top of page
Writer's pictureKaranam Lakshmi Sailaja

పరోపకారం


'Paropakaram' - New Telugu Story Written By K. Lakshmi Sailaja

'పరోపకారం' తెలుగు కథ

రచన: కే. లక్ష్మీ శైలజ

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ గోడమీద ఉన్న ఆ బోర్డు, మన దగ్గర ' డబ్బు ' ఉండటం కంటే ' ఆరోగ్యం ' ఉండటమే పెద్ద సంపద అని చెబుతున్నట్లుగా ఉంది. ఆయుర్వేద ఆసుపత్రి వరండాలో తమ వంతు కోసం వేచి చూస్తున్నారు జలజ, జయకర్. ‘నెమ్ము’ [ ఆస్తమా లాంటిది] సమస్య కోసం జలజ వచ్చింది.


ఒకపేషంట్ డాక్టర్ గారి గది లోపలకెళ్ళున్నారు. నర్సు వచ్చి జలజా వాళ్ళ ఎదురుగా కూర్చున్న ఒకావిడను లోపలకు వెళ్ళిన వాళ్ళు చూపించుకుని వచ్చిన తరువాత డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళమనీ, ఆ తరువాత జలజను వెళ్ళమనీ, చివరలో ఆ చివర కూర్చున్న ఒక పల్లెటూరి జంటనూ వెళ్ళమంది. ఆ జంటలో ఉన్న అమ్మాయి ‘మేము ముందుగా వచ్చాము కదా, మేమెందుకు చివరలో వెళ్ళాలి?’ అని అంటూ ఉండటం, ‘వాళ్ళు ఫోన్ లో నిన్ననే అప్పాయింట్మెంట్ తీసుకున్నార’ని నర్స్ చెప్పడం విన్నది, జలజ.


నర్స్ వెళ్ళిపోయిన తరువాత కూడా ఆ అమ్మాయి ’మేము వేరే ఊరినుంచి వచ్చాము. మాకు ఇదంతా తెలియదు. ఫోన్ చేస్తే ముందుగా పంపుతారా?' అని కొంచెం గొణుక్కుంటూనే ఉంది. వాళ్ళకు అప్పాయింట్మెంట్ గురించి అవగాహన లేనట్టుంది. ఆ మాటలు వింటున్న జలజ ‘పోనీలే వాళ్ళనే ముందు వెళ్ళమందాము’ అనుకొని “సరే ముందు మీరే వెళ్ళండి. మేము ఈ ఊరి వాళ్ళమే. మీ తరువాత మేము వెళతాము” అని ఆ అమ్మాయి తో అంది. అప్పుడు ఆ అమ్మాయి సంతోషంగా “సరేనమ్మా” అంది.


అన్నట్లుగానే లోపల పేషెంట్ రాగానే, ఆ అమ్మాయి వాళ్ళు వెళ్ళారు. అప్పుడు జలజ కు ఫోన్ రావడంతో జలజ ఫోన్ తీసుకొని మాట్లాడుతూ బయటకు వెళ్ళింది. జలజ అటు వెళ్ళగానే జలజకు ఎదురుగా కూర్చున్న ఆవిడకు కోపమొచ్చింది. “ఆవిడ వెళ్ళాల్సిన టైంకు కావాలంటే వేరేవాళ్ళను పంపుకోమను. అంతేగానీ నేను వెళ్ళవలసిన టైంకు వేరే వాళ్ళను వెళ్ళమని ఆవిడెలా చెప్తుంది? ఇంట్లో నా కెంత ఇబ్బందిగా ఉందో ఆమెకు తెలుసా? ఇక్కడినుంచి నేను వేదాయపాళెం వెళ్ళాలి. మేము నిన్ననే అప్పాయింట్మెంట్ తీసుకున్నది ఎందుకు?“ అంటూ ఆవిడ కోప్పడింది జయకర్ వైపు చూస్తూ. జయకర్ కు ఏం చెప్పాలో తెలియలేదు.


కొద్దిసేపటికి జలజ లోపలికి రావడం, ఆ అమ్మాయి వాళ్ళు డాక్టరుగారి గదిలోపల్నుంచి బయటకు రావడం, జలజ ఎదురుగా వున్న ఆవిడ లోపలి కెళ్ళడం జరిగింది. జలజ రాగానే జయకర్ జరిగింది చెప్పబోయి హాస్పిటల్ లో ఎందుకులే అని ఆగిపోయాడు. జలజ కూడా చూపించుకున్న తరువాత ఆటోలో ఇంటికెళ్లిన తరువాత జరిగింది చెప్పాడు.


“అయ్యో. ఆవిడెందుకు కోప్పడటం? పాపం వాళ్ళు పల్లెటూరి వాళ్ళు కదా, మళ్ళీ వాళ్ళు ఊరెళ్ళాలని, అలా చెప్పాను” అంది జలజ. “అమ్మా, సమాజ సేవకీ. ఇంకొకరి విషయంలో జోక్యం చేసుకుంటే ఇదుగో ఇలాగే వస్తాయి మాటలు“ అన్నాడు జయకర్. ఒక నిముషం తరువాత మళ్ళీ

“ఆమె నిన్ను అలా విసుక్కోని మాట్లాడుతుంటే నాకు కూడా బాధనిపించింది. నువ్వు చేసింది మంచి పనే. కానీ అందరూ మనలాగా ఆలోచించరు కదా. అందుకని మనం ఏదైనా చేయాలనుకుంటే చేద్దాం. అంతేకానీ వేరేవాళ్ళను కూడా చెయ్యమనటం మంచిది కాదు” అన్నాడు. జలజ దిగులు పడింది ‘ఒకరికి మంచి చేస్తే తనకు చీవాట్లోచ్చాయ్’ అని. ‘పోనీలే, ఆ అమ్మాయి సంతోషపడిందిగా. అది చాలు’ అనుకుంది.

..

ఆ రోజు ఉదయాన్నే మూలాపేట నుంచి జలజా వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు, జలజను జయకర్ ను ఇద్దరినీ వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మని. ఆ రోజు రాత్రి జలజ అక్కా, బావ వాళ్ళమ్మా వాళ్ళింటికి వస్తున్నారని జలజకు తెలుసు కనుక “అక్కావాళ్ళు ఎన్ని గంటలకు వచ్చారు నాన్నా రాత్రి?” అంది జలజ. “వాళ్ళు వచ్చేటప్పటికి రాత్రి లేట్ అయ్యింది. ఇప్పుడు ఇంకా లేవలేదు. మీరు టిఫన్ కు కూడా ఇక్కడికే రండి”అన్నాడాయన. సరేనని వీళ్ళు బాలాజీ నగర్ లో ఉన్న వాళ్ళ నాన్నా వాళ్ళింటికెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసరికి ఇంట్లో వాళ్ళమ్మ మాత్రమేవుంది. వాళ్ళ నాన్న, అక్క, బావ హాస్పిటల్ కు వెళ్ళారనీ, రాత్రి విషయం వాళ్ళమ్మ బాధపడుతూ ఇలా చెప్పుకొచ్చింది.


జలజ అక్క రవళి, బావ రాకేష్ చెన్నై నుంచి కార్లో నెల్లూరు వస్తూ వున్నారు. అక్కడ షాపింగ్ కొంచెం లేట్ అవడం వల్ల నెల్లూరు దగ్గరికి వచ్చేసరికి 11. 30 దాటింది. గూడురు దాటుతున్నప్పుడు తమ దగ్గరున్న ' లేస్ ' పాకెట్ లోని 'ఆలూ చిప్స్ ' తినేశారు. అయినా ఆకలిగానే ఉంది. హరనాథపురం సెంటర్ దాటారు. సర్వేపల్లి కాలువ నిండుగా కనిపిస్తోంది. కొంచెం వర్షం పడుతూనే వుంది. ఎడమచేతి వైవు షాప్స్ అన్నీ మూసి ఉన్నాయి. వీధి లైట్లు వెలుగుతున్నాయి. నడిచే జనాలెవ్వరూ కనిపించడం లేదు. అప్పుడప్పుడూ ఒక బండి, ఒక కారు వెళ్తున్నాయి.


ఇంతలో కారును ఆపుతూ ఇద్దరు ఆడవాళ్ళు, ఒక మగమనిషి కనిపించారు. ఆపడమా, వద్దా అనుకునే లోపల అందులో ఒకావిడకు ఆక్సిడెంట్ అయినట్లుంది. చెయ్యి మొత్తం రక్తం తో ఉంది. ఆవిడ పడిపోకుండా వీళ్ళిద్దరూ పట్టుకొని ఉన్నారు. కారు దగ్గరి కొచ్చీ వాళ్ళను దాటబోతోంది. రవళి ‘‘ఆపేద్దాం లే’’ అంది. “ఆక్సిడెంట్ కేస్ లాగుంది. కావాలంటే మనం 108 కు ఫోన్ చేద్దాం” అన్నాడు రాకేష్. “అయ్యో పాపం. ఎవరూ ఆపుతున్నట్లు లేదు. అంబులెన్సు రావాలన్నా ఇంకో పదినిముషాలైనా పడుతుంది కదా. ప్లీజ్ రాకేష్, సేవ్ హర్” రవళి మళ్ళీ అంది.


రాకేష్ ఏం చెయ్యాలా అని ఆలోచించి, ‘సరే చూద్దాం’ అని కారును నెమ్మదిగా వెనక్కు, వాళ్ళునిలబడ్డ దగ్గరకు తీసుకెళ్ళి ఆపేశాడు. అద్దం దించింది, రవళి. “అమ్మా ఆటోలేవీ రావడం లేదు. తొందరగా ఆసుపత్రి తీసుకెళ్ళాలమ్మా. కొంచెం దయ చూపండమ్మా” అంది వాళ్ళలో పెద్దావిడ.


చుట్టూ చూసింది, రవళి. నిజమే ఆ టైం లో ఆటోలు లేవు. “ఏం జరిగింది?” అంటూ రవళి వెనుక తలుపు తీసింది. “ఆటో గుద్దేసిందమ్మా. ఆపకుండా వెళ్ళిపోయింది” అందామె దెబ్బ తగిలిన ఆమెను కారులో ఎక్కిస్తూ. అతను కూడా హెల్ప్ చేసాడు. ముగ్గురూ కూర్చున్న తరువాత ‘ఎక్కడదించాలి?’ అంటే ‘విజయమహల్ గేట్ దగ్గర ఏదో ఒక హాస్పిటల్ కు’ అన్నారు. సరేనని కారు స్టార్ట్ చేశాడు రాకేష్.


వాళ్ళు ముగ్గురూ కారెక్కిన ఒక రెండు నిముషాలల్లోనే స్పీడ్ గా తమ పని చేసేశారు, వాళ్ళు. వెనుక సీట్ లో కూర్చున్న అతను మత్తుమందు కర్చీఫ్ ను రాకేష్ ముక్కు మీద గట్టిగా అదిమి పెడుతూ, స్టీరింగ్ కంట్రోల్ చేయసాగాడు. దెబ్బతగిలినట్టు యాక్షన్ చేసిన ఆమె రాకేష్ చేతులు గట్టిగానొక్కి పట్టేసింది. ఆ పెద్దావిడ రవళి ముక్కుకు కర్చీఫ్ అదిమి, రవళిని కదలకుండా పట్టుకుంటోంది. రెండు నిముషాలకు వీళ్ళు సృహ తప్పడం, అతను కారును ఒక సైడ్ గా ఆపడం జరిగిపొయ్యాయి.


వాళ్ళు ముగ్గురూ రవళి హ్యాండ్బ్యాగ్ తీసి అందులో చెన్నైలో కొన్న గోల్డ్ నెక్లెస్, డబ్బు, రాకేష్ జేబులో ఉన్న డబ్బు, ఇద్దరి మెడలల్లో ఉన్న బంగారు దండలు, చేతుల ఉంగరాలు చక చకా తీసుకొని, కారు దిగి ఎవరికీ అనుమానం రాకుండా నెమ్మదిగా ఎడమవైపు ఉన్న పెద్ద బిల్డింగ్ పక్క సందులోకి వెళ్ళి పొయ్యారు. వాళ్ళు కారు ఎక్కిన చోట గానీ, వాళ్ళు కారు దిగిన చోట గానీ ఎక్కడా సి. సి. కెమెరాలు లేవు.


ఒక 5, 6 గంటల తరువాత కారులో మత్తుగా పడిపోయి ఉన్న రవళి, రాకేష్ లకు మెలుకువ వచ్చింది. అప్పుడప్పుడే తెల్లవారుతోంది. జరిగిన మోసాన్ని తెలుసుకొని హతాశులయ్యారు. అప్పుడు నాన్నకు ఫోన్ చేశారు. నాన్న వెళ్ళిన తరువాత నాన్నే కారు డ్రైవ్ చేసి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి, వాళ్ళను ఇంటికి తీసుకొచ్చారు. అయినా ఆ మత్తుమందు ప్రభావం ఎలా ఉంటుందో ఏమో, ఒకసారి డాక్టర్ గారికి చూపిస్తే బాగుంటుందని హాస్పిటల్ కు వెళ్ళారు.


వాళ్ళమ్మ చెప్పిందంతా విని ‘‘అమ్మో, ఇలా చేసేవాళ్ళు కూడా వుంటారా?” అంటూ భయపడింది, జలజ. వీళ్ళిద్దరూ కూడా ఆహాస్పిటల్ కెళ్ళి వాళ్ళను చూసి వద్దామనుకునే లోపల వాకిట్లో రవళి వాళ్ళ కారు ఆగింది. వాళ్ళ నాన్న దిగగానే, వీళ్ళు ముగ్గురూ కారు దగ్గరికెళ్ళి, రవళి, రాకేష్ లకు చేయూత నిచ్చారు, వాళ్ళిద్దరూ సోఫాలో కూర్చునేంతవరకు. జలజ ఇద్దరికీ మంచినీళ్ళు ఇచ్చింది. వాళ్ళమ్మ అందరికీ టీ తీసుకొచ్చింది.


తరువాత వాళ్ళ నాన్న ఇలా చెప్పారు. “డాక్టరుగారు చెక్ చేశారు. ఏమీ ఫరవాలేదన్నారు. కొన్ని జాగర్తలు చెప్పారు. కొంచెం రెస్ట్ తీసుకోమన్నారు” అని వివరించారు. రవళి, రాకేష్ కూడా కొంచెం కోలుకున్నారు. “ మాకు కొంచెం కూడా డౌట్ రాలేదమ్మా. ఆమెకు నిజంగా దెబ్బ తగిలిందనే అనిపించింది” అంది, రవళి. “ మీకు గాయాలు చెయ్యకుండా వదిలేశారు. అంతే చాలు. డబ్బుపోతేపోయింది “అంది వాళ్ళమ్మ దేవునికి నమస్కారం చేస్తూ. “ఇలాంటప్పుడే, నిజాన్ని నమ్మలేక, మంచి చెయ్యాలని అనిపించినా.. చెయ్యలేకపోతాము” కొంచెం బాధగా అన్నాడు రాకేష్.


“నిజమన్నయ్యా, మనం మంచి చేస్తే మనకు చెడు ఎదురౌతుందొక్కొక్కసారి. నిన్న హాస్పిటల్ లో జలజకు అదేవిధంగా జరిగింది” అంటూ నిన్నటి విషయం చెప్పాడు జయకర్. “మరీ ఈరోజు లాగా మోసం చేసినప్పుడు మనుషుల మీద నమ్మకం పోతుంది“ నిట్టూర్చాడు వాళ్ళనాన్న.


అయితే మళ్ళీ ఆయనే “అలా అని ఎవరికీ మంచి చెయ్యకుండా పోతే ఆపదలో ఉన్న వాళ్ళ గతేంటి? సమయం సందర్భం చూసుకొని సహాయం చేస్తూ ఉండాల్సిందే. ఆ తరువాత భగవంతుని దయ. ‘ఆ నలుగురు’ సినిమా లో రాజేంద్రప్రసాద్ చెప్పినట్లు ‘తాను డబ్బులిచ్చిన పాపకు కాన్సర్ లేకపోవడం సంతోషం’ అన్నట్లు మనం కూడా సహాయం చెయ్యడం వరకే మనపని. ఏమైనా మనం కూడా అంత బంగారు తీసుకొని ప్రయాణం చెయ్యకూడదు. పోనీ లెండి. ఇకనుంచైనా జాగర్తగా వుండండి. ఒక్కోసారి ఇలాంటి ఎదురుదెబ్బలు తప్పవు” అంటూ నిట్టుర్చాడు.

..

జలజ, జయకర్ లు ఆ రోజు రాత్రి భోజనాలయిన తరువాత, యెన్. టి. ఆర్. నగర్ లో ఉన్న వాళ్ళింటికి బయలు దేరారు. ఆటోలు పెద్దగా దొరకవు ఆ టైం లో. కొంచెం దూరం నడిచి, ఆటో ఎక్కారు.


ఒక ఐదు నిముషాలకు పక్కనున్న సంగం దగ్గర ఆటోను ఆపుతున్న ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళకు కనిపించారు. ఆటో అతను ఏం చెయ్యమంటారనట్లు వీళ్ళ వంక చూశాడు. వాళ్ళల్లో ఒకమ్మాయి గర్భవతి లాగుంది. జలజ, జయకర్ ఒక్క క్షణం ఆలోచించి ఆటో దిగేశారు.


వాళ్ళను ఆటో ఎక్కమని, ఆటోకు ఇంకా ఎక్కువ డబ్బులిచ్చి, వాళ్ళను తొందరగా పంపించేశాడు జయకర్. ఆమె నిజంగా గర్భవతి కాకుండా వాళ్ళు డ్రామా ఆడుతుంటే, పక్కనుంచి ఎవరైనా మగవాళ్ళు వచ్చి కొడతారేమోనని భయంగా వున్నా, సెల్ ఫోన్ పట్టుకొని అటూ, ఇటూ జాగర్తగా గమనిస్తూ వీళ్ళు గబగబా మెయిన్ రోడ్ లో కొచ్చారు. అక్కడ ఒక పది నిముషాలకు ఆటో దొరికింది.


తెల్లవారి పేపర్ లో ' ఆటో లో ప్రసవించిన తల్లి’ అంటూ వేసిన ఫోటో చూసి, ‘అమ్మయ్య మనం మోసపోలేదు’ అని సంతోషించారు జలజ, జయకర్ లు.


భగవంతుడు మన నమ్మకాలను వమ్ముకానీకుండా అప్పుడప్పుడూ ఇలా ‘నేనున్నానని చెప్తున్నట్లనిపించింది’ వాళ్ళకు.

***

కే. లక్ష్మీ శైలజ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link:

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : నా పేరు K. లక్ష్మీ శైలజ.

నెల్లూరు లో ఉంటాను.

నేను ఎం. ఏ. ఎం.ఫిల్ చేశాను.

ఇప్పటి వరకు 40 కథలు , పది కవితలు ప్రచురితమైనవి.

జూన్ 2022 న తానా గేయతరంగాలు లో గేయం రచించి పాడటమైనది.

యూట్యూబ్ లో కథలు చదవడం ఇష్టం.


76 views0 comments

Comments


bottom of page