top of page

పంజరంలో పారిజాతం

#పంజరంలోపారిజాతం, #PanjaramloParijatham, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguStory, #తెలుగుకథ


'Panjaramlo Parijatham' - New Telugu Story Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 19/10/2024

'పంజరంలో పారిజాతం' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


"ఏయ్! పారూ!" మంతనాల మంగమ్మగారి గావుకేక హాల్లోనుంచి....

పారిజాతం ఆ ఇంటి పనిపిల్ల.


మంతనాల మంగమ్మగారి భర్తగారు వడ్డీ వ్యాపారి వడ్డికాసుల వీరభద్రయ్య.

వీరభద్రయ్యను వివాహం చేసుకొన్నందున మంతనాల అనే ఇంటిపేరు మంగమ్మకు, వడ్డికాసుల మంగమ్మగా మారిపోయింది.


వీరభద్రయ్యే కాకుండా, భర్తకు తెలీకుండా మంగమ్మ కూడా బంగారం, ఇత్తడి, రాగి వస్తువులను కుదువ పెట్టుకొని ఆ వాడ ఆడవారికి, వారి అవసరాలకు ఒకనెల వడ్డీను పట్టుకొని వారు పెట్టె కుదవ వస్తువులకు తానుగా ఒక ధర నిర్ణయించి (నూరు రూపాయల వస్తువుకు వారి తీర్మానించే ధర యాభైరూపాయలు) వడ్డీ రేటు నెలకు నూటికి ఐదు రూపాయలుగా మంగమ్మ వడ్డీ వ్యాపారాన్ని సాగిస్తూ వుంది. పారిజాతం తండ్రి రామకోటి, అంజమ్మలు చాలా పేదవారు. 

రామకోటి కూలిపనులు చేసుకొంటూ, అంజమ్మ నాలుగైదు ఇళ్ళల్లో పనిమనిషిగా వుంటూ, వారు... వారి ఇద్దరు కూతుళ్ళు వనజాక్షి, పారిజాతాలను పోషిస్తూ, కలో గంజో తాగుతూ కాలాన్ని గడుపుతున్నారు.


రామకోటి అక్క సుందరమ్మ. కొడుకు గోపాలం. వరసకు మామైనందుకు అప్పుడప్పుడూ అక్క అంజమ్మ ఇంటికి వస్తూ పోతూ వుండేవారు. కాలగమనంలో వనజాక్షి శరీరంలో కలిగిన మార్పులు, ఒంపుసొంపులు, ముఖ్యంగా ఆమె గోపాలానికి అక్క కూతురు అయినందున వనజాక్షిని పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నాడు. అతను సబ్ రిజిష్టార్ ఆఫీసులో అటెండర్, గవర్నమెంటు ఉద్యోగం. తన నిర్ణయాన్ని గోపాలం సుందరమ్మకు, తన తల్లికి తెలియజేశాడు. సుందరమ్మ తమ్ముడి ఇంటికి వచ్చి, తన కొడుకు నిర్ణయాన్ని రామకోటికి మరదలు అంజమ్మకు తెలియజేసింది. రామకోటి అంజమ్మలు ఆలోచించుకొన్నారు. వనజాక్షిని.... అడిగారు. ఆమె సిగ్గుతో తలదించుకొని నవ్వుతూ ప్రక్కకు వెళ్ళిపోయింది.


పెద్దలు ముగ్గురూ కలసి మాట్లాడుకొని వనజాక్షికి గోపాలానికి వివాహం చేయ నిశ్చయించు కొన్నారు. వివాహాన్ని రామాలయంలో క్లుప్తంగా ముగించాలని తీర్మానించుకొన్నారు. కట్న కానుకలు ఏమీ గోపాలానికి ఇవ్వవలసిన నిర్భంధం లేకపోయినా, పెండ్లి ఖర్చులకు పది పదిహేను వేలు కనీసం అవసరమని లెక్కలు వేసుకొన్నారు రామకోటి అంజమ్మలు. చిన్న పూరిగుడిశ తప్ప వారికి ఆస్థిపాస్థులు ఏమీలేవు. రెక్కలు ఆడితే, డొక్కలు ఆడే జీవితాలు వారివి.

డబ్బును గురించి ఆ భార్యా భర్తలు ఆలోచించుకొని, పదిహేను వేలు వీరభద్రయ్య దగ్గర అప్పుగా తీసుకోవాలని నిర్ణయించుకొన్నారు.


రామకోటి భార్య సలహా ప్రకారం వీరభద్రయ్యను పదిహేను వేలు అప్పుగా అడిగాడు. అతను అడిగినప్పుడు వీరభద్రయ్య ప్రక్కన వారి సతీమణి మంగమ్మగారు వున్నారు. రామకోటి మాటలను విన్నారు.


వేగంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది మంగమ్మ. హెచ్చు స్థాయిలో వీరభద్రయ్యను పిలిచింది. వీరభద్రుడు ఇంట్లోకి పరుగెత్తాడు. 


"ఏం వాడికి పదిహేను వేలు ఇస్తావా!" అడిగింది మంగమ్మ.


"పాపం ఆడబిడ్డ వివాహానికి అడుగుతున్నాడు. నోటు వ్రాయించుకొని ఇస్తానే" అనునయంగా జవాబు చెప్పాడు వీరభద్రయ్య.


"అంతేకాదు. ఇంటిపనులు నేను చేసుకోలేక సతమత మౌతున్నా. వాడి రెండవ కూతురు పారిజాతాన్ని మన ఇంట్లో పనిచేసేదానికి పంపించమను. కూడు గుడ్డా అన్ని మనమే చూచుకొంటాం. ఇరవై నాలుగు గంటలు మన ఇంట్లోనే వుండాలి. ఇంటిపని, వంటపని అన్నీ చేయాలి. మన డబ్బు ఆ రామకోటి తిరిగి ఇచ్చిన నాడు మనం ఆ పిల్లను వదిలేద్దాం. సరేనా! ఇలాగే చెప్పు. సరే అన్నాడా పత్రంలో సంతకమో, వేలిముద్రో తీసుకొని, పెండ్లి అయిపోయిన మరుదినం నుంచి ఆ పారిజాతం మన ఇంటికి పనికి రావాలని చెప్పు. రామకోటి సరే అంటే డబ్బు ఇవ్వు. కాదన్నాడా, డబ్బును ఇవ్వనని ఖచ్చితంగా చెప్పు. సరేనా!" ఆజ్ఞాపించింది మహారాణిలా మంగమ్మ.


మరబొమ్మలా తలాడించి, వీరభద్రయ్య వరండాలో వున్న రామకోటిని సమీపించి, తన భార్య తనకు చెప్పిన మాటలను రామకోటికి చెప్పాడు.


కొన్ని నిముషాలు తలదించుకొని ఆలోచనా సాగరంలో మునిగిపోయాడు రామకోటి. అతని కళ్ళల్లో ఆశ్రువులు.


పంకజాన్ని పనికి పంపనంటే వీరభద్రయ్య డబ్బును ఇవ్వడు. వనజాక్షి వివాహం గోపాలంతో జరుగదు. అలాంటి సంబంధాన్ని నేను నా జీవితకాలంలో తేలేను. గోపాలాన్ని కాదనుకొంటే నేను మరో సంబంధాన్ని వెదికి వనజాక్షికి నా జీవిత కాలంలో వివాహం చేయగలనా!.... ఇప్పుడు ఆమె వయస్సు ఇరవై, పంకజం వయస్సు పదహారు.


 మరో రెండు మూడు సంవత్సరాల్లో పంకజానికి పెండ్లి చేయాలి. ఇప్పుడు వనజాక్షి పెండ్లి జరగకపోతే, నా ఇద్దరు ఆడబిడ్డలకు నేను నా జీవితకాలంలో వివాహాలను జరిపించగలనా?... అసంభవం!... కనుక వీరభద్రయ్య మాటలకు అంగీకరించి, పారిజాతాన్ని వారి ఇంటికి పనికి పంపిస్తానని చెప్పి, పదిహేను వేలు వారి వద్దనుండి తీసుకొని వనజాక్షి వివాహం జరిపించడం అన్ని విధాలా మేలు’ అనుకొన్నాడు రామకోటి.


"రామకోటీ!... నీ జవాబేమిటి?" గద్ధించినట్లు అడిగాడు వీరభద్రయ్య.


ఉలిక్కిపడ్డాడు రామకోటి. పైపంచతో కన్నీటిని తుడుచుకొంటూ....

"అయ్యా!.... మీ మాటే నా మాట" విరక్తితో కూడిన నవ్వు నవ్వాడు రామకోటి.


వీరభద్రయ్య ప్రామిసరి నోటు వ్రాసి, రామకోటి చేతి వేలిముద్రను వేయించుకొన్నాడు.

ఇంటిలోనికి వెళ్ళి, అర్థాంగి బీరువా తెరిచి లెక్కపెట్టి అందించిన పదిహేను వేలను తీసుకొని, తాను ఒకసారి మరలా లెక్కించి వరండాలోనికి వచ్చి ఆ డబ్బులో ఒక నెల వడ్డీని తగ్గించి మిగతా డబ్బును రామకోటి చేతికి అందించాడు.


"చూడు రామకోటి! నీ పిల్లకు మేము, మూడుపూట్లా అన్నం పెట్టి సంవత్సరానికి మూడు జతల గుడ్డలు, నెలకు జీతం వెయ్యి రూపాయలు. నెలకు నూటికి వడ్డీరేటు ఐదు రూపాయలు. అంటే పదిహేను వేలకు నెలకు వడ్డీ ఏడువందల యాభై రూపాయలు నీ కూతురికి నెలకు జీతం వెయ్యిలో నెల వడ్డీ 750/- రూపాయలు పోను 250/- నెలకు ఇస్తాను. పిల్ల మా ఇంట్లో పనిచేసిన కాలంలో నీవు వడ్డీ కట్టనవసరం లేదు. అది ఆమెకు మేము ఇవ్వాల్సిన జీతంతో చెల్లు అయిపోతుంది. సరేనా!. పదిహేను వేలల్లో ఒకనెల వడ్డీ ఏడు వందల యాభై నేను తగ్గించి, నీకు పద్నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు ఇచ్చినా. లెక్క చూచుకో. సంతోషంగా ఇంటికి వెళ్ళు. పెద్దపిల్ల పెండ్లి అయిన మరుసటి రోజునుండే మీ పంకజాన్ని మా యింటికి పనికి పంపాలె. మరిచిపోకు" వ్యంగ్యంగా నవ్వుతూ చెప్పాడు వీరభద్రయ్య.


డబ్బును పై పంచలో చుట్టుకొని చంకలో పెట్టుకొని వీరభద్రయ్యకు నమస్కరించి 

తన ఇంటివైపుకు బయలుదేరాడు రామకోటి.


రామాయలంలో వనజాక్షి వివాహం గోపాలంతో జరిపించారు. రామకోటి, అంజమ్మలు ఆ మరుదినం మాట ప్రకారం పారిజాతాన్ని వీరభద్రయ్య ఇంటికి పంపారు.

*

ఆ మహోన్నత దంపతులకు ఒక కుమార్తె పేరు నీలవేణి. ఆమెకు తల్లి గారాబం, అంతా ఇంతా కాదు పదమూడు సంవత్సరాలకు ఐదవక్లాస్ పూర్తి అయింది. పెద్ద మనిషి అయింది. హైస్కూల్లో చేరింది. మోడ్రన్ డ్రస్. చేతిలో సెల్లు. స్కూలు నుండి గంటకొకసారి తల్లితో ప్రసంగం. మహాతల్లి వినోద యాత్రకు వెళ్ళినట్లు స్కూలుకు వెళ్ళేది. ఇక ఇంట్లో వున్నప్పుడు పారిజాతాన్ని చాలా నీచంగా చూస్తూ ఒసే... తుసే అని పిలిస్తూ కాళ్ళు పిసకమంటూ ఎప్పుడూ తిడుతూ చాలా అహంకారంగా ప్రవర్తించేది. పాపం. నిస్సహాయురాలైన పారిజాతం, వారికి దూరంగా కూర్చుని తన దుస్థితిని, నీలవేణి మాటలను తలచుకొని భోరున ఏడ్చుకొనేది.


స్కూలుకు వీరభద్రయ్య ఇంటికి ఒకటిన్నర కిలోమీటరు దూరం. ఎండలో కూతురు ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళితే నల్లబడి పోతుందని మంగమ్మ ఒంటిగంటకల్లా పారిజాతంతో కూతురికి ఇష్టమైనవి వండించి భోజనాన్ని క్యారియర్‍లో స్కూలుకు పంపేది పారిజాతం ద్వారా మంగమ్మ.


ఒకనాడు నీలవేణికి భోజనం అందించి ఖాళీ క్యారియర్‍తో ఇంటికి వెళుతున్న పారిజాతాన్ని హెడ్ మిసెస్ కోమలి చూచింది. పారిజాతాన్ని దగ్గరకు పిలిచింది కోమలి. చెమట కారుతున్న ముఖంతో పారిజాతం కోమలిని సమీపించింది.


"ఎవరు నీవు?" అంది కోమలి.


"నీలవేణి అమ్మగారి ఇంటి పనిమనిషిని అమ్మగోరూ!" భయంతో మెల్లగా చెప్పింది పారిజాతం.

కోమలి పారిజాతాన్ని తన గదికి తీసుకొని వెళ్ళింది. కుర్చీలో కూర్చొన బెట్టింది. తన టవల్‍ను ఇచ్చి ముఖాన్ని తుడుచుకోమంది కోమలి. పంకజం ఆశ్చర్యంతో టవల్ అందుకొంది. భయంతో పారిజాతం దీనంగా ఆమె ముఖంలోకి చూస్తూ హెడ్ మిసెస్ కోమలి చెప్పినట్లు చేసింది.

కోమలి, పారిజాతాన్ని చాలా రోజుల నుండి గమనిస్తూ వుంది. పారిజాతం ఎంతో సౌమ్యురాలు. వీరభద్రయ్య, మంగమ్మ, నీలవేణి, ఆమెను ఎన్నో విధాల మాటలతో చేతలతో అంటే వారికి కావలసిన ఉపచారాలను చేయించుకొంటూ రెండు వారాలకు ఒక ఆదివారం నాడు పారిజాతాన్ని ఇంటికి ఉదయాన్నే పనంతా చేసిన తరువాత పంపి, మరలా సాయంత్రం ఆరుగంటల కల్లా తమ ఇంటికి రప్పించుకొనేవారు. ఇలాగే సంవత్సరం గడిచిపోయింది. బాకీ తీరలేదు. పారిజాతానికి విముక్తి కలుగలేదు.


ఆదివారం ఇంటికి వచ్చినప్పుడు తల్లితండ్రి ’వారు నిన్ను ఎలా చూచుకొంటున్నారమ్మా’ అని అడిగినప్పుడు చిరునవ్వుతో పుట్టెడు దుఃఖాన్ని ఎదలో దాచుకొని పారిజాతం...

"అమ్మా! అయ్యా!... ఆ ముగ్గురూ నన్ను చాలా బాగా చూచుకొంటున్నారు. మీరు దిగులుపడకండి. నాకు అక్కడ అన్ని విధాలా బాగుంది" అమాయకంగా నవ్వుతూ చెప్పేది పారిజాతం.


ఆడవారు సహనానికి ప్రతిరూపం అంటారు మన పెద్దలు. అవును ఆ మాట పరమసత్యం. ఆ పదానికి ప్రతిరూపం... ప్రత్యక్ష సాక్ష్యం ఆ పారిజాతం.


కోమలి పారిజాతం నుండి ఆమె పూర్తి కథ తెలుసుకొంది. ఛామనఛాయే అయినా పారిజాతం ముఖంలో ఏదో వింత కాంతి. మేధస్సు. హెడ్ మిసెస్‍కు పారిజాతంలోని ఆ రెండు లక్షణాలు ఎంతగానో ఆకర్షించాయి.


కోమలికి పిల్లలు, భర్త లేరు. తండ్రి సిపాయి. బార్డర్‍లో వీరమరణం. పాకిస్తానీయులతో పోరాడి మరణించాడు వీర జవాన్ విశ్వేశ్వరయ్య. తల్లి గోమతి మాత్రం వుంది. 


"సరే పారిజాతం. ఇక నీవు ఇంటికి వెళ్ళు. రేపు ఆదివారం. నేను ఆరున్నరకు మీ ఇంటికి మీ అమ్మా నాన్నలను చూచేదానికి వస్తాను. జాగ్రత్తగా వెళ్ళమ్మ. నవ్వులపాలైన నాప చేను ఒకనాడు బాగా పండుతుంది" నవ్వుతూ చెప్పింది కోమలి.


కుర్చీనుండి లేచి పారిజాతం మేడమ్ గారికి నమస్కరించి, వారి పాదాలను తాకి కళ్ళకు అద్దుకొని ఆ గదినుండి మెల్లగా బయటికి నడిచింది.

*

ఆరోజు ఆదివారం. అమ్మా నాన్నలను కలవబోతున్నానని ఆనందం పారిజాతానికి. నాలుగు గంటలకే లేచి అన్నీ పనులు వంటా అంతా ఏడున్నరకు పూర్తి చేసింది.

యజమానురాలు మంగమ్మకు చెప్పి రెండు కిలోమీటర్ల దూరంలో వున్న తన ఇంటికి బయలుదేరింది. వేగంగా నడవసాగింది.


మనస్సును ’అమ్మా నాన్నలను కలవాలి. హెడ్ మిసెస్ మేడం తనతో మాట్లాడిన విషయాలన్నీ చెప్పాలి’ అనుకొంది ఆ వెర్రిబాగుల పంజపు పంకజం.


వాకిట ఎదురుచూస్తూ నిలుచున్న తన తల్లిని చేరి గట్టిగా కౌగలించుకొంది పంకజం. ఆ సమయంలో ఆమె కళ్ళల్లో కన్నీరు. వాటిని చూచిన తల్లి అంజమ్మ.

"ఎందుకు తల్లి ఏడుస్తున్నావు. వాళ్ళు ఏమైనా అన్నారా!" విచారంగా అడిగింది.


"చెప్పు తల్లీ!" దీనంగా అడిగాడు తండ్రి రామకోటి.


"నాన్నా అమ్మా!... వాళ్ళు ఎవరూ ఏమీ అనలేదు. నా ఈ కన్నిళ్ళు ఆనందపు కన్నీరు." చిరునవ్వుతో చెప్పింది పారిజాతం.


"ఏమిటమ్మా కారణం?" తల్లి ప్రశ్న.


"హైస్కూలు హెడ్ మిసెస్‍గారు ఈ సాయంత్రం మన ఇంటికి వస్తానన్నారమ్మా. వచ్చి మీతో ఏదో మాట్లాడుతారట."


"అలాగా!...." రామకోటికి ఆశ్చర్యం.


"అవును నాన్నా!"


ముగ్గురూ ఆనందంగా నవ్వుకొన్నారు. గుడిసెలో ప్రవేశించారు. ఎవరి ఊహల్లో వారు.

*

సమయం సాయంత్రం ఏడుగంటలు.

హెడ్ మిసెస్ కోమలి కారు వచ్చి గుడిసె ముందు ఆగింది. పరుగున వెళ్ళి పారిజాతం డోర్ తెరిచింది.


చిరునవ్వుతో కోమలి కారు దిగింది. సీట్లో వున్న పూలు, పండ్ల సంచిని చేతికి తీసుకొంది.

కొంతదూరం నిలబడి వున్న పేదలు పారిజాతం తల్లి తండ్రిని చూచింది కోమలి. ఆమె వదనంలో చిరునవ్వు.


"ఆ..... పద పారూ!..." నవ్వుతూ చెప్పింది కోమలి.


ఆమె పలికిన ’పారూ’ మాటను విన్న పారిజాతం ఆశ్చర్యంతో కోమలి ముఖంలోకి చూచింది నవ్వుతూ కోమలి తన చేతిని పారిజాతం భుజంపైన వేసింది. ఇరువురూ పారిజాతం తల్లితండ్రులను సమీపించారు. ఆ ఉభయులు చేతులు జోడించి ఒకేసారి.


"దండాలు అమ్మగోరూ!..." చిరునవ్వుతో అన్నారు.


వారి గుడిసె చుట్టూ పది పన్నెండు గుడిసెలు వున్నాయి. కారు శబ్దం విని గుడిసెలోపల వున్నవారంతా బయటికి వచ్చి ఆశ్చర్యంతో కారును కోమలిని చూచారు. అందరూ పేదవారే. కాయకష్టం చేసుకొని బ్రతికేవారు. వారి మధ్యన ద్వేషం, పగ, ప్రతీకార వాంఛలులేవు.

"తీసుకో అమ్మా!" తన చేతిలోని సంచిని కోమలి అంజమ్మకు అందించింది.


రామకోటి నిలబెట్టి వున్న నులకమంచాన్ని వాల్చాడు.

బిడియంతో "అమ్మగోరూ!.... కూకోండి" అన్నాడు.


కోమలి చిరునవ్వుతో ఆ మంచంపైన కూర్చుంది. ఆ దంపతులను పరీక్షగా చూచింది.

అంజయ్య చేతిలోని సంచిని పారిజాతం అందుకొని గుడిసెలోనికి వెళ్ళి, దాన్ని లోన వుంచి బయటికి వచ్చింది.


"చూడండి... నా గురించి పారిజాతం మీకు కొంతవరకు చెప్పి వుందనుకొంటాను. నా తండ్రి మిలటరీలో బార్డర్‍లో చనిపోయారు. మావారు కారు యాక్సిడెంటులో నా పెండ్లి అయిన రెండవ సంవత్సరంలో చనిపోయారు. నాకంటూ వున్నది డెభ్భై సంవత్సరాల మా తల్లి గౌరి. నాకు పారిజాతం మీ కథనంతా చెప్పింది. నాకు పారిజాతం అంటే ఎంతో ఇష్టం. నేను పారిజాతాన్ని దత్తత తీసుకొంటాను. స్కూల్లో మాన్పించి మంగమ్మ ఇంటి పని మనిషిగా చేశారు" అని తన హ్యాండ్ బ్యాగ్‍ను తెరిచి పదిహేను వేలను రామకోటి చేతికి అందించింది కోమలి.


ఆ ముగ్గురూ ఆశ్చర్యపోయారు.


"ఈ డబ్బును లెక్క చూచి వీరభద్రయ్యకు చెల్లించండి. పంకజానికి ఆ పంజరం నుండి విముక్తిని కలిగించండి. నాతో తీసుకొని వెళతాను. మావూరు వవ్వేరు. అక్కడ మాకు ఇల్లు, భూములు వున్నాయి. మిమ్మల్ని అక్కడకు తీసుకొని వెళతాను. ఆ ఇంట్లో వుంటూ ఆ భూములను చూచుకొంటూ మీరు అక్కడ హాయిగా బ్రతకండి. ఇక్కడికి వవ్వేరు పదికిలోమీటర్లు. మీరు పంకజాన్ని చూచేటందుకు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు. ఇది నా నిర్ణయం. మీకు సమ్మతమేనా!" చిరునవ్వుతో అనునయంగా అడిగింది కోమలి.


రామకోటి, అంజమ్మలు ఆశ్చర్యపోయారు. వారి కళ్ళల్లో ఆనంద భాష్పాలు. చేతులు జోడించారు సంతోషంలో, పంకజం కళ్ళల్లో వింతకాంతి. పెదవులపై చిరునవ్వు. కోమలి పంకజం చేతిని తన చేతిలోనికి తీసుకొంది. ఇరువురూ కారువైపుకు నడిచారు.


సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


40 views
bottom of page