top of page
Writer's pictureLV Jaya

పటాకా   

#అత్తగారికథలు #అత్తాకోడళ్ళకథలు, #LVJaya, #LVజయ, #Pataka, #పటాకా


Pataka - New Telugu Story Written By L. V. Jaya

Published in manatelugukathalu.com on 19/11/2024 

పటాకా - తెలుగు కథ (అత్తగారి కథలు - పార్ట్ 9)

రచన: L. V. జయ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జాగృతి, సమర్థ్ ల నిశ్చితార్థానికి, ఇద్దరివైపు దగ్గర బంధువులు కలిశారు. జాగృతి వాళ్ళ అమ్మ లత, సమర్థ్ ని, జాగృతి బాబాయ్, పిన్ని అయిన పార్థసారథికి, లలితకి పరిచయం చేసింది. 


లలిత, లతని పక్కకి పిలిచి, "అక్కా, ఫొటోలో చూసినప్పుడు అబ్బాయి బాగానే ఉన్నాడని అనిపించింది. కానీ, ఇప్పుడు చూస్తే, జాగృతి కన్నా వయసులో చాలా పెద్దవాడిలాగా అనిపిస్తున్నాడు. అన్నీ సరిగ్గా చూసుకునే ఈ సంబంధానికి ఒప్పుకున్నారా?" అని అడిగింది. 


"నాకూ అలానే అనిపిస్తోంది వదినా." అన్నాడు పార్థసారథి.


"అయ్యో. అలా అంటారేంటి ఇద్దరూ? నేను అంతా చూసుకున్నాను. అబ్బాయి, జాగృతికన్నా సంవత్సరమే పెద్దవాడు." అంది లత. 


"అబద్దాలు చెప్పి, పెళ్ళిచేసేవాళ్ళు ఉన్నారు అక్కా. అబ్బాయి తల్లిని చూస్తే, నాకు అనుమానంగా ఉంది. పెళ్ళి తరువాత, జాగృతిని సరిగ్గా చూసుకుంటారో లేదో?" అని తన అనుమానాన్ని వ్యక్తం చేసింది లలిత.


"ఆవిడతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు పటాకా లాగ పేలుతుందో తెలియదు అని చెప్పారు కొందరు. అబ్బాయి మాత్రం చాలా మంచివాడు. జాగృతి అంటే చాలా ఇష్టమున్నట్టు తెలుస్తోంది." అంది లత.


"సరే మీ ఇష్టం." అన్నారు ఇద్దరూ. 


పార్థసారథికి, మాత్రం సమర్థ్ వయసు మీద ఉన్న అనుమానం తీరలేదు. "మా వదిన, జాగృతిని పెద్దవాడికిచ్చి పెళ్ళిచెయ్యబోతున్నారనిపిస్తోంది." అన్నాడు లలితతో. 


"మనం చెప్పి చూసాం. ఆవిడకి అభ్యంతరం లేనప్పుడు, మనం మాత్రం ఏం చేస్తాం? పీటల మీద కూర్చొని, పెళ్లి చెయ్యడం వరకే మన భాద్యత. అదే చేద్దాం." అని నచ్చచెప్పింది లలిత. 


వీళ్ళు మాట్లడుకోవడాన్ని దూరంనుంచి చూసిన సమర్థ్ వాళ్ళ అమ్మ రాధ, "ఏమిటీ? మీలో మీరే చెవులు కొరుక్కుంటున్నారు? మీకేమైనా అనుమానలేమైనావుంటే, ఇప్పుడే అడిగెయ్యండి. అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలు కదా." అంది.


"అనుమానాలేమి లేవండి. ఎదో ఊరకనే మాట్లాడుకుంటున్నాం." అని మాటదాటవేసాడు పార్థసారథి. 


నిశ్చితార్థం అయ్యింది. 


************************************************************


పెళ్లిలో, పెళ్ళికొడుకు కాశీయాత్రకు వెళ్ళే సమయం వచ్చింది. ఎంతో సరదాగా సాగే ఈ సన్నివేశం చూడడానికి, బంధువులందరూ చుట్టూ చేరారు. 


ఒకచేత్తో కర్ర, మరో చేత్తో గొడుగు పట్టుకుని, భుజానికి మూట తగిలుంచుకొని, పాదాలకి చెక్క పాదుకలు వేసుకుని, కాశీయాత్రకి బయలుదేరాడు సమర్థ్. కుంటుంకుంటూ, నెమ్మదిగా నడుస్తున్న సమర్థ్ ని చూసి, 'పెళ్ళికొడుకు కుంటుతున్నాడేంటి?' అనుకున్నారు అందరూ.


పార్థసారథి కూడా సమర్థ్ కుంటుతూ నడవడం చూసాడు. "చెక్కపాదుకలు వేసుకున్నందుకు అలవాటు లేక అలా నడుస్తున్నాడా? లేక నిజంగా కుంటుతున్నాడంటావా?" అని అడిగాడు లలితని. 


"ఏమోనండి. నాకూ అదే అర్ధంకావటంలేదు." అంది లలిత. 


సమర్థ్, పెద్దవాడేనేమోనన్న అనుమానం పెరిగింది పార్థసారథికి. 


******************************************************* 


కన్యాదాన సమయంలో, పాదాల్ని పళ్లెంలో పెట్టమని సమర్థ్ తో చెప్పాడు పురోహితుడు. పాదాలని కడగాల్సిన పార్థసారథి, పొంగిపోయున్న సమర్థ్ పాదాలని చూసి ఆశ్చర్యపోయాడు. 


"మన అనుమానం నిజమేనేమో అనిపిస్తోందండి." అని ఎవరికీ వినపడకుండా, నెమ్మదిగా, పార్థసారథి తో అంది లలిత.


"మనం చెప్పినా వినకుండా, జాగృతిని, పెద్దవాడికిచ్చి పెళ్ళిచేస్తున్నారు మా వదిన. ఈ అన్యాయం, మన చేతుల మీదుగా చెయ్యాల్సివస్తోంది." అన్నాడు పార్థసారథి బాధపడుతూ.


"మన ప్రయత్నం మనం చేసాం. ఇప్పుడేం చెయ్యగలం?" అని అడిగింది లలిత.


"ఇంతవరకూ వచ్చాక, ఇప్పుడు ఇంకేం చేస్తాం? నువ్వింకేం మాట్లాడకు." అన్నాడు పార్థసారథి కళ్ళుతుడుచుకుంటూ. 


సమర్థ్ పాదాలని కడిగి, కన్యాదాన కార్యక్రమం పూర్తిచేసాడు పార్థసారథి.


***********************************************


అప్పగింతలు కార్యక్రమం కూడా అయ్యాక, కొత్తకోడలిని, అత్తగారింటికి తీసుకువెళ్ళటానికి సిద్ధమయ్యారు సమర్థ్ వాళ్ళు. జాగృతిని ఇక పంపెయ్యాలన్న భాదతో, జాగృతి తరపు బంధువులందరూ జాగృతి చుట్టూ చేరారు. 


ఈలోగా, సమర్థ్ పాదాల గురించి, నడక గురించి బంధువులు మాట్లాడుకుంటున్న మాటలు, అందరినోటా పడుతూ, ఆఖరుకి, పడకూడని రాధ చెవిన పడ్డాయి. కోపంతో ఊగిపోయింది రాధ. లతని వెంటనే పిలిపించమని చెప్పింది. 


'ఇప్పటివరకు అన్నీ బాగానే జరిగాయి కదా. ఇప్పుడు, ఎందుకింత హుటాహుటిన రమ్మన్నారు? ఏమి జరిగి ఉంటుంది?' అన్న భయంతో రాధ దగ్గరికి వచ్చింది లత. 


లతని చూస్తూనే, "మీ అమ్మాయిని, మేము, మాతో తీసుకువెళ్ళడం లేదు. మీరు, మీ అమ్మాయిని, మీ దగ్గరే ఉంచుకోవచ్చు." అంది రాధ అరుస్తూ. 


బిత్తరపోయింది లత. రాధ చేతులు పట్టుకుని, "ఏమయ్యింది వదినగారు. మా వల్ల ఏమన్నా తప్పుజరిగిందా?" అని అడిగింది దీనంగా.


"నా కొడుకు గురించి, మీ వాళ్ళు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలాంటి సంబంధం చేసుకున్నందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి." అంది రాధ కోపంగా. 


ఆశ్చర్యపోయింది లత. "ఎవరన్నారండి? ఏమన్నారు?" అని అడిగింది భయంగా. 


"అందరినీ పిలిపించండి. ఎవరన్నారో, ఏమన్నారో మీకే తెలుస్తుంది." అంది రాధ. ఏం జరిగిందో తెలియక, ఎవరిని ఏం అడగాలో తెలియక, కూలబడిపోయింది లత. 


వీళ్లిద్దరి మాటలు విన్న రాధ బంధువు ఒకాయన, "దీపావళి పటాకా పేలుతుంది లోపల. అందరూ రండి." అంటూ, అరుస్తూ, బంధువులందరినీ పిలిచాడు. రాధ, ఎదో పెద్ద సమస్యే తెచ్చుంటుందని అర్ధమయ్యింది అందరికీ. సమర్థ్ కూడా, రాధ ఏంచెయ్యబోతోందో అన్న భయంతో, గబగబా కుంటుకుంటూ వచ్చాడు. లత తరపు చుట్టాలకి కూడా ఈ విషయం తెలిసి వచ్చారు.


అందరూ వచ్చి చూసే సమయానికి, రాధ, కుర్చీలో, కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉంది. రాధ చేతులు పట్టుకుని, కుర్చీపక్కన, నేలమీద కూర్చుని ఏడుస్తోంది లత. లత తరపు బంధువులు, కంగారుగా లత చుట్టూ మూగారు. ఏమయ్యింది అని అడిగినా, లత ఏమి చెప్పకుండా, ఏడుస్తూనే ఉంది.


"అమ్మా. ఏం జరిగింది. ఏంటి ఇందంతా?" అని రాధని అడిగాడు సమర్థ్.


"నన్నడుగుతావేం? ఏరికోరి చేసుకున్నావ్ కదా. నిన్ను, కుంటివాడు, బోదకాళ్ళ వాడు అంటున్నారు వాళ్ళు. వీళ్లు వద్దు. వీళ్ళ పిల్ల వద్దు. పద. ఆ అమ్మాయిని ఇక్కడే వదిలేసి, మనం మనింటికి వెళ్ళిపోదాం." అంది రాధ కోపంతో ఊగిపోతూ.


"మా వాళ్ళు ఎవరూ అలా అనరు బాబు. దయచేసి, మా అమ్మాయిని, మీతో తీసుకువెళ్ళండి." అంటూ బతిమాలుకుంది లత.


లతని లేపి నించోబెట్టి, "మీరు బాధపడకండి. మీ అమ్మాయికి ఏమీ కాదు." అన్నాడు సమర్థ్. రాధతో, "అమ్మా. నువ్వు ఆగు. నన్ను ఎవరూ కుంటివాడు, బోదకాళ్ళవాడు అనలేదు. ఎవరన్నారో, ఏమన్నారో నేను విన్నాను. ఇందులో, వాళ్ల తప్పు కూడా ఏమిలేదు. వాళ్ళ భయాలేవో వాళ్ళకీ ఉంటాయి. నేను ఎందుకు కుంటుతున్నానో వాళ్ళకి తెలియదు కదా. నేను మాట్లాడతానుండు." అని రాధని శాంతపరిచాడు. 


అక్కడ చేరినవాళ్లందరిని చూసి, నవ్వుతూ, "వారంరోజుల క్రితం, మనమందరం దీపావళి చేసుకున్నాం కదా. ఆ రోజు, చుట్టాలందరూ ఇంట్లోనే ఉండడంతో, సంతోషంగా, అందరం కలిసి, దీపావళి పటాకాలు కాల్చుకున్నాం. అప్పుడు, భూచక్రం ఒకటి నా పాదాల మీద నుండి వెళ్ళింది. చిచ్చుబుడ్డి పేలి, నా కాళ్ళ మీద పడి, గాట్లు పడ్డాయి. ఆ బాధనే తట్టుకోలేకపోతుంటే, మా వాళ్ళు, పెళ్ళికొడుకుని చేసిననప్పుడు రాసిన పసుపు లోపలకి వెళ్ళి, పాదాలు, కాళ్ళు పొంగిపోయాయి. అందుకే, కుంటుతూ నడుస్తున్నాను. అది విషయం." అన్నాడు.


"అయ్యో. ఆ విషయం మాకు ముందే చెప్పచ్చు కదయ్యా." అన్నాడు పార్థసారథి చేతులు జోడిస్తూ.


"మా వాళ్లందరికీ ఈ విషయం తెలుసు. మీరందరూ, ఆడపెళ్ళివాళ్ళు. పెళ్ళి హడావిడిలో ఉన్నారు కదా. అందుకే మీకు చెప్పలేదు. జాగృతి అంటే ఇష్టమున్న వాళ్ళకి, తనకి తగిన భర్త వచ్చుంటే బాగుంటుంది అనిపించడంలో తప్పులేదు. ఇప్పటికైనా, నా మీద ఉన్న అనుమానాలు అందరికీ తీరుంటాయని అనుకుంటున్నాను." అన్నాడు సమర్థ్, పార్థసారథిని, లలితని చూస్తూ. పార్థసారథి, లలిత తప్పుచేసినట్టుగా, ఒకళ్ళమొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. 


"మా వల్ల జరిగిన తప్పుల్ని క్షమించండి. జాగృతిని, మీ ఇంటికి తీసుకువెళ్ళి, జాగ్రత్తగా చూసుకోండి." సమర్థ్ చేతులు పట్టుకుంటూ, అన్నాడు పార్థసారథి.


"మీరు పెద్దవాళ్ళు. మీరు క్షమాపణలు చెప్పకండి." అని పార్థసారథి తో అని, "జాగృతి నా భార్య. తనకి ఏ బాధ రాకుండా చూసుకునే బాధ్యత నాది." అన్నాడు లతతో. సమర్థ్ అన్న మాటలకి కళ్ళు తుడుచుకుని, తన నిర్ణయం సరైనదే అని మురిసిపోయింది లత. 


సమర్థ్, రాధ వైపు తిరిగి, "అమ్మా. ఇది ఎవరూ కావాలని చేసినది, అన్నది కాదు. ఇందులో ఎవరి తప్పు లేదు. జాగృతిది అసలు లేదు. తననెందుకు ఇక్కడే వదిలెయ్యాలి. మనతో తీసుకువెళ్ళద్దు అన్నావ్?" అని రాధని సూటిగా ప్రశ్నించాడు సమర్థ్. కొడుకుకి, ఏం చెప్పాలో తెలియక, చేసిన తప్పుకి తలదించుకుంది రాధ.


"నువ్వు, మా అమ్మాయి, పటాకాల నుండి కొంచెం దూరంగా ఉండండి బాబు." అంది లలిత.


"ఏ పటాకా నుండి?" అన్నారు సమర్థ్ బంధువుల్లో ఒకరు. ఆ మాటకి అర్ధం తెలిసినవాళ్ళందరూ నవ్వుకున్నారు. 


***


L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : LV జయ

నా పేరు LV జయ. 
https://www.manatelugukathalu.com/profile/jaya

నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం. 
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

ధన్యవాదాలు



51 views1 comment

1 Comment


mk kumar
mk kumar
Nov 21

"పటాకా" అనేది L.V. జయ గారు రాసిన కథ, ఇది ఒక వివాహం నేపథ్యంలో కుటుంబ సంబంధాలు, అవగాహన లోపాలు, కొన్ని సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఈ కథలో, పెళ్లి పెరిగే సమయంలో పెళ్లి కొడుకును సంబంధించి జాగృతి కుటుంబం అనుమానాలు వ్యక్తం చేస్తుంది, ముఖ్యంగా సమర్థ్ కుంటిగాకనిపిస్తున్నాడనే ఆందోళనతో. ఈ అనుమానాలు పెళ్లి దరిమిలా పెరిగి, చివరికి ఒక నిజం బయటపడుతుంది.


కథలో, సమర్థ్ కుంటి నడక ఆతిథ్య పటాకాలతో (పటాకాలు) జరిగిన ప్రమాదం వల్ల వచ్చింది. శరీర సంబంధమైన సమస్య వల్ల కాదు, అని అర్ధమవుతుంది. మొదటివ్యక్తీకరించిన అవగాహన తప్పు అని తెలిసి, జాగృతి కుటుంబం సమర్థ్ కి క్షమాపణలు చెప్పి, అతన్ని ఓకే చేస్తారు.


ఈ కథా వివరణ సన్నివేశాలు చాలా హాస్యంగా, లోతైన సందేశం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇది కుటుంబ, అవగాహన లోపాలు, పరస్పర చర్చల అవసరం గురించి తెలుపుతుంది.


Like
bottom of page