top of page

పార్క్ బెంచి


'Park Bench' - New Telugu Story Written By Jidigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 25/10/2023

'పార్క్ బెంచి' తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

శంకరం, పార్వతి లకి వివాహం అయిన దగ్గరనుండి, భర్తకి కావలిసినవి అన్నీ అమర్చి శంకరాన్ని ఆఫీస్ కి పంపేది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి అన్నం పెట్టి, వాళ్ళచేత హోంవర్క్ చేయించి, సాయంత్రం మళ్ళీ భర్త ఆఫీస్ నుంచి వచ్చేసరికి వంట తయారు చేసేది. ఈ విధంగా ముప్పై సంవత్సరాలు గడిచిపోయాయి.


కొడుకు శ్రీకాంత్ కి పెళ్లి అయ్యింది. కోడలు కూడా శంకరాన్ని తండ్రిలా చూసుకునేది. కొడుకు ఉద్యోగం, వున్న ఊరిలోనే. హాయిగా అమ్మ చేసిన భోజనం, నాన్న యింటి బాధ్యత తో కష్టం తెలియకుండా జరిగిపోతోంది.


కాలం, సుఖంగా వుంటే చూడలేదు అన్నట్టుగా శంకరం కొడుకు శ్రీకాంత్ ఒకరోజు తండ్రితో అన్నాడు ‘తనకి ఢిల్లీలో ఒక ఫారిన్ కంపెనీలో మంచి జాబ్ దొరికింది’ అని, ‘యిప్పుడు వున్న ఉద్యోగం లో తనకి ఎదుగుదల ఉండదు’ అని.


“అక్కడ కొత్త ఉద్యోగం లో జీతానికి యిప్పుడు వచ్చే జీతానికి ఎంత తేడా వుంటుంది” అని అడిగాడు కొడుకుని.


“జీతం గురించి కాదు డాడీ, ఆ ఉద్యోగంలో కొన్నాళ్ళ తరువాత అమెరికా కి కూడా పంపుతారు” అన్నాడు కొడుకు శ్రీకాంత్.


“యిక్కడ బాగానే వుంది కదరా, నా పెన్షన్ తో ఇంటి ఖర్చులు వెళ్లిపోతున్నాయి, నీ జీతం నీకు మిగులుతోంది, వేరే వూరిలో యింటి అద్దె, ఖర్చుల తో నీకు మిగిలేది సున్నా. మేమా కదలగలిగే స్థితిలో లో లేము. తల్లిదండ్రుల అండలో వున్న సుఖం విడిగా వుంటే దొరకదు, బాగా అలోచించి నిర్ణయం తీసుకో” అన్నాడు కొడుకుతో.


“లేదు మామయ్యగారు.. నేను చదివిన సబ్జెక్టు కి నాకు ఢిల్లీ లో అయితే ఉద్యోగం దొరుకుతుంది. అప్పుడు మా యిద్దరి జీతాలు బాగానే సరిపోతుంది” అంది కోడలు వాణి.


“నువ్వు యిష్టపడ్డాక యింకా నాదేముంది తల్లీ, అలాగే వెళ్ళండి” అని, భోజనం కి లేచాడు.


రాత్రి భార్య ని ఆడిగాడు “వాడు చెప్పింది విన్నావా, లేకపోతే చింతకాయ పచ్చడి చేసుకుంటో కూర్చున్నావా” అని.


“చూడండి, అనవసరంగా వాడిని యిబ్బంది పెట్టకండి, పెళ్లి అయిన మర్నాడే వేరే కాపురం పెట్టే కొడుకులు, కోడళ్ళు వున్న రోజులలో మనవాళ్ళు మనదగ్గర నాలుగు సంవత్సరాలు వున్నారు. మనలాగా గుమస్తా ఉద్యోగాలు కావు ఒకేచోట పడుండటానికి. ఇంజనీర్ ఉద్యోగం అంటేనే వాళ్ళ ప్లానింగ్ వేరుగా వుంటుంది” అంది పార్వతి.


“అదే నేనూ అనేది, వాళ్ళ ప్లాన్ వేరే అని. కోడలికి పర్వాలేదు నెగ్గుకు వస్తుంది, మనవాడే అమాయకుడు, ఏమి యిబ్బంది పడతాడో అని భయం ఒక పక్కన. వాడు కారు రాష్ డ్రైవింగ్ తో ఏ యిబ్బంది తెచ్చుకుంటాడో అని భయం ఒక పక్కన” అన్నాడు శంకరం.


“అన్నిటికి దేముడు వున్నాడు, మనం ఎవ్వరికి అపకారం చెయ్యలేదు, మనకి ఏ అపకారం జరగదు” అంది భర్తతో పార్వతి.


“సరే కానీ! ఎలా జరిగితే అలా జరుగుతుంది” అన్నాడు.

“అమ్మా! ఈ వారం లో వరుసగా రెండు రోజులు మంచివి ఎప్పుడో చూసి చెప్పితే, మేము ఢిల్లీకి బయలుదేరి వెళ్తాము. ఈ వారం లో ఉద్యోగం లో జాయిన్ కావాలి” అన్నాడు కొడుకు శ్రీకాంత్.


గోడకి వున్న క్యాలెండరు తీసుకుని చూసి, “బుధవారం, గురువారం మంచిదే, వర్జ్యం లేకుండా చూసుకుని ఉద్యోగం లో జాయిన్ అయితే మంచిది” అంది పార్వతి.


“అయితే బుధవారం ఫ్లైట్ కి వెళదాం అండి, మీరు గురువారం జాయిన్ అవ్వవచ్చు” అంది మొగుడితో కోడలు వాణి.


బుధవారం తెల్లవారుజామున ఫ్లైట్ అవడం తో అలారం పెట్టుకుని నాలుగు గంటలకల్లా తయారు అయిపోయారు. మనవడు యింకా నిద్రలోనే వున్నాడు. వాడిని భుజం మీద వేసుకుని, “అమ్మా, నాన్నా! టాక్సీ వచ్చింది మేము బయలుదేరుతాము” అన్నాడు శ్రీకాంత్.

కోడలు వాణి రెండు సూట్ కేసులు లాగుకుంటో బయటకు నడిచింది.


శంకరం పార్వతి బయటకు వచ్చి గేటు దగ్గర నిలబడి, “..అబ్బాయి, అమ్మాయి జాగ్రత్త గా వుండండి, కొత్త ప్లేస్ లో అలవాటు అయ్యే అంతవరకూ నువ్వు ఒక్కదానివే బయటకు వెళ్లకు” అని కోడలికి చెప్పారు.


కారు ఎక్కుతూ తల్లిదండ్రుల వంక ఒకసారి చూసాడు శ్రీకాంత్. తండ్రి ఎందుకో వణుకుతో వున్నట్టు అనిపించింది. బహుశా తను వెళ్లిపోతున్నందుకా లేక చలికో అనుకుని, “నాన్నా, త్వరగా యిక్కడ యిల్లు ఖాళీ చేసి మీరుకూడా వచ్చేద్దురుగాని, నేను ఎక్కడ వుంటే మీరు అక్కడే వుండాలి” అన్నాడు తడి కళ్ళు తుడుచుకుంటూ శ్రీకాంత్.


గేటు వేసి లోపలికి వస్తో “ఏమిటో సృష్టి విచిత్రం, ఈ కలవడాలు, విడిపోవడాలు” అన్నాడు శంకరం భార్య తో.


“ఏది ఆలోచించక పడుకోండి, యింకా తెల్లవారలేదు, యివి ప్రతీ యింట్లోను జరిగివే” అంది పార్వతి.


ఏడాది గడిచింది. ఈ ఏడాది లో కొడుకు కోడలు ఒకసారి, కొడుకు ఒక్కడే ఒకసారి వచ్చి వెళ్లారు.


“యిహ మీరు కూడా మాతోనే వుండండి” అంటున్న కొడుకు తో “పర్వాలేదు లే, మాకు ఓపిక లేనప్పుడు ఎలాగో మేము నీ దగ్గరికి రాక తప్పదు, కొన్నాళ్ళు యింకా యిక్కడే వుంటా”మని చెప్పి పంపించాడు కొడుకు ని.


“ఎంతవరకు వీడు రమ్మని గొడవే కానీ నీ కోడలు కదా వండిపెట్టాలిసింది, తను ఒక్కసారి కూడా ఆ మాట ఎత్తదే” అన్నాడు భార్యతో.


“ఏ పిల్లకి మనసులో ఏమి వుండదు అండీ, వస్తే గౌరవంగా చూసుకుంటుంది, వెళ్తోవుంటే నిమిత్తం గా వుంటుంది, అంతే. అయినా మనల్ని ఒకళ్ళు పిలవాలా, మనం కావాలంటే వెళ్తాము, లేదంటే లేదు. మనలో మనకి పిలుపులు కావాలా” అంది నవ్వుతో పార్వతి.


‘తను ఎప్పుడు అంతే, దేనికి బాధ పడదు., మనసులో ఏముందో కూడా తెలియనివ్వదు’ అనుకున్నాడు భార్య వంక చూసి.


కాలం వేగంగా గడిచిపోతుంది, దంపతులిద్దరూ రెండు సార్లు కొడుకు దగ్గరికి వెళ్లి వచ్చారు. శంకరం కి ఢిల్లీ నచ్చలేదు. అందరూ హింది వాళ్ళు, ఎవ్వరూ పలకరించే అలవాటు లేదు. గుడ్డిలో మెల్లలా కొడుకు వున్న యింటికి ఎదురుగా పెద్ద పార్క్ వుంది. ఢిల్లీలో వున్న రోజులు కిటికీలోనుంచి పార్కులో తిరిగే జనం ని చూస్తో వుండేవాడు శంకరం.


రోజూ ఉదయమే లేచి కాఫీ తాగుతో టీవిలో సుప్రభాతం వినే పార్వతి ఆ రోజు యింకా లేవకపోవడం తో, “ఇదిగో ఎనిమిది అయింది, యింకా పడుకున్నవే” అని పిలిచాడు భార్య ని శంకరం.


భర్త పిలుపు కి నీరసంగా కళ్ళు తెరిచి, “అప్పుడే ఎనిమిది అయ్యిందా” అంటూ లేచింది.


“నేను కాఫీ తాగేసాను, నీకు డికాషన్ రెడీ” అన్నాడు శంకరం.


పొలం దగ్గరికి వెళ్లి పన్నెండు గంటలకు భోజనం కి వచ్చిన శంకరంకి భోజనం వడ్డీస్తో, “ఏమండీ మనం అబ్బాయి దగ్గరికి వెళ్లి వుండిపోదాం అండీ, ఎందుకో నాకు యిక్కడ ఉండాలి అనిపించడం లేదు, ఏదో తెలియని భయం పట్టుకుంది” అంది పార్వతి.


ముద్ద నోట్లో పెట్టుకోబోతో భార్య వంక చూసాడు శంకరం. ఎందుకో బాగా ముసలిది అయినట్టు అనిపించింది. తనకి అరవై ఎనిమిది నిండింది, తను రెండేళ్లు చిన్న అయినా ఈరోజు ఎందుకో వాడిపోయినట్టు అనిపించింది. “సరే అలాగే వెళ్ళిపోదాం, ఈ యిల్లు అద్దెకు యివ్వాలి అంటే రంగులు వేయించటానికి ఒక నెల టైమ్ పడుతుంది. అబ్బాయి కి ఫోన్ చేసి చెప్పాలి” అన్నాడు.


“నిజంగానే వచ్చేస్తారా” అని అడిగాడు శ్రీకాంత్ తండ్రి చెప్పిన విషయం విని.


“నిజమే రా, మీ అమ్మకి నీ దగ్గర ఉండాలి అని నిర్ణయం చేసుకుంది, సరే మా చివరి రోజులు నీ దగ్గర గడపడం మంచిది అనిపించింది, యిల్లు అద్దెకు యిచ్చేస్తాను. రంగులు వేసే వాడికి పని అప్పగించాను. నువ్వు ఒక నాలుగు రోజులు సెలవు పెట్టుకుని వస్తే కొంత సామాను పొలం దగ్గర వున్న యింట్లో పడేసి నీకు అవసరమైనవి ఢిల్లీకి పంపించేసి మమ్మల్ని నీతో తీసుకుని వెళ్ళు” అన్నాడు శంకరం. “పనిలో పని కోడలికి కూడా చెప్పు మేము వచ్చేస్తున్నామని, సంతోషిస్తుంది” అన్నాడు.


మొత్తానికి ఢిల్లీ చేరుకున్నారు. “మామయ్యగారు కొద్దిగా చిక్కినట్టు వున్నారు” అన్న కోడలు తో “యిహ నీ చేతి వంటతో మళ్ళీ బరువు పెరిగిపోతానులే” అన్నాడు శంకరం.


ఆ మాట వాణికి నెత్తిన బరువు పెట్టినట్టు అనిపించింది. మనవడితో మాట్లాడుతూ కూర్చున్నాడు శంకరం.


“ఒరేయ్ తాతయ్య ఎక్కడికి వెళ్లారు, మాట్లాడింది చాలు చదువుకో” అని వంటగదిలో నుంచి అరిచింది కోడలు.


“నాన్నా! వాడికి కొద్దిగా చదువు చెప్పండి, మీకు టైమ్ పాస్ అవుతుంది” అన్నాడు కొడుకు శ్రీకాంత్.


“అలాగే! రేపటి నుంచి ఒక గంట వాడు ఏమి చదువుతున్నాడో చూస్తానులే” అన్నాడు శంకరం.


“నాన్నా! తాతయ్య కి నా చదువు అర్ధం కాదు, అంతా అడ్వాన్స్ గా ఉంటుంది” అన్నాడు శంకరం పరువు తీస్తో మనవడు.

“నిజమే రా, నాకు అర్ధం కావు, నువ్వే బాగా చదువుకో, లేదంటే నాకు మాటస్తుంది” అన్నాడు మనవడి భుజం తడుతు.


రోజూ ఎనిమిదింటికల్లా టిఫిన్, పన్నెండు గంటలకు భోజనం, రాత్రి టిఫిన్ అన్ని బాగానే జరుగుతున్నాయి. పార్వతి భాగవతం పుస్తకం చదువుకుంటూ పుణ్యం కోసం ప్రయత్నం చేస్తోంది, కోడలు పిల్లలకి డాన్స్ నేర్పుతో టైమ్ పాస్ చేస్తోంది, మనవడు చదువుతో ఎవ్వరిని పట్టించు కోవడం లేదు. కొడుకు సరే సరి ఎంతవరకు ఆఫీస్ ఫోన్ కాల్స్ తో వుంటాడు, యిహ శంకరం కి మిగిలింది కిటికీ నుంచి పార్క్ వంక చూస్తో వుండటం.


కంచం లో వడ్డీంచిన కూర ని చూసి, “ఇదేమిటి?” అన్నాడు కోడలుతో.


“కాప్సికం మామయ్యగారు” అంది.


“నాకు కాప్సికం కూర యిష్టం లేదు అని తెలుసు కదా, నాకు రెండు బంగాళాదుంపలు వేయించాలిసింది, కూర తీసివేసి, పప్పు, కొద్దిగా ఆవకాయ వెయ్యి, మీ అత్తయ్య ఏంచేస్తోంది, యిటు రమ్మను” అన్నాడు శంకరం.


“వీళ్ళు పప్పుచారు పెట్టుకుంటే పప్పు విడిగా వండుకోరు, రేపటి నుంచి మీ కోసం కొద్దిగా విడిగా తీయమంటాను, కాప్సికం కూర కూడా బాగానే వుంటుంది తినండి” అంది పార్వతి ఆవకాయ పెచ్చు కంచం లో వేస్తో. “నువ్వు తిను, నాకు నచ్చదు, ఈ రోజుకి ఆవకాయ చాలు” అన్నాడు.


సాయంత్రం కొడుకు శ్రీకాంత్ వచ్చిన కాసేపు అయిన తరువాత, తండ్రి దగ్గరికి వచ్చి, “యిది తినను, అది తినను అని అమ్మని యిన్నిరోజులు ఏడిపించుకుతిన్నారు, ఏది వండితే అది తినడంకి అలవాటు పడాలి నాన్నా” అన్నాడు.


“అంటే నీ ఉద్దేశ్యం ఏమిటి, అప్పుడే ఉదయం జరిగింది నీకు చెప్పేసిందా” అన్నాడు కొడుకు తో శంకరం.


“ఏమో నాన్నా, మీరు యిక్కడే వుంటారు, యిక్కడ వాటితో సర్దుకోవాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క వంట చెయ్యాలి అంటే తనకి కూడా కష్టమే కదా, నేను తినడం లేదా, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి” అని తన గదిలోపలికి వెళ్ళిపోయాడు.


“మీరు తగాదా పడి పోండి అనిపించుకోవాలి అనుకుంటే నేను ఏమి చెయ్యలేను, ఏదో తలదాచు కోవాలి కానీ ఈ వయసులో కోరికలు చంపుకోవాలి. అదే తింటాను అంటే జరగడానికి యిది మీ యిల్లు కాదు” అంది పార్వతి.


“ఏమిటి, యిది మన యిల్లు కాదా? అయితే యిక్కడ వుండటం ఎందుకు. మన అబ్బాయి మన దగ్గరికి వచ్చినప్పుడు మా ఇంటికి వెళ్తున్నాను అని అంటాడు కదా.. మరి మన కొడుకు యిల్లు మనది కాదా, మనవి మాత్రమే వాళ్ళవి, మనం మాత్రం పరాయి వాళ్ళం అన్న మాట” అన్నాడు శంకరం. “మీతో వచ్చిన చిక్కు యిదే, నేను మాటవరసకి అంటే మీరు ఎక్కడికో వెళ్లిపోయారు. చూడండి, మన అబ్బాయి, కోడలు మంచి వాళ్ళు. అందరి లాంటి వాళ్ళు కాదు. యిప్పటికి శ్రీకాంత్ మీ మాట అంటే గౌరవం. కోడలికి మీకు ఎక్కడ కోపం వస్తుందో అని భయం. హాయిగా వండింది తిని సాయంత్రం అలా పార్క్ కి వెళ్లి నడవండి. మీ వయసు వాళ్ళతో స్నేహం చేసుకోండి. యింకా పదేళ్లు బతుకుతాము అనుకోవద్దు. వున్నన్నాళ్ళు కొడుకు, కోడలు తో చక్కగా మాట్లాడి కాలం గడిపేయండి” అంది.


“సరే, నువ్వు నాకు నచ్చని కూర వండినప్పుడు వంటగదిలోకి వెళ్లి రెండు వంకాయలో, బంగాళాదుంపలో వేయించితే ఏ గొడవ వుండదు. నీ భాగవతం పుస్తకం ఎప్పుడు అవుతుంది” అన్నాడు శంకరం భార్య తో.

“మీరు కూడా రామాయణం పారాయణం చేయండి, అప్పుడు మనసు రుచులమీదకి వెళ్లదు” అంది.


ఉదయమే లేచి ఒక గ్లాస్ మంచి నీళ్లు త్రాగి, పార్క్ వైపుకి నడిచాడు శంకరం. పార్క్ చుట్టూ నాలుగు రౌండ్స్ తిరిగి, ఆయాసం గా అనిపించి ఒక బెంచి మీద కూర్చొని యూట్యూబ్ లో సుప్రభాతం పెట్టుకుని వినడం మొదలుపెట్టాడు కళ్ళుమూసుకొని.


“మీరు తెలుగు వాళ్ళా” అన్న ప్రశ్న వినిపించి కళ్ళు తెరిచి చూసాడు. తన వయసు కలిగిన ఒక పెద్దాయన తన పక్కన కూర్చొని, “మాది హైదరాబాద్, యిక్కడ మా అమ్మాయి, అల్లుడు వుంటున్నారు. పరిస్థితులు విషమించడం వలన నేను వీళ్ళ దగ్గర వుంటున్నాను, నా పేరు మూర్తి” అన్నాడు.


“మాది కూడా ఆంధ్రానే, యిక్కడ మా అబ్బాయి కోడలు వున్నారు. మా ఆవిడ యింకా మనం ఎందుకు విడిగా వుండటం, అబ్బాయి దగ్గరికి వెళ్లి శేషజీవితం గడిపేద్దాం అంది, అందుకే యిక్కడ కి వచ్చి పడ్డాము. హింది వాళ్ళు అవడంతో నాకు స్నేహితులు ఎవ్వరు కుదరలేదు’ అన్నాడు.


“మన తెలుగు వాళ్ళు పదిమంది దాకా వున్నారు, సాయంత్రం పార్క్ కి వస్తారు. మీరు కూడా సాయంత్రం రండి, పరిచయం చేస్తాను. బాధలు చెప్పుకుంటూ వుంటే సమయం యిట్టే అయిపోతుంది. గుండెల్లో బాధ కూడా తగ్గుతుంది” అన్నాడు మూర్తి గారు.


“అంత బాధలేమి లేవు మూర్తి గారు, వృద్ధాప్యపు బాధ తప్ప” అన్నాడు శంకరం.


“అదృష్టవంతులు మీరు, పోనీ వాళ్ళ బాధలు విని ఉపాయం చెప్పండి. తప్పకుండా సాయంత్రం రండి, యిహ వెళ్తాను, బట్టలు ఆరేసుకోవాలి” అన్నాడు మూర్తి.


శంకరం ఇంటికి వచ్చి మూర్తి గురించి పార్వతి కి చెప్పాడు. “పాపం భార్య పోవడంతో అల్లుడు పంచన చేరాడు. కూతురు అల్లుడు ఉద్యోగం తో బిజీగా వుంటారుట. యింటి పని వంటపని తనే చూడాలిసి వస్తోంది” అని బాధ పడ్డాడు అన్నాడు భార్య తో.


సాయంత్రం మళ్ళీ పార్క్ కి వెళ్లి రెండు రౌండ్స్ కొట్టి తను ఉదయం కూర్చున్న బెంచి దగ్గరికి వచ్చాడు. బెంచి ఫుల్ గా వుంది.


“రండి శంకరం గారు, మీ కోసమే ఎదురు చూస్తున్నాము” అంటూ కొద్దిగా జరిగాడు.


“కొద్దిగా నడిచి తరువాత ఇక్కడకి వచ్చాను, మీరు నడవరా” అన్నాడు శంకరం.


“యింట్లో నడిచింది చాలు” అని, “యిక్కడ నోటికి చెవులకి పనిపెట్టుకున్నాం” అన్నాడు నవ్వుతు మూర్తి.


“యియన వెంకటేష్, పెద్ద ఇంజనీర్ చేసి వైదవ్యo తరువాత కొడుకు దగ్గర సెటిల్ అయ్యారు, పిల్లలకి ట్యూషన్ చెప్పుతో వుంటారు. యింట్లో ఎవ్వరు మాట్లాడరుట. ఈయన సుబ్బారావు గారు, హైదరాబాద్ లో వంటలు చేసి ఒక్కగానోక్క కొడుకు ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదివించాడు. యిప్పుడు కొడుకు కోడలు దగ్గరకి వచ్చి వుంటున్నారు. యిక్కడ కూడా వంటే యింట్లో. ఈయన కిషోర్ గారు రైతు, యిక్కడ కూతురు దగ్గర వుంటున్నాడు”, అంటూ అందరిని పరిచయం చేసాడు మూర్తి.


వింటూవుంటే తన పరిస్థితి వాళ్లందరికంటే మేలు. యింట్లో సాధింపు లేదు, తోచటం లేదన్న బాధ తప్పా యింకా ఏ బాధ లేదు. ప్రశాంతం గా వుంటుంది యిల్లు. నోరు కూడా కట్టుకున్నాడు.


పాపం కొడుకు శ్రీకాంత్ ‘నాన్నా నీ పెన్షన్ ఏమిచేస్తునావు, ప్రతినెలా నాకు కొంత ఇవ్వచ్చు కదా’ అని అడగను కూడా అడగడు. తన దృష్టిలో కి వచ్చినప్పుడు ఆన్లైన్ లో ఇంటికి కావలిసినవి తెప్పించేస్తాడు శంకరం.


నాలుగు సంవత్సరాలనుండి పార్కులో సాయంత్రం మీటింగ్ జరుగుతోనే వుంది. శంకరం కొడుకు శ్రీకాంత్ సాయంత్రం రన్నింగ్ చేస్తో తండ్రి వంక చూస్తో వెళ్లిపోయేవాడు. ఒకరోజున అందరూ వచ్చారు మూర్తి తప్పా. బహుశా యింట్లో ఏమైనా పని వుందేమో అన్నాడు సుబ్బారావు. రాత్రి ఏడుగంటల వరకు పిచ్చాపాటి మాట్లాడుకని ఎవ్వరింటికి వాళ్ళు వెళ్లిపోయారు.


“టిఫిన్ తింటారా లేకపోతే మీకు యిష్టమైన లంచ్ కోసం చేసిన వంకాయ కూర వేసుకుని భోజనం చేస్తారా మామయ్యగారు” అన్న కోడలు మాటకి నవ్వుతు, “అన్నమే తింటాను” అన్నాడు శంకరం డైనింగ్ టేబుల్ వైపుకి నడుస్తో. ఫోన్ చప్పుడు కి మళ్ళీ ఫోన్ తీసుకుని హలో అన్నాడు.


అటునుంచి “నేను సుబ్బారావుని సార్, మూర్తి గారు చనిపోయారు హార్ట్ ఎటాక్ తో, పాపం ఆ టైములో యింట్లో ఎవ్వరు లేకపోవడం తో హాస్పిటల్ కి కూడా వెళ్లే అవకాశం లేకపోయింది, రేపు ఉదయం మూర్తి గారిని చూద్దాం, పార్క్ దగ్గర మన స్నేహితులందరు కలుద్దాం” అని ఫోన్ పెట్టేసాడు.


“భోజనం వడ్డించింది, ఫోన్ పెట్టేసి రండి” అని పిలుస్తున్న పార్వతి తో “నేను యిప్పుడు తినను, మీరు తినేయండి” అన్నాడు శంకరం కళ్ళు తుడుచుకుంటో.


ఉదయమే లేచి బయటకు వెళ్తున్న తండ్రిని చూసి పార్క్ గేటు అప్పుడే తియ్యరు” అన్నాడు శ్రీకాంత్.


“పార్క్ కి కాదు, మా స్నేహితుడు ఒకరు చనిపోయారు, చూడటానికి వెళ్తున్నాను” అన్నాడు శంకరం.


మంచం మీదనుంచి ఒక్కసారిగా లేచి, “వద్దు డాడీ, అటువంటి చోటకి వెళ్లి మీరు మనసు పాడుచేసుకుంటారు” అన్నాడు.


“పర్వాలేదు రా, కంగారు పడకు” అంటూ బయటకి నడిచాడు. మొన్నటి వరకు అందరిని నవ్వించిన మూర్తి ప్రాణం లేకుండా పడుకున్నాడు. ఛీ ఏమిటో జీవితం అనుకుంటూ మూర్తి పాడేని తనతోపాటు మిగిలిన స్నేహితులు స్మశానం దాకా తీసుకునివెళ్ళి కార్యక్రమం జరిపించారు.


రోజులు గడుస్తున్నాయి, పార్క్ బెంచి కొద్ది కొద్దిగా ఖాళీ అవుతోంది. కాలం మనకోసం ఆగదు కదా.

రన్నింగ్ చేస్తూ శ్రీకాంత్ తండ్రి ఒక్కడే బెంచి మీద కూర్చొని వుండటం చూసి, కొద్దిగా ఆగి, “డాడీ మీ ఫ్రెండ్స్ యింకా రాలేదా” అన్నాడు. “వాళ్ళు రారు నేనే వెళ్ళాలి” అన్నాడు శంకరం.


శ్రీకాంత్ కొడుకు పెళ్లి అయ్యింది, ప్రేమ వివాహం. వేరు కాపురం. యింట్లో మిగిలింది శ్రీకాంత్, అతని భార్య. డాన్స్ చేసి చేసి నడుము బలహీన పడి మంచం కి పరిమితం అయ్యింది. పార్క్ బెంచి మీద కూర్చొని శ్రీకాంత్, తన తండ్రితో ఒక్క గంట కూడా సరిగ్గా మాట్లాడా పోవడం తో తన తండ్రి ఎంత బాధ పడ్డాడో యిప్పుడు తనతో ఎవ్వరూ మాట్లాడకపోవడం తో తెలిసి వచ్చింది. ఈ బెంచి మీద అటువంటి వాళ్ళు కూర్చొని ఎంతో మంది వెళ్ళిపోయారు, కొన్నాళ్ళకి నేను కూడా, కానీ ఈ బెంచి మాత్రం శాశ్వతంగా యిక్కడే వుండి అనాధారణ కి గురి అయిన ఎంతోమంది తల్లిదండ్రుల కబుర్లు విని చలించకుండా ఉండిపోయింది కొత్త స్నేహితులు కోసం అనుకున్నాడు శ్రీకాంత్.


శుభం


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.









2 Comments


@saipraveenajeedigunta8361 • 1 day ago

Good one

Like

@sudharamanapudipeddi7857 • 1 day ago

Chala bavundi katha. Vastavaniki daggaraga undi.

Like
bottom of page