పెళ్ళంటే..
- Mangaratnam P L N
- Mar 31, 2023
- 9 min read

'Pellante' New Telugu Story
Written By P. L. N. Mangaratnam
'పెళ్ళంటే..' తెలుగు కథ
రచన: P.L.N.మంగారత్నం
ఆ ఉదయం..
పెళ్ళి వేడుక జరుగుతుంది, వ్యాగ్రేశ్వరరావు ఇంట్లో..
మంగళ వాయిద్యాలూ, మేళతాళాలూ జోరుగా మ్రోగుతున్నాయి. అతని ఒకే ఒక్క కొడుకు ‘ఎల్లేందర్ రావు’ ని పెళ్ళి కొడుకుని చేస్తున్నారు.
వీధి వాకిట్లో నిలబడి వచ్చే అతిధులకు స్వాగతం పలుకుతునే, ఏవేవో పనులు.. ఎవరెవరికో పురమాయిస్తూ చాలా హడావుడిగా ఉన్నాడు వ్యాగ్రేశ్వరరావు.
పిల్లాడికి ‘కాళ్ళగోళ్ళు’ పూర్తి అయిన తరువాత.. బావి గట్టు మీద కూర్చోబెట్టి మంగళ స్నానాలు చేయిస్తున్నారు ముత్తయిదువలు.
అప్పటికే చెల్లెళ్ళ వరుస అయిన అమ్మాయిలు పెద్ద పెద్ద గంగాళాల నిండుగా నీళ్ళు తోడి వాటి నిండా గులాబీలూ, చేమంతులతో అలంకరించారు. పోసే నీళ్ళలో కూడా పూరేకులు రంగరించారు.
మేనత్తలూ, వరుస అయిన వాళ్ళూ అబ్బాయికి ‘నలుగు’ రాస్తూ, పరాచికాలు ఆడుతున్నారు “ దగ్గరలో ఆడపిల్లలే దొరకనట్లు.. ఎక్కడో ఉన్న పిల్లని వెతుక్కున్నావు” అంటూ.
“అమ్మాయి బాగుంది. దూరం ఏమిటీ? అమెరికా కన్నా దూరమా?” అన్నాడు చిన్నగా నవ్వుతూ. అతని ముఖంలో ఆనందం బాగా ప్రస్పుటంగా కనిపిస్తుంది.
అంతే! ఇష్టమైతే ఏదీ కష్టం కాదు.
ఈ టైముకు అక్కడ ‘శోభిత’ ను కూడా పెళ్ళికూతుర్ని చేస్తూ ఉంటారు. తరువాత సాయంత్రానికల్లా.. ఇక్కడికి ‘తరలి’ వస్తారు. రేపు తెల్లవారి ఈ సమయానికే పెళ్ళి.. అనుకోగానే పెదాల మీద చిరునవ్వు మెరిసింది.
అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్.. ప్రతి సన్నివేశాన్నీ తన కెమెరాలో బందిస్తున్నాడు. వచ్చిన వాళ్ళందరూ ఫోటోల్లో పడడానికి తాపత్రయపడ్డారు.
***
కాస్సేపటికి స్నానఘట్టం పూర్తి అయ్యి..
బుగ్గన చుక్క పెట్టుకుని, కళ్యాణ తిలకం దిద్దుకుని తెల్లటి బట్టలతో, హాలులో కూర్చున్నాడు ఎల్లేందర్. ప్రక్కనే, ఓ బుల్లి తోడ పెళ్ళి కొడుకు. అప్పుడూ నవ్వువచ్చింది. అక్కడా ఇలానే.. ఓ బుల్లి తోటి పెళ్ళికూతురు ఉంటుంది కాబోలు అన్నట్లు.
వచ్చిన ముత్తయిదువలతో ‘పసుపు’ దంపే కార్యక్రమం చేయిస్తు౦ది పెళ్ళికొడుకు తల్లి అజంతమ్మ. పిల్లాడు ఇష్టపడిపోయాడని చెయ్యడం గాని..
ఆమెకు.. అంత ఇష్టం లేదు, ఈ సంబంధం.
వచ్చిన పేరంటాళ్ళు తలో పనీ అందుకుంటున్నారు. ఇల్లంతా సందడి సందడి. పరాచికాలూ.. పలకరింపులు.. గాజుల గలగలలూ, చీరెల రెపరెపలూ.
పది గంటలు అవుతుండగా వచ్చింది..
అజంతమ్మకు, ఆడపడుచు వరస అయిన, గంగావతి.
వస్తూనే, “ ఏం? అజంతా, కొడుక్కి ఉద్యోగం వచ్చిందో! లేదో! అప్పుడే పెళ్ళి చేసేస్తున్నావు” అంటూ..
ఆమెను చూస్తూ “ ఇప్పుడా వచ్చేది. బారెడు పొద్దెక్కాక. కాస్త పెందలాడే బయలుదేరితే ఏమయ్యింది? ” అంటూ చిరుకోపం ప్రదర్శించి, అంతలోనే..
“అవును, మరి.. చేసేది పోలీసు ఉద్యోగ౦. ఎప్పుడూ ఒక్క దగ్గర ఉండడు. ఎక్కడెక్కడికో ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి. అందుకే, ఆ పెళ్ళేదో చేసేస్తే, ఇక అన్నీ.. ఆ పిల్లే చూసుకుంటుందని ” అంటూ అక్కడే ఉన్న అమ్మాయితో, పసుపూ, కుంకుమలు ఇప్పించింది.
ఆ అమ్మాయి చేతిలోని.. పళ్ళెంలోనే ఉన్న అక్షతలు తీసి, మేనల్లుడి తల మీద వేసి ఆశీర్వదిస్తూ..
“ అప్పుడే పెళ్ళి కొడుకువై పోయావు” అంటూ పలకరించి.. అప్పటి వరకూ జేబురుమాలులో కట్టి తెచ్చిన ‘నోట్లను’ పిల్లాడి చేతిలో కుక్కింది.
అది చూసిన అజంతమ్మ “ అప్పుడే.. ఏంటీ! పెట్టేస్తున్నావు? వెంటనే వెళ్లి పోదామనే.. రేపు పెళ్లి అయ్యేంత వరకూ ఉండాలి.. అయిన వాళ్ళే మొహం చూపించి వెళిపోతే, చివరి వరకూ ఉండేది ఎవరు? ” కళ్ళెర్ర చేసింది.
గంగావతి మామయ్య కూతురు, చిన్నప్పుడు వేసవి శెలవుల్లో మామయ్యగారి ఊరిలోనే గడిచింది బాల్యం.. అందుకే ఆ చనువు.
“ రేపు ఇదే ముహూర్తానికి, సుబ్బమ్మ అత్త ఇంట్లోనూ పెళ్ళి ఉంది కదా! వెళ్ళకపోతే బాగుంటుందా? అందుకని రేపు ఆ ఊరు ” చెప్పింది. అక్కడికీ వెళ్ళకపోతే, ఆ బందుత్వం మాత్రం నిలుస్తుందా? అన్నట్లు.
“ ఓ నిజమే కదా! వాళ్ళూ వచ్చి ‘పిలిచా’రు. నేను మరచిపోయాను. మా పెళ్ళి పనుల్లో పడి” అంటూనే..
“ ఇంతకీ ‘మీ పిల్ల’ విషయం ఎంత వరకూ వచ్చిందీ” అడిగింది వచ్చిన వాళ్ళని ఆహ్వానిస్తూనే.
ఆ పిల్లకి ఇంకా ఏ సంభందమూ కుదరలేదన్న సంగతి తెలిసినదే అయినా.. విషయం అటు నుంచే వినాలన్నట్లు. ఎందుకంటే, ఆ ‘ఎత్తు పళ్ళ’ పిల్లని.. తన కొడుక్కి ఇవ్వమని.. పెద్ద చెల్లెలితో రాయభారం పంపిన విషయం గుర్తు ఉండి.
ఆ మాటకు నోచ్చుకుంటున్నట్లు “ ఇంకా.. ఎక్కడ అజంతా! కుదిరితే, నీకు చెప్పమా? నీకన్నా మాకు ఎవరు ఎక్కువ?” అంటూనే..
“ అయితే, మాయేగాని.. సంబంధం మరీ.. అంత దూరంలో కుదుర్చుకున్నారు ఏందీ? కడప జిల్లాకు పో బడితిరి. దగ్గరలో పిల్లలే దొరకలేదా? ఎక్కడ మన అనంతపురం జిల్లాలోని గుంతకల్లూ.. ఎక్కడ కడప జిల్లాలోని ‘ఆ’ పల్లెటూరు. రెండొందల కిలోమీటర్ల దూరం అంట కదా! ” అంటూ మనసులోని మాటని బయటపెట్టింది.
దాంతో..
ఒక్కసారిగా నీరపోయింది అజంతమ్మ మనసు. గుండె గొంతుకలోకి వచ్చినట్లయ్యింది. అప్పటి వరకూ అదిమి పట్టుకున్న ఆవేదన.. ఆ ఆప్యాయతకి బయటకి వచ్చేసింది.
తన కూతుర్ని కాదంటే ఏమిటి? అలాంటివి మనసులో పెట్టుకోకుండానే వచ్చింది కదా! అనుకున్నామని అన్నీఅయిపోతాయా? సంబంధాలు కలుపుకోవడానికి పరిస్తితులు అనుకూలించ వద్దూ! అనుకుంటూనే..
“ఎవరు చూసారు గంగా! ఈ సంబంధాన్ని. వాడే చూసుకున్నాడు. మన పంతులుగారు.. ఓ రెండు సంబంధాలు తెచ్చారు. అవి వాడికి నచ్చలేదు ”
“ఇంతలో.. ఏదో మాట్రిమోనియల్ సైటులో ఈ ‘పిల్ల’ ఫోటోలు చూసాడట. అప్పటి నుంచీ వాడిని పట్టలేకపోయాం. ఒకసారి వాళ్ళ అమ్మ లైనులోకి వస్తే ‘ మీకూ, మాకూ ఎక్కడ కుదురుతుంది.. దూరాభారం.. వద్దు.. అని కూడా అన్నా’..
“ పిల్లా.. పిల్లాడూ ఇష్ట పడుతున్నారు. ఈడూ జోడూ కలిసింది కదా! మీరు రాలేకపొతే.. నేనే పిల్లని తీసుకుని మీ ఊరు వస్తాను! అని పిల్లని మన గుంతకల్లు తీసుకు వచ్చింది.. ఇక్కడ ఎవరో చుట్టాలు ఉన్నారని”
“ఇంక, కాదని ఏమంటాము? వెళ్లి.. చూస్తే పిల్ల బాగానే ఉంది. డిగ్రీ చదివింది. ఏ వంకా పెట్టేటట్టులేదు. చక్కటి నగలు పెట్టుకుని నడిచొచ్చే మహాలక్ష్మిలా”
“అయినా నేను ఇష్టపడలేదు ‘దూరం’ అన్న ఒక్క కారణంతోనే..
“ ఇక్కడ పిల్లాడు గొడవ అయితే.. అక్కడ పిల్ల తల్లి ‘ధనలక్ష్మి నస. పిల్ల నచ్చింది కదా! మా ఇంటికీ ఓ సారి రావచ్చు కదా!” అంటూ.
“చేసేది లేక.. ఇష్టం లేకుండానే రైలు ఎక్కాననుకో. మీ అన్నయ్య పట్టు మీద”
“అదే కడప జిల్లాలోని.. రాపాడు మండలంలో ఉన్న ఆ ‘వెదురూరు’ అనే చిన్న పల్లెటూరికి
“రైలూ, బస్సూ, ఆటోలు ఎంత ప్రయాణం అనుకున్నావు.. విసుగొచ్చేసింది. ఎందుకైనా వియ్యపువాళ్ళ ఇంటికి ఓ పూట భోజనానికి వెళ్ళాలంటే.. ఇంతే సంగతులు ” అంటూ తన పంధాలో చెప్పుకుపోతుంది అజంతమ్మ.
పసుపులో.. రోకలి పోట్లు వేస్తూ కొందరూ, తాంబూలాలు అందుకుంటూ కొందరు.. అజంతమ్మ మాటలు అటూ, ఇటూ చేసి ఆలకిస్తూనే ఉన్నారు.
“సరే! అని అక్కడకు పొతే.. ఆ ఇల్లు ఉంది కదా!”.. దాని గురించి చెప్పలేను అన్నట్లు నెత్తి కొట్టుకు౦ది.
మళ్ళీ గంగ వైపు చూసి..
“రెండు గదుల తాటాకుల ఇల్లు. ఇంటి వెనకాల కాస్త ఖాళీ స్థలంలో చిన్న బాత్రూము. దానికో రేకు తలుపు అడ్డం. దాని ప్రక్కనే ఓ చిన్న మునగ చెట్టూ. ఇంటి చుట్టూ తాటాకుల దడి. అదీ ఇంటి పరిస్తితి. ప్రక్కనే సైడు కాలువ”
“అయ్యో!” అంది గంగ.
“పోయి.. పోయి ఇలాంటి సంభందానికి వచ్చాం ఏమిటన్నట్లు “
“ఎప్పుడో ‘ఆ’ పిల్ల తాతగారు, ఎక్కడి నుంచో వచ్చి.. కాస్త జాగా చూసుకుని ఇప్పుడు ఉంటున్న స్టలం లోనే ‘టీ’ హోటలు పెట్టుకున్నాడట. చివరకు దాన్నే పెద్దది చేసి, మరింత స్థలం ఆక్రమించుకుని ఇల్లు కూడా లేపెయ్యడంతో.. గవర్నమెంటు దానికి పట్టా కూడా ఇచ్చిందట”
“రోడ్డు మలుపులో ఉందేమో! ఇంటి చుట్టూరా జీవనదిలా మురికి కాలువ. పై నుంచి వచ్చిన మురుగు అంతా, వీళ్ళ ఇంటి ముందే నిలబడిపోతుంది. ఉన్న కాస్సేపటికే.. ఆ వాసనకి కడుపులో తిప్పేసిందనుకో! మరి వాళ్ళు జీవితాంతం ఎలా భరిస్తున్నారో గాని ” అంటూ ముఖం వికారంగా పెట్టుకు౦ది. ఇక చెప్పలేను అన్నట్లుగా.
ప్రక్కన ఉన్న వాళ్ళు నవ్వారు.
“అంతే! మాట్రిమొని సంభంధాలు ఇలాగే, ఉంటాయి. అన్నీ ‘బాగా’ ఉంటే ఇంత దూరం వస్తారా! వాళ్లయినా? ” అన్నారు ఎవరో.
“అది చూసి వద్దంటే.. వద్దన్నాను. అంత లేనింటి పిల్లని తెచ్చుకునే ఖర్మ ఏంటని. అయితే.. మీ అన్నయ్య సంగతి తెలిసిందే కదా! ఎడ్డెం అంటే తెడ్డెం అనే రకం. నేను ‘కాదన్నందుకు.. పిల్లాడికే వంత పాడారు.
'ఇప్పటి వరకూ నువ్వు చెప్పిన సంభంధాలు ఏవైనా వీడికి నచ్చినయ్యా? ఈ పిల్ల వీడికి నచ్చింది. ఇద్దరికీ ఇష్టం అయ్యింది చేసెయ్యాలి. రేప్రోద్దుట కలిసి ఉండేది వాళ్ళు. పిల్ల ‘ఇల్లు’ నచ్చకపొతే ఏమిటి? పెళ్ళయిన తరువాత మన పిల్లాడు అక్కడకు పోయి ఉంటాడు.. గానా!' అంటూ నా మాటను కొట్టి పారేసారు. అలా తండ్రీకొడుకులు ఒక్కటై పొతే.. నేను చెయ్యగలిగేది ఏముందీ? అన్నిటికీ తల వంచడం తప్ప” అంటూ బాధపడింది.
“అంతేలే, ఎవరికి ఎవరో! ఎవరికి తెలుసు” అంటూ ఓదార్చింది గంగావతి. ఆ ఓదార్పు లోనూ గంగావతి అంతరంగమే కనిపించింది అజంతమ్మకి.
“తెల్లవారితే.. పెళ్ళి పెట్టుకుని ఇంకా బాధ పడుతుంది అక్క” సానుభూతిగా అంది పెరంటాళ్ళలో ఒకామె.
“అంతే, కోడలు నీతో కలిసేదైతే చాలదూ! నువ్వు గానీ.. అస్తమానం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావు గానా” సమర్ధించింది అజంతమ్మ అక్క కళావతి కూడా.
***
మధ్యాహ్నం పన్నెండున్నర..
వేడుక పూర్తి అయి.. గ్రామం వాళ్ళు విందు భోజనాలు కానిస్తున్నారు.
ఇంతలో.. వ్యాగ్రేశ్వరరావు ఫోను మ్రోగింది.
వియ్యాలవారి దగ్గర నుంచి. అప్పటికి అలా మ్రోగడం ఆరవ సారి. కాబోయే బావమరిదీ, పెళ్ళికూతురి తండ్రీ అయిన రామేశ్వరం.
అవతలి వాళ్ళు, అడిగిందే అడగడం.. చెప్పిందే చెప్పడం అన్నట్లు ఉంది.
“బావగారూ! కాస్సేపటిలో బయలుదేరుతున్నాం. వచ్చేటప్పటికి సాయంత్రం అవుతుందేమో! అయిదు గంటల ప్రయాణం కదా! విడిదిలో పలహారాల మాట ఎలా ఉన్నా? రాత్రికి భోజనాల ఏర్పాట్లు కాస్త ఘనంగా ఉండేలా చూడండి. మా గేమం.. వాళ్ళు ఇంటికి ఒకరో! ఇద్దరో చొప్పున వస్తున్నారు మరి ” అంటూ నవ్వాడు.
“ఎంతమంది ఉంటారేంటీ?”
అయితే, సంభంధం కలుపుకున్నప్పటి నుండీ వాళ్ళ పోకడ విసుగ్గానే అనిపిస్తుంది.
‘ఏదో.. పిల్లాడు ఇష్టపడడం’ అన్న ఒక్క కారణం పట్టుకుని, భార్యని విభేదించి.. తను వ్రేల్లడాడు గానీ, అది తమ స్తితిగతులకు ఏ మాత్రం.. సరిపడే సంభంధం కాదని రోజులు గడుస్తుంటే.. తెలిసి వస్తుంది.
దేనికైనా సమవుజ్జీలు ఉండాలంటారు. ఆ విషయా౦ తను అంతగా పట్టించుకోకపోవడం తెలివితక్కువ అనిపించేలా.
భార్య అయితే.. ఇదేమిటీ? అదేమిటీ? అంటుందని.. వాళ్ళకు తనే అలుసు ఇచ్చాడు. అందుకు దేనికైనా తనకే ఫోన్లు చెయ్యడం మొదలు పెట్టారు.
పిల్లాడికి.. ఇచ్చే లాంచనాల దగ్గరకు వచ్చేసరికి ‘ఇంత వరకే ఇవ్వగలం ’ అన్నారు కూరగాయల బేరంలా.. పిల్లాడు దాటిపోడన్న నిశ్చయానికి వచ్చి.
పిల్లకు బట్టలు కొనేటప్పుడూ, నగలు కొనేటప్పుడూ.. గొడవలు పెట్టుకున్నారు. పెళ్ళి చీరే ముప్పై వేలదైనా తియ్యాలనీ, రెండు లక్షల ‘నగ’ అయినా పెట్టాలనీ డిమాండు చేసారు.
ఆ విషయంలో భార్య అజంతమ్మకీ.. వియ్యపురాలికీ మాట తేడాలు వచ్చేసినాయ్.
పిల్లా.. పిల్లాడి మద్య సయోధ్య బాగానే ఉన్నా.. ఏదో తెలియని అగాధం.
కరవమంటే, కప్పకి కోపం.. విడవమంటే, పాముకు కోపంలా.
అన్నీ తెలిసినా.. తల్లికే ఎదురొచ్చే వాడు ఎల్లేందర్.
“వాళ్ళడిగి౦ది ఇస్తే ఏమయ్యింది? నీకు ఈ సంభంధం ఇష్టం లేకపోతే ఏమిటీ? చేసుకుంది నేను కదా! నాకు పెళ్ళి చెయ్యాలనుకోవడం లేదా నువ్వూ? అప్పుడే ముప్పై ఏళ్ళు వచ్చేసాయి ” అంటూ.
కొడుకు పెళ్ళి తలనొప్పిగా మారడంతో కల్పించుకోవడం మానేసింది అజంతమ్మ.
నాలుగురోజులు ఓపిక పడితే.. కాలం గడిచిపోతుందని.
“ఇంటికి ఒకరు చొప్పున చూసుకున్నా.. అటూ, ఇటూగా ఓ వంద మంది అయితే వస్తారు బావగారూ! “ అన్నాడు రామేశ్వరం. ‘ఆటా.. ఇటా’ అందామనుకున్నాడు గానీ ఓపిక చాలక వదిలేసాడు.
ఇంతమందికీ.. భోజనాల మాట ఎలా ఉన్నా, వసతి ఏర్పాటు ఎలాగా? రాత్రికి ఎక్కడ పడుకోబెట్టాలి అని.
***
సాయంత్రానికి..
ఇంకా సూర్యుడు ఉండగానే..
ఇంటి ముందు రెండు పెద్ద లగ్జరీ బస్సులు వచ్చి ఆగడంతో తుళ్ళి పడింది ఊరు.
ఏంటీ? ఆ ‘వెదురూరు’ మొత్తం వచ్చేసిందా? అన్నట్లు. పిల్లా మేకాతో కలుపుకుని నూట యాభైమంది వరకూ దిగారు. బస్సులు ఖాళీగా రావడం ఎందుకనుకున్నారో! గాని.
పిల్లా.. పిల్లాడూ చూపులతోనే పలకరించుకోవడంతో.. ‘ ఏమిటి? ఇంతమందీ?’ అన్నట్లు సౌజ్న చేసాడు ఎల్లేందరు చూపులతోనే.
తమ అనురాగబంధానికి ఇక ఎంతో దూరం లేకపోయినా..
ఎందుకో ఆ ప్రశ్న నచ్చలేదు శోభితకి. ‘పెళ్ళికి కాకపోతే ఇంకెప్పుడు వస్తారు తన వాళ్ళూ’ అన్నట్లు చురుకుగా చూసింది.
వచ్చిన వాళ్ళను ఎలా చక్కబెట్టాలో తెలీలేదు అజంతమ్మకి.
అప్పటికే కేటరింగు యూనిట్ వచ్చి.. టిఫెన్లూ, కాఫీ.. టీలు సప్లయ్ చేసింది.
వచ్చిన వాళ్ళు వచ్చినట్లే పలహారాల మీద పడ్డారు.
చిన్నపిల్లలు ప్రయాణ బడలికకూ, ఉక్కబొతతోనూ ఏడుపు లంకించుకున్నారు. వారిని సముదాయించలేక అవస్థపడ్డారు తల్లులు.
చాక్లెట్లూ, బిస్కెట్ల కోసం బయటకు పరిగెత్తారు మగ పిల్లకాయలు.
‘ అంత చిన్న పిల్లల్ని వేసుకుని రాకపొతే ఏమిటీ? పిలిస్తే మాత్రం ఎగేసుకుంటూ వచ్చేయ్యడమేనా? ఇప్పుడు వీళ్ళు రాకపోతే.. పెళ్ళి ఆగిపోతుంది గానా?” మగ పిల్లాడి తరఫున వాళ్ళ రుసరుసలు.
“ అబ్బా! సాయంకాలం పూరీలూ, ఉప్మాలూ ఏం తింటాం? ఇప్పుడు ఇవి తింటే, మళ్ళా రాత్రికి భోజనాలు ఏం చేస్తాం? ఏదో స్నాక్ ఐటమ్స్ పెట్టాలి గానీ” అంటూ పిల్ల తరుఫు వాళ్ళ విసవిసలు.
కొందరయితే, బాహాటంగానే విసుక్కున్నారు.
అంతలోనే.. మూతి విరుపులూ, ముక్కు విరుపులూ చోటు చేసుకున్నాయి.
***
రాత్రి ఎనిమిదయ్యేసరికి భోజనాలూ వచ్చినయ్.
వాటితో పాటు చాట్ల్, మిక్చర్లూ, పానీ పురీలూ మిర్చి బర్జీలు లాంటివి వచ్చి చేరినయ్యి. పిల్లలు వాటి మీదకు ఎగబడ్డారు.
ఎల్లేందర్.. సోభితకు దగ్గరగా వచ్చాడు.
చిన్నగా నవ్వుకున్నారు.. పలకరించుకున్నారు.
ఇంతలో స్నేహితుడు.. ఎవరో పిలవడంతో, వెళ్ళిపోయాడు ఎల్లేందర్ పెద్దగా మాట్లాడకుండానే.
కాస్త ముందుగా టిఫెన్లు తినడంతో భోజనాలు రుచించలేదు ఎవ్వరికి.
వేయించుకుని.. ప్లేట్లలో వదిలేసిందే ఎక్కువ.
“ అడిగి మరీ వడ్డించండయ్యా. పిల్లలకీ పెద్దలకీ ఒకటే వడ్డనా? ” విసుక్కున్నాడు వ్యాగ్రేశ్వరరావు కేటరింగు వాళ్ళని.
ఆ రాత్రికి..
భోజనాలు తెమలిపోవడంతో..
నిద్రలు ముంచుకొచ్చి “ తెల్లవారితే! పెళ్ళి.. ఈ రాత్రికి ఎలాగో సర్దుకుని.. . లేచి, ప్రోద్ద్తుట కాస్త త్వరగా తయారవ్వండి. టిఫెన్లు కూడా చేసుకుని.. ఎనిమిదయ్యేసరికి కళ్యాణమండపానికి వెళ్ళాల్సి ఉంటుంది” అంటూ వియ్యంకుడికి అప్పగింతలు అప్పగిస్తుంటే..
“ఇంతమందికీ.. ఆ అయిదు గదులే౦ సరిపోతాయండీ? బయట ఎక్కడన్నా ఇంకాసిన్ని రూములు చూడకపోయారా? ఆ అయిదు లోనూ రెండు వాటికే బాత్రుంలు ఉన్నాయి. తెల్లారితే.. స్నానాల మాట ఎలా ఉన్నా.. అందరి అవసరాలు తీరొద్దూ? ఏదో పెళ్ళి కంటే వస్తారు గానీ జనాలు. , ఇంతమందీ మళ్ళీ మళ్ళీ వస్తారా?” తగులుకున్నాడు ఓ పెద్దాయన.
“ఏం చెయ్యమంటారండీ? ఈ కరోనాకి జడిసి హోటల్ వాళ్ళు ఎవ్వరూ రూములు ఇవ్వనన్నారు. లేకపోతే అలాగే బుక్ చేసేవాళ్ళం. చుట్టుపక్కల ఇళ్ళు ఏవీ సౌకర్యవంతంగా లేవు. వందమందికి.. మరో యాభైమంది కలిసి వస్తే.. ఇంతే. ఇలాగే ఉంటుంది పరిస్తితి. సర్దుకోక తప్పదు” అంటూ దూకుడుగానే సమాధానం వచ్చేసింది వ్యాగ్రేశ్వరరావు నుంచి.
“అంటే, ఇంతమందిమి వచ్చి మేం తప్పు చేసామన్న మాట” అందుకున్నాడు మళ్ళీ అతను.
“అబ్బా! నేను అలా అనలేదండీ. మా గదుల్లోనూ చుట్టాలు ఉన్నారు అని చెబుతున్నాను. కాబట్టి, మీరు ఇక్కడే సర్దుకోవాలి. కాదనుకుంటే.. ఆ వరండా ఉంది. అక్కడ ఫేనులూ ఉన్నాయి ” అంటూ మాట రెట్టించకుండా వచ్చేసాడు.
***
తెల్లవారింది.
బయట విడిదిలో జనాలు..
గొడవ గొడవగా మాట్లాడుకుంటూ, హడావుడిగా తిరుగుతున్నారు. వాళ్ళని ఇప్పుడే కదపకూడదు.. టిఫెన్లు వచ్చేదాకా అనుకున్నాడు వ్యాగ్రేశ్వరరావు.
అజంతమ్మ, కళ్యాణ మండపానికి తమతో పాటు తీసుకు వెళ్ళాల్సిన సామాగ్రి అంతా ఓ ప్రక్కకి సర్ది ఉంచింది.
చెల్లికి సాయపడుతూనే.. టైము దగ్గర పడుతుండడంతో పెళ్ళికూతురు ముస్తాబు ఎంతవరకూ వచ్చిందో! అని చూడడానికి వెళ్ళింది కళావతి.
వెళ్ళిన మనిషి, కాస్సేపటికే..
వెనక్కి తిరిగి వచ్చింది విషయ సేకరణతో..
జరిగింది తెలుసుకుని నిర్ఘాంతపోయారు మగ పెళ్ళి వాళ్ళు.
ఎల్లేందరు మాటలు రానివాడిలా ఉండిపోయాడు.
‘వసతులు సరిగ్గలేని విడిది ఇల్లు ఇవ్వడమే కాదు, బోజనాలూ సరిగ్గా లేవనీ.. . ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు ముందు పిల్లని ‘ఎలా’ చూస్తారో! నన్న కారణంగా.. పెళ్ళి కాన్సిల్ చేసుకునే దిశగా ‘వన్ టౌన్’ పోలీసు స్టేషనులో కేసు పెట్టడం కోసం వెళ్ళారని’.
మిగిలిన వాళ్ళ కోసం అక్కడ ఒకటే బస్సు నిలిచి ఉంది.
అక్కడ నుండి పెళ్ళి బృందం పోలీసు స్టేషను బాట పట్టారు.
***
ఎస్. ఐ గారి ముందు కుర్చీల్లో రామేశ్వరం, మరెవరో పెద్దలు కూర్చుని ఉన్నారు.
పెళ్ళికూతురు చక్కటి ముస్తాబుతో, గది వారగా ఉన్న బెంచీపై తల్లీ, మరి కొందరితో పాటు కూర్చుని ఉంది.
మగ పెళ్ళి వాళ్ళు పోలీసు స్టేషనుకి చేరుకోవడంతో..
అక్కడ కలకలం మొదలయ్యింది.
వ్యాగ్రేశ్వరరావును చూస్తూనే తగులుకున్నారు.
“అడుగోండి సార్! వచ్చాడుగా.. పెద్దమనిషి అడగండి. పెళ్ళి పేరు మీద ఇంటికి వచ్చిన మాకు సరిఅయిన వసతి సౌకర్యం ఇవ్వలేదు. అయిదు అంటే అయిదు గదులు ఇచ్చారు. పోనీ, అవైనా సరిగ్గా ఉన్నాయా అంటే.. అదీ లేదు. వాటికీ రెండే బాత్రూములు ఉన్నాయి. అవి ఎంతమంది చాలేను.
“రాత్రి మేం.. ఎవ్వరూ నిద్ర పోలేదంటే నమ్మండి. పెద్ద పెద్ద దోమలు మీద తిరిగేసినయ్యి. చిన్న పిల్లలు అయితే ఒకటే ఏడుపులు. వాళ్ళని సంముదాయించడం తోనే సరిపోయింది రాత్రంతా” చెప్పాడు ఆవేశంగా ఓ పెద్ద తలకాయ.
“మేము ఇన్ని అవస్థలు పడుతూ ఉంటే.. ఈయన మాత్రం తన గదిలో ఏ. సీ వేసుకుని హాయిగా పడుకున్నాడు. రాత్రిలో ఒక్కసారీ బయటకి రాలేదు. వచ్చిన వాళ్ళు ఎట్లా పోయారో! కూడా చూడలేదు. ఈయనేం.. మనిషండీ?” అంటూ కాలర్ పట్టుకోక పోయినా.. అంత పని చేసేవాడిలా ముందుకు దూకాడు ఇంకొక అతను.
‘వీటికి ఏం చెబుతావ్’? అన్నట్లు చూసాడు ఎస్. ఐ, వ్యాగ్రేశ్వరరావు పైపు.
“ సార్! పెళ్ళి అంటే, అంతమంది వచ్చేస్తే ఎలా? కోవిడ్ రోజులు. హోటల్ వాళ్ళు.. పెళ్ళివాళ్ళకు రూములు ఇవ్వని విషయం తెలిసిందే కదా! అయినా.. ఇంట్లోనే అయిదు గదులు ఇవ్వగలిగాను. అవి తక్కువ అంటే.. నేనేం చెయ్యగలను? ఇంక కాస్సేపటిలో పెళ్ళి.. అన్నీ సర్దుకుంటాయి. కేసూ వద్దూ ఏమీ వద్దు. వదిలెయ్యండి సార్! “ అంటూనే..
రామేశ్వరం వైపు తిరిగి “ అయ్యా! బావగారూ! జరిగిందేదో! జరిగిపోయింది. అన్నీ మరచిపోయి.. బయలుదేరండి.. కళ్యాణమండపానికి రండి. పిల్లా.. పిల్లాడూ ఇష్టం మీదేగా మనం ముందుకు వెళ్ళేది” బ్రతిమాలాడు.
“సార్! ఆ ఒక్క కారణంగానే ఈ పెళ్ళి అనుకున్నా౦. కానీ, ఇంత జరిగాక వీళ్ళు మా పిల్లని ఏం చూస్తారో అన్న అనుమానంగా ఉంది. ఇంకా చెప్పాలంటే.. పిల్ల అత్తగారికి ఈ పెళ్ళి ఇష్టమే లేదు. నెమ్మదిగా అదే సర్దుకుంటుంది అనుకున్నా.. విడిదిలో మాకు అందాల్సిన గౌరవ మర్యాదలు అందలేదు. కనీసం ఫోటోలు కూడా మా ఇష్ట ప్రకారం తీసుకోలేక పోయాం. అంత ఇష్టం లేని ఇంటికి నా కూతుర్ని కోడలిగా పంపలేను. అందుకే మేము ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నాం” ప్రకటించింది ధనలక్ష్మి.. మొదటి నుంచీ పెత్తనం చేసింది ఆమే అయినా.
అందుకు అజంతమ్మ ఏం మాట్లాడలేకపోయింది.
“పోనీలేమ్మా! పెళ్ళిళ్ళలో ఇలాంటివి సహజమే. ఎలాంటి వారికైనా కోపతాపాలు అనేవి ఉంటూ ఉంటాయి. అవి సహజం. అయితే, ఈసారి మీకు ‘కాస్త ఎక్కువ’ వచ్చింది. కోవిడ్లో ఇంతమంది కలిసి తిరగ కూడదని తెలీదా? అసలు మీ మీదే కేసు పెట్టాలి.. ఇంతమంది కలిసి బస్సులో వచ్చినందుకు. అయినా.. జరిగిందేదో! జరిగిపోయింది. వెళ్ళండి.. వెళ్లి, పెళ్ళి చక్కబెట్టుకుని రండి” అంటూ సలహా ఇచ్చాడు ఎస్. ఐ.
“వద్దు సార్! మాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నా కూతురు ఇక్కడ సుఖపడుతుందని అనిపించడం లేదు” గట్టిగా చెప్పాడు రామేశ్వరం.
“అవును.. అవును ”అన్నారు మరి కొందరు.
అందరూ అలాంటి నిర్ణయాలు తీసేసుకోవడంతో కంగారు పడిన ఎల్లేందర్.. శోభితని చూస్తూ ‘ ఇలా రా’ అన్నట్లు సౌజ్న చేసాడు.
అందుకు అతన్ని చూసి మొహం తిప్పుకు౦ది.
మ్రాన్పడ్డాడు ఎల్లేందర్.
ఇక విషయం ఆటో! ఇటో! తేల్చెయ్యాలనుకున్నాడు ఎస్. ఐ.
“నువ్వేమంటావమ్మా” అడిగాడు పెళ్ళి కూతుర్ని.
అప్పటి వరకూ మౌనంగా ఉన్న శోభిత “ మా పెద్దల ఇష్టమే.. నా ఇష్టం సార్!” చెప్పింది.
పెళ్ళి కూతురే అలా చెప్పేసరికి ఎస్. ఐకి మాట్లాడడానికి ఏమీ దొరకలేదు.
చూస్తుండగానే రెండు బస్సులూ.. కలిసి బయలు దేరాయి కడప వైపు.
***
ఆ నీలి నీడలు తొలగిపోవడంతో..
ఇప్పుడు తేటగా నవ్వుతుంది అజంతమ్మ.
పెళ్ళికి ‘పిల్ల’ నచ్చడం ఒక్కటే ముఖ్యం కాదు. ఇరు కుటుంబాల వారూ పరస్పర అవగాహనతో కలవగలగాలి.
కాలం నెమ్మదిగా సాగుతుంది.
విషయ వాసనలు మర్చిపోయేలా.
“ చూడు.. పంతులుగారు గారు తెచ్చిన మొదటి సంభంధపు.. పిల్ల ‘వసంత’ నీకు ఎందుకు నచ్చలేదో! మళ్ళీ చూసి చెప్పూ” అంటూ ఫోటో ముందు పెట్టింది.
వెంటనే ముఖం తిప్పుకున్నాడు పెళ్ళంటే, అస్సలు ఇష్టంలేని వాడిలా..
“ ఫర్వాలేదు. ఎవరేజ్. నాన్న, ఆ అమ్మాయి నవ్వు నచ్చలేదని, అనడంతో.. నేనూ ఊరుకున్నా” చెప్పాడు.
“ నేను అవునంటే, మీ నాన్న కాదనే అంటారు కదా! అది పెద్ద పిన్ని ద్వారానే కదా! వచ్చింది. అంటే నా తరుఫు వాళ్ళ నుంచి వచ్చినది. అందుకే మీ నాన్న ఇష్టపడలేదు. పిల్ల నవ్వుకేమయ్యింది? చక్కగా ఉంది. పోటోకీ.. మనిషికీ తేడా ఉంటుంది. అది వాళ్ళ తోటలో, నడిచి వస్తుంటే.. సెల్లో తీసిన ఫోటో! ఫోటో చూసే నిర్ణయాలు తీసేసుకోకూడదు”.
“మనింట్లో పెళ్ళి ఆగిపోవడంతో.. పంతులుగారు మళ్ళీ చెప్పారు. వాళ్ళు మన మాట కోసం ఇంకా ఎదురు చూస్తున్నారట. అమ్మాయని చూడకుండా ఏ నిర్ణయమూ చెయ్యకూడదు. కాబట్టి, మనం వెళ్లి చూస్తున్నాం ” అంటూ చెప్పింది అజంతమ్మ.
మాట్లాడలేదు ఎల్లేందర్. మౌనం అర్ధ అంగీకారం అయ్యింది.
వ్యాగ్రేశ్వరరావూ ఇప్పుడు స్వంత నిర్ణయాలు తీసుకోవడం లేదు. జరిగిన బులబాటానికి తల బొప్పి కట్టడంతో.
***
అన్నీ నచ్చడంతో..
నెల రోజులు తిరిగేసరికి..
ఎల్లేందర్ పెళ్ళి ‘వసంత ’ తో జరిగింది. అన్నీ తానై చక్కబెట్టింది అజంతమ్మ.
“మీ కోడలు బొమ్మలా ఉంది” అన్నారు చూసిన వాళ్ళు.
అప్పుడూ నవ్వింది అజంతమ్మ. మనసుకి నచ్చిన పని ఏదైనా సంతోషాన్ని ఇస్తుంది.
నవ్వినా.. ఏడ్చినా అంతా పైవాడి నిర్ణయమే. ఘటనాఘటన సమర్ధుడు.
సమాప్తం --
P.L.N.మంగారత్నం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం :
నా పేరు పి.ఎల్ ఎన్. మంగారత్నం, బి.ఎస్సీ చదివి 1984 లో రెవిన్యూ డిపార్టుమెంటులో జూనియర్ అసిస్టెంటుగా జాయిను అయి, డిప్యుటీ తహసీల్దారుగా డిసెంబర్ 2018లో రిటైరు అయ్యాను. చిన్నప్పుడు బొమ్మలు బాగా వేసేదాన్ని. ఇప్పుడు రచనలు జై సమైక్యాంద్ర సమయంలో వచ్చిన సెలవులలో రెండవ సారి మొదలు పెట్టి వ్రాయడం మొదలు పెట్టాను. ఇప్పటికి 100 పైగా కధలు వ్రాసాను. త్వరలో ఒక సంకలనం కూడా వేసుకునే ఆలోచనలో ఉన్నాను.
Comentários