'Papam Bosubabu' - New Telugu Story Written By Padmavathi Divakarla
Published In manatelugukathalu.com On 11/08/2024
'పాపం బోసుబాబు!' తెలుగు కథ
రచన: పద్మావతి దివాకర్ల
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"ఏమండీ! లేవండి! లేవండి!!" అని భార్య భవాని జోరుగా తట్టి లేపేసరికి నిద్రలో అందమైన కలలు కంటున్న బోసుబాబు తుళ్ళిపడి లేచాడు. ముందు తను ఎక్కడున్నాడో ఒకక్షణం గుర్తుకు రాలేదు. పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొని రాత్రంతా ట్రైన్లో ప్రయాణం చేసి అలిసిపోయి ఇంటికి తిరిగి వచ్చిన బోసుబాబుకి బాగా నిద్ర పట్టేసింది. ఇంకా ఆ మధుర జ్ఞాపకాలే మదినింకా వీడలేదు. వయసు పెరిగినా వన్నె తగ్గని చిన్ననాటి చెలి చందన చందమామ మోము కళ్ళముందు కదలాడగా కళ్ళు తెరిచాడు.
అయితే కళ్ళెదురుగా ఉంది చందనకాదు, చంద్రముఖి! ఆ చంద్రముఖి మరెవరోకాదు, తన భార్య భవాని ముఖం అని గుర్తించి ఉలిక్కిపడి లేచాడు. ఎర్రగా వేయించిన మిరపకాయ బజ్జీలా ఉన్న ఆమె మొహాన్ని చూసి బోసుబాబు మనసులో మూడో నంబరు ప్రమాద సంకేతం రెపరెపలాడింది.
అప్పుడు చూసాడు ఆమె చేతిలో ఉన్న తన సెల్ ఫోన్. తనెన్నిసార్లు పాస్వార్డ్ మార్చినా ఆమె ఎలాగోలా కనిపెట్టి, సెల్ తెరిచి వచ్చిన సందేశాలన్నీ చదివేస్తుంది, సమూహంలో ఉన్న సమాచారాలన్నీ ఆసాంతం చూసేస్తుంది, ఆనక అరుస్తుంది భర్తపై. అందుకే ఫోన్లో తన కొంపముంచే అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలు లేకుండా చాలా జాగ్రత్త వహిస్తాడు బోసుబాబు.
ముఖ్యంగా తన డోసుబాబు అవతారం ఎక్కడా లేకుండా చూసుకుంటాడు. అయినా ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోయే ఉంటుందని అని అతని సిక్స్త్ సెన్సేకాదు అన్ని సెన్సులూ గుర్తు చేసాయి.
"ఏమిటండీ ఇది?" అని సెల్ని విసురుగా బోసుబాబుపైకి విసిరింది.
ముంచుకొస్తున్న ముప్పు ఊహించిన బోసుబాబు ఒడుపుగా క్యాచ్ పట్టకపోయి ఉంటే ముక్కు పచ్చడైయ్యేదే! అతని మనసు పరిపరివిధాల పోయింది.
‘కొంపతీసి తన పాత మిత్రులు సమూహంలో తన దేవదాసు ఫోజు గానీ పెట్టలేదుకదా! చక్కనైన చందన, తనతో దిగిన సెల్ఫీ కానీ పెట్టి తన కొంప ముంచలేదు కదా! సమావేశం మొదటి రోజు వేదిక మీద తను వేసిన చిందులు గానీ ఆమె చూసిందేమో? చదివేటప్పుడు తను గాఢంగా ప్రేమించిన ప్రమీలకి గిఫ్ట్గా వజ్రపుటుంగరం ఇస్తున్న ఫోటోగానీ లీకవలేదుకదా!' అని బోసుబాబు గుండెలు లబ్ డబ్ లాడసాగాయి.
రాత్రి పడుక్కొనే ముందు అన్నీ డిలీట్ చేసేసాడే, మరే ఫోటో తన సతీమణి ఆగ్రహానికి కారణమైందో తెలియక సెల్ వైపు చూసాడు. ఆ ఊళ్ళో కొన్న కొత్త బరంపురం పట్టు చీర్లతో ధగధగా మెరిసిపోతున్న డజనుమంది అమ్మాయిలతో కలిసి అందరూ దిగిన గ్రూప్ ఫోటో ఒక్కటే దర్శనమిచ్చింది. అందులో తప్పు ఏముందో ఎంతమాత్రం అర్ధంకాక ఆమెవైపు వింతగా చూసాడు బోసుబాబు.
"మీ స్నేహితురాళ్ళందరూ అక్కడ బరంపురం పట్టుచీరలు కొనుక్కున్న పోటో పెట్టారు. మీరేమో బరంపురంవెళ్ళి, నాకోసం ఒక్కటంటే ఒక్కటైనా పట్టు చీర కొని తేలేదు. ఇంతేనా నామీద మీకున్న ప్రేమ, అభిమానం!" అంటూ వచ్చినంత వేగంగా వంటింట్లోకి వెళ్ళి వంటపాత్రలపై తన ప్రతాపం చూపించిందామె.
ఓ క్షణం బిత్తరపోయిన బోసుబాబుకి తక్షణ కర్తవ్యం గుర్తుకువచ్చి వంటింట్లోకి పరుగెత్తాడు ఆమెని శాంతపరచడానికి. అప్పుడు గుర్తుకువచ్చింది తన స్నేహితుడు శేషుబాబు వ్యాపారం చెయ్యడానికి కొన్ని పట్టుచీరలు కొన్నసంగతి. వాడ్ని బతిమాలుకొని ఒక్కటైనా తెచ్చుకోకపోతే తన కొంప కొల్లేరు కావడం ఖాయమని భావించి వంటింట్లోకివెళ్ళి నష్టనివారణ చర్యలు చేపట్టడంలో మునిగిపోయాడు పాపం బోసుబాబు.
సమాప్తం
పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.
Comments