top of page

పల్లెటూరి సంసారం

Updated: Aug 19, 2023


'Palleturi Samsaram' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally

'పల్లెటూరి సంసారం' తెలుగు కథ

రచన : సుదర్శన రావు పోచంపల్లి


ఓ.. లింగయ్య! జర బాయి కాడికి పోయి పాలకూరనన్న కలెగూరనన్న తీసుకోని ఎల్లెం రా” అంటుంది గంగమ్మ.


“ఒండుకోని జప్పజప్పదిని నువ్వు బాయికాడికి పోదువు.. నేను దొరోండ్లింట్ల పని జేయటానికి పోవాలె - ఇప్పటికే దొరుసానమ్మ ఎంత తిట్టుకుంటున్నదో” అంటుంటె లింగయ్య అంటాడు “ఎందుకు తిట్టు డెందుకు? మనం సక్కగ కొలువు జెయ్యడము లేదా”.


“అదెపాయ్ తియ్యి ఆనాడు లేదు ఈనాడు లేదు

కుంటి బిడ్డ నాడు సొంటి కొమ్ము


అని నీకేమొ లెస్స కోపమొస్తది. పని సక్కగ జెయ్యక పోతె పైసలేడికెల్లి వస్తయ్. నువ్వైతె పో నేనీ పొల్లగాన్ని సాల్లెకి బంపి దొరోండ్లింటికి పోత- అరె ఓరి పోరగా ఎల్లెం దిను. ఆలస్యమైతె పంతులు గొట్టి గొట్టి సంపుతడు. తిను కొడుక తిను” అని బతిమాలుతుంది కొడుకు రాములును.


అప్పటికే ఉన్న బువ్వ సద్దిగట్టుకోని లింగయ్య బాయి దగ్గరికి పోతె - కొడుకు తినంగనె “నీ ఒయ్యిలెక్కడున్యిరా రాములుగా” అంటుంది గంగమ్మ.

“ యే ఈడ్నే ఉన్నయే” అంటు పుస్తకాలు సర్దుకుంటాడు రాములు.


-- రాములును తీసుకోని గుడిసె తలుపుకు తాళమేసి బడిదగ్గర వదిలి యజమానింటికి పోతది గంగమ్మ.


“ఏమి గంగమ్మ ఈ రోజు ఆలస్యమయింది?” అని అంటుంది యజమానురాలు సావిత్రమ్మ-


“అదె దొరసాని నిత్యము వస్తులేనా.. రాత్రి జర పెయ్యి పుల్లసిల్లినట్టయ్యింది. అందుకే మబ్బుల లేవనీకి చేతగాలె” అంటుంది గంగమ్మ.


“నువ్వు ఆలస్యము చేస్తె చంద్రిగాణి పెండ్లాము గోపమ్మను బిలిచి వాకిట్ల ఊడ్చి చానిపి జల్లి ముగ్గేసి పొమ్మన్న. అది అంత వరకే చేసి పొయ్యింది. సరె నువ్వయితె చేదబాయి కాడ బాసండ్లు ఉన్నయి, తోమి లోపలబెట్టు. రాత్రి వండిన సద్దెన్నమున్నది, మామిడి కాయ తొక్కేస్త తీసుకపో” అంటుంది సావిత్రమ్మ.


“అట్టగె దొర్సాని. అంబటేల గాంగనె సాల్లెనే పిల్లలకు తిండి బెడుతున్నరు- ఇగ పొద్దుమూకి రాంగనె మా పొల్లగాడు ఇల్లంత సదుర్తడు తినెనీకి ఏమున్నదని. ఇగ ఈ అన్నము తొక్కు జూసెనా అంటె ఆవురావున దింటడనుకుంటు- దొర్సాని ఇగ నేను ఎల్లెం బోవాలె, ఆ నర్సిరెడ్డి బాయికాడ వరి నాట్లేస్తున్నరు. ఆలస్యమైతె పనిలోనికి రానీయరు” అనుకుంటు పరుగు పరుగున నర్సిరెడ్డి బాయి దగ్గరికి పోయి అందరిలో కలిసి నాట్లేయ బూనుకుంటది గంగమ్మ.

వరి నాట్లు వేస్తుంటె తోటి కూలీలు పాట జెప్ప మంటరు. దానికి సిగ్గు పడకుండా పాడ్తది గంగమ్మ.


కొండ వెనుక బాయి కాడ కోస్తారు వరిచేను

కొడవళ్ళూ చేతబట్టి కొంగూ నడుముకు గట్టి

రండమ్మ రండీ రమణు లారా


అని పాడుతుంటే తోటి కూలీలందరు పాటనందుకుంటరు.


ఎండవేళ గావచ్చె బండి మనకు లేదాయె

పిల్లబాట వెంట మనము మెల్లంగ నడుస్తె

తెల్లారి పోతుంది కడుపారి పోతుంది

వడి వడిగ నడువండి వరిచేను గోయాలి


కుప్పలూ గొట్టాలె తూర్పార బట్టాలె

నడ్డి విరిగిన దాక నడుమొంచి పని జేస్తె

అడ్డెడూ ధాన్యమె అతి కష్టమాయె


అతివలూ వీరంటు గతిలేని వారంటు

మతి గలుగు వారు మనకెవరు లేరు

రెక్కలే చుట్టాలు డొక్కలే కోరికలు

బుక్కెడన్నమె మనకు దక్కేది రోజు


కొండ వెనుక బాయి కాడ కోస్తారు వరి చేను

రండమ్మ రండీ రమమణులార

అని పాట ముగిస్తు పడమటి దిక్కు జూస్తది గంగమ్మ.

‘పొద్దు తల్లి కల్లి కడుపులకు బాయె ఇంక చాలిత్తాము - ఇయ్యాళ్ళన్న పటేలు కైకిలు ఏస్తడో ఇప్పటికే ఎనిమిదొద్దులాయె సావుకారి ఉద్దెర గూడ ఇస్తులేడాయె’ అనుకుంటు గట్టెక్కి కాలువలో చేతులు కాళ్ళు ముఖము కడుక్కోని కొంగుతో ముఖము తుడుచు కుంటూ అక్కడే నిలబడ్డ నర్సిరెడ్డి తో అంటారు “చీకటయితుంది. ఇయ్యాళ్ళ కైకిలి పైసలే ఇయ్యి పటేలా. గింజలేస్తె ఆ కోమటాయిన సగం దోచుకుంటడు- మట్టి పెల్లలని తాలు గింజలని నానా యాతన బెడుతడు వాని మీద మన్ను బొయ్య! మనూరు కొచ్చిన్నాడు వాణికి కాళ్ళకు చెప్పులు సుగ గతి లేకుండె - ఇప్పుడు మిద్దె మీద మిద్దె గట్టి ఓ బలె ఇదై పోతున్నడు. మా పేదోండ్ల నోట్ల మన్ను బోసుకుంటు” అంటుంటె నర్సిరెడ్డి నవ్వుతూ డబ్బులే చెల్లిస్తాడు లెక్కగట్టి అందరికి.


ఇక కూలీలందరు తమ తమ ఇండ్లకు బాట పడుతారు.

రోజు ఇదే కార్యక్రమం లింగయ్యది గంగమ్మది. కొంత కాలానికి లింగయ్య తమ కష్టార్జితముతో రెండు ఎకరాల చెలుక కొంటాడు. వాన కాలం ఒక పంట మాత్రమే తీసుకుంటు కాలం వెళ్ళదీస్తుంటారు.


కొడుకు రాములు పెద్దవాడైతడు- ఉన్నత పాఠశాల చదువు పూర్తీయి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడైతాడు- పై చదువులకు పట్నము పంపాలంటె తగు స్తోమత లేకున్నా గంగమ్మ తన మెడలో ఉన్న బంగారాన్ని కుదువబెట్టి డబ్బు తెస్తుంది- మొత్తం మీద కొడుకును ఇడువ తొడుగ ఉన్న బట్టలతోనే పట్నము పంపుతారు.

పట్నము చేరిన రాములు వసతి గృహములో చేరి చదువుకుంటుంటాడు.


‘మా రాములయ్య ఎట్ట్లున్నడో ఏమొ’ అని రోజూ తలుచుకుంటు దిగులు చెందుతది గంగమ్మ.


ఇంటెర్మిడియేట్ లోను మొదటి తరగతిలో ఉత్తీర్ణుడౌతాడు రాములు. ఇక పై చదువులకు ఆర్థికంగా స్తోమత లేక పల్లె బాట బడుతాడు రాములు. కొడుకు బుద్ధిగ కష్టపడి చదువుకున్నందుకు తల్లిదండ్రి ఎంతో సంతోష పడుతారు.


కొడుక రాములు ఇంకా చదివిత్తామనుకుంటె “ఇదివరకే కుదువ బెట్టిన బంగారానికి మిత్తి గట్ట లేక ఆగమైతున్నము - మీ అయ్య అటు జీతం జేసుకుంటు ఇటు పొలం దున్నుకుంటు ఎంత కష్టము చేసిన ఒచ్చే పైకము ఆడికాడికే సరిపాయె” అంటుంది లింగమ్మ.


“పోనీలే అమ్మా! నేను కరెంటు పని నేర్చుకున్న - ఆ పని జేసుకుంటు బతుకుదాము, మీరు బాధ పడకుండి” అంటాడు రాములు.


రాములు కరెంటు పనులు చేసుకుంటు బాగానే సంపాదించ సాగాడు. కొద్ది కాలానికే తల్లి కుదువబెట్టిన బంగారాన్ని విడిపిస్తాడు.


ఇంకో రెండేండ్లు గడువగానే తల్లిని పని మానిపిస్తాడు. లింగయ్య, గంగమ్మ, రాములు పొలము పని చేసుకుంటు ఇంక నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయము చేస్తుంటారు - వ్యవసాయములో కొన్ని మెలకువలు నేర్చుకున్నందున దిగుబడి బాగనే వచ్చేటట్లు కష్ట పడుతారు ముగ్గురు.


కొంచెము నిలదొక్కుకోంగనె రాములుకు పెళ్ళి చేయాలని అనుకుంటరు తల్లి, తండ్రి.


“నాకు లగ్గము ఇప్పుడే ఒద్దు కౌలుకు తీసుకున్న నాలుగెకరాలు కొన్నాంక చేసుకుంట. ఐనా ఇంక రెండర్రలు గూడా కట్టాలె గదా” అంటాడు రాములు.


“ఇంకెప్పుడురా అయ్యేవయితుంటయి, పొయ్యేవి పోతుంటాయి గాని గా పక్కూళ్ళ సూరయ్య బిడ్డ చూడెనీకి బాగుంటది. ఆ పిల్ల కూడా నీతోటి సమానంగ సదువుకున్నదట. కాదనకు కొడుక.. అంతయితె ముందుగాల రెండర్రలు కట్టిచ్చుకుందా”మంటుంది గంగమ్మ.


“సరె తియ్యి ముందుగాల గా రెండర్రలు గానియ్యె” అంటడు రాములు.


“ఈ మాటలు వినుకుంటూ మన రెండు ఎకరాలు అంజుమనోళ్ళకాడ కుదువ బెట్టి అప్పుదెత్తాము. ఇల్లు జర జల్దీన కట్టొచ్చు - అప్పు దీర్చటానికి రెండేడ్లు -- అప్పుడిన్ని అప్పుడిన్ని కట్టొచ్చు” అంటడు లింగయ్య-

“దుహునీ మనకున్నవే రెండెకరాలాయె. కాలము బాగ లేకపోయినా అప్పులోడు మిత్తి మీద మిత్తిలేస్తుంటె ఆయింత పొలము అమ్మవల్శొస్తది - ఉన్నది బాయె ఉంచుకున్నది బాయె చేసుకున్నది శెప్పకుండ బాయె అన్నట్లయితది మన గతి” అంటడు రాములు.


“సరె కొడుక నీ యిష్టమే. కాని ఆ పిల్లయితె జర బాగుంటదనుకున్న - ఓ లింగయ్యా.. సప్పుడు జేయవు.. ముందుగాలనైతె బాపనాయినను మంచి రోజడిగి పూలు పండ్లు పెట్టొత్తాము. మనపిల్ల అనిపించుకోని”అంటుంది గంగమ్మ-


“ఏమోనే మీ తల్లి కొడుకులు ఎట్ల అంకుంటె అట్ల జేతాము” అంటడు లింగయ్య.


భూముల ధరలు పెరుగుతున్నవి అని తెలిసి లింగయ్య తన రెండు ఎకరాల భూమి, భార్య మెడలోని బంగారము అమ్మి కౌలుకు చేస్తున్న నాలుగు ఎకరాల భూమిని కొంటాడు. గంగమ్మ రాములు కూడా సంతోష పడుతరు.


“ఇప్పుడు సమ్మతమేనా?” అంటడు లింగయ్య, భార్య గంగమ్మ వైపు చూస్తు.


“అది సరె గాని పూలు పండ్ల సంగతేమాయె” అంటుంది గంగమ్మ.


“నువ్వు తొందర పెట్టకె నాయిన ఆయింత రెండెకరాలు కుదువబెట్టగల - జరాగరాదు వచ్చే నెల పోదురు గాని. ఆ లోపల ఎట్లనో తిప్పలబడి ముందుగాల ఒక్క అర్రైనా కట్టనియ్యి” అంటాడు రాములు.


“సరె బిడ్డ అట్లనే కానియ్యి” అంటుంది గంగమ్మ.


నెల రోజులు ముగ్గురు కష్టపడి ఒచ్చిన రాబడితో ఒక్క అర్ర మాత్రము కట్టిస్తారు. మంచిరోజు బాపనాయినను అడిగి పక్కూరుకుపోయి పిల్లను చూసి పూలు పండ్లు పెడ్తరు- పిల్ల పేరు అడిగితె సత్య అని తెలుపుతుంది- చదువు ఇంటర్ మీడియేట్ అని చెబుతుంది సత్య.


లింగయ్య గూడ పిల్ల బాగుంది అనుకుంటాడు. పెళ్ళి మాత్రము యేడాది కాలము పడుతుంది అని చెబుతారు లింగయ్య గంగమ్మ.


“పూలు పండ్లు పెట్టినంక ఏడాది లోపలే లగ్గము జెయ్యలె అంటరు గద” అంటడు సూరయ్య -


“మాకు కూడా జల్దీననే జెయ్యలె అని ఉన్నది” అంటది గంగమ్మ.


“మా ఊరికి పొయినంక సోంచాయించి మీకు జెబుతము. ఇగ బొయ్యొస్తము” అని “చెబితె బువ్వ దిని బోదురు” అంటడు సూరయ్య-

“గతుతుకుతె అతుకదంటరు గదనె సూరన్న- మల్లొచ్చినప్పుడు దింటము గాని మీరిద్దరు మా ఊరికి రండి. పిల్లగాణ్ణి గూడ చూసినట్టుంటది” అంటుంది గంగమ్మ.


“సరెతియ్యి సూతాము” అంటడు సూరయ్య.


“వదినే.. మీ సత్యది ఒక ఫోటో ఉంటె ఇయ్య రాదు, మా పిల్లగాడు చూస్తడు” అని అడుగుతుంది గంగమ్మ.


“అట్లనే” అనుకుంటు సత్యనడిగి ఫోటో ఇస్తుంది జానకమ్మ.


“ఇగ బొయ్యొస్తము” అని మరొక సారి చెప్పి ఇంటిదారి పడుతరు లింగయ్య, గంగమ్మ.


ఇల్లు చేరగానే ఫోటో రాములుకు ఇస్తరు.


ఫోటో జూసి “అమ్మా! నేనీ పిల్లను ఎన్నో సార్లూ జూసిన. పేరు సత్యగదా” అంటడు రాములు.


“అదెట్లరో నీకు గాపిల్ల ఎట్ల దెలుసు?” అంటది తల్లి.


“నేను అప్పుడప్పుడు పట్నములో బస్సు లో దిరుగుతున్నప్పుడు జూసిన. ఇగ పేరంటవా వాళ్ళ దోస్తులు పిలుచుకున్నప్పుడు ఇన్న” అంటడు రాములు.


“సరె తియి ఇంతకు ఆ పిల్లనొప్పుకుందామా” అంటది గంగమ్మ-


“అదేందమ్మా ఒప్పుకోకనే పూలుపండ్లు బెడ్తరా నీదో ఇచిత్రము అండడు” రాములు-


“ఇంక మూడ్నెల్లయితె దస్ర పండుగొస్తది ఆ నెలల బాగుంటదంటరు. అప్పుడు లగ్గం బెట్టించుకుందాము బాపనాయినతోని- ఈ లోపల్నే ఇంకో అర్ర గట్టుడు జప్ప జెప్ప గానిత్తాము” అంటది గంగమ్మ.


“సరె అమ్మా’ అనుకుంటూ తండ్రిని తీసుకోని పొలము పని చేయడానికి పోతడు రాములు- ఆ రోజు ఇగ కమ్మని వంట జేసి పెడుతది గంగమ్మ.


దసరా దాటంగనె సత్య తో వివాహము జరిపిస్తరు లింగయ్య గంగమ్మ. సత్య తండ్రి సూరయ్య రెండు ఎకరాల తరి భూమి ఇచ్చి మోటారు బండి కొనిస్తనంటడు అల్లునికి. రాములు ససేమిరా వద్దంటడు.


“రెండేండ్లు సైసు మామా.. మేమే కొనుక్కుంటము. నిన్ను దావతుకు గూడా పిలుస్తము” అంటడు ధీమాగా రాములు.


అన్నట్లె బాగా కష్టపడి రెండేండ్లలో రెండు ఎకరాల పొలము, తరువాత మోటారు సైకిలు, సత్యకు బంగారము కొనిపెడుతడు. ఇక నలుగురికి చేతి నిండా పనులే.. ఇంటి గరిశె నిండా ధాన్యమే..


అత్త జానకమ్మ మామ సూరయ్య చూసి ఎంతో సంతోష పడుతారు. ఏడాది తిరగకముందే చక్కని కూతురు పుడుతుంది రాములుకు సత్యకు- ఆ పాపకు ధన లక్ష్మి అని పేరు పెట్టి సంబర పడుతారు అందరు.


సమాప్తం.


సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.



コメント


bottom of page