top of page

పెద్దయ్య పయనం!?.....



'Peddaiah Payanam' - New Telugu Story Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 24/04/2024

'పెద్దయ్య పయనం' తెలుగు కథ 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ



యానం..... గోదావరి నది గౌతమి శాఖ (బ్రాంచ్) ఒడ్డున ఉంది. ఇంగ్లీషు వారి పాలనా కాలంలో పాండిచ్చేరి, యానం ఫ్రెంచ్ పరిపాలనలో ఉండేవి. ఆ రెండు నేడు కేంద్రపాలిత ఒక రాష్ట్రాలుగా పరిగణింపబడుతున్నాయి.


యానం వద్ద గౌతమి నది వెడల్పు 1.8 కి.మీ. ఆ నదిపై బ్రిడ్జి నిర్మాణ 2003న పూర్తయింది. ఆ బ్రిడ్జి అమలాపురాన్ని, యానంని కలుపుతుంది.


పెద్దయ్య గారికి ఆ వూర్లో మంచిపేరు గల కుటుంబం. వారి తండ్రి గారి పేరు సత్యయ్య. గొప్ప ఈతగాడు. ఫ్రెంచ్ దొరలు కొందరు సత్యయ్య దగ్గర గౌతమి నదిలో ఈత నేర్చుకొన్నారు. ఆ పారంపర్యాన్ని తన కొడుకు పెద్దయ్యకు నేర్పాడు సత్యయ్య. ఆయనకు పెద్దయ్య ఒక్కడే కొడుకు. చాలా గారాబంగా పద్ధతిగా పెంచి పెద్దచేశాడు సత్యయ్య.


తనకు ఒక్కడే సంతానం అయినందున సత్యయ్య కొడుకు పెద్దయ్యకు ఇరవై సంవత్సరాల ప్రాయంలో కాకినాడ వాస్తవ్యులు మణేశ్వరయ్య కుమార్తె జానకితో ఘనంగా వివాహం జరిపించాడు సత్యయ్య. ఆ దంపతులను సత్యయ్య నాలుగురైదుగురు బిడ్డలను త్వరత్వరగా కనాలని దీవించాడు. కావలసినంత సంపద, వ్యవసాయం. రెండు లాంచీల మీదా ఆదాయం కల కుటుంబం వారిది (లాంచీలు యానం దరి నుండి అమలాపురం దరికి నదిపై తిరిగేవి) సత్యయ్య వారి అర్థాంగి విమలమ్మ. ఎంతో దైవభక్తి పరులు. దానధర్మాలు విరివిరిగా చేసేవారు. యానానికి చుట్టూప్రక్కల వున్న పల్లె ప్రాంతాల్లో సత్యయ్య గారి పేరు తెలియని వాళ్ళు వుండరు.


పెద్దయ్య వివాహం అయిన ఒకటిన్నర సంవత్సరానికి జానకమ్మ కవలలను కన్నది. మొదటి ఆడపిల్ల తరువాత మగబిడ్డ. ఆడబిడ్డకు చంద్రిక, మగబిడ్డకు సూర్య అనే నామకరణాలను చేశాడు సత్యయ్య. తండ్రి నిర్ణయించిన తన బిడ్డల పేర్లకు పెద్దయ్య, అతని భార్య జానకీలు బాగా ప్యాషన్‍గా ఉన్నాయని సంతోషించారు.


మరుసటి సంవత్సరం జానకి కవలలకు ప్రసవించింది. ఇద్దరూ మగపిల్లలే.

వారికి సత్యయ్య, రామలక్ష్మణులనే పేర్లను నిర్ణయించారు. నాలుగు సంవత్సరాల్లో ఇంట్లో నలుగురు వారసులు. పెద్దవారైన సత్యయ్య, విమలమ్మలకు ఎంతో ఆనందం... ఒకనాడు సత్యయ్య తన కొడుకు పెద్దయ్యను దగ్గరకు పిలిచాడు.


"చూడు పెద్దయ్యా!.... పిల్లల్ని కనడం గొప్పకాదు. వారిని చిన్నతనం నుంచీ క్రమశిక్షణలో పెంచడం చాలా ముఖ్యం. అంటే నేను నిన్ను పెంచినట్లుగా! ఈ విషయంలో నీ భార్య జానకమ్మ, పిల్లల పెంపకం సరిగా లేదు. అతిగా గారాబం చేస్తూ వుంది. అడిగినదాన్ని వెంటనే వారికి తెప్పించి ఇస్తూ వుంది. పిల్లలు ఆడింది ఆట, పాడింది పాటగా వుంది. చిన్ననాడు పిల్లలు ఆ చేష్టలు పెద్దలకు చూడముచ్చటగా వుండవచ్చు. కానీ వారు పెద్దయ్యాక మన మాటను ధిక్కరిస్తారు. వారిమాట చలామణి కావాలని పట్టుపట్టడం అలాంటి సన్నివేశాలు పెద్దలకు బాధను కలిగిస్తాయి. పిల్లలు ఎదిగిపోతారు. మనం ఒక మాట అంటే వారు రెండు అనే కోవకు వస్తారు. అప్పుడు వారి ఆ ప్రవర్తనను నిర్లక్ష్యాన్ని చూచి బాధపడడం పెద్దల వంతు అవుతుంది. మొక్కలో వంచనిది మాను అయ్యాక వంచలేముగా! నేను నీ తండ్రిని. నా జీవితాంతం నేను, నీవు, నీ భార్యా పిల్లల మేలు కోరేవాణ్ణి. పిల్లల విషయంలో నీ భార్యను కొంచెం కట్టుదిట్టం చెయ్యి. నేను మీ అమ్మ ఆమెకు చెబితే.... ఆమె నీకు ప్రశాంతతను లేకుండా చేస్తుంది. జాగ్రత్త. సమయం చూచి సౌమ్యంగా చెప్పు" అనునయంగా చెప్పాడు సత్యయ్య.


తండ్రిమాటల పరమార్థాన్ని గ్రహించాడు పెద్దయ్య. ఏకాంతంలో ’పిల్లల పెంపక విషయంలో అడిగింది క్షణాల్లో అందివ్వక, వారికి దాని అవసరాలను తెలుసుకొని ఏర్పాటు చెయ్యడం వారికి మనకు మంచిది’ సౌమ్యంగా చెప్పిన భర్త మాటలను అర్థం చేసుకొంది జానకమ్మ.


కొడుకు, కోడలు, మనుమలు, మనుమరాండ్రుతో విమలమ్మ ఎంతో సంతోషంగా వుండేది. ప్రతి దినం ఉదయాన్నే స్నానం చేసి పూజామందిరంలో కూర్చొని, తనవారికంటే ముందు తనే ఆ లోకానికి చేరాలని తాను ఎంతగానో నమ్మి కొలిచే శివపార్వతులను వేడుకొనేది.


’మంచివారి నిస్వార్థపు కోరికలను ఆ సర్వేశ్వరులు నెరవేరుస్తారట. విమలమ్మ విషయంలో అదే జరిగింది. వుత్తరాయణ పుణ్యకాలంలో, పేదలకు నిత్యం దానధర్మాలు చేసి సర్వేశ్వర నామజపంతో భోజనానంతరం రాత్రి శయనించిన విమలమ్మ తెల్లవారి లేవలేదు.


ప్రతిదినం ఐదుగంటలకు లేచి వీధివాకిట చిమ్మి నీళ్ళు చల్లి ముగ్గు వేయటం ఆమె వంతు.

ఆ రోజు విమలమ్మ లేవలేదు.

ఆరుగంటలకు నిద్ర లేచిన సత్యయ్య భార్య మంచం వైపు చూచాడు. ఆమె నిశ్చలంగా కళ్ళుమూసుకొని శాశ్వత నిద్రలో ఉంది.


"విమలా!" అని పిలిచాడు సత్యయ్య.

విమలమ్మలో చలనం లేదు.


పరీక్షగా ఆమె ముఖంలోనికి చూస్తూ మరోసారి కాస్త హెచ్చు స్థాయిలో పిలిచాడు సత్యయ్య.

వారి పిలుపుకు విమలమ్మ గారినుండి జవాబు లేదు.


సందేహంతో సత్యయ్య విమలమ్మను తాకి చూచాడు. వారికి విషయం అర్థం అయ్యింది. నయనాలు ఆశ్రుపూరితాలైనాయి.


"అరే పెద్దయ్యా!.... అమ్మా... అమ్మా...." దుఃఖంతో చెప్పలేక సత్యయ్య ఒరిగిపోయాడు. 


ఐదు నిమిషాల్లో అందరూ ఆ గదిలోనికి చేరారు. విమలమ్మను మంచం దించారు. హాల్లో ఒళ్ళు పోసి చాపవేసి దానిపై చీరను పరిచి విమలమ్మను పడుకోబెట్టారు.


పెద్దమనుమడు సూర్యకు అప్పటికి పదిహేను సంవత్సరాలు. ఫోన్ ద్వారా బంధువులందరికీ తెలియజేశాడు. సాయంత్రానికి రావలసిన వారంతా వచ్చారు. విమలమ్మ శరీరం ఐస్ బాక్సులో పదిలపరిచారు. మరుదినం పూలు, పసుపు, కుంకుమలతో ఆ మహాతల్లిని, బంధుమిత్రులు స్మశానానికి తరలించారు. భూస్థాపితం చేశారు. 


కాల చక్రంలో సత్యయ్యకు ఎంతో భారంగా మరో ప్రదక్షిణం చేసింది. తన ఇల్లాలు జ్ఞాపకాలు సత్యయ్యను సతమతం చేయసాగాయి. జీవితానికి లక్ష్యం, ఆశయం లేకుండా పోయింది. ఆస్తిలో కొంతభాగం అమ్మి, ధర్మ సత్రం (యాచకులు వుండేదానికి) పేదలకోసం ధర్మ హాస్పిటల్ నిర్మించాడు. మిగతా యావత్ ఆస్థిని తన కుమారుడు పెద్దయ్య పేరున వ్రాశాడు. ఒకరోజున అందరికీ చెప్పి కాలినడకతో కాశీకి బయలుదేరి వెళ్ళాడు సత్యయ్య. వెళ్ళిన వాడు తిరిగి రాలేదు. పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయి. 

  *

పెద్దయ్య పెద్ద కూతురు చంద్రిక కొడుకు సూర్య, చిన్న కొడుకులు రాముడు, లక్ష్మణుడు అందరూ యుక్త వయస్కులైనారు.


పెద్దయ్య కుమార్తె చంద్రికకు అమెరికా వ్యామోహం. బి.యస్.స్సీ చదివి యం.ఎస్.స్సీ అమెరికాలో చేయాలని ఆమె సంకల్పం. ఆ భావనకు తల్లి మద్దతు. కానీ పెద్దయ్యకు ఇష్టం లేదు. భార్య కూతురు పోరు భరించలేక చంద్రికను అమెరికా పంపేశాడు. స్కాలర్ షిప్‍తో చంద్రిక అమెరికాలో ఎం.ఎస్.స్సీ చదవసాగింది.


కొడుకు సూర్య. అతనిని డాక్టర్ కావాలనే ఆశ. బి.యస్సీ మంచి మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకులో పాసయ్యాడు. యం.బి.బి.యస్ పూర్తిచేసి యం.ఎస్ చేయడానికి అమెరికా వెళ్ళిపోయాడు. 

ఇక చిన్నవాడు రాముడు లక్ష్మణుడు ఇంజనీరింగ్ (సివిల్) ఫైనల్ ఇయర్. వీరికి ఒక మేనమామ దుర్గారావు. లారీ బ్రోకర్. అంటే లారీల ద్వారా ఒక వూరి నుండి మరో వూరికి సరుకులను, వివిధ వస్తువులను రవాణా చేయించేపని. లోడ్ దించినా కమీషన్, లోడ్ ఎత్తినా కమీషన్. మనిషి మంచి మాటకారి. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు. సంధ్య, స్వప్న. ఇద్దరూ అందంగా బాగా వుంటారు. అప్పుడప్పుడూ పెద్దయ్య ఇంటికి వచ్చి రామలక్ష్మణులను వరుసతో ’బావా!’ అనిపించి చిరునవ్వుతో పలకరించి ఏవో ధర్మ సందేహాలను అడిగి రామలక్ష్మణులు చెప్పే జవాబులను విని ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయేవారు. ఇరువురూ బి.టెక్ సెకండ్ ఇయర్. 


దుర్గారావు తన ఇరువురు కూతుళ్ళను రామలక్ష్మణులకు ఇచ్చి వివాహం చేయలానే ఆశ. ఇదే విషయాన్ని తన అక్క జానకితో ప్రస్తావించాడు.


ఆ విషయాన్ని గురించి విన్న అక్క జానకి "నాదేముందిరా! అంతా మీ బావగారి ఇష్టం" నవ్వుతూ చెప్పింది.


దుర్గారావు తన బావగారిని అడిగాడు. జవాబుగా పెద్దయ్య "రేయ్ దుర్గా! నాదేముందిరా అంతా మీ అక్క ఇష్టమే!" చిరునవ్వుతో చెప్పాడు పెద్దయ్య.

రామలక్ష్మణులను అడిగాడు దుర్గారావు.


"ఆ అన్నాతమ్ములు రాముడు - సంధ్యను, లక్ష్మణుడు - స్వప్నను వివాహం చేసుకొనేటందుకు అంగీకరించారు.


పెద్దయ్య మనస్సులో ఒక ఆలోచన. తన చుట్టూ వున్న వారంతా భార్యాపిల్లలు బంధువులు తన ముందు ఎంతో వినయంగా ప్రేమాభిమానాలను ప్రదర్శిస్తూ ఎంతో ఆదరంగా వర్తిస్తూ ఉంటారు. యదార్థంగా వారి వారి మనస్సులో ఏముందో తెలుసుకోవాలి. ఎలా!?.... ఎలా?!.... బిక్కముఖంతో ఆకాశానికేసి చూచాడు పెద్దయ్య.


కోటానుకోట్ల నక్షత్రాలు, ’గతించిన మంచిజన్మలు ఆకాశాన నక్షత్రాలుగా వెలుస్తాయట. మీ అమ్మా నాన్న (నాన్న రాలిపోయి వుండవచ్చునేమో!?) పైనుండి నన్ను చూస్తున్నారేమో!....’ ఆనందంగా నవ్వుకొన్నాడు. మస్తిష్కంలో మెరుపులాంటి భావన!!....

  *

వారంరోజులుగా గాలివాన.....

జనం సంచారానికి ఎంతో అంతరాయం..... ఇబ్బంది.

ఆ సాయంత్రానికి వాతారవరణంలో మార్పు.... అన్నీ సమసిపోయాయి. ఆ రాత్రి పున్నమి పండువెన్నెల.


మరుదినం ఉదయం... ఆరుగంటల సమయం.....


ఆ సమయంలో ప్రతిరోజు గతంలో పెద్దయ్య గౌతమి నదిలో ఈదడం.... జలస్థంభనం... చేయవలసిన తరుణం... వారంరోజులనాడు కొడుకు కూతురు అమెరికా నుంచి వచ్చారు.

పెద్దయ్య తన మంచంపైనే వున్నారు... కదలిక లేదు.


పొద్దు బాగా పైకెక్కింది. ఎనిమిది గంటల సమయం.

అర్థాంగి జానకమ్మ వారిని మంచాన్ని సమీపించి పిలిచింది.

రెండు క్షణాల తర్వాత మరోసారి "ఏమండీ!" పిలుపు.


పెద్దయ్యలో కదలిక లేదు శరీరాన్ని తాలి "ఏమండీ!" అని పిలిచింది జానకి. 


ఇంతలో పెద్దకొడుకు డాక్టర్ సూర్య అక్కడికి వచ్చాడు. తండ్రి శరీరాన్ని తాకి చూచాడు. శరీరం చల్లగా ఉంది. అతని కళ్ళల్లో కన్నీరు. అతనికి విషయం అర్థం అయ్యింది.


"ఏందిరా ఏడుస్తున్నావు" గద్గద స్వరంతో అడిగింది జానకమ్మ.


"నాన్న చచ్చిపోయాడమ్మ!" భోరున ఏడుస్తూ చెప్పాడు సూర్య.


అందరూ అక్కడికి చేరారు. అందరూ ఏడవసాగారు. ఈ వార్త... కొద్ది నిముషాల్లో వూరంతా ప్రాకిపోయింది. ఊరిజనం.... హితులు.... విరోధులూ అందరూ పెద్దయ్య ఆకస్మిక మరణనికి ఆశ్చర్యపోతూ వారి ఇంటికి చేరారు. నట్టింట తలవైపు (దక్షిణం) దీపంతో, శాశ్విత నిద్రలో వున్న పెద్దయ్యను చూచి అందరూ బాధపడ్డారు. కారణం ఆయన చీమకు కూడా కీడు చేసిన వాడు కాదు. అడిగిన అందరికీ మేలు చేసినవాడు. బంధువులకు వర్తమానాలు సెల్‍ఫోన్ ద్వారా చేరిపోయాయి. 

ఆ మధ్యాహ్నానానికే వచ్చేశారు అందరూ.....


’శవాన్ని రేపు లేపడమా లేక ఈ సాయంత్రం తియ్యడమా!’ అనే చర్చ జరిగింది.


చలికాలం రాత్రంతా శవంతో జాగారం చాలా కష్టం. కనుక ఐదు గంటలకు తరలించాలని నిర్ణయించుకొన్నారు పెద్దలు. పురోహితుడు వచ్చాడు. పెద్దయ్య అంతిమ యాత్ర ప్రయాణానికి ఏర్పాట్లు జరిగాయి.


నలుగురు వాహకులు పెద్దయ్య రధాన్ని ఎత్తుకొన్నారు. అందరూ భోరున ఏడ్చారు.

సూర్య అగ్ని కుండను వుగ్గుతో చేతబట్టుకొని కన్నీటితో ముందుకు సాగాడు. విచారవదనాలతో బంధుమిత్రులు పెద్దయ్య పాడే వెనుక నడక

దింపుడు కల్లాం...!


స్మశానానికి యాభై మీటర్ల దూరంలో వుంది దింపుకల్లా.


వాహకులు నలుగురు పెద్దయ్య వాహనాన్ని నెలవుంచారు. అందరూ దీనంగా పెద్దయ్య ముఖంలోనికి కన్నీటితో చూచాడు. పురోహితుడు ఏదో మంత్రం చదివాడు.

పెద్దయ్య గబుక్కున లేచి కూర్చున్నాడు.


చుట్టూ వున్న జనం ఆశ్చర్యపోయారు. భయపడ్డారు. వెనక్కు ఆశ్చర్యంతో నడిచారు.

ఆ దింపుడు కల్లా ప్రక్కనే గౌతమీ నది ప్రవహిస్తుంది.


పెద్దయ్య చిరునవ్వుతో నదివైపుకు నడిచాడు. పరుగున నదిలో దూకేశాడు.

అందరూ బిత్తరపోయారు.

పెద్దయ్య నీటిపైకి రాలేదు.


కొంత తరుణం ఉండిన ఊరిజనం... పెద్దయ్య ఏ బాధతోనో నదిలో దూకి చచ్చిపోయాడనుకున్నారు. ’మహానుభావుడు ఆ తండ్రి తగ్గ తనయుడు. వారి హృదయంలో ఏమి బాధో! నదిలో దూకి చచ్చిపోయాడు అనుకొన్నారు.


పిల్లలు ఆయన మాటలను గౌరవించలేదు. పెద్ద కూతురు కొడుకు అమెరికా మోజుతో, చదువు నెపంతో అక్కడికి వెళ్ళిపోయారు. వున్న ఊరు కన్నవారు వారికి గిట్టలేదు. అదే పెద్దయ్య గారి ఆవేదన, వారికి మన వూరన్నా, మనమందరం అన్నా ఎంతో ప్రేమ అభిమానం, తన సంతతి తన దారికి వ్యతిరేకంగా జీవితాన్ని విదేశాల్లో సాగించటం ఆయనకు ఇష్టం లేదు. అందుకే నదిలో దూకాడు. బంగారు మనిషి దేవుడు. ఇక మనకు లేడని కొందరు వాపోయారు. పెద్దకొడుకు నది ఒడ్డున కూర్చొని భోరున ఏడుస్తున్నాడు.


విషయాన్ని విన్న భార్య, కూతురు చిన్న ఇద్దరు కొడుకులు నది ఒడ్డుకు వచ్చారు.


"నాన్నా! మా తప్పులను మన్నించండి. మీరు మా తాతయ్య మాటలను ఎలా గౌరవించి, మీ జీవితాన్ని గడిపారో మేము అలాగే మీ మాట ప్రకారం నడుచుకుంటాం. మీ తాత, మా తండ్రిగారైన మీ మాట ప్రకారమే మన వూర్లోనే వుండి మన సాటివారికి సాయం చేస్తూ మీ పద్దతిలోనే మీ జీవయాత్రను సాగిస్తాము. మీకు ఆనందం కలిగిస్తాము."


పెద్దకొడుకు సూర్య పెద్దగా చెప్పగా కూతురు చంద్రిక, చిన్న కొడుకులు రామ లక్ష్మణులు మనసారా పలికారు.


నదిలో వున్న పెద్దయ్యకు వారి ఆవేదన నిర్ణయం అర్థం అయ్యింది. జల స్తంభన విడిచి ఆనందంగా పెద్దయ్య పయనం పైకి సాగింది.


సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

 



44 views0 comments

Comments


bottom of page