'Panigrahanam - 9' New Telugu Web Series
Written By Bhagavathula Bharathi
రచన: భాగవతుల భారతి
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ..
హంసమంజీర ఒక రచయిత్రి, కవయిత్రి. ఆమె చెల్లెలు సుగాత్రి.
హంసమంజీర పెదనాన్న పిల్లలు విరూపాక్ష, సాగర మేఖల.
సాగరమేఖల భర్తతో విడాకులు తీసుకున్న విషయం గుర్తుకొచ్చి బాధ పడతాడు విరూపాక్ష.
గతం గుర్తుకొస్తుందతనికి.
కుటుంబ పోషణ లో భర్తకు చేదోడుగా ఉండటానికి తను కూడా ఉద్యోగంలో చేరుతుంది సాగరమేఖల. అభినందించక పోగా అనుమానిస్తాడు భర్త. అవమాన భారంతో ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది సాగరమేఖల. హాస్పిటల్ లో కోలుకుంటుంది. భర్తను, పిల్లల్ని వదిలి హైదరాబాద్ లో ఉద్యోగం చూసుకొని ఒంటరిగా ఉంటుంది ఆమె.
ఫోన్ రావడంతో గత కాలపు ఆలోచనలనుండి తేరుకుంటాడు విరూపాక్ష. ఫోన్ లో లక్ష్మణ అనే వ్యక్తికి అతని భార్య విడాకుల నోటిస్ పంపినట్లు విని బాధ పడతాడు. 'పాణిగ్రహణం కన్సల్టెన్సీ' పేరుతో ఒక సంస్థను ప్రారంభిస్తాడు విరూపాక్ష.
మిత్రులను, పత్రికా విలేఖరులను ఆహ్వానించి సహకారం కోరుతాడు. భార్యాభర్తల మధ్య ఏర్పడ్డ అభిప్రాయం బేధాలను సామరస్యంగా పరిష్కరించడమే ఈ కన్సల్టెన్సీ ఉద్దేశమని చెబుతాడు.
ముందుగా సాగర మేఖల కాపురం సరిదిద్దాలనుకుంటాడు.
ఆమె భర్తకు కాల్ చేసి సాగర మేఖలకు అతనంటే విముఖత లేదని చెబుతాడు.
మొదట్లో అతను సరిగ్గా బదులివ్వక పోయినా విరూపాక్ష పట్టుదల వల్ల మెత్తబడతాడు.
సాగర మేఖలలో కూడా మార్పు వచ్చి భర్త దగ్గరకు వెళ్తుంది.
సమీర్ కాపురాన్ని కూడా అతని తండ్రి సహకారంతో సరిదిద్దుతాడు.
తరువాత లక్ష్మణ్ సమస్య పైన దృష్టి సారిస్తాడు.
ఇక పాణిగ్రహణం ధారావాహిక తొమ్మిదివ భాగం చదవండి.
"హలో! విరూపాక్ష గారేనా?" ఫోన్ లో ఓ గొంతు బలహీనంగా అడిగింది.
"అవును ! 'పాణిగ్రహణం 'కన్స ల్టెన్సీ'
"మిమ్మల్ని ఓసారి కలవాలి"
"రండి! మా అడ్రసు...."
"మీ అడ్రస్ మాకు తెలుసండీ! కానీ నేను వచ్చే పరిస్థితిలో లేను. దయచేసి వీలుచూసుకుని మీరే రాగలరా!? ఈఊళ్ళోనే.... అడ్రసు... మీ బండి పెట్రోలు ఖర్చు నేను భరిస్తాను. " ఖళ్ళూ ఖళ్ళూ దగ్గుతూ ఫోన్ పెట్టేసాడు ఓ పెద్దాయన.
ఓ రోజు ఖాళీ చూసుకుని చెప్పినచోటికి బయలుదేరాడు విరూపాక్ష.
కానీ తన ఈ పయనం వల్ల, తన ఆలోచనలూ, ప్రణాళికలూ, ఓ కొత్త శుభారంభానికి నాంది పలుకబోతున్నాయని ఆక్షణం లో అతనికి తెలీదు, ఊహించలేకపోయాడు.
రెండుగదుల డాబాయిల్లు. వంటిల్లు ఇంటికి వెనుకభాగంలో సపరేట్ గా ఉంది. మధ్య గదిలో ఓ పెద్దాయన పడుకుని ఉన్నాడు. చిన్నగా దగ్గుతున్నాడు.
వెళ్ళి మంచందగ్గర నుంచున్న విరూపాక్ష ను తేరిపార చూసి, లేచికూర్చుని, కుర్చీ తీసుకురావటానికి ప్రయత్నించాడు. గమనించిన విరూపాక్ష తనే కుర్చీ తెచ్చుకుని వేసుకుని కూర్చుని, "మీరేనా?ఫోన్ చేసిందీ " అన్నాడు.
"అవునండీ! పేపర్లో ప్రకటన చూసి, మీరు నాకేమన్నా సహాయం చేయగలరేమో ననే చిన్న ఆశ తో ఫోన్ చేసాను. మన్నించాలి. "
"అయ్యో! పెద్దవారు! అలా అనకూడదు. విషయం చెప్పండి!"
"వైదేహీ! " అని పిలిచాడు. వంటగదిలోంచి ఓ మెరుపుతీగ... దేవతాస్త్రీ...అమృతభాండం తెచ్చినట్లు, కాఫీ గ్లాస్ తో వచ్చింది.
ఆ అమ్మాయి అందానికి... కళ్ళు తిప్పుకోలేక సభ్యత కాదని ముఖం క్షణకాలం చూసి, కాఫీ తాగటంలో నిమగ్నమయ్యాడు. ఆమె వంటింట్లోకి వెళ్ళిపోయింది.
"మా అమ్మాయి వైదేహి....చందమామ లో మచ్చలా....మా అమ్మాయికి లోపం ఉంది. ఆ కథ చెప్పి, పరిష్కారం అడగటానికి పిలిచాను."
"నేను చేయగలిగనదైతే తప్పకుండా చేస్తా !"
"మాది తెలంగాణా లోని, రామచంద్రాపురం. మా ఆవిడది పక్కనే ఉన్న ‘వి. యం బంజర్’. రెండూ పల్లెటూళ్ళే. నేను ఓ మామూలు స్కూల్ టీచర్ ని. ఇద్దరు ఆడపిల్లల తండ్రిని. నా భార్య సహకారంతో ఇంటిని ఎలాగోలా లాక్కువచ్చా.
ఆడపిల్లలిద్దరూ చక్కగా చదివారు. ఉద్యోగాలూ వచ్చినాయ్.
పెద్దపిల్లకి పెళ్ళి చేసా. బెంగుళూరు లో చక్కగా సెటిలయ్యీరు. కానీ కాస్తలో జీవితం తిరగబడింది.
రెండో పిల్ల ఇదిగో ఈ వైదేహి… చక్కని సంబంధంతో పెళ్ళి చేసాం. కానీ.... "
"విడాకులా ?"
"కాదు... చిత్రమైన కథమాది. పెళ్ళయిన సంవత్సరం, పిల్ల కడుపుతో ఉన్నదని, వాళ్ళమ్మమ్మ, చలిమిడి పెట్టాలి రమ్మంది. పిల్లను 'వి. యమ్ బంజర్' కి తీసుకుని వెళ్ళాం. గోరింటాకు కోసుకుందామని రెండిళ్ళ అవతలికి వెళ్ళింది. పల్లెటూరుగా... ఎక్కడినుండో నల్లత్రాచు వచ్చి వైదేహి కాలిమీద కాటేసింది. "
"అయ్యో! "
"అవును! నురగలు కక్కుతూ పడిపోయింది. చచ్చిపోతుందని భయపడ్డాము. ఏదో పసరుమందు పోయించి, హైదరాబాదు తీసుకుపోయాం. కానీ విషం ఒళ్ళంతా పాకేసింది. కడుపులో పిల్లకూ విషం ఎక్కేసిందేమో! ఈ హడావిడికి అబార్షన్ అయింది."
"శివశివా! ఎంతకష్టం వచ్చిందీ! ప్చ్ "...
"మా ఖర్మ అక్కడితో ఆగలా! వైదేహికి నెలసరులు అంటే పీరియడ్స్ ఆగిపోయినాయి. డాక్టర్.... ‘హార్మోన్స్ డిజార్డర్ వచ్చింది. ఇక మెనోపాజ్ వచ్చేసింది. పిల్లలు పుట్టరు'
అని చెప్పేసింది. మేం కుప్పకూలి పోయాం."
ఇది విని వైదేహి మెుగుడు పిల్లలు పుట్టనిఈమె నాకెందుకు? అని విడాకులు తీసుకుని ఇంకోపెళ్ళి చేసేసుకున్నాడు. వైదేహి మానసికంగా, శారీరకంగా మామూలు స్థితికి రావటానికి, మేమెంత శ్రమపడ్డామో మాటల్లో చెప్పలేం."
ఆ సమయంలో విరూపాక్ష కు అక్క, అక్కకోసం తాను పడిన శ్రమ గుర్తుకువచ్చింది.
"అయ్యయ్యో! ప్రపంచంలో ఇలాంటి కష్టాలూ ఉంటాయా ?" అన్నాడు.
"మా కష్టాలు ఇక్కడితో ఆగలా! పిల్ల ఎలాగోలా ఉద్యోగం చేసుకుని బ్రతుకుతుందిలే అని హైదరాబాదు వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చిన ఆరునెలలకే కరోనా మెుదలయింది. లాక్ డౌన్.. ఇంట్లోనే సగం జీతంతో... ఆన్ లైన్ జాబ్. సరే.. నా పెన్షన్ వస్తుందనుకోండి.."
"పోనీలెండి.....గుడ్డిలోమెల్ల"
"అప్పుడే ఏమయిందీ? ఇంకాఉంది. కరోనా సోకి వీళ్ళమ్మని గవర్నమెంట్ వెహికల్ లో.... గాంధీ కి తరలించారు. మూడోరోజే పోయింది. శవాన్ని కూడా ఇవ్వలేదు. "
చెబుతూ ముసలాయన కళ్ళుతుడుచుకున్నాడు.
లోపల్నించి వైదేహి ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నట్లు వినబడి.
విరూపాక్ష మనసు అతలాకుతలం అయింది.
"ఇప్పుడు నేను చేయాల్సిన సాయం చెప్పనేలేదూ !"
"అక్కడికే వస్తున్నా! చుట్టాలు పక్కాలనూ కాదని, మిమ్మల్ని పిలిపించాను బాబూ. మీరెంతో బాధ్యత గా అందరి సమస్యలూ పరిష్కారిస్తున్నారని వినీ.... "
"చెప్పండి !నేను చేయగలిగినదంతా శక్తివంచన లేకుండా చేస్తాను. "
"కరోనా తగ్గాక వైదేహి ఓ కంపెనీలో ఉద్యోగం లో చేరింది. అక్కడ తనతో పనిచేసే ఓ అతను... వైదేహిని ఇష్టపడుతున్నాడుట.
అతను ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటీ? కొంచెం సమాచారం సేకరించి పెట్టాలి"
"ఎందుకు సేకరించాలి ?"
"అతను వైదేహిని పెళ్ళి చేసుకుంటానని, ఎవరితోనో అనీ అనకుండా.... అన్నాడట....నాలుగు రోజుల క్రితం. వాళ్ళు కూడా చూచాయగానే నాతో అన్నారు. రేపు అతనే నన్ను గాని, వైదేహిని గానీ, అడిగితే ఏం చెప్పాలీ?
నాకూ వయసైపోతోంది. రేపోమాపో నేను పోతే... పిల్ల దిక్కులేనిదై పోతుందనే దిగులుతో కుమిలిపోతున్న, నాకు ఇదేదో శుభవార్తలా ఉన్నప్పటికీ... నా పిల్లలో ఉన్న లోపం అతనికి ఎలాచెప్పాలి? అసలు చెప్పాలా? స్వార్ధంతో నిజం దాచి పెళ్ళి చేసి, తప్పుచేసి, అతనిముందు దోషిగా నిలబడాలా? సతమతం ఐపోతున్నాను. దీన్ని మీరు పరిష్కరిస్తారని...పిలిచా!.... చుట్టాలూ పక్కాలూ ఆదుకుంటారనే నమ్మకం లేదు..."
"అమ్మా వైదేహీ! "అని పిలిచాడు విరూపాక్ష.
వచ్చింది వైదేహి.
"నేను నీ అన్నయ్యననుకో! భయపడకు. అతను ఎవరు? వివరాలన్నీ నాకివ్వు. ఓ వేళ అతను నిన్ను నిజంగానే ఇష్టపడితే... నీకూ ఇష్టమేనా? " అడిగాడు.
వైదేహి మౌనం అర్దాంగీకారంగా భావించి, "బాబాయ్! దేవుడు ఓ తలపు మూసేస్తే ఇంకో తలుపు తెరుస్తాడనీ, ఓ లోటుని, ఇంకో దానితో పూడుస్తాడనీ, వినలేదా?
‘పూర్ణ మద:పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవా వశిష్యతే!’
"సృష్టి లో ఏదీ ఖాళీగా లేదు. పూర్ణమే. పూర్ణం లోంచి పూర్ణం తీసేసినా పూర్ణమే ఉంటుంది.పూర్ణంతో, పూరింపబడుతూనే ఉంటుంది.
మీరు నిశ్చింతగా ఉండండి. ఒకవేళ ఈమెలో లోపం అతను అంగీకరించకపోతే అంతకన్నా గొప్ప సంబంధం తెచ్చి, చెల్లిపెళ్ళి నేనుచేస్తా. "
'జీవితంలో అన్నీ కోల్పోయినా, ఒకటిమాత్రం మిగిలే ఉంటుంది. అదే...భవిష్యత్తు' నాకు అప్పజెప్పారుగా. ఇక నిశ్చింతగా నిద్రపోండి. ఆలోచించకండి...నేను శుభవార్త తో తిరిగివస్తానమ్మా! వస్తాబాబాయ్! "
//////////////'
"మీరు?"
"నా పేరు విరూపాక్ష...పాణిగ్రహణం కన్స ల్టెన్సీ "
"విన్నాను...నాతో పనేమిటో? "
"డైరక్ట్ గా పాయింటు కి వస్తున్నాను. వైదేహిని ఇష్టపడుతున్నారుట. ఆమెకు అన్నగా వచ్చాను. "
"ఓహ్! హలో! నా పేరు అనిరుద్ధ్.... నిజమేనండీ! ఆమెకూడా ఇష్టపడితే!.... " షేక్ హాండ్ ఇచ్చి చెప్పాడతను.
"కానీ ఆమెలో ఓ లోపముంది. బాబాయ్ మీతో చెప్పలేకపోతున్నారు "
"తెలుసు"
"తెలుసా ? తెలిసే ఇదంతా " ఆశ్చర్యపోయాడు విరూపాక్ష.
"నాజీవితంలోనూ ఓ లోటుంది. అది వైదేహికి ఎలా చెప్పాలా? అనీ.... చెబితే… ఎలా రియాక్ట్ అవుతుందోననీ.... "
"ఏమిటదీ?"
"నాకూ కొన్నేళ్ళ క్రితమే పెళ్ళయింది. ఓ బాబుకూడా ఉన్నాడు. నా భార్యకి, కాన్సర్ వచ్చింది. చాలా డబ్బులు ఖర్చు పెట్టి, వైద్యం చేయించినా బ్రతికించుకోలేకపోయాను. అప్పటికి బాబుకి ఏడాదే!”
"అవునా! అయ్యో! చాలా విషాదం జరిగిందే"
"ఏం చేస్తాం! మళ్ళీ పెళ్ళి చేసుకోమని మా వాళ్ళంతా పట్టుపట్టారు. మీకుతెలుసు.. వచ్చినావిడ నాకు భార్య అవుతుంది. నా బిడ్డకు తల్లిఅవదుగా!.... పైగా
వచ్చినామెకూ... ఎన్నో కలలూ, ఆశలూ ఉంటాయిగా! ఇప్పుడు బాబుకి నాలుగు సంవత్సరాలు...ఊహ తెలుస్తోంది. వచ్చీరాని మాటలతో అమ్మ అమ్మ...అంటున్నాడు. ఎక్కడతేనూ!?
ఇన్నాల్టికి, వైదేహి కనబడింది వాకబు చేస్తే తన కథ తెలిసింది. కానీ నేను... అడిగితే...పిల్లవాడికోసం.... స్వార్ధంతో అడిగాననీ… తన నిస్సహాయతను, నేను ఆసరాగా చేసుకుని, తనను కించపరచానని... అనుకుంటుందేమో! "
"వైదేహిని ఇష్టపడి... చక్కని ఆలోచన చేసారు.మీరు. నాకు వదిలేయండి. ఇక నేను చూసుకుంటా! శుభవార్తతో వస్తా! "
తిరిగివచ్చాడు, స్వీట్ బాక్స్ తో...
"బాబాయ్ గారూ! ఇదీసంగతి! అతని కొడుకుకు, వైదేహి తల్లికాగలిగితే, వైదేహికి అతను మంచి భర్త కాగలడు. అమ్మా వైదేహీ! ఇదిగో! స్వీట్ పాకెట్. విషయమంతా విన్నావుగా! అతను మంచి సంపాదన పరుడు. ఆస్థిపరుడు. కాకపోతే… నువ్వు మంచితల్లివి కాగలను అంటే.. ఇదిగో! ఇందులోంచి స్వీట్స్ తీసి, నాకూ మీ నాన్నకు తీసి ఇవ్వు. లేదంటే...
నీ యిష్టం.... "
వైదేహి వెంటనే స్వీట్స్ తీసి ఇద్దరికీ ఇచ్చి, తనూ తీసుకుంది.
"విరూపాక్షా! నీ రుణం తీర్చుకోలేనిది. నా పిల్ల బ్రతుకు ఏమైపోతుందోననీ...పగలూరాత్రీ ఎంత వేదనపడ్డానో! గుండెలమీది బరువు దింపేసావు.... నువ్వు దేవుడివి!... "
అని ఉద్వేగంతో కన్నీళ్ళు కార్చాడు.
"ఈ వేదేహి పరిణయం వలన నామనసులో కొత్త ప్రణాళిక రూపుదిద్దుకుంది. అందుకు మీకు నేనే ధన్యవాదాలు చెప్పుకోవాలీ... ఈ శుభవార్త అతనికీ చెప్పాలి. అన్న స్థానంలో నిలబడి ఈ పెళ్ళి నేనే జరిపిస్తాను " అంటూ విరూపాక్ష వెళ్ళిన వైపే చూస్తూ... చేతులు జోడించారు... తండ్రీ కూతుళ్ళు.
చాలా కొద్దిమంది ఆహూతులతో.. వైదేహీ అనిరుధ్ద్ ల కల్యాణం సలక్షణంగా జరిగింది.
////////////////
లక్ష్మణ భార్య సునీల ఎటు పోయినట్లూ ఏమయినట్లూ లక్ష్మణ ఇచ్చిన ఫోన్ నెంబర్ సునీలది పలకట్లేదు. ఆమెతో పరిచయం ఉన్న అందరికీ....ఫోన్ చేసాడు. కొన్ని వివరాలు తెలిసాయి. వాటిసాయంతో....
=======================================
(సశేషం)
=======================================
భాగవతుల భారతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Twitter Link
Podcast Link
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం
ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.
ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో
బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
Srivasthava Kattem • 16 hours ago
Chala chala Bagundhi Andi
challa ch • 7 hours ago
కథ కథనం రెండు బాగున్నాయివర్ధమాన రచయిత్రి భారతి గారికి హృదయపూర్వక అభినందనలు