కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link
'Paschatthapam' New Telugu Story
Written By Neeraja Hari Prabhala
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
హాస్పిటల్ లో వార్డులోని పేషెంట్లను చూసి తన గదిలోకి వచ్చి, కాస్త విశ్రాంతి గా కూర్చున్నాడు ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీకర్. రాత్రి ఒక పేషెంట్ కు అర్జెంట్ గా ఆపరేషన్ చేసి ఇంటికెళ్లి సరిగ్గా నిద్ర పోకపోయినా, మరలా తన రోజు వారీ డ్యూటీగా హాస్పిటల్ కు వచ్చాడు శ్రీకర్. అలసటగా ఉంటే కుర్చీలో కాస్త వెనక్కి వాలి కనులు మూసుకోగానే తన సెల్ ఫోను రింగయింది. ఉలిక్కిపడి 'ఎవరా' అని ఫోన్ చూస్తే ‘శోభ’ అనే పేరు కన్పించి లిఫ్టు చేశాడు శ్రీకర్.
" హలో! బావా! " అన్న పిలుపు వినగానే సంతోషంగా " హలో! శోభా! ఎలా ఉన్నావు?" అని పలకరించాడు శ్రీకర్.
శోభ తను బాగానే ఉన్నానని, తను ఆ ఊరికి రెండు నెలల మెడికల్ కాన్ఫరెన్స్ కోసం వస్తున్నట్లు, ఎక్కడైనా వాళ్లకు దగ్గరగా ఒక గదిని చూడమని చెప్పింది.
"రెండు నెలలకోసం వేరే గది ఎందుకు? మా ఇంట్లోనే ఉండు. నీకు తోడుగా అమ్మ, సుధ కూడా ఉంటారు." అని చెప్పిన శ్రీకర్ మాటలకు "వద్దు బావా! అలాగ బావుండదు " అని చెప్పింది శోభ.
"నీవేమన్నా పరాయిదానివా? మా ఇంట్లోనే ఉండు." అన్న శ్రీకర్ మాటలకు "సరే" అని తను ఆ ఊరికి వచ్చే తేదీని చెప్పి ఫోన్ పెట్టింది శోభ.
ఒక్కసారిగా శ్రీకర్ ఆలోచనలు గతంలోకి వెళ్లాయి. శోభ తన మేనత్త కూతురు. తమ ఊరు, మేనత్త ఊరు దగ్గర దగ్గర ఊళ్లు అవటంతో చిన్నతనం నుంచి కలిసిమెలిసి పెరిగారు శోభా, తను. ఎదిగేకొద్దీ చుట్టుపక్కల వాళ్లు, బంధువులు చాలా మంది వాళ్లిద్దరూ కాబోయే భార్యాభర్తలనుకునేవారు.
వ్యవసాయదారులైన రామయ్య, తులశమ్మ దంపతులకు శ్రీకర్ ఏకైక కొడుకు. చిన్నతనం నుంచి కష్టపడి చదివే శ్రీకర్ తను డాక్టరు అవ్వాలని ఎన్నోకలలు కనేవాడు. అందుకోసం ఎంతో కష్టపడి చదువుతూ టెంత్ క్లాసు మంచిమార్కులతో పాసయ్యాడు. అతని ఇష్టాన్ని గ్రహించిన రామయ్య వాళ్లు అతన్ని పట్నంలో మంచి కాలేజీలో చేర్పించి, అక్కడే హాస్టల్ లో ఉండేట్లు ఏర్పాటు చేశారు.
శ్రీకర్ కష్టపడి చదువుతూ ఇంటర్ పూర్తి చేసి మెడిసిన్ లో చేరాడు. అతను మెడిసిన్ 3వ సం… చదువుతూండగా రామయ్య కార్డియాక్ అరెస్టుతో అకాలమరణం చెందాడు. జరిగిన దారుణానికి తులశమ్మ, శ్రీకర్ లు చాలా బాధపడి మిగిలిన తంతు పూర్తి చేశారు. ప్రక్క ఊరిలోనే ఉండే మేనత్త శకుంతల కుటుంబం కూడా బాధపడి శ్రీకర్ వాళ్లను ఓదార్చారు. తర్వాత కొన్నాళ్లకు శ్రీకర్ తన తల్లిని ఒంటరిగా ఉంచలేక తనతో తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత 2 సం..కి శ్రీకర్ మెడిసిన్ పూర్తిచేసి, M.D కూడా చేసి హాస్పిటల్ లో డాక్టర్ గా చేరి క్రమేణా మంచిపేరు తెచ్చుకున్నాడు.
శకుంతలమ్మ ఏకైక కూతురు శోభ మెడిసిన్ చదివి, గైనకాలజిస్టుగా వేరే ఊరిలో చేస్తోంది. స్వతహాగా కలివిడిగా ఉండే శోభ, స్నేహాలు అంటూ అందరితో కలుపుగోలుగా తిరుగుతూ సినిమాలు, షికార్లు చేసేది. శోభ ప్రవర్తన తెలిసి ఆమెని కాస్త దూరంగా పెట్టి శ్రీకర్ కు మంచి సంబంధాలను వెతకసాగింది తులశమ్మ. శ్రీకర్ కు శోభ అంటే ఇష్టమే కానీ జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఏనాడూ తన మనసులో మాట ఆమెకు చెప్పలేదు. శోభకు ఇప్పుడే పెళ్లి, సంసారమనే జంజాటం ఇష్టం లేదు. హాయిగా హాస్పిటల్ లో ఉద్యోగం చేసుకుంటూ కొన్నాళ్లు స్వేఛ్ఛగా ఉండాలని ఆమె కోరిక.
తులశమ్మకు సుధా వాళ్ల సంబంధం నచ్చడం, శ్రీకర్ కు, సుధకు ఒకళ్లనొకళ్లు నచ్చడంతో సుధనిచ్చి పెళ్లి చేసింది తులశమ్మ. MBA చదివిన సుధ స్వతహగా అందగత్తె, తెలివైనదీ, చురుకైనదీ. పెళ్లైనాక సుధ శ్రీకర్ తో కాపురానికొచ్చింది. సుధ కూడా ఒక మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.
శ్రీకర్, సుధలు సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. తన తండ్రి మరణం తర్వాత శోభ వాళ్లతో ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. మరల ఇన్నాళ్లకు శోభ నుంచి ఫోను. ఏదో అలికిడయితే ఆలోచనల నుంచి తేరుకుని చూశాడు శ్రీకర్. ఎదురుగా నర్స్. పేషంట్ వెయిట్ చేస్తున్నాడని చెప్పడంతో తన విధిలో నిమగ్నమయ్యాడు శ్రీకర్.
తర్వాత తన పని ముగించుకుని ఇంటికి వెళ్లి తల్లికీ, భార్యకు చెప్పాడు శోభ ఫోన్ చేసి చెప్పిన విషయం. అంతా విని తులశమ్మ మౌనం వహించగా సుధ, '2నెలలేగా శోభ కూడా మనతోనే ఉంటుం’దనడంతో సంతోషంగా ఉన్నాడు శ్రీకర్.
తర్వాత 2 రోజులకు శోభ వీళ్లింటికి రావడం జరిగింది. తులశమ్మ, సుధ, శ్రీకర్ లు ఆప్యాయంగా ఆదరించగా శోభ తన విధులకు వెళ్లివస్తూ వీళ్లతో సరదాగా గడుపుతోంది. శోభ వచ్చి వారం అయింది. శోభ శ్రీకర్ తో ఎక్కువ చనువుగా ఉండటాన్ని గమనించిన సుధకి మనసులో కాస్త బాధ అనిపించినా, శోభ గురించి లోగడ శ్రీకర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్లు చిన్నప్పటినుంచీ కలిసి మెలిసి తిరిగిన చనువని, తను తన భర్తని అపార్థం చేసుకోగూడదని, ఇంకొన్నిరోజులలో ఆమె వెళుతుందని తన మనసులోంచి ఆ విషయాన్ని తీసేసి, ఆప్యాయంగా శోభని చూస్తోంది సుధ.
తులశమ్మ, శోభ ప్రవర్తనని గమనించి శోభని కాస్త హెచ్చరించుదామనుకుని.. దాని వలన శ్రీకర్ కు ఏంకోపం వస్తుందో, దాని వలన సుధ, శ్రీకర్ ల మధ్య మనస్పర్ధలొస్తాయేమో.. ఇంకాస్త శృతిమించితే శోభని హెచ్చరించవచ్చని మిన్నకుండిపోయింది. ప్రతిరోజూ ముగ్గురు వాళ్ల విధుల నిమిత్తం బయటికి వెళుతుంటే తులశమ్మ ఒక్కతే ఇంట్లో ఉంటోంది.
ఒకనాడు శ్రీకర్ తనకు కేసులేవీ లేని కారణంగా రోజూ కంటే ముందుగా ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత కాసేపటికి శోభ ఇంటికి వచ్చింది. ఇద్దరూ తమ యూనీఫారంతోనే ఉన్నారు. కాఫీ, స్నాక్స్ తీసుకున్నాక శ్రీకర్ తన గదిలోకి వెళ్లాడు. తులశమ్మ వంటగది లోకి వెళ్లి సాయంత్రం వంటపనిలో నిమగ్నమైపోగా శోభ నెమ్మదిగా శ్రీకర్ గదిలోకి వెళ్లింది.
వాళ్ల గదిలోంచి సరదాగా కబుర్లు వినబడుతున్నాయి తులశమ్మకు. సరదాగా కబుర్లే కదా, ఇంకాసేపట్లో సుధ ఇంటికివచ్చే వేళవుతోందని ఆలోచనతో ఉంది. క్రమేణా వాళ్లిద్దరి కబుర్లు ఆగిపోగా 'ఏంటా?' అని ఆ గదివేపు తొంగిచూసి బిత్తరపోయింది తులశమ్మ.
ఆ గది తలుపులు ఓరగా తెరిచే ఉన్నాయి. వాళ్లిద్దరూ చాలా సన్నిహితంగా ఉండటమే కాక శ్రీకర్ కౌగిలిలో శోభ. తన రాకని వాళ్లు గమనించే స్ధితిలో లేరని గ్రహించిన తులశమ్మ చిన్నగా దగ్గింది. తృళ్లిపడి వాళ్లిద్దరూ ఈలోకంలోకి వచ్చి కొంచెం దూరం జరిగారు. తులశమ్మ ఆవేశంగా ఏదో అనబోయేంతలో అప్పుడే వచ్చిన సుధ అక్కడి సన్నివేశాన్ని చూసి జరిగింది అర్థం చేసుకుంది.
"మీరాగండి అత్తయ్యా! నేను మాట్లాడుతాను " అని ముందుకెళ్లి వాళ్లకెదురుగా నిలబడి ఛడామడా శోభని తిట్టి “ఈ క్షణమే నీవు మా ఇంటినుంచి బయటికెళ్లు. నీ వలన పచ్చని మా కాపురం కూలబోతోంది. ఇంకెప్పుడూ నీవు నా భర్తని కలవద్దు. మర్యాదగా తక్షణమే వెళ్లిపో. " అని తన సూట్కేసు ను తెచ్చి శోభ చేతికిచ్చి బయటకు పంపింది సుధ. జరిగిన అవమానానికి ముఖం కందగడ్డలా పెట్టుకొని గబగబా చెప్పులేసుకుని సూట్కేసుని తీసుకుని వెళ్లింది శోభ.
శోభ వెళ్లినవైపే చూస్తూ ఉన్న భర్తను "చూడండి. నేను శోభని మాత్రమే నిందించాననని.. అంతమాత్రాన ఇందులో మీ తప్పేమీ లేదని, మీరు శ్రీరామచంద్రుడని సమర్ధించుకోవద్దు. రెండు చేతులు మ్రోగితేనే చప్పట్లు. ఆ అమ్మాయి అలా ఉన్నా మీ బుద్ధి ఏమయ్యింది? మీరు ఆమెని దూరంగా ఉంచచ్చు కదా! ఇప్పటిదాకా నాభర్త శ్రీరామచంద్రుడు, పరస్త్రి వైపు కన్నెత్తి కూడా చూడడు. నేను చాలా అదృష్టవంతురాలినని మురిసిపోయాను. మీ నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది. నేను మీకేం లోటు చేశాను? నాకెందుకింత ద్రోహం చేశారు?" అని ఆవేదన, ఆక్రోశంతో భర్తని నిలదీసింది సుధ.
జరిగిన దానికి సిగ్గుతో తలవంచుకుని "నన్ను క్షమించు సుధా. నేను చాలా తప్పుచేశాను. ఇంకెన్నడూ ఎలాంటి పొరపాటు చేయను. నన్ను నమ్ము. ప్రామిస్. అమ్మా! నీవు కూడా నన్ను క్షమించాలి." అని అన్న శ్రీకర్ ను దగ్గరకు తీసుకుని "నీవిలా చేస్తావని నేను కలలో కూడా ఊహించలేదు. ఇప్పటికైనా నీవు నీ తప్పు తెలుసుకున్నావు. సుధ బంగారంలాంటి భార్య. ఇంకెప్పుడూ ఎలాంటి తప్పూ చేయనని నా మీద ఒట్టుపెట్టు" అన్న తల్లి మాటలకు కన్నీళ్లతో ఆమె కాళ్లకు నమస్కరించి " నన్ను నమ్ము అమ్మా! ఇంకెన్నడూ ఎలాంటి పొరపాటు పనీ చేయను." అన్న కొడుకుని లేవదీసి ప్రేమతో హత్తుకుంది తులశమ్మ.
"నన్ను క్షమించు సుధా! నేను చాలా తప్పు చేశాను. ఇంకెప్పుడూ ఎలాంటి పొరపాటు చేయను. జరిగిన దానికి నేను చాలా పశ్చాత్తాపపడుతున్నాను. నన్ను నమ్ము" అన్న భర్తని క్షమించి అతని వైపు చూస్తున్న సుధని ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు శ్రీకర్. సంతోషంతో భర్త కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయింది సుధ.
ఆ భగవంతుని దయవలన వాళ్ల మధ్య మనస్పర్థలు ఏర్పడలేదని సంతోషంతో ఆ దేవునికి మనసులో కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వంటగదిలో ఇంతకు ముందు వదిలేసిన మిగిలినపనిని పూర్తి చేయడానికి వెళ్లింది తులశమ్మ.
సమాప్తం.
నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏
బాగుందండి కథ👍👌. భర్తను తప్పుదారిలో వెళ్ళకుండా సరైన సమయంలో గ్రహించింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంత పశ్చాత్తాపం చెందినా చేసినది ఒప్పు కాలేదు, తర్వాత ఎంతో మనస్తాపం చెందాల్సి వచ్చేది.