పెళ్లి చూపుల్లో స్నేహ బంధం
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- 3 days ago
- 4 min read
#PelliChupulloSnehabandham, #పెళ్లిచూపుల్లోస్నేహబంధం, #Kandarpa Murthy, #కందర్ప మూర్తి, #TeluguKathalu, #తెలుగుకథలు

Pelli Chupullo Snehabandham - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 12/04/2025
పెళ్లి చూపుల్లో స్నేహ బంధం - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
"ఏరా, రామం! ఇంటర్ పూర్తయింది కదా, డిగ్రీలో జాయిన్ అవుతున్నావా?" అడిగారు మేనమామ జానకిరామ్.
"డిగ్రీ చదవాలని లేదు మామయ్యా! ఏదైనా జాబ్ చూసుకుంటాను. ఇంక అమ్మను కష్ట పెట్ట దలుచుకోలేదు." చెప్పేడు రామారావు.
"పోనీ, నాతో వస్తే వైదీకం నేర్పుతాను. ఊళ్లోనే పెళ్లిళ్లు, గృహ ప్రవేశం, వ్రతాలు చేసుకు బతకవచ్చు. అమ్మకి సాయంగా ఉంటావు. " అన్నారు ఊరి పురోహితులు జానకిరామ్.
"నాకు పురోహితం మీద ఇంటరెస్టు లేదు మామయ్యా! అలాగైతే టెన్తుకు ముందే మీవద్ద వైదీకం నేర్చుకునే వాణ్ణి. నాన్న పురోహితం చేస్తునే కరోనాతో కాలం చేసారు. అమ్మ
వంటలు చేస్తు మీ సహకారంతో నన్ను ఇంతవరకు చదివించింది. పురోహితంలో కూడా కాంప్టీషన్ ఎక్కువైంది. ఇదివరకటిలా ఆదాయం రావడం లేదు. మీలాంటి పెద్దల
ముందు ఇప్పటి మాలాంటి వాళ్లం నిలబడలేం.
మరొకటి. వైదీకం, అర్చకులంటే ఎవరూ పిల్లనివ్వడానికి ఇష్ట పడటం లేదు. ప్రభుత్వ పథకాలతో ఆడపిల్లలు మగ పిల్లల కంటే పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగాలు సంపాదిస్తు
సాంప్రదాయ కట్టుబొట్టుతో ఉండే వైదికుల్ని, గుడి అర్చకుల్ని ఇష్టపడక చాలామంది ఈ వృత్తిలో ఉన్న కుర్రాళ్లు పెళ్లి జరగక ముదర బెండకాయలవుతున్న విషయం మీకు తెలియంది కాదు. ఇంటర్ తో పాటే షార్ట్ హేండ్, కంప్యూటర్ కోర్సులు నేర్చుకున్నాను. ఏదో జాబ్ చేస్తు డిగ్రీ ప్రైవేటుగా చదువుకుంటాను. " తన మనసులోని మాట చెప్పాడు రామారావు.
"నీకు ఉద్యోగం మీదే ఆశక్తి ఉంటే ఈ ఊరి నుంచి వెళ్లిన పాపారావు టౌన్లో ప్లాస్టిక్ సామాన్ల ఫేక్టరీ నడుపుతున్నారు. నేను అప్పుడప్పుడు వారింటి శుభకార్యాలకు వెళ్లి వస్తుంటాను. నీకు ఉద్యోగం కావాలంటే నామాట కాదనరు ఆయన. ఇష్టం ఉంటే చెప్పు. మాట్లాడతాను."
"అలాగే, ఏదో జాబుకు నాగురించి ప్రయత్నించండి మామయ్యా "
నెల రోజుల తర్వాత ఊరి పురోహితులు జానకిరామ్ మేనల్లుడిని వెంట పెట్టుకుని టౌన్ వెళ్లి కళా ఎంపోరియం యజమాని పాపారావుకు రామారావును పరిచయం చేసి వారి ఇంటి పరిస్థితులు వివరించి ఏదైన జాబ్ చూడమన్నారు.
రామారావు చదువు విషయాలు, మిగతా కంప్యూటర్, కోర్సులు సర్టిఫికెట్లు చూసి కొన్ని సందేహాలు అడిగి తెలుసుకుని సంతృప్తి చెంది ఎకౌంట్సు సెక్షన్లో జాబ్ ఇచ్చారు అప్పారావు. రోజూ ఫేక్టరీకి షోరూంకి తిరగవల్సి వస్తోంది రామారావుకు. టూ వీలర్ ఎరేంజి చేసారు యజమాని పాపారావు. వారి ఆఫీసుకు దగ్గరలోనె ఒక రూము, భోజన ఏర్పాట్లు చేసారు. వారంలో ఒకటి రెండుసార్లు ఊరెళ్లి అమ్మను, మామయ్యను కలుస్తున్నాడు.
జాబ్ చేస్తూనే పట్టుదలగా కామర్స్ డిగ్రీతో పాటు ఎకౌంటెంటు పరీక్షలు పూర్తి చేసాడు. రామారావు పట్టుదల, క్రమశిక్షణ, అందరితో గౌరవభావం చూసిన పాపారావు గారు పూర్తి ఎకౌంటెంటు భాధ్యతలు అప్పగించి హోదా పెంచేరు. మంచి ఇల్లు, తిరగడానికి కారు ఏర్పాటు చేసారు. ఇప్పుడు రామారావు అమ్మను తన వెంటే పట్నం తెచ్చుకున్నాడు. మేనల్లుడి ఉన్నతిని చూసి మురిసిపోయారు జానకిరామ్. మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తే తన భాద్యత తీరుతుందని చెల్లితో సంప్రదించి అమ్మాయిల వేట ప్రారంభించారు.
అగ్రహారంలో ఒక పెళ్లి సంబంధం ఉందని వాకబు చెయ్యగా రామారావుకు అనుకూలంగా ఉండటం, ఈడుజోడుతో పాటు జాతకాలు కలియడంతో వారితో సంప్రదించి పెళ్లి చూపులు
ఏర్పాటు చేసారు. ఒక మంచి రోజున రామారావు వెంట తల్లి, మేనమామ
జానకిరామ్ రాగా ఆడ పిల్ల ఇంటికి బయలుదేరి వెళ్లేరు. సాంప్రదాయం ప్రకారం అతిథి మర్యాదలు అవగానే పిల్లను చూడాలనుకున్నారు.
ఇంతలో గుమ్మంలో ఆటో వచ్చి ఆగింది. అందులోంచి ఆజానుబాహుడైన యువకుడు లగేజీతో దిగేడు. అతడి కోసమే ఎదురు చూస్తున్న ఆడపిల్ల తరపువారు పరుగున
ఎదురు వెళ్లి ఇంటి లోపలికి తీసుకు వచ్చారు.
ఆ అబ్బాయిని చూసిన రామారావు ఆశ్చర్యంగా "ఒరేయ్, సుధాకర్! నువ్వు ఇక్కడేంటి?" అని అడిగాడు.
"ఒరేయ్, ఫూల్! ఐతే మా చెల్లాయి రమను పెళ్లి చేసుకునేది నువ్వా? వండర్" తన ఆనందాన్ని తెలియచేస్తు "నేను నీతో ఇంటర్ అవగానె ఆర్మీలో జాయిన్ అయాను. చెల్లి డిగ్రీతో పాటు బి. ఎడ్ పూర్తి చేసి ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తోంది. గవర్నమెంట్ జాబ్ కి ఎగ్జామ్స్ రాసింది.
చెల్లికి పెళ్లి సంబంధం చూసాము, నువ్వు కూడా దగ్గరుండి అబ్బాయిని చూసి ఖాయం చెయ్యమని ఫోన్లో చెబితే, జమ్మూకాశ్మీర్ నుంచి అర్జంటుగా శలవు తీసుకుని బయలుదేరితే వాతావరణం అనుకూలించక ప్రయాణం ఆలశ్యమై ఉరుకుల పరుగులతో ఇప్పటికి చేరా”నని జరిగిన సంగతి చెప్పాడు సుధాకర్.
అనుకోకుండా ఒకరోజున స్కూల్ మిత్రులు కలుసుకోవడం, ఆనంద కోలాహాల మద్య పెళ్లి చూపులు జరగడం, సుధాకర్ శలవు పూర్తయే లోపున చెల్లి పెళ్లికి ముహూర్తం నిర్ణయం
జరిగిపోయాయి.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Comments