top of page

పరిపూర్ణత కు శ్రీకారం స్త్రీ

Updated: Mar 14

#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #పరిపూర్ణతకుశ్రీకారంస్త్రీ, #ParipurnathakuSrikaramSthree, #TeluguKathalu, #తెలుగుకథలు

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మణులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు. 🌷🌷

Paripurnathaku Srikaram Sthree - New Telugu Article Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 08/03/2025

పరిపూర్ణత కు శ్రీకారం స్త్రీ - తెలుగు వ్యాసం

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


స్త్రీ


పరిపూర్ణత కు శ్రీకారం స్త్రీ. 

మమకారానికి సాకారం స్త్రీ.. 


కరుణతో లాలించినా, కర్తవ్య దీక్షతో పాలించినా, తల్లిగా దీవించినా, ధర్మపత్ని గా నడిపించినా ఆమెకు సాటి ఎవరూలేరు, రారు. అందుకే సృష్టి యావత్తు ఆమె కనుసన్నలలో నడుస్తోంది. విశ్వవ్యాప్తిగా ఉండే చైతన్య శక్తియే స్త్రీ. ఆమెకు నీరాజనాలు పట్టే సంస్కృతి మనది. వేదాలు, ఇతిహాసాలు‌ పురాణాలలో ఆమె పాత్ర అమోఘం. అద్వితీయం. 


"ఉపాథ్యాయాన్ దశాచార్య ఆచార్యానాం శతం పితాః, సహస్రంతు పిత్రూన్ మాతా గౌరవేణాతి రఛ్ఛతే. "


పదిమంది ఉపాధ్యాయుల కంటి ఒక ఆచార్యుడు, వంద మంది ఆచార్యుల కంటే ఒక తండ్రి, వేయి మంది తండ్రుల కంటే ఒక తల్లి సదా పూజనీయురాలు అని మనుస్మృతి చెబుతున్నది. 


"మాతృ దేవో భవ, పితృ దేవోభవ " అని తల్లికే తొలి నమస్కారం చేయాలి అని ఉపనిషత్తులు చెపుతున్నవి. 


'శ్రీ ' (సంపద), స్త్రీ ( భార్య) ఈ రెండిటితోనే పురుషుడికి పూర్ణత్వం సిధ్దిస్తుంది. ఆమె తోనే ఆ ఇల్లు కళకళ లాడి ఆ వంశం వృధ్ధి చెందుతుంది. స్త్రీ దుఃఖించ కూడదు, ఆమె ఖేదం ఆ వంశ నాశనం అని కూడా మను స్మృతి చెబుతున్నది. 


"పితా రక్షతి కౌమారే, భర్తా రక్షతి స్థావిరే, 

పుత్రా నస్త్రీ స్వాతంత్ర్య మర్హతి". అని స్త్రీ రక్షణ బాధ్యత పురుషునికే అప్పగించాడు మనువు. బాల్యంలో తండ్రి, యౌవనంలో భర్త, కౌమార, వృథ్థాప్యంలో బిడ్డలు ఆమెకు రక్షణ కల్పించాలని మను థర్మం శాసిస్తున్నది. 


"యత్ర నార్యేస్తు పూజ్యంతే రమంతే తత్రదేవతాః". ఎక్కడ స్త్రీని పూజిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారు. అందుకే స్త్రీ సర్వత్రా పూజ్యనీయురాలు. ఆమెకే అగ్రతాంబూలం. 


అతని శక్తి " వధువే. " 


వివాహమంత్రాలు వధువుని మహారాణి గా పేర్కొన్నాయి. "గ్రృహాన్గఛ్ఛ గ్రృహపత్నీ చథా సోవశినీత్వం విదధమాదాసి" అని ' నీవు మా ఇంటికి అతిథిగా వచ్చి, అధిపతిగా మారి మాచే పుణ్య కార్యాలు, యజ్ఞ యాగాలు చేయించి మమ్మల్ని ముందుకు నడిపించటానికి మా ఇంటికి రావాలి ' అని వరుడు వథువుని పెళ్ళిలో హామం చేసేటప్పుడు ప్రాధేయపడతాడు. 


కన్యాదాన సమయంలో తండ్రి ఆమెను లక్ష్మీ స్వరూపంగా భావించి కన్యాదానం చేస్తాడు. అందుకే వథువుని సర్వాలంక్రృతురాలిని చేసి నడిపించకుండా ధాన్యం పోసిన వెదురు బుట్టలో మంగళ వాయిద్యాలతో తీసుకుని వస్తారు. వివాహ తంతు అయినాక కూడా ఆమె ను నడిపించకుండా " ఉత్తరా రథస్యోత్తంభనీ, వాహావుత్తరాభ్యాం యన్నక్తిః’; ‘అరోహయన్తీముత్తరాభి రభిమన్త్రయతే’.. - రథం మొదలైన వాహనాల మీద కూర్చోపెట్టి వరుడి ఇంటికి తీసుకు వెళ్లాలని వివాహమంత్రాలు చెబుతున్నాయి. 


మొత్తం వివాహ ప్రక్రియలో వరుడే వధువుని తనకు భార్యగా ఉండాలని "నాతిచరామి" అని వరుని చేతే ప్రమాణం చేయించి, ఆమెను అభ్యర్థించి, ఆమె అనుమతి మేరకే తన ఇంటికి తీసుకువెళ్లాలని వేద మంత్రాలు వల్లిస్తున్నాయి. 


నవమాసాలు మోసి, మరోజన్మ (ప్రసవం) ఎత్తి బిడ్డ కు ప్రాణం పోసే ప్రాణ శక్తి స్త్రీ. 

భర్త ను సేద తీర్చే చైతన్య శక్తి స్త్రీ. 

మనిషిని పోరాట యోథునిగా తీర్చి దిద్దే శక్తి స్త్రీ. 

తన శ్వాసను వదిలైనా సరే బిడ్డకు శ్వాసను అందించాలని నిస్వార్థంగా కోరుకునే ప్రాణి ఈ భూమి మీద కేవలం ఆమె మాత్రమే. 


అందుకే వేదాలన్నీ ఆమెకు అంతటి ప్రాముఖ్యత ఇచ్చాయి. కనుకనే ఆమె " వేద స్వరూపిణి " అయినది. 


….నీరజ  హరి  ప్రభల.










Comments


bottom of page