'Peddalake Telusu Aa Rahasyam' - New Telugu Story Written By Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 07/08/2024
'పెద్దలకే తెలుసు ఆ రహస్యం!' తెలుగు కథ
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
''పెద్దాపురం సంబంధం విషయం ఏమైందేమిటి?''
ఆఫీసులోకి సత్యానందరావు అడుగుపెట్టగానే గుస గుసగా అడిగాడు ధర్మారావు.
''14 ఎకరాల మాగాణి, రెండు పెద్ద బిల్డింగులు, ఒక రైస్ మిల్లు, పాడి చెప్పలేనంత, బజారులో అద్దెలు వచ్చే షాపులు అరడజను, రెండు మూడు ఫ్యాక్టరీ లలో షేర్లు, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు, నౌకర్లు, ఫ్యామిలీ డాక్టర్లు.. అబ్బ వాళ్ళ ఐశ్వర్యం అంతా ఒక సారి కళ్ళారా చూస్తే చాలు కడుపు నిండిపోతుంది. ''
సత్యానందరావు, కొలీగ్ ధర్మారావుకే కాకుండా ఆఫీ సులో తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా వినబ డేటట్టు గర్వంగా చెప్పాడు.
సత్యానందరావు గత కొంతకాలంగా తన కూతురుకి పెళ్లి చేయాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. ఒక విష యం నప్పితే మరొక విషయం కుదరక ఆ రెండు నప్పితే చదువు నప్పక పోనీ అది కూడా నప్పేస్తే సాంప్రదాయం నప్పక.. ఇలా ఏదోరకంగా వచ్చిన ప్రతి సంబంధం ప్లాప్ అయిపోతున్నాయి. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూ మంచి సంబంధం ఎలాగోలా ఖాయం చేసుకుని తన ఆఫీ సులో అందరి చేత శభాష్ సత్యానందరావు అనే గౌరవం పొందేయాలని కూడా అతను ఆరాట పడు తున్నాడు.
ఆఫీసులో గోడగడియారం 10 గంటలు ఎప్పటిలాగే కొట్టింది. ఎవరు సీట్లలో వాళ్లు కూర్చుని పుస్తకాల మీద దుమ్ము లేకపోయినా నోటితో ఊదుతూ కాగి తాలు తిరగేస్తూ మరో గంటలో సాయంత్రం నాలుగు గంటలు అయిపోతే బాగుండన్న ఆత్రుతతో గోడ గడియారం వైపు అసహనంగా అలా చూస్తూ పని చేసుకుంటున్నారు.
మరోపక్క కంప్యూటర్ పై కొందరు పనిచేస్తున్నారు కానీ దానిని చితక్కొట్టుతున్నట్టు ఉంది అక్కడి వాతావరణం.
అయితే సత్యానందరావు చెప్పిన విషయం అంతా విని తన డ్యూటీ నిర్వహించాలన్న విషయం తెలి యని అదోరకం అయోమయంలో పడిపోయాడు ధర్మారావు.
''పెద్దాపురం సంబంధం ఖాయం చేసుకున్నట్టేనా.. నువ్వు మనసులో ఏం ఆలోచించుకున్నావు చెప్ప లేదు ఏంటి?'' అంటూ మెరుపులాంటి వేగంతో సత్యానందరావు దగ్గరకు వచ్చి అడక్కుండా ఉండలేక పోయాడు ధర్మారావు.
''ఉండవయ్యా నీకు ప్రతి విషయము ఆతృతే. సమస్య దాని ఎండింగ్ పాయింట్ రెండు తెలిస్తేనే కానీ నిద్రపోని మనస్తత్వం నీది. కంగారు పడకు మగపెళ్లి వారు పది రోజులు గడువు ఇచ్చారు. వాళ్ళింట్లో పెద్దావిడకు అనారోగ్యమట. ఆవిడగారు చూస్తుండగానే ఈ శుభకార్యం కాస్త జరగాలని వాళ్లు కంగారు పడిపోతున్నారు. మా సంబంధం కాకపో యినా ఏదో ఒక సంబంధం కుదుర్చుకోవాలన్నంత ఆత్రుతలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ అబ్బాయికి పెళ్లి జరిగితేనే కానీ ఊపిరి పీల్చుకోము అన్నంత పట్టు దలతో ఉన్నారు. ''
''సరే అది వాళ్ళ సమస్య ఇంతకీ నువ్వు ఏం డెసిషన్ కి వచ్చావో నాకు చెప్పు. వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు నువ్వు అసలు వాళ్లకు ఏం చెప్పావు?. '' జవాబు చెప్పి తీరాలి అన్నంత ఆత్రు తగా అడిగాడు ధర్మారావు.
''ఏమంటాను మా పెద్దలతో ఆలోచించి మళ్లీ పది రోజుల్లోనే వస్తానని చెప్పాను. ''
''నీ ఉద్దేశం చెప్పవయ్యా బాబు''
''ఉద్దేశానిదేముంది. ఇది బంగారం లాంటి సం బంధం అనేకన్నా అంతకుమించి అనడం కరెక్ట్. అబ్బాయి బంగారపు ముద్ద. ఈ కంప్యూటర్ యుగపు రోజుల్లో ఇంతటి బుద్ధిమంతుడుని నేను ఎక్కడ చూడలేదు అంటే నమ్ము. ఇదిగో ఈ పెళ్ల యితే మా అమ్మాయి కాదు ముందు నేను అదృష్ట వంతుడిని.. ఇది తప్పింది అనుకో మా అమ్మాయి గురించి నా జీవితంలో పెళ్లి ప్రయత్నాలు చేయడం శుద్ధ దండగ. వెంటనే చెప్పేస్తే బాగుండదని అలా చెప్పి వచ్చేసాను. నువ్వు ప్రాణ స్నేహితుడువి అని చెప్తున్నా శుభలేఖల సెలక్షన్ కూడా చేసి ఒక పక్కన పెట్టేస్తాను. అలాగే ఒక వారం రోజుల్లో పెళ్లికి సంబం ధించిన మిగిలిన అన్ని వ్యవహారాలు ఒక కొలిక్కి తీసుకువచ్చేస్తాను. నేను ఇన్ని సంవత్సరాలు సంబంధం కోసం ఖర్చుపెట్టిన ఖర్చుకి, పడ్డ కష్టానికి భగవంతుడు నాకు చివరకు మంచి సంబంధం చూపించాడు. వదులుకుంటానా.. '' మహదానం దంగా చెప్పాడు సత్యానందరావు.
విషయానికి ముగింపు తెలిసాక తన మనసు చల్ల బడిందో మరింత వేడెక్కిందో తెలియనట్లుగా అడు గులు వేసుకుంటూ తన సీట్ లోకి వెళ్లి పుస్తకం తెరి చాడు ధర్మారావు. కానీ తను చూస్తున్న ఆ పుస్తకం తిరగబడి ఉంది అన్న విషయం అతనికి చాలాసేప టికి కానీ అర్థం కాలేదు. చివరికి ఎలాగోలా ఈ ప్రపం చంలోకి వచ్చాడు.
సాయంత్రం అయింది ఆఫీసు ముగిసింది.
ఆఫీసు నుండి ఇంటికి వెళ్తున్న సత్యానందరావుని వెళ్లకుండా దారిలో ఆపుచేశాడు ధర్మారావు
''ఇదో సత్యానందరావు, ఆఫీసులో మాట్లాడడం దేనికని చెప్పలేదు ఇలా రా ఇక్కడ కూర్చుందాం నీకు కొన్ని ముఖ్య విషయాలు చెప్పాలయ్య. '' అంటూ బలవంతంగా సత్యానందరావుని పక్కనున్న జోడు తూములు మీద కూర్చోబెట్టాడు ధర్మారావు.
''నువ్వు వెళ్ళింది పెద్దాపురంలో వెదురుపర్తి ఆనందరావు గారి అబ్బాయి బీటెక్. ఆ సంబంధం గురించే కదా. ''
''కాదు కాదయ్యా బాబు కత్తిపూడి కనకావతరం గారి అబ్బాయి. హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగం నెలకి నాలుగు లక్షలు. ''
''అదే అదే అ.. అదే అ.. కత్తిపూడి కనకావతరం గారి అబ్బాయి అదే అదే.. వాళ్ళు ఇల్లు పెద్దాపురం లో రమాథియేటర్ దాటాక గానుగచెట్టు కింద ఉంది అదే కదా. ''
''అబ్బబే వాళ్ళ ఇల్లు లైబ్రరీ పక్కన మూడు అంత స్తుల భవనం''
'' అవునవును.. లైబ్రరీ పక్కన మూడంతస్తుల భావనమే గుర్తొచ్చింది. సరే నువ్వు ఈ ధర్మారావుని నమ్ముతాను అంటే ఆ సంబంధం గురించి నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఉందయ్యా. '' సత్యానంద రావు దగ్గరగా జరుగుతూ భుజం మీద చేయి వేస్తూ అన్నాడు ధర్మారావు.
''చెప్పు నేను కూడా ఎవరిని ఎంక్వయిరీ చేద్దామా అనుకుంటున్నాను. '' ఆత్రుతగా చూస్తూ అడిగాడు సత్యానందరావు.
''కొన్నాళ్ల క్రితం అంటే సంవత్సరం క్రితం వాళ్లకి మా వాళ్ళకి మధ్యన వ్యవహారం నలిగింది. వివరంగా చెప్తా విను.. మా పెదనాన్నగారి అమ్మాయి విషయం లో మేము వాళ్ళ ఇంటికి వెళ్లి వచ్చాము. సంబంధం ఖాయం అయిపోయినట్టే అనుకునే సమయంలో వాళ్ల గురించి కొన్ని పచ్చి నిజాలు బయటపడ్డాయి.
వాళ్లు చాలా గొడవ మనుషులట. కోపం వస్తే కర్రలు కత్తులతోనే వ్యవహారం ముగిస్తారట. చాలా క్రిమినల్ కేసుల్లో కూడా వాళ్లు ఉన్నారట.. ఈ మొత్తం విష యాలన్నీ మాకు ఆ నోట ఈ నోట తెలియడంతో.. నేను కూడా ఎంక్వయిరీ చేశాక తెలిసుండి తల కాయను కత్తిపీటతో కోసుకోవడం దేనికిరా బాబు అని.. ఆ సంబంధం వదిలిపడేసాం. సాటి ఉద్యో గస్తుడివి. నువ్వు పప్పులో కాలు వేస్తున్నావ్ అని నాకు అనుమానం వచ్చింది. నీ నిర్ణయం పూర్తిగా తెలుసున్నాక విషయం చెబుదాంలే కదా అని ఉదయం నువ్వు ఆఫీసుకు రాగానే నిన్ను అంత వివరంగా అడిగాను అన్నమాట.
ఇదిగో.. నీకు తెలిసుంటే నాకెందుకు చెప్పలేదు ధర్మారావు అని నువ్వు ముందు ఎప్పుడైనా నన్ను అడుగుతావని మధ్యాహ్నం చెప్పాలనుకున్నాను. చెబితే నీ ఇంట్రెస్ట్ ను చంపేసిన వాడిని అవుతానే మోనని నాలో నేనే తెగ మదన పడిపోయాను ఇప్పటి వరకు. చిట్టచివరికి ప్రాణ స్నేహి తుడు కుమార్తెకు అన్యాయం జరగకూడదు అన్న కృత జ్ఞతతో కృతనిశ్చయంతో ఇప్పుడు చెప్పేసాను అన్నమాట. సరే ఇప్పుడు నా మనసు హాయిగా ఉంది. ఇక నీ ఆలోచన నీది.. వెళ్తాను అంటూ పైకి లేచి వెళ్ళిపోయాడు ధర్మారావు తన వీధిలైనులోకి.
విషయం తెలుసుకుని నీరసపడిన సత్యానందరావు నీరసంగా పైకి లేచి మోపెడ్ స్టార్ట్ చేసి తన వీధిలోకి వెళ్లిపోయాడు.
***
మర్నాడు ఆఫీసులో ధర్మారావు కి ఆఫీసర్ పిలు స్తున్నాడు అన్న పిలుపు వచ్చింది. లోపలకు వెళ్ళాడు ధర్మారావు.
పది నిమిషాలు.. అరగంట బయటకు రాలేదు ధర్మారావు. అతను ఆఫీసర్ ను ఏదో బ్రతిమిలాడు తూ మాట్లాడుతున్నట్టుగా బయట అందరకు అర్థం అవుతుంది.
''ఆ చెన్నై క్యాంపు గురించి నాకు అసలు అనుభవం లేదు సార్. మీరు ఎన్ని చెప్పినా నేను వెళ్లి ఆ డీల్ కుదుర్చుకొని రాలేను. అంత సమర్థత నాకు లేదు.. అయితే ఇప్పటి పరిస్థితులను బట్టి ఆ డీల్ మనకు చాలా అవసరం కదా. ఆ డీల్ నేను చెడగొట్టుకుని వస్తే మన మేనేజ్మెంట్ కి నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను. పైగా ఈ మధ్య నాకు ఆరోగ్యం కూడా బాగుండలేదు బీపీ షుగర్ ఇంకా రకరకాల వ్యాధులు. కానీ అధికారుల ఉప్పు పులుసు తింటు న్న విశ్వాసంతో నేను ఒక మాట చెప్పగలను సార్.. ఈ డీల్ క్యాన్సిల్ అయితే అధిష్టానం లో మీరు కూడా చులకన అయిపోతారు. అందుకని మన సత్యానందరావుని పంపిస్తే మాత్రం ఖచ్చి తంగా సక్సెస్ కొట్టుకొని రాగలడు. అతనికి మంచి టాకింగ్ పవర్ ఉందని మీకు తెలుసు కదా పోయిన సంవత్సరం బొంబాయి డీల్ రాదు అనుకున్నాం రాబట్టుకొని వచ్చాడు. మరి ఎవరిని పంపినా కూడా డీల్ క్యాన్సిల్ అయిపోవడం ఖాయం సార్. బాగా ఆలోచించండి. ఇది ప్రతిష్టాత్మకం కదా సార్ మనకి. నేను చెప్పాను అని అనకుండా మన సత్యానంద రావు నే ఎలాగోలా పంపండి సార్. సీనియర్ను కనుక మీకు చెప్పాను ఏమనుకోకండి.. ఉంటాను సార్. ''
ధర్మారావు ఆఫీసర్ గారికి చెప్పవలసిందంతా చెప్పి చేతులు దులుపుకుంటూ చెమటలు పట్టిన ముఖం తో బయటకు వచ్చేసాడు.
వెంటనే సత్యానందరావు కి పిలుపు వచ్చింది.
లోపలకు వెళ్లిన 10 నిమిషాలలో సత్యానందరావు ఆఫీసర్ గారు పురమాయింపు ఖాయం చేసుకొని బయటకు వచ్చినట్టుగా వచ్చేసాడు. విషయ సేక రణ కోసం అందరూ అతడిని చుట్టుముట్టారు ధర్మారావు తప్ప.
చెన్నై క్యాంప్ ఈరోజు రాత్రికి బయలుదేరాలి. 25 రోజులు అక్కడ ఉండి తిరిగి రావాలి.
ధర్మారావు తన సీట్లో కూర్చుని కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తున్నాడు అలా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఏదైనా ఒక సమస్యకు ముగింపు తెలిస్తేనే కానీ హాయిగా ఉండలేని ధర్మారావు చివరికి సత్యానంద రావు చెన్నై క్యాంపు కి వెళ్ళడానికి ఒప్పుకున్నాడన్న విషయం అతని చెవిలో పడ్డాక కొంచెం స్థిమిత పడ్డాడు.. అదీ అతని మెంటాలిటీ..
***
ఆ రాత్రికే సత్యానందరావు చెన్నై వెళ్లిపోయాడు.
25 రోజులు అలా అలా గడిచిపోయాయి. 26వ రోజున సత్యానందరావు ఆఫీస్కు వచ్చాడు మామూలుగా. అందరూ చుట్టుముట్టి ఆహ్వానించి చిన్నపాటి సన్మానం కూడా చేసి చెన్నై లో జరిగిన విషయాలన్నీ విపులంగా అడిగి తెలుసుకున్నారు.
''ధర్మారావు నా పేరును రికమండే చేసినట్టు మొన్న ఫోన్ లో చెప్పారు ఆఫీసర్ గారు. అవును దీనికి అంతటికీ కారణం అతనే కదా అతనేడి.. ఈరోజు ఆఫీసుకు సెలవు పెట్టాడా?'' ఆశ్చర్యంగా కొలీగ్స్ ను అడిగాడు సత్యానందరావు.
''అరే నీకు తెలియదా మాకందరికీ ఫోన్ లో విషయాలు చెప్తున్నట్టే నీకు ప్రతిరోజు ఫోన్ చేస్తు న్నాడేమో అనుకున్నాం. మన ధర్మారావుకు ఒక కూతురు ఉంది కదా. లత బిఎస్సి కంప్యూటర్.. మీ అమ్మాయి కి పెళ్లి సంబంధాలు నువ్వు వెతుకు తున్నట్టే అతను కూడా చాలా సంవత్సరాల నుండి వాళ్ళ అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాల కోసం తిరుగుతున్నాడు కదా నీకు తెలుసు కదా. ''
'' అవును''
''ఒకానొక సమయంలో మంచి సంబంధం దొరకటం లేదని సూసైడ్ కూడా చేసుకోబోయాడు కదా''
''అవునవును ఏమైంది పాపం అతనికి''
''అతనికి ఏమి కాలేదయ్య బాబు. రొట్టెముక్కలాగ చక్కగా ఉన్నాడు. నువ్వు వెళ్ళిన రెండు రోజులకే వాళ్ళ అమ్మాయికి మంచి సంబంధం కుదిరిందట నువ్వు వెళ్ళిన దగ్గర నుండి అతను సెలవులోనే ఉన్నాడు. ఆ వెంటనే కంగారుగా ఎంగేజ్మెంట్ చేసు కుని నిన్న రాత్రి ఘనంగా పెళ్లి కూడా చేసేసాడు. మేమందరం వెళ్ళాము. ఇదిగో శుభరేఖ'' అంటూ అందించాడు అతని కొలీగ్ రాము.
గబగబా తెరచి చూసాడు సత్యానందరావు.
పెళ్ళికొడుకు పెద్దాపురం కత్తిపూడి కనకావతరంగారి అబ్బాయి.. లైబ్రరీ పక్కన మూడంతస్తుల భవనం. సాఫ్ట్వేర్ ఉద్యోగం నెలకి నాలుగు లక్షలు.. కుర్రాడు బుద్ధిమంతుడు.. అవును ఆ అబ్బాయి ధర్మారావు కి అల్లుడు ఎలా అయ్యాడు. అర్థం చేసుకోగలిగిన సత్యానందరావు కళ్ళు తిరిగి కింద పడబోయి అక్క డున్న కుర్చీలో కూలబడ్డాడు. కాసేపటికి తేరు కున్నాడు.
పెద్దాపురం సంబంధం చాలా మంచిదని తను పొగిడి పొగిడి చెప్పడంతో అతని కూతురికి ఎలాగైనా ఆ సంబంధమే పట్టేయాలి అన్న దుర్బుద్ధితో ఆ సంబం ధం మీద తనకు పూర్తిగా వ్యతిరేకం నూరిపోసి భయం పెట్టి తనను చెన్నై క్యాంపు వెళ్లేలా తెలివి గా చేసి ఆ సమయంలో పెద్దాపురం వాళ్ళ ఇంటికి వెళ్లి తనమీద తన కూతురి మీద అనుమానాలు కలిగేలా నూరిపోసి ఆ సంబంధం ఖాయం చేసేసు కొని మర్నాడు అర్జెంటుగా ఎంగేజ్మెంట్ చేసుకొని చివరికి నిన్న రాత్రి ముహూర్తం పెట్టించి అతను కూతురికి పెళ్లి కూడా చేసేసి చంకలెగరేసుకుంటూ ఇంటి దగ్గర ఉన్నాడన్నమాట ఆ ధర్మారావు. కాదు అతను అధర్మారావు. తన కూతురికి ఎన్నాళ్ళకి సంబంధం కుదరకపోతే మాత్రం ఇంత మోసమా ఇన్ని అబ ద్ధాలా. అయినా తప్పులేదేమో వెయ్యి అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయమన్నారు పెద్దలు ఆ దారినే అతను నడిచాడు.
పెద్దలే అలా అన్నప్పుడు అతను "ఎన్ని అబద్ధాలు ఆడినా ఎన్ని కుళ్ళుకుట్రలు చేసినా ఎంత మాత్రం తప్పుకాదు" అనుకున్నాడా?
"తన కూతురుకి క్యాంపు నుండి వచ్చిన వెంటనే కుదుర్చుకోవాలనుకున్న ఆ సంబంధాన్ని కాకిలా ఎత్తుకుపోయినా మోసం దగా కుళ్ళు కుట్ర క్రిందకు రావులే " అన్న గట్టి భావన అతను పెట్టుకున్నా డేమో.
ఏమో అది అతనికి తెలియాలి ఆ పెద్దలకు తెలియాలి!
తనలాంటి నిజాయితీ కలిగిన వాళ్లు అమాయక తత్వం కలిగిన వాళ్లు తమ ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయలేరా? హే భగవాన్. తను ఇంకా ఎన్ని సంవ త్సరాలు ప్రయత్నం చేయలో. ఇంకా ఎన్ని ఏళ్ళు ఈ నిరీక్షణ?
సత్యానందరావు తన తల సహస్ర ఖండికలు అయి పోయినట్లు నిస్సత్తువగా అయిపోయి అక్కడున్న కుర్చీ మీద కూలబడిపోయాడు.
****
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
Comments