top of page
Writer's pictureDivakarla Venkata Durga Prasad

పాపం పసివాడు!


'Papam Pasivadu' - New Telugu Story Written By D V D Prasad

'పాపం పసివాడు' తెలుగు కథ

రచన: డి వి డి ప్రసాద్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

"ఏమండీ!...మన బాబిగాడు స్కూల్ నుండి ఇంకా రాలేదండీ! నాకేంటో భయంగా ఉందండీ! మీరు వెంటనే రండి!" కంగారుగా అంటున్న భార్య వసుంధర మాటలు ఫోన్లో వినగానే వాసుదేవరావు విస్తుపోయాడు. గోడ గడియారం వైపు చూసాడు. టైం ఆరున్నర దాటింది. స్కూలు నాలుగున్నరకే విడిచిపెడ్తే బాబి ఇంకా ఇంటికి రాకపోవడమేమిటి అని మనసులోనే అనుకున్నాడు.


భార్య వసుంధరమీద చెప్పలేని కోపం వచ్చింది. అయిదు గంటలకే ఆఫీసు వదిలినా అక్కణ్ణుంచి తిన్నగా క్లబ్బుకి వెళ్ళి స్నేహితులతో పేకాట ఆడి, కబుర్లతో కాలక్షేపం చేసి ఏ రాత్రి తొమ్మిదికో, పది గంటలకో ఇంటికి చేరడం వాసుదేవరావుకి అలవాటు. అలాగే ఆ రోజు కూడా తన స్నేహితులతో ఆటలో నిమగ్నమై ఉన్నాడు. అసలే హ్యాండ్ రైజింగ్లో ఉంది. అందులోనూ ఎన్నడూ లేనిది ఈ రోజు అప్పటికే కొన్ని ఆటలు గెలిచి మంచి హుషారుగా ఉన్న తరుణంలో ఇలాంటి వార్త ఇంటి నుండి రావడంతో కొద్దిగా చిరాకు వేసింది కూడా. ఆట మంచి రసపట్టులో ఉండగా డిస్టర్బ్ చేసిన వసుంధర మీద చెప్పలేని కోపం కూడా వచ్చింది.


“అయిదు గంటలలోపే ఇంటికి రావలసిన బాబిగాడు ఇంటికి రాలేదంటే, ఇంతవరకూ నువ్వు ఏమిటి చేస్తున్నావు? నీకు కొద్దిగా కూడా బాధ్యత లేదా? ఏ స్నేహితులతోనో వాళ్ళింటికి వెళ్ళాడో లేక, ఎక్కడైనా మిగతా పిల్లల్తో కలిసి క్రికెట్ ఆడుతూ ఉండిపోయాడేమో కనుక్కున్నావా? అంత మాత్రానికే నాకు ఫోన్ చెయ్యాలా? వాడి ఫ్రెండ్స్ని అడిగితే చెప్తారు కదా! అయినా ఇప్పుడా నాకు చెప్పటం?" అన్నాడు విసుగు, కోపం కలగలసిన గొంతుతో.


"ఇవాళ మహిళా మండలి వార్షికోత్సవం ఉందని బయలుదేరబోతూంటే మన ఆటోవాడు లక్ష్మణ్ మన వీధిలోని పిల్లలందర్నీ దింపాడు. మనవాడి గురించి అడిగితే తను వెళ్ళేసరికే బాబి స్కూల్లో లేడుట. మనం ఇంటికి తెచ్చామేమో అని అనుకున్నాడట. ఇంకే స్నేహితులతో కలిసి ఎవరింటికైనా వెళ్ళాడేమోనని, తెలిసిన అందరికీ ఫోన్ కూడా చేసానండీ! ఎవరింటికీ వెళ్ళలేదుట. స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్లని కూడా అడిగాను, వారికీ ఏమీ తెలియదట." మధ్యమధ్యన వెక్కుతూ చెప్పింది వసుంధర.


ఆ మాటలు వినేసరికి మత్తు వదిలిపోయింది వాసుదేవరావుకి. ఫోన్లో మాట్లాడుతున్నంతసేపు తనవైపు ప్రశ్నార్థకంగా చూస్తున్న స్నేహితులకి విషయం టూకీగా చెప్పి అయిష్టగానే అక్కణ్ణుంచి కదిలాడు వాసుదేవరావు. రకరకాల ఆలోచనలతో సతమతమవుతూ బైక్ ఎక్కాడు. అతను ఇంటికి చేరేసరికి వాకిట్లోనే దిగులుగా నిలబడి ఉంది వసుంధర. ఆమె కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ అవేమీ గమనించకుండా, ఇంటికి చేరుతూనే భార్యపై విరుచుకుపడ్డాడు వాసుదేవరావు. తన కోపమంతా ఆమెపై చూపించాడు.


"బాబిగాడు ఇంటికి రాకపోతే నాకు వెంటనే ఎందుకు ఫోన్ చెయ్యలేదు? పిల్లాడు కన్నా మహిళా మండలి మీటింగులే నీకు ముఖ్యమా? ఎప్పుడూ సినిమాలు, షికార్లు, షాపింగ్అని తిరుగుతావు కాని వాడ్ని రోజు స్కూలు నుండి తేవచ్చుగా! నీ దగ్గర ఎలాగూ స్కూటీ ఉంది కదా?" అని కేకలేసాడు.


"మీరు మాత్రం, ఆఫీసు వదలగానే నేరుగా ఇంటికి రావచ్చుగా, క్లబ్బులో అంతసేపు గడపకపోతే! ఆఫీసు నుండి వస్తూ బాబిని తీసుకురావచ్చు కూడా! మీరు వచ్చే దారిలోనే స్కూలు ఉంది కూడా! మీకు మాత్రం బాధ్యత లేదా?" అంటూ వసుంధర కూడా భర్తపై విరుచుకు పడింది.


"మాటకు మాట ఎదురు చెప్పడం బాగా వచ్చు! నువ్వు ఇంట్లో ఉండి మాత్రం ఏ విషయాలు పట్టించుకుంటున్నావు? ఎప్పుడూ బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగడం తెలుసు. మహిళామండలి మీటింగులని దేశాన్ని ఉద్ధరించడానికి బయలుదేరతావు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ సెల్ ఫోన్ పట్టుకు కూర్చుంటావు, వాడిని అసలు పట్టించుకోవు."మండిపడ్డాడు వాసుదేవరావు.


”నన్నంటున్నారు కానీ, అసలు మీరు ఏనాడైనా ఆఫీసు పని అయిన తర్వాత నేరుగా ఇంటికి వచ్చారా? స్నేహితులతో పేకాటలు, కబుర్లతో కాలక్షేపం చేసి ఏ రాత్రికో గానీ రారు. అయినా మీరు మాత్రం వాడ్ని ఎప్పుడు పట్టించుకున్నారు? స్కూలు ఫీజ్ కట్టెస్తే మీ బాధ్యత తీరిపోతుందా?" నిలదీసింది వసుంధర భర్తని రోషంగా.


ఇద్దరిమధ్య మాటామాటా పెరిగింది. పరస్పర దోషారోపణలు చేసుకున్నారు. ఎవరూ తగ్గడంలేదు. అప్పటికే బాబి కనబడటం లేదని చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. కర్తవ్యం ఆలోచించకుండా ఒకరినొకరు తప్పుబట్టడం చూసిన ఇరుగూపొరుగూ వాళ్ళని వింతగా చూసారు. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ ఉన్నదే అయినా, ఇలాంటి సమయంలో కూడా తగువులాడుకోవడం వాళ్ళెవరికీ మింగుడు పడలేదు.


ఇక వాళ్ళనలా వదిలేస్తే లాభం లేదని గ్రహించిన పక్కింటి సుందరంగారు, "వాసుదేవరావుగారూ, మీ తగువు కాస్త ఆపి అబ్బాయి విషయం ఇకనైనా ఆలోచించండి. ఊళ్ళో ఉన్న మీ బంధువులు, చుట్టాలు ఎవరింటికైనా వెళ్ళి ఉంటాడేమో ఒకసారి కనుక్కోండి." అన్నాడు.


ఆ మాటలు విన్న భార్యభర్తలిద్దరూ కోపంగా ఒకళ్ళమొహలోకరు చూసి ఓ క్షణం మౌనం వహించారు. ఇదే అదునుగా సుందరం, "వెంటనే ఫోన్ చెయ్యండి మీ బంధువులకి. అక్కడకి కూడా వెళ్ళి ఉండకపోతే పోలీసు రిపోర్ట్ ఇవ్వాలి." అన్నాడు.


పోలీసుల మాట వినగానే వసుంధర గుండెల్లో రాయి పడింది. వాసుదేవరావు కూడా కంగారు పడి సిద్ధార్థనగర్లో ఉండే తన చెల్లెలు వనజకి ఫోన్ చేసాడు. వనజ కొడుకు కిట్టూ కూడా బాబి వయసువాడే. ఎప్పుడైనా పండుగలు, సెలవులు వస్తే బాబిని తీసుకొని వాళ్ళింటికి వెళ్ళేవాడు. పిల్లలిద్దరూ సరదాగా ఆడుకొనేవారు. వాళ్ళిల్లు కూడా బాబికి బాగా తెలుసు.


ఫోన్ ఎత్తి విషయం తెల్సుకున్న వనజ, "అన్నయ్యా! బాబి ఇక్కడకు రాలేదు. బహుశా వాళ్ళ మావయ్య ఇంటికి వెళ్ళాడేమో కనుక్కో? ఏ విషయం నాకు చెప్పు. అసలే రోజులు బావులేవు. చిన్నపిల్లల్ని ఎత్తుకు పోయేవాళ్ళు ఊళ్ళో తిరుగుతున్నారని పుకారు కూడా ఉంది." ఆదుర్దాగా అంది.


సరిగ్గా అదే సమయంలో వసుంధర కూడా గాంధీనగర్లో ఉంటున్న తన అన్నయ్యకి ఫోన్ చేసింది. అక్కడికి కూడా వెళ్ళలేదని తెలుసుకున్న వసుంధర బిక్క మొహం వేసింది. విషయం విన్న వసుంధర అన్నయ్య సుధాకర్ ఆదరాబాదరాగా అక్కడికి వచ్చాడు. వాసుదేవరావు, వసుంధరతో కలిసి మళ్ళీ ఆటో వాణ్ణి, స్కూల్ సిబ్బందిని కలుసుకున్నాడు. కానీ ఫలితం శూన్యం. ఎవరూ బాబీ గురించి ఏమీ చెప్పలేకపోయారు.


క్లాస్ టీచర్ సుమలత, "స్కూలు సెలవవగానే మిగతా అందరితో పాటు ఆటోలో వెళ్ళడానికి బయలుదేరాడు. అదే సమయంలో నాకో ఫోన్ రావడంతో గమనించలేకపోయాను." అని చెప్పింది.


అన్ని చోట్లా విచారించి హతాసులై ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి చేరుకోగానే చుట్టుపక్కలవాళ్ళు ఆరా తీసారు.


'చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయి వాళ్ళకి అంగవైకల్యం కలిగించి, వాళ్ళచేత బిచ్చమెత్తించే మాఫియాలు కూడా ఉన్నాయి.' అని ఒకరంటూంటే, 'ఇంట్లో తల్లితండ్రులు పోరు రోజూ చూస్తూ విరక్తి చెంది ఏ అఘాయిత్యమైనా చేసుకున్నాడేమో పాపం పసివాడు.' అన్నారింకొకళ్ళు.


వాళ్ళ మాటలు వసుంధర, వాసుదేవరావు ఇద్దరి చెవులా పడుతూనే ఉన్నాయి. ఆ మాటలు వాళ్ళిద్దరి మనసులనూ తూట్లు పొడుస్తున్నాయి. వాళ్ళిద్దరి మనసులో తీవ్రమైన అలజడి రేగింది. వాళ్ళ పరిస్థితి చూసిన సుధాకర్ మనసు ద్రవించి అనునయంగా వాళ్ళ వీపు తట్టాడు.


"ఇంక ఇలా లాభం లేదు. పదండి, పోలీస్ రిపోర్ట్ ఇద్దాం!" అన్నాడు సుధాకర్.


విచార వదనాలతో భారంగా అతనివెంట వెళ్ళారు దంపతులిద్దరూ. జరిగినది యావత్తూ సావధానంగా విన్న పోలీస్ ఇన్స్పెక్టర్, బాబిని ఎవరైనా కిడ్నాప్ చేసారేమోనని తన అనుమానం వెలిబుచ్చాడు.


"మీ వాడ్ని కావాలని కిడ్నాప్ చేస్తే డబ్బులు కోసం కిడ్నాపర్స్ మీకు తప్పకుండా ఫోన్ చేస్తారు. మీకు అలాంటి ఫోన్ ఏదైనా వస్తే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా మాకు తెలియజేయాలి. ఎర వేసి కిడ్నాపర్స్ని పట్టుకోవచ్చు. ఒకవేళ డబ్బులు కోసం కిడ్నాప్ అయి ఉండకపోతే మాత్రం ఇంకో కోణం నుంచి ఆలోచించాలి. మీ మీద ఎవరికైనా పగ ఉండి ఉంటే పగ సాధించడానికి బాబుని కిడ్నాప్ చేసి ఉండవచ్చు. బైదిబై, మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? గుర్తు చేసుకోండి!" అన్నాడు వాసుదేవరావు వైపు సూటిగా చూస్తూ.


ఆ మాటలకు ఆలోచనలో పడ్డాడు వాసుదేవరావు. వసుంధర కూడా ఏవేవో గుర్తు చేసుకోసాగింది. రెండు నిమిషాల తర్వాత తల అడ్డంగా ఊపాడు వాసుదేవరావు. "నో సర్! అలాంటిదేమీ లేదు. అలాంటి శత్రువులు ఎవరూ లేరు సార్." అన్నాడు.


అతనివైపు సాలోచనగా చూసాడు ఇన్స్పెక్టర్. "ఓకే! మరో కోణం లోంచి ఆలోచిద్దాం! స్కూల్లో టీచర్లుగాని ఏమైనా మందలించడం గాని చేసారా? లేదా, ఇంట్లో మీరిద్దరూ గాని పిల్లాడి మీద కోపంతో ఏమైనా అన్నారా? నేనిలా అన్నానని అన్యథా భావించకండి. ఇవాళా రేపు పసి పిల్లలు కూడా తల్లీ తండ్రీ మందలించారనో, స్కూల్లో టీచర్ కోపడ్డాడనో ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు కదా? అలాంటి సున్నిత మనస్కులు కూడా ఉంటున్నారు మరి! అలాంటి సంఘటనలేమీ జరగలేదు కదా?" అని అడిగాడు.


ఆ ఊహ మనసులోకి రాగానే ఒళ్ళు జలదరించింది ఇద్దరికీ. భయంతో ఒకరిమొహాలొకళ్ళు చూసుకున్నారు వసుంధర, వాసుదేవరావూను. "లేదండీ...అలాంటిదేమీ లేదు." అంది వసుంధర తత్తరపాటుగా.


"చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయే చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా పనైనా కావచ్చు, ఏ విషయమూ ఇప్పుడు చెప్పలేం. దర్యాప్తు చెయ్యాలి." సాలోచనగా అన్నాడు.

అతని మాటలకి వాళ్ళిద్దరి మొహాల్లోనూ అంతులేని భయం గూడు కట్టుకుంది.


"సరే! మీరు ఇంటికి వెళ్ళండి! మేము దర్యాప్తు చేస్తాం. కిడ్నాపర్ల నుండి ఫోన్ వస్తే మాత్రం మాకు తెలపడం మరువకండి." ఇన్స్పెక్టర్ అనగానే అక్కణ్ణుంచి భారంగా కదిలారు వాళ్ళు.


ఇంటికి వెళ్ళేంతవరకూ మౌనంగా ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. వాళ్ళకి తోడుగా సుధాకర్ కూడా వాళ్ళింటికి వచ్చాడు. బాబి కిడ్నాప్ అయ్యాడేమోనని పోలీసులు అనుమానం వెలిబుచ్చడంతో కిడ్నాపర్లనుండి ఫోనేమైనా వస్తుందేమోనని దిగులుగా ఎదురు చూడసాగారు ఇద్దరూకలిసి, తమ ఇద్దరిమధ్యా కోపతాపాలకి తాత్కాలికంగా స్వస్తి చెప్పి. ఇద్దరి మొహాల్లోనూ విచారం గూడు కట్టుకుంది. తమ మధ్య ఉన్న విభేదాలు మరిచిపోయి ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకోసాగారు. రాత్రి పదకొండు గంటలకి ఫోన్ రింగైతే ఉలిక్కిపడ్డారిద్దరూ. కిడ్నాపర్లు వద్దనుండి ఫోన్ వచ్చిందేమోనని అదుర్దాగా, ఆత్రంగా ఎక్కణ్ణుంచి ఫోన్ వచ్చిందోనని చూసాడు. ఊళ్ళో ఉన్న వాసుదేవరావు చెల్లెలు వనజ నుంచి వచ్చిందా కాల్.


"ఏం అన్నయ్యా! బాబీగాడు ఇంటికొచ్చాడా?" అందామె ఆతృతగా.


"లేదమ్మా! పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ కూడా ఇచ్చాం." దీర్ఘంగా నిట్టూర్చుతూ నిరాశగా చెప్పాడు.

"అయ్యో...పాపం పసివాడు ఏమైపోయాడో?..." అందామె.


* * * * * * * *


రాత్రంతా నిద్రలేకుండా గడిపారు దంపతులిద్దరూ. చీమ చిట్టుక్కుమంటే ఉలిక్కిపడుతున్నారు. ఏమైనా ఫోన్ వస్తుందేమోనని అలా ఫోన్ వైపు చూస్తూ ఉండిపోయారు. కలత చెందిన ఇద్దరి మనసులూ పరితాపంతో జ్వలిస్తున్నాయి. తమ అశ్రద్ధ వల్లే, కోట్లాటలవల్లే బాబి తమకు దూరమైయ్యాడని కలత చెందనారంభించారు. బాబీ తిరిగి వస్తే, మరెన్నడూ పోట్లాడకోకూడదని ఇద్దరూ ఒకరికొకరు మాటిచ్చుకున్నారు. కనిపించని దేవుళ్ళందరికీ మొక్కుకున్నారు. తెల్లారి అయిదు గంటలయ్యేసరికి మూగన్నుగా నిద్రపట్టింది వసుంధరకి. వాసుదేవరావు కూడా జోగుతున్నాడు.


సరిగ్గా అప్పుడే ఫోన్ రింగవడంతో ఉలిక్కిపడ్డారిద్దరూ. ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు వాసుదేవరావు కిడ్నపార్ల వద్దనుండి వచ్చిందేమోనని ఊహిస్తూ. చూస్తే దూరంగా పల్లెటూళ్ళో ఉండే తన తండ్రి పరంధామయ్య నుండి వచ్చిందా ఫోన్.


'అంటే, తన తండ్రికి కూడా తెలిసిపోయిందా బాబి తప్పిపోయిన విషయం. వాళ్ళకి బాధ కలగకూడదనే తను చెప్పలేదే, వనజ కానీ చెప్పిందో ఏమో? వాళ్ళకి ఏం జవాబు చెప్పాలి?' ఇలా పరిపరి విధాల ఆలోచిస్తూ ఫోన్ ఎత్తాడు.


"హల్లో! వాసూ… బాబీగాడు ఇక్కడే ఉన్నాడు, మీరేం కంగారు పడకండి. మీరిద్దరూ మీమీ వ్యాపకాల్లో పడి వాడ్ని అసలు పట్టించుకోవడం మానేసారు. పైగా రోజూ మీరిద్దరూ ఎప్పుడూ దెబ్బలాడుకోవడంతో పాపం వాడి మనసు పూర్తిగా దెబ్బ తింది. పాపం పసివాడు! ఎవ్వరితోనూ ఏమీ చెప్పుకోలేడు. నిన్న రాత్రి రైలెక్కి తిన్నగా అరగంట క్రితం ఇక్కడికి వచ్చాడు. చాలా సేపు బుజ్జగిస్తే అసలు విషయం చెప్పాడు. మీ కాట్లాటతో పాపం విసిగిపోయాడు వాడు. నయం, ఇంకే అఘాయిత్యం చెయ్యకుండా ఇక్కడికి వచ్చాడు.


ఇకముందైనా మీ మధ్య విభేదాలు మరిచి వాడ్ని జాగ్రత్తగా చూసుకోండి! అలాగైతేనే వాడ్ని మీ దగ్గరకి తిరిగి పంపించేది. లేకపోతే ఇక్కడే మా దగ్గరే ఉండి ఈ పల్లెటూళ్ళోనే చదువుకుంటాడు. పిల్లలపట్ల బాధ్యతగా మసలడం నేర్చుకోండి. మీ అహంకారాలు, పరస్పర ద్వేషాలు వదులుకోండి ఇకనైనా. మీ ఇగోలు కన్నా పిల్లడు ముఖ్యమన్న విషయం ఇప్పటికైనా గుర్తించండి." అని చివాట్లు పెట్టారు బాబి తాతగారైన పరంధామయ్యగారు.


ఆ మాటలు వినగానే వసుంధర, వాసుదేవరావు గాఢంగా ఊపిరి పీల్చుకొని ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. వాళ్ళ మొహాల్లో కళ తిరిగి వచ్చింది. పసివాడైనా బాబి తమకు సరైన గుణపాఠమే నేర్పాడని తెలిసింది వాళ్ళకి. ఇకనుంచి తమ ప్రవర్తన పూర్తిగా మార్చుకోవాలని మనసులో ప్రతిజ్ఞ చేసుకొని ఒకరి చేతులొకరు పట్టుకొని లేచారు. వారి నిర్ణయానికి మనసులోనే హర్షం తెలిపాడు సుధాకర్.

***

దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.



54 views0 comments

Comments


bottom of page