#JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #PellamaMajaka, #పెళ్ళామామజాకా, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు
Pellama Majaka - New Telugu Story Written By - Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 26/11/2024
పెళ్ళామా మజాకా - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“యిదిగో ఒకసారి ఇటు రండి” అని వంటగదిలో నుంచి అరుస్తున్న కళ్యాణి అరుపులు విని, చదువుతున్న పేపర్ పక్కన పడేసి లేచి వంటగదిలోకి వెళ్ళాడు రాజా.
అసలే విశాలానేత్రలు వున్న కళ్యాణి, కళ్ళు యింకా పెద్దవి చేసి, “ఈ స్టవ్ చూడండి, దోశలు వేసుకోవాలి అంటే స్టవ్ మొత్తం పాడు చెయ్యాలా? స్టవ్ మొత్తం నూనె, స్టవ్ కింద దోశల పిండి. యిప్పుడే కదా పనిమనిషి వచ్చి స్టవ్ తుడిచింది, అప్పుడే నాశనం చేసారు. అసలే కార్తీకమాసం, మనశాంతి గా పూజ చేసుకుని, దేముడికి పరమాన్నాం చేద్దాం అనుకున్నాను.
అంత ఆకలి సొరెసుకు పోతోవుంటే జాగ్రత్తగా రెండు దోశలు వేసుకుని రావచ్చు కదా పైపెచ్చు ఉల్లిపాయలు వేసుకుని తినడం” అంటూ నాన్ స్టాప్ గా మాట్లాడేస్తోంది.
“వుండు వెధవ గొడవ, యిప్పుడు ఏమైంది, నేను రాత్రి భోజనం చెయ్యను కదా, ఉదయం తొమ్మిది అవుతున్నా ఆ పూజ గదిలోనుంచి బయటకు రావు, నాకు షుగర్ పడిపోయి సృహ పోయెడట్లు వుంది, నాకు ఏమైనా అయితే పూజలు లేవు, ఏమి లేవు. అందుకే నేనే రెండు దోశలు వేసుకుని తిన్నాను. స్టవ్ తుడుచుకో, లేదంటే పనిమనిషి కి చెప్పు, నేను స్టవ్ పాడు చేసిన తరువాత తుడవమను” అన్నాడు రాజా.
“ఎందుకు అలా అరుస్తారు, నా పూజలు వళ్లే రిటైర్ అయినా పెన్షన్ వచ్చి నాలుగు మెతుకులు తింటున్నాము. ఏదైనా అంటే నా పూజలు మీద పడతారు” అంది స్టవ్ తుడుచుకుంటూ.
“ఖర్మ రా నాయన, ఉద్యోగం చేస్తున్నప్పుడు స్టాఫ్ డైరెక్టుగా మాట్లాడటానికి బయపడి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని మాట్లాడే వాళ్ళు, యిప్పుడు తన నోటికి భయపడటం.. అంతా విధిభలియం” అనుకుంటూ చెప్పులు వేసుకుని బయటకు బయలుదేరాడు.
“ఏం వండాలో చెప్పకుండా మీ దారిన మీరు అలా వెళ్ళిపోతే ఎలా” అంటూ అరుపు.
“కందా బచ్చలి వండు, బెండకాయ వేపుడు చెయ్యి చాలు, పప్పు వండకు పోనీ” అన్నాడు.
“అయితే ఆ కంద ముక్కలు చేసి ఇవ్వండి, అలా మెల్లగా జారుకుంటే కుదరదు” అంది కళ్యాణి.
“ఛీ నా బ్రతుకు చివరికి యింట్లో కూరలు తరగే స్థితి కి వచ్చింది, ఆఫీస్ లో ఫైల్స్ మీద సంతకం పెట్టే చెయ్యి యిది తెలుసా” అన్నాడు టేబుల్ మీద వున్న కంద దుంపని పట్టుకుని.
“యింటి పని కూడా బాధ్యత గా అనుకోవాలి, హుషారుగా తరగండి, లేదంటే దురద పుడుతుంది” అంది కళ్యాణి నవ్వుతు.
ముక్కలు తరిగి, కళ్యాణి వంక చూసి, “ఇంతేనా ఇడ్లీ కి పప్పు రుబ్బాలా” అన్నాడు చిరాకుగా.
“అక్కర్లేదు, కొద్దిగా మేడ మీద ఆరేసిన బట్టలు తీసుకుని వచ్చి, మీ వాకింగ్ కి మీరు వెళ్ళండి” అంది కళ్యాణి.
వాకింగ్ చేస్తూ, ‘మొదట్లో కళ్యాణి శాంతం గానే ఉండేది, యిప్పుడు ఏమిటో ఒకటే విసుగు, ప్రతి చిన్న విషయం కూడా తగాదా కి దారి తీస్తోంది. తన ఫ్రెండ్ మూర్తి ఆజన్మ బ్రహ్మచారి. హోటల్ తిండి, యాత్రలతో హాయిగా గడిపేస్తున్నాడు ఏ బీపీ షుగర్ లేకుండా. నాకు షుగర్, బీపీ రావడానికి కళ్యాణి అరుపులే కారణం, అనవసరంగా మా బామ్మ మాట విని పెళ్లి చేసుకున్నట్టయింది’ అనుకున్నాడు రాజా.
వాకింగ్, స్నేహితులతో టాకింగ్ పూర్తి చేసుకుని యింటికి చేరిన మొగుడిని చూసి, “బాత్రూం లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుని రండి, ఎక్కడెక్కడ తిరిగారో” అంటూ కెవ్వున అరిచింది “అదేమిటి కాలు వ్రేలు కి నెత్తురు” అంటూ.
అప్పుడు కాలు చూసుకుని “అయ్యో కాలు కి రాయి కొట్టుకున్నట్టు వుంది” అన్నాడు ఆయింట్మెంట్ కోసం వెతుకుతో.
“మన యింట్లో అంత త్వరగా ఏది కనిపించదు వుండండి, కొద్దిగా పసుపు పెడతాను” అని పసుపు తీసుకుని వచ్చి కాలు పట్టుకొని దెబ్బ తగిలిన చోట పసుపు పెట్టింది.
కాలు పట్టుకొగానే దీర్ఘసుమంగళీ భవ అని దీవించిన మొగుడిని చూసి, “ఏమిటో యింత పెద్ద దెబ్బ తగిలిన బాధ పడకుండా నవ్వుతున్నారు, యిలా అయితే ఎలా అండి, షుగర్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని కూడా తెలియదు” అంది.
“తెలియక కాదే, నువ్వుండగా నాకు భయమెందుకు” అన్నాడు రాజా భార్యని చూసి.
రోజులు మొగుడు పెళ్ళాం మధ్య తగాదాలు, చిరాకులతో గడుస్తున్నాయి.
“యిలా అయితే కాశీ వెళ్ళి సన్యాసం పుచ్చుకుంటాను జాగ్రత్త” అన్నాడు రాజా కోపంతో.
“శంకర మఠం లోకి వెళ్ళి కూర్చోండి సన్యాసం అంటే ఏమిటో తెలుస్తుంది” అంది కళ్యాణి.
“భోజనం వడ్డించు ఆకలిగా వుంది” అన్న రాజా తో “అన్నం వండలేదు, మీరు సన్యాసం తీసుకుంటున్నారు కదా అని” అంది నవ్వుతు.
“కొంపదీసి నిజంగానే వండలేదా, ఏదో సరదాగా అన్నాను” అంటూ వంటగది లోకి వెళ్ళి చూసాడు.
ఒక గిన్నెలో టొమోటో పప్పు, యింకో గిన్నెలో దొండకాయ కారం కూర " రా, రా " అని పిలుస్తో కనిపించాయి.
‘అమ్మయ్య, వండలేదు అంటే భయం వేసింది, సన్యాసం తీసుకుంటే మాత్రం తిండి తినకూడదు అని ఎక్కడ వుంది’ అనుకుంటూ తినడం మొదలుపెట్టాడు.
“ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కళ్యాణి, నీ మాట దురుసుగా వున్నా, వంట మాత్రం రుచి అదిరిపోతుంది” అన్నాడు రాజా.
“నేను మాత్రం వూరికే నోరు పారేసుకుంటానా చెప్పండి, మీరు విసిగించకపోతే” అంది భర్త కంచం లో యింకొద్దిగా కూర వడ్డీస్తో.
“నేను విసిగించటం కాదు, నువ్వే ఎందుకో ప్రతిదానికి అరుస్తున్నావు, ఈ పప్పు, కూర నువ్వు వండుతున్నావు అంటే, నేను అనే వాడిని ఉండబట్టే కదా, నా పెన్షన్ లేకపోతే ఏమిపెట్టి వండే దానివి” అన్నాడు.
“మీ పెన్షన్ వండదుగా, నేను వండాలిసిందేగా, కొద్దిగా భార్యకి ఉపకారం చెయ్యకపోయినా, చేసే పనికి అడ్డం రాకుండా ఉండలేరా చెప్పండి” అంది కళ్యాణి.
“అలా అంటేనే నాకు చిరాకు, నిన్ను యిబ్బంది పెట్టకుండా కొన్ని పనులు నేను చేసుకుంటూవుంటే అది పాడు చేసారు, ఇది పాడు చేసారు అని ఒకటే నసుగుడు. దోశ గిన్నెలో గరిటే వేసి వుంచితే ఉప్పు వేసి రెడీగా ఉంచావు అనుకుని దోశలు వేసుకుంటే ఉప్పు వుండదు. అదేమిటి అంటే నా మీద విరుచుకు పడతావు. నీ తప్పు ఒప్పుకోవు” అన్నాడు.
“అబ్బో అదికూడా తప్పేనా, మీరు నన్ను అడగవచ్చు కదా ఉప్పు వేసానా లేదా అని, అయినా మీలా ఎవ్వరు వంటింట్లో దొరబడి ఆడంగి పనులు చెయ్యరు. మా నాన్న కి వంటిల్లు ఎక్కడ ఉండేదో కూడా తెలియదు మా యింట్లో” అంది కళ్యాణి.
“మీ నాన్నకి ఏం ఖర్మ, మీ అమ్మకి కూడా తెలియదు, ఎప్పుడు హోటల్ తిండే గా” అన్నాడు.
“మాకు డబ్బులు బాగా వున్నాయి కాబట్టి హోటల్ తిన్నాము, మీలా ఎవ్వరు భోజనం కి పిలుస్తారా అని ఎదురు చూడలేదు” అంది కోపంగా.
“అంటే మేము తిండికి గతి లేని వాళ్లమా, అటువంటప్పుడు మీ నాన్న మా యింటి చుట్టూ తిరిగి నిన్ను పెళ్లిచేసుకోమని ఎందుకు ఆడిగాడు, మొత్తానికి నాకు అంటగట్టి తను అమ్మయ్య అనుకున్నాడు” అన్నాడు కోపంగా.
మాట మాట పెరిగి, చివరికి ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా గడుపుతున్నారు. రెండు రోజులు అయ్యే సరికి మొగుడు ముందు మాట్లాడితే బాగుండును అని అనుకుంటే, రాజా తన భార్య ముందు పలకరిస్తే బాగుండును అనుకున్నాడు.
కాని యిద్దరూ బిగించుకుని కూర్చున్నారు. ఇంతలో రాజా కూతురు తండ్రికి ఫోన్ చేసి తనకి వొంట్లో బాగాలేదు అని ఒక నెలరోజుల కోసం అమ్మని పంపమని అడిగింది.
“నువ్వే మీ అమ్మని అడుగు, తను వస్తానంటే రైలు ఎక్కిస్తాను” అన్నాడు కూతురితో.
కూతురు మాట కి యిదే మంచి అవకాశం, తన అవసరం ఏమిటో భర్తకి తెలిసి రావాలి అని అంగీకరించి, సామాను సద్దుకుని బెంగళూరు వెళ్ళిపోయింది కూతురు దగ్గరికి.
మొదట్లో “వెళ్తే వెళ్ళు, నేను ప్రశాంతం గా వుంటాను” అన్న రాజా కి, భార్య యింట్లో లేకపోతే యిల్లు బోసిపోయినట్టుగా అనిపించింది.
సాయంత్రం కాఫీ కోసం పాలు స్టవ్ మీద పెట్టి మర్చిపోవడం తో పాలు పొంగిపోయి స్టవ్ పాడవటం కాక గిన్నె కూడా మాడిన వాసన రావడం తో టివి చూస్తున్న రాజా కంగారు గా వంటగది లోకి వచ్చి స్టవ్ ఆపేసి, తను లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే పెద్దగా గొడవ పెట్టేసేది అనుకున్నాడు.
రాత్రికి హోటల్ నుంచి చపాతి తెచ్చుకుని తిని పడుకున్నాడు. ఉదయం 8 గంటలకు మెలుకువ రావడం తో లేచి మొహం కడుక్కుని ఆ రోజు పేపర్ చూస్తూ కూర్చున్నాడు. అరగంట అయినా కాఫీ రాకపోవడంతో, కళ్యాణి నాకు కాఫీ యిచ్చేది వుందా లేదా అని అరిచాడు. ఇల్లంతా నిశ్శబ్దం. అప్పుడు గుర్తుకు వచ్చింది భార్య ఊరు వెళ్ళింది అని రాజా కి. నీరసంగా కుర్చీలోనుంచి లేచి, బయటకు వచ్చి చూసాడు. రోజు కళ్యాణి రాత్రి బయట గేటుకి సంచి పెట్టేది పాలవాడు అందులో పాల ప్యాకెట్స్ వెయ్యడానికి.
అక్కడ సంచి లేకపోవడం తో పాల పాకెట్స్ వెయ్యలేదు పాలవాడు. ఏమిటో పాపం కళ్యాణి యిన్ని పనులు మర్చిపోకుండా చేసేది. తను యింట్లో లేని లోటు కనిపిస్తోంది అనుకుంటూ, ఎదురింటి కుమార్ యింటికి వెళ్ళి “ఒక పాల ప్యాకెట్ వుంటే యిస్తారా, సాయంత్రం తిరిగి యిస్తాను” అన్నాడు.
“ఆంటీ లేదా అంకుల్” అంటూ కుమార్ భార్య సుధ అడిగింది.
“లేదమ్మా, మా అమ్మాయి దగ్గరికి వెళ్ళింది, నాకు అలవాటు లేక పాల కోసం సంచి పెట్టలేదు” అన్నాడు.
“మీరు యిప్పుడు కాఫీ ఏం కాచుకుంటారు అంకుల్”, అంటూ వేడిగా కాఫీ కలిపి కప్ చేతికిచ్చింది.
“ఎందుకమ్మా నేను కలుపుకునే వాడిని కదా” అంటూ కాఫీ కప్ అందుకున్నాడు.
“పర్వాలేదు అంకుల్, మీరు కూడా ఆంటీ తో వెళ్ళలిసింది అంకుల్” అంది సుధ.
“మీ ఆంటీ కి తను వుంటే తప్పా నేను ఏ పని చేసుకోలేను అని అభిప్రాయం.. అది తప్పు అని నిరూపించదలిచాను” అన్నాడు నవ్వుతు రాజా.
వంటిల్లు, యుద్ధం అయిన తరువాత ఉన్నట్టు వుంది. స్టవ్ మీద మాడిపోయిన గిన్నె, ఎక్కడ ప్లేట్స్ అక్కడ సింక్ లో పడి వున్నాయి. కళ్యాణి రోజు రాత్రి అన్నీ గిన్నెలు బయట పెట్టేది పనిమనిషి కోసం. యిల్లు శుభ్రం గా తుడుచుకుని అప్పుడు నిద్రపోయేది. తనకి మొదటి రోజే యింత తేడా కనిపించడం తో బాబాయ్ తను లేకపోతే నా పని అంతే అనుకుంటూ పనిమనిషి కి ఫోన్ చేసాడు యింకా రాలేదే అని.
“రాకపోవడం ఏమిటి సార్, తెల్లారి ఆరు గంటలకు వచ్చి తలుపు ఎన్నిసార్లు తట్టినా మీరు తలుపులు తీయ్యలేదు, అందుకే వెళ్ళిపోయాను, యిహ రేపు వస్తాను” అంది.
నిట్టూరుస్తూ, అంట్లు బయట పడేసి, వంట గది చీపురుతో తుడుస్తోవుంటే మొత్తం పుల్లలు అన్నీ ఊడిపోవటం తో కళ్ళలోనుంచి నీళ్లు వచ్చాయి రాజా కి బాబోయ్ యిన్ని బాధలు నాకే ఎందుకు అని.
తమ్ముడుకి ఫోన్ చేసాడు, ‘మీ ఇంటికి వస్తున్నాను, మీ వదిన ఊరు వెళ్ళింది’ అని.
రాజా తమ్ముడు రామ్ “అయ్యో, మేము మా బావమరిది యింట్లో వ్రతం అని వెళ్తున్నాము, నువ్వు కూడా రా పరవాలేదు” అన్నాడు.
“మీ బావమరిది యింటికి నేను ఎలా వస్తాను లే, నేను ఈ రోజు హోటల్ లో తింటాలే” అని ఫోన్ పెట్టేసాడు.
వాడింటికి వీడింటికి వెళ్లడం ఎందుకు, నేనే వండుకుంటాను అని వంటగదిలోకి వెళ్ళి కుక్కర్ లో నీళ్లు పోసి బియ్యం తన ఒక్కడికి ఎన్నిపోయాలో అని అనుమానం వచ్చి ఆగాడు. పోనీ కళ్యాణి కి ఫోన్ చేసి అడుగుదాం అనుకుంటే లోకువ కడుతుంది అనుకుని రెండు డబ్బాలు పోసి దానిలోనే కొద్దిగా కందిపప్పు, రెండు టమోటాలు వేసి స్టవ్ ఆన్ చేసి, ఈ లోపు మొక్కలకి నీళ్లు వదులుదాం అని మేడమీదకి వెళ్ళాడు.
కుక్కర్ పెట్టిన విషయం అరగంటకి గుర్తుకు వచ్చి పరుగున వచ్చి స్టవ్ ఆపి కుక్కర్ మూత తీసాడు. అంతే ఆవిరి రాజా చేతికి కొట్టి చెయ్యి కాలింది. మూత అక్కడ పడేసి, దగ్గరలో వున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకుని వచ్చి కుక్కర్ లోకి చూసాడు. లోపల పదార్థం ఏమిటో గుర్తు పట్టలేనట్టు వుంది.
ఒక పక్కన కాలిన చెయ్యి, ఒక పక్కన ఆకలి, స్విగ్గి నుంచి టిఫిన్ ఆర్డర్ చేసుకుని, బెంగళూరు కి టికెట్ బుక్ చేసుకున్నాడు. భార్య లేకపోతే యిల్లు నరకమే, వేళకి అన్నీ చేసి పెట్టేది, అనవసరంగా తన కష్టం అర్ధం చేసుకోక గొడవ కి దిగటం తప్పయింది అనుకున్నాడు.
బ్యాగ్ తో గేట్ తీసుకుని లోపలికి వస్తున్న తండ్రిని చూసి రాజా కూతురు అమ్మా నాన్న వచ్చారు అని తల్లిని పిలిచింది.
కొంగుకి చెయ్యి తుడుచుకుంటు వంటగదిలోనుంచి బయటకు వచ్చిన కళ్యాణి కి భర్త కుడి చెయ్యి కి చర్మం ఎర్రగా ఉండటం చూసి, “ఏమైంది అండి” అంది.
జరిగింది చెప్పింది విని “మిమ్మల్ని ఒక్కరిని వదిలి రావడం పొరపాటు అయ్యింది, దగ్గర వుండి అన్నిపనులు చూసుకుంటేనే కాని సరిగ్గా కంచం లో అన్నం పెట్టుకోవడం రాదు మీకు” అంది.
కాలిన చేతి మీద కళ్యాణి కన్నీటి చుక్కలు పడటంతో, రాజా భార్య వంక చూసి “అవును, యిహ ఎక్కడకి వెళ్లినా కలిసే వెళదాం” అన్నాడు కళ్యాణి చెయ్యి పట్టుకొని.
“మీరు పంతం మానుకోవాలి నాన్నా, అమ్మతో పాటు మీరు వచ్చి వుంటే మాకు ఆనందమే కదా”, అంటూ బర్నల్ తండ్రి చేతికి రాసింది.
“తాతయ్య, వచ్చేసావు గా. లేకపోతే రోజు ఏ వంట వండినా ‘ఈ కూర మీ తాతయ్య కి చాలా యిష్టం’, అంటూ అమ్మమ్మ నీ గురించే మాటలు” అని చెపుతున్న మనవడి మాటలకి సిగ్గుపడింది కళ్యాణి.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
"పెళ్లామా మజాకా" కథను తెలుగులో హాస్య కథల ప్రియులకు అందించిన జీడిగుంట శ్రీనివాసరావు గారు అద్భుతంగా రాశారు. పెళ్లాం-మొగుడు మధ్య మనస్పర్ధలు, మాటల యుద్ధం, చివరికి అనుభవాల బాటలో వచ్చిన లోతు అనుభవాల సారంతో కథ మనసుకు హత్తుకుంటుంది.
కళ్యాణి, రాజా మధ్య చోటు చేసుకున్న చిలిపి ఘర్షణలు, హాస్యంతో కూడిన సందర్భాలు, ప్రతిసారీ చివరికి ఒకరి అవసరం మరొకరికి ఎంత ముఖ్యమో తెలియజేస్తాయి. ఇది హాస్యం తో పాటు కుటుంబ బంధాల విలువను గుర్తు చేస్తుంది. భార్యాభర్తల మధ్య చిన్నపాటి చిచ్చు ఎలా ఒకరికొకరు అర్థం చేసుకునే సందర్భంగా మారుతుందో చూపించడం గొప్పగా వుంది.
@himabindusworld1383
• 14 hours ago
రాజా, కళ్యాణి గారి సంసారం
@himabindusworld1383
• 14 hours ago
చాలా బాగా ఉంది