top of page

పరిష్కారం


'Parishkaram' - New Telugu Story Written By Gorthi VaniSrinivas

'పరిష్కారం' తెలుగు కథ

రచన: గొర్తి వాణిశ్రీనివాస్

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఆ ఇల్లు అత్తగారి రాకతో రణరంగంగా మారింది. చిన్నగా మొదలైన సాధింపుల ఉద్యమం క్రమంగా మొహం మీదే కడిగేసేంత తీవ్ర దుమారం రేపింది. ఏమాత్రం మొహమాటం లేకుండా మనసులో ఉన్నది పైకి అనేస్తున్న అత్త అనసూయ వాలకానికి విస్తుపోయాడు మోహన్.


అనసూయ భర్త పోయి పదేళ్ళయింది. అతనుండగా అతనితో ఏమాత్రం సంతోషం లేదని వాపోయేది. తను తమలపాకుతో రాస్తే అతను తలుపు చెక్కతో జవాబు చెప్పేవాడు. అంత సరసత ఏమాత్రం తెలీని ముక్కోపి. తాగుడు ఆభరణం, వాగుడు అలంకారం. అలాంటి మనిషితో పడీ పడీ విసిగిన అనసూయకు మనసు కరుడుగట్టిన కంచుకాగడాగా మారింది. అనసూయకు ఒక్కతే కూతురు కావడంతో గారాబంగా పెంచుకొచ్చింది. హైదరాబాద్ లోనే మంచి కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేసింది.


ఇంట్లో కూతురూ లేక, భర్తా లేక ఒంటరిదైపోయింది అనసూయ. ఒక్కసారిగా అంత ప్రశాంతతను తట్టుకోలేకపోయింది. నాలుగురోజులకోసారి కూతుర్ని చూసి వస్తూ ఉండేది. మానసకి ఇద్దరు పిల్లలు పుట్టారు. వియ్యపురాళ్లిద్దరూ కలిసి పురుళ్లు పోశారు. చాలా కాలం సజావుగానే సాగింది.

కొన్నాళ్ళకి "మానసా! నేనొక్కదాన్నే వుండలేనే. నాకూ మీ ఇంటిదగ్గరే ఓ ఇల్లు చూడు. నిన్నూ పిల్లల్నీ చూసుకుంటూ ఉంటాను. " అంది అనసూయ.


"సరేనమ్మా.. నువ్వూ మాకు దగ్గర్లో ఉంటే ఏ బెంగా ఉండదు" అంది మానస.


మోహనే మంచి ఇల్లు అద్దెకి చూసి సామాన్లతో సహా అత్తగారిని తెచ్చి ఆ ఇంట్లో ఉంచాడు. రోజూ సాయంత్రం కూతురు వచ్చేవేళకు వెళ్లి, అక్కడి తిండి తిప్పలు కానిచ్చి, రాత్రికి తన ఇంటికి చేరుకుంటుంది. చాలా రోజులు మామూలుగానే గడిచాయి. మానస అత్తగారితో అంత కలివిడిగా మాట్లాడటం, మంచి చీరలు కొనడం, ఆవిడ అవి కట్టుకుని భర్త పక్కన కూర్చోవడం, ఇద్దరి అన్యోన్యతా చూసిన అనసూయలో ఒక విధమైన ఉక్రోషం బయల్దేరింది. కానీ బయట పడకుండా జాగ్రత్త పడింది.


"ఏమే, మీ అత్తగారికి ఈ వయసులో అంత చేటు సరసం అవసరమా? ఎప్పుడూ మొగుడ్ని ఆనుకుని కూర్చుంటుంది. ఇద్దరూ ఇకయికలూ పకపకలూ. కానీ భలే అన్యోన్యతే వాళ్ళది" అంది.


"అవునమ్మా.. ఆదర్శ దంపతులు వాళ్ళు. " అంది మానస.


"నిజమేనే. దంపతులంటే వాళ్లే. మీరిద్దరూ కూడా అలా ఉండాలి" అని చెప్పింది.

తల్లి తన మంచి గురించి ఆలోచిస్తోందని సంతోషించింది మానస. ఓరోజు మానస ఆఫీసునుంచి ఇంటికి వచ్చింది. రోజూ వచ్చే తల్లి ఆరోజురాలేదు. మానస ఫోన్ చేసింది.


"అమ్మా, రాలేదే. ఒంట్లో బాలేదా?" అంది.


"ఒంట్లో బాగుంది. మనసే బాలేదు" అంది అనసూయ.


"అదేంటమ్మా అలా అన్నావ్. అసలేమైంది?"


"మీ ఇంట్లో విషయాలు నాకెందుకులేమ్మా. ఇక మీదట మీఇంటికి నేను రాను. నువ్వే వచ్చి వెళుతూ వుండు" అంది.


"నువ్వలా బాధపడటం నేను చూళ్ళేను. అసలేమైందో చెప్పమ్మా" అంది.


"నువ్వు ఇంతలా అడుగుతున్నావ్ కాబట్టి చెబుతున్నాను. నిన్న నువ్వు అటు వెళ్ళగానే మీ అత్తా మామ కూర్చుని నీ గురుంచే మాట్లాడుకున్నారు. నువ్వంటే వాళ్ళకి గొప్ప అలుసుగా ఉంది. నిన్ను చులకన చేసి మాట్లాడ్డం నేను వినలేకపోయాను. కడుపున పుట్టిన పిల్లవి. నా తీపి నాది. జాగ్రత్తగా వుండు. " అంది.


"అమ్మా.. నువ్వు రావడం మానేస్తే నా మీద కొట్టే. నువ్వసలు నాదగ్గరే ఉండాలి. వాళ్ళ మాటలు పట్టించుకోకు. నేను చూసుకుంటాను. " అంది మానస.


ఆరోజునుంచీ అనసూయ రాకపోకలు మొదలయ్యాయి. కానీ అత్తా మామలు కలిసి కూర్చుని మాట్లాడుకునేతప్పుడు తన గురించేనేమో అని మానస ఆలోచించసాగింది. మానసకి అమెరికన్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్. రాత్రి షిఫ్ట్. ఏడు గంటలకి కూర్చుంటే తెల్లారి ఆరుగంటలకు పూర్తవుతుంది. వర్క్ పూర్తి కాగానే మొహం కడుక్కుని కాఫీతాగి పడుకుంటుంది మానస.


అత్తగారు వంట పని చూస్తుంది. అనసూయ మిగతాపన్లు చూసుకుంటుంది. కాలం గడుస్తుంటే అనసూయలో అసహనం పెరిగింది. అల్లుడు జాబ్ కి పొద్దున్నే వెళ్ళిపోతాడు. కూతురు పగలంతా పడుకునే ఉంటుంది. రాత్రిపూట తన గదిలో తలుపేసుకుని ఉద్యోగంలో ఉంటుంది. తను ఎవరితో మాట్లాడాలి. ముసలి భార్యా భర్తలిద్దరూ కబుర్లు చెప్పుకుంటుంటే కుతకుత ఉడికిపోయేది.


ఉన్నట్టుండి ప్లేట్లు ఎగిరి పడటం, గ్లాసులు దొర్లిపోవడం, అరుపులు వినబడడంతో మానస బయటకొచ్చి "ఏంటమ్మా పడుకోనివ్వవు. పన్లు కాస్త మెల్లిగా చేయొచ్చుగా" అంది.


"అవునమ్మా, నీ ఇంట్లో నోరుమూసుకుని అడ్డమైన వాళ్ళకీ గాడిద చాకిరీ చేస్తూ ఉంటా. కొంత మంది తీరిగ్గా కూర్చుని కులుకుతూ వుంటారు" అంది అనసూయ మూతి వంకర్లు తిప్పుతూ.


ఆ మాటలు భర్త, అత్తమామలు విన్నారని తెలిసి మానస ప్రాణం చచ్చిపోయింది. తల్లిని గదిలోకి పిలిచింది.


"ఏంటమ్మా ఆ మాటలు. వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించవా. ఏదనిపిస్తే అది అనేస్తావా? నా పెళ్ళికి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో మర్చిపోయావా? నాన్న బాగా తాగి, షుగర్ పెరిగి, హాస్పిటల్ పాలయ్యారు. అప్పుడే ఆయనకి క్యాన్సర్ ఉందని తెలిసింది. అటువంటి పరిస్థితుల్లో నా పెళ్లి ఎలా అవుతుందా అని నువ్వెంతగా ఏడ్చావో గుర్తులేదా.


మోహన్ నా విషయాలన్నీ తెలుసుకుని నీ కుటుంబాన్ని నేనాదుకుంటానని ముందుకొచ్చారు. ఆదర్శంగా కానీ కట్నం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నారు. ఆ మాత్రం కృతజ్ఞత లేకుండా వాళ్ళ అమ్మానాన్నల్ని నువ్వన్ని మాటలనడం నాకు నచ్చలేదు" గట్టిగా తల్లిని మందలించింది మానస.


"అనమ్మా అను. నా చేత నీ ఇంటిల్లిపాదీ చాకిరీ చేయించుకుని నన్నే అనండి. పడటానికి పాపిష్ఠిదాన్ని నేనున్నానుగా" అంటూ ఏడుపులూ రాగాలూ మొదలుపెట్టింది.


"అందరం కలిసి వున్నప్పుడు పనులు పంచుకోవాలికదమ్మా. ఇందులో ఎక్కువ తక్కువలు ఏమున్నాయి?" అంది మానస తల్లికి నచ్చచెప్పే ధోరణిలో.


"అలా కాదుగానీ మీ అత్తా మామల్ని మీ మరిది దగ్గరకు పంపై. వాళ్ళు నీ ఒక్కదానిదగ్గరే ఎందుకుండాలి. వాళ్ళకి ఇంకా పిల్లలున్నారుగా. వెళ్ళమని చెప్పు. కొన్నాళ్లు ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఈరాత్రికే మోహన్ కి కూడా చెప్పు. నీ సొమ్ము గట్టి పరుచుకో"


తల్లి మాటలకు తలపట్టుకుంది. రాత్రంతా ఆలోచించి తెల్లవారి ఒక నిర్ణయానికొచ్చింది. "అమ్మా నేను పిల్లల్ని తీసుకుని నీ ఇంటికి వచ్చేస్తాను. పద ఇద్దరం వెళదాం. నీకు నా అత్తామామలతోనేగా సమస్య. మనమే వెళ్లిపోదాం పద" అంటూ తనవీ పిల్లలవీ బట్టలు సర్దుకుని తల్లి ఇంటికి వచ్చేసింది మానస.


మోహన్ తల్లిదండ్రులు మానస నిర్ణయానికి షాక్ తిన్నారు. తమ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కుమిలిపోయారు. అనసూయ కూతుర్నీ, పిల్లల్నీ అత్తగారి ఇంటినుంచి దిగ్విజయంగా తన ఇంటికి తెచ్చానని మురిసిపోయింది. చెట్టుకి కాయ భారమా? ఎక్కడుంటే ఏంటి?అక్కడ చాకిరీ కన్నా ఇక్కడ ఉండటమే హాయి అని ఇరుగుపొరుగు వాళ్ళతో చెప్పింది. విన్నవాళ్ళు ముక్కుమీద వేలేసుకున్నారు. ఏమీ అనలేక ఊరుకున్నారు. నెల గిర్రున తిరిగొచ్చింది. హౌస్ ఓనర్ అద్దె కట్టమని ఫోన్ చేసాడు.


"ఇంకా అద్దె కట్టలేదా? ఓనర్ ఫోన్ చేసాడు. త్వరగా కట్టెయ్యి" అంది మానసతో.


"నేనెందుకు కడతాను. ఇన్నాళ్లూ నీ ఇంటి అద్దె మీ అల్లుడుగారే కట్టారు. అదంతా ఆయనకే తెలుసు. ఆయన్నే అడుగు" అంది మానస.


ఏదో విధంగా డబ్బులు సర్దుబాటు చేసి ఆ నెల ఇంటద్దె కట్టేసింది అనసూయ.


"అమ్మాయ్ సరుకులు నిండుకున్నాయి. డబ్బులివ్వు కొనుక్కొస్తా" అంది.


"నా జీతం డబ్బులు నా బండి, లాప్టాప్ ఈ ఎం ఐ లకే సరిపోతుంది. ఇంట్లో ఏం కావాలన్నా మీ అల్లుడే తెచ్చేవారు. నాకేం తెలీదు" అంది.


అనసూయ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఏదో విధంగా ఆ నెల సరుకులు తెచ్చి మ్యానేజ్ చేసింది. పొద్దున లేచిన దగ్గర్నుంచీ రాత్రి పడుకునే వరకూ పని తప్ప విశ్రాంతి లేకుండా పోతోంది. పొద్దున్నే లేచి వంటచేసి పిల్లలకు బాక్సులు కట్టి, వాళ్ళకి తినిపించి బడికి పంపించడం. గిన్నెలు, బట్టలు పన్లు కానిచ్చి వంటచేసి తిని నడుంవాల్చేసరికి బడి నుంచి పిల్లలు తిరిగొచ్చి "అమ్మమ్మా ఏవన్నా పెట్టవా" అనడం. ఇలా రోజూ రోబో లా అయిపోయింది అనసూయ పరిస్థితి.


కూతురు చూస్తే పగలు నిద్ర, రాత్రి ఉద్యోగం. ఏ పనికీ ఆశలేదు. పోనీ డబ్బులిస్తుందా అంటే అదీ లేదు. ఈ గాడిద చాకిరీ నాకెందుకొచ్చింది భగవంతుడా అని తలపట్టుకుంది. రాత్రంతా బాగా ఆలోచించి తెల్లారి కూతుర్ని పిలిచి "అమ్మాయ్. భర్తని వదిలి ఇక్కడ ఎన్నాళ్లని వుంటావ్. పిల్లలూ తండ్రి కోసం కలవరిస్తున్నారు. ఆడపిల్ల పుట్టింట్లో ఉండటం మంచిది కాదు. ఇప్పటికే ఇరుగుపొరుగువాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. మీ ఇంటికి పోదాం పద" అని తట్టా బుట్టా సర్దుకుని కూతుర్ని, పిల్లల్ని తీసుకుని మానస ఇంటికి వచ్చేసింది అనసూయ.


భార్యా పిల్లల్ని చూసి మోహన్ సంతోషించాడు. అనసూయకు కూడా సంతోషం కలిగింది. ఎందుకంటే మానస అత్తా మామలు అక్కడ లేనందుకు. వాళ్ళ చిన్న కొడుకుంటికి వెళ్లారు. ఆడుతూ పాడుతూ పని చేసుకోవచ్చు అనుకుంది అనసూయ. కానీ కత్తి పోయి డోలు వచ్చే డాం డాం డాం అన్నట్టు. అల్లుడుకీ పిల్లలికీ వండిపెట్టి వాళ్ళకి బాక్సులు ఇచ్చి బయటకు పంపేసరికి తలప్రాణం తోకకొస్తోంది. నానా హైరానా పడిపోయింది.


కూతురు ఎప్పటిలా పగలు నిద్ర. రాత్రి ఆఫీస్ పనిలో ఉంటుంది. ప్రశాంతంగా కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టింది అనసూయ. ఈ ఇంట్లో మానస అత్తా మామా ఉన్నప్పుడు తనకు ఇంత పని ఉండేది కాదు. వంటంతా ఆవిడే చేసేది. కూరలు తరగడం దగ్గర్నుంచి అన్ని పనుల్లో భార్యకి చేదోడుగా ఉండేవాడు ఆ ముసలాయన. పిల్లలకి తినిపించడం, వాళ్ళకి బట్టలు తొడిగి, షూస్ వేయడం కూడా చేసేవాడు.


తనల్లా పైపని చూసుకునేది. దానికే నానా హైరానా పడి వాళ్ళని తిట్టి, తన నోరు బయట పడేసుకుంది. నిజానికి మోహన్ తనని అన్ని విధాలా ఆదుకున్నాడు. ఆ విశ్వాసం లేకుండా వాళ్ళని అన్ని మాటలు అని తప్పు చేశానని తెలుసుకుంది అనసూయ. తను గతంలో వాళ్ళని అన్నవన్నీ ఆ ఇంట్లో ప్రతిధ్వనించాయి. చ.. నేనింత కర్కశంగా ఎప్పుడు మారాను. కూతురి అత్తవారింట్లో నా పెత్తనం ఏంటి? ఎవరెక్కడుండాలో అక్కడుండాలి అనుకుని సిగ్గు పడింది.


"అల్లుడూ. నేను చాలా తప్పు చేశాను. నా స్థితిగతులు తెలిసి కూడా నువ్వు మమ్మల్ని ఆదరణగా చూశావు. ఏమీలేని విస్తరాకు ఎగిరి పడుతుందని నా అర్హతను మరిచిపోయి ప్రవర్తించినందుకు నన్ను క్షమించు. నేను నా ఇంటికి వెళ్లిపోతాను" అంది అనసూయ.


"అలా అనకండి అత్తయ్యా. మానసకి మా వాళ్ళు ఎంతో, మీరూ నాకంతే. ఇద్దరం ఉద్యోగస్తులం. మా ఇద్దరికీ మీరూ మా అమ్మా అండగా ఉంటేనే మాకు ధైర్యం. మీరు ఇక్కడే వుండండి ఎక్కడికీ వెళ్లొద్దు. "అన్నాడు మోహన్.


మోహన్ తల్లిదండ్రులు అప్పుడే ఊరినుంచి వచ్చారు. వాళ్ళని కుశలాలడిగి మంచినీళ్లిచ్చి, కాఫీ పట్టుకొచ్చింది అనసూయ.


"ఈరోజు వంట ఏం చెయ్యమంటారు వదినగారూ. మీరు స్నానాలు చేసిరండి. క్షణంలో చేసేస్తా" అంది అనసూయ.


ఆమెలో వచ్చిన మార్పు చూసి ఆనందించారు ఆ దంపతులు. "మీకెందుకు శ్రమ వదినగారూ, ఇన్నాళ్ళూ మీరెంతో కష్టపడి చేశారు. ఈరోజు నుంచి నేను చేస్తాను లేండి" అంది మానస అత్తగారు.


వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటే మోహన్ మానసని తీసుకొచ్చి ఆ అద్భుత దృశ్యాన్ని చూపించాడు. మానస కళ్ళు సంతోషంతో మెరిశాయి. ఎవరికి వారు మారాలి తప్ప ఎదుటివాళ్ళు ఎంత చెప్పినా మార్పు రాదు. నోటితో చెప్పడం కంటే మార్పు వచ్చేలా చేయడం మంచిదని చెప్పి మోహన్ తనని పుట్టింటికి పంపించిన సంగతి గుర్తొచ్చి భర్తకి కళ్లతోనే కృతజ్ఞతలు చెప్పింది మానస.


నేటితరంలో భార్యా భర్తల తల్లిదండ్రులు ఒకరితో ఒకరు సర్దుకుపోతేనే పిల్లలు సుఖంగా ఉద్యోగాలు చేసుకుంటూ అటు వాళ్ళని, ఇటు వీళ్ళని సమానంగా చూసుకోగలుగుతారని చెప్పిన భర్త ముందు చూపుకు సంతోషించింది మానస..

***


గొర్తి వాణిశ్రీనివాస్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)

నా పేరు గొర్తివాణి

మావారు గొర్తి శ్రీనివాస్

మాది విశాఖపట్నం

నాకు ఇద్దరు పిల్లలు

కుమార్తె శ్రీలలిత ఇంగ్లండ్ లో మాస్టర్స్ చేస్తోంది

అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

రచనల మీద ఎంతో మక్కువతో

కవితలు, కథలు రాస్తున్నాను.

విశాలాక్షి, సాహితీకిరణం, సాహో,సహరి,విశాఖ సంస్కృతి,సంచిక,

ప్రస్థానం, కథా మంజరి, హస్యానందం, నెచ్చెలి, ధర్మశాస్త్రం, ఈనాడు,షార్ వాణి తెలుగుతల్లి కెనడా, భిలాయి వాణి, రంజని కుందుర్తి  వంటి  ప్రముఖ   సంస్థలు నిర్వహించిన పలు పోటీలలో బహుమతి అందుకోవడం ఒకెత్తైతే మన తెలుగు కథలు. కామ్ వారి వారం వారం కథల పోటీలలో బహుమతులు అందుకోవడంతోపాటు

ఉత్తమ రచయిత్రిగా ఎంపిక కాబడి రవీంద్రభారతి వేదికగా పురస్కారం దక్కడం నా రచనా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచింది.


మానవ సంబంధాల నేపథ్యంలో మరిన్ని మంచి రచనలు చేసి సామాజిక విలువలు చాటాలని నా ఈ చిన్ని ప్రయత్నం. మీ అందరి ఆశీర్వాదాలను కోరుకుంటూ

గొర్తివాణిశ్రీనివాస్

విశాఖపట్నం

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.






2 Comments


@srinivasgorty3375 • 15 hours ago

Baaga chadivaru sir!

Like

@vanigorthy6887 • 17 hours ago

బాగా చదివారండీ

Like
bottom of page