top of page

పంచవన్నెల రాజకళ్యాణీ అశ్వం - 1



'Panchavannela Panchakalyani Aswam - Part 1' - New Telugu Story Written By Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 16/03/2024 

'పంచవన్నెల రాజకళ్యాణీ అశ్వం - పార్ట్ 1' తెలుగు పెద్ద కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



పూర్వం కోసల దేశాన్ని వీరభట్టారకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని ఒక్కగానొక్క కొడుకు రుద్రసింహ. రాజ్యాధికారం చేపట్టే వయసు కలిగిన యువకుడు. 


ప్రస్తుతం రుద్రసింహ రాజ్యానికి దూరంగా ఉన్న అడవిలో గుర్రపుస్వారీ అలవాటు చేసుకుంటున్నాడు. గుర్రపు స్వారీలో బాగా ప్రవేశం ఉన్న అతని మిత్రుడు గురుస్వామి రుద్రసింహకి సులువులు చెబుతూ నేర్పు తున్నాడు. అయినా ఫలితం శూన్యంగా ఉంది. 


''యువరాజా! ఈ కళ్లెం బిగుతుగా లాగకండి. కొంచెం సునాయాసంగా లాగితే సరిపోతుంది. '' అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు గురుస్వామి. 


''నీకేం.. ఎన్నైనా చెబుతావు. ఇప్పటికి రెండుసార్లు క్రింద పడ్డాను. '' కోపంగా అన్నాడు రుద్రసింహ. 


''ముందు ఈ మంచి నీళ్లు తాగండి. ఓషధులు అన్నీ కలిపిన మంచినీళ్లు ఇవి. ఇవి తాగితే కొంచెం బలం వస్తుంది. ఆ తర్వాత ప్రయత్నిస్తే విజయం సులభంగా చేకూరుతుంది. '' అన్నాడు. 


''ఇదిగో గురుస్వామి.. నువ్వు నన్ను మభ్యపెట్టకు. నాకు బలంగానే ఉంది. గుర్రపు స్వారీకి ప్రాణమైన కుడిచేతి బొటన వేలే నాకు లేదు. ఇక ఎలా స్వారీ నేర్చుకోగలను?'' కొంచెం బాధపడుతూ అన్నాడు రుద్ర సింహ. 


''ఆ అనుమానమే వద్దు యువరాజా. మీరు గణిత శాస్త్రంలో, వ్యాకరణ శాస్త్రంలో, పాకశాస్త్రంలో, రత్నశాస్త్రంలో, రసాయన శాస్త్రంలో.. ఇంకా అనేక శాస్త్రాలలో చాలా గొప్ప అనుభవం సంపాదించిన ప్రవీణ్యులు. మీరు తలచుకుంటే ఏదైనా సాధించ గలరు. ''అంటూ ఉత్సాహపరిచాడు గురుమూర్తి. 


''గురుస్వామి.. అవన్నీ కాదు, రాజులకు యుద్ధశాస్త్రం లో ప్రావీణ్యం కావాలి. ముఖ్యంగా అందులో భాగమైన గుర్రపు స్వారీలో మంచి పట్టు ఉండాలి. రెండవది కత్తి పట్టడం. అది కూడా నాకు అబ్బలేదే. నేను ఎలాగూ రాజును కాలేను. కనీసం నన్ను నేను కూడా కాపాడు కోలేని పరిస్థితులలో ఉన్నాను. ఎన్నాళ్లు నీ అండతో బ్రతకడం. నాన్నగారు రాజ విద్యలు ఏవి నాకు అబ్బడం లేదని నన్ను చిన్న చూపుగా చూస్తున్నారు కదా. ఏం చేయను నా కర్మ. భగవంతుడు పుట్టుకతో నాకు ఈ బొటనవేలు ఇవ్వకపోవడం నా పూర్వజన్మ శాప ఫలితమేమో. '' నిట్టూరుస్తూ అన్నాడు రుద్రసింహ. 


''యువరాజా! మీరు ప్రశాంతపడండి. అన్ని విషయాలు ఆకళింపు చేసుకోగల వయసు మీది. ముందు ఈ ప్రయత్నం మీద దృష్టి పెట్టండి. తొందరలో సింహాసనం ఎక్కవలసిన మీరే ఇప్పుడు ఇంత బాధగా మాట్లాడటం పనికిరాదు” అంటూ ధైర్యపరిచాడు గురుస్వామి. 


యువరాజు రుద్రసింహ మరొకసారి గుర్రాన్ని ఎక్కి చాలా దూరం వెళ్లి తన బొటనవేలు పట్టులేని కారణంగా కళ్లెం వదిలి దబ్బున క్రింద పడిపోయాడు. రుద్రసింహ పైకి లేవలేకపోతున్నాడు. గురుస్వామి చాలా దూరంలో ఉన్నాడు.. ఇంతలో విచిత్రంగా తన పక్కనే ఎవరో తనను చూసి నవ్వుతున్నట్టు అని పించింది రుద్రసింహకు. 


''ఎవరు నవ్వేది? ఆ నవ్వు ఆపి ముందు కొంచెం సాయం చేయండి.. '' అని రుద్రసింహ ప్రాధేయంగా అడిగినా ఎవరు ముందుకు రాలేదు. రుద్రసింహ తనంత తానుగా పైకి లేవలేకపోతున్నాడు. అపరిచిత కంఠం నవ్వు ఇంకా ఎక్కువయింది. 



''సాయం చేయడం చేతకాకపోతే మానేయండి. కని పించకుండా ఆ నవ్వడం దేనికి. ఇది ఏమైనా మాయా ప్రపంచమా నువ్వు ఏమైనా మాయా రాక్షసుడివా?” కోపంగా అరిచాడు రుద్రసింహ. 



''కాదు రుద్రసింహ.. నేను మనిషిని, దేవుడిని, దెయ్యాన్ని, రాక్షసుడుని కాదు. నేను ఓ మాయా ఉంగరాన్ని. కొన్ని కారణాలవల్ల మానవులకు నా చరిత్ర చెప్పలేను. దేవలోకం నుండి మాత్రం వచ్చి పడ్డాను. సరే, ప్రస్తుత విషయం ఏమిటి అంటే నీ నీడ చుట్టుకొలతలోనే నేనున్నాను. వెతికి పట్టుకుంటే నీకు ఉపకారం చేస్తాను. '' అంటూ ఆ మాయఉంగరం నవ్వుతూ చెప్పింది. 


'ఇదేదో విచిత్రంగా ఉందే నా పేరు కూడా చెబుతుంది. ' అని అనుకుంటూ రుద్రసింహ నెమ్మదిగా కొంచెం పైకి లేచి తన చుట్టూ చాలాసేపు తడిమి తడిమి చివరికి ఉంగరాన్ని పట్టుకున్నాడు. 


మిత్రుడు గురుస్వామి ఇంతలో రుద్రసింహను సమీపించి విషయం తెలుసుకున్నాడు. 


''ఓ ఉంగరమా.. ఇప్పుడు చెప్పు నాకు ఏ ఉపకారం చేయగలవు. ?''' అడిగాడు రుద్రసింహం. 


''ఓ రాజకుమారా! నువ్వు కోరింది నేను ఇవ్వగలను. అయితే ఆలోచించి అడగాలి మరో విషయం.. నేను నీ కోరిక తీర్చిన ప్రతిసారి నేను నీ దగ్గర నుంచి ఏదో ఒకటి తప్పకుండా తీసుకుంటాను. ఖచ్చితంగా మూడుసార్లు మాత్రమే నేను నీకు ఉపకారం చేయగలను. సరేనా.. ఒప్పందం ఖాయమా?'' అంటూ అడిగింది మాయా ఉంగరం. 


ఆశ్చర్యపోయాడు రుద్రసింహ. ఈ విషయం చిత్రంగా ఉందే.. అనుకుంటూ.. ' సరే ఇప్పుడు ఏం కోరాలి అబ్బా.. ?’ అని ఆలోచించాడు. 'ఏముంది.. ఇంద్రుని వజ్రాయుధం లాంటి ఆయుధం కోరితే శత్రువుల్ని తరిమేయొచ్చు కదా.. ఇదే సరైన కోరిక'.. అని రుద్ర సింహ ఒక నిశ్చయానికి వచ్చాడు. 


''ఓ ఉంగరమా.. ఇంద్రుని వజ్రాయుధం కన్నా బలమైనది, పెద్దది, నవరత్న ఖచితమైన మహాయుధం కావాలి. '' అని కోరిక కోరాడు. 


''సరే. నిరభ్యంతరంగా ఇవ్వగలను. నేను కూడా నిన్ను ఓ చిన్న కోరిక అడగాలి కదా.. విను.. అది, నీ తల వెంట్రుకలు మొత్తం నాకు ఇవ్వగలవా?. '' అడిగింది మాయఉంగరం. 


''ఇంతేనా.. ఇంకా ఏదో అడుగుతావు అనుకున్నాను. మహారాజులం. తలకు వెంట్రుకలు లేకపోయినా పరవాలేదు.. ఎందుకంటే శిరోధారణం ఉపయోగించు కుంటాం కదా. లేదా తలపాగ పెట్టుకుంటాం. నా వెంట్రుకలు తీసుకో. '' అంటూ తన సమ్మతిని తెలిపాడు రుద్రసింహ. 


అంతే మహాయుధం ప్రత్యక్షమవడం, దాన్ని రుద్ర సింహ చూడడం వెంటనే అతని తల వెంట్రుకలన్ని మాయ మవడం జరిగిపోయాయి. 


''మరో విషయం రుద్రసింహ.. నామీద ఎప్పుడైనా నీకు నమ్మకం పోతే నా దగ్గర నుండి తీసుకున్న బహుమతులు నాకు ఇచ్చేయ్. అలాగే నీ దగ్గర నుండి తీసుకున్నవి అన్ని నీకు ఇచ్చేస్తాను సుమా. ఇందులో నిన్ను నేను నష్టపెట్టేది ఏ మాత్రం ఉండదు. '' అని చెప్పి ఆ కంఠం మాయమైపోయింది. 


''భళి భళి.. ఇదేదో సరదాగా ఉందే. '' అనుకుంటూ తనకు దొరికిన ఉంగరం ధరించి, ఉంగర కంఠం ఇచ్చిన మహాయుధం కదిలించబోయాడు. అతనితరం కాలేదు. మిత్రుని సాయంతో కూడా కదపలేకపోయాడు. 


అటుగా వెళుతున్న తన రాజ్య సైనికులను కొందరు పిలిచి ఆయుధాన్ని బలవంతంగా పైకి లేపి రాజ్యానికి బయలు దేరాడు రుద్రసింహ. తండ్రికి తన గొప్పతనం చెప్పి మెప్పు పొందాలని రాజ్యం చేరి రాజభవనము లోకి మహాయుధాన్ని చేర్పించాడు. అంతలో తన మందిరం నుండి తండ్రి వీరభట్టారకుడు వచ్చాడు. 


''నాన్నగారు, ఇదిగో నా ఘనకార్యం. ఇప్పుడు చెప్పండి.. నేను యువరాజుగా సింహాసనం అధిష్టించ డానికి పనికొస్తానా?.. '' అంటూ మహాయుధం చూపిస్తూ జరిగింది మొత్తం చెప్పాడు రుద్రసింహ. 


రాజు నవ్వాడు. నీ అవిటితనంతో పాటు అమాయకత్వం నాకు కనిపిస్తుంది రుద్రసింహ. '' అంటూ రాజు కొడుకుని దగ్గరకు తీసుకుని తల నిమరాడు. 


''అడవిలో ఇలాంటి మాయ వస్తువులు చాలా ఉంటాయి నాయన. ముందు లాభం చూపించిన చివరికి వాటి వల్ల నష్టమే. అవును పదిమంది సైనికులు కూడా పైకి ఎత్తలేని ఈ మహా వజ్రాయుధం నువ్వు ఎలా ఉపయోగించగలవు?.. '' అంటూ అడిగాడు రాజు. 


కంగు తిన్నాడు రుద్రసింహ.. తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఉంగరకంఠాన్ని పిలిచాడు. 


కంఠం తను వచ్చినట్లు చెప్పి రుద్రసింహను విషయం అడిగింది. 


 ''నన్ను మోసంచేశావు. ఇంత బరువైన మహా ఆయుధం తో నేను ఎలా యుద్ధం చేసి విజయం సాధించగలను. ?'' కోపంగా ఉంగరాన్ని ప్రశ్నించాడు రుద్రసింహ. 


''తప్పు నీదే రుద్రసింహ.. ఆలోచించి అడగ మన్నాను. అసలు ఈ ఆలోచన నీకు ముందే ఎందుకు రాలేదు. ఎందుకు అంత బలమైన ఆయుధం కోరావు. '' అంటూ నిలదీసింది మాయాఉంగరం. 


''సరే, నీతో నేను పడలేను కానీ.. నీ ఆయుధం నువ్వు తీసేసుకుని నా వెంట్రుకలన్నీ నాకు వెంటనే పెట్టేయ్. '' అంటూ అన్నాడు రుద్రసింహ. 


'' సరే అలాగే. కానీ కంగారు పడకు. అది అలా ఆపు చేసి మరో కోరిక కోరుకోవచ్చు కదా. ఇప్పుడైనా ఆలోచించి కోరుకో యువరాజా. '' అంటూ మంచిగా చెప్పింది ఆ మాయఉంగరం. సరే అంటూ రుద్రసింహ చాలాసేపు ఆలోచించాడు. 'ఈసారి ఎట్లాగైనా ఉంగరపు ఎత్తుకు చిత్తు కాకూడదు. '.. అని నిర్ణ యించుకున్నాడు. 


''ఉంగరమా కోరుతున్నాను.. నాకు మహాబలమైన వెయ్యి గుర్రాలు అలాగే వాట్లను చూసుకుంటూ అవసరం వచ్చినప్పుడు సైన్యాన్ని యుద్దభూమికి చేర్చగల వెయ్యి మంది గుర్రపు యజమానులు ఇవ్వగలవా. ?.. ''

 అంటూ ప్రశ్నించాడు రుద్రసింహ. 


''ఇదంతా నువ్వు అడిగావో లేదో నీ రాజ్యం పొలిమెర లో పెద్ద గుడారాల్లో నీ కోరిక నేను తీర్చి సిద్ధంగా ఉంచాను చూసుకో.. మరి నాకు ఒక చిన్న కోరిక నువ్వు తీర్చాలి కదా నీ మీసాలు నాకు ఇచ్చేయ్'' అడిగింది మాయా ఉంగరం. 


నవ్వాడు యువరాజు. ''' చిలిపి కోరిక కోరావు.. నువ్వు తీసుకుంటావా నన్ను తీసి ఇవ్వమంటావా''?అడిగాడు. అంతే.. అతని మీసాలు మాయమై పోయాయి. అంటింపు మీసాలతో యువరాజు సిద్ధమయ్యాడు. 


 ఆ సాయంత్రం యువరాజు తండ్రితో మళ్లీ జరిగింది అంతా వివరంగా చెప్పాడు. ఈసారి మాయా ఉంగరాన్ని మంచి కోరిక కోరినందుకు రాజు ఆనందించాడు. కొడుకు మహారాజు కావడానికి తగిన శక్తి యుక్తులు సంపాదిస్తున్నాడని తను సంబరపడ్డాడు కానీ ఆ సంబరం నాలుగు రోజులే నిలిచింది. 


వేయిగుర్రాలు అంటే మాటలా? వెయ్యి గుర్రపు యజ మానులు అంటే మాటలా ?వాటి పోషణ?పైగా రాజ్యం లో ప్రశాంతత లేకుండా ఆ వెయ్యి గుర్రాలు వాటి ఇష్టమొచ్చినట్టు పరిగెడుతున్నాయి. 


 గుర్రాలును అదుపు ఆజ్ఞలలో పెట్టుకోవడానికి వాటి యజమానులు చేసే హడావిడితో మొత్తం రాజ్యం అల్లకల్లోలపు తీర్థంలా తయారయింది. ప్రజలు బెంబేలు, భయాందోళనలు అదంతా చూసి రాజుకు కంగారు పుట్టింది. పరిస్థితి విషమించడంతో రాజు కంపరం ఎత్తినట్లు అయిపోయాడు.. కానీ ఏమీ చేయ లేకపోయాడు. 


అసలు యుద్ధం వస్తుందా.. ఎప్పుడో వచ్చి చచ్చే యుద్ధం కోసం ఈ లేనిపోనీ హడావిడి దేనికి? వెంటనే మహారాజు యువరాజును పిలిచి.. ''నువ్వే ఈ పరిస్థితి చక్కబెట్టు. '' అంటూ చెప్పాడు. 


యువరాజు ఆలోచించాడు ఎంతసేపు ఆలోచించినా తను కూడా ఏమీ చేయలేకపోయాడు తన మందిరం లోపలకు వెళ్లి కూర్చుని మాయా ఉంగరాన్ని పిలిచాడు. 


'' యువరాజా ఆజ్ఞ.. చెప్పు.. '' అంటూ పలికింది మాయాఉంగరం. 


''చూస్తున్నావుగా.. నీ ఆజ్ఞలు.. గౌరవాలు మాకు అవసరం లేదు. నువ్వు నన్ను రెండవసారి కూడా మోసగించావు. ఈసారి నేను మూడవ కోరిక కోరాలి అని కచ్చితంగా నిర్ణయించుకున్నాను. విను.. అదేమిటంటే నాకు ఒక మహా పెద్ద యంత్రం కావాలి. దాన్ని నేను మోయను. ఏ విధంగానూ నా శరీర భాగాలతో దానిని ముట్టుకోను. కానీ నేను దాని వైపు చూసి నోటి తో గట్టిగా దానికి ఏం చెప్తానో అది చేసేయాలి. '' కళ్ళు మూసుకుని వికటంగా నవ్వుతూ అడిగాడు యువ రాజు రుద్రసింహ. 


అంతే.. కళ్ళు తెరిచి చూసేసరికి అతిపెద్ద యంత్రం తన రాజ్యపు ప్రవేశద్వారం పక్కన సిద్ధంగా ఉన్నట్లు అతనికి కిటికీలోంచి కనిపిస్తుంది. 


'' నా కోరిక అడగమంటావా?'' అడిగింది మాయా ఉంగరం. 


''నాకు అభ్యంతరం లేదు. నన్ను అడగవద్దు తీసేసుకో. నా దగ్గర ఉన్నది నీకు ఏది కావాలో అది తీసేసుకో. '' అన్నాడు యువరాజు. 


అంతే యువరాజు కాలి చేతి గోళ్లు అన్ని మాయమై పోయాయి. యువరాజు కంగారు పడలేదు ప్రత్యేక వస్త్రాలు ధరించడం ద్వారా తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. అవి లేకపోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ లేకపోవడం వల్ల రుద్రసింహ బాధపడలేదు.. 


మర్నాడు ఆ అతిపెద్ద యంత్రం గురించి తెలుసు కోవాలి అనుకున్నాడు. ఆ యంత్రాన్ని సమీపించి చాలా దూరంగా ఉన్న 500 సంవత్సరాల నాటి ఒక మహావృక్షాన్ని చూపించి.. '' ఓ యంత్రమా మా రాజ్యానికి అడ్డుగా ఉన్న ఈ భయంకర మహా వృక్షాన్ని వేళ్ళతో సహా తొలగించి మహాసాగరంలో పడేయి.. '' అంటూ ఆజ్ఞాపించాడు. ఆర నిమిషములో మాయగా ఆ పని జరిగిపోయింది. 


ఈసారి యువరాజు రుద్రసింహ మాత్రమే కాదు మహారాజు వీరభట్టారకుడు.. రాజ్యంలోని ప్రజలు.. మంత్రులు.. పెద్దలు చాలా సంతోషించారు. యువ రాజు అమోఘమైన తెలివికి కొనియాడారు. 


మళ్లీ.. నాలుగు రోజులు పోయాక ఆ యంత్రాన్ని సరదాగా పరీక్షించాలనిపించింది యువరాజు కి వెంటనే తన రాజ్యంలోని వేలాదిమంది బలమైన సైనికులను రప్పించి ఎదురుగా చూపెట్టి ఇలా అన్నాడు.. ''ఓ యంత్రమా మరొకసారి నీ గొప్పతనం తెలుసుకోవడం కోసం ఓ పరీక్ష పెడతాను. 


మా సొంత సైన్యం వేలాదిమంది నీ ఎదురుగా ఉన్నారు. వాళ్ళను నువ్వు శత్రు సైన్యంగా భావించి వాళ్లను స్పృహ కోల్పోయేలా చెయ్.. '' అన్నాడు. 


అంతే యువరాజు అన్నట్టే జరిగిపోయింది ఆ సైన్యం అందరూ నేల కొరిగిపోయారు. కానీ ఎంతకీ పైకి లేవడం లేదు. యంత్రాన్ని పైకి లేపమని యువరాజు ఆజ్ఞాపించినా.. యంత్రం ఆ పని చేయలేకపోయింది.

=================================================================================

ఇంకా ఉంది..

================================================================================

 ******

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు

38 views0 comments

コメント


bottom of page