top of page

పవిత్ర స్నేహబంధం

Writer's picture: Neeraja PrabhalaNeeraja Prabhala

#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #పవిత్రస్నేహబంధం, #PavithraSnehabandham, #TeluguKathalu, #తెలుగుకథలు



Pavithra Snehabandham - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 06/01/2025

పవిత్ర స్నేహబంధం - తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ఉదయాన్నే  ఇంటి పనులు  ముగించుకుని కాస్త విశ్రాంతి  తీసుకుంటున్న  రమ్య  తన సెల్ ఫోన్  మ్రోగితే  ఫోన్ ఎత్తింది.

  

"అమ్మా! నీవు, నాన్నగారు  బాగున్నారా ?  ఇప్పుడు నీతో ఒక అంకుల్ మాట్లాడుతారు.  ఎవరో గుర్తుపట్టు. నీవు చాలా  సంతోషిస్తావు.ఆయనకు ఫోన్ ఇస్తున్నాను " అంది  అమెరికాలో ఉంటున్న కూతురు  స్వాతి.


"హాయ్ రమ్యా ! ఎలా  ఉన్నావు? " అవతలనుంచి మధురమైన  అతని  పలకరింపు .ఆ కంఠస్వరం తనకు  చాలా  పరిచయమైనట్టు, విని  చాలా కాలమైనట్టనిపిస్తోంది. ఇంతలో  అతనే  "ఇంకా  గుర్తుపట్టలేదా మొద్దూ !  అని "తేనెల తేటల మాటలతో  మన దేశ మాతనే  కొలిచెదమా"  అని మధురంగా  పాడాడు. అది తన బాల్య మిత్రుడు  విజయ్ గొంతు. తనకెంతో ఇష్టమైన అతని పాట. ఇద్దరిదీ  ఒకే  ఊరు, ఒకే  స్కూలులో చదువుకున్నారు.


"హాయ్  విజయ్!  ఎలా ఉన్నావు? ఎన్నేళ్ళయింది  నిన్ను  చూసి ? " అడిగింది  సంభ్రమాశ్చర్యాలతో రమ్య.


"హమ్మయ్య ! గుర్తుపట్టావు. బాగున్నాను. 35 సం.. అయింది మనం కలిసి. "  అని తన  గురించి చెప్తూ  మంచి  డాక్టర్ గా   అక్కడ  స్థిరపడిన వైనం చెప్పి ,తన భార్య, పిల్లల  గురించి  వివరాలు చెప్పాడు."నీ గురించి చెప్పు. ఎలా ఉన్నావు? మీ ఆయనేంచేస్తున్నాడు?. పిల్లలెంత మంది?" వగైరా ప్రశ్నలకు  ఆనందంగా  సమాధానం చెప్పింది  రమ్య.


"నిన్ను చూడాలని ఉంది  రమ్యా!   ఈనెల 15న  తేదీన  ఇండియాకు   వస్తున్నాను. రవీంద్రభారతిలో నాకు  సన్మానం . తప్పకుండా రా ! నీ  నెంబర్ ను   స్వాతి  వద్ద తీసుకుంటాను. నీకు  మళ్ళీ  ఫోన్ చేసి  మీ ఆయన్ను స్వయంగా  ఆహ్వానిస్తాను.  తప్పకుండా రండి  " అని  ఫోన్ పెట్టేశాడు.


 ఆనందంగా  ఫోన్ పెట్టేసిన  రమ్య  గత స్మృతులను  గుర్తుకు తెచ్చుకుంది. తను, విజయ్  చిన్నప్పటి నుంచీ  బాగా ఆడుకునేవాళ్ళం. కలిసి చదువుకునేవాళ్ళం. తనంటే అతనికి ప్రాణం.అతనంటే  తనకు  కూడా అంతే. ఇద్దరిదీ ఒకే ఊరు‌, ఒకేస్కూలు, దగ్గర దగ్గర  ఇళ్ళు అవటం  వలన  ఇద్దరం  10వతరగతి  వరకూ  ఆటపాటలతో సరదాగా గడిపేవాళ్ళం....చదువులో పోటీ పడి  ప్రతి తరగతి లోను  అతను  ప్రధమ, తను  ద్వితీయ శ్రేణులు తెచ్చుకుని  ఉపాధ్యాయుల, తోటి స్నేహితుల  అభిమానం  చూరగొనేవాళ్ళం. 


తనకు అతను  ప్రతివిషయంలోనూ  చాలా  సాయంచేసేవాడు.తనను  వాళ్ళ పేరెంట్స్  కూడా చాలా  ప్రేమగా  చూసుకునేవాళ్ళు.అలా  తమిద్దరి బాల్యం  ఆటపాటలతో చాలా హాయిగా, సరదాగా గడుపుతూ ఉండగా 10 వతరగతి పరీక్షలలో  అతను స్కూలు  ప్రధమ, తను  ద్వితీయ  శ్రేణుల్లో ఉత్తీర్ణులయ్యాము. ఆ తరువాత అతను వేరే ఊరిలో పై చదువులకు వెళ్ళాడు. తనకు  పెద్దలు వేరే వ్యక్తి తో   వివాహం చేయటం, తన  పేరెంట్సు  కూడా  హైదరాబాద్ కు  వచ్చి స్ధిరపడటంతో  ఇంక అతని గురించి ఏ  వివరాలు  తెలీలేదు. అప్పుడు ఈ కాలంలో లాగా  స్నేహితులు,  ఫోను వసతులు కూడా లేవు కదా!


ఆతర్వాత  సంసార  జంఝాటంలో పడి  ముగ్గురు పిల్లలు, వాళ్ళ  పెంపకం, చదువులు‌, బాధ్యతలతో ఇన్నేళ్ళూ గడిచిపోయాయి. ఇన్నేళ్ళల్లో  అతని క్షేమసమాచారాలు  తెలుసుకొన  ప్రయత్నించి విఫలురాలైంది. మరలా  ఇన్నేళ్ళకు స్వాతి ద్వారా అతనితో  మాట్లాడగలిగింది. ఏదో  శబ్దం రావడం తో త్రృళ్ళిపడి  వంట  గదిలోకెళ్ళి  బ్రేక్ ఫాస్ట్ చేసే

పనిలో మునిగిపోయింది  రమ్య. 


ఆతర్వాత  భర్త రవికి   టిఫిన్ పెట్టి " ఏమండీ! ఇందాక  స్వాతి  ఫోన్ చేసింది  అని, తన  బాల్య మిత్రుడు  విజయ్  మాట్లాడిన  విషయం చెప్పి  చిన్నప్పటి తమ  స్నేహం, అతను ఇండియాకు వచ్చే  విషయం, అతని సన్మాన  వివరాలు చెప్పి,  మనిద్దరినీ  ఆ వేడుకకు రమ్మని  ఆహ్వానించాడు, మీకు  మరలా తనే  స్యయంగా  చెప్పి ఆహ్వానిస్తానన్నాడు "  అంది  సంతోషంగా  రమ్య. వింటున్న  రవి  ముఖకవళికలు  మారటం  రమ్య ద్రృష్టిని  దాటిపోలేదు. 


"ఇంకేం. అయితే  నీ  ప్రియుడు అమెరికా నుండి  నిన్ను  కలవటానికి   వస్తున్నాడు  కదా!  ఇంక ఈ మొగుడిని  మర్చిపోయి  వాడితో  కులుకుతావా వాడున్నాన్నాళ్ళూ" అన్నాడు  రవి. భర్త  నీచమైన  భావన, ఏహ్యమైన మాటలకు చాలా జుగుప్స, మనసులో బాధ కలిగి  ఆవేశం  పెల్లుబుకింది  రమ్యకు .


"అతనన్న  మాటలు  వేరే ఎవరయినా అని ఉంటే వాళ్ళ  మొహం  ఈ జన్మలో  చూసేదాన్ని కాదు. కానీ ఈ బంధం అలా కాదే.... " . అగ్ని సాక్షిగా తాళికట్టిన  భర్త. 35 ఏళ్ల   సంసారం , ముగ్గురు పిల్లలు .ఇదా  ఇన్నేళ్ళల్లో  భర్త  తనను ఆర్ధం చేసుకున్నది. విజయ్ తో తన  పవిత్రమైన  స్నేహ బంధాన్ని ఇంత  నీచంగా ,సంస్కార హీనంగా  భర్త  మాట్లాడుతారా ?  అని  చాలా  బాధతో  విలవిలలాడింది  రమ్య. 


తిరిగి ఏదన్నా సమాధానం ఇస్తే  అప్పుడే  తనని చావ  గొడతాడు రవి. ఇలా  ఎప్పుడూ ఏదో ఒక  విషయానికి  రవి  తనమీద  చేయిచేసుకోవటం  పరిపాటి  అని తెలిసిన  రమ్య  తనలోని  కోపాన్నీ, బాధను , అవమానాన్ని  మనసులో నే  అణచుకుంటూ " మీ బుధ్ధి  పోనిచ్చుకున్నారు కాదు. ఎవరకీ - ఎవరితోనూ నీచమైన సంబంధాలు  అంటగట్టకూడదు. అది గుర్తుపెట్టుకోండి. సంస్కారవంతంగా  మాట్లాడటం, అలా  ప్రవర్తించటం  కూడా  ఒక  వరం. పవిత్రమైన మా స్నేహాన్ని  గురించి    నీచంగా  మాట్లాడే  మీ కుసంస్కారానికీ,  ఇన్నేళ్ళుగా  మీతో కాపురం చేసిన  మీ భార్యను  అనుమానించే  మీ  మనస్తత్వానికి చాలా  అసహ్యం  వేస్తోంది. దయచేసి  ఇంకెప్పుడూ  ఇలా మాట్లాడద్దు. మీకొక నమస్కారం . విజయ్ సన్మానం  రోజున  మీరొస్తే ఇద్దరం కలిసి  వెళ్ళి విజయ్ ను  చూసి ,అతన్ని  అభినందిద్దాము..మీరు రాకపోయినా  నేను  వెళ్ళి అతన్ని  చూసొస్తాను. పవిత్రమైన  మా మనస్సులను, మా స్నేహ బంధాన్ని  మీరు  అర్థం చేసుకుంటే   మీ భార్యగా  సంతోషిస్తాను."  అని  ఇంక తను అక్కడే ఉంటే    భర్త  నోటి  వెంట  ఏ మాటలు  వినాల్సొస్తుందో  ఏమో, ఆవేశంతో  దెబ్బలు  తినాల్సొస్తుందని  అక్కడి నుండి  ఏదో పని  ఉన్నట్టు వంట  గదిలోకి వెళ్ళింది  రమ్య. రవి ఆఫీసుకు  వెళ్ళిపోయాడు.


 ఇంకా  10 రోజులు  సమయం ఉంది  విజయ్ ఇండియాకు  రావటం, అతని  సన్మానవేడుకలు. ఈలోగా  తన మాటలకు  భర్త  వివేకంతో  స్పందించి మనసు మార్చుకుని  మంచి మనస్సుతో  తనతో  ఆవేడుకకు  రావాలని, తన బాల్య స్నేహితుడిని  సంతోషంగా  తన  భర్తకు  పరిచయం చేయాలనీ  ఉవ్విళ్లూరుతున్న  మనస్సుతో  ఆ భగవంతుడిని  ప్రార్థిస్తోంది   రమ్య. రమ్య  కోరిక  నెరవేరాలని  మనమందరం  ఆశిద్దాం.


.. సమాప్తం .. 


నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి  బిరుదు పొందారు



నా గురించి పరిచయం.....


 నా పేరు  నీరజ  హరి ప్రభల. మాది  విజయవాడ. మావారు  రిటైర్డ్  లెక్చరర్. మాకు  ముగ్గురు  అమ్మాయిలు. మాలతి, మాధురి, మానస.  వాళ్లు  ముగ్గురూ  సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా   విదేశాల్లో  ఉద్యోగాలు  చేస్తూ  భర్త, పిల్లలతో  సంతోషంగా ఉంటున్నారు. 


 నాకు  చిన్నతనం  నుంచి  కవితలు, కధలు  వ్రాయడం  చాలా  ఇష్టం. ఆరోజుల్లో  వాటిని  ఎక్కడికి,  ఎలా  పంపాలో  తెలీక  చాలా ఉండిపోయి  తర్వాత  అవి  కనుమరుగైనాయి.  ఈ  సామాజిక మాధ్యమాలు  వచ్చాక  నా రచనలను  అన్ని  వెబ్సైట్ లలో  వ్రాసి వాటిని పంపే  సౌలభ్యం  కలిగింది. నా కధలను, కవితలను  చదివి  చాలా  మంది పాఠకులు  అభినందించడం  చాలా  సంతోషదాయకం. 

నా కధలకు   వివిధ పోటీలలో  బహుమతులు  లభించడం,  పలువురి  ప్రశంసలనందుకోవడం  నా అదృష్టంగా  భావిస్తున్నాను. 


మన  సమాజంలో  అనేక  కుటుంబాలలో   నిత్యం  జరిగే  సన్నివేశాలు, పరిస్థితులు,   వాళ్లు  పడే  బాధలు కష్టాలు, ధైర్యంగా వాటిని   ఎదుర్కొనే  తీరు   నేను  కధలు వ్రాయడానికి  ప్రేరణ, స్ఫూర్తి.  నా కధలన్నీ  మన  నేటివిటీకి, వాస్తవానికి   దగ్గరగా ఉండి  అందరి  మనస్సులను  ఆకర్షించడం  నాకు  సంతోషదాయకం. నిత్యం జరుగుతున్న  దారుణాలకు, పరిస్ధితులకు   నా మనసు  చలించి  వాటిని  కధల రూపంలోకి  తెచ్చి  నాకు  తోచిన  పరిష్కారం  చూపే  ప్రయత్నం  చేస్తాను.   


నా  మనసులో  ఎప్పటికప్పుడు  కలిగిన  భావనలు, అనుభూతులు, మదిలో  కలిగే  సంఘర్షణలను   నా కవితలలో  పొందుపరుస్తాను. నాకు  అందమైన  ప్రకృతి, పరిసరాలు, ఆ సుందర  నైసర్గిక  స్వరూపాలను  దర్శించడం, వాటిని  ఆస్వాదించడం, వాటితో  మమేకమై మనసారా  అనుభూతి చెందడం  నాకు  చాలా ఇష్టం. వాటిని  నా హృదయకమలంలో  అందంగా  నిక్షిప్తం చేసుకుని   కవితల రూపంలో  మాలలుగా  అల్లి  ఆ  అక్షర మాలలను  సరస్వతీ దేవి  పాదములవద్ద  భక్తితో   సమర్పిస్తాను.  అలా  నేను  చాలా  దేశాల్లలో  తిరిగి  ఆ అనుభూతులను, అనుభవాలను   నా కవితలలో, కధలలో  పొందుపరిచాను. ఇదంతా  ఆ వాగ్దేవి  చల్లని  అనుగ్రహము. 🙏 


నేను గత  5సం… నుంచి  కధలు, కవితలు  వ్రాస్తున్నాను. అవి  పలు పత్రికలలో  ప్రచురణలు  అయ్యాయి. పుస్తకాలుగా  ప్రచురించబడినవి. 


“మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్” లో  నేను కధలు, కవితలు   వ్రాస్తూ ఉంటాను. ఆ వెబ్సైట్ లో   నాకధలకి  చాలా సార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు  లభించాయి.  వాళ్ల   ప్రోత్సాహం  జీవితాంతం  మరువలేను. వాళ్లకు  నా ధన్యవాదాలు. ఆ వెబ్సైట్ వాళ్లు   రవీంద్రభారతిలో  నాకు  “ఉత్తమ రచయిత్రి” అవార్డునిచ్చి  ఘనంగా  సన్మానించడం  నా జీవితాంతం  మర్చిపోలేను. ఆజన్మాంతం  వాళ్లకు  ఋణపడిఉంటాను.🙏 


భావుక  వెబ్సైట్ లో  కధల పోటీలలో   నేను  వ్రాసిన “బంగారు గొలుసు” కధ   పోటీలలో  ఉత్తమ కధగా  చాలా ఆదరణ, ప్రశంసలను  పొంది  బహుమతి  గెల్చుకుంది. ఆ తర్వాత  వివిధ పోటీలలో  నా కధలు  సెలక్ట్  అయి  అనేక  నగదు  బహుమతులు  వచ్చాయి.  ‘మన కధలు-మన భావాలు’  వెబ్సైట్ లో  వారం వారం  వాళ్లు  పెట్టే  శీర్షిక, వాక్యానికి కధ,    ఫొటోకి  కధ, సందర్భానికి  కధ  మొ… ఛాలెంజ్  లలో  నేను   కధలు వ్రాసి  అనేకమంది  పాఠకుల  ప్రశంశలను  పొందాను. ‘మన తెలుగుకధలు. కామ్  వెబ్సైట్ లో  “పశ్చాత్తాపం” అనే  నా  కధకు  విశేష స్పందన  లభించి  ఉత్తమ కధగా  సెలక్ట్ అయి  నగదు బహుమతి   వచ్చింది. ఇలా  ఆ వెబ్సైట్ లో  నెలనెలా   నాకధలు  ఉత్తమ కధగా  సెలెక్ట్ అయి  పలుసార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి.



ఇటీవల నేను  వ్రాసిన  “నీరజ  కథాకదంబం” 175 కధలతో పుస్తకం, “ఊహల అల్లికలు”  75 కవితలతో  కూడిన పుస్తకాలు  వంశీఇంటర్నేషనల్   సంస్థ వారిచే  ప్రచురింపబడి  మా గురుదంపతులు  ప్రముఖ వీణావిద్వాంసులు, రాష్రపతి  అవార్డీ    శ్రీ  అయ్యగారి శ్యామసుందరంగారి  దంపతులచే  కథలపుస్తకం,  జాతీయకవి  శ్రీ సుద్దాల అశోక్ తేజ  గారిచే   కవితలపుస్తకం  రవీంద్ర భారతిలో ఘనంగా  ఆవిష్కరించబడటం,  వాళ్లచేత  ఘనసన్మానం  పొందడం, బహు ప్రశంసలు, అభినందనలు  పొందడం  నాఅదృష్టం.🙏 


ఇటీవల  మన  మాజీ ఉపరాష్ట్రపతి  శ్రీ  వెంకయ్యనాయుడి గారిచే  ఘనసన్మానం పాందడం, వారి అభినందనలు, ప్రశంసలు  అందుకోవడం  నిజంగా  నా అదృష్టం. పూర్వజన్మ  సుకృతం.🙏


చాలా మంది  పాఠకులు  సీరియల్ వ్రాయమని కోరితే  భావుకలో  “సుధ” సీరియల్  వ్రాశాను. అది  అందరి ఆదరాభిమానాలను  పొందటమే  కాక   అందులో  సుధ  పాత్రని  తమ ఇంట్లో పిల్లగా  భావించి  తమ  అభిప్రాయాలను  చెప్పి  సంతోషించారు. ఆవిధంగా నా  తొలి సీరియల్  “సుధ”  విజయవంతం అయినందుకు  చాలా సంతోషంగా  ఉన్నది.        


నేను వ్రాసిన  “మమతల పొదరిల్లు”  కధ భావుకధలు  పుస్తకంలో,  కధాకేళిలో “మంచితనం-మానవత్వం” కధ, కొత్తకధలు-5 పుస్తకం లో  “ప్రశాంతినిలయం” కధ, క్షీరసాగరంలో  కొత్తకెరటం   పుస్తకంలో “ఆత్మీయతానుబంధం”, “గుర్తుకొస్తున్నాయి”   పుస్తకంలో  ‘అత్తింటి అవమానాలు’ అమ్మకు వ్రాసిన లేఖ, మొ…కధలు  పుస్తకాలుగా  వెలువడి  బహు  ప్రశంసలు  లభించాయి. 


రచనలు  నా ఊపిరి. ఇలా పాఠకుల  ఆదరాభిమానాలు, ఆప్యాయతలే  నాకు  మరింత  రచనలు  చేయాలనే  ఉత్సహాన్ని, సంతోషాన్నిస్తోంది. నా తుది  శ్వాస వరకు  మంచి రచనలు  చేయాలని, మీ అందరి  ఆదరాభిమానాలను  పొందాలని  నా ప్రగాఢవాంఛ. 


ఇలాగే  నా రచనలను, కవితలను  చదివి  నన్ను   ఎల్లప్పుడూ ఆశ్వీరదిస్తారని   ఆశిస్తూ 


                     మీ  అభిమాన రచయిత్రి

                       నీరజ హరి  ప్రభల.

                          విజయవాడ.

Photo Gallery








38 views0 comments

Comments


bottom of page