top of page

పాపం పసిపాప

Writer's picture: Kayala NagendraKayala Nagendra

#KayalaNagendra, #కాయలనాగేంద్ర, #PapamPasipapa, #పాపంపసిపాప, ##TeluguHeartTouchingStories

Papam Pasipapa - New Telugu Story Written By Kayala Nagendra

Published In manatelugukathalu.com On 01/02/2025

పాపం పసిపాప - తెలుగు కథ

రచన: కాయల నాగేంద్ర


పన్నెండేళ్ళ అర్పితకు తీవ్రమైన జ్వరం రావడంతో ఒళ్ళంతా పొయ్యిమీద పెనంలా కాలిపోతోంది. మూసిన కళ్ళు తెరవడం లేదు. మనసులో ఏదో అర్థం కాని బాధ తొలుస్తోంది ఆమెను. కొద్దిసేపటికి మెల్లిగా కళ్ళు తెరిచింది. ఎదురుగా తల్లి సుజాతను చూడగానే దుఃఖం కట్టలు తెంచుకుంది. 'అమ్మా' అంటూ బోరు ఏడ్చింది.

 

 "ఏమీ కాదమ్మా..తగ్గిపోతుంది" అంది తల్లి పక్కలో కూర్చుని తల నిమురుతూ. 


 భయపడుతూ వణికిపోతున్న అర్పితను చూడగానే డాక్టర్ కి పరిస్థితి అర్థమైంది. ఆమె ఏదో సైకాలజికల్ గా సతమతమవుతున్నదని గ్రహించాడు.


 "మీరు కొద్దిసేపు బైటకు వెళ్ళండి.. పాపతో నేను మాట్లాడాలి" సుజాతతో అన్నాడు. 


అర్పిత చాలా తెలివైన అమ్మాయి. స్కూల్లో ఎప్పుడూ ఫస్టు వచ్చేది. అంతేకాదు చాలా అందమైనది కుడా. ఆమె నవ్వితే మనోహరంగా, మాట్లాడితే మధురంగా ఉంటుంది. ఎప్పుడూ తూనీగలా చెంచుచెంగున ఎగిరే అమ్మాయి అనుకోకుండా ఇలా మంచం పట్టడం అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. క్లాసు రూములో తోటి విద్యార్థులతో సరగాగా ఆడుతూ, పాడుతూ ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో ఉండే అమ్మాయి ఒక్కసారిగా ఇలా అయ్యేసరికి తోటి విద్యార్థులు జీర్ణించుకోలేక పోయారు. 


ఆమె తల్లి బయటకి వెళ్ళిపోగానే "చూడమ్మా.. రాత్రి దేనినైనా చూసి భయపడ్డావా? " నెమ్మదిగా అడిగాడు డాక్టర్. 


 ఒక్క నిముషం గాఢంగా శ్వాస తీసుకుని, దుఃఖం, ఆవేదన కలగలిపిన స్వరంతో చెప్పుకొచ్చింది అర్పిత. ఆమె గుండెల్లో గూడు కట్టుకున్న వేదన మాటల రూపంలో తన్నుకొచ్చింది.


"నిన్న బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండటంతో అమ్మ, తమ్ముడు వెళ్ళారు. నాకు హోం వర్క్ ఉందని రానని చెప్పాను. ఇంట్లో నేను, తాతయ్య మాత్రమే ఉన్నాం. రాత్రి వర్షం చిన్న చినుకులతో మొదలై ఉరుములు, మెరుపులతో భారీ వర్షంగా మారడంతో రాత్రికి అమ్మ ఇంటికి రాలేక పోయింది. కరెంట్ పోవడంతో అంతటా చీకటి అలుముకుంది. అన్నం తిని పడుకున్నాను. గొంగళి పురుగు నా వంటి పైన ప్రాకులాడుతున్నట్టు అనిపించడంతో ఉలిక్కిపడి లేచాను.


నా పక్కలో తాతయ్య వింత వింతగా ప్రవర్తించడం చూసి భయపడ్డాను. ఎంత వేడుకున్నా ఆయన మనసు కరగలేదు. ఆయన నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నించి విఫలమయ్యాను. బైట పెళపెళ ఉరుముల శబ్దాలు నా హృదయంలో సమ్మెట దెబ్బలయ్యాయి. సభ్యసమాజం తల దించుకునేలా, మానవత్వం మంటగలిపేలా వావి వరసలు మరచిపోయాడు." 


ఆమె చెబుతుంటే ఆమె కళ్ళు అగ్నిగోళలా మారాయి.. కొద్దిసేపు మౌనం వహించి మళ్ళీ చెప్పడం ప్రారంభించింది. 


 " 'వద్దు తాతయ్య' అంటూ ప్రాధేయపడినా ఆయన మనసు కరగలేదు. ఎన్ని విధాలుగా వేడుకున్నాను ఆయన మనసు చలించలేదు. జోరు వాన, గాలిలో నా అరుపులు బైట ప్రపంచానికి వినిపించకుండా చేశాయి. కోడిపిల్లలా తన్నుకున్నాను. గొంతులో తడారిపోయేవరకు ఏడ్చాను. ఒంట్లో రక్తమంతా ఒక చోటికి వచ్చినట్లయింది. ఎవరికైనా చెబితే గొంతు నలిపి చంపుతానని బెదిరించాడు తాతయ్య అనబడే మృగం. ” 


అర్పిత చకచకా ఆవేశంతో చెప్పిన విషయాలకు డాక్టర్ మైండ్ బ్లాంక్ అయింది. 'అర్పిత చాలా తెలివైన అమ్మాయి, ఇప్పుడేమి చేయాలి? ఆ చిన్నారి మనసులో గట్టిగా పాతుకుపోయిన దృశ్యాన్ని ఎలా రూపు మాపాలి? డాక్టర్ మనసు పరిపరి విధాలుగా ఆలోచించసాగింది. 


రోడ్డు పైకి వెళితే పోకిరీల బెడద.. స్కూల్ కెలితే ఉపాధ్యాయుల వెకిలి చేష్టలు. ఇక ఆడపిల్లల మాన ప్రాణాలకు రక్షణ ఎక్కడ దొరుకుతుతుంది? బయటకు వెళ్ళినా, ఇంట్లోనే ఉన్నా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. 


అర్పిత అమ్మగారిని లోపలికి తీసుకురమ్మని నర్స్ తో చెప్పాడు డాక్టర్. 

గదిలోకి వచ్చిన సుజాత " డాక్టర్ గారు.. మా అమ్మాయికి ఎలా ఉంది ?" ఆత్రుతతో అడిగింది. 


"జ్వరం తగ్గింది కాని, హృదయానికి తగిలిన గాయం మానలేదు"


“అంటే.. ఏమిటి డాక్టర్ మీరనేది ?"


 "రాత్రి మీరు ఇంట్లో లేని సమయంలో జరగరాని ఘోరం జరిగిపోయింది. మీ నాన్నగారు తప్పతాగి మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు. కామంతో కళ్ళు బైర్లుకమ్మి మనవరాలినే కాటేశాడు. దాంతో ఆమె లేత మనసు గాయపడింది”.. 


డాక్టర్ చెబుతున్న మాటలకు ఆమె నిర్ఘాంతపోయింది. గుండెల్లో పిడుగు పడినట్లయింది. కాళ్ళ క్రింద నేల కృంగిపోతున్నట్లనిపించింది. 


సుజాత మొహం గంభీరంగా మారిపోయింది. ఆమె మనసు ఆక్రోశించింది. కోపం, ఆవేశం కట్టలు తెంచుకుంది 'రాత్రి ఇంత ఘోరం జరిగిపోయిందా? భగవంతుడా.. అర్పితను ఎలా ఓదార్చాలి? ఆ దుర్మార్గున్ని ఇప్పుడే అంతం చేయాలి' వడివడిగా అడుగులు వేస్తూ ఇంటికి బయలుదేరింది సుజాత. చేతుల్లో వున్న కొడుకును మరింత గట్టిగా హృదయానికి హత్తుకుంది. వాన జల్లులు పడుతున్నా, వాతావరణం చల్లగా మారినా, ఆవేదనతో అట్టుడుకి పోతున్న ఆమె మనసు చల్లారలేదు. 


ఈ మధ్యనే సుజాత భర్త ఇల్లు వదిలి పోవడంతో అప్పటినుండి తండ్రి దగ్గర ఉంటోంది.

అర్పిత తాతయ్యకి గారాలపట్టి. కొండమీది కోతిన తెమ్మాన్నా పట్టి తెస్తాడు. ఆమెను పల్లెత్తు మాట కూడా అనడు. 'బంగారు తల్లి' అని ముద్దుగా పిలుచుకుంటాడు. 


"దాన్ని అలా ముద్దు చేస్తూ నెత్తిన ఎక్కించుకుంటున్నావు" సుజాత చాలా సార్లు తండ్రితో వాదనకు దిగేది. 


"నా బంగారు తల్లికి ఏమి తక్కువే! అందముంది.. తెలివితేటలున్నాయి చదువులో బాగా రాణిస్తోంది. బాగా చదివించి డాక్టర్ని చేస్తాను" అనేవాడు. అలాంటివాడు ఇలా చేశాడంటే సుజాతకి నమ్మశక్యం కావట్లేదు. తాగిన మైకంలో వావి వరసలు మరిపించే ఇటువంటి మద్యాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించడం అన్యాయం అనుకుంది. 


 కాలం పరుగెడుతోంది. కంగారుగా ఆమె మరింత వడివడిగా అడుగులు వేసింది. కట్టలు తెంచుకున్న ఆవేశంతో ఇంటి తలుపులు తోయగానే, తలుపులు బోర్లా తెరుచుకున్నాయి. 


ఎదురుగా ఫ్యాన్ కి ఉరేసుకుని వేలాడుతున్న అరవై ఏండ్ల తండ్రి. అప్పటికే అతని ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. బస్తీ వాసులందరూ గుమిగూడారు. పాపం చాలా మంచోడు.. ఇలా ఎందుకు చేసుకున్నాడో ? అన్నారు అందరూ. 


 టేబుల్ మీద తెల్లని పేపర్ రెపరెపలాడుతుంటే, దాన్ని చేతిలోకి తీసుకొని చదవాడు ఇన్స్‌పెక్టర్. 

 “నా చావుకు నేనే కారకుడ్ని” అని రాసి ఉంది. 


-------


కాయల నాగేంద్ర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు కాయల నాగేంద్ర, నేను కేంద్ర ప్రభుత్వ సంస్థలో పని చేస్తూ 31-10-2021 తేదీ రిటైర్ అయ్యాను. నా రచనలు వివిధ దిన, వార, మాస పత్రికలో ప్రచురింపబడ్డాయి. తాజాగా ఈ సంవత్సరం 'విడదల నీహారక ఫౌండేషన్, సాహితీ కిరణం' సౌజన్యంతో నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో 'సంబంధం కుదిరింది' కథకు బహుమతి వచ్చింది.


 
 
 

Comments


bottom of page