'Palle Pilusthondi Padandi Podam' - New Telugu Story Written By Parupalli Ajay Kumar
'పల్లె పిలుస్తోంది పదండి పోదాం' తెలుగు కథ
రచన: పారుపల్లి అజయ్ కుమార్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఆ ఇంటిని ప్రకాశవంతమైన లైట్లు మరియు రంగు రంగు పూలదండలతో అలంకరించారు. విద్యుద్దీప కాంతులతో, మామిడాకుల తోరణాలతో సుందరంగా తీర్చి దిద్దారు.
రంగురంగుల హ్యాంగింగ్ లైట్లతో అలంకరించబడి, పూల మొక్కలు, పూల గుత్తులతో ఇల్లు శోభాయమానంగా కనిపిస్తున్నది.
ఇంటి ముందు ప్రదేశం అంతా ఎరుపు, గులాబీ, తెలుపు, పసుపు రంగులతో, సుందరమైన రంగోలిలను తీర్చిదిద్ది వాటి మధ్యలో వివిధ రకాల పూలరెక్కలతో అలంకరించారు.
ఇంటిముందు ఆటో దిగిన సుబ్బారావు, రాధ దంపతులు రెండు నిమిషాలపాటు ఆ ఇంటి వైభోగాన్ని చూస్తూ నిలుచుండిపోయారు.
"ఎంత బాగుందండి ఇల్లు" రాధ సంతోషంగా అంది.
సుబ్బారావు ఏం మాట్లాడలేదు.
ఇద్దరూ గేటు దగ్గరకి నడిచారు.
గేటు దగ్గర వాచ్ మాన్ వీరివైపు 'ఎవరు మీరు' అన్నట్లు చూశాడు.
అంతలోనే ఒక కారు హారన్ కొడుతూ గేటుముందు ఆగింది.
వాచ్ మాన్ గేటు బార్లాదీసి కారు వైపు చూస్తూ సెల్యూట్ చేసాడు.
కారు రివ్వున లోపలికి వెళ్లిపోయింది. గేటు మూసి వాచ్ మ్యాన్ వీరివైపు చూసాడు.
రాధ ఒక అడుగు ముందుకి వేసి "విజయ్ మా అబ్బాయి" అంది.
ఆ మాటలు విని అతను వీరివంక ఎగాదిగా చూశాడు.
సుబ్బారావు సెల్ తీసి ఒక నంబర్ కు డయల్ చేసాడు.
లోపలి నుండి పాతిక సంవత్సరాల యువకుడు ప్రశాంత్, ఇరవై సంవత్సరాల యువతి శాంతి పరుగెత్తుకొంటూ వచ్చారు.
వాచ్ మ్యాన్ తత్తరపడుతూ గేటు తీసాడు.
"తాతయ్యా", "నానమ్మా" అంటూ వారు సుబ్బారావు, రాధలను చుట్టేశారు.
"చాలా సేపటి నుండి ఎదురు చూస్తున్నాము. దిగగానే ఫోన్ చేస్తే బస్ స్టేషనుకు కారు తెచ్చేవాడినిగా తాతయ్యా" అన్నాడు ప్రశాంత్.
"రా నానమ్మా"అంటూ రాధ చేయిపట్టుకుని లోనికి నడించింది శాంతి.
ప్రశాంత్, సుబ్బారావు చేతిని పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు.
అప్పుడే అక్కడికి వచ్చిన విజయ్, తల్లి తండ్రిని చూస్తూనే
"ఇప్పుడే వస్తున్నారా?" అని,
కొడుకు ప్రశాంత్ ను చూస్తూ "నీ రూంలో కూర్చోబెట్టు" అంటూ హడావుడిగా వెళ్లిపోయాడు మరొకరిని పలకరిస్తూ.
సుబ్బారావు, రాధ ల ఏకైక కొడుకు విజయ్.
సుబ్బారావు మధ్యతరగతి రైతు.
వారికి విజయ్ ఒక్కడే కొడుకు.
చిన్నప్పటి నుంచి విజయ్ చదువు మీద శ్రద్ద చూపేవాడు. బాగా చదివేవాడు. పొలం పనులను ఎప్పుడూ పట్టించుకునేవాడు కాడు. ఎప్పుడైనా సెలవు దినాల్లో పొలానికి రమ్మని తండ్రి పిలిచినా వెళ్ళే వాడు కాడు.
ఒక్కడే కొడుకు అని తల్లి గారాబం చేసేది. ఎప్పుడూ ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అవుతూ ఉండటం వలన సుబ్బారావు కూడా పొలం పనులకు బలవంతం చేసేవాడు కాదు.
విజయ్ ఇంజనీరింగ్ చదువుకోసం కొంత పొలం అమ్మాడు.
విజయ్ చదువు అయ్యాక మంచి ఉద్యోగం సంపాదించాడు.
సుబ్బారావు, రాధ కొడుకు కోసం సంబంధాలు చూడటం మొదలు పెట్టారు.
అప్పుడే విజయ్ విమలను ప్రేమించానని, ఆమెనే పెళ్ళి చేసుకుంటానని తల్లీ తండ్రి తో చెప్పాడు. విమల బాగా డబ్బున్న వారి అమ్మాయి. విజయ్ పెళ్ళికి సుబ్బారావు దంపతులు అభ్యంతరం చెప్పలేదు.
పెళ్ళిలో విమల తల్లితండ్రులు సుబ్బారావు, రాధలను తక్కువ చేసి మాటలాడటం వారిని బాధించింది. వారి ఎకసెక్కాలకు కొడుకు కూడా వంత పాడటం వారికి మింగుడు పడలేదు.
పెళ్ళిలో గొడవలెందుకని నోరు మూసుకుని భరించారు.
మూడు నిద్రలకు తప్ప విమల అత్తగారి గుమ్మం తొక్కిందే లేదు. విమలకు అత్తమామలను చూస్తే లోకువ.
పెళ్ళి అయ్యాక విజయ్ విమల మాటే వినేవాడు. విజయ్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో వుండేవాడు. పండగలకు కూడా తల్లితండ్రుల దగ్గరకు వచ్చేవాడు కాడు. అదేమంటే 'ఆ పల్లెటూర్లో ఏం తోచదు నాకు' అని అనేవాడు. కొడుకు, కోడలు ప్రవర్తనలతో విజయ్ తల్లితండ్రులు బాధపడేవారు.
విజయ్ కు కొడుకు ప్రశాంత్, కూతురు శాంతి పుట్టినప్పుడు కూడా హాస్పిటల్ కు వెళ్ళి చూసివచ్చారు.
విజయ్ పిల్లల బారసాల, అన్నప్రాసన, పుట్టినరోజు లాంటి వేడుకలను విజయ్ అత్తమామల ఆధ్వర్యంలో వారి ఇంటిలోనే జరిపేవాడు.
ఆ వేడుకలకు పిలిస్తే వెళ్లి ఒక పూటలోనే తిరిగి పల్లెటూరికి వచ్చేవాళ్ళు.
కోడలి ప్రవర్తన, విజయ్ అంటీముట్టనట్టుందే స్వభావంతో సుబ్బారావు దంపతులు ఒకరకమయిన వైరాగ్యంతో కాలం వెళ్లదీస్తున్నారు.
అయితే వారి వైరాగ్యాన్ని పటాపంచలు చేసి వారి జీవితాలలో మళ్ళీ వెలుగులను నింపింది మనవడు ప్రశాంత్, మనవరాలు శాంతి.
వారిద్దరికీ తాతయ్య, నానమ్మ అంటే చెప్పలేని ప్రేమ.
ఊహ తెలిసిన దగ్గరనుండి తల్లీ తండ్రీ వారిస్తున్నా వినకుండా ప్రతీ సెలవులకు వాళ్ళు తాతయ్య దగ్గరకే వచ్చి ఆ పల్లెటూర్లో ఆడుతూ పాడుతూ గడిపి వెళ్ళేవారు.
తాతయ్య వెంట పొలానికి వెళ్లి అక్కడ చేసే వ్యవసాయ పనులను ఆసక్తిగా చూసేవాడు ప్రశాంత్.
శాంతి నానమ్మకు గారాల మనవరాలు.
మనవడు, మనవరాలు ముద్దుముచ్చట్లతో కొడుకు, కోడలు చేసిన గాయాలను మరచి ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నారు సుబ్బారావు, రాధ.
సంవత్సరం క్రితం విజయ్ వచ్చి మంచి ఇల్లు కడుతున్నాను డబ్బులు కావాలంటే ఒక ఎకరం మాత్రం తమ క్రింద ఉంచుకొని మిగిలిన పొలం అంతా అమ్మి డబ్బులు విజయ్ కి ఇచ్చాడు సుబ్బారావు.
ఏనాడు తండ్రిని కడుతున్న ఇల్లు చూడటానికి రమ్మనలేదు విజయ్. రేపు గృహప్రవేశం అనగా ముందురోజు ఫోన్చేసి చెప్పాడు. సుబ్బారావుకి వెళ్ళటం ఇష్టంలేదు. ప్రశాంత్, శాంతి తప్పకరావాలని ఫోన్ చేయడంతో భార్యను తీసుకుని వచ్చాడు.
కొడుకు సరిగా మాట్లాడకుండా వెళ్ళిపోవటం, కోడలు కనీసం ఇటువైపు చూడకపోవటం సుబ్బారావు దంపతులు అవమానంతో కృంగిపోయారు. తమతో మాట్లాడటానికి తీరికలేని కొడుకు వియ్యంకుడితో నవ్వుతూ కబుర్లు చెప్పటం గమనించాడు.
అందరితో సరదాగా ఉండే కొడుకు తమని మాత్రం దూరం పెట్టటం సహించలేక వెళ్లిపోవాలని మనసులో అనుకున్నాడు.
ఎవరో అడుగుతున్నారు విజయ్ ని - 'మీ తల్లితండ్రులు రాలేదా' అని.
'మా నాన్నకి ఒంట్లో బాగలేక రాలేదు' అన్న విజయ్ సమాధానం సుబ్బారావు, రాధను నిశ్చేష్టులను చేసింది.
ప్రశాంత్, శాంతి కూడా ఆ సమాధానంతో అవాక్కయ్యారు.
సుబ్బారావు, రాధలను చేయిపట్టుకుని నడిపించుకుని హాలు మధ్యలోకి తీసుకు వచ్చారు ప్రశాంత్, శాంతి.
అక్కడ ఏర్పాటు చేసిన డయాస్ మీద పాట కచేరి జరుగుతున్నది. ప్రశాంత్ ఆ డయాస్ ఎక్కాడు.
శాంతి తాతయ్యను, నానమ్మను బలవంతాన డయాస్ ఎక్కించింది.
ప్రశాంత్ ప్రక్కనే ఉన్న మైక్ అందుకుని "మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ అభివందనాలు.
ఇల్లు చాలా బాగుందని అందరూ మెచ్చుకున్నారు.
ఈ ఇల్లు మా తాతయ్య, మా నానమ్మ గార్లు ఇచ్చిన డబ్బులతో కట్టినది కనుక ఒక రకంగా చూస్తే యీ ఇల్లు వారిదే. మీ ప్రశంసలన్నీ వారికే చెందుతాయి. ఇదుగో వీరే మా తాతగారు సుబ్బారావు, ఈమె మా నానమ్మ రాధ "
అంటూ ఆహూతులందరికీ పరిచయం చేసాడు.
అది విన్న విజయ్, విమల వచ్చిన అతిధుల ముఖాలలోకి చూడలేక సిగ్గుతో తలలు దించుకున్నారు.
"మా తాతగారు పల్లెటూరులో వ్యవసాయం చేస్తూ మా నాన్నగారిని ఉన్నత చదువులు చెప్పించారు. మంచి భవిష్యత్తుకు బాటలు వేశారు. ఈ రోజు మేము ఇంత మంచి స్థితిలో ఉన్నామంటే కారణం మా తాతగారే. తన రెక్కల కష్టంతో సంపాదించిన సంపదనంతా మాకు ఇచ్చేసి మమ్ములను ఈ స్థాయిలో నిలబెట్టింది మా తాతగారే"
అంటూ తాతగారి కాళ్లకు నమస్కారం చేసాడు ప్రశాంత్.
శాంతి అన్న దగ్గరి నుండి మైక్ తీసుకుని
"మా నానమ్మ గురించి చెప్పాలంటే ఒక రోజంతా చెప్పొచ్చు.
నాకు ఊహ తెలిసిన దగ్గరనుండి ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు పొందినది మా నానమ్మ దగ్గరే. మా అమ్మానాన్నలు చూపించిన ప్రేమను తక్కువ చేయటం లేదు. ఎందుకో మా నానమ్మ దగ్గర ఉన్న స్వతంత్రం నాకు మా అమ్మ దగ్గర లేదు.
మా నానమ్మ వొడిలో తలపెట్టుకొని పడుకుంటే ఎంత ప్రశాంతంగా వుంటుందో. తన దగ్గర గారాలు పోతాను.
మారాము చేస్తాను. పీజీ చదువులు చదివినా మా నానమ్మ కు నేను చిట్టి పాపాయినే"నవ్వుతూ నానమ్మ భుజాల మీద తల పెట్టింది.
ప్రశాంత్ కొనసాగించాడు..
"చిన్నతనం నుండి పల్లెటూరిలో మా తాతయ్య వెంట పొలాలకు వెళ్ళి అక్కడ వ్యవసాయాన్ని ఆసక్తిగా గమనించే వాడిని. నాకూ వ్యవసాయం మీద అనురక్తి కలిగింది. అమ్మ ఒడిలోని కమ్మదనం పల్లెటూర్లలో ఉంది. తెలుగు భాషలోని తీయదనం అక్కడే ఉంది.
కానీ ఇప్పుడు ఆధునికత, ఫ్యాషన్లు వేలంవెర్రిలా పల్లెలకు సైతం పాకడం, సినిమాలు, రాజకీయాలు, సాంకేతికత అక్కడి స్వచ్ఛమైన మనసులను కలుషితం చేయడంతో పరిస్థితి పూర్తిగా మారిపోతున్నది.
పల్లె అందాలు, ప్రశాంతత మసకబారిపోతున్నాయి.
పంట పొలాలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో పడి ప్లాట్లుగా మారడంతో వ్యాపార సంస్కృతి అక్కడ వేళ్లూనుకుంటోంది.
వ్యవసాయం చేయడం అంటే ఇపుడు చాలామంది రైతులు నామోషీగా భావిస్తున్నారు. కన్నతల్లి లాంటి పంట భూములను వదిలి పట్టణీకరణ వ్యామోహంలో కొట్టుమిట్టాడుతున్నారు.
కులవృత్తుల జాడ కానరావడం లేదు. పచ్చని పల్లెల్లో ఆధిపత్యం కోసం కులాల కుమ్ములాటలు నిత్యకృత్యమై పోయాయి.
'మనిషికి మనిషే కరువు’ అనే నగర సంస్కృతి ఇపుడు పల్లెలకూ పాకడంతో ‘ఎవరికివారే’ అన్నట్టయి ప్రేమ పూరిత పలకరింపులకు దూరమై జనం ఒంటరి జీవితాలకు అలవాటుపడుతున్నారు.
చెట్టూ, చేమా, పక్షి, పురుగు, గొడ్డూ గోదా, పాడీ, పంటా అన్నీ మాయమైపోతూ పల్లెల్లో ఎటు చూసినా కాంక్రీట్ కట్టడాలు తప్ప మరేమీ కనబడటం లేదు.
ఊరిలో చేయటానికి పనులు లేక, తినటానికి తిండి లేక, ఉండటానికి గూడులేక నగరాలకు, వలసపోతున్నారు.
ఇపుడు గ్రామీణ వాతావరణం గుర్తు పట్టలేనంతగా మారిపోతున్నది. శిథిలావస్థకు చేరుకున్న గ్రామీణ వ్యవస్థ ఏదో ఒక రోజు అమాంతం కూలిపోతుంది.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మనిషి మనుగడకు, పర్యావరణానికి, సంస్కృతీ సంప్రదాయాలకు అపార నష్టం జరుగుతుంది.
ఈ వ్యవస్థకు మరమ్మతులు చేయాలన్న తపన ఎవరిలోనూ కనిపించడం లేదు. గ్రామాల పరిస్థితి మరింత దయనీయంగా మారిపోక ముందే మనం మేల్కొనాలి.
‘ఈ పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు’ అని మహాత్మాగాంధీ అన్నారు.. పల్లెలు అభివృద్ధి సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యం..
'ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా
అటో ఇటో ఎటో వైపు
మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరీ
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ
వెనుకవచ్చు వాళ్ళకు బాట అయినది'
అటువంటి స్ఫూర్తితో పని చేయటానికి నేనూ నిర్ణయించుకున్నాను. గాంధీజీ కల సాకారం చేయటానికి మా వంతు కృషి మేము చేయదలుచు కున్నాము.
70 ఏళ్ల మా తాతయ్యే నాకు ఆదర్శం. అందుకే నేను అగ్రికల్చర్ M. sc. చేసాను. మా తాతగారితో కలసి వ్యవసాయం చేస్తాను.
వ్యవసాయంలో సరిక్రొత్త పద్ధతులు కనుగొని, ఆధునిక సాంకేతిక వనరులను వినియోగించుకొని ఎక్కువ దిగుబడి యిచ్చే పంటలను పండించి వ్యవసాయ రంగంలో ఒక నూతన ఒరవడిని తీసుకొస్తాను.
దీనికి మా తాతగారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.
మా అమ్మా, నాన్న కూడా దీనికి అభ్యంతర పెట్టరని భావిస్తున్నాను.
ఇప్పటికే చాలా లేట్ అయింది. డిన్నర్ మొదలుపెడదాం"
అంటూ తాతయ్య, నానమ్మలను తీసుకుని శాంతి వెంటరాగా డైనింగ్ హాల్ కు దారి తీసాడు ప్రశాంత్.
********************************
పారుపల్లి అజయ్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పారుపల్లి అజయ్ కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు పారుపల్లి అజయ్ కుమార్ ...
పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని ...
ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని ...
సాహిత్యం అంటే ఇష్టం .... కథలు,
నవలలు చదవటం మరీ ఇష్టం ...
పదవీ విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మం లో
"పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్ " పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగం లో నిర్వహిస్తున్నాను ..
షుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి .
నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు ..
రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు ...
ఉచిత లైబ్రరీ ....
మంచినీరు ,కుర్చీలు ,రైటింగ్ ప్యాడ్స్ ,వైఫై ,కరెంటు అంతా ఉచితమే ...
ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు ...మనసున్న
మనిషిగా నాకు చేతనైన సాయం నిరుద్యోగ మిత్రులకు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి.
Comentários