'Panigrahanam - 1' New Telugu Web Series
Written By Bhagavathula Bharathi
రచన: భాగవతుల భారతి
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
భాగవతుల భారతి గారి ధారావాహిక పాణిగ్రహణం ప్రారంభం
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
చిన్నచిన్న చినుకులుగా వర్షం మెుదలయింది. బయటికి వచ్చిచూస్తే...
ఇంటిముందు ఎండావానలను తట్టుకోటానికి, నిలువుగా వేలాడేసిన నీలంపట్టా మీది చినుకు జారి, అక్కడే ఉన్న కుండీలోని చిట్టిగులాబీ పువ్వుమీద పడి, చినుకు పడినప్పుడల్లా, పువ్వు అదోలా నవ్వడం, ఓఆటలా అనిపిస్తోంది.
ఓ 'తేటగీతి' పద్యం మదిలో మెదిలింది....
'మధుర భావాల మంజుల రథమునెక్కి
తరుణి మదిలోన యాశల తావులద్ది సాంథ్యకాంతుల హారతి సంతరించ
రార! చెలికాడ మజ్జీవన రమ్యవనికి'
భావుకతతో చూస్తుంటే ఏదైనా పద్యమే, కవితే, ఏదైనా పాటే...
ఈ సయ్యాటను కన్నార్పకుండా చూస్తున్న హంస మంజీరను, "ఏంటి సంగతులూ.. నాతో మాట్లాడటం మానేసి ఎటో చూస్తున్నావ్?"
మాటలు వినబడి వెనుకకు తిరిగి చూసింది హంసమంజీర.
"ఏం లేదే! సన్నని చినుకు గులాబిమీద పడితే దానికదలిక భలే తమాషాగా ఉంది. వలపు ఒడిలోని ప్రేయసీప్రియుల సరాగంలా! "
"కవయిత్రి మెుల్ల... కాదు... కాదు మెల్ల.... "
మెల్లకన్ను పెట్టి పకపకా నవ్వింది సాగరమేఖల.
"ఏం చేస్తున్నావ్? ఉద్యోగాల వేటా?"
"అవునే! ఇప్పటికి నాలుగు ఉద్యోగాలు మానేసా! కొత్తది వెదుకుతున్నా "
"ఎలాఉంటున్నావే! నీ గురించే మా అందరి దిగులు"
"నా గురించి ఎందుకు? నేను చూడు.... ఎంత ఉల్లాసంగా ఉన్నానో.... ఎంత ఉత్సాహం గా ఉన్నానో.... " బద్రిలా ఫోజ్ పెట్టి చెప్పింది సాగరమేఖల.
"అన్నయ్య నిన్న ఫోన్ చేసి మనిద్దరి క్షేమసమాచారాలూ అడిగాడు. "
"నాకూ చేసాడు. పిచ్చిఅన్నయ్య! నేను బాగానే ఉన్నానంటే వినడే! అమ్మకూడా దిగులు పడుతోందిట. అది వదిలేయ్. ఇంకేవైనా విషయాలు చెప్పు. "
"ఈయనగారికి ప్రమోషన్ వచ్చేటట్లు ఉంది"
"ప్రమోషన్ మీద ట్రాన్స్ ఫర్ కూడా అవుతుందా? ముందే చెప్పవే! నేనూ తట్టాబుట్టా సర్దుతా! "
"ట్రాన్స్ ఫర్ ఉండదేమో! అయినా ఇక్కడ బానే ఉందిగా! పరిచయాలూ పెరిగినాయ్! సహయపడేవాళ్ళూ, స్నేహితులూ ఉన్నారుగా! మేం లేకపోతేనేం? " హంసమంజీర అంది.
"ఊరికే అన్నాలేేవే! తెగిన గాలిపటంలాంటిదాన్ని నేనెక్కడుంటే ఏంటీ?" సాగర మేఖల ముఖం వివర్ణమవటం హంసమంజీర చూసి...
"ఛ అవేంమాటలే! నువ్వేదో ధైర్యవంతురాలివీ, ధీరవనితవీ మా అందరికీ స్ఫూర్తి అనుకుంటుంటాం సుగాత్రి నేను. "
"అన్నట్లు సుగాత్రి ఫోన్ చేస్తోందా? ఓ సారి రమ్మనక పోయావా? చూసిచాలా రోజులయింది"
"ఎక్కడా! తనకీ పిల్లల చదువులూ వాళ్ళాయన ఉద్యోగానికి పోతే, ఇల్లు చూసుకోవాలీ!"
"అవునే! ఎవరిబిజీలు వాళ్ళవి... కానీలే! ఇంటర్వ్యూ కి టైం ఐంది... కొత్త జాబ్ తో సరికొత్తగా కలుస్తా"
"అమ్మవాళ్ళకి ఫోన్ చేయి. నువ్వు ఫోనే చేయవని తిడుతోంది"
"సరే! నేను వెళ్ళివస్తానే! మళ్లీ వర్షం పెరిగితే ఆటోలు దొరకటమూ, వెళ్ళటమూ కష్టమే. "
హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని, బయటికి వచ్చి భుజంమీద చేయివేసి చెప్పింది సాగరమేఖల.
"జాగ్రత్తగా పో! " అని సాగరమేఖలను పంపి లోపలికి వచ్చి.... చలిగాలి లోపలికి వస్తుంటే... తలుపులు వేయబోతుండగా...
ఫోన్ మోగింది.
తలుపుసంగతి ఆపేసి... ఫోన్ తీస్తే...
"అక్కా! ఏం చేస్తున్నావ్? " సుగాత్రి అడుగుతోంది.
"ఇది అడగటానికి ఫోన్ చేసావా?"
"వెటకారం కాదు. మంచి కవితల పోటీ ఉంది. నువ్వు మాంచి కవయిత్రివికదా! పోటీకి ప్రయత్నం చేయి... ఇప్పటిదాకా ఏం చేస్తున్నావ్? "
"మళ్ళీఇదో ప్రశ్నా? సాగరమేఖల వస్తే మాట్లాడిపంపా. కథలు, కవితలు రాసే మూడ్ లేదు.”
"ఇంతకీ ఏమంటుంది సాగరమేఖల? ఏమిటోనే! దాన్ని చూస్తే బాధనిపిస్తుంది. దాని సంసారం.... "
"నీ గురించి అడిగింది. నిన్ను రమ్మని పిలువమంది... ఏం ఫరవాలేదు. మనందరికన్నా తనే బాగుంది. నేను బ్రహ్మాండంగా ఉన్నానని చెబుతోంది. నవ్వుతూ గలగలమాట్లాడుతోంది. తనని చూస్తే...
సంసార లంపటంలో మనమే బాగుండలేదేమో! ... అదే చీకూచింతా లేకుండా ప్రశాంతంగా ఉన్నదేమో ననిపిస్తోంది. తెల్లవారితే, అన్నిటికీ వెంపరాలాటేగా, పీకుల్లాటలేగా మనకీ... "
"ఛ... అలాఎందుకనుకోవాలీ? ఒంటరిగా తను ఎన్ని సమస్యలు ఎదుర్కుంటోందో మనకు తెలుసా? "
"ఇక్కడ గాంధీనగర్ లో మాకు కూతవేటు దూరంలోనేగా తనుండేదీ! ? వచ్చిపోతూనే ఉంటుందిగా! 'ఎప్పుడడిగినా నాకేం! బ్రహ్మాండంగా ఉన్నా' అంటుంది. నవ్వుతూనే కనబడుతుంది. మరి.... "
"తను తీసుకున్న నిర్ణయం, తనకే వెక్కరింత అయిందనే విషయాన్ని దాచుకోటానికో, నలుగురిలో నవ్వులపాలు కాకూడదనో... అలా ప్రవర్తిస్తున్నదో తెలీదుగా! "
"అయినా ఎలా సంపాదిస్తోందో! ఖర్చులకు డబ్బులు ఎక్కణ్ణించి సమకూర్చుకుంటోందో మాత్రం చెప్పట్లేదు. పైగా మన ప్రమేయం లేకుండా, తన బ్రతుకు తను బ్రతుకుతోందిలే అనీ, మన దగ్గర ఏడ్చి, మెుత్తుకుని, చెయ్యిచాచని తన ఆత్మవిశ్వాసం చూసి, ఉదాసీనత మనలో.... "
"ముగ్గురు పిల్లల తల్లి.... పిల్లలేమయ్యారో?! "
"తెలీదు... దాని జీవితమే మిస్టరీ"...
"తన జీవితంగురించి ఓ కథ వ్రాయకూడదూ"
"మనకు తెలీని విషయాలు తనజీతంలో ఏమున్నాయో... ఏంవ్రాస్తాం"
"ఓ రచయిత్రి అడిగేప్రశ్నేనా ఇది? యధతథంగా రాయకపోతే ఊహించిరాయ్. మెుత్తానికి రాయి. "
ఫోన్ పెట్టేసి ఆలోచిస్తోంది హంసమంజీర.
'అలల తాకిడికి ఒరిసిన ఒడ్డును,
నురగల తరగల చిరుగాలి వణికిస్తుంటే
వలపుల వరమేదని అడిగిన గోదారిని
చుట్టేసి నిలేసిన సాగరమేఖల'...
కవిత రాస్తూ..... కథకోసం ఆలోచిస్తోంది హంసమంజీర.
అదేసమయంలో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నంలో మనీషా ఎన్ క్లేవ్ లో ఫోన్ మోగింది.
విరూపాక్ష ఫోన్ తీసాడు.
"అవును ఐతే! " అన్నాడు విరూపాక్ష ఫోన్లో.
"పార్టీ ఉంది రా ఎంజాయ్ చేద్దాం రా మామా! "
"నాకు చాలా పనుందిరా ఇప్పుడు ఎక్కడికీ రాలేను"
" పెళ్ళకాక ముందు ఎన్ని కబుర్లు చెప్పావురా?! "
"మా ఆవిడ రెండోసారి ప్రెగ్నెంట్, ఇప్పుడు ఆమెదీ, పిల్లవాడిదీ బాధ్యత అంతా నాదే. పనిమనిషిచేత ఇల్లు తుడిపించటం, అంట్లూ బట్టలూ.... "
"ఇలా తయారయ్యావేరా? పెళ్ళికి ముందు, పెళ్ళాన్ని చెప్పుచేతల్లో ఎలా పెట్టుకోవాలో ఉపన్యాసాలు ఇచ్చావ్
నిన్నూ.... "
"అవునూ! నువ్వేదైనా తిట్టుకో... నీకు తెలుసుగా! ఎంత సంపాదించినా, జీతమెంతైనా మగపిల్లలకు పెళ్ళళ్ళవటం కష్టమైన ఈ రోజుల్లో, పెళ్ళంటే బ్రహ్మపదార్థంలాగా, నాలాంటి బ్రహ్మచారికి అర్ధంకాని యదార్థం లాగా,
అనిపించేది.
కానీ పెళ్ళి, అర్దంకాని బ్రహ్మ పదార్థమేంకాదు. ఆలుమగలు ఒకరికొకరుఅర్ధం చేసుకుని మెలిగే బ్రహ్మాండ పదార్థం.
పెళ్ళి కోసం వెంపర్లాడిన రోజులు గుర్తుంచుకోకుండా, పెళ్ళి తర్వాత ఇల్లూవాకిలి వదిలేసి, గర్భిణియైన భార్యను వదిలేసి, ఇప్పుడు మందుపార్టీకి రాలేను. " నిష్కర్ష గా చెప్పేసాడు విరూపాక్ష.
"మగజాతికే అవమానం తెచ్చావుగదరా! ? "
"నేనే కాదు.. నా కొడుకుకు కూడా చిన్న చిన్న పనులలో ట్రైనింగ్ ఇస్తున్నాను. బుల్లి బుల్లి చేతులతో, నావెనకే తిరుగుతూ, వాడూ, పనిలో చేతులు పెడుతున్నాడు. "
"ఎవరండీ ఫోనులో "అంది విరూపాక్ష భార్య.
"మా ఫ్రెండ్ చారుకేశి మందు పార్టీ ఉంది రమ్మంటున్నాడు"
"రమ్మంటున్నారుగా.. పోనీ వెళ్ళకపోయారా " అంది నీరసంగా.
"ఇదివరకు నేను ఒంటరిగాణ్ణి. ఎలాఉన్నా, ఎలా ప్రవర్తించినా, అదంతా బ్రహ్మచారి లైఫ్. ఇప్పుడూ వైవాహిక జీవితబంధానికే విలువ. నాకు ఫ్యామిలీ తర్వాతే ఎవరైనా. "
"భార్యచాటు భర్త అనీ, కొంగున కట్టేసుకున్నానని, తిట్టుకుంటారండీ " అంది భార్య పక్కమీద ఒత్తిగిలుతూ.
విరూపాక్ష మనసు అటూఇటూ ఊగిసలాడింది.
పెళ్లికాకముందు బాధ్యతలేదు. ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి వెళ్లిపోవడం, బాధ్యతలు లేని జీవితం కళ్ళముందు మెదిలింది. అలాగే మాష్టారు చిన్నప్పుడు చెప్పిన పద్యం కూడా మదిలో మెదిలింది.
'సజ్జన మైత్రియె హృద్యము
సజ్జకు పూపరిమళాల సౌరభమట్లున్
ఒజ్జలు నేర్పిన విద్యయె
ముజ్జగముల యందు సర్వపురుషులు మెచ్చన్! '
"విరూ"... " అమ్మ పిలిచింది.
వెళ్ళి మంచంమీద కూర్చున్నాడు. వణుకుతున్న చేతుల్తో విరూపాక్షను తడిమింది.
"అంతా వింటూనే ఉన్నానురా! సిరిసంపదలు కాదు మనల్ని మనలా ప్రేమించేవారిని పొందే జీవితం చాలు అదే పెద్ద అదృష్టం. అని ప్రతీ ఆడపిల్ల లాగే నేనూ ఎన్నో కలలు కన్నాను.
కానీ, సప్తవ్యసనాల బాటలో మీనాన్న చిక్కుబడి నిన్నూ నన్నూ వదిలి, ఆఫీసులో మరో అమ్మాయితో వెళ్ళిపోయాడు" అని కళ్ళు వత్తుకుంటూ ఆగి,
"నువ్వు పుట్టాక... మీ నాన్నలాగే తయారవుతారవుతావని చాలా భయపడ్డాను. కానీ.... కుటుంబానికే విలివిచ్చే నిను చూస్తే... నా పెంపకానికి ముచ్చటేస్తోంది " అని కొంగుతో కళ్ళు తుడుచుకుంది.
నిండు గర్భిణి అయిన భార్య వంక ఆప్యాయంగా చూసాడు.
చారుకేశి మళ్ళీ ఫోన్ చేసాడు.
"ఏరా నువ్వేకాక నీ కొడుకునూ, చెడగొడుతున్నావా? వంటపనీ ఇంటిపనీ ఆడవాళ్ళ పనులురా! ?ఒక్కసారి వచ్చిపోరా. వెంటనే పంపేస్తాలే " అన్నాడు.
"వద్దురా బాబూ! ఆ వ్యసనాలు నాకొద్దు. వివాహ వ్యవస్థ మీద అవగాహన లేకపోతే అస్తవ్యస్థాల మధ్య దోబూచులాడుతూ, చివరికి విడాకుల మార్గంలో ప్రయాణించాల్సొస్తుంది. ఆడపిల్లలను పుట్టినప్పటినుండి, అత్తగారింట్లో ట్రైనింగ్ ఇవ్వటంలోఉన్న శ్రధ్ద, మగపిల్లలకు ఇవ్వటం లేదు. నేటి సమాజానికి మగపిల్లలను ఎడ్జస్ట్ చేయాలనేదే నాతాపత్రయం. " విరూపాక్ష ఫోన్ పెట్టేసాడు.
తల్లీ భార్య విరూపాక్ష వంక ఆరాధనగా చూసారు.
"నాన్నా! కుక్కర్ విజిల్స్ శబ్దం చేస్తోంది స్టవ్ ఆపనా " అన్నాడు విరూపాక్ష కొడుకు వచ్చిరాని మాటలతో....
స్టవ్ తనే ఆపి వచ్చేసి సోఫాలో కూలబడి
నిస్సారంగా, నిస్సహాయంగా తలవిదిలించాడు.
భార్య వచ్చి, మోకాళ్ళమీద కూర్చుని సోఫాలో విరూపాక్షమీదికి "ఏమయిందండీ " అంటూ కంగారుగా వంగింది.
తల్లి కంగారుగా చూస్తూ "విరూ" అంది.
=============================
సశేషం
పాణిగ్రహణం 2 త్వరలో
=============================
భాగవతుల భారతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Twitter Link
Podcast Link
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం
ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.
ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో
బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
Vijayalaxmi Telikicharla • 5 hours ago
బాగుంది మేడం, కథ, పఠనం చాలా బాగున్నాయి
Chinni Krishna • 7 hours ago
భారతి గారు కథనం ఎంతో బాగుందండీ.. మీరు అభినందనీయులు. సంప్రదాయ విలువలకు ప్రాధాన్యమిచ్చే ఇటువంటి రచనలు ఎంతో అవసరం ద్వితీయ భాగం కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నాం
vani gorthy • 6 days ago
అభినందనలు భారతీ...కథా గమనం ఆసక్తికరంగా ఉంది...రెండవ భాగం కోసం ఎదురుచూస్తూ..వాణిశ్రీనివాస్