంది కవిత.
ఇక్కడ సాగర్ సుధాకరు కొడుకు శ్రీధరుతో మాట్లాడాడు. "నాన్నకు ఒకే.. ! అయితే మాకు ఒకే.. !" అన్నాడు శ్రీధర్.
"అమ్మయ్య.. ! పిల్లలు అయ్యారు. ఇక పెద్దవాళ్లను ఒక పట్టు పట్టాలి" అని అనుకున్నారు కవితా సాగర్లు.
పద్మతో మాట్లాడింది కవిత.
“పద్మ, ఈ సుధాకర్ కి పెద్ద ఉద్యోగం, ఇల్లు ఇంకా పదియేళ్లు సర్వీస్ వుంది. భార్య కాన్సర్ తో పోయింది రెండేళ్ల క్రితం. మావారు, సుధాకర్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. చాలా మంచివాడు. నీకు ఇపుడు తెలియదే? తర్వాత వంటరిగా వుండటం ఎంత కష్టమో” అని చెప్పి ఒప్పించింది. “కావాలంటే సుధాకర్ నంబర్ ఇస్తాను. మాట్లాడు, వద్దూ.. ! అంటే వదిలేద్దాం. సరేనా"
అంది కవిత.
ఇటు సుధాకరుని కన్విన్స్ చేసి ఒప్పించాడు సాగరు. "పిల్లలు ఏమంటారో? అని సుధాకర్ గొణుగుతుంటే నేను, కవితా వాళ్లతో మాట్లాడి ఒప్పించాము లేరా.. ముందు నీ సంగతి చెప్పవోయ్.. !"
పద్మ, సుధాకర్లు కలిసి మాట్లాడుకుని “ఓకే.. !" చెప్పారు.
పద్మకు సుధాకర్ తను ఉన్న చోటుకి జాబ్ ట్రాన్స్ఫర్ అయ్యేటట్లు చేస్తానన్నాడు. పిల్లలు పద్మతో మాట్లాడి హాపీగా ఫీలయ్యారు.
రిజిస్టర్ ఆఫీసులో పద్మ సుధాకర్లు పెళ్లి చేసుకున్నారు. పద్మ, కవితతో, ఇక నువ్వు మారేజి బ్యూరో పెట్టవచ్చే.. !" అంది నవ్వుతూ.
"అమ్మో.. ! నన్ను మటుకు ఇన్వాల్వ్ చేయకే.. ! నీకు దణ్ణము పెడతాను" అన్నాడు సాగరు.
"పెట్టటానికి పూను(పూలు )కొంటున్నాను. మా పిల్లల పెళ్లికి మారేజ్ బ్యూరోల చుట్టూ తిరిగే పని తప్పుతుందిగా.. " అంది కవిత నవ్వుతూ.
ఆ మాటకు అందరూ నవ్వారు.
సమాప్తం
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.
Comments