#PeddalaGolaPinnalaLila, #పెద్దలగోలపిన్నలలీల, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguStory, #తెలుగుకథ,#TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ
Peddala Gola - Pinnala Lila - New Telugu Story Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 22/11/2024
పెద్దల గోల - పిన్నల లీల - తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
"సామీ!... దండాలు..."
పురోహితులు శంకరశర్మ గారికి నమస్కరించాడు రాజన్న.
అరుగు మీద కూర్చొని సంధ్యావందనాన్ని ముగించి లేస్తున్న శంకరశర్మ రాజన్నను చూచాడు.
"ఏం రాజన్నా!" అడిగాడు.
"సామీ!... తొలకరి జల్లులు కురిసినాయి కదా!... దుక్కిని సాగించే దానికి మంచిరోజును సెప్పండి సామీ!" వినయంగా అడిగాడు రాజన్న.
శంకరశర్మగారు వేళ్ళను లెక్కించి...
"రేపు లేదు ఎల్లుండి దశమి శుక్రవారం. ఉదయాన్నే దుక్కిని సాగించు రాజన్న. ఈ సంవత్సరం ఫలింపు బాగుంటుంది."
"మీ నోటివాక్కు నాకు ఏదం సామీ!... అట్టాగే ఎల్లుండి దుక్కిని పారభిస్తా! వెళ్ళిస్తా సామీ!"
"మంచిది రాజన్నా!"
మరోసారి వారికి నమస్కరించి తన ఇంటివైపుకు బయలుదేరాడు రాజన్న.
రాజన్న గ్రామవాసి. భార్య సుశీల. అన్యోన్య దాంపత్యం. వారి పిల్లలు శంకర్, చంద్రిక. వారు ఆ వూరికి మూడు కిలోమీటర్ల దూరంలో వున్న తాలూకా హెడ్ క్వార్టర్స్ లో శంకర్ ప్లస్ టు, చంద్రిక టెన్త్ చదువుతున్నారు. వారికి ఒక సైకిల్ ఉంది. అన్నాచెల్లెళ్ళు ఆ సైకిల్ మీదనే వెళ్ళి స్కూలు వదిలాక ఇరువురూ సైకిల్ మీదనే తిరిగి ఇంటికి వస్తారు. శలవు రోజుల్లో అమ్మా నాన్నాలతో కలిసి పొలం పనులూ చేసేవారు.
రాజన్నకు వున్నది ఒకటిన్నర ఎకరం పంట భూమి. సంవత్సరానికి రెండు కార్లు పండే భూమి. రెండు పంటలకూ కలిసి ఎనభై తొంభై బస్తాల ధాన్యం (ఒక బస్తా వంద కేజీలు) పండుతుంది. నలభై బస్తాల ధాన్యం భోజనానికి, మరో నలభై బస్తాలు విక్రయించి ఇంటికి ఇతర ఖర్చులకు వాడుకొంటారు.
శంకర్‍కు ఇంజనీర్ కావాలనే ఆశ. ప్లస్ టు ముగియగానే రాజన్న శంకర్ ఇష్టప్రకారం, ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాడు. శంకర్ చాలా తెలివికలవాడు. విజ్ఞత ఎవరికి వున్నా అది ఎదుటివారిని ఆకర్షిస్తుంది.
శంకర్ సామర్థ్యం కాలేజీలోని చాలామంది ఆడ మగ పిల్లలను ఆకర్షించింది. అతనికి చాలామంది మిత్రులు.
వారిలో... తాలూకా సివిల్ కోర్టు జడ్జి రంగనాయకి కుమార్తె బిందు ఒకరు.
శంకర్ కాలేజి జీవితం తొలి సంవత్సరం ఆనందంగా ముగిసింది. రెండవ సంవత్సరంలో బిందు స్నేహం గాఢమైంది. మూడవ సంవత్సరం చివరకు ఇరువురి మధ్యా వయస్సు రీత్యా ఆడామగల మధ్య కలిగే భావావేశాలు కారణంగా ఆ ఇరువురూ ప్రేమ జంటగా మారారు.
బిందు, శంకర్‍ను తన ఇంటికి తీసుకొని వెళ్ళి తల్లి రంగనాయకికి పరిచయం చేసింది. శంకర్ ఆమెకు బాగా నచ్చాడు.
రంగనాయకి శంకర్ కుటుంబ వివరాలనన్నింటినీ, అతన్ని అడిగి తెలుసుకొంది. ఆమె భర్త మోహన్ సబ్ ఇన్‍స్పెక్టర్. ఛత్తీస్‍ఘడ్‍లో నక్సల్స్ కు పోలీసులకు మధ్యన జరిగిన కాల్పులలో వారు మరణించారు. అప్పటికి బిందు సివిల్ ఇంజనీరింగ్ తొలి సంవత్సరంలో వుండింది.
తన తండ్రి మరణం కారణంగా బిందు ఎంతో విచారంలో వున్న సమయంలో శంకర్ ఆమెను ఎంతో అనునయించాడు. మంచి మాటలు చెప్పి ఓదార్చాడు. ఆ సమయంలో శంకర్ బిందుకు మరీ సన్నిహితుడైనాడు. బిందు మనస్సులో అతని పట్ల ప్రేమ బాగా పెరిగింది.
ఫైనల్ ఇయర్ పరీక్షలు ముగిశాయి. ఆ పరీక్షల సమయంలో ఆ ఇరువురు బిందు ఇంట్లో కంబైండ్ స్టడీ చేసి, ఇరువురూ పరీక్షలు బాగా వ్రాశారు.
ఆ సమయంలో రంగనాయకి, శంకర్ తన కుమార్తె విషయంలో ఏ రీతిగా వర్తిస్తున్నదీ బాగా గమనించింది. శంకర్ తత్వం ఆమెకు పూర్తిగా నచ్చింది. తన కుమార్తె బిందు శంకర్‍తో మాట్లాడే మాటలు, ఆమె అతన్ని చూచే చూపులను బట్టి బిందు మనస్సున శంకర్ వున్నడనే విషయాన్ని గ్రహించింది. పరీక్షలు ముగిసిన తర్వాత, శంకర్ తల్లిదండ్రులతో మాట్లాడి, బిందు వివాహాన్ని శంకర్‍తో జరిపించాలని రంగనాయకి నిర్ణయించుకొంది. తన నిర్ణయాన్ని కూతురుకు చెప్పి, ఆమె అభిప్రాయాన్ని తెలుసుకొంది తాలూకా సివిల్ కోర్టు జడ్జి రంగనాయకి.
చంద్రిక మంచి అందగత్తె. ఆ వూరి సర్పంచ్ రాజారావు కొడుకు కిరీటికి చంద్రిక అంటే చిన్నతనం నుండి అభిమానం... యుక్తవయస్కుడై ఎం.ఎ, బి.ఎల్ పాసయ్యే నాటికి ఆ అభిమానం ప్రేమగా మారింది. అతనికి సంబంధాలు రాసాగాయి. కిరీటి తన తల్లితో ఒకనాడు.....
"అమ్మా!...."
"ఏంటి నాన్నా!"
"నాకు సంబంధించిన ఒక మాట నేను నీతో చెప్పాలమ్మా!" అన్నాడు తల్లి ముఖంలోకి చూస్తూ కిరీటి.
"ఏమిటి నాన్నా ఆ విషయం?"
"నా వివాహ విషయం అమ్మా. మీరు సంబంధాలను చూడడం ఆపండి"
"ఒకటి... నాలుగు సంబంధాలను చూస్తే కాదా నాన్నా!... మనకు తగిన నీకు నచ్చిన అమ్మాయి దొరుకుతుంది!"
"నాకు ఒక అమ్మాయి బాగా నచ్చిందమ్మా!"
"ఎవరయ్యా!... ఆ అమ్మాయి?"
"చంద్రిక. రాజన్న కూతురు!.... బి.ఎస్సీ వరకు చదివి టీచరుగా పనిచేస్తూ ఉంది."
"వారు చాలా పేదవారు. మీ నాన్నగారు ఆశించినంత కట్నకానుకలను వారు ఇవ్వలేరు!"
"ఆడపిల్ల వారి వద్దనుండి మనం కట్నకానుకలను ఎందుకు ఆశించాలమ్మా!... మనకు వున్నది చాలదా!...."
"చాలదు!... " అప్పుడే ఇంట్లోకి వచ్చిన కిరీటి తండ్రి రాజారావు కొడుకు మాటలను విన్నాడు. తన నిర్ణయాన్ని తెలిపాడు.
"నాకు ఆడపిల్ల వారి వద్దనుండి ఎలాంటి కట్నకానుకలు వగైరా, అవసరం లేదు నాన్నా" ఎంతో సౌమ్యంగా చెప్పాడు కిరీటి.
"నాకు కావాలి నాన్నా!" వ్యంగ్యంగా అన్నాడు సర్పంచ్ రాజారావు.
క్షణం తర్వాత.....
"ఆరునెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. గెలవాలంటే బోలెడంత డబ్బు కావాలి!" ఆవేశంగా చెప్పాడు రాజారావు.
ఇరువురు సంభాషణను విని కిరీటి తల్లి అలిమేలు ఆశ్చర్యపోయింది.
"వాడి వివాహం, వాడికి నచ్చిన అమ్మాయితో, వాడి ఇష్టానుసారంగా జరిగేలా చూడటం, తల్లితంద్రులైన మన ధర్మం కదండీ" అంది అలిమేలు.
"అలిమేలూ!.... డబ్బు విలువ వాడికేం తెలుసు!.... డబ్బు లేకపోతే కాటిలో కూడా శవసంస్కారం జరగదు. డబ్బు.... డబ్బు... అంతా డబ్బు.... ఎవరి జీవితం అయినా ప్రశాంతంగా ముందుకు సాగుతూ ఉందటే దానికి మూలం డబ్బు. ఈయనగారి పేరు చివరన కిరీటి ఎం.ఎ, బి.ఎల్ అనే డిగ్రీ వీరికి వుందంటే అది నేను వాడికిగా ఖర్చుపెట్టిన డబ్బు మహిమ. అబ్బాయిగారు అంతదూరం ఆలోచించలేదు కాబోలు!... చెప్పు, వీడి వివాహం నాకు నచ్చిన, నేను మెచ్చిన సంబంధంతోనే జరగాలి!..." ఆవేశంగా చెప్పి రాజారావు తన గదిలోనికి వెళ్ళిపోయాడు.
అలిమేలు అతని వెనకాలే వెళ్ళింది.
తండ్రి, తల్లిని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయాడు కిరీటి.
*
కిరీటి తల్లి అలిమేలు, చంద్రిక తల్లి సుశీల ఒకే వూరివారు. స్నేహితులు. కొడుకు కోరిన ప్రకారం అలిమేలు భర్త ఇంట్లో లేని సమయంలో సుశీల ఇంట వెళ్ళింది. తన కొడుకు నిర్ణయాన్ని సుశీలకు తెలియజేసింది అలిమేలు.
"అలిమేలు!... మనం మంచి స్నేహితులం. కానీ... నేను నీ వియ్యపురాలిని అయ్యే అర్హత నాకు లేదు. మేము పేదవారం. మీరు కోటీశ్వరులు. మీతో మేము ఏ విషయంలోనూ సరితూగలేము. అన్యధా భావించకు. నీ మాటను నేను అంగీకరించలేను. నా కూతురికి, నీ కొడుక్కు వివాహం జరగడం అసంభవం" అంది సుశీల.
ఆ స్నేహితురాండ్ర మాటలను చంద్రిక తన గది నుండి, రాజన్న ఇంటి ముందరి పందిట్లో నుంచి విన్నారు.
విచారవదనంతో అలిమేలు వెళ్ళిపోయింది.
ఆ రాత్రి రాజన్నకు సుశీల, అలిమేలు చెప్పిన విషయాన్ని చెప్పింది. మౌనంగా రాజన్న అంతా విన్నాడు.
"ఏం బావా!... ఏం పలకవు?" అడిగింది సుశీల.
"సుశీ!... అమ్మాయి అభిప్రాయాన్ని కనుక్కొన్నావా!" అడిగాడు రాజన్న.
"చందమ్మా!" పిలిచాడు కూతురుని.
చంద్రిక తల్లిదండ్రులను సమీపించింది.
"ఏం నాన్నా!"
"కూర్చో అమ్మా!"
తండ్రి పక్కన మంచంపై కూర్చుంది చంద్రిక.
"ఒకమాట అడుగుతాను నిజం చెప్పాలి తల్లీ!"
"అడగండి నాన్నా!"
"నీకు సర్పంచ్ రాజారావు కొడుకు కిరీటి అంటే ఇష్టమేనా!" అడిగాడు రాజన్న.
"చెప్పమ్మా!...." సుశీల సౌమ్యంగా అడిగింది.
"అమ్మా నాన్నా!.... మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే!" చెప్పి తన గదిలోనికి వెళ్ళిపోయింది చంద్రిక.
రాజన్న భార్య ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూచాడు.
"అమ్మాయికి ఆ అబ్బాయి అంటే ఎంతో ఇష్టం బావా!..." చిరునవ్వుతో చెప్పింది సుశీల. రాజన్న మౌనంగా తలాడించాడు.
*
రాజారావు కొడుకు కోసం తమ వూరికి పాతిక కిలోమీటర్ల దూరంలో వున్న మరో గ్రామాన్నించి ఒక సంబంధాన్ని తెచ్చాడు. అర్థాంగి అలిమేలుకు తెలియజేశాడు.
"చూడూ!... ఇప్పటికి ఆరు సంబంధాలను చూచాము. వాడు ఏ ఒక్కదాన్ని నచ్చలేదు. ఇది ఆరవ సంబంధం. ఆనందరాయుడు మనలాగే బాగా కలవాడు. ఆయన ఆ గ్రామసర్పంచ్. మనలాగే మంచిపేరు ప్రతిష్టలున్న మనిషి. రేపు భార్య సమేతంగా తమ కుమార్తె నీలవేణిని మనవాడికి వివాహం జరిపించమని మనలను కోర వస్తున్నారు. నీ కొడుక్కి చెప్పు. పిచ్చిపిచ్చి వేషాలు వేయకుండా వారితో అణకువగా మర్యాదగా మాట్లాడమని చెప్పు. మనం ఆయనను ఏమీ అడగవలసిన అవసరం లేదు. ఐదు రైసు మిల్లులకు, యాభై ఎకరాలకు ఆసామి. చాలా గొప్ప సంబంధం. దీన్ని మనం పోగొట్టుకోకూడదు. నేను చెప్పిన అన్ని విషయాలు నీ కొడుక్కి వివరంగా చెప్పు. అర్థం అయిందా!..." గద్దించినట్లు అడిగాడు రాజారావు.
"ఆఁ.... అర్థం అయింది, చెప్పింది తెలుగులోనేగా!" ముఖం చిట్లిస్తూ చెప్పింది అలిమేలు.
"నీ స్వరంలో సంతోషం లేదే!" ఆశ్చర్యంగా భార్య ముఖంలోకి చూచాడు రాజారావు.
"సంతోషం స్వరంలో ఎలా వుంటదండీ!... ముఖంలో కదా!" విరక్తిగా నవ్వింది అలిమేలు.
"సరే... సరే!... వాడు కోర్టు నుండి తిరిగి రాగానే విషయాన్ని వివరంగా చెప్పు. రేపు ఇంట్లోనే వుండమను!" అన్నాడు రాజారావు.
అలిమేలు తలాడించింది.
రాజారావు వేగంగా తన గదిలోనికి వెళ్ళిపోయాడు.
ఆ రాత్రి భోజన సమయంలో డైనింగ్ టేబుల్ ముందు... రాజారావు ఎదుటివైపు కిరీటి కూర్చొని భోంచేస్తున్నారు.
రాజారావు కుమారుడి ముఖంలోకి చూచాడు.
కిరీటి తలదించుకొన్నాడు.
"అలిమేలూ!...."
"ఆ చెప్పండి!"
"నేను నీకు చెప్పడం అయిపోయింది. నీవు విషయాన్ని ఈడికి చెప్పావా లేదా?" అడిగాడు రాజారావు.
"చెప్పానండీ!" తొట్రుపాటుతో చెప్పింది అలిమేలు.
"కిరీటీ!" రాజారావు పలకరింపు.
"ఏం నాన్నా!"
"అమ్మ చెప్పిన విషయాన్ని గురించి నీ అభిప్రాయం!"
"నాన్నా!... మరి కొంతకాలం నేను వివాహం చేసుకోవాలనుకోవడం లేదు నాన్నా!"
"కారణం?"
"కొంతకాలం ఫ్రీగా బ్రతుకుదామని!"
"ఇప్పుడు నీ వయస్సు ఎంత?"
"ఇరవై ఆరు!"
"ఆ వయస్సుకు నీకు మాకు పుట్టావు. ఇప్పటికే ఆలస్యం అయింది. బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా సవ్వంగా పనికి రావంటారు!... కనుక నీవు నా మాట ప్రకారం ఒకటి రెండునెలల్లో వివాహం చేసుకోవాలి."
"అది కుదరదు నాన్నా!" అన్నాడు కిరీటి.
అతని ఆమాటకు రాజారావు చాలా ఆశ్చర్యపోయాడు కోపం వచ్చింది. భార్యా తనయుల ముఖంలోకి తీక్షణంగా చూచాడు.
అలిమేలు ముఖాన్ని ప్రక్కకు త్రిప్పుకొంది.
"వాడి ఇష్టానుసారంగా వాడి వివాహాన్ని జరిపితే వాడు ఒప్పుకొంటాడు" మెల్లగా చెప్పింది అలిమేలు.
"ఏమిటా ఇష్టం!"
"వాడికి నచ్చిన పిల్ల!"
"ఎవరు ఆ పిల్ల!"
"రాజన్న కూతురు"
"ఏమిటీ... రాజన్న కూతురా!"
"అవును. ఆ అమ్మాయి బి.ఎస్సి గోల్డ్ మెడలిస్టు. టీచరుగా పనిచేస్తూ ఉంది! వాడికి బాగా నచ్చింది"
"నీకు!..."
"నాకూ నచ్చింది!"
"అయితే నచ్చనిది నాకేనన్నమాట!"
"ఆమాటను నేను ఎప్పుడన్నానండీ!" వాల్గంట రాజారావు ముఖంలోకి చూచింది చిరునవ్వుతో అలిమేలు.
క్షణంసేపు ఆమె ముఖంలోకి చూచి, కంచం ముందు నుంచి లేచాడు రాజారావు. బేసిన్‍లోచేతిని కడుకొన్నాడు.
"చూడూ!"
"ఏమిటండీ!"
"ఆ రాజన్నను వచ్చి నాతో మాట్లాడమను" కొడుకువైపు ఒకసారి తీక్షణంగా చూచి...
"కిరీటీ!"
"ఏం నాన్నా!"
"ఆ పిల్లనైతే పెండ్లి చేసుకొంటావా!"
కిరీటి మౌనంగా తలాడించాడు.
"నోరు తెరిచి చెప్పు!" అంది అలిమేలు.
"చేసుకొంటాను నాన్నా!" మెల్లగా చెప్పాడు కిరీటి.
తల్లీకొడుకులను రెండుక్షణాలు పరీక్షగా చూచి రాజారావు తన గదికి వేగంగా వెళ్ళిపోయాడు. ఆ తల్లి కొడుకులు నవ్వుకొన్నారు.
*
అలిమేలు వారి పనిమనిషి పెంచలమ్మను రాజన్న ఇంటికి పంపి రాజన్నను తన ఇంటికి రమ్మని చెప్పమంది. పెంచలమ్మ ఆ విషయాన్ని రాజన్న భార్య సుశీలకు చెప్పి వెళ్ళిపోయింది. విషయాన్ని సుశీల భర్తకు చెప్పింది.
సాయంత్రం నాలుగు గంటలకు రాజన్న రాజారావు ఇంటికి బయలుదేరాడు.
అదేసమయానికి తాలూకా సివిల్ జడ్జి రంగనాయకి కారు అతన్నిదాటి ముందుకు వెళ్ళింది. రాజారావు తనవాకిటి ముందు నిలబడి వున్నాడు.
డ్రైవర్ రాజారావు ఇంటి ముందు కారును ఆపాడు. రంగనాయకి కారు దిగింది. నవ్వుతూ రాజారావు ఆమెకు నమస్కరించి స్వాగతం పలికాడు.
ఆ దృశ్యాన్ని రాజారావు ఇంటిని సమీపించిన రాజన్న చూచాడు. కొన్ని క్షణాలు ఏం చేయాలనే ఆలోచన....
పర్యవసానం, మౌనంగా వెనక్కు తన ఇంటివైపుకు నడిచాడు.
వాకిటి ముందే వున్న అర్థాంగి సుశీలకు నిరుత్సాహంగా విషయాన్ని చెప్పి ఇంట్లోకి నడిచాడు.
రాజారావు తన నిర్ణయాన్ని మార్చుకొన్నాడు. నాలుగు రోజుల క్రిందట రంగనాయనికి కలిసి, వారి వూరికి ఇంటికి రమ్మని ఆహ్వానించాడు.
అతని కోరిక ప్రకారం... రంగనాయకి రాజారావు ఇంటికి వచ్చింది. కొడుకును, భార్యను రంగనాయకికి పరిచయం చేశాడు రాజారావు. కిరీటిని చూచి రంగనాయకి ఆశ్చర్యపోయింది.
కారణం కిరీటి లాయర్ అయినందున ఆమెకు అతనితో పరిచయం ఉంది.
కిరీటి మంచి అందగాడు. ఆమెను వృత్తిరీత్యా కూడా బాగా కోర్టు ఆవరణంలో, వ్యవహారాల్లో ఆకర్షించాడు.
శంకర్ కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగి. అంత గొప్ప అందగాడేం కాదు. కానీ... అతని తత్వం. ఆడవారి యందున అతనికి వున్నగౌరవం, ఉన్నంతలో లేనివారికి సాయం చేయాలనే సత్ సంకల్పం. రంగనాయకికి ఒకనాడు నచ్చాయి. అందుకే శంకర్‍ని తన ఇంటికి రానిచ్చింది. అది మూడు సంవత్సరాల క్రిందటి మాట, భావన.... కానీ... నేడు, ఆమె దృష్టిలో కిరీటి మిన్నగా నిలిచాడు.
తన కూతురు బిందుకు కిరీటి అన్నివిధాలా తగిన వాడని నిర్ణయించుకొనే ఆమె రాజారావు ఇంటికి వచ్చింది. రాజారావుకు మహదానందం. అతిధి మర్యాదలను అలిమేలు యధావిధిగా నిర్వహించింది. జడ్జిగారు కనుక వారికి ఒక నమస్కారం పెట్టి కిరీటి తనగదికి వెళ్ళిపోయాడు.
రాజారావుకు రాజన్న సంబంధం ఇష్టంలేదు. అతనికి డబ్బు.... డబ్బు... కావాలి. రంగనాయకి అందుకు సరితూగకల్గింది. ఆ కారణంగా ఆమెను కలిసి, తన ఇంటికి ఆహ్వానించాడు. ఆమె వచ్చింది. ఇదంతా అలిమేలు, కిరీటికి అయోమయం.
రాజారావు, రంగనాయకి అతని ఆఫీసు గదిలో కూర్చున్నారు. తలుపులు మూశారు. అన్ని విషయాలూ మాట్లాడుకొన్నారు. కిరీటికి బిందుకు వివాహం జరిపించ నిర్ణయించుకొన్నారు. గది తలుపులు తెరువబడ్డాయి. రాజారావు రంగనాయకి గది నుండి బయటికి చిరునవ్వుతో వచ్చారు.
రంగనాయకి కారువైపుకు నడిచింది. ఆమె ప్రక్కనే రాజారావు కారువరకూ నడిచాడు.
రంగనాయకి కార్లో కూర్చుంది. ఆనందంగా రాజారావు తన కుడిచేతిని పైకెత్తారు. కారు కదిలి వెళ్ళిపోయింది. రాజారావు ఆనందంగా వీధి గేటునుండి ఇంటివైపుకు నడిచాడు.
ఆ సన్నివేశాన్ని కిరీటి మేడపైన కిటికీ నుంచి, అలిమేలు డైనింగ్ హాల్ కిటికీ లోనుంచి చూచారు. విషయం అర్థం గాక ఆలోచనలో మౌనంగా వుండిపోయారు.
రాజారావు హాల్లోకి వచ్చాడు. అలిమేలు అతన్ని సమీపించింది.
"అలిమేలు! జడ్జి రంగనాయకి గారి కూతురు బిందుకు మన కిరీటికి త్వరలో వివాహం!..." చెప్పి రాజారావు వేగంగా తన గదిలోనికి వెళ్ళిపోయాడు.
అలిమేలు విచారంగా సోఫాలో కూలబడింది.
*
కిరీటీ ఆ సాయంత్రం శివాలయంలో శంకర్‍ను కలిశాడు. చంద్రిక విషయంలో తన నిర్ణయాన్ని శంకర్‍కు తెలియజేశాడు. శంకర్ తన మనస్సు నిండా వున్న బిందును గురించి కిరీటికి తెలియజేశాడు.
"శంకర్!..."
"ఏమిటి కిరీటీ!"
"నీ విషయంలో మీ అమ్మా నాన్నల వలన నీకు ఎలాంటి సమస్యా లేదు. కానీ నా విషయంలో మా నాన్న పెద్ద ప్రాబ్లం కనుక నాది ఒక సలహా!...."
"మనస్సుకు నచ్చని వారిని పెద్దల బలవంతంతో వివాహం చేసుకొని ఆనందంగా జీవించలేము కిరీటీ!... కనుక నేను చంద్రికను, నీవు బిందును రిజిష్టర్ మ్యారేజీ చేసుకొందాం. చట్టరీత్యా జరిగిన వైవాహితులను ఎవరూ విడదియ్యలేరు. కొంతకాలం ద్వేషిస్తారు. ఆ తరువాత వారి మాటలు, వీరి మాటలు విని, వారు మన దగ్గరకు తప్పకుండా వస్తారు. నీకు ఈ సమస్య లేదు. కానీ నాన్న మూలంగా అది నాకుంది. నేను దాన్ని ఎదుర్కొంటాను. నీ చెల్లిని నేను నా ప్రాణ సమానంగా చూచుకొంటాను. ఇందుకు నీకు సమ్మతమేనా!...." ప్రాధేయపూర్వకంగా అడిగాడు కిరీటి.
ఆ క్షణంలో శంకర్ కళ్ళల్లో కన్నీరు...
"శంకర్!... ఎందుకు ఏడుస్తున్నావ్?" ఆత్రంగా అడిగాడు కిరీటి.
"కిరీటీ!... ఇవి కన్నీరు కాదు ఆనంద భాష్పాలు... నా చెల్లి అదృష్టవంతురాలు. నీది ఎంత గొప్ప మనస్సు కిరీటీ!" ఆనంద పారవశ్యంలో కిరీటిని కౌగలించుకొన్నాడు శంకర్.
"శంకర్!... నేను బిందును కలిసి మా పెద్దల నిర్ణయాన్ని, మన నిర్ణయాన్ని చెబుతాను. నా మిత్రుల సాయంతో మన ఇరువురి వివాహాలు రిజిస్టార్ ఆఫీసులో జరిగేలా చూస్తాను. వీలుచేసికొని నీవు బిందును ఒక్కసారి కలువు. మన నిర్ణయాన్ని ఆమెకు తెలియజేయి. ఆమె కూడా సంతోషిస్తుంది కదా!" చిరునవ్వుతో చెప్పాడు కిరీటి.
"అవును కిరీటీ!"
"సరే పద.... ఇళ్ళకు పోదాం"
శివాలయం నుండి ఇరువురూ ఇండ్ల వైపుకు బయలుదేరారు. శకున పక్షులు ఆకాశంలో ’కోక్.... కోక్...’ మని అరుస్తూ బారులుగా ముందుకు సాగాయి. ఆకాశం వైపు చూచి ఇరువురూ ఆనందంగా నవ్వుకొన్నారు.
*
తన సీనియర్ లాయర్ చింతామణి గారు ఇచ్చిన పేపర్లను జడ్జిగారికి ఇచ్చేటందుకు కిరీటి జడ్జి రంగనాయకి ఇంటికి వెళ్ళాడు. కిరీటికి గొప్పగా మర్యాద చేసింది కాబోయే అల్లుడని రంగనాయకి. బిందు చేత కాఫీ ఇప్పించింది. చిన్న చీటీ ముక్కను సమయం చూచి బిందుకు చూపించి, సోఫా సీట్ క్రింద వుంచాడు. వెళ్ళిపోయాడు కిరీటి.
బిందు, ఆ చీటిని తీసుకొని చదువుకొంది. స్నేహితురాలి ఇంటికని తల్లికి చెప్పి పార్కుకు వెళ్ళింది. శంకర్‍ను కలిసింది. అన్ని వివరాలను తనకు కిరీటి చెప్పిన రీతిగా బిందుకు శంకర్ చెప్పాడు. ఇరువురూ ఆనందంగా వెళ్ళిపోయారు.
శంకర్ మిత్రులు సబ్ రిజిస్టార్ ఆఫీసులో కిరీటి చంద్రిక, శంకర్ బిందుల వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు.
కిరీటి, అతని తల్లి, శంకర్, రాజన్న, సుశీల, చంద్రిక, బిందు ఆ ఆఫీసుకు వచ్చారు. రిజిస్టార్ వారి వివాహాలను జరిపించాడు. పెద్దలందరూ మిత్రులు, ఆ రెండు జంటలను మనసారా దీవించారు.
ఆ నాలుగు ’కలిసిన మనసులు’ ఆనందంతో అందరి ముందు చూపులతో పెనవేసికొన్నాయి. రెండు జంటలూ హనీమూన్‍కు అరుణాచలం బయలుదేరారు ఆనందంగా.
ఇదే నేటికొందరి ’పెద్దల గోల... పిన్నల లీల!!!...’
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comentarios