పశ్చాత్తాపం
- Neeraja Prabhala
- Jul 14, 2022
- 6 min read
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link

'Paschattapam' New Telugu story Written By Neeraja Hari Prabhala
రచన: నీరజ హరి ప్రభల
" ఏమండీ! మన అమ్మాయి సుధకి రెండు రోజుల్లో పరీక్ష ఫీజు కట్టాలిట. ఇందాకే తను చెప్పింది." అంది శ్యామల, భర్త రామయ్యతో.
"అలాగేలేవే! చూద్దాం. ఈనెల జీతం ఇంకా రాలేదు" అని ఆఫీసుకు వెళ్లాడు రామయ్య.
ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రామయ్య- భార్య శ్యామల, కూతురు సుధతో ఉన్నంతలో సంతోషంగా జీవిస్తున్నారు. చదువంటే ఇష్టంతో చిన్నప్పటినుంచి కష్టపడి చదువుతూ ఇప్పుడు డిగ్రీ ఆఖరి సం.. చదువుతోంది సుధ. తమ ఇంటి పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు తెలుసుకుని నడుచుకుంటూ తల్లి తండ్రులకు అనుకూలంగా ప్రవర్తించే సుధ అంటే వాళ్లకు ప్రాణం.
ఆ సాయంత్రం ఆఫీసునుంచి వస్తూనే జీతం డబ్బులను తెచ్చి భార్య చేతికిచ్చి అందులో సుధకు ఫీజు కట్టమన్నాడు రామయ్య. శ్యామల సుధను పిలిచి ఫీజుకు డబ్బులు ఇచ్చింది. ఈ సం… చదువు పూర్తవగానే ఏదన్నా ఉద్యోగం చేసి సంపాదిస్తూ తండ్రికి చేదోడుగా ఉండాలని అనుకుంది సుధ. సుధ పెళ్లి కోసం ఒక చిట్ ఫండ్ కంపెనీలో చీటీ కట్టి డబ్బులు దాస్తున్నాడు రామయ్య. కాలం గడుస్తోంది. ఒక రోజున చిట్ ఫండ్ కంపెనీ వాళ్లు బోర్డ్ ఎత్తేసి పరారైనట్లు విని రామయ్య హతాశుడయ్యాడు. ఆదరాబాదరాగా అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ తనలాంటి ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు. పోలీసులు ఆఆఫీసుకు సీల్ వేసి కేసు నమోదు చేసుకుని ఎవరెవరు ఎంతెంత కట్టారో తెలుసుకుని వ్రాసుకుంటున్నారు. రామయ్య కూడా తనెంత కట్టాడో వివరాలు చెప్పి ఇంటికి వచ్చాడు. జరిగింది భార్యతో, సుధతో చెప్పి బాధపడ్డాడు. వాళ్లిద్దరూ ఆయన్ని ఓదార్చారు.
కొంతకాలానికి శ్యామలకు బాగా జబ్బు చేసింది. హాస్పిటల్ కు తీసికెళ్లి వైద్యం చేయిస్తే బ్రతికి ఇంటికొచ్చింది. దానికి చాలా ఖర్చయితే ఒక షావుకారు వద్ద నోటువ్రాసి అప్పుచేశాడు. నెలలు గడుస్తున్న కొద్దీ షావుకారు తన అప్పు తీర్చమని ఒత్తిడి చేయసాగాడు. సుధ తను చదువుతూనే ట్యూషన్సు చెబుతూ కొంత సంపాదిస్తూ తండ్రి కిస్తోంది.
ఒకనాడు షావుకారు రామయ్య ఇంటికి వచ్చి అప్పు తీర్చమని గొడవచేయసాగాడు. " రెండునెలలాగితే తన కూతురి చదువు పూర్తయి ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటుంది. అప్పుడు మీ అప్పు ఎలాగైనా తీరుస్తాను. కాస్త మా పరిస్థితిని అర్థం చేసుకోండి" అని ఎంతో బ్రతిమలాడాడు. కానీ షావుకారు వినే స్ధితిలో లేడు. అప్పుడే కాలేజీ నుంచి వచ్చిన సుధ మీద అతని చూపు బడింది.
"అప్పు ఇప్పుడే తీర్చు, లేకపోతే నీ కూతురిని నా వద్దకు పంపు" అన్న వెకిలి మాటలకు రామయ్య రక్తం ఉడికిపోయింది. 'పరువూ ప్రతిష్టే ప్రాణంగా బ్రతుకుతున్న తమను అంతమాటంటాడా!' అని ఆవేశంతో ఇంట్లో ఉన్న కత్తిని తీసుకుని ఆ షావుకారి మీదకు వెళ్లి దాడిచేశాడు. సుధ, శ్యామల వద్దని ఎంత వారిస్తున్నా వినకుండా షావుకారిని కత్తితో పొడిచాడు. అక్కడికక్కడే ఆ షావుకారు తనువు చాలించాడు.
జరిగినదారుణానికి శ్యామల, సుధ హతాశులయ్యారు. ఈ సన్నివేశాన్ని కొంచెం దూరంగా ఎవరో చూసి వీడియో తీసి పోలీసులకు ఫోన్ చేసి, ఆ వీడియోను కూడా పంపారు. వెంటనే పరుగున పోలీసులు రావడం, శవాన్ని పరీక్ష చేసి పోస్ట్ మార్టం కు పంపడం, వీడియో చూపి కేసు నమోదు చేయడం, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా రామయ్యే హంతకుడని తెలియడం, వెనువెంటనే రామయ్యను పోలీసులు అరెస్టు చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి.
వీడియో సాక్షాధారం ఉన్నందున, పైగా ఏ రాజకీయ పలుకుబడి లేనివాడు కనుక రామయ్యకు కోర్టులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. రామయ్యను జైలుకు తరలించారు. విషణ్ణ వదనంతో జైలులో ఉన్నాడు రామయ్య. సుధ, శ్యామల ల పరిస్థితి అగమ్యగోచరంగా అయింది. 'నిన్నటిదాకా అందరూ ఒకచోట హాయిగా బ్రతుకుతున్న తమను హఠాత్తుగా విధి ఎంత క్రూరంగా విడదీసింది? భగవంతుడా ! నీవే మాకు దిక్కు' అని రోదింస్తున్న తల్లిని ఓదార్చి ధైర్యం చెప్పింది సుధ.
సుధకు పరీక్షలు ఇంకో నెలలో జరగనున్నాయి. కాలేజీ ప్రిన్సిపాల్ కు తన పరిస్థితిని వివరించి రోజూ కాలేజీకి హాజరవకుండా ఇంటివద్ద తన తల్లికి తోడుగా ఉంటూ పరీక్షలకు ప్రిపేరయేట్టు, పరీక్షల సమయంలో కాలేజీకి వచ్చి పరీక్షలు వ్రాసేట్టు అనుమతించాలని చేతులు జోడించి ప్రార్ధించింది. సుధ బాగా చదువుకునే మంచిపిల్ల, పైగా చాలా కష్టంలో ఉన్నందున ప్రిన్సిపాల్ ఆమెను అర్థం చేసుకుని అందుకు ఒప్పుకుని సుధకు ధైర్యం చెప్పి ఇంటికి పంపించాడు.
సుధ ఇంటికి వచ్చి తన తల్లికి జరిగింది చెప్పి ఆవిడను అనునయించింది. అప్పుడప్పుడు జైలు అధికారుల అనుమతిని తీసుకుని రామయ్యను చూసివస్తున్నారు శ్యామల, సుధలు. తనవలననే వాళ్లకీ దుస్థితి వచ్చిందని వాళ్లను చూసి మరింత బాధపడుతున్నాడు రామయ్య. కొన్ని నెలలకు రామయ్యను వేరే చోట జైలుకు తరలించారు.
సుధ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ట్యూషన్లు చెప్పుతూ వస్తున్న డబ్బుకు తోడుగా, శ్యామల ఇంట్లో మిషనుతో చుట్టుపక్కల వారికి బట్టలు కుట్టగా వచ్చిన డబ్బులతో సుధ ఇంటిని నడుపుతోంది. కష్టపడి చదివి సుధ పరీక్షలు బాగా వ్రాసి మంచి మార్కులతో డిగ్రీ పూర్తి చేసింది. సుధ ఉద్యోగ ప్రయత్నాలను మొదలుపెట్టింది. భర్త జైలుపాలవటం, కూతురి ఉద్యోగవేట, బంధువులు హంతకుడి కుటుంబంగా తమను చూడటం శ్యామలమ్మ మనసును బాగా కృంగదీస్తోంది. సుధ ఎంత ధైర్యం చెప్తున్నా 'మనోవ్యాధికి మందులేదన్నట్లు' గా శ్యామల నిద్రలోనే హార్ట్ఎటాక్ తో తనువు చాలించింది. సుధ గుండె పగిలేలా ఏడ్చి తల్లికి జరగవలసిన కార్యక్రమాన్ని యధావిధిగా జరిపించింది.
ఒంటరైన సుధ ఇంక ఆ ఊరిలో ఉండలేక వేరే రాష్ట్రనికి వెళ్లి ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరింది. హాస్టల్ లో ఉంటూ ఉద్యోగానికి వెళ్లివస్తోంది. రోజులు గడుస్తున్నాయి. సుధ ఆఫీసు పనులతో చాలా బిజీగా ఉంటోంది. తన తండ్రిని ఎక్కడో దూరంగా జైలుకు మార్చినందున సుధకు తండ్రిని చూడవీలుకాలేదు. కానీ మనసులో తండ్రి పట్ల ప్రేమ, జాలీ, సానుభూతి మాత్రం ఉన్నాయి. 'తన వలననే కదా తండ్రి ఆ హత్య చేసి జైలుపాలయ్యి విలువైన జీవితాన్ని కోల్పోయాడు.' అనే బాధ మనసులో సుధకు ఉంటోంది.
రామయ్య తన సత్ప్రవర్తన వలన, జైలులో కష్టపడి పనిచేయడం వలన జైలు అధికారుల సానుభూతిని పొందాడు. క్రమేపీ వాళ్ల మనస్సులలో అతనంటే సదభిప్రాయం ఏర్పడింది. కాలం గడుస్తోంది.
సుధ తన తోటి ఉద్యోగస్తుడైన జగన్ ను ప్రేమించింది. అతను కూడా సుధను ప్రేమించాడు. సుధ తన గతాన్నంతా జగన్ కు చెప్పి తండ్రిని తలుచుకుని బాధపడింది. అంతా విని జగన్ 'తన తల్లి తండ్రులకు ఇదంతా చెప్పద్దు. వాళ్లు నిన్ను హంతకుడి కూతురిగానే భావించి మన పెళ్లికి ఒప్పుకోరు. కొంతకాలమయ్యాక వాళ్లకు నిదానంగా చెప్పచ్చు. ఎలాగూ ఆయనకు యావజ్జీవ జైలు శిక్ష కదా, మనమేమి చేయలేము.' అని సుధను ఓదార్చాడు. సరేనంది సుధ. తన తల్లిదండ్రులను ఒప్పించి సుధను రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాడు. సుధని అత్తామామా చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. భర్త అనురాగం, ఆదరించే అత్తమామల అభిమానం లభించినందుకు సుధ సంతోషపడుతూ నిత్యం ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటోంది కానీ మనసులో తండ్రిని తలుచుకుంటూ బాధపడుతోంది.
రెండేళ్ల తర్వాత సుధ పండంటి మగబిడ్డకు జన్ననిచ్చింది. కొడుకుని , కోడలిని, మనవడిని చూసి చాలా సంతోషిస్తున్నారు సుధ అత్త మామలు. జగన్ తన భార్యా బిడ్డల భవిష్యత్ రీత్యా సుధను తన తండ్రివిషయాన్ని మనసులోనే దాచుకోమని, దాన్ని తలుచుకుంటూ బాధపడద్దని కోరాడు. చేసేదేమీలేక, బంగారం లాంటి సంసారాన్ని పాడుచేసుకోవటం ఇష్టం లేక సుధ మిన్నకుంది.
రామయ్య సత్ప్రవర్తన వలన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి క్షమాభిక్ష క్రింద రామయ్య యావజ్జీవ శిక్షను రద్దు చేసి ఆయన చేతిలో కొంత డబ్బును కూడా పెట్టి రామయ్యను జైలు నుంచి విడుదల చేశారు. రామయ్య సంతోషంతో బయటకు వచ్చి లోగడ తాము ఉన్న ఊరికి వెళ్లి తాము ఉన్న ఇంటిని వెతికాడు. అక్కడ ఆ ఇల్లు ఆనవాళ్లు మచ్చుకైనా కానరాలేదు. చుట్టుపక్కల ఉండే వాళ్లను శ్యామల, సుధల గురించి చెప్పి వాళ్ల వివరాలనడిగాడు. వాళ్లెవరో తమకు తెలియదన్న వాళ్ల సమాధానం విని బాధతో వెనుతిరిగి రైల్వే స్టేషన్ కు చేరి రైల్లో కూర్చున్నాడన్న మాటే గానీ అతని మనసంతా పశ్చాత్తాపంతో వ్యధ చెందుతోంది. కళ్లు మూసుకుని కూర్చుంటే గతమంతా ఒక్కసారి కళ్లముందు కదలాడింది.
" నేను, శ్యామల, సుధ ఆరోజుల్లో ఎంతో అన్యోన్యంగా సంతోషంగా జీవించేవాళ్లం. శ్యామల ఎంతో అనుకూలంగా, ప్రేమగా నన్ను చూసుకునేది. శ్యామల ఆరోగ్యం ఇప్పుడెలా ఉందో, ఏమో ? సుధ తన తల్లి ని కంటికి రెప్పలా చూసుకంటూ ఉండి ఉంటుంది. నా బంగారు తల్లి సుధ ఎంతో చక్కగా చదువుకునేది . ఇప్పుడు చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఉండి ఉంటుంది. శ్యామల, సుధలు ఇప్పుడు ఎక్కడున్నారో? ఏమో ? నా వలననే కదా వాళ్లకీ దుస్థితి . నేను ఆరోజున క్షణికావేశాన్ని తగ్గించుకునుంటే ఆ షావుకారు చనిపోయేవాడే కాదు. నేను ఇప్పటిదాకా ఈ జైలు శిక్షను అనుభవించేవాడినే కాదు. ఇంకానయం ఆ దేవుడు దయదలచి నాకు విధించిన యావజ్జీవ శిక్షను రద్దు చేసి నన్ను విడుదల చేశారు. లేకపోతే జైల్లోనే నా జీవితం ముగిసేది. అయ్యో! ఎంత దుర్మార్గపు పనిని చేశాను? నేను హంతకుడి ని అవుతానని కలలో కూడా అనుకోలేదే! భగవంతుడా! నాభార్యాబిడ్డలను నేను కలుసుకునేట్టు చేయి. నా భార్యను, నా బంగారుతల్లి సుధను క్షమాపణలు అడిగి వాళ్లను కంటికిరెప్పలా చూసుకుంటాను. సుధకు మంచి వరుడితో చక్కగా పెళ్లి చేయాలి. అసలు శ్యామల, సుధలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో? ఎన్ని అగచాట్లు, అవమానాలు పడుతున్నారో ? పశ్తాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు కదా! నా పాపాన్ని పోగొట్టి నన్ను క్షమిస్తాడా ఆ దేవుడు" అని కనులు మూసుకుని బాధాతప్తహృదయంతో పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉన్నాడు రామయ్య.
...సమాప్తం...
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
మనసులోని మాట

రచయిత్రి పరిచయం : "మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏
Comments