#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #పనికి గౌరవం, #PanikiGowravam, #NoPainsNoGains, #కష్టే ఫలి
'Paniki Gowravam' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 23/10/2024
'పనికి గౌరవం' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
కాంతం పది ఇళ్ళల్లో ఇంటి పని చేసి, డబ్బులు సంపాదించేది. ఆమెకి చాలా మంచి పేరు ఉంది. పని మాత్రం శుభ్రంగా, పద్ధతిగా చేసేది. అందుకే, ఆమెనే అందరూ పనిలో పెట్టుకోవా లనుకునేవారు. కానీ, పది ఇళ్ళకి మించి ఒప్పుకునేది కాదు.. ఎందుకంటే, 'పని శుభ్రంగా చెయ్యాలి కదా..' అని అనేది కాంతం.
కాంతం.. కూతురు రాధతో ఒక గుడిసెలో ఉండేది. భర్త కాశీ చాలా సంవత్సరాల కిందటే చనిపోయాడు. కూతురంటే, ఇష్టమున్న కాశీ, కూతురిని ఏమీ అనకుండా జాగ్రత్తగా చూసుకోమని చనిపోయేముందు మాట తీసుకున్నాడు. రాధ పెద్దగా చదువుకోకపోయినా, కపట తెలివితేటలు బాగా ఉన్నాయి. అమ్మ పని చేసి సంపాదించి తెస్తే, మాట వినకుండా అల్లరిగా తిరిగేది. తల్లి ఎంత చెప్పినా చదువుకోలేదు..అలాగని పనిలోకి రమ్మన్నా తనతో రాదు. ఇక చెప్పలేక, తానే తెలుసుకుంటుందని చెప్పి వదిలేసింది కాంతం.
కొన్ని సంవత్సరాలు గడిచాయి. పెరుగుతున్న వయసుతో..ఒంట్లో ఓపిక తగ్గింది కాంతానికి. ఎక్కువ పని చెయ్యడానికి శరీరం సహకరించలేదు. కూతురు రాధ చేసే ఖర్చులకి, సంపాదన సరిపోయేది కాదు. ఒకసారి, రాధను పిలిచి...
"రాధా..! నాకు ఒంట్లో ఓపిక తగ్గింది. నువ్వు చదువుకుని ఉండి ఉంటే, ఈపాటికి ఏదో ఉద్యోగం చేసి, మనం బాగుండేవాళ్ళం. ఇప్పుడు నేను పనిలోకి వెళ్ళలేను. రేపటినుంచి నువ్వు నేను పని చేసే ఇళ్ళకి పనికి వెళ్ళాలి. నా కూతురివి అంటే, నాలాగా నిన్ను కూడా చూస్తారు. నాకున్న మంచి పేరు నువ్వు నిలబెట్టాలి.."
"అలాగే లే అమ్మ.." అంది రాధ.
మర్నాడు రాధ వాళ్ళమ్మ పని చేసే పది ఇళ్ళకి పనికి వెళ్లడం మొదలు పెట్టింది. కొన్ని రోజులకి ఇంకో పది ఇళ్ళు ఒప్పుకుంది రాధ..
నెల గడిచిన తర్వాత...రాధ జీతం డబ్బులు తెచ్చి, అమ్మ చేతికి ఇచ్చింది..
"చూసావా అమ్మా..! నీకంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను.."
"నువ్వు నేను పని చేసే సమయానికంటే తక్కువ సమయమే పనిచేస్తున్నావు కదా.. ఇంత ఎలా సంపాదిస్తున్నావు..?" ఆశ్చర్యంగా అడిగింది కాంతం.
"నువ్వు పది ఇళ్ళల్లో పని చేస్తే, నేను ఇరవై ఇళ్ళల్లో చేస్తున్నాను. అదే నా తెలివి" అంది గొప్పగా రాధ.
కాంతానికి అనుమానం వచ్చినా..చిన్న పిల్ల కదా..ఫాస్ట్ గా పనిచేస్తుందేమోనని ఊరుకుంది.. మనసులో రాధను మెచ్చుకుంది కుడా..
కొన్ని నెలలు గడచినా తర్వాత, ఒక రోజు, కాంతం బయటకు వెళ్ళినప్పుడు, అక్కడ దేవీ మేడం కనిపించింది. దేవి మేడం ఇంట్లో కాంతం పని చేసేది. కాంతం పనంటే, ఆమె చాలా ఇష్టపడుతుంది. ఇప్పుడు రాధ ఆమె ఇంట్లో పనిచేస్తోంది..
"కాంతం.. ఎలా ఉన్నావు..? " అడిగింది ప్రేమగా దేవీ మేడం.
"మీరా మేడం..! ఇప్పుడు కొంచం పర్వాలేదు..ఇంతకీ మా అమ్మాయి ఎలా పని చేస్తుంది..?"
"కొత్తలో బాగానే వచ్చేది..కానీ ఈ మధ్య ఏమిటో నీకు వొంట్లో బాగోలేదనో, తనకి బాగోలేదనో నెలలో చాలా రోజులు పనికి రావట్లేదు.." అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది.
ఇంటికి వచ్చిన రాధను వాళ్ళమ్మ ఈ విషయమై గట్టిగా అడిగింది. దానికి రాధ తాను చేస్తున్న తెలివైన పని గురించి చెప్పింది. ఇరవై ఇళ్ళలో పనికి ఒప్పుకుని, రోజుకు పదిమంది ఇళ్ళలో మాత్రమే పని చేస్తుంది. మిగిలిని ఇళ్ళకి ఏదో సాకు చెప్పి వెళ్ళదు. మర్నాడు ఆ మిగిలిన పది ఇళ్ళకి పనికి వెళ్తుంది. ఇలా మొత్తానికి మేనేజ్ చేసి అందరి దగ్గర జీతం తీసేసుకుంటుంది.
"ఇది చాలా తప్పు రాధా..! నా మీద నమ్మకం తో నిన్ను పనిలో ఒప్పుకున్నారు. అందుకే నిన్ను ఏమీ అనట్లేదు. కానీ ఏదో రోజు విషయం తెలిస్తే, మొదటికే మోసం వస్తుంది. మంచిగా ఉంటే..చేసే పనికి గౌరవం, గుర్తింపు, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇకనైనా మారు.." అని గట్టిగా చెప్పింది కాంతం.
అమ్మ మాటలు వినకుండా..ఎప్పుడూ చేసినట్టుగానే పని చేసేది రాధ. ఒక రోజు కాలనీ లో వాళ్ళందరూ..కలిసి మీటింగ్ పెట్టుకుని విషయం తెలుసుకుని.. రాధను పని మానిపించేసారు.. అంతే కాకుండా.. ఎక్కడా పని దొరక్కుండా చేసారు. ఆమెను ఎవరూ పనిలోకి తీసుకోలేదు.
తప్పక, మళ్ళీ కాంతం అందరినీ బతిమాలి..తానే పనిలోకి ఓపిక చేసుకుని వస్తానని చెప్పింది. విషయం తెలిసిన అందరూ, జీతం పెంచి కాంతాన్ని పనిలోకి మళ్ళీ తీసుకున్నారు. అమ్మ పని చూసి.. ఆమెకు, ఆమె పనికి అందరూ ఇచ్చే విలువ చూసి..తాను ఎంత తప్పు చేసిందో తెలుసుకుంది రాధ.
********
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
コメント