#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #PapamKumar, #పాపంకుమార్, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు
![](https://static.wixstatic.com/media/acb93b_1ca4d6c1fd004dca9c111699383b12c7~mv2.jpg/v1/fill/w_940,h_788,al_c,q_85,enc_auto/acb93b_1ca4d6c1fd004dca9c111699383b12c7~mv2.jpg)
Papam Kumar - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 06/02/2025
పాపం కుమార్ - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
"ఏమండీ.. ! మనం ఈ ఇంటికి అద్దెకు వచ్చిన తర్వాత నుంచి అంతగా కలిసి రావట్లేదండీ. ఏమంటారు.. ? ఆ పాత ఇంట్లో చాలా బాగుండేది.. అక్కడ చుట్టూ వాతావరణం కూడా బాగుండేది.. అక్కడ మీరు నా మీద ఎక్కువ ప్రేమ చూపించేవారు.. ఇప్పుడేమో ప్రేమ తగ్గిపోయింది. ఇంకో పెద్దింటికి మారిపోదామండి" అంది కాంతం.
"అదేమీ లేదే కాంతం.. ! అక్కడనుంచి ప్రమోషన్ తో ట్రాన్స్ఫర్ మీద ఈ సిటీకి వచ్చామా.. నాకు ఆఫీస్ లో వర్క్ కుడా పెరిగింది కదా.. అంతే.. ! ఇంకేమీలేదు. ఈ సిటీలో పెద్ద ఇల్లు దొరకటం కూడా కష్టమే.. సర్దుకుపోవాలి.. " అన్నాడు కుమార్.
"అందుకే కనీసం ఈ ఇంటి వాస్తు ఏమైనా చూపించాలేమో చూడండి".
"అవన్నీ చూడడానికి నాకంత టైం లేదు.. " అన్నాడు భర్త కుమార్.
"నేను ఏమైనా చీరలు కొనమన్నానా.. ? నగలు కొనమన్నానా.. ? అంత విసుక్కుంటారేమిటి.. ? ఇంటి వాస్తు చూపించమన్నాను.. అంతే కదా".
"నీకు ఎవరైనా తెలిస్తే చూపించు. నా కొత్త పెళ్ళాం అక్కడ వెయిట్ చేస్తుంటుంది.. నేను వెళ్ళాలి".
"కొత్త ఇంటికి రాగానే, మీరు అప్పుడే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా.. ? అనుకున్నా.. ఈ సిటీలో అమ్మాయిలు ఎప్పుడు బట్టలు కొరత అనేలాగ వేసుకున్నారో.. అప్పుడే అనుకున్నా.. ఎవరో అమ్మాయి మిమల్ని బుట్టలో వేసేసుకుంటుందని.. ఇక నా జీవితం అయిపోయిందిరా దేవుడా.. !".
"కాంతం! మా కొత్త బాస్ ని అందరూ కొత్త పెళ్ళాం అంటుంటారు అంతే.. నన్ను నమ్ము".
"మీ మనసులో ఆ ఉద్దేశ్యం లేకపోతే, అలా ఎందుకు అంటారు చెప్పండి.. ? నా జాగ్రత్తలో నేను ఉండాలి".
"ఇందాక వాస్తు ఏదో అంటున్నావు కదా.. పోనీ చూపించు.. నీకు కొంచం రిలీఫ్ గా ఉంటుంది..".
"థాంక్స్.. ఒప్పుకున్నందుకు" అంది కాంతం చిరునవ్వుతో.
"నవ్వితే నువ్వు చాలా బాగుంటావు కాంతం.. ".
"చాల్లెండి.. ! ఎదురింటి పద్మగారికి ఎవరో వాస్తు స్వామి తెలుసంట.. 'గ్రేట్ వాస్తు' అనే సంస్థ వారిదేనంటా.. ఆయన వాస్తు మార్పు పాటిస్తే, అంతా మంచే జరుగుతుందంటా.. ".
"పద్మగారికి ఏం అద్బుతాలు జరిగాయేమిటి.. ?" అంటూ ఆత్రుతగా అడిగాడు కుమార్.
"వాళ్ళాయన మీలాగే, ఆఫీస్ లో అమ్మాయితో క్లోజ్ గా ఉంటున్నాడని ఎవరో చెబితే.. ఆ స్వామిజీ ఇంటి ప్లాన్ చూసి.. వాళ్ళ ఇంటి గోడ ఎత్తు పెంచితే.. మీ ఇంట్లోకి వేరే అమ్మాయి తొంగి చూడదని చెప్పారంట. వెంటనే, ఇంటి గోడ ఎత్తు పెంచేశారు. అప్పటినుంచి ఏ అమ్మాయి కూడా వాళ్ళాయన మనసులోకి తొంగిచూడలేకపోతున్నాది.. తెలుసా.. !".
"ఇంటికి గోడ ఎత్తు పెంచితే.. మనసులోకి అడ్డు పడిందా.. గ్రేట్".
"అవునండి.. పైగా ఏదో యంత్రం ఇచ్చారంట.. అది ఇంట్లో తగిలిస్తే, అంతా మంచే అంటా.. "
"గ్రేట్.. !".
"పద్మగారు చెప్పారని.. పక్కింటావిడ ఉమ కూడా స్వామిజీ దర్శనం చేసుకుందట.. " అంటూ కంటిన్యూ చేసింది కాంతం.
"ఆవిడ నీకు ఏం చెప్పిందో?".
"మొదట్లో వాళ్ళింట్లో ఎవరికీ అంతగా కలిసి వచ్చేదికాదంట.. స్వామిజీ వాస్తూ చూసి.. మీ బాత్రూం దిక్కు సరిగ్గా లేదని.. బాత్రూం లో కూర్చున్నప్పుడు మధ్య మధ్యలో లేస్తూ కూర్చుంటే, వాస్తు బ్యాలన్స్ అయి, అంతా మంచే జరుగుతుందని చెప్పారంట. అప్పటినుంచి ఎంత అర్జెంటు అయినా సరే, ఇంట్లో అందరూ బాత్రూం లో ఆగి, ఆగి కూర్చునేవారు. ఇప్పుడు వారికి చాలా బాగుందంటా.. ఇప్పుడు వాళ్ళాయన బాత్రూం కమోడ్ బిజినెస్ బాగా జరుగుతున్నాదంటా.. ".
"సూపర్.. "
"కోర్ట్ కేసుల్లో ఇబ్బందులున్నా.. ఒంట్లో జబ్బులున్నా.. ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా.. స్వామిజీ ఇట్టె నయం చేస్తారు.. "
"గ్రేట్.. ! అయితే డాక్టరు దగ్గరకో, లాయర్ దగ్గరకో వెళ్ళనవసరం లేదు.. ఒక్క ఇంటి వాస్తు చూపించుకుంటే సరి.. "
"ఆ వెటకారమే వద్దన్నది మరి.. నేను స్వామిజీని కలవడానికి వెళ్తానండి. మన ఇంటికి ఏం చేయించాలో ఆ స్వామిజీని కనుక్కుని వస్తాను. అలాగే ఇంటి బయట ఏం తగిలించాలో.. ఇంటి లోపల ఏం తగిలించాలో అన్నీ అడిగి వస్తాను.. ఆశీర్వదించండి.. "
"మంచి వాస్తు సలహా సిద్ధిరస్తు.. !"
కాంతం చాలా హుషారుగా స్వామిజీని కలవడానికి వెళ్ళింది. స్వామిజీని కలిసి.. ఆయన చెప్పినవన్నీ రాసుకుని సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి వచ్చిన కాంతం.. బయట ఎప్పటినుంచో ఆఫీస్ నుంచి వచ్చి వెయిట్ చేస్తున్న భర్త కుమార్ ని చూసి..
"ఎంత సేపయ్యిందండి మీరు వచ్చి.. ?"
"ఒక గంట అయ్యిందేమో.. "
"అయ్యో.. స్వామిజీ గారితో మన ప్రాబ్లెమ్స్ గురించి చెప్పి ఆయన చెప్పిన పాయింట్స్ నోట్ చేసుకుని వచ్చేసరికి లేట్ అయ్యిందే.. మధ్యలో షాపింగ్ చేసుకుని వచ్చేసరికి ఇంకా లేట్ అయ్యిందండీ.. "
"షాపింగ్ బ్యాగ్ పెద్దదిగా ఉంది.. ఎంతసేపు చేసావేంటి?"
"స్వామిజీ గారి దగ్గర ఒక గంట అయ్యింది.. తర్వాత షాపింగ్ కొంచం టైం పట్టింది.. "
"బాగా టైం పట్టిందేమో కదా.. "
"ఎంత.. ! ఒక ఐదు గంటలు.. "
అది విన్న కుమార్ తల గిర్రున తిరిగింది..
"తాళం తీసి ఆ కాఫీ నీళ్ళు నోట్లో పోయ్యవే కాంతం.. తర్వాత మీ స్వామిజీ ప్రవచనాలు వింటాను.. " అన్నాడు కుమార్ నీరసంగా.
"కాఫీ తాగిన తర్వాత.. ఇప్పుడు చెప్పు ఏమైందో.. ఏం తెచ్చావో.. ?"
"స్వామీజీ చాలా గొప్పవారండీ.. వెళ్ళిన వెంటనే ఐస్ వాటర్ ఇచ్చారండీ.. "
"మొదట్లోనే నిన్ను బాగా కూల్ చేసారనమాట! అంతే కాదండీ.. మధ్య మధ్యలో కూల్ డ్రింక్స్ కుడా ఇచ్చారు.. "
"అయితే ఇంకా కూల్ చేసారనమాట.. ఇంతకీ ఏం చెప్పారు.. ?" అడిగాడు కుమార్.
"మన ఇంటి ప్లాన్ చూసి.. అంతా బాగుంది గానీ.. ఇంటికి దిష్టి తగిలిందని.. అందుకే ప్రతి గదిలో ఒక యంత్రం పెట్టమని ఇచ్చారండీ.. "
"నిజంగా స్వామిజీ ఎంత మంచివారే.. యంత్రాలు ఫ్రీగా ఇచ్చారు కదా.. "
"ఫ్రీ అని నేను చెప్పానా.. ! మీకు తొందర ఎక్కువ.. "
"ఎంతేమిటి.. "
"ఒకటి ఐదువేలు.. మనింట్లో అన్ని బెడ్రూమ్స్, కిచెన్, హాల్ అన్నిటి కోసం ఒక ఆరు తెచ్చాను.. "
"అన్ని ఎందుకే.. ?
"కిచెన్ లో పెడితే.. నేను వంట బాగా చేస్తానన్నారు. అసలే ఈ మధ్య ఉప్పు కారాలు ఎక్కువ పడుతున్నాయని మీరు గోల పెడుతున్నారుగా మరి.. "
"అలాగే, బెడ్ రూమ్ లో పెడితే.. మన మధ్య ప్రేమ ఎక్కువ అవుతుంది. ఇంకొకటి బాత్రూం ఎంట్రన్స్ లో పెట్టి, లోపలికి వెళ్లేముందు దణ్ణం పెట్టుకుంటే, మోషన్ ఫ్రీగా అవుతుంది.. అసలే మీకు గ్యాస్ ప్రాబ్లం కదా.. "
"అయితే ముప్పై వేలు దక్షిణ సమర్పయామి.. !"
ఇంకా వుందండీ.. వినండి..
"మీ మీద ఏ ఆడవారి కళ్ళు పడకూడదని.. మీకోసం ఒక బొట్టు ఇచ్చారు. అది పెట్టుకుని మీరు బయటకు వెళ్తే.. ఏ అమ్మాయి కుడా మీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడడానికే భయపడుతుందట.. ఎంతైనా మీరు నా వారు కదా.. నాకే సొంతం.. దానికి ఒక పదివేలు.. "
"ప.. ప.. పదివేలా.. ?"
"ఇంకా.. ఇంటి గుమ్మం ముందు కట్టడానికి కొన్ని కూరగాయలు తెచ్చాను.. దిష్టి కోసం"
"ఓహ్.. ! అందుకే మార్కెట్ కి వెళ్ళావా.. ?
"ఇవి అల్లాటప్పా కూరగాయలు కాదండీ.. ! ఒక వంకాయ, ఒక బెండకాయ, ఒక మిరపకాయ, ఇంకా కొన్ని వేరేవి ఉన్నాయి. వీటిని మంత్రించి ఇచ్చినందుకు ఒక దానికి ఒక ఐదు వేలు.. మొత్తం యాభై వేలు.. వీటిని ప్రతి నెల మారుస్తూ ఉండాలి. ఇంకా, ఇంటి లోపల.. గుమ్మానికి ఎదురుగా.. జిడ్డు కారుతూ, చెత్తగా ఉన్న మీ పెద్ద ఫోటో ఒకటి తగిలించమన్నారు.. ఇంటికి దిష్టి తగలకుండా.. ! ఇంకా అంత దూరం నా దారి ఖర్చులు, నా షాపింగ్ ఖర్చులు కలిపి ఒక లక్ష పైనే అయింది"
ఇది విన్న కుమార్ ఈసారి మూర్చపోయాడు..
"ఏమండీ.. ! ఏమైందండీ.. లేవండీ.. ! ఏదో దిష్టి తగిలినట్టుంది.. మళ్ళీ రేపు స్వామిజీ దగ్గరకి వెళ్ళాలి.. " అని కాంతం అంటుండగానే టక్కున లేచేసాడు కుమార్.
"చూసారా స్వామిజీ పేరు చెప్పగానే ఎలా లేచారో.. అదీ ఆయన మహిమ.. "
"నువ్వు అలా అనుకున్నావా.. ? నువ్వు మళ్ళీ చేసే బిల్ గుర్తుకు వచ్చి ఆటోమేటిక్ గా తెలివి అదే వచ్చేసింది.. అంతే.. !"
"మీకు ఇంకో సంతోషకరమైన విషయం చెబితే.. ఫుల్ ఖుషీ అవుతారు.. "
"చెప్పిన తర్వాత గానీ దాని ఎఫెక్ట్ తెలియదు.. ఇంతకీ ఏమిటది.. ?"
"స్వామీజీ తన భక్తుల కోసం, వీధికో ఆశ్రమం పెడతారంట.. అప్పుడు నేను అంత దూరం వెళ్లడం ఉండదు.. ఎంచక్కా ఎప్పుడు పెడితే అప్పుడే ఆయనను కలవొచ్చు.. "
"మనలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఆయన ఎన్ని ఆశ్రమాలైనా కడతారు. మొన్నటివరకు నీ షాపింగ్ ఖర్చు ఒక్కటే ఉండేది, ఇప్పుడు స్వామిజీ ఖర్చు కుడా తోడయ్యింది. నీకు రిలీఫ్ మాటేమో గానీ, నా పని అయిపోయింది" అంటూ మళ్ళీ మూర్చపోయాడు కుమార్.
**********
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
![](https://static.wixstatic.com/media/acb93b_9147f3217674494696f7459cafee01a0~mv2.jpg/v1/fill/w_204,h_308,al_c,q_80,enc_auto/acb93b_9147f3217674494696f7459cafee01a0~mv2.jpg)
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Comentários