top of page

పని భూతం

#SudhavishwamAkondi, #PaniBhutham, #పనిభూతం, #సుధావిశ్వంఆకొండి, #TeluguMoralStories, #నైతికకథలు


Pani Bhutham - New Telugu Story Written By Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 27/04/2025 

పని భూతంతెలుగు కథ

రచన: సుధావిశ్వం ఆకొండి


ఒక ఊరిలో నివాసముండే రామశర్మ కొద్ధిగా తనకు వచ్చిన విద్య తో, పిలిచిన వారింటికి వెళ్లి, వారికి కావాల్సిన పూజలూ, అభిషేకాలూ చేసుకుంటూ వాళ్ళిచ్చిన కొద్ది దక్షిణ తోనే జీవనం సాగిస్తున్నాడు. కానీ ఆ వచ్చే దక్షిణలు తన కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. 


 దానివల్ల ఇంట్లో భార్య సణుగుడు ఎక్కువ అయ్యింది. ఆమె తన అసమర్థతను నిందిస్తోంది. ఆమెనూ తప్పుగా అనుకోడానికి వీల్లేదు. పిల్లలకు సరియైన తిండి పెట్టలేని తన స్థితి వల్ల వచ్చే ఆక్రోశం వల్ల అంటోంది కదా అనుకుని..


ఒకరోజు భార్యతో "మా గురువుగారి వద్దకు వెళ్లి మన దారిద్య్రం తీరేట్టు ఏదైనా మంత్రం చెప్పమని అడిగి వస్తాను" అన్నాడు.


అప్పుడు అతని భార్య " ఏదైనా భూతాన్ని వశపర్చుకునే మంత్రం చెప్పమనండి. అదైతే తొందరగా ఫలితం లభిస్తుందట. వెంటనే మన దారిద్య్రం పోతుంది" అంటూ సలహా చెప్పింది. 


సరేనని వెళ్ళాడు గురువుగారి వద్దకు.


విషయం విన్న గురువు... "అది మంచిది కాదు నాయనా! ప్రమాదాన్ని కొని తెస్తుంది. ఇంకేదైనా దేవతా మంత్రం చెబుతాను నిష్ఠతో చేస్తే ఫలిస్తుంది" అని హితవు పలుకగా...

నాకు భూత వశీకరణ మంత్రమే కావాలని పట్టుబట్టాడు.


సరేనని అదే ఉపదేశించారు గురువుగారు. సంతోషించిన రామ శర్మ వెంటనే ఇంటికి వచ్చాడు. భార్య సంతోషించింది. ముందుగా చాలా డబ్బులు అడగమంది. 


వెంటనే ఆ మంత్రం జపించాడు. ఎదురుగా పెద్దగా పొగ వచ్చి, ఆ స్థానం లో ఒక పెద్ద భయంకరమైన భూతం ప్రత్యక్ష మయ్యింది. 


"ఓ రామ శర్మా! చాలా సంతోషించాను నాకోసం మంత్రం పఠించి, నన్ను ఆహ్వానించినందుకు. కానీ నాకొక బలహీనత ఉంది. నేను ఎవరికి వశపడి వుంటానో వాళ్ళు నాకు ఏ పని చెప్పినా చేస్తుంటాను. కానీ పని చెప్పకపోతే మాత్రం నిన్ను మింగేస్తాను." అంది.


ఆ మాట విన్న రామశర్మ దంపతులు చాలా సంతోషించారు. తమకు కావాల్సింది కూడా అదే కదా అనుకున్నారు. కానీ దాని పర్యవసానం ఏమవుతుంది అనే ఆలోచన రాలేదు వారికి.


 "ముందుగా చాలా ధనం తీసుకురా" అనగానే తెచ్చి, ఇచ్చింది. ఆనందిస్తుంటే పని చెప్పమంది. అప్పుడు మళ్ళీ ఇలా చెప్పాడు....


"ఓ భూతమా! దాసదాసీ జనాలతో,సకల సౌకర్యాలతో ఒక భవనం ఏర్పాటు చెయ్యు" అన్నాడు రామశర్మ. 


పూర్తిగా చెప్పి చెప్పకుండానే క్షణంలో వచ్చి, చేసేశాను ఇంకో పని చెప్పు అంది. మమ్మల్ని అందులోకి చేర్చు అన్నాడో లేదో చేర్చేసి, ఇంకోటి చెప్పు అంది.


అలా ఏ పని చెప్పినా వెంటనే చేసి ఇంకోపని చెప్పు లేదంటే చంపేస్తానంది. చెప్పడానికి పనే తోచలేదు. ఇక అది చంపుతుందనే భయంతో మా గురువుగారి ఆశ్రమానికి తీసుకెళ్ళు నన్ను అన్నాడు. అది నిముషంలో దించేసింది. 


వెంటనే పరుగున లోపలికి వెళ్ళి గురువుగారి కాళ్లపై పడి, విషయం వివరించి, క్షమాపణ వేడుకున్నాడు. భూతం నుంచి కాపాడమని కోరాడు.


మందహాసం చేసిన గురువుగారు..

తన గిరజాల జుట్టు లోనుంచి ఒక వెంట్రుక తీసి శిష్యుడి చేతికిస్తూ " అంత బెంగ ఎందుకు? ఉపాయం చెబుతాను. దీన్ని నిటారుగా చేయమని చెప్పు దానికి. నీ సమస్య తీరుతుంది అని చెప్పి పంపాడు. 


రామశర్మ ఆ వెంట్రుకను భూతానికి ఇచ్చి నిటారుగా చేయమన్నాడు. ఇక అది జీవితకాలం అంతా చేస్తూనే ఉంది. 


రామశర్మ అప్పట్నుంచి అటువంటి మంత్రాల జోలికి వెళ్లకుండా తను చేయాల్సినవే గురువుగారి అనుజ్ఞతో చేస్తూ హాయిగా జీవించాడు.


ఈ సరదా కథ ను చదివి మీ అభిప్రాయాలను తెలియజేయండి.


-సుధావిశ్వం





Comments


bottom of page