top of page
Writer's pictureVasundhara

పగలే వెన్నెల

వేసవి ఎండలనుండి వసుంధర గారి అక్షరాల వెన్నెలతో ఉపశమనం పొందండి.


'Pagale Vennela' New Telugu Story Written By Vasundhara

Published In manatelugukathalu.com On 07/03/2024 

'పగలే వెన్నెల' తెలుగు కథ

రచన: వసుంధర 

(ప్రముఖ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



మండు వేసవి. మిట్టమధ్యాహ్నం. బయట ఎండ నిప్పులు చెరుగుతోంది. 

ఇంట్లో ఏసీ రూములున్నాయి. కానీ నాకూ, నా భార్య సీతకీ ఏసీ పడదు. అందుకని డ్రాయింగురూం మధ్యలో వ్రేలాడే వట్టివేళ్ల తడకకి అవతల టేబుల్ ఫ్యాన్ పెట్టి, ఇవతల మేం కూర్చుని కబుర్లాడుతున్నాం. మధ్యమధ్య తడకని చన్నీళ్లతో తడుపుతున్నాం.

ఉన్నట్లుండి ఓ ఏసీ బెడ్రూంలోంచి మా కోడలూ, పదమూడేళ్ల మనవరాలూ- మరో ఏసీ రూంలోంచి మా అబ్బాయీ, పదహారేళ్ల మనవడూ- ఇస్సురంటూ బయటి కొచ్చారు. 

కరెంటు పోయిందని వాళ్లు చెప్పేదాకా మాకు తెలియలేదు.


అబ్బాయిని చూస్తూనే, “అన్నట్లు- నా బీపీ టాబ్లెట్లు ఐపోయాయిరా. బయట ఎండ మండిపోతోందనుకో. వెళ్లేది ఏసీ కార్లో కాబట్టి, అర్జంటుగా రెండు స్ట్రిప్సు తెచ్చిపెడతావా?” అనడిగింది సీత. 


అందుకు అబ్బాయికంటే ముందు మనవడు రియాక్టయ్యాడు, “కారు ఏసీ ఐతే మాత్రం, ఇప్పుడు బయట గ్యారేజి దాకా వెళ్లే పరిస్థితుందా? చిన్నప్పుడు మీవాళ్లిలాగే మిమ్మల్ని ఎండలో పంపేవారా?” అన్నాడు. 


తండ్రంటే వాడికి ప్రాణం. 

వాడలా అనగానే మనసుని ఒక్కసారిగా పాత జ్ఞాపకాలు ముసురుకుని నన్ను నా పన్నెండో ఏటికి తీసుకెళ్లాయి. 

- - - - -

గోదావరిలో ప్రముఖ ద్వీపమైన కోనసీమకు ముఖద్వారంగా అనబడే బొబ్బర్లంకకు సరిగ్గా రెండు మైళ్ల దూరంలో ఉన్న పేరవరం మా స్వగ్రామం. 

వ్యవసాయం చూసుకుంటూ నాన్నగారు అక్కడే ఉంటున్నారు. 

అప్పటికి నాకు ముగ్గురు తమ్ముళ్లు, ఓ చెల్లెలు. అందరికీ నా దగ్గర బాగా చేరిక. 

వాళ్లని బాగా అడిస్తానని అమ్మ నన్ను మెచ్చుకునేది. 

అప్పటికి ఊళ్లో మిడిల్ స్కూల్ మాత్రమే ఉండడంవల్ల- చదువుకోసం నేను ధవళేశ్వరంలో మా తాతగారి వద్ద ఉంటున్నాను. 


తాతగారిది ఉమ్మడి కుటుంబం. 

ఇద్దరు బాబాయిలు, అపుడప్పుడు వచ్చి వెడుతుండే ఇద్దరత్తయ్యలతో ఇల్లెప్పుడూ సందడిగా ఉండేది. 


ఇంకా ఆ ఇల్లే ఎందరో బంధుమిత్రుల రాకపోకలకు కేంద్రబిందువుగా ఉండేది.

ధవళేశ్వరానికి దగ్గర్లోనే రాజమండ్రి పట్టణం. బాబాయిలిద్దరూ అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. 

వాళ్లు పొద్దున్న తొమ్మిదికి బయల్దేరి, సాయంత్రం చీకటిపడే వేళకి ఇంటికి తిరిగొచ్చేవారు.

పెద్ద బాబాయికి ముగ్గురు, చిన్నబాబాయికి ఇద్దరు- పిల్లలు. 

అందరూ ఆడపిల్లలే. అందరికీ నా దగ్గర బాగా చేరిక. 


వాళ్లలో ఆఖరిదైతే నన్నుచూడగానే ఎత్తుకోమని చేతులందిచ్చేస్తుంది. 

పిల్లల్ని బాగా ఆడిస్తానని పినతల్లులు నన్ను మెచ్చుకునేవారు. 

అక్కడ నలుగురు. ఇక్కడ ఐదుగురు. మొత్తం తొమ్మండుగురికి అన్నయ్యనని నాకెంతో గర్వంగా ఉండేది.


ఎప్పటిలాగే ఆ ఏడూ వేసవి సెలవులకి పేరవరం వెళ్లాను. 

అక్కడ నా దినచర్య ఏమిటంటే- 

చద్దన్నం తిన్నాక ఊరికి అటువైపున్న గోదావరి నదిలో స్నానం. అది సుమారు గంట. 

తర్వాత పంచాయతీ బోర్డు గ్రంథాలయంలో పుస్తకపఠనం. అది గంటన్నరలోపు. 

పన్నెండు దాటేక పిల్లలంతా కలిసి భోజనం. 

మధ్యాహ్నానికి పెద్దలు కాసేపు నడుం వాల్చేవారు.


 ఆ సమయంలో చుట్టుపక్కలుండే నా ఈడు పిల్లలతో కలిసి- ఆకాట, చెడుగుడి వగైరా ఆటలు. 

ఆకాటలో పంటలు వేసుకున్నాక, ఇద్దరు దొంగలుగా మిగులుతారు. మిగతావాళ్లు వాళ్లకి ఓ చెట్టు ఆకు తెమ్మని చెబుతారు. దొంగలు ఆ ఆకు వెదికి తెచ్చేలోగా, మిగతావాళ్లు రహస్య స్థలాల్లో దాక్కుంటారు. దొంగలు వాళ్లని వెదికి పట్టుకుని ఆకుతో ముట్టుకుని ఔట్ చెయ్యాలి. ఈ ఆటలో దొంగలు ఆకుకోసం ఊరంతా తిరిగి వెదకాల్సిఉంటుంది. మిగతావాళ్లు ఇంట్లో ఏమూలో దాక్కుంటారు. 


చెడుగుడి ఐతే మా ఇంటి పెరట్లోనే!

అమ్మ ఎప్పుడైనా ఆట మధ్యలో మమ్మల్ని చూస్తే, “మీకు ఎండ వెన్నెల్లా ఉన్నట్లుంది” అని మందలించేది. 


తనూ మాటవరసకే అన్నట్లు అనేది. మేము ఏమాత్రం పట్టించుకునేవాళ్లం కాదు. 

సాయంత్రం చల్లబడ్డాక తమ్ముళ్లనీ, చెల్లెల్నీ తీసుకుని- ఊరికి ఇటువైపున్న కాలవకెళ్లేవాణ్ణి. 

గోదావరి నీళ్లని ఆ కాలవలోకి బొబ్బర్లంక దగ్గర లాకుల వదులుతారు. 

వేసవిలో గోదావరి మట్టం తగ్గిపోతుంది కాబట్టి- ఓ నెల్లాళ్లపాటు కాలవ కట్టేస్తారు. అంటే నీళ్లొదలడం ఆపేస్తారన్నమాట! 


అప్పుడు కాలనలో ఇసుకే తప్ప నీళ్లుండవు. అక్కడ పిల్లలతో కలిసి కూర్చుని గాలిపటాలెగరేయడం, ఇసుకలో పిచ్చుకగూళ్లు కట్టడం, చెలమలు తవ్వి నీళ్లు తియ్యడం అదో అనుభూతి!


సెలవుల్లో నేనక్కడుండేది మామూలుగా ఐతే నాలుగైదు వారాలు. ఈసారి మూడువారాలకే వెనక్కెళ్లాల్సొచ్చింది. 

ఎందుకంటే గోదావరిలో మునిగిన లంక ఒకటి కొత్తగా తేలింది. అందులో నాన్నగారికి కొంత పొలముంది. 


అది కొంటామంటూ గ్రామస్థులు కొందరు నాన్న వెంటబడ్డారు. 

తాతగారి సలహా లేకుండా నాన్న ఏ పనీ చెయ్యరు. 

అప్పుడు నాన్నకి రెండ్రోజుల దాకా ఊళ్లో వేరే పనులున్నాయిట. 

నాన్న విషయాన్ని వివరంగా ఓ ఉత్తరంలో రాశారు. తాతగారది చదివి ఆకళింపు చేసుకుని నాన్నగారికి సలహా ఇవ్వాలి. 


ఆ ఉత్తరం ఇవ్వడానికి నన్ను ఉన్నపళంగా ధవళేశ్వరం వెళ్లమన్నారు నాన్న. 

ఆ పూట పదకొండుకే భోజనం కానిచ్చి- నాన్నిచ్చిన ఉత్తరం తీసుకుని బయల్దేరాను. 

మా ఇంటినుంచి కాలవగట్టుకి సుమారు రెండు ఫర్లాంగులు (నాలుగొందల మీటర్లు). 

నల్లరేగడి నేల. ఎండ కొంచెం ముదిరితే చాలు, చుర్రుమంటుంది.


కాళ్లకి జోళ్లు లేవు. బాటపక్క అక్కడక్కడ ఉండే పచ్చగడ్డి కాళ్లకి కాస్త ఉపశమనం ఇస్తుంది. 

కాలవగట్టుమీంచి బొబ్బర్లంక చేరడానికి రెండు మైళ్ల (3.2 కిలోమీటర్లు) తార్రోడ్డుంది. రోడ్డుకి- అటు కాలవ, ఇటు పంట పొలాలు. వాటిమీదనుంచి వచ్చే పిల్లగాలి- వంటికి కాస్త ఉపశమనం.

బొబ్బర్లంక వెళ్లడానికి గంటకో బస్సుంది. కానీ మా ఇంట్లో స్త్రీ బాల వృద్ధులందరికీ నడకే రివాజు. 

కాళ్లకి పచ్చగడ్డి, తలకి చెట్లనీడ, వంటికి గాలి- ఈ ఉపశమనాలతో నడక ప్రారంభించాను. 

కుడిపక్క పొలాల్లో రైతు కూలీలు పనిచేస్తున్నారు. వాళ్లలో ఒకడు గట్టుమీదకొచ్చి- గంజి అన్నంలో ఉల్లిపాయ నంచుకుతింటూ- “ఇంత ఎండలో బయల్దేరావేంటి బాబూ” అని ఆప్యాయంగా పరామర్శించాడు. 


దానికి చిరునవ్వు తప్ప జవాబేముండదు!

సగం దారి గడిచేక, ధవళేశ్వరంలో పెరుగు అమ్ముకుని తిరిగొస్తున్న వెంకమ్మ నెత్తిమీద తట్టతో కనిపించి, అదే ప్రశ్నతో పలకరించింది. అందుకూ బదులు చిరునవ్వే!

ఇవన్నీ ప్రయాణంలో కొన్ని పదనిసలు.


బొబ్బర్లంక చేరేసరికి ఇంకా పన్నెండవలేదు. 

అక్కణ్ణించి ధవళేశ్వరం వెళ్లడానికి కిరాయి నావలుంటాయి. 


నావ నడిపేవాళ్లు చిన్నపిల్లల దగ్గర డబ్బు తీసుకోరు. అదీ ముఖ్యంగా విద్యార్థులనుంచి. 

ఇప్పుడు అనూహ్యమైనా, అప్పట్లో అదో పార‘మార్థిక’ సంప్రదాయం! 

రేవుకి వెడితే- అప్పుడే ఓ నావ వెళ్లిపోయింది. 


తర్వాతి నావకి సరిపడ జనం పోగవాలంటే-మరో రెండు గంటలు పడుతుంది. ఎందుకంటే చాలామంది తర్వాతి నావకోసం ఎదురు చూడరు. 


బొబ్బర్లంకనుంచి ధవళేశ్వరానికి రెండు ఆనకట్టలమీంచి నడకదారి ఉంది. అది సుమారు రెండున్నరమైళ్లున్నా- ఆ రోజుల్లో ఎవరూ నడకకు వెనకాడేవారు కాదు. 

కాళీగా రెండు గంటలేం కూర్చుంటానని- నేనూ నడకదారి పట్టాను. ఆ ప్రయాణంలోనూ మరిన్ని పదనిసలు.


మొదటి ఆనకట్టమీద నడుస్తూ చుట్టూ చూస్తే- చాలాచోట్ల గోదావరీ జలాలు ఆనకట్ట తలుపులకి అటే ఆగిపోయాయి. 

అక్కడక్కడ నదీజలాలు ఆనకట్ట తలుపుల సందుల్లోంచి జాలువారుతూ అంతర్వేది వైపు పయనిస్తున్నాయి. 


ఆ ధారలెంత సన్నమంటే- సాగరసంగమానికి వెళ్లే వేసవి గోదావరిలో, నీటికంటే ఇసుకతిప్పలే ప్రస్ఫుటమౌతున్నాయి.

ఆనకట్ట బాట సిమెంటుది. వేడిగా ఉంది. 


ఆ బాటపై అక్కడక్కడ వాలిన తలుపులు ఇనుపవి. అవి ఇంకా వేడిగా ఉన్నాయి. 

ఐతే ఆనకట్టపై అక్కడక్కడ పల్చనిపొరలా ఉన్న నదీజలాలు కాళ్లకి కాస్త ఊరటనిస్తున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నా, గోదావరి గాలి చల్లగా వళ్లు నిమురుతోంది. 

నడుస్తూ నడుస్తూ మధ్యలో ఆనకట్ట తలుపులకి అటెళ్లి, నదీమతల్లిని తాకి- కాళ్లూ చేతులూ మొహం కడుక్కుని పుక్కిట పట్టి నీళ్లు తాగుతున్నాను. నేడు ఇంట్లో ఫిల్టర్ నీళ్లు, బయట మినరల్ నీళ్లకీ- అలవాటుపడ్డవాళ్లకి అపరిచితమైన సుఖానుభూతి అది. వర్ణించడానికి మాటలు దొరక్కపోయినా- నాడు అది మాకు సుపరిచితం. 


మొదటి ఆనకట్ట దాటేక- పిచికలలంక అనే చిరు దీవి వచ్చింది. అందులో అరమైలుపైన నడిస్తే రెండో అనకట్ట వస్తుంది. 


లంకదారిలో అటూఇటూ కొన్ని పెద్ద చెట్లు, కొన్ని మరీ అంత పెద్దవి కాని సీమచింత చెట్లు. 

సీమచింతల్ని అలంకరించిన ఆకుపచ్చటి పచ్చికాయలూ, గులాబిరంగు దోరకాయలూ- అందరికీ, ముఖ్యంగా పిల్లలకి ఓ పెద్ద ఆకర్షణ. వాటిని కోసుకు తినడం ఆ ప్రయాణంలో మరో పదనిస.


పచ్చిగా ఉన్నా, పక్వానికి దగ్గర్లో ఉన్న కాస్త పెద్దకాయలకు- వగరు ఎసరు, తీపి కొసరు. అదో రుచి. పండినవాటికి- తీపి ఎసరు, వగరు కొసరు. అదో రుచి.

ఆ రెండూ దేనికదే రుచి!


అమ్మ హెచ్చరిస్తూంటుంది- సీమచింతకాయలు ఎక్కువ తింటే గొంతు పట్టేస్తుందని. అందుకని కోసినవాటిలో కొన్ని కాయలు తిన్నాక, మిగిలినవాటిని నిక్కరు జేబులోకి తోశాను. అలా చేశానంటే ఆ కాయలిక నావికాదు. ఇంటివద్ద పిల్లలవి. 


వాళ్లకోసం ఏందాచినా, వాటిని మరి ముట్టకోని మనోనిగ్రహం నాకుంది.

పిచికలలంక దాటి రెండో ఆనకట్టపై ప్రయాణం కొనసాగించి- ధవళేశ్వరంలో గోదావరికి లాకులుండే ప్రదేశం చేరాను.


అక్కణ్ణించి రోడ్డెక్కకుండా, గోదావరిగట్టుమీదే నడిస్తే- మైలుదూరంలో రామపాదాల రేవు. ఆ రేవులో సీతారామలక్ష్మణుల పాదముద్రలున్నాయి. 


అవి నిజంగా రామాయణకాలానివా అన్న ఆలోచనే లేకుండా, వాటిని కళ్లకద్దుకునే సంప్రదాయాన్ని నేనూ అనుసరిస్తాను. 


వైషమ్యాలు లేని నమ్మకం, ఆ నమ్మకంనుంచి పుట్టిన సంప్రదాయం- మనసుకి తృప్తినివ్వడం అప్పటికే నాకు స్వానుభవం.

రామపాదాల రేవునుంచి ఊళ్లోకి వందడుగులేస్తే- ధవళగిరి కొండ. ఆ కొండపై నెలకొని ఉన్నాడు జనార్దనస్వామి. 


కొండమీదనుంచి ఆలయానికి వెళ్లడానికి మెట్లున్నాయి. 

గుడి చేరాలంటే వందకు పైగా మెట్లెక్కాలి కానీ- మా ఇల్లు చేరడానికి ఇరవై మెట్లెక్కితే చాలు. 

నాకైతే మా ఇల్లే ఒక ఆలయంలా అనిపిస్తుంది. 


కొండను, గుడిమెట్లనూ చూడగానే నాలో ఉత్సాహం పొంగింది. 

ఒకే ఊపులో మొత్తం మెట్లన్నీ ఎక్కి కొండ పైకి చేరి- అప్పుడు దిగి మా ఇంటికొచ్చాను. 

మెట్లు బాగా వేడెక్కి ఉన్నాయన్న స్పృహే లేదు నాకు.


నేను వెళ్లేసరికి ఇంట్లో మా బామ్మగారు, పినతల్లులు ఏదో తర్జనభర్జన పడుతున్నారు. 

తాతగారికి- పచ్చిపెసల్ని నానబెట్టకుండా రుబ్బి వేసిన పెసరట్లు ఇష్టం. ఆ రోజాయనకు వాటిపై మనసయింది. 


ఇంట్లో పెసలు లేవు. బాబాయిలు చీకటి పడితేనే కానీ రారు. ఆడపిల్లల్ని దుకాణానికి పంపరు. 

‘ఇప్పుడు బాబి ఉంటే ఎంత బాగుణ్ణూ’ అని నా గురించి వాళ్లు అనుకుంటూండగా నేను వెళ్లాను. 

అప్పుడే వచ్చిన నన్ను చూసిన చిన్న పినతల్లి, “నీకు నూరేళ్లాయుష్షోయ్ బాబీ! ఎవరో చెప్పినట్లు- భలే వచ్చేశావే! హమ్మయ్య, ఇక దుకాణానికి ఎవర్ని పంపాలన్న మీమాంసే లేదు” అంది. 


- - - - -

ఇది విన్న నా మనవడు, “నువ్వు చెప్పింది నిజమైతే- నీ పెద్దలు వెరీ బాడ్ తాతయ్యా! అంత ఎండన పడి, అంత దూరం నడిచొస్తే- అయ్యో పాపం అనకుండా- వెంటనే మళ్లీ బయట ఎండలోకి పంపిస్తారా?” అన్నాడు.


“నీకలా అనిపించిందా- కానీ అప్పుడు నేనేం చేశానో తెలుసా?” అన్నాను.

“ఏంచేస్తావ్! ఎదురుచెప్పే ధైర్యం లేక- ఈసురోమంటూ బయటికెళ్లొచ్చి, అప్పుడు కుప్పకూలి ఉంటావ్!” అన్నాడు మనవడు.


వాడలా అనగానే నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే- అప్పటి దృశ్యం నా కళ్లకు కట్టింది. 

ముందు తాతగారికి ఉత్తరమిచ్చాను. ఆ వెంటనే దుకాణానికెళ్లాను. 

దారిలో నా ఈడు మిత్రుడొకడు కనిపించి, రైలాట మొదలెడుతున్నామనీ, నన్నూ కలవమనీ అడిగాడు.


రైలాట అంటే- నలుగురైదుగురు పిల్లలం ఒకరివెనుక ఒకరు, ఒకరి చొక్కా ఒకరు పట్టుకుని నిలబడి- రైలులా పరుగులు పెట్టడం. ముందున్నవాడు ఇంజను కాబట్టి- కూ అని కూత కూడా కూస్తాడు. చివర ఉండేది గార్డు. తనవద్ద పచ్చజెండా, ఎర్రజెండా ఉంటాయి. మేము ఎంచుకున్న నిర్ణీతస్థలాలు స్టేషన్లు. మేమెక్కడ ఆగేదీ, ఎప్పుడు కదిలేదీ గార్డు నిర్దేశిస్తాడు. 


పిల్లల సంఖ్యను బట్టి మా రైళ్ల సంఖ్యకూడా ఉంటుంది. 

వాటిలో పాసెంజర్, మెయిల్, ఎక్స్‌ప్రెస్, గూడ్సు ట్రయిన్సు ఉంటాయి. 

రైలు ప్రమాదాలూ, రైళ్లు ఆలస్యం కావడాలూ, సిగ్నల్సూ- మొత్తం రైల్వే నెట్‌వర్కులాగే ఉంటుంది. 


జనసమ్మర్దం ఉండకూడదు కాబట్టి- మిట్టమధ్యాహ్నాలే ఆ ఆటకి తగిన సమయం. 

“పెసలు ఇంట్లో ఇచ్చేసి వస్తానని ఆ అబ్బాయికి చెప్పాను. అప్పటికింకా టైం రెండున్నర కూడా కాలేదు” అన్నాను మనవడితో.


తర్వాత సాయంత్రం నాలుగు దాటేదాకా పరిసరాల స్పృహ లేకుండా రైలాట కొనసాగించామని వేరే చెప్పాలా? 

ప్రకృతితో కలిసి జీవిస్తూ, ప్రకృతి రక్షణ తీసుకుంటూ, ప్రకృతిని రక్షించుకుంటూ- జీవితం గడిపిన రోజులవి. 


మాకు మండుటెండ పండువెన్నెలలా అనిపించడంలో ఆశ్చర్యంలేదు. 

కానీ నా మనవడది నమ్మగలడా?

---0--- 

వసుంధర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

 విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


వసుంధర పరిచయం:మేము- డాక్టర్‌ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు. 



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత్రి బిరుదు పొందారు.







126 views0 comments

Comments


bottom of page